top of page
Anchor 1

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

రచనలలో వైజ్ఞానిక దృష్టి అవసరం

Sivuni Rajeswari

ఇన్నయ్య నరిశెట్టి

“చంద్రుడు గుండ్రంగా ఎందుకు కనిపిస్తాడు” అని పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఏం చెపుతారు.

“అమ్మా నేనెట్లా పుట్టాను?” అని అడిగితే తల్లి ఏం చెబుతుంది?

పిల్లలు అనేక సందర్భాలలో అమాయకంగా తల్లిదండ్రులను అడుగుతూ పోతారు. వాటికి సమాధానం చెప్పలేనప్పుడు, నోరుమూసుకో అని గానీ, దేవుడిచ్చాడు అని గానీ, బుకాయిస్తే అది సమాధానం చెప్పినట్లు కాదు. తెలియనప్పుడు తెలుసుకుని చెపుతాను అంటే పోయేదేమీ లేదు. అది సరైన ధోరణి కూడా. అబద్ధాలు, అసత్యాలు కలిపి చెప్పి పిల్లలకు వక్రీకరించే ధోరణి చేయకూడదు. కానీ, చాలామంది తల్లిదండ్రులు ఈ తప్పులే చేస్తుంటారు. వారు చెప్పే విషయాలు పిల్లలకు గాఢంగా నాటుకుపోతాయి. అలాగే తల్లిదండ్రుల మాటలు, సమాజంలో ఇతరుల మాటలు, మూఢనమ్మకాలు, హత్తుకుపోతే పెద్దయిన తర్వాత సైన్సు చదువుకున్నా అవి పోవు. ఈ విషయమై సుప్రసిద్ధ రచయిత చలం తన బిడ్డల శిక్షణలో చాలా స్పష్టంగా వివరించారు. నేటి సైంటిస్టులు, కార్ల్ సేగన్, మైకల్ షర్మర్ వివరిస్తూ పిల్లలపై తెలియని దశలో చెప్పే విషయాల ప్రభావం ఎలా నాటుకపోతుందో  తేటతెల్లం చేశారు. సైన్సులో ఒక విభాగంలో నిపుణుడైనంత మాత్రాన ఆ సైంటిస్టుకు మిగిలిన విషయాలలో స్పష్టత వున్నదని అనుకోరాదు. అందుకే ఒక విభాగంలో సైన్సు చదువుకున్న వ్యక్తి మూఢ నమ్మకాలను పాటిస్తే మనం ఆశ్చర్యపడక్కరలేదు.

తెలుగులో వైజ్ఞానిక విషయాలు చక్కగా వివరిస్తూ లోగడ అనేక రచనలు వచ్చాయి. సుప్రసిద్ధులు అందుకు  పూనుకున్నారు. డా. గాలి బాలసుందర రావు, మహీధర జగన్మోహన రావు, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వసంతరావు వెంకటరావు నేడు దేవరాజ్ మహరాజు, నాగసూరి వేణుగోపాల్, వసునందన్ తదితరులు సైన్సును విడమరిచి సులభంగా అందిస్తున్నారు. రచయితలు అవి దృష్టిలో పెట్టుకుంటూ చెడగొట్టకుండా ఉండే ధోరణిలో రచనలు చేయవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక, మాథ్యమిక పాఠశాల స్థాయిలో వైజ్ఞానిక ధోరణి అలవరచి పెంపొందించడానికి పాఠ్య ప్రణాళిక తగనుగుణంగానే రూపొందించారు.

 పిల్లల్ని చెడగొట్టాలని తల్లిదండ్రులెవరూ భావించరు. తాము చెప్పేదంతా వారి మంచికేనని కథలూ గాథలూ నూరిపోస్తారు. అవన్నీ నిజమేనని పిల్లలు నమ్ముతారు. ఎంత సైన్సు చదువుకున్నా చిన్నప్పటి నమ్మకాలు, ఈర్ష్యా ద్వేషాలు, కులాలు, మతాలు, ప్రాంతీయ తత్త్వాలు, రంగు భేదాలు తొలగిపోవడంలేదు. కనుక పాఠాలలో చిన్నప్పటి నుండీ వైజ్ఞానిక విషయాలు ఆకర్షణీయంగా చెప్పటం వలన ఈ దోషం చాలా వరకు తొలగిపోతుంది. నిపుణుడైన శాస్త్రజ్ఞుడు ఇతర విభాగాలలో జరిగేవాటితో సమన్వయీకరణ చేస్తే రాగద్వేషాతీతంగా పాఠాలు పిల్లలకు అందించవచ్చు. కార్ల్ సేగన్, ఐజక్ అసిమోవ్, రిచర్డ్ డాకిన్స్, ఎ.బి.షా., నైల్ డి గ్రాస్, బ్రైన్ గ్రీన్, రచనల నుండి ఈ విషయాలు గ్రహించవచ్చు. పాఠ్యగ్రంథాలు తయారు చేసేటప్పుడు వీటిని సిలబస్ లో ప్రవేశపెడితే అనూహ్య సత్ఫలితాలు లభిస్తాయి.

బి.వి. నరసింహారావు బాలబంధుగా ఈ విషయాలని ఆడిపాడీ చూపెట్టారు. ఆయన రచనలు నేడు లభిస్తున్నవి. వాటిని అమెరికాలోనూ ఆంధ్ర ప్రదేశ్ లోనూ తెలంగాణా లోనూ ఉపాధ్యాయులు స్వీకరించి అనుసరిస్తే చక్కని పరిణామాలు వస్తాయి. ఆధునిక పునర్వికాసానికి ఈ ధోరణులు అవసరం. స్త్రీ రచయితలలో నవలలు, కథలు, నాటికలు, కవితలు నేడు విపరీతంగా వెలువరిస్తున్నారు. వారు కూడా వైజ్ఞానిక ధోరణులను స్వీకరిస్తే సమాజంపై ఇంకా గాఢమైన ప్రభావాన్ని చూపెట్టగలరు. ప్రాచీన కథలు, గాథలు తిరిగి రాసేటప్పుడు పాఠాలలో చేర్చేటప్పుడు అవి కథలని, యథాతథంగా జరిగినట్లు నమ్మరాదని స్పష్టం చెయ్యాలి.

వైజ్ఞానిక ధోరణిలో గొప్ప సుగుణం ఏమంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరు కనుగొన్నా అది అందరికీ అందించటం, ఆ విషయంలో ఎలాంటి అరమరికలు లేకపోవడం చెప్పుకోదగిన అంశం. అందువలన వైజ్ఞానిక ధోరణి అనేది పిల్లల స్థాయి నుండి అలవరచాలి. అమెరికా సైన్సు, అమలాపురం సైన్సు, అదిలాబాదు సైన్సు అని వుండదు. ఎక్కడ ఎవరు కనుగొన్నా అందరికీ అందించటం, అంటరానితనాన్ని పాటించకపోవడం, కుల మత దేశ సంకుచిత తత్వాలను దూరంగా పెట్టి అందరికీ విజ్ఞానాన్ని విప్పార చేయటం సైన్సు సుగుణం. అదే ధోరణి రచయితలు, రచయిత్రులు బాగా వ్యాపింప చేయాలి.

OOO

bottom of page