MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
వర్ధని నవల : సమీక్ష
డా. శిరీష ఈడ్పుగంటి
వర్ధని నవల
రచయిత్రి చంద్రలత రాసిన నవల వర్ధని. ఈ నవలలో ఏడేళ్ల అమ్మాయి వర్ధని. రెండవ తరగతి చదువుతుంటుంది. రచయిత్రి ఈ అమ్మాయి పాత్రను ముఖ్యపాత్రగా తీసుకుని నవల రాయడం జరిగింది. ఈ పాత్ర మనస్తత్వాన్ని నవలలో చాలా చక్కగా చూపించారు. నవలలో వివిధ సందర్భాలలో వర్ధనిలో వచ్చే మార్పులను కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు. అంతేగాకుండా వర్ధనిలో వచ్చే మానసిక మార్పులకు కారణమైన ఇతర పాత్రలను కూడా రచయిత్రి ఈ నవలలో అంతే చక్కగా మలిచారు. ఏడేళ్ళ అమ్మాయి వర్ధని మానసిక సంఘర్షణను వివరించిన నవల ఇది.
అలాగే ఈ నవలలో గ్రామీణ ప్రాంతాలలోని ఉమ్మడి కుటుంబాలు, పంట పొలాలు, నీటి కాలువలు, పాడిపంటలకు కొదవలేని పచ్చని సంసారాలు, ఇంటి తోటలో పూల మొక్కలు, బాల్యంలోని ఆటలను గుర్తుచేసే పల్లె సీమలు, సీమ చింతకాయలు, ఇల్లు కట్టడం, పందిరికి గుంజలు నాటడం, కుంకుడు రసంతో తలంటు పోసుకోవడం... మొదలైన వాటిని ఈ నవలలో చూడవచ్చు. రచయిత్రి గ్రామీణ ప్రాంత అందచందాలన్నింటినీ బహుచక్కగా వర్ణించారు...
నవలలోని ప్రధాన పాత్రలు
ఈ నవలను పాత్రల ఆధారంగా సమీక్షించడమైంది. పాత్ర పరంగా సమీక్ష చేయడం ద్వారా నవలకు ప్రధానాంశం అయిన వర్ధని పాత్ర మనస్తత్వాన్ని మరింత స్పష్టంగా పరిశీలించవచ్చు. ఈ నవలలో వర్ధని, కోటయ్య, జయమ్మ, ముకుందం, లలిత, మేడం, ఈ ఆరు ముఖ్యపాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. వేణు, సరోజ, మురళి, వాణి, గౌతం, కురుపా, సుమతి, శశిరేఖ టీచర్, భాస్వంత్, రవి, బడిపంతులు... తదితర పాత్రలు అప్రధానంగా ఉంటాయి.
కూచిమంచి తిమ్మకవి శతకసాహిత్యం – సమకాలీనత
డా. మల్లిపూడి రవిచంద్ర
0. సంక్షిప్తి
ప్రాచీనసాహిత్యపు పరమ ప్రయోజనం ఉపదేశం. అలాంటి ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక విశిష్ట స్థానముంది. సర్వకాల సర్వావస్థలలోనూ అన్వయయోగ్యమైన మనిషి నైతికజీవనం, మానవత్వపువిలువలు వంటి అనేక విషయాలనే శతకకవులు ఎక్కువశాతం వర్ణించారు. అందుకే ఉపదేశాత్మక కవిత్వంలో శతకాలకు, అందునా నీతిశతకాలకు ఉన్నతపీఠం వేయబడింది. ఇటువంటి విషయాలను స్పృశిస్తూ, 17-18 శతాబ్దుల కాలానికి చెందిన కూచిమంచి తిమ్మకవి ఏ కాలంలోనైనా చెప్పుకోదగిన దురాశ, అవకాశవాదం, దోపిడి, మూర్ఖప్రవృత్తి, డాంబికం, లోభం, మోసం, క్రూరత్వం, కాపట్యం, సాంఘిక అసమానత... మొదలైన సామాజిక విషయాలను తన శతకాలలో నీతి ఉపదేశంగా చెప్పిన తీరును ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.
1. ఉపోద్ఘాతం
ఉపదేశాత్మక కవిత్వంగా చెప్పాల్సి వస్తే మొత్తం తెలుగుసాహిత్యంలో శతకసాహిత్యానిదే అగ్రతాంబూలం. శతకంలో ఉండే ముక్తకలక్షణం వల్ల అది మిగిలిన సాహిత్యం కంటే విశిష్టంగానూ, తెలుగుప్రజల విశేష ఆదరణ పొందిన, పొందుతున్న శక్తిమంతమైన ప్రక్రియగానూ పేరుకెక్కింది.
శతకాలలో భక్తి, స్తుతి, వేదాంత, తత్త్వ, శృంగార, వైరాగ్య, హాస్య, అధిక్షేప శతకాలుగా అనేక భేదాలున్నాయి. కానీ, శతకాలు అనగానే తెలుగువారికి వెంటనే స్ఫురించేవీ, వారి లోగిళ్ళను వరించేవీ నీతిశతకాలు మాత్రమే. అందకు కారణం సమాజంలోని ఏ స్థితికైనా, ఏ సందర్భానికైనా అన్వయించుకుని, వక్రమార్గంలో నడుస్తున్న మనిషి జీవన స్థితిగతులను సన్మార్గంవైపు మళ్ళించేందుకు కారణభూతమైన ఉపదేశం నీతిశతకాలకు జీవం కావడమే. ఆ జీవ లక్షణమే నీతి శతకాలను నేటికీ సజీవంగా, సమకాలీనతకు దగ్గరగా నిలిపి ఉంచింది.
.