MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-2]
గిరిజా శంకర్ చింతపల్లి
ఒకానొక యుద్ధం. నవీన మర మారణాయుధాలు రాని, కత్తులూ, గుర్రాలూ, రధాలూ, గదల యుద్ధ కాలం.
"ఆ" రాజ్య సైనికుడు కత్తి దూసి, "ఈ” రాజ్య సైనికుడిమీదికి పరుగెట్టుకుని వస్తున్నాడు, వాణ్ణి పొడవటానికి. ఇంతలో వెనకనించి ఒక బాణం వచ్చి వాడి తల నరికేసింది. ఆ తలతెగిన మొండెం, అదే వేగంతో ముందుకి నడిచి, ఎదుటి సైన్యం వీరుణ్ణి పొడిచి, ఆ తరవాత కింద పడింది. అక్కడ చచ్చి పడిఉన్న కొన్ని తలల్లో ఇంకా కోపంతో బిగబట్టిన పెదవులు, అలాగే కరుచుకుని ఉన్నాయి.
నమ్మశక్యం కావటంలేదు కదూ. మీరు నమ్మాల్సిందే ఇది నిజం.
మన మెదడు [Brain] లో ఉండే పదార్థాలు రెండు 1. న్యూరాన్. 2. న్యూరొగ్లియ. ముట్టుకుంటే టోఫూ లాగా ఉంటుంది. పట్టుకుంటే నొప్పి ఉండదు. 100 బిల్లియన్ కణాలుంటాయి అని అంచనా. కానీ ఆ కణాలు ఒకదానితో ఒకటి అనేకరకాలుగా కలుసుకుని కొన్ని కోటానుకోట్ల కన్నెక్షన్లు ఏర్పడతాయి. అవి ఎన్ని అంటే, మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ. కానీ ఇందులో మనం 20 శాతమే వాడతామని నమ్మిక. అదీ బాగా తెలివిగలవాళ్ళని పేరున్నవారు. మరి నూటికి నూరు పాళ్ళూ వాడితే వారి శక్తికి అంచనా కట్టగలమా?
శేషేంద్ర తొలి రచనలు - ఒక విహంగ వీక్షణం
విన్నకోట రవిశంకర్
సుదీర్ఘ కాలం సాహితీ జీవనం గడిపి, అనేక రచనలు చేసిన కవులు, రచయితల పరిణామక్రమం రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది, వారి తొలి రచనలు తాజాదనం, కొత్తదనం, ఊహా వైచిత్రి, ప్రయోగం వంటి వాటితో తళుక్కున మెరిసి, ఆ మెరుపు తదనంతర రచనలలో క్రమంగా మాయం కావటం. తొలిరచనే అత్యంత ప్రసిద్ధి పొందినప్పుడు, దాని ప్రభావం తరువాతి రచనల మీద పడే అవకాశం ఉంది. అలాగే, తమకంటూ ఒక పాఠకవర్గం ఏర్పడ్డాక, వారిని సంతృప్తి పరిచే బాధ్యత కూడా వారి రచనలను ప్రభావితం చెయ్యవచ్చు. తెలుగులో మొదటి ప్రచురణతోనే విశిష్ట ప్రసిద్ధిపొందిన రచనలు శ్రీశ్రీ “మహాప్రస్థానం” , నవీన్ “అంపశయ్య” వంటివి కొన్ని ఉన్నాయి.
దీనికి భిన్నంగా, కొందరి రచనలలో కాలం గడిచేకొద్దీ పరిణతి, కూర్పులో నేర్పు, గాఢత వంటివి ఏర్పడి, తొలి రచనలకంటే మెరుగ్గా రూపుదిద్దుకుంటాయి. ఉదాహరణకి, ఇస్మాయిల్ గారి తొలి పుస్తకం కంటే, తరువాత వచ్చిన “చిలకలు వాలిన చెట్టు”, “రాత్రి కురిసిన రహస్యపు వాన” వంటి కవితా సంపుటాల్లో కవితలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తిలక్ “అమృతం కురిసిన రాత్రి” లో బాగా ప్రసిద్ధి పొందిన కవితలలలో చాలా వరకు ఆయన నలభైలలో ఉండగా అంటే 1960 ప్రాంతాల్లో రాసినవే. శివారెడ్డి గారి కవిత్వం విషయంలో కూడా తొలినాళ్ళ సంపుటాల కంటే ఇటీవలి కాలంలో వచ్చిన సంపుటాల్లోని కవితలే నాకు ఎక్కువగా నచ్చుతాయి.
ఎన్నేళ్ళుగా రాస్తున్నా, వారి రచనలలో పెద్దగా మార్పులేనివారు రూ కొందరుంటారు. వారు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు.
ఏది ఏమైనా, సుదీర్ఘకాలం రచనలు చేసినవారి తొలి రచనలను పరిశీలించటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రముఖ కవి, పండితుడు, ఆలోచనా శీలి, బహుగ్రంథకర్త గుంటూరు శేషేంద్ర శర్మ గారి తొలి రచనలలో విశేషాలు కొన్ని ప్రస్తావిస్తాను.
కరోనా కాటు
ఆర్. శర్మ దంతుర్తి
మహా భాగవతంలో కధ ఇది.
కృష్ణుడు తన మనుమడైన అనిరుద్ధుణ్ణి రక్షించడానికి శోణపురంలో ఉన్న బాణాసురుడిమీదకి దండెత్తి వెళ్తాడు. ఈ బాణాసురుడు గొప్ప శివభక్తుడు. వాడితో యుద్ధం చేస్తూ వైష్ణవ జ్వరం అనేదాన్ని కృష్ణుడు ప్రయోగిస్తాడు, ఆ బాణాసురుడు వేసిన శివజ్వరం అనే అస్త్రానికి ప్రతిగా. మొత్తానికి కధలో బాణాసురుడి ఉన్న వేయి చేతుల్లో నాలుగింటిని వదిలి మిగతావాటిని ఛేధిస్తాడు కృష్ణుడు తన సుదర్శన చక్రంతో. ఆ తర్వాత శివజ్వరం అనేది కృష్ణుడి దగ్గిరకి వచ్చి క్షమించమని అడిగితే ఆయన చెప్తాడు, “నన్ను శరణు జొచ్చావు కనక బతికిపోయావు, నన్ను తల్చుకుంటే ఎవరికీ నీ వల్ల కష్టాలు రావు,” అని. ఈ కధ, జ్వరం అనే అస్త్రాలు ఎందుకు గుర్తొచ్చాయంటే గత ఏడాది చివర్లో ప్రపంచం మీద విరుచుకుపడిన ఇటువంటి అస్త్రమే కరోనా. ఇది ఎక్కడ ఎలా మొదలైంది అనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియకుండా ఉంది. దానిక్కారణాలు అనేకం, వచ్చినది ప్రయోగశాలలోంచి కావొచ్చు, లేదా మాంసం విక్రయించే చోటు కావచ్చు అంటున్నారు. నిజంగా ప్రయోగశాలలోంచి వస్తే అదెలా తయారు చేసారో, దేనికోసం తయారు చేసారో అవన్నీ చెప్తే, ఇటువంటి మారణాయుధాలు తయారుచేస్తున్నారేమో అని ప్రపంచం అనుకోవచ్చు.
ఇటు లక్షల కొద్దీ జనం ఛస్తున్నా ఆ రహస్యం మాత్రం ఇంకా బయటకి రాలేదు. అయితే ఈ కరోనా వూహాన్ అనేచోట పశువులూ, జంతువులూ, పక్షులూ అమ్మే మార్కెట్ లోంచి వచ్చిందని ఒక కధనం. చిత్రమో విచిత్రమో అదే నగరంలో ఒక వైరల్ లాబ్ ఉండడం, ఈ వైరస్ అక్కడనుంచే లీక్ అయి బయటకి వచ్చిందని మరో కధనం, అబ్బే మరోచోటనుంచిడి గబ్బిలాలు తింటే వచ్చిందని మరో కధనం అలా ఊహాగానాలు (“వూహా”గానాలు అనాలేమో) వస్తున్నాయి కానీ ఏదీ ఇతమిత్థంగా తెలియదు. ఇప్పటివరకూ.
క్షేత్రయ్య పదములు - సంగీత ప్రాధాన్యత
డాక్టర్ వై. కృష్ణ కుమారి
ఏ విద్యకైనా రెండు సోపానాలుంటాయి.
చదువుల తల్లిని మనసులో భావించి, నిల్పుకొని, ఆరాధించడం మొదటి సోపానమైతే అయితే కరుణించిన ఆ తల్లి ప్రసన్న కటాక్షం రెండవ సోపానం.
అయితే ఇది లోక సామాన్యమైన చదువుల వల్ల రాదు. ఇది తపఫలం. దైవ సమానుడైన గురు ముఖతః అభ్యసించి, ఆ విద్యను ఒక తపస్సులాగా ఆరాధిస్తే, అంతరంగం నుండి ఒక వెలుగులా వెలువడి అనిర్వచనీయ దివ్యానుభూతి కళాకృతి గా దర్శనీయ మవుతుంది. ఈ అనుభూతి ఒక్కొక్క కళాకారునిలో ఒక్కొక్క విధంగా ఆవిష్కరింప బడుతుంది. ఈ కళాకారులు భగవంతుని సృష్టికి అందమైన నిర్వచనాలీయ గలిగిన సమర్ధులు.
అటువంటి ఒక నిర్వచనం –ఏవో లోకాలకు తీసుకెళ్ళి, మైమరపింప చేయగల సంగీతంగా మారింది క్షేత్రయ్యకు సంబంధించినంతవరకు. ఇది భాషకు అందని అలౌకికానుభూతి. క్షేత్రయ్య సంగీత రచన నభూతో నభవిష్యతి. సంగీత రచనకు సంబంధించినంతవరకు ఇతనికంటే ముందు సాహిత్యానికి ఉన్న విశిష్టత సంగీతానికి లేదు.