MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
శాస్త్ర విజ్ఞాన సాహిత్యం
వేమూరి వేంకటేశ్వరరావు
“శాస్త్ర విజ్ఞాన సాహిత్యం” అంటే “విజ్ఞాన శాస్త్రాలకి సంబంధించిన సాహిత్యం.” ఇది విరుద్ధోక్తి అనే అలంకారానికి ఉదాహరణ. అనగా రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే మాటలని ఒకే సందర్భంలో వాడడం. సాహిత్యం, శాస్త్రం నూనె, నీళ్లల్లా కలవవు.
సాహిత్యం అనగానే మన మనస్సులలో స్ఫురించేవి కవితలు, కథలు, నాటకాలు, నవలలు, వ్యాసాలు, వగైరా. వీటన్నిటిలోను సాధారణంగా సమాజంలోని సమస్యలు ఇతివృత్తాలుగా వస్తూ ఉంటాయి: ప్రేమలు, దోపిడీలు, దుర్మార్గాలు, మూఢ నమ్మకాలూ, మానసిక సమశ్యలు, వగైరా.
సాహిత్యం ఒక కళాత్మకమైన రచన. అనగా విద్యావిషయక రచనలు, పాండిత్య ప్రదర్శక రచనలు, వార్తాపత్రికలలో కనబడే రచనల వంటి రాతలని మినహాయించగా మిగిలిన రచనలు! ఈ పరిధిలో “సైన్సు ఫిక్షన్” ని ఇమడ్చవచ్చు. కానీ “పాపులర్ సైన్సు”ని ఇమడ్చడం కాసింత కష్టం. అయినా సరే నేటి ప్రసంగంలో ఈ రెండింటిని “సాహిత్యం” కింద జమకట్టి మాట్లాడతాను.
“పాపులర్ సైన్సు” లేదా “జనరంజక విజ్ఞానం” గమ్యం సమాజం లోని లోపాలని కళాత్మకంగా ఎత్తి చూపడం కాదు; ప్రభంజనంలా విరుచుకుపడి మన జీవన శైలినే మార్చివేస్తున్న “సైన్సు” ని అందరికి అందుబాటులోకి వచ్చేలా తేలిక భాషలో చెప్పడం. అనగా ఇది ఒక విద్యావిషయక (academic), పాండిత్య ప్రదర్శక (expository) రచన. ఉపనిషత్సరాన్ని అందరికి అర్థం ఆయే రీతిలో ప్రవచనాలు చెప్పినట్లు చెప్పడం అన్నమాట.
ఇలా చెప్పవలసిన అవసరం ఏమిటిట? సైన్సు ప్రజల జీవితాలని అనూహ్యంగా ప్రభావితం చేస్తున్నది. ఉదాహరణకి “వైరస్ అంటే ఏమిటి? దానిని అదుపులో పెట్టడం ఎలా? వేక్సిన్ తయారు చెయ్యడానికి ఎందుకు అంత కాలయాపన జరుగుతుంది? ” మొదలైన ప్రశ్నలు ఎదురైనప్పుడు వైద్యులు, నిపుణులు ఇచ్చే సలహాలని అర్థం చేసుకునే కనీస పరిజ్ఞానం మన నాయకులకి ఉండాలి. ఇటువంటి పని చెయ్యడానికి “జనరంజక విజ్ఞానం” అవసరం. ఇటువంటిదే “సెల్ ఫోనుల వాడకం వల్ల కేన్సరు వస్తుంది” అనే భయం. లేదా “అమ్మవారికి మేకని బలి ఇస్తే రోగం నయం అవుతుంది” అనే నమ్మకం!
ఇదేమీ తేలిక విషయం కాదు కదా! జనరంజక శైలిలో రాయాలంటే సైన్సు మీద మంచి పట్టు ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, క్లిష్టమైన అంశాలని తేలిక ఉపమానాలతో - మూలానికి భంగం రాకుండా - చెప్పగలిగే నేర్పు ఉండాలి. వచ్చిన చిక్కు ఏమిటంటే సైన్సు వచ్చినవాళ్ళకి తెలుగు రాయడం రాదు, తెలుగు బాగా రాయడం వచ్చిన వాళ్ళకి సైన్సు అర్థం కాదు. రెండూ వచ్చినవాళ్ళకి సైన్సుని తెలుగులో ఎందుకు రాయాలి అనే నిరసన భావం!
అందరికీ సైన్సు మీద అభిలాష ఉండకపోవచ్చు. కొందరికి సైన్సు అనేది అర్థం అవని పదార్థం అనే భయం ఉండొచ్చు. అప్పుడు మనం చెప్పదలుచుకున్న విషయాన్ని కథల రూపంలో చెబితే అది “సైన్సు ఫిక్షన్” లేదా “వైకల్పన.” కథ అనగానే కల్పనకి అవకాశం ఉంటుంది కనుక “వైకల్పన” లో “సైన్సు”కి సాధ్యం కాని కల్పన ఉండొచ్చు.
సైన్సు అర్థం కానివాళ్ళకి “సైన్సు ఫిక్షన్” కూడా అర్థం కాకపోవచ్చు. అందుకని వైకల్పనలు సైన్సు పాఠం చెప్పినట్లు రాయకూడదు. చదువుతున్న పాఠకులకి ఏ కాశీమజిలీ కథో, పత్తేదారి కథో, చదువుతున్నట్లు అనిపించాలి. కొస మెరుపు కోసం తాపత్రయం పడితే వ్రతం చెడవచ్చు, ఫలమూ దక్కకపోవచ్చు. అందువల్ల సగటు పాఠకులనే కాదు, సగటు సంపాదక వర్గాన్ని, విమర్శకులని ఆకట్టుకునే విధంగా, మెప్పించే విధంగా “సైన్సు ఫిక్షన్” రాయడం కష్టం. ఈ రెండింటికి మధ్యేమార్గంగా మరొక రకం కథలు ఉన్నాయి. వీటిలో కథ కల్పన కావచ్చు కానీ సైన్సు మాత్రం పకడబందిగా ఉంటుంది. వైద్యుల అనుభవాలు, వకీళ్ళ అనుభవాల మీద ఆధారపడ్డ కథలు ఈ కోవకి చెందుతాయి. వీటిని సాహిత్యపు పరిధిలోకి చేర్చుకోవచ్చు.
పదజాలం పుష్ఠిగా ఉన్నా వాడుకలో లేకపోబట్టి తెలుగులో జనరంజక విజ్ఞానం కానీ వైకల్పనలు కానీ రాయడం తేలిక కాదు. కష్టం కనుకనే తెలుగులో ఈ రెండు ప్రక్రియలని ప్రోత్సహించాలి. ఎవరు ప్రోత్సహించాలి? ప్రచురణ మాధ్యమాలకి అధినేతలయిన సంపాదకులు. సాహిత్య విలువలు ఉన్న సైన్సు కథలకి, నవలలకి ఒక గౌరవ స్థానం ఇవ్వాలి.
“తెలుగులో వొకేబ్యులరీ లేదండి!” అంటూ సైన్సు రాసేవాళ్ళని ఎగతాళి చెయ్యకండి. సైన్సులో మనం వాడే ఇంగ్లీషు పదజాలం చాలామట్టుకు గ్రీకు, లాటిన్ భాషల నుండి పుట్టుకొచ్చినవే. గ్రీకు, లాటిన్, సంస్కృతం - ఈ మూడూ జ్ఞాతులు కనుక ఇంగ్లీషు పదజాలానికి సమానార్థకాలయినవి, మన నుడికారానికి లొంగేవి అయిన తెలుగు మాటలు తయారు చేసుకోవడం కష్టం కాదు. అలా వీలు కానీ సందర్భాలలో ఇతర భాషలలో మాటలు తెలుగు వ్యాకరణానికి లొంగే విధంగా మార్చుకుని వాడుకోవచ్చు.
ఏ భాష అయినా సరే వాడుతున్న కొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. తెలుగు అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే మనం తెలుగుని అన్ని రంగాలలోను విరివిగా వాడాలి. తెలుగు వాడకాన్ని కేవలం కథలకి, కవిత్వాలకి పరిమితం చేసినంతసేపు తెలుగు ఎదగదు. తెలుగులో పదజాలం లేదని భ్రమ పడకండి. పదజాలం ఉంది; వాడుకలో లేక మరుగున పడిపోయింది. షేక్స్పియర్ వాడిన ఇంగ్లీషు పదజాలం కంటే తిక్కన వాడిన తెలుగు పదజాలం పెద్దది అని ఎంతమందికి తెలుసు?
చివరిమాట. “సైన్సు ఫిక్షన్ ని సాహిత్య ప్రక్రియగా పరిగణించవచ్చా?” అనే ప్రశ్న కొత్తదేమీ కాదు. ఇతర భాషలలో ఈ ప్రశ్న ఉదయించింది. కళాత్మకమైన కల్పనలు - ఏ రూపంలో ఉన్నవయినా సరే, కథా వస్తువు ఏదైనా సరే - . సాహిత్యమే అనిన్ని, కనుక ఉత్తమ సైన్సు ఫిక్షన్ రచనలని కూడా సాహిత్యపు పరిధిలోకి తీసుకోవాలని ఇంగ్లీషు రచయితల అభిప్రాయం. ఇలాంటి దృక్పథం తెలుగులో కూడా రావాలి!
***