top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

వర్ధని నవల : సమీక్ష

sireesha.JPG

డా. శిరీష ఈడ్పుగంటి

రచయిత్రి చంద్రలత రాసిన నవల వర్ధని. ఈ నవలలో ఏడేళ్ల అమ్మాయి వర్ధని. రెండవ తరగతి చదువుతుంటుంది. రచయిత్రి ఈ అమ్మాయి పాత్రను ముఖ్యపాత్రగా తీసుకుని నవల రాయడం జరిగింది. ఈ పాత్ర మనస్తత్వాన్ని నవలలో చాలా చక్కగా చూపించారు. నవలలో వివిధ సందర్భాలలో వర్ధనిలో వచ్చే మార్పులను కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు. అంతేగాకుండా వర్ధనిలో వచ్చే మానసిక మార్పులకు కారణమైన ఇతర పాత్రలను కూడా రచయిత్రి ఈ నవలలో అంతే చక్కగా మలిచారు. ఏడేళ్ళ అమ్మాయి వర్ధని మానసిక సంఘర్షణను వివరించిన నవల ఇది.


అలాగే ఈ నవలలో గ్రామీణ ప్రాంతాలలోని ఉమ్మడి కుటుంబాలు, పంట పొలాలు, నీటి కాలువలు, పాడిపంటలకు కొదవలేని పచ్చని సంసారాలు, ఇంటి తోటలో పూల మొక్కలు, బాల్యంలోని ఆటలను గుర్తుచేసే పల్లె సీమలు, సీమ చింతకాయలు, ఇల్లు కట్టడం,  పందిరికి గుంజలు నాటడం, కుంకుడు రసంతో తలంటు పోసుకోవడం... మొదలైన వాటిని ఈ నవలలో చూడవచ్చు. రచయిత్రి గ్రామీణ ప్రాంత అందచందాలన్నింటినీ బహుచక్కగా వర్ణించారు.


నవలలోని ప్రధాన పాత్రలు
ఈ నవలను పాత్రల ఆధారంగా సమీక్షించడమైంది. పాత్ర పరంగా సమీక్ష చేయడం ద్వారా నవలకు ప్రధానాంశం అయిన వర్ధని పాత్ర మనస్తత్వాన్ని మరింత స్పష్టంగా పరిశీలించవచ్చు. ఈ నవలలో వర్ధని, కోటయ్య, జయమ్మ, ముకుందం, లలిత, మేడం, ఈ ఆరు ముఖ్యపాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. వేణు, సరోజ, మురళి, వాణి, గౌతం, కురుపా, సుమతి, శశిరేఖ టీచర్, భాస్వంత్, రవి, బడిపంతులు... తదితర పాత్రలు అప్రధానంగా ఉంటాయి.


వర్ధని 
ఈ నవలలో ఏడేళ్ల అమ్మాయి వర్ధని. రెండవ తరగతి చదువుతుంటుంది. పెదనాన్న కోటయ్య, పెద్దమ్మ జయమ్మ దగ్గర ఊళ్లో గారాబంగా పెరుగుతుంది. వర్ధనికి తల్లిదండ్రులు అదే ఇంటిలో ఉంటున్నప్పటికీ వారి ధ్యాసే ఉండదు. దీనికి గల కారణం ఆ ఉమ్మడికుటుంబంలో వర్ధని మొదటి ఆడపిల్ల. దాంతో కోటయ్య జయమ్మ దంపతులు వర్ధనిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. అంతేగాకుండా కోటయ్య వాళ్ళ అమ్మ పేరు వర్ధనమ్మ. ఆమె ఎంతో తెలివైనది, చురుకైనది. ఆమె పేరును కోటయ్య తమ్ముడు(ముకుందం) కూతురికి పెట్టి అమ్మాయిని అపురూపంగా చూసుకుంటుంటాడు. కోటయ్య భార్య జయమ్మ కూడా వర్ధనిని ఎంతో ప్రేమతో చూసుకుంటుంది. అంతేగాకుండా కోటయ్య జయమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలే. పెద్దకొడుకు వేణుకు పెళ్ళైపోతుంది. చిన్నకొడుకు  మురళీకి పెళ్ళి సంబంధాలు చూస్తుంటారు. వాళ్లకి వర్ధనికి  వయసులో చాలా తేడా ఉంటుంది. వాళ్లు కూడా చెల్లెల్ని ఎంతో మురిపెంగా చూసుకుంటారు.


ఇక ముకుందం లలిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలే. పెద్దమ్మాయి వర్ధని, చిన్నమ్మాయి వాణి.  ఆ ఉమ్మడి కుటుంబంలో అందరికంటే ముందు పుట్టిన అమ్మాయి వర్ధనినే. అందుచేత అందరూ వర్ధనినీ గారాబంగానే చూస్తుంటారు. అంతేగాకుండా ఊళ్లో వాళ్ళు కూడా వర్ధనిని అందరూ ఒక మహారాణిలా చూడడం జరుగుతుంది. చివరికి బడిలోని పంతులు కూడా, వర్ధనిని పీట మీద కూర్చోమని మిగిలిన పిల్లలందరినీ నేల మీద కూర్చోమంటాడు. ఆ ఊళ్లో అంతా వర్ధని ఇష్టా రాజ్యంగా ఉంటుంది.


ఈ నవలలో మొదటి పదమూడు పుటల వరకు వర్ధని తండ్రి ముకుందం అని చదివే పాఠకునికి తెలియదు. కనీసం  ముకుందం తన తండ్రి అని వర్ధనికి కూడా తెలియదు అనేవిధంగానే నవలలో సంభాషణ నడుస్తుంది. తరువాతనే పరోక్షంగా వర్ధని తల్లిదండ్రులు ముకుందం, లలిత అని పాఠకునికి తెలిసే రీతిలో నవల కొనసాగుతుంది.  ముకుందం వేరే ఊళ్ళో బ్యాంకులో పని చేస్తుంటాడు.  ఉద్యోగ కారణంగా ఇంటి దగ్గర ఉండేది తక్కువ. ఉమ్మడి కుటుంబం కారణంగా తన పిల్లల గురించి అంతగా పట్టించుకోడు. భార్య లలిత, అన్నా వదిన చూసుకుంటున్నారు అనుకుంటాడు. ఇదే ధోరణి పిల్లల చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు కూడా అక్కడ భార్య చూసుకుంటుందని ఊరుకుంటాడు. వర్ధని తల్లి లలిత కూడా కోటయ్య జయమ్మ దంపతులకు వ్యతిరేకంగా నడుచుకునేది కాదు. పల్లెప్రాంతాల ఉమ్మడి కుటుంబాలలో సహజంగానే ఇంటి యాజమానికి ఎవరూ ఎదురుచెప్పరు. దాంతో ఆ ఇంట్లో వర్ధని ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది.


చదువు నిమిత్తం ముకుందం లలిత పిల్లలిద్దరిని (వర్ధనిని, వాణీని) పట్నం తీసుకుని వెళతారు. ఒకవిధంగా  వర్ధనికి తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. వర్ధని ఊరి నుండి, పెదనాన్న పెద్దమ్మ నుండి  హఠాత్తుగా దూరమవ్వడం భరించలేకపోతుంది. ఈ పరిణామాన్ని ఊహించలేకపోతుంది. దీనికి గల కారణం తల్లిదండ్రులు గాని పెద్దమ్మ పెదనాన్న గాని తనను వేరే ఊరు తీసుకెళుతున్నట్లుగా వర్ధనితో చెప్పరు. ఏదో ఒక సందర్భంలో ఆడుకుంటూ వర్ధని ఇంటి ముందు ఆగి ఉన్న కారులో నిద్రపోతుంది. ఆ సమయంలోనే తల్లిదండ్రులు వర్ధనిని, వాణీని అదేకారులో తీసుకుని వెళ్తారు. ఇదంతా వాణికి తెలిసి తల్లిదండ్రులతో సంతోషంగా వెళుతుంది. కారు కదలడంతో వర్ధనికి కొంత మెలకువ వచ్చి కారులోంచి చూస్తే పెద్దమ్మ, పెదనాన్న దూరంగా కనిపిస్తారు. దాంతో వర్ధని పెద్దమ్మ పెదనాన్న అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతుండగానే కారు ఊరు దాటి పోతుంది. ఒక్కసారిగా వర్ధనికి అంతా చీకటిగా కనిపిస్తుంది. తాను ఎక్కడికి వెళుతున్నది, ఎవరితో వెళుతున్నది, ఎందుకు వెళుతున్నది, అర్థం కాక భయంతో ఏడుస్తూ ఉండిపోతుంది. పట్నంలో ఇంటికి వెళ్లిన తర్వాత కూడా లలిత, వాణి ఇద్దరూ ఇల్లు సర్దుతూ ఉంటే, వర్ధని మాత్రం ఓ మూల గదిలో కూర్చుని ఉంటుంది. మర్నాడు  ముకుందం వాణీని, వర్ధనిని (పిల్లలిద్దరిని) కొత్త స్కూల్లో చేర్పించడానికి తీసుకుని వెళతాడు.  స్కూల్లోని పిల్లలు, ప్రిన్సిపాల్ మేడమ్ అందరూ కొత్తగా వింతగా కనిపిస్తున్నారు వర్ధనికి. ఆ కొత్త వాతావరణం చూసి వర్ధనికి ఏమీ దిక్కుతోచని పరిస్థితి అవుతుంది. ఏదో విధంగా అక్కడి నుంచి పారిపోయి పెద్దమ్మ, పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇటువంటి ప్రయత్నాలు కొన్ని రోజులు చేసి చేసి అలిసిపోతుంది. మధ్య మధ్యలో వాణితో గొడవ పడుతూ ఉంటుంది. దాంతో లలిత వర్ధనిని అప్పుడప్పుడు చేయి చేసుకుంటుంది. చివరికి వర్ధని ఊరు వెళ్ళడానికి బస్సుకు డబ్బులు అవసరం అని తెలుసుకొని తండ్రి చొక్కాలోంచి డబ్బులు కూడా దొంగిలిస్తుంది. దాంతో వర్ధని ప్రవర్తన పట్ల లలిత విసుగు చెందుతుంది. కొంతకాలం తర్వాత వర్ధనిలో మార్పు వస్తుందని ఆశించిన లలితకు నిరాశే ఎదురవుతుంది.  వాణి మాత్రం వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ అందరితో కలిసి పోతుంది. కానీ వర్ధనిలో ఏ మాత్రం మార్పు కనిపించదు. కాకపోతే సహజంగానే తెలివైన అమ్మాయి కనుక క్లాస్ లో మంచి మార్కులు వస్తాయి. ప్రిన్సిపాల్ మేడం కథలు చెప్పడంతో కథ చెప్పే తీరు నచ్చి ఆమెను ఇష్టపడుతుంది. సహజంగానే పిల్లలు కథలు.., తదితర విషయాల్లో ఆసక్తి చూపుతారు. ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం అదే చేస్తుంది. ఏదో ఒక సమయంలో పిల్లలకు కథలు చెబుతూవుంటుంది.  అదేవిధంగా వర్ధని కూడా మేడం లా కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే క్లాస్ లో మంచి మార్కులు వచ్చిన అమ్మాయి బయట కాస్త విభిన్నంగా కనబడటంతో ప్రిన్సిపాల్ మేడం వర్ధని తండ్రియైన ముకుందాన్ని పిలిచి మాట్లాడుతుంది.


వీరిద్దరి సంభాషణను రచయిత్రి మాటలలో... “వర్ధని విషయాలు ఎవరు చూస్తారు? మామూలుగా అడిగిందావిడ. వాళ్ళ అమ్మే చూసుకుంటుంది. అయినా మేమేదో పిల్లలకు కావలసినవి సమకూర్చడం వరకే గానీ వారి బాగోగులు పట్టించుకోవలసినది ఆడవాళ్లే కదండీ! ముకుందం కూడా మామూలుగా అన్నాడు. కానీ ఆవిడ తీవ్రంగా స్పందించింది. ఇంత తెలిసిన వారు మీరే అలాగంటే ఎలాగండీ ముకుందం గారు? పిల్లల పెంపకం అనేది ఏదో ఆడవాళ్ళ పనిలెండి అంటూ చులకనగా ఎందుకు తీసివేస్తారు? అసలు ఆడపనులు, మగపనులు అంటూ గీసుకున్న విభజన రేఖ రోజురోజుకీ హద్దులు చెరిపేసుకుంటుంటే మీరు ఇంకా అలా అంటున్నారేమిటి? ఆడవారు చేస్తున్నారు కాబట్టి అవి తేలిక పనులుగా భావించాల్సిన అవసరం ఉంటుందంటారా? 


ఏమైనా పిల్లల్ని పెంచగల నేర్పూ, ఓర్పూ వారికే సాధ్యమనీ... అవును సుమండీ! నేనూ మర్చే పోయాను! మాతృదేవత అంటూ ఓ అందమైన పట్టం కట్టి, ఆ బాధ్యతల నుంచి మీరంతా సులువుగా చేతులు దులిపేసుకున్న సంగతి!” అని మేడం అనడంతో ముకుందం కొంత ఆలోచనలో పడతాడు. ముకుందంలాంటి వాళ్ళు మనకు బయట ఎంతోమంది కనిపిస్తుంటారు. పిల్లలు అనేసరికి  ఆ బాధ్యతంతా తల్లిదే అని భావిస్తారు. దానికి కారణం బహుశ వారి విధి నిర్వహణ లేదా మరొకటి కావచ్చు. ఏది ఏమైనా పిల్లల బాధ్యత అనేది తల్లిదండ్రులిద్దరు కలిసి నిర్వర్తించవలసిన అపురూపమైన బాధ్యత. 


నవలలో మేడం మాటలు విన్న తర్వాత ముకుందంలో మార్పు వస్తుంది. ఇన్నాళ్ళు తను పిల్లల గూర్చి లలిత చూసుకోంటుందిలే అనుకుంటూ ఉండిపోయాడు. ఆ రకమైన అభిప్రాయం ఎంత పొరపాటో గ్రహిస్తాడు. దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాడు. పిల్లల పట్ల ఎంతో శ్రద్ధగా ఉంటాడు. ముఖ్యంగా వర్ధని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. నిరంతరం వర్ధనిని కనిపెట్టుకుని వుంటాడు. వర్ధని మానసిక పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ముందుగా వర్ధనికి దగ్గరయ్యి అమ్మాయి మనసుకు అనుగుణంగా నడుచుకుంటాడు. దాంతో వర్ధనిలో తండ్రి పట్ల అంతకుముందున్న అభిప్రాయం చెరిగి తండ్రికి దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నెమ్మది నెమ్మదిగా వర్ధనిలో మార్పును కోరుకుంటాడు. కానీ ఇంతలో స్కూల్ కి సెలవులు వస్తాయి. ఊరికి వెళదామని ముకుందం దంపతులు పిల్లల్ని తీసుకొని బయలు దేరుతారు. ఊరు అనగానే వర్ధనిలో మళ్ళీ ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. పెద్దమ్మ, పెదనాన్నలను చూడొచ్చు. ఇక మళ్ళీ ఇక్కడకు రాకుండా అక్కడే ఉండిపోవచ్చని ఎన్నో ఆశలతో వెళుతుంది.


ఊరు వెళ్లిన తర్వాత అక్కడ  పెదనాన్న, పెద్దమ్మను చూసి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఊరికి వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడి పరిస్థితి చూసి వర్ధనికి అంతా అయోమయంగా ఉంటుంది. ఎందుకంటే తనను ఒక్క క్షణం కూడా విడిచి పెట్టి ఉండని పెద్దమ్మ ఇప్పుడు ఎప్పుడు చూసిన వేణు అన్నయ్య, సరోజ వదినల కూతురుని ఎత్తుకొని ఉంటుంది. ఆపాపకు స్నానం చేయించడం, అన్నం తినిపించడం... అన్నీ పెద్దమ్మే చేస్తోంది. ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన తనను అసలు పట్టించుకోవడం లేదనే ఆలోచన వర్ధనిలో కలుగుతుంది. ఆ ఆలోచన అతి కొద్ది రోజుల్లోనే పెద్ద వృక్షంగా మారుతుంది. ఎన్నో ఆశలతో ఊరు వచ్చిన వర్ధనికి అక్కడ పరిస్థితి అంతా తారుమారుగా కనిపించేసరికి తట్టుకోలేకపోతుంది. తనను చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న పెద్దమ్మ చేతిలో ఎప్పుడు చూసినా చంటిపిల్ల (వేణు సరోజల కూతురు) ఉండడం చూసి భరించలేకపోతుంది. నన్ను దూరం పెడుతున్నారు పెదనాన్న పెద్దమ్మ అనుకుంటుంది. తన స్థానాన్ని ఆ చంటి పిల్ల ఆక్రమించుకోవడంతో కోపం పట్టలేకపోతుంది. ప్రతి విషయంలోనూ ఆ చంటి దాన్ని చూసి అసూయ పడుతూ ఉంటుంది. ఒక సందర్భంలో వర్ధని ఆ చంటిదాన్ని కొడుతుంది. దాంతో పెద్దమ్మ వచ్చి వర్ధనిని తిడుతుంది. తనను ఇంతవరకు పెద్దమ్మ ఎప్పుడు తిట్టలేదు. ఇప్పుడు తిట్టడానికి కారణం  ఆ చిన్న పిల్లే అనుకుంటుంది. దాంతో వర్ధని  పసిదాని పట్ల అసూయద్వేషంతో రగిలిపోతుంది. ఎలాగైనా సరే తన స్థానాన్ని ఆక్రమించుకున్న ఆ పాపను లేకుండా చేయాలనుకుంటుంది. చంపేయాలనే హింసాత్మక ఆలోచన చేస్తుంది. రాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు చంటి దాన్ని మంచం మీద నుంచి కిందకు తోసేస్తుంది. పాప చనిపోయింది అనుకొని అది తెలిస్తే ఇంట్లోవాళ్లు తనని కొడతారని భయపడి ఆ రాత్రి సమయంలో రోడ్డుమీదికి పరిగెడుతుంది. అదే సమయంలో ముకుందం ఒక పెద్ద వాహనంలో వచ్చి రోడ్డుమీద వర్ధనిని చూసి ఆశ్చర్యపోతాడు. వర్ధనిని ఇంటికి తీసుకొని వెళతాడు. వెళ్ళిన తర్వాత పాప చనిపోలేదని తెలిసిన వర్ధని తన మనసులోని మాటను (ఆ రాక్షసి ఇంకా చనిపోలేదా అని) పైకి అంటుంది. అది విన్న కుటుంబమంతా షాక్ కు గురి అవుతారు. చంటి పాప తల్లి మాత్రం వర్ధనిని తిడుతుంది. రాత్రి మంచం మీద నుంచి కిందకు తోసింది నువ్వా?  నేనింకా నిద్రలో దొర్లి కిందపడిందేమో అనుకున్నాను. ఎంత నంగనాచివి అని తిడుతుంది. 
ఏడేళ్ళ వర్ధని ఇంతటి క్రూరత్వానికి హింసాత్మక చర్యలకు పాల్పడానికి కారణం ఎవరు? ఏమిటి? అనేదానికన్నా అందుకు కారణమైన పరిస్థితులను గూర్చి ఆలోచించాలి. 


వర్ధనిని పెంచి పెద్ద చేసిన వారి నుండి దూరం చేసేటప్పుడు, ముఖ్యంగా ఊరి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు అందుకనుగుణంగా తన మనసును సిద్ధం చేయలేదు. ఇది కుటుంబం చేసిన పొరపాటు. పట్నం వెళ్ళిన తర్వాత కూడా వర్ధనికి  పెద్దమ్మ, పెదనాన్న తనదగ్గర లేరనే లోటు అలాగే ఉండిపోతుంది. ఆ లోటును తల్లిదండ్రులు భర్తీ చేయలేకపోతారు. అటువంటి సమయంలో కూడా  వర్ధని మానసిక పరిస్థితికనుగుణంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండదు. ఇటువంటి స్థితిలో వర్ధని తల్లిదండ్రులుండి కూడా ఒంటరిదవుతుంది. ఒంటరితనం భరించలేక ఏం చేస్తుందో తనకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో స్కూల్లో కూడా తన తోటి పిల్లలు ఎవరితోనూ కలవదు. ఇంట్లో చెల్లెలు వాణితో కూడా సఖ్యంగా ఉండకపోగా రెండు మూడు సార్లు గాయపరుస్తుంది. వర్ధని ఇటువంటి పనులు చేసినపుడల్లా లలిత వర్ధనిని తిట్టడమే కాక కొడుతుంది కూడా. ఊరు వెళ్ళి పోవడానికి డబ్బుల కోసం దొంగతనం కూడా చేస్తుంది. అప్పటికీ కూడా వర్ధని మానసిక పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం తల్లిదండ్రులలో కనిపించదు. ఏది ఏమైనప్పటికీ వర్ధనిలో ఎటువంటి మార్పు ఉండక పోగా ఇంకా పెంకిఘటంలా తయారవుతుంది. 


నవలలో వర్ధనిలో వచ్చే మానసికపరమైన ఒత్తిడికి పరిష్కారం చూపేవిధంగా మేడం మాటలుంటాయి. వాటిని ముకుందం అమలుపరిచే లోపు మళ్ళీ పరిస్థితులు అనుకూలించక వర్ధనిలో హింసాత్మక ధోరణి మొలకెత్తడం జరుగుతుంది. మేడం మాటలు విన్న తర్వాత ముకుందంలో మార్పు వచ్చి వర్ధనికి దగ్గరవుతుండగా మళ్ళీ ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి పరిస్థితులు వర్ధని మనసుని మరింత క్రూరంగా తయారుచేస్తాయి. దానిఫలితమే పై హింసాత్మకచర్య. తదనంతరం నవలలో ముకుందం మాటలు... “మానసిక సంఘర్షణతో కొట్టుమిట్టాడుతూ తీవ్ర అసంతృప్తికి’ లోను కాకుండా చేసేవాళ్ళం. పరాధీనతలో తన అస్తిత్వం నిరూపించుకోవడానికి వర్ధని అనుక్షణం అనుభవించిన అలజడికి ప్రతీక ఆ విధ్వంసం! దాన్ని గుర్తించడంలో మనం చాలా ఆలస్యం చేసాం! చాలా ఆలస్యం! ముకుందం తనలో తను గొణుక్కున్నట్లుగా అన్నాడు.” 


    ఏడేళ్ళ పసిదాని మనసులో ఎన్నెన్ని మార్పులో ఈ నవలలో కనిపిస్తాయి. దీనికి గల కారణం తల్లిదండ్రులు, కుటుంబం, పరిస్థితులు,... ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ. హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి తనతోటి చెల్లెల్ని కొట్టడం, దొంగతనం చేయడం, చివరకు ఎత్తుకుని ముద్దాడాల్సిన నెలల పసికందును చంపే హింసాత్మక ఆలోచన చేయడం, ఇన్ని జరుగుతున్నా తను చేస్తున్నదేమిటో అర్ధం కాని పరిస్థితి నవలలో వర్ధనికుంటుంది. చివరికి వర్ధని పరిస్థితి ఏంటో లలిత ఊహాల్లో రచయిత్రి మాటలు... వర్ధని మానసిక పరిస్థితి ఏవిధంగా ఉందో గ్రహించిన లలిత మొదట షాక్  లో ఉన్నప్పటికీ తర్వాత తేరుకుంటుంది. భర్త ముకుందం మాటలు చెవినపడతాయి. “అవసరమైతే మహబూబ్ నగర్ వెళ్ళాక డాక్టర్ని కలుద్దాం! డా... డాక్టర్? వర్ధనికి ఏమైందని మీ అనుమానం? భయం భయంగా అడిగింది. కాళ్ళూ చేతులు బంధించబడి, తలకు కరెంట్ షాక్ లు ఇప్పించబడుతున్న వర్ధని లలిత కళ్ళముందు కదలాడింది. వర్ధని లేత కంఠంలో నుంచి ఆపకుండా వస్తోన్న పిచ్చికేకలు సూటిగా లలిత హృదయాన్ని తాకుతున్నాయి. లలిత హృదయాన్ని తాకుతున్నాయి. లలిత తల పగిలి పోతున్నట్లుగా వుంది. భరించలేనట్టుగా కణతులు వత్తుకుంది. ఇంకా ఏమీ అవలేదు అవకముందే మనం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది! పువ్వలాంటి పసిమనసు సున్నితత్వాన్ని కరడుగట్టినీయవద్దంటోంది. అందుకు ముందు మనం సిద్ధం కావద్దూ... మానసికంగా...!” నవలలో చివరిగా వర్ధని మాటలు... వేణు అన్నయ్య నేను ఎవరితోనూ మాట్లాడను. నీ ఒక్కడితోనే మాట్లాడుతా, మనిద్దరం ఒక జట్టు. ఇది వర్ధని మానసిక పరిస్థితి. 


నవలలోని విశేషాంశాలు 
1.భాష
: ఈ నవలలో రచయిత్రి ఎంచుకున్న ప్రాంతం తెలంగాణాలోని మహబూబ్ నగర్. తెలంగాణ మాండలిక యాసలోనే సంభాషణలుంటాయి. ఉదాహరణకు... సీమ చింతకాయలు, దానం గుంజ, సవారీ... మొదలైనవి. 


దడి... అంటే తడుకలు మొదలైన వాటితో ఆవరణ ఏర్పరచడం.. అనే అర్థంలో తెలంగాణలో వాడటం జరుగుతుంది.  గాబు... అంటే కాగు అనే అర్థంలో వాడుతున్నట్లుగా తెలంగాణ పదకోశం ద్వారా తెలుస్తుంది.


అలుకుమన్ను, అల్కుపూతలు... పదాలకు అలకడం అనే అర్థం ఉన్నట్లుగా తెలుస్తుంది......మొదలైన తెలంగాణ మాండలిక పదాలతో సంభాషణలు నవలలో కనిపిస్తాయి.  అయితే పూర్తిగా తెలంగాణా మాండలికంలో నవల ఉందని చెప్పలేం. మధ్య, మధ్యలో వేరే మాండలిక పదాలతో కూడా సంభాషణలు కొనసాగుతాయి. అది ప్రామాణిక భాషా మాండలికం కావచ్చు లేదా ఇతర వేరే మాండలికం కావచ్చు. అట్లాంటి పదాలకు ఉదాహరణ... రామాకండి, అన్నాయ్, ఇవరం, తెప్పించమాకు, చావిడి, గభాల్న, పైటేళ, తొలకరి,  బావులేకపోతే,  పిదప కాలం, సద్దికోసం, ..... మొదలైనవి. అలాగే నవలలో ఉపయోగించిన మరికొన్ని పదాలు గోదావరీ తీర ప్రాంతాలలో ఎక్కువగా వాడేవిగా కనిపిస్తాయి. ఉదాహరణకు... కేకేశాడు (పిలవడం అనే అర్థంలో వాడతారు) అయితే తెలంగాణా మాండలికంలో కూడా ఈ పదం (కేకేసి... వాడుకలో చిన్న చిన్న మార్పులతో ఉంది) ఉన్నట్లుగా మనకు అక్కిరాజు రమాపతిరావుగారి మాండలిక పదకోశం (కేకేసి = కేక వేసి పిలిచె) ద్వారా తెలుస్తుంది. రెండంగలు... ఈ పదబంధంలో అంగలు అంటే త్వరత్వరగా ఒక చోటికి పోవడం లేదా రావడం అనే అర్థంలో అక్కిరాజు రమాపతిరావుగారి మాండలిక పదకోశంలో ఇవ్వడం జరిగింది. నవలలో రచయిత్రి కూడా ఇదే అర్థంలో వాడటం జరిగింది. కాని అంగలు అనే పదం కేవలం కోస్తా ప్రాంతంలో వాడే పదంగా  పదకోశంలో ఇవ్వడం జరిగింది. 


2. ప్రస్తుత నవలను రచయిత్రి 1995- 1996 ప్రాంతంలో రాశారు. నవలలో ఊరిలో చదువుతున్న స్కూల్లో ప్రభవ, విభవ.... తెలుగు సంవత్సరాలు, పెద్ద బాలశిక్ష నేర్పించడం కనిపిస్తుంది. ఒకప్పటి రోజుల్లో ఈ రకమైన చదువు కనిపించేది. నేడు చూద్దామన్న ఎక్కడా కూడా ఈ విధంగా తెలుగు సంవత్సరాలు నేర్పించడం, పెద్దబాలశిక్ష చదివించడం కనిపించదు. కాని నవల రాసే సమాయానికి ఈ రకమైన చదువులు పల్లెటూళ్లో ఉన్నాయా అనే సంశయం కలుగుతుంది. లేదా రచయిత్రి అనుభవంతో రాసిన సంఘటన కూడా కావచ్చు. 


3. పిచ్చుక గూడు 
నవలలో ఒక చోట పిచ్చుకగూడు ప్రసక్తి వస్తుంది. ఒకప్పుడు పల్లెప్రాంతాలలో పిచ్చుకలు, అవి పెట్టే గూళ్ళు పిల్లలకు భలే సరదాగా ఉంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో పిచ్చుకలు లేవు అవి పెట్టేగూళ్ళు రెండూ లేవు. ఒకరకంగా చెప్పాలంటే అట్లాంటి సరదాలేమి పిల్లలు అనుభవించకుండానే పెరుగుతున్నారు. ఈ నవలలో వర్ధనికి అట్లాంటి చక్కటి అనుభూతి కలుగుతుంది. “పెదనాన్నా... పిచ్చుగ్గూడును ఏం చేసావ్? కొబ్బరాకుల నడుమ కుదురుగా ఒదిగివున్న పిచ్చికగూడు వైపు సైగ చేశాడు కోటయ్య. గూడులో కువకువలాడుతోన్న పిచ్చిక పిల్లల్ని చూసి వర్ధని నిండుగా నవ్వింది. వికసించిన వర్ధని ముఖం చూసి,  కోటయ్య కూడా నవ్వాడు.” 
అలాంటిదే మరొక సంఘటన
“ఆరుబయట మంచం వేసుకుని పడుకుని, ఆకాశంలో నక్షత్రాలకు ఆకారాల్ని’ ఊహించుకుంటూ, పెదనాన్న  చెప్పే కథలకీ ఊకొడుతూ ఉండేటపుడు ఆ సన్నని సవ్వడి ఎంత చక్కటి నేపథ్యమని! ఇట్లాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన వర్ధని హఠాత్తుగా చదువు నిమిత్తం తల్లిదండ్రులతో ఊరు విడిచి వేరే చోటికి వెళ్లడం అనేది ఊహకందని విషయం.


ముగింపు
ఈ నవలలో వర్ధని మానసిక పరిస్థితి వివిధ సందర్భాలలో పలురకాలుగా మారుతూ వచ్చింది. కానీ చిట్టచివరికి ఆ మార్పుకు పరిష్కారం చూపుతూ నవల ఇంకొంచెం ముందుకు సాగి వుంటే మరింత పరిపూర్ణత నవలకు వచ్చిఉండేది. రచయిత్రి నవలలో వర్ధని మానసిక సమస్యను మాత్రమే చూపించి వదిలేయడం కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది.  మేడం సందేశం ఈ నవలలో అత్యంత ప్రధాన ఘట్టంగా కనిపిస్తుంది.  వర్ధని తండ్రి మేడం మాటలు విన్న తర్వాతనే అతనిలో మార్పు కనిపిస్తుంది. వర్ధని మనసును అర్థం చేసుకోనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నమే పూర్తిగా ఫలించే విధంగా నవల ఉంటే మానసిక సంఘర్షణతో బాధపడుతున్న వర్ధనికి బదులు, అందమైన ఏడేళ్ళ పసిదాని లేతమనసు మనకు ముగింపుగా కనిపించేది.

*****

bottom of page