top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అర్చన ఫైన్ ఆర్ట్స్ రచనల పోటీ

వార్ధక్యం

nv.jpg

ఎన్. వీ. శ్రీధరశర్మ

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ

“హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన గోదావరి  ఎక్స్ ప్రెస్ మరికొద్దిసేపట్లో ఒకటవ నెంబరు ప్లాట్ఫారం మీదకు వచ్చును” అనౌన్స్మెంట్ విన్న అనిరుధ్ ట్రైన్ రాగానే తన బెర్త్ లో కూర్చొని యండమూరి వీరేంద్రనాథ్ “విజయానికి ఐదు మెట్లు” పుస్తకం చదవ సాగాడు. 

 

హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అనిరుధ్ కు హ్యూమన్ సైకాలజీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అందుకే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సైకాలజీ లో PG చేస్తున్నాడు. మనిషి ముఖ కవళికలను బట్టి అతని మానసిక స్థితిని అంచనావేయడంలో బాగానే పట్టు  సాదించాడు. వున్న పళంగా విశాఖపట్నంకు రమ్మని అనిరుధ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే ఆఫీస్ కు సెలవు పెట్టి బయలు దేరాడు. పుస్తకం చదవడంలో బిజీ గా వున్న అనిరుధ్ దృష్టి అప్పుడే స్టేషన్ లోకి అడుగుపెడుతున్న వృద్ధ దంపతుల మీదకు మళ్ళింది. వృద్ధ దంపతులలో ఆయన ఇక తనవల్ల కాదన్నట్టు సైగ చేస్తూ అక్కడే వున్న బెంచి పై కూర్చుండి పోయాడు.  ముసలావిడ మాత్రం ఏదో విషయంలో అతన్ని బుజ్జగిస్తున్నట్టు కనపడుతోంది. ఈ తతంగాన్ని చాలా సేపటి నుండి గమనిస్తున్న అనిరుధ్ చివరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.

“బామ్మ గారు ఎమన్నా సమస్య?” అని అడిగాడు ఆ ముసలావిడను. 

 

“బాబూ మేము గోదావరి బండిలో విశాఖపట్నం వెళ్ళాలి. లగేజి చాలా వుంది.  బండి అప్పుడే ప్లాట్ఫారం మీదకు వచ్చేసింది. ఈయనేమో లగేజి తను మోయలేనని కూర్చొని పోయాడు.  ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదు”. అంది ఖంగారుగా.

 

“దీనికి ఖంగారు పడాల్సిన అవసరం ఏముంది బామ్మగారూ.  బండి ఇంకా 20 నిముషాలు స్టేషన్ లో ఆగుతుంది. కూలి వాడిని మాట్లాడితే వాడే సామానంతా భోగిలోకి చేరుస్తాడు”. అన్నాడు అనిరుద్.  కూలి పేరు వినగానే ఆ వృద్ధ దంపతుల ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. వారి నుంచి అనిరుధ్ కు మౌనమే సమాధానంగా వచ్చింది. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న అనిరుధ్ .

 

“ సరే బామ్మ గారు మీ భోగి నంబరు చెప్పండి.  మీరు బెర్తుల దగ్గర కూర్చోండి. తాతగారు ఇక్కడే వుంటారు. నేను ఒక్కొక్క సామాను చేరుస్తాను” అన్నాడు. “ నీకు శ్రమ ఎందుకు బాబూ” అంది బామ్మగారూ. “ఇందులో శ్రమ ఏముందండి, మీ మనుమడు అయితే సాయం చేయడా?” అంటూ రెండు చేతులతో బ్యాగులను తీసుకొని బామ్మ వెంట నడిచాడు అనిరుధ్ . 

 

అనుకోకుండా వాళ్ళ బెర్తులు అనిరుధ్ కు ఎదురు బెర్తులు కావడం యాదృచ్చికం అయింది. బామ్మ మీ ఎదురు బెర్తే నాది. మీరు కూర్చొని వుండండి, నేను మిగిలిన సామాను , తాతగారిని తీసుకొని వస్తాను అని చెప్పి ప్లాట్ఫారం మీదకు నడిచాడు.

 

మొత్తం సామానంత చేర్చేసరికి అనిరుధ్ బాగా అలసి పోయాడు. “బామ్మగారూ ఇంత సామాను తీసుకొని వెళుతున్నారు. దేనికండి” అని అడిగాడు అనిరుద్. 

 

బామ్మ గారు ఏదో చెప్పెటంతలోనే “LESS LAGUAGE MORE COMFORTABLE” అన్న అనౌన్స్మెంట్ వినపడింది. ఆ అనౌన్స్మెంట్ విన్న అనిరుధ్ ముసి ముసి నవ్వులు నవ్వాడు. అతన్ని చూసి బామ్మ అలిగి పక్కకు తిరిగింది. “బామ్మగారూ సారీ, ఏమి అనుకోవద్దండి మీ లగేజ్, ఆ అనౌన్స్మెంట్ మ్యాచ్ అయ్యే సరికి కాస్త నవ్వు వచ్చింది” అంతే అంటూ “అది సరే బామ్మ గారు మీ లగేజ్ మొత్తం మాడ్రన్ గా వుంది ఒక్క ఆ హ్యాండ్ బాగ్ తప్ప ఎందుకంటారు?” అని అడిగాడు అనిరుధ్ కాస్త బామ్మగారి అలకను మరిపించడానికి. 

 

“ మా పెళ్లి జరిగిన కొత్తలో మదరాసు హనిమున్ వెళ్ళినప్పుడు ఆయన పాండి బజార్ లో నాకోసం కొన్న మొట్ట మొదటి కానుక, ఒరిజినల్ లెదర్ తో చేసిన బాగ్. అందుకే కొని 50 సంవత్సరాలైనా పాడవలేదు.” అంది బామ్మగారూ సిగ్గుపడుతూ. ఇంతలో కాఫీ కాఫీ అని వినపడడంతో బామ్మగారూ కాఫీ తాగుతారా? అని అడిగాడు అనిరుద్.

 

బామ్మగారు వద్దని, తాతగారు కావాలన్నట్లు తల ఊపారు. అనిరుధ్ కు అర్థం కాక మూడు కాఫీలు ఆర్డర్ చేసాడు. ఆ వృద్ధ దంపతులు అవురు అవురుఅంటూ కాఫీ తాగేసారు. వాళ్ళను చుస్తే ఎందుకో అనిరుధ్ కు మదిలో ఒక అనుమానం మొదలైంది.  చూడడానికి పైకి బాగానే కనపడుతున్న వాళ్ళలో లోపల అంతర్మధనం ఏదో జరుగుతువుందన్న 

నిర్ణయానికి వచ్చాడు. వాళ్లతో ఏదో పిచ్చాపాటి మాటలలో మునిగి వుంటే రైల్ మాత్రం హైదరాబాద్ నుండి  విజయవాడకు చేరుకుంది. బామ్మగారూ మీకు తినటానికి ఏమైనా తెమ్మంటారా? అడిగాడు అనిరుద్. మళ్ళీ బామ్మగారు వద్దని, తాతగారు కావాలన్నట్లు తల ఊపారు.  మళ్ళీ ఆలోచనలో పడ్డ అనిరుధ్ ప్లాట్ఫారం మీదకు వెళ్లి తాను తిని వాళ్ళకు పార్సిల్ తెచ్చాడు. ఆ వృద్ధ దంపతులు మళ్ళీ అవురు అవురుఅంటూ తినేసారు. “బామ్మగారూ నేను పడుకుంటున్నాను. కాస్త నన్ను విశాఖపట్నం రాగానే నిద్ర లేపండి అని చెప్పి తన బెర్తులో నిద్రలోకి జారుకున్నాడు అనిరుద్.  నిద్ర మద్యలో లేచి చూసేసరికి ఎదురుగావున్న బెర్తులో బామ్మగా కనపడలేదు, తాత గారు మాత్రం మంచి నిద్రలో వున్నాడు. వాష్ రూము వద్దకు వెళ్ళే సరికి అక్కడ బామ్మగారు ఒక్కతే నిలబడి ఏడుస్తూ వుంది. అనిరుధ్ ను చూడగానే తన కొంగు తో కన్నీళ్లను తుడుచుకుంది. “ బామ్మగారూ నేను మిమ్మల్ని మెదటి నుంచి  గమనిస్తూనే వున్నాను మీరు ఏదో సమస్య వల్ల బాధపడుతున్నారు. మీ సమస్యను మీ మనవడి లాంటి వాడిని నాతో పంచుకుంటే నేను ఒక పరిష్కారం చూపగలను. నేను మీకంటే వయస్సులో చిన్నవాడిని ఐన నేను ఒక సైకాలజీ స్టూడెంట్ని” అన్నాడు అనిరుద్. అప్పుడు బామ్మ గారు పొడిబారిన గొంతుతో ఇలా చెప్ప సాగింది “ బాబూ, మాకు ఇద్దరు కొడుకులు.  పెద్దవాడు విశాఖపట్నం లో, చిన్నవాడు హైదరాబాదు లో వుంటారు. మా అయన రిటైర్ అయినప్పుడు వున్న ఆస్తి నంతటిని రెండు సమ భాగాలూ చేసి ఇద్దరికీ పంచి ఇచ్చాడు. మా కొడుకులు మాత్రం ఆస్తులతో పాటు మా భాద్యతను పంచుకున్నారు. అందుకే ఆరు మాసాలు ఒకరి దగ్గర మరొక ఆరు మాసాలు మరిఒకరి దగ్గర ఉంటున్నాము. ఈ వయసులో మా పిల్లలే మా పాలిట శాపం అయ్యారు.  చివరకు నెల నెల మా ఆయన పెన్షన్ డబ్బులు కూడా మా వరకు చేరకుండ వాళ్లే తీసుకొంటున్నారు. నెలసరి ఖర్చులకోసం మాకు మాత్రం కొంత డబ్బులిచ్చి దాని ఖర్చు తాలుకు లెక్కలు అడుగుతారు. ఇప్పడు మా దగ్గర చిల్లి గవ్వ లేదు మా చిన్న కొడుకు వున్న డబ్బు చిల్లరతో సహా తీసుకొని రైల్ టికెట్లు కొనిపెట్టి, ఇక ఆరు నెలలు మా భాద్యత పెద్దవాడిదని చెప్పి మమ్ములను స్టేషన్ లో వదిలి వెళ్లి పోయాడు.  అందుకే మా దగ్గర కూలి వాడిని మాట్లాడడానికి, టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. చివరకు రేపు విశాఖపట్నం లో దిగిన తర్వాత మా పెద్దోడి ఇంటికి వెళ్ళడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు . మా ఆయన మాత్రం అమాయకుడు. అందుకే ఇవేమీ పట్టనట్లు హాయిగ నిద్రపోతున్నాడు. రేపటినుంచి విశాఖపట్నం లో 6 నెలలు ఎలా గడపాలో అన్న ఆలోచనలతో నిద్ర పట్టలేదు. అంది బామ్మ అనిరుధ్ ని పట్టుకొని ఏడుస్తూ.  అనిరుధ్ మాత్రం మౌనంగా బామ్మను బెర్త్ దగ్గరకు తీసుకెళ్ళి పడుకోబెట్టాడు.

వాళ్ళ పరిస్తితిని చూసి అనిరుధ్ కు నిద్ర పట్టలేదు. బామ్మ గారు మాత్రం కాసేపటికి నిద్రలోకి జారుకున్నారు.   

***

కాలం  మాత్రం ఎవ్వరితో లేదు అన్నట్లు పరిగెడుతూనే వుంది.  ట్రైన్ విశాఖపట్నం చేరుకుంది.  "బామ్మగారూ, విశాఖపట్నం వచ్చేసాము లేవండి" అంటూ అనిరుధ్ లేపడంతో ఆ వృద్ధ దంపతులు నిద్ర లేచారు.  బామ్మగారూ మీరు వెళ్ళవలసిన అడ్రస్ చెప్పండి నేను టాక్సీ బుక్ చేస్తాను అన్నాడు.  నీకు ఎందుకు బాబూ శ్రమ అంది బామ్మ. చూడండి బామ్మా రాత్రి మీకు సహాయం చేస్తానని మాటిచ్చాను .  మీ విషయంలో టాక్సీ బుక్ చేయడం మించి నేను ఏమి చేయలేను, కనీసం ఈ సహాయం అయిన చేయనీయండి. అన్నాడు అనిరుద్.  “వద్దు బాబూ. మళ్ళీ మా పెద్దోడు టాక్సీకి డబ్బులెక్కడివి? అని మమ్ములను నిలదీస్తాడు” అంది బామ్మ భయంగా. “ దూరపు బందువు ఒకడు కనిపించి మమ్ములను టాక్సీ ఎక్కించి పంపిచాడని చెప్పండి” అన్నాడు అనిరుద్.  తనే దగ్గరుండి సామానులన్ని టాక్సీ లో ఎక్కించి పంపించాడు.  

***

“ఎందుకమ్మా! వున్న పళంగా వచ్చేయమన్నావు?” అడిగాడు అనిరుధ్ వాళ్ళ అమ్మ శారదను.  “ ఒరేయ్, నీకు మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి కూడా నీకు లానే హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఒక్కతే కూతురు.  10 గంటలకు పెళ్లి చూపులు. నీవు వెంటనే రెడీ అయితే బయలు దేరడమే. మీ నాన్నగారు పూలు, పళ్ళు తేవడానికి బయటకు వెళ్లారు.  త్వరగా రెడీ అవ్వు, టిఫిన్ తిందువు గాని” అంటూ వున్న విషయాన్ని గడ గడ చెప్పేసి కిచెన్ లోకి వెళ్లి పోయింది శారద. "అదేంటమ్మ, నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు" అన్నాడు అనిరుద్.  చెబితే నీవు రావు అని, ఏదో ఒక సాకు చెప్పి తప్పించు కుంటావని మీ నాన్నగారే ఈ సారి ఏమీ చెప్పొద్దన్నారు అంది శారద.

నాన్న గారి నిర్ణయమైతే ఇక చేసేదేమిలేదు అనుకుంటూ బాత్ రూమ్ వైపు నడిచాడు.

 

***

MVP కాలనీలో ఒక ఇంటి వద్ద కారు ఆపిన  అనిరుధ్ వాళ్ళ నాన్న “దిగండి. ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు” అన్నాడు. 

 ఇల్లు చాలా బాగుంది అన్నాడు అనిరుద్. “అమ్మాయి కూడా చాలా బాగుంటుంది .  నిన్ననే షాపింగ్ కాంప్లెక్స్ లో వాళ్ళ నాన్నతో చూసాను. ఈ ఇల్లు కూడా అమ్మాయి ఇష్ట ప్రకారం కట్టిందే అందుకే బాగుంది” అన్నాడు అనిరుధ్ వాళ్ళ  నాన్న . ఇంతలో లోపలి నుంచి వచ్చిన అమ్మాయి తండ్రి అనిరుధ్ వాళ్ళను సాదరంగా లోనికి ఆహ్వానించాడు. ఇల్లు లోపల కూడా చాలా బాగుంది. ఇంతలో అమ్మాయి వచ్చింది.  నిజంగానే అమ్మాయి చాలా బాగుంది. అనిరుధ్ కు కూడా అమ్మాయి నచ్చింది.

 “అమ్మా నీవు వెళ్లి అందరికి కాఫీ తీసుకొనిరా” అంటూ అమ్మాయిని లోనికి పంపించి , బాబూ మా అమ్మాయి మీకు నచ్చిందా? అని అడిగాడు అమ్మాయి తండ్రి.  నచ్చింది అంకుల్ అంటూ సిగ్గు పడుతూ చెప్పాడు అనిరుద్. అమ్మాయి తెచ్చిన కాఫీ తాగుతూ ఇంటిని పరిశిలిస్తున్న అనిరుధ్ దృష్టిని ఒక మూల ఉంచిన లగేజ్ ఆకర్షించింది. అందులో ఒక పాత లెదర్ బ్యాగ్ అతడిని చూపు తిప్పనివ్వలేదు.  ఆశ్చర్యం! ముందు రోజు రాత్రి తను ట్రైన్లో బామ్మ దగ్గర చూసిన పాత హ్యాండ్ బ్యాగే అది, తనకు బాగా గుర్తు. అంటే రాత్రి బామ్మగారూ చెప్పిన ఆ పెద్ద కొడుకే ఈ అమ్మాయి కి తండ్రి. కాసేపు తనలోనే తను మధన పడ్డాడు అనిరుద్. చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు.  “నాన్న నేను అమ్మాయి తండ్రితో కాస్త మాట్లాడాలి అన్నాడు. “అదేంట్రా, అందరూ చేసుకునే అమ్మాయితో మాట్లాడాలని అనుకుంటే నీవు వెరైటిగా పిల్ల తండ్రితో మాట్లాడాలని అంటావు” అన్నాడు అనిరుధ్ తండ్రి ఆశ్చరంగా!. “ ఫరవాలేదు, రా బాబూ, నా ఆఫీస్ రూమ్ లో మాట్లాడుకుందాం” అన్నాడు అమ్మాయి తండ్రి.  ఇద్దరు ఆఫీస్ రూమ్ వైపు నడిచారు.

***

“అంకుల్ మీ అమ్మా, నాన్న గార్లు వున్నారా? అడిగాడు అనిరుధ్ .  ఆ వున్నారు బాబూ ఈరోజే హైదరాబాద్ నుంచి వచ్చారు. అలసి పోయి పడుకొనివున్నారు, ఎందుకు బాబూ అడిగావు అన్నాడు  అమ్మాయి తండ్రి. ఏమి లేదు అంకుల్ రేపు నేను మీ అమ్మాయి ని చేసుకొని హైదరాబాద్ లో కాపురం పెడితే మాకు కొన్ని రోజులు పెద్ద దిక్కుగా మీ అమ్మా నాన్నలను పంపుతారా? ఇది నా రిక్వెస్ట్. అని అడిగాడు అనిరుద్.  ఒక్క నిముషం ఆలోచించిన అమ్మాయి తండ్రి “సరే అలాగే చేద్దాం” అన్నాడు 

రూములో నుంచి బయటకు వచ్చిన అనిరుధ్ “నాన్న నాకు సంబంధం ఓకే  మీరు ఇక ముహూర్తం ఎంత తొందరగా అయితే అంత త్వరగా పెట్టించండి” అన్నాడు.  “బావగారు మాకు ఇక సెలవు, ముహూర్తం పెట్టి కబురు చెయ్యండి” అని చెప్పి బార్య కొడుకుతో బయలు దేరాడు అనిరుధ్ తండ్రి.  

***

“అదేంటండీ అందరూ మామగార్లను అది కావాలి, ఇది కావాలి అని అడుగుతారు.  మీరు మాత్రం మా నానమ్మ,తాతయ్యలను మనతో పెట్టుకుంటామని అడిగారంట? అందరూ నవ్వుతున్నారు” అంది అనిరుధ్ భార్య సుప్రజ.  “చూడు సుప్రజ మీ నానమ్మ,తాతయ్యలను నేను ఏమి సరదా కోసం మనతో పెట్టుకుంటానని అనలేదు. జీవితపు చివరి అంచులలో వాళ్ళు పడుతున్న బాధను కాస్తైన తీరుద్దామనే ఇలా చేశాను.  వార్ధక్యం ప్రతి ఒక్కరి జీవితానికి తీపి ముగింపు ఇవ్వాలే కానీ అది శాపంగా మారకూడదు. జీవితపు చరమాంకంలో వారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలే కానీ కన్నీళ్ళు పెట్టుకోకూడదు. నేను అప్పుడే ఈ విషయాలను మీ నాన్నతో చెప్పవచ్చు.  కాని కొద్ది రోజుల తర్వాత చెపితే నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడి గా, అల్లుడిగా నాకు చెప్పే అధికారం వుంటుంది. అప్పటికీ వాళ్ళు మారకపోతే ఆ ముసలి జీవితాలు ముగిసే వరకు నేను వాళ్ళను పోషిస్తాను” అన్నాడు అనిరుద్.

అనిరుద్, సుప్రజ ల సంభాషణను వంటింటి నుంచి అటుగా వెడుతూ విన్న బామ్మగారి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. “ఆ రోజు స్టేషన్  లో అనిరుధ్ ఏ  ముహూర్తంలో మనవడిని అనుకోమన్నాడో కానీ నిజంగా మమ్ములను ఆదుకోవడానికి ఆ దేవుడు ఇచ్చిన మనవడే!” అనుకోని ముందుకు కదిలింది.

*****

bottom of page