top of page

కథా​ మధురాలు

వాణి-జ్యం

 

- నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)

nirmaladitya_edited.jpg


ఓక్ చెక్కతో చేసిన టేబిల్ మీద రెండు పుస్తకాలు ఉన్నాయి.

ఒకటి బాగా నలిగి, పేజీ కొనలు ముడతలతో ఉన్న పేపర్ బ్యాక్. హైస్కూల్ పిల్లల పుస్తకాల మధ్య, పొగ మసితో పోరాడుతున్న మగువల కొంగు చాటున, రెండు వేళ్ళ మధ్య సిగరెట్టు పెట్టుకొని పేజీలు తిప్పుతున్న కుర్రకారు చేతుల మీదుగా ప్రయాణం చేసిన పాత కాలపు డిటెక్టివ్ పుస్తకాలను గుర్తుకు తెస్తున్నది. 

రెండో పుస్తకం బార్న్స్ అండ్ నోబుల్ డిస్ ప్లే కిటికీలో ఫోకస్ లైట్ల కాంతులతో మెరిసిపోతున్న కాఫీ టేబిల్ పుస్తకంలా ఉంది. కళాత్మకంగా డిజైన్ చేసిన ముఖ చిత్రం, అందులోని పేజీలు, పుస్తకం సైజు 'నా క్లాసే వేరు' అనేలా, స్వీట్ సిక్స్టీన్ కు తయారవుతున్న గొప్పింటి పడుచు పిల్లలా ఉంది. 

టేబిల్ కు ఇరువైపులా ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరూ నడివయస్కులే. తొండనాడు ఈ అమెరికా దేశంలో స్థిరపడి దాదాపు పాతిక ఏళ్ళు అయ్యి ఉంటాయి. గంజం కూతురు కాన్పులు, అవీ అంటూ అప్పుడప్పుడు ఈ దేశం సందర్శిస్తుంటాడు. ఇద్దరికీ పుస్తకాల పిచ్చి. తెలుగు పుస్తకాలంటే మరీ పిచ్చి. ఇక్కడో జైలు లాగా ఉంది, అని వచ్చిన ఒక వారం నుండే, పోరు పెడుతున్న గంజం బాధ పడలేక, గంజం కూతురు ఆయన్ని తొండనాడు వారి ఇంటికి పంపించింది.

పరామర్శలయ్యాక, గంజం "మీరు అప్పుడపుడు కథలు రాస్తారు అని విన్నాను. మీ వెనుక బుక్ షెల్ఫ్ లో పుస్తకాలు చాలానే ఉన్నాయి. ఒక పుస్తకం ఇస్తారా, చదివి ఇచ్చేస్తాను," అన్నాడు.

"పుస్తకాలు ఇవ్వడంలో సమస్య లేదండి. కానీ అవి, మన దేశం నుండి వలస వచ్చిన నాలాంటి వారిలాగా, తిరిగి వాపసు రావు. పోయిన చోటే స్థిర పడిపోతాయి," అన్నాడు తొండనాడు.

ఇన్ని పుస్తకాలు ఉన్నా ఒక పుస్తకం ఇవ్వడానికి ఏడుస్తున్నాడెందుకు అనుకొని, మరో క్షణం లోనే తను పోగొట్టుకొన్న పుస్తకాలు గుర్తుకు వచ్చి, గంజం  తొండనాడు మాటలో నిజం ఉందనుకున్నాడు.

"అలా నేను చేయనండి.  కూతురు దగ్గరకు వచ్చాను కానీ పరమ బోర్ కొడుతుంది. మాట్లాడడానికి మనుష్యులు లేరు. పోనీ చదువు కుందామంటే ఒక తెలుగు పుస్తకమూ దొరకదు."

అలా గంజం అంటుండగానే తొండనాడు లేచి షెల్ఫ్ లో నుంచి రెండు పుస్తకాలు తీసి టేబిల్ మీద పెట్టాడు. 

గంజంకు తొండనాడు ఏ పుస్తకం ఇస్తాడో అంతుబట్టలేదు. నలిగిన పుస్తకమే ఇస్తాడేమో అనుకున్నాడు. పుస్తకం పోతుందేమో అన్న అప నమ్మకం ఉన్న వాడు ఖరీదైన పుస్తకంలా కనిపిస్తున్నదానిని ఎందుకిస్తాడు?

***

"ఇక్కడి నుంచి కథ నాకు తెలుసు. నన్ను చెప్పనీ," గల, గల మొదలెట్టింది వాణి.

"నాకు కూడా తెలుసు. నీ కంటే పెద్దదాన్ని. ముందు నన్ను చెప్పనీయి," అంది నింపాదిగా భారతి.

"సరే నీ కథే ముందు చెప్పు," అంది వాణి.

**


భారతి చెప్పిన కథ:

సుందరాచారి గొప్ప కవి. ఆయన చాలా కవితలు రాసినా ఒకటి మాత్రమే బాగా జనంలోకి వెళ్ళగలిగింది. అతనికివేమి పట్టింపులు లేవు. రాయడం లోనే ఆనందం. పెళ్ళిలకెళ్ళినా 'పంచరత్నాల' ని ఓ ఐదు పద్యాలు రాసి ఫ్రేమ్ కట్టి దంపతులకు, చదువింపుల వేదిక మీద, చదివి సమర్పించేవాడు. వచ్చిన డబ్బులు లెక్కపెట్టేవాళ్ళు, పడుచు దంపతులు, డబ్బు తీసుకొని ఆ ఫ్రేమ్ చెత్త లో పారేయడమో లేక ఫ్రేమ్ పెట్టుకొని ఆ పద్యాలు పారేయడం ఆయనకు తెలియదు. తెలిసినా పట్టించుకోడు. చిన్నప్పుడే ఇల్లు వదిలేసాడని, నిలకడ లేని మనిషి అని పేరు. ఏదో ఒకటి తిని, వీలైతే సురాపానం చేసి రాత్రుల్లలో ఎప్పుడో నిద్ర పోతాడు. ఇంటికి బాడుగ కట్టుకో లేని సమయాలలో భజన గుడి ఆవరణలో నిద్ర పోతాడు. తెలివిగా ఉన్నప్పుడు చేతిలో చిన్న పుస్తకం లో ఏదో మధనపడుతూ, రాస్తూ ఉంటాడు.


చాలా మంది సుందరాచారిని పట్టించుకోకపోయినా, కొందరు ఆయన కవితలకి వీరాభిమానులు. చెవి కోసుకుంటారు. అందులో ఒకడు డాక్టర్ జమ్మలమడుగు. సుందరాచారి పక్క ఊరివాడే కావడం వల్ల ఆయన కవితలు చిన్నప్పటి నుంచి వినడం, చదవడం జరిగింది. ఆ డాక్టర్ అమెరికా రావడం, డబ్బు సంపాదించడం, నిలదొక్కుకోవడం అయిన తరువాత, జీవితానికి పరమావధి ఏంటి? అన్న ప్రశ్న  సతాయించడం మొదలెట్టింది. అప్పుడే ఆయనకు కృష్ణదేవరాయలు మనస్సుకు తట్టాడు. సాహిత్యం వైపు, ముఖ్యంగా సుందరాచారి కవితా సౌరభం పై ఆయన మనసుపడ్డది. ఆ సంవత్సరం ఇండియా పోయినప్పుడు భజన గుడిలో సుందరాచారిని పట్టుకొని, అమెరికా రావాల్సిందే అని పట్టుపట్టి పామ్ బీచ్ లో ఉన్న తన ఇంటికి పిలిపించుకున్నాడు. 

సుందరాచారికి ఠంచనుగా భోజనం దొరకడం, తిరగడానికి బోలెడన్ని పార్కులు, బీచ్ లు, తాగాలంటే విదేశీ సరుకు, అన్నీ బాగానే ఉన్నాయనిపించింది. సాయంత్రం జమ్మలమడుగు తో కవితా గోష్ఠులే కొద్దిగా ఇబ్బందికరంగా తయారయ్యాయి. జమ్మలమడుగు విజయనగర సామ్రాజ్యేశ్వైరుడి సింహాసనం అధిష్టించలేకపోయాడు.

సుందరాచారి ఇబ్బంది గమనించి, జమ్మలమడుగు "సా, మయామిలో తెలుగువాళ్ళ కాన్ఫరెన్స్ ఉంది వెళ్తారా" అన్నాడు. 

"నాకు అంతా కొత్త. ఒకడినే వెళ్లాలా?" అడిగాడు సుందరాచారి.

"నాకు ఆన్ కాల్ పడింది సుందరాచారి గారు. నా డోనార్ టికెట్లు ఎలా వేస్ట్ అవ్వుతాయి. మీరెళ్ళితే సరిపోతుంది. మా ఆవిడ మిమ్మల్ని హోటల్ దగ్గర దింపి మళ్లీ రెండు రోజులకు, సమావేశం ముగిసిన తరువాత, మిమ్మల్ని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తుంది. సమావేశం హోటల్ ఆవరణలోనే ఉంది. మీకు హోటల్ బయట రానవసరం లేదు. సమావేశంలో భోజనాలు పెడతారు.  అది కాక, మీరుంటున్న హోటల్ రూం లో కూడా మీకు కావలసిన తిండి,  డ్రింకులు మీరు ఫోన్ లో ఆర్డర్ చేస్తే రూముకే తెచ్చి ఇస్తారు. మీకు ఎలా సౌకర్యం అయితే అలా చేయండి. హోటల్ బిల్ నా కార్డ్ కే పోతుంది. మీకెలాంటి ఇబ్బంది ఉన్నా నాకు ఒక ఫోన్ చేయండి," అన్నాడు జమ్మలమడుగు.

సుందరాచారి ఇదేదో మార్పు బాగానే ఉంటుందని భుజాన తనకున్న ఒక సంచి వేసుకొని బయలు దేరాడు. జత గుడ్డలు, తను రాసిన కొన్ని పుస్తకాలకి ఆ సంచి సరిపోయింది. అదొక్కటే భారత దేశం నుండి, ఇక్కడికి వచ్చినప్పటి లగేజీ కూడా.

హోటల్ కు వెళ్ళిన సుందరాచారి అక్కడి సదుపాయాలు చూసి అబ్బురపడ్డాడు.  జమ్మలమడుగు కని సమావేశం వాళ్ళు ముందుగానే రూంలో ఉంచిన,  వెల్కమ్ బ్యాగ్ లో ఉన్న రెండు కుకీలు తిని, సమావేశం సావనీర్ గా ప్రచురించిన పుస్తకం, ఫ్లయర్స్ మీదున్న కార్యక్రమం చూసాడు. పుస్తకం మెరిసిపోతుంది. దాదాపు రెండు వందల పేజీలు ఉన్న ఆ పుస్తకంలో ఎక్కువ పేజీలు దాతలు, వారి వ్యాపార ప్రకటనలే. జమ్మలమడుగు కుటంబం ఒక పూర్తి పేజీలో ప్రత్యక్ష మైయ్యారు. ఆ పేజీ చించి అలానే ఫోటో ఫ్రేమ్ లో పెట్టేయొచ్చు. అంత బాగా ఆ పుస్తకంలో ఉపయోగించిన కాగితం, ప్రింటింగ్ ఉంది. మరో పేజీలో జమ్మలమడుగు పనిచేస్తున్న క్లినిక్ ప్రకటన ఉంది. ఆశ్చర్యంగా లోపల, ఈ దాతల కుటుంబ చిత్రాల మధ్య ఇరవై పేజీలలో కొన్ని కవితలు, కథలు. అందులో ఒక కవిత సుందరాచారిది కూడా. భలే ఉన్నారే, ఒక్క మాట కూడా చెప్పలేదు, నా కవిత అచ్చు వేసుకున్నారు అని అచ్చెరువు పోయాడు సుందరాచారి. జమ్మలమడుగు కాపీ కదా అనీ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు, జమ్మలమడుగు కి ఇవ్వడానికి. వారి కుటుంబ చిత్రం కూడా ఉంది. తప్పకుండా  జమ్మలమడుగు పరివారం పది కాలాలు వారి ఇంట్లో ఉంచుకుండే సంచిక అది.

మరుసటి రోజు ఏదో సాహిత్య సమావేశం ఉందంటే, సుందరాచారి చూద్దాం అని బయలు దేరాడు. అక్కడ ఒకటే జనం. ఒక వైపు ప్రవేశ టికెట్లకని వరుసగా కౌంటర్ లు పెట్టారు. అక్కడ జనాలు క్యూ లు కట్టారు. మొదటి రోజు కదా. పెళ్లి సంబంధాలు వెదుక్కుంటున్న వారికని, ఇండియా నుండి వచ్చిన నగలు, బట్టలు, ఇతర వస్తువులు కొనాలనుకునే వారికని కట్టిన అందమైన, రంగుల, రంగుల పోస్టర్లు అర్థం కాని అబ్ స్ట్రాక్ చిత్రాలుగా వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నాయి. వచ్చిన వారు చూసి పడవేసిన ఫ్లయర్స్, బ్రోచర్ కాగితాలతో నేల గజిబిజిగా ఉంది. ‘అబ్బా ఇండియా వచ్చినట్లే ఉంది’ అనుకున్నాడు సుందరాచారి. 

అప్పటికే టికెట్లు, అడ్మిషన్ బ్యాడ్జీ ఉండటం వల్ల సుందరాచారి ప్రవేశ గేట్ దగ్గరకు వెళ్తుంటే, హడావుడిగా రెండు టికెట్లు కొని తన పక్కనే నడుస్తున్న జంట ఒకటి తటస్థ పడింది. 

"హోటల్ సదుపాయాలు ఇవ్వలేదు. సమావేశం టికెట్లు పంపించలేదు. కనీసం మిమ్మల్ని సమావేశంకు కూడా పిలువలేదు. ఎందుకండి పోలోమని మీరు రావడమే కాక, నన్ను కూడా లాక్కొచ్చారు. ఈ సింగారానికి మీరు ఓ నెల రోజులు కుస్తీలు పడి కథ రాసి పంపించాలా. మిమ్మల్ని కథ కావాలని అడిగిన మనిషి, ఈ ఏర్పాట్లు చూసుకోవద్దూ?" అన్నది జంటలోని ఆవిడ.

"వాళ్ళకీ ఏవో కష్టాలు ఉంటాయి. ఇంత పెద్ద సమావేశం అంటే మాటలా? కానీ నువ్వన్నది నిజమే. మనం డైలీ టికెట్లు కొనడంతో,  నా కథ పడిన ఆ సావనీర్ సంచిక కూడా ఇవ్వలేదు. డోనర్ లకు, మూడు రోజుల సీజన్ టికెట్ కొన్న వారికే ఆ సావనీర్ ఇస్తారట.  నా కథ ఉందని ఆ కౌంటర్లో ఉన్న వారికి చెప్పి అడిగాను కూడా," జంటలో ఉన్నతను చెప్పాడు.

"ఆ అదీ చూసాను, మీరు బతిమాలడం. అవసరమా అది మనకు?"

ఆవిడ మాటలు పూర్తి అవ్వకుండానే, అతను "సార్. సుందరాచారి గారు కదా. నమ్మలేక పోతున్నాను. మీ ఊరి వాడినండి. మీ కవితలంటే తెగ పిచ్చి. సమావేశం వాళ్ళు మిమ్మల్ని పిలిపించారా?" సుందరాచారి వైపు తిరిగి పలకరించాడు.

"ఎవరు బాబు నీవు," అని అడిగాడు సుందరాచారి.

"మునిరత్నం అబ్బాయినండి. చిన్నప్పుడు నాన్నను మీరు కలవడానికి వచ్చినప్పుడు, చాలా సార్లు చూసాను. నా పేరు రమేష్, ఈమె మా ఆవిడ మీరా," అని పరిచయం చేసుకున్నాడు.

"ముని రత్నం కొడుకువా? గుర్తే పట్ట లేకపోయాను. ఈ దేశం ఎప్పుడొచ్చావు? ఇందాక నీ మాటలలో నీ కథ అనడం వినపడింది. వీళ్లు వేసిన సంచికలో రమేష్ రాసిన ఒక కథ చదివాను. నువ్వే రాసావా? బాగుంది. ఇక్కడి పరిస్థితులు బాగా వర్ణించావు," సుందరాచారి ఆప్యాయంగా రమేష్ భుజం మీద చెయ్యి వేసి, మీరా ను కూడా పలుకరించాడు. 

ముగ్గురూ సాహిత్య సమావేశం జరుగుతున్న వేదికను వెదుక్కుంటూ లోపలికి వెళ్లారు. వెళ్తూనే దాదాపు ఓ ఐదు వేల మంది కూర్చో గల పెద్ద హాలు కనపడింది. అది సాయంత్రం జరిగే సినిమా వారు వేస్తున్న కార్యక్రమాలకని రమేష్ సుందరాచారి కి చెప్పాడు. వంద, రెండు వందల మంది సరిపడ మరి కొన్ని సమావేశం గదులలో భారత దేశం మెడికల్ కాలేజీల ఓల్డ్ స్టూడెంట్ సమావేశాలు. సమావేశం కూడా  ఓ బిజినెస్ కాన్ఫరెన్స్ గా పరిగణించి ఖర్చులు టాక్స్ రైట్ ఆఫ్ చేయగలిగే మరి కొన్ని జాబ్ ట్రైనింగ్ సమావేశాలు జరుగుతున్నాయి. చివరకు సాహిత్య సమావేశం జరుగు తున్న గదిని పట్టగలిగారు. చాలా చిన్న గది. ఒక నలభై మంది కూడా పట్టరు, వేదిక మీద ఉన్న వారితో సహా. సభ వేడుకగానే జరిగింది. వేదిక మీద ఉన్నవారు, వేదికకు వెళ్లి మాట్లాడిన వారు చక్కగానే సాహిత్య చర్చలు, సొంత రచన, కవితా పఠనాలు చేశారు. ప్రేక్షకులే మరీ నీరసంగా కనిపించారు. కొందరు ఇండియా నుంచి పిలిపించిన ఆహ్వానితులు జెట్ లాగ్ వల్లనేమో తూగుతున్నారు. అలానే ఇక్కడి వారు కూడా. మధ్యాహ్నం సియస్టీ టైం లో సభ పెట్టడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను ఆపడం అసాధ్యం. అర్థం చేసుకోవాలి, అంతే. రమేష్ కు మాత్రం సభ హైలైట్, సుందరాచారి కవిత తో ప్రారంభించడం.

"మీ పాట తో సభ ఆరంభం అయ్యింది. మిమ్మల్ని సభకు పిలిచి ఉండవచ్చు కదా," అని వాపోయాడు రమేష్. 

"ఆ కవిత ప్రజలలోకి పాకిపోయింది. అదీ మంచిదే కదా," నవ్వేసాడు  సుందరాచారి.

"నిజమేననుకోండి. నిర్వాహకుల కు వారి సమస్యలు వారికి ఉంటాయి. ఇప్పుడే చూసాము కదా. సాహిత్య సభ అంటే పట్టుమని పది మంది కూడా టికెట్ కొని ఈ సమావేశం కు రారు. జనం ఎగబడేది సినిమా జనం కోసం. టికెట్లు కొనేది వారికోసం. ఈ సభ కు చాలా ఖర్చులు అవుతాయి. అయినా, నష్టం లో పడకుండడానికి, సినీమా పరిశ్రమ వారు రావడం ఓ ముఖ్యకారణం.  కాబట్టి సినిమా వారికి జరిగే మర్యాదలు, ఏదో ఉబుసుపోక కథలు, కవితలు రాస్తున్న  నా వంటి వారికి ఇవ్వాలనుకోవడం సరి కాదనుకుంటా. కానీ మీలాంటి వారిని ఇంత వరకు పిలువకపోవడం మాత్రం సరి కాదు," అన్నాడు రమేష్.

"ఇలా సభలకు పిలువకపోవడం నాకు అలవాటే. కానీ జమ్మలమడుగు లాంటి సాహిత్యాభిమానులు నన్ను గుర్తుంచుకొని, నన్ను పిలస్తూనే ఉంటారు. అలాంటి వారు అరుదే. ఉండే వాళ్ళు కూడా కాలంతో పాటు మాయమై పోతున్నారు. ప్రేమాప్యాయతలు ఎక్కడ నుండి, ఎవరి నుండి వస్తాయో తెలీదు. రోజుకో పూట తిండి, పడుకోవటానికి ఇంత చోటు ఉంటే నాకు చాలు. అంతకు మించి నాకు కోరికలు లేవు. నా ఇష్టంగా కవితలు రాసుకుంటా," నిట్టూర్పు తో అన్నాడు సుందరాచారి.


"అవునండి. మీరు విరివిగా కవితలు రాస్తారని మా నాన్న ద్వారానే విన్నాను. మా నాన్న గారి పెళ్లికి కూడా 'పంచ రత్నాలు' రాసి చదివింపులప్పుడు మీరు స్వయంగా పాడారని విన్నాను.” సుందరాచారి నవ్వేసాడు.

సభ తరువాత సాయంత్రం ఎనిమిది వరకు ఆట విడుపే. ఈ మధ్యలో సమావేశం కని ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్, హైదరాబాద్ న్యుమాయిష్ ను మరిపించేస్తున్నాయి. కిక్కిరిసిన జనం, నగలు, బట్టలు, ఇంటికి పనికి వచ్చే అనేక భారతీయ వస్తువులను పిచ్చిగా బేరం చేస్తున్నారు, కొనేస్తున్నారు

సుందరాచారి కి ఇవేం పట్టవు. రమేష్, వాళ్ళావిడకూ అంతే. 

"సా, మా మోటెల్ ఇక్కడికి ఒక పది మైళ్ళ దూరంలో ఉంది. పోయేసి వస్తాం. మళ్లీ కలుద్దాం," అని వీడ్కోలు తీసుకోబోయాడు రమేష్.

"మా జమ్మలమడుగు నాకు ఈ హోటల్ లోనే బ్రహ్మాండమైన రూం ఇప్పించాడు. రండి కాఫీ తాగి వెళ్దురు," అన్నాడు సుందరాచారి.

ఆయన అంత ఆప్యాయంగా పిలిస్తే కాదనలేకపోయారు రమేష్ దంపతులు. సుందరాచారికి ఇచ్చిన రూం పెద్దదే. ఒక అపార్ట్మెంట్ లాగానే ఉంది. రూం కు వెళ్ళిన తరువాత రూం సర్వీస్ కి చెప్పి కాఫీలు, కుకీస్ తెప్పించాడు. ముగ్గురూ కవితల గురించి కథల గురించి వాటిని రాసిన రచయిత, రచయిత్రుల గురించి కబుర్లలో పడిపోయారు. ఆ రోజు జరిగిన సినిమా వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమంలో ఇసుక వేస్తే రాలని జనం. ఈలలు, చప్పట్లు, నానా గందర గోళం. సుందరాచారి రాలేదు. రమేష్, మీరా వెళ్లారు. 

"అరె ఆ స్టేజి మీదుంది మిమ్మల్ని కథ రాయమని అడిగిన మనిషే కదూ," అంది మీరా.

అందమైన తారల మధ్య, చమత్కారమైన చలోక్తులు విసురుతూ, వారికి అందమైన, ఖరీదైన మోమెంటో లు ఇస్తూ, శాలువలు కప్పుతున్న వ్యక్తి అతనే, సమావేశం సాహిత్య కార్యదర్శి.

"అతనేవే. భలే గుర్తు పట్టావు. ఇంత దూరంలో కూర్చున్నామా గుర్తు పట్టలేక పోయాను. అదీ సంగతి. అంత బిజీ గా ఉన్నందు వల్లే ఆయన మనల్ని కలవలేక పోయారు," అన్నాడు రమేష్.

" మరీ ఇంత అమాయకులై పోయారు ఎలాగండి? అతని అజెండా లో మీరు లేరు. సంచికకు మీరు కథ పంపించడం తో, మిమ్మల్ని తన బుర్రలో నుంచి తీసి పక్కన పడేసి వుంటాడు. మీరు టికెట్లు కావాలి, సమావేశం సంచిక కావాలి అంటే వారికి మీరొక విసుగే. అది మీకు అర్థం అయినట్లు లేదు," అంది మీరా. రమేష్ మీద ఈగ వాలితే వెంటనే చంపేసే మీరాకు, ఈ సమావేశం ముళ్ళ మీదున్నట్టే ఉంది. కానీ రమేష్ మీది ప్రేమ వల్ల రాక తప్ప లేదు. పోనీ మహానుభావుడు సుందరాచారి గారిని కలిసాము కదా అని తృప్తి పడింది.

మరుసటి రోజు సుందరాచారిని కలిసి, గత రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమం వివరాలు పంచుకొని, ఆయన్ని నవ్వించారు రమేష్, మీరాలు. మిగిలిన రెండు రోజులు కూడా సుందరాచారి వల్ల ఆ సమావేశం సరదాగా గడిచిపోయింది. రమేష్, మీరాలు సుందరాచారిని నగరంలోను, బీచ్ ల లోను తిప్పారు. డైలీ టికెట్ గాళ్ళ కి సమావేశం వారు భోజన ఏర్పాట్లు చేయరు కాబట్టి, రమేష్ మీరా లు ఆ మూడు రోజులు సుందరాచారి తో బాటు లంచ్ బయట రెస్టారంట్ లలోనే తిన్నారు.  రాత్రి డిన్నర్ మటుకు, రూం సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసి మంచి భోజనం, డ్రింక్స్ ఏర్పాటు చేశాడు సుందరాచారి. 

సుందరాచారి రూం లో రమేష్ కు సమావేశం సావనీర్ చదవడానికి వీలైయ్యింది. దానితో రచయితగా తన రచన అచ్చులో చదవాలనే కోరిక తీరిపోయింది.

చివరి రోజు సుందరాచారి తన కవితల పుస్తకం ఒకటి తన సంచిలో నుంచి తీసి,  రమేష్ కి ఇచ్చాడు. మీ సంతకం తో ఇవ్వండి అని రమేష్ అడగడం తో, సుందరాచారి ముత్యాలాంటి అక్షరాలతో, కవిత లాంటి రెండు వాక్యాలలో రమేష్ ను, మీరాను ఆశీర్వదిస్తూ సంతకం పెట్టాడు. ఆ చిన్న పేపర్ బ్యాక్ పుస్తకాన్ని జాగ్రత్తగా సంచిలో పెట్టుకున్నాడు రమేష్. వీడ్కోలు ఇవ్వడానికి సుందరాచారి కూడా హోటల్ కాన్ఫరెన్స్ హాల్ బయట నున్న పార్కింగ్ గరాజి కి వచ్చాడు. కాన్ఫరెన్స్ హాల్ అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సినిమా ఫంక్షన్ పుణ్యమా నని చిందర వందరగా ఉంది. అడ్డా దిడ్డంగా ఉన్న కుర్చీలను మడుస్తూ, కింద పడేసిన కాగితాలు, ప్రోగ్రాం ఫ్లయర్స్, సగం తాగి వదిలేసిన కోక్ కేన్లు, నీళ్ళ బాటిళ్లను ప్లాస్టిక్ ట్రాష్ సంచులలో వేస్తున్నారు మెక్సికో లో నుండి వలస వచ్చిన పని వాళ్ళు.

"వాట్ ఎ సర్ప్రైజ్!" రమేష్ ముఖం వెలిగి పోతున్నది.  రీసైకిల్ ట్రాష్ కేన్ లో సమావేశపు సావనీర్ లు కొన్ని పడేసారు. అందులో ఒక రెండు సంచికలు రమేష్ తీసుకొని, ఒకటి తనుంచుకొని, మరొకటి సుందరాచారికి ఇచ్చాడు. 

"నాకెందుకయ్యా. అదో మోత. నువ్వే ఉంచేసుకో," అని తిరిగి ఇచ్చేసాడు, సుందరాచారి.

***

"ఆగాగు, అప్పుడే నేను నిన్ను కలిసాను. ఇక్కడి నుంచి, నీకు తెలియని కథ నన్ను చెప్పనీ," అని వాణి, భారతిని ఆపేసింది. 

***


వాణి చెప్పిన కథ:


భైరవ కు మాతృ దేశం పట్ల పరమ ప్రేమ. తెలుగు మీద అంతకు మించిన ప్రేమ. తెలుగు సమావేశం నగరంలో జరుగుతుందనగానే ఎగిరి గంతులు వేసి వాలంటీర్ గా చేతులు ఎత్తేసాడు. భైరవ కు వాలంటీర్ కావడం అంత సులభం కాదు. దానికి కారణం ఆ చేతులెత్తడం భైరవ, ముందు తన అల్లుడు దగ్గర చేయాల్సి వచ్చింది, ఒక పక్క భైరవ వాళ్ళావిడ, ఆ చేతులు కిందకి లాగుతుంటే. 

"అమ్మాయి కాన్పుకు వచ్చాం. ఆ పని చూడక ఈ తెలుగు సమావేశాలు ఏంటండీ? అమ్మాయి ఒప్పుకోదు. అల్లుడు ముందు చేతుల చాచకండి. చూడడానికి దరిద్రంగా ఉంటుంది," మెల్లిగా గొణిగింది భైరవ భార్య. 

"ఇక్కడకి రావడమే దరిద్రంగా ఉంది.   ఒక చోటుకు పోలేము. అన్నిటికీ ఈ పిల్లల మీద ఆధార పడాలి. ఈ సమావేశం ఒక ఆటవిడుపు. నీవు కూడా రా. ఆ మూడు రోజులు మళ్లీ మన దేశం పోయామనిపిస్తుంది," అన్నాడు భైరవ.

"మీరు వాలంటీర్ గా పని చేస్తుంటే, నేనేం చెయ్యాలి. ఇక్కడ మనమ్మాయికి తోడుంటాను. లేదంటే అది  మీరొచ్చి ఏమి లాభం అని మన ముఖం ముందే కడిగేస్తుంది. మీరు వెళ్లి రండి," అంది భైరవ భార్య.

అల్లుడు మొత్తం మీద భైరవ సమావేశం పోవడానికి ఒప్పుకున్నాడు. 

భైరవ తను ఎలా వాలంటీర్ గా తెలాడో అని కొత్తగా పరిచయమైన మరో వాలంటీర్ తో చెప్తుండగా విన్నాను. అప్పుడు భైరవ ఆ కొత్త వాలంటీర్ తెచ్చిన అట్ట పెట్టలనుండి సమావేశం కు అచ్చేసిన సావనీర్ లను ఒక్కోక్కటిగా తీసి, అప్పటికే చాలా ట్రింకెట్స్, సమావేశం బ్రోచెర్లు, వచ్చిన వ్యాపారస్తుల పాంఫ్లెట్ లతో నిండి పోయిన సంచులలో వేస్తున్నారు. ఆ సంచులు సమావేశపు గుర్తులతో,  కలంకారీ చిత్రాల తో ఎంతో  అందంగా ఉన్నాయి.

ఆ సంచులు సర్దుతుండంగానే ఒక జంట కౌంటర్ దగ్గరికి వచ్చింది. 

"రెండు డైలీ టికెట్ల కావాలి," అన్నాడు వచ్చినతను.

"సాయంత్రం సినిమా వాళ్ళ కార్యక్రమం కూడా చూస్తారా?", అడిగాడు భైరవ.

"అవునండి"

"అయితే రెండు వందల డాలర్లు కట్టండి," అన్నాడు భైరవ టికెట్లు, బ్యాడ్జీ లు తీస్తూ.

టికెట్లు తీసుకున్న తరువాత, వెంటనే మరలివెళ్ల కుండా, "నా పేరు రమేష్," అన్నాడు.

"అయితే ఏంటండీ. మీ వెనుక జనాలు ఉన్నారు, కదలండి. టిక్కెట్లు అమ్మాలి," కొంచెం అసహనంగా అన్నాడు భైరవ.

"మీరు సంచిక చదవ లేదా. అందులో నన్ను అడిగి వేయించుకున్న కథ ఉంది. నాకు ఒక కాపీ ఇస్తారా?" అడిగాడు రమేష్. 

"అబ్బే వీలు పడదండి. మాకు నిర్వాహకులు కచ్చితంగా చెప్పారు. డైలీ టికెట్ వాళ్లకు ఈ పుస్తకం, ఉన్న సమావేశం సంచి ఇవ్వనవసం లేదని,"  భైరవ అన్నాడు. 

వాళ్ళు మరలి వెళ్లిపోతుంటే, వారి సంభాషణ లీలగా వినిపించి చివరకు ఫేడ్ అవుట్ అయిపోయింది.

"హోటల్ సదుపాయాలు ఇవ్వలేదు. సమావేశం టికెట్లు పంపించలేదు. కనీసం మిమ్మల్ని సమావేశంకు కూడా పిలువలేదు. ఎందుకండి పోలో మని మీరు రావడమే కాక, నన్ను కూడా లాకొచ్చారు. ఈ సింగారానికి మీరు ఓ నెల రోజులు కుస్తీలు పడి కథ రాసి పంపించాలా. మిమ్మల్ని కథ కావాలని అడిగిన మనిషి, ఈ ఏర్పాట్లు చూసుకోవద్దు?" అన్నది జంటలోని ఆవిడ.

"వాళ్ళకీ ఏవో కష్టాలు ఉంటాయి. ఇంత పెద్ద సమావేశం అంటే మాటలా…."

ఆ మాటలు వింటుండగనే, ఒక రివటలా ఉన్న అబ్బాయి వచ్చి భైరవ ను చూసి దూరం నుండే చేయి ఊపాడు. సమావేశం లో కీలకమైన స్థానంలో ఉన్న సాహిత్య కార్యదర్శి డ్రైవర్. ఇది వరకే పరిచయం చేశారు, సమావేశపు సంచులకు వస్తాడని. ఒక సంచి కావాలని సైగ చేశాడు. వెంటనే, ఒక సంచి తీసి భైరవ ఆ డ్రైవర్ కి అంద జేసాడు.

డ్రైవర్, ఆ సంచి తీసుకొని పార్కింగ్ గరాజీ కి రాగానే, సమావేశపు సాహిత్య కార్యదర్శి ఒక రోజా పూల గుత్తి తో ఎదురయ్యాడు.

"హలో ఎడ్, డిడ్ యు గెట్ ద సావనీర్ బ్యాగ్. ఐ సీ ఇట్. నెవర్ మైండ్. లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్,"అని ఎడ్ తీసిన కారు తలుపుల ద్వారా, లిమో లో అడుగు పెట్టాడు.

ఎయిర్పోర్ట్ చేరిన కొద్ది సేపటికి తెలుగు సినీ పరిశ్రమలో పేరొందిన నటీమణి బయటకు రావడంతో, మన అధికారి పూల గుచ్ఛం, సమావేశపు సంచి ఆవిడ చేతికి అందించాడు. కెరీర్ ఒక బెల్ కర్వ్ లాగా అనుకుంటే, తన కెరీర్ కొండెక్కి కుడి వైపు జారబండ మీద వేగంగా దూసుకెళ్తున్న నటీమణి సుతారంగా అవి అందుకొని "థాంక్స్" అంది.

లిమో లో అడుగు పెట్టిన వెంటనే ఆ పూలు, సంచి సీట్లో ఒక వైపు విసిరేసింది ఆ నటీమణి. కారు కదులు తూనే కబుర్లు మొదలెట్టాడు సమావేశం సాహిత్య కార్యదర్శి.

"ఈ రోజు నా పని అంతా మీతో ఉండడమే. మీ కార్యక్రమం ఏమిటో చెప్పండి. అలా చేద్దాం," అన్నాడు తన కోటు మీదున్న సమావేశపు బ్యాడ్జ్ రిబ్బన్లు సరి చేసుకుంటూ.

"ఇది వరకే ఈ నగరం చుట్టేసాను. మధ్యాహ్నం లంచ్ తరువాత కలుద్దాం. కొంచెం షాపింగ్ ఉంది," అంది నటీమణి.

ఆ నటీమణి ని హోటల్ లో దింపి, కారులో నుంచే సమావేశపు ట్రెజరర్ కు ఫోన్ చేసాడు.

"నేను సమావేశపు సాహిత్య కార్యదర్శి నండి. ఇదేదో పనికి నేనే ఒప్పుకున్నాను. ఈ నటీమణి మధ్యాహ్నం షాపింగ్ అంటుంది. అది తీసుకెళ్లగలను. కానీ ఆ బిల్స్ ఎవరు కడతారు?", అడిగాడు.

"ఈ నటీమణులు, హీరోలకు బడ్జెట్ వేసామండి. ప్రతీ అతిథికి  ఉంది. మీకు ఖర్చు కని ఇచ్చిన కార్డ్ లిమిట్ అయ్యేంత వరకు బిల్లులు కట్టండి. ఆ లిమిట్ దాటితే నాకు చెప్పండి. నేను మాట్లాడి కావాలంటే లిమిట్ ఎక్కిస్తాను.  ఈ టాలీవుడ్ వారికి, మనకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. మీరు వర్రీ కాకండి," అన్నాడు ట్రెజరర్. 

"ఎలాంటి అవగాహన?" విషయం పూర్తిగా బోధ పడని అసహనంతో అడిగాడు సాహిత్య కార్యదర్శి.

"హాస్య నటులు అడిగితే షాపింగ్ కు తీసుకెళ్లం. అదో ఉదాహరణ. వారికి ఆ బడ్జెట్ లేదు. అదే వారు డ్రింక్స్ కావాలంటే లిమిట్ లేకుండా తీసుకోవచ్చు. తిరిగి పోయేటప్పుడు వాళ్ళకి రెండు బాటిల్స్ కొని ఇవ్వడానికి కూడా అనుమతి ఉంది. అలా అని అందరు నటులు, నటీమణులు ఇవన్నీ అడగరు. వారిని ఫస్ట్, బిజినెస్స్ క్లాస్ లలో పిలిపించి, స్టార్ హోటల్ లో వసతి కల్పించి, వారు తినడానికి, తిరగడానికి ఏర్పాట్లు చేస్తే చాలు, చాలా సంతోషిస్తారు. వారితో మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఎలాను వారికి అంద చేస్తాము. సమావేశం తరువాత వారే పలు నగరాలు తిరిగి ఎంతో, కొంత సంపాదించుకుంటారు కాబట్టి వారూ ఖుష్," అన్నాడు ట్రెజరర్.

లిమో లోనే కూర్చుని మాట్లాడుతున్న సాహిత్య కార్య దర్శి మళ్లీ లంచ్ తరువాత వస్తానని డ్రైవర్ కు చెప్పి ఇతర తారలను కలవడానికి వెళ్ళిపోయాడు

నటీమణి కి ఇచ్చిన సంచి కారులోనే ఉంది పోయింది. తను పూలు మాత్రం రూం కు తీసుకెళ్ళింది.

అలా మూడు రోజులు షాపింగ్  అంటూ బ్రాండెడ్ షాప్ లన్నీ తిరిగి కావల్సినన్ని వస్తువులు కొన్న తరువాత, సమావేశం ముగియడంతో ఎయిర్పోర్ట్ కు తిరిగి నటీమణి బయలు దేరింది. సమావేశంలో పరిచయం అయ్యిన మరో ముగ్గురు కూడా వారితో లిమోలో ఎయిర్పోర్ట్ కు బయలు దేరారు. లిమో డ్రైవర్ నటీమణి సూట్కేస్ లు ట్రంక్ లో సర్దేసి, లోపల ఇంకా సీటు మీదున్న సమావేశపు సంచి తీసి "దీన్ని ఏమి చేయమంటారు" అని అడిగాడు.

నటీమణి సంచిలో ట్రింకెట్స్ మాత్రం ఉంచేసుకొని, ఈ మోత ఎందుకు ట్రాష్ లో పడేయండి అంటూ బ్రోచర్లు, ఫ్లయర్ల్ తో పాటు సమావేశపు సావనీరు కూడా డ్రైవర్ చేతికందించింది.

డ్రైవర్ అవి గేరాజి లోనే ఉన్న ట్రాష్ బిన్ లో వేస్తుంటే, అప్పటికే ట్రాష్ చేసిన మరిన్ని సావనీర్ లు కూడా కన పడ్డాయి.

తరువాత కొంత సేపటికి రమేష్ ట్రాష్ వైపు చూస్తూ కనపడ్డాడు.

"వాట్ ఎ సర్ప్రైజ్!" రమేష్ ముఖం వెలిగి పోతున్నది.  రీసైకిల్ ట్రాష్ కేన్ లో సమావేశపు సావనీర్ లు కొన్ని పడేసారు. అందులో ఒక రెండు సంచికలు రమేష్ తీసుకొని, ఒకటి తనుంచుకొని, మరొకటి సుందరాచారికి ఇచ్చాడు.

"నా కెందుకయ్య. అదో మోత. నువ్వే ఉంచేసుకో," అని తిరిగి ఇచ్చేసాడు, సుందరాచారి.

***


"అప్పుడే నిన్ను కలిసాను భారతి, మళ్లీ నా ప్రయాణం మొదలయ్యేటట్టుంది. నీ పనే నయం. ఉన్న పట్టున ఉంటావు. నాదో ట్రావెల్ జాబ్ అయిపోయింది," అంది వాణి.

"ఏం చేస్తాం? పోన్లే, కనీసం రచయిత ఇంట్లో పడ్డాం.  కొంత ఎడబాటు ఉన్నా, ఇన్ని రోజులు కలిసే ఉండగలిగాము," అంది భారతి.

***

తొండనాడు అందంగా మెరుస్తున్న కాఫీ టేబిల్ పుస్తకం తీసి గంజం కు అంద జేశాడు. అదో సావనీర్. 

"పుస్తకం పెద్దగా అనిపించినా, కథలు ఒక పాతిక పేజీల కంటే ఎక్కువ లేవు. 'తెలుగు వాణి' -  ఒక పదేళ్ల క్రితం మన అమెరికా సంఘం వాళ్ళు ప్రింట్ చేసిందే,  తీసుకెళ్లండి," అన్నాడు తొండనాడు.

"చాలా థాంక్స్  రమేష్ గారు. ఇంత ఖరీదైన పుస్తకం నన్ను నమ్మి ఇచ్చారు. అక్కడ మరో నలిగిన పుస్తకం తీశారు. అదేంటి," అడిగాడు గంజం. 

"భైరవ్ గారు, మీరన్నట్టు మీకిచ్చిన పుస్తకం ప్రచురించడానికి బాగానే ఖర్చు అయ్యిఉంటుంది. ఆ పుస్తకం ఖరీదైనదే. కానీ నా దృష్టి లో ఆ పుస్తకానికి విలువ లేదు. చూస్తూనే చేదు జ్ఞాపకాలు వస్తాయి. కానీ ఈ నలిగిన పుస్తకం నాకు అమూల్యం. ఈ పుస్తకం చచ్చినా ఎవరికీ ఇవ్వదలచు కోలేదు. మా సుందరాచారి గారు స్వహస్త అక్షరాలతో దీవించి రాసి ఇచ్చిన పుస్తకం 'తెలుగు భారతి'. నేను తరచు చదివే పుస్తకం ఇది. ఈ పేజీల ముడుతలే దానికి సాక్ష్యం," అన్నాడు తొండనాడు.

"ఎవ్వరండి సుందరాచారి?" అడిగాడు గంజం.

"గొప్ప కవి. మీరడిగిన ప్రశ్ననే, ఈ మధ్య అందరూ అడగడం మొదలెట్టారు. జనాలు ఆయనని మరచి పోయారు. చివరి రోజులలో ఆయన తిరుపతి లో తిండికి లేకుండా ఆకలితో అలమటించి పోయారని విన్నాను," తొండనాడు రమేష్ కంట్లో నీళ్ళు.

గంజం భైరవ 'తెలుగు వాణి' చేతిలో పెట్టుకొని, కూతురు ఇంట్లో నుంచి మానసికంగానైనా విడుదల దొరికింది కదా, అని కూతురు ఇంటికి వడి వడిగా అడుగులు వేయసాగాడు. 


***

'మా తెలుగు' పార్టీ లీడర్ హడావుడిగా వచ్చేశాడు. 

అతని మెడలో తెల్లటి 'మల్లె పూదండ'.

అక్కడి  నిలువెత్తు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కు బలవంతం మీద వచ్చిన ప్రభుత్వోద్యోగులు, 'గల గల' అని మాట్లాడుతున్నారు.


'బిర బిర' నడుస్తున్నాయి వాహనాలు, ఆ కాంస్య విగ్రహం ఉన్న నాలుగు రోడ్ల కూడలి చుట్టూ.

తిరుపతి బదులు, 'అమరావతి' నగరంలో ఆ 'అపురూప శిల్పం, నెలకొల్పి ఉండాలి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మల్లె పూదండ మెడలో నుంచి చేతిలోకి తీసుకుని, "ఎవరిది తెర వెనుక ఉన్న విగ్రహం?" అడిగాడు పార్టీ లీడర్ మంద్ర స్వరం లో, తన పక్కనున్న పి. ఏ ను.

 

"శంకరంబాడి సుందరాచారి"

 

"ఎలక్షన్లు మొదలయ్యాయి. క్షణం తీరిక కూడా లేదు. ఈ శంకుస్థాపనలు ఇప్పుడు అవసరమా?" నేత విసుక్కున్నాడు.

 

"ఎలక్షన్ల కోసమే సార్. ఫ్రీ పబ్లిసిటీ. మీడియా ఇలాంటి వాటినే కవర్ చేస్తాయి. మీ పేరు ప్రజలలో మరింత నానుతుంది. ఇదే కవరేజ్ మీరు కొనాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది."

 

సభ మొదలయ్యింది. 

 

'నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం'

 - అంటూ పార్టీ నేతకు జేజేల కేకలు వేస్తున్నారు,  ఆ సభకు వచ్చిన 'మా తెలుగు' పార్టీ కార్యకర్తలు,  పార్టీ నేత అభిమానులు.

***

bottom of page