MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వంగూరి పి.పా -28
వీసా కష్టాల్ వస్తే రానీ, పోతే పోనీ.
వంగూరి చిట్టెన్ రాజు
ఓరి నాయనోయ్.
గత మూడు, నాలుగు నెలలుగా మా ఇంట్లో ఒకటే హడావుడి. ఆ హడావుడి అంతా నా ఒహడిదే కాదు. నాతో పాటు అటు దక్షిణ ధృవానికి కూత వేటు దూరంలో ఉన్న న్యూజీలాండ్ నుంచి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న నార్వే దాకా, మధ్యలో ఉన్న సింగపూర్, ఆస్టేలియా, మన పవిత్ర భారత దేశం, దక్షిణ ఆఫ్రికా దాకా, మధ్య ప్రాచ్య దేశాల నుంచి మా అమెరికా దాకా జరిగిన ఈ హడావుడి పేరు 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు. సెప్టెంబర్ 17-18, 2022 లో న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక మీదే కాకుండా అంతర్జాలంలో కూడా 24 గంటల సేపూ, అది చాలక మళ్ళీ అక్టోబర్ 2, 2022 నాడు మరొక 12 గంటల సేపూ వెరసి మొత్తం 36 గంటలు అంతా తెలుగు సాహితీ సంబరమే. దేశ విదేశాలలోని 9 సాహితీ సంస్థల ప్రధాన నిర్వాహకులు, 18 వేదికలు, ఇద్దరికీ జీవన సాఫల్య పురస్కారాలు, 30 పైగా దేశాల నుంచి సుమారు 150 మంది వక్తలు, 20 మందికి పైగా ప్రసంగ వేదికల నిర్వాహకులు, 30 మందికి పైగా సాంకేతిక నిర్వాహకులు. మరి హడావుడిగా ఉందీ అంటే ఉండదూ.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సాహితీ సదస్సుకి న్యూజీలాండ్ నిఝంగానే వెళ్ళి హడావుడి చేద్దాం అనుకున్న అందరికీ వచ్చిన “పీత కష్టాలు పీతవే” అన్నట్టు వచ్చిన ఎవరి కష్టాలు వారికే వచ్చిన ఉదంతాలు ఒక ఎత్తు. అమెరికా నుంచి వెళ్ళిన నేనూ, మా క్వీన్ విక్టోరియా, మా ఆప్త మిత్రుడూ, పోతన గారి అవతారం అనదగ్గ మల్లిక్ పుచ్చా, మా అందరి పెట్టెలూ మొయ్యడానికి మా సుపుత్రుడికీ వచ్చినవి ఒక రకం కష్టాలు అయితే పవిత్ర భారత దేశం నుంచి ఆహ్వానిత అతిధులుగా వచ్చిన కవి జొన్నవిత్తుల గారికీ, ప్రముఖ సాహితీవేత్త వోలేటి పార్వతీశానికీ వచ్చిన విమాన కష్టాలు పరాయివాడికి కూడా వద్దురా బాబోయ్ వద్దు. అవన్నీ తరువాత ఎప్పుడో వ్రాస్తాను కానీ ప్రస్తుతం అమెరికా ‘పీతల’ కష్టాలు మాత్రం ఏకరవు పెడతాను.
అసలు ఏం జరిగిందంటే- న్యూజీలాండ్ లో జరిగే ఈ సదస్సుకి నేనూ వెళ్దాం అనుకోనేలేదు. అలాగే ఇండియా నుంచి జొన్నవిత్తుల గారినీ, వోలేటి పార్వతీశం గారినీ ఆహ్వానిద్దాం అని కూడా అనుకోనే లేదు. ఎందుకంటే ఈ దిక్కుమాలిన కోవిడ్ మూలాన న్యూజీలాండ్ సరిహద్దులు పర్యాటకులకి అప్పుడెప్పుడో పూర్తిగా మూసేశారు. హమ్మయ్య డబ్బు కలిసి వచ్చింది కదా అనుకుంటుంటే కోవిడ్ బాగా తగ్గి, ఇక ‘కొంపలు ములగవులే’ అనుకున్నారో ఏమిటో. ఈ న్యూజీలాండ్ సర్కారు వారు ఆగస్ట్ ఒకటో తారీకు నుంచీ ఎవరైనా సరే న్యూజీలాండ్ రావచ్చును అని సరిహద్దులు తెరిచారు. అది తెలియగానే అక్కడికి వెళ్ళడానికి నేను తయారు అవగానే వెంటనే మా ఆవిడ ‘నేనూ వస్తాను’ అని పేచీ పెట్టింది. అసలు కారణం సాహిత్యం మీద ప్రేమ కాదు. నేను ఒక్కడినే వెళ్తే ఎక్కడ పిచ్చి వేషాలు వేస్తానో, ఏమై పోతానో అని తనకి బెంగ. ‘మీ ఇద్దరూ గట్టిగా నాలుగు అడుగులు కూడా వెయ్యలేరు, దారిలో ఎక్కడైనా కాలు జారి పడిపోతే లేపడానికీ, కీచులాడుకుని విడిపోతే మళ్ళీ కలపడానికి నేనూ వస్తాను’ అని మా సుపుత్రుడూ, ‘నా పెట్టెలు మోస్తాను అని హామీ ఇస్తే నేనూ వస్తాను’ అని ఆప్తమిత్రుడు మల్లిక్ హడావుడి చెయ్యడంతో అందరం కలిసి అమెరికా నుంచి బయలు దేరాం. మరి వెళ్ళే ముందు ‘ఎత్తెంత, లోతెంత, యెడల్పెంత’ అని రావు గోపాలరావు టైపులో కంప్యూటర్ లో చూసుకోగానే న్యూజీలండ్ సర్కారు వారి దృష్టిలో మేము పుట్టినది పవిత్ర ఆంధ్ర ప్రదేశ్ లోనే అయినా ఇప్పుడు ఘనత వహించిన అమెరికా పౌరులం కాబట్టి మాకు వీసా అక్కర లేదు అని తెలియగానే సంబరపడ్డాం. కానీ ఐదు నిమిషాల తర్వాత వీసా అక్కర లేదు కానీ “పరవేశ పత్రం” ఉండాలి అని ఆ కంప్యూటర్ అమ్మాయి ద్వారా తెలిసింది. అంటే ఎంట్రీ పెర్మిట్ అనమాట. ఇదేమో రెండు రకాలు. ఒకటేమో న్యూజీలాండ్ లో కేవలం అడుగు పెట్టడానికి.. ట. రెండోది “అలా అడుగుపెట్టినప్పుడు మా పెట్టెలలో కానీ, మగాళ్ళయితే నడుం చుట్టూ బెల్ట్ లోనో, చెప్పుల్లొనో రహస్యంగా పెట్టేసుకుని కానీ ఆడవాళ్ళు అయితే అంతకంటే రహస్యంగా పర్సులు దాచుకునే లేదా వివాహితలైన హైందవ మహిళలు తమ పవిత్ర మంగళ సూత్రములను వేళ్ళాడదీసుకునే చోట కానీ ‘మొక్కలు, పాదులు, విత్తనములు, తాబేళ్ళు, పాములు, క్రిమికీటకాదులని రహస్యంగా న్యూజీలాండ్ లోపలకి తీసుకురావడం లేదు’ అనే ‘అబధ్ధపు వాగ్దానం” చేసే పత్రం. అలనాడు అనగా 1970 లలో అమెరికాకి దొండపాదు, తమల పాకు పాదు కష్టమ్స్ వాడి కళ్ళు కప్పి పొట్టకి కట్టుకుని, పట్టుకొచ్చిన నాకు న్యూజీలాండ్ వారి అమాయకత్వానికి నవ్వు వచ్చినా “రోజులు మారాయ్. బిడ్డా, కంప్యూటర్లు, కెమెరాలు వచ్చి పడ్డాయ్, విమానాశ్రయాలలోనే ప్రార్ధనా మందిరాలే కాక తక్షణ జైలు సౌకర్యాలు కూడా వచ్చేశాయ్” అని తెలుసుకున్న వాడిని కాబట్టి ఎందుకైనా మంచిది అని మా ఆవిడ పెట్టెలో ఉన్న ఆవకాయ, కందిపొడి అవతల పారేసి అందరికీ ఆ రెండు ‘పరవేశ పత్రాలు” కంప్యూటర్ లో సంపాదించి ప్రింట్ చేసి జేబులో పెట్టుకున్నాను. హ్యూస్టన్ నించి లాస్ ఏంజెలెస్, అక్కడి నుంచి న్యూజీలాండ్ లో ఆక్లండ్ చేరుకోడానికి నాకున్న తెలివితేటలు అన్నీ ఉపయోగించి అందరికీ చక్రాల కుర్చీ ముందే అడిగాను కానీ. దాం దుంపతెగా! ఆ యునైటెడ్ మరియు ఎయిర్ న్యూజీలండ్ వాళ్ళు కూడబలుక్కుని తెల్ల మీసాలు ఉన్న నాకూ, పోతన మల్లిక్ కీ, అస్సలు మీసాలే లేని నా సతీమణికీ చక్రాల కుర్చీ వగైరాలు ఏర్పాటు చేశారు కానీ నిగ నిగలాడే నల్ల మీసాలతో మెరిసిపోతున్న మా సుపుత్రుడిని కాలి నడకకి పరిమితం చేశారు.
సుమారు ఐదు గంటలు అమెరికా భూభాగం మీదా. ఆ తర్వాత 14 గంటలు లాస్ ఏంజెలెస్ నుంచి న్యూజీలండ్ దాకా శాంత మహా సముద్రం. అనగా పసిఫిక్ సముద్రం మీదా విమాన ప్రయాణం తర్వాత ఆక్లండ్ విమానాశ్రయంలో ఈసురో మంటూ మేము ముగ్గురం దిగాం. అనగా హ్యూస్టన్ నుంచి నలుగురం బయలుదేరినా. లాస్ ఏంజెలెస్ లో ఆక్లండ్ కి విమానం ఎక్కబోతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది. నేనూ, సతీమణీ, పుత్రరత్నమూ విమానంలో మా ఆసనాలలో కూర్చుని తోలు పటకాలు. అనగా సీట్ బెల్ట్ లు పెట్టుకున్నాం. కానీ మా వెనకాలే ఉన్న పోతన గారు వెనకపడ్డారు. కారణం అకాల అనారోగ్యం. ఎందుకో, ఏమిటో ఏమీ ఎవరికీ తెలీదు కానీ హఠాత్తుగా, ఆఖరి క్షణంలో అతను విమానం ఎక్కలేదు. అన్నీ సద్దుకున్నాక ఆ మర్నాడు అతను ఆక్లండ్ వచ్చాడు.
ఇక మేము ముగ్గురం అక్కడ దిగి, అందులో ఇద్దరం ఎలెక్ట్రిక్ బండి మీదా, మా వాడు దాని వెనకాల పరిగెట్టుకుంటూనూ కష్టపడి కష్టమ్స్ అమ్మాయి దగ్గరకి వెళ్ళాం. ఆ పిల్ల మమ్మల్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి, మమ్మల్ని తీసుకొచ్చిన చక్రాల కుర్చీ అమ్మాయి దగ్గర అందరి ‘పరవేశ పత్రాలూ’ తీసుకుని తన స్కానర్ లో పెట్టి కెవ్వు మని ఐటెమ్ సాంగ్ పాడింది. దానికి కారణం అమెరికాలో ముద్రించిన మా పత్రాలని ఆ న్యూజీలాండ్ కంప్యూటర్ నిరాకరించుట. ఒకటి, రెండు సార్లు ఆ తెల్ల పిల్ల ప్రయత్నించి, తెల్లబోయి, దిక్కు తోచక దిక్కులు చూస్తున్న తరుణంలో మా స్మార్ట్ తనయుడు నా స్మార్ట్ ఫోన్ లాక్కుని, అందులో దాక్కున్న ఈమైల్ లో వచ్చిన ఆయా పత్రాలని ఆ పిల్లకి చూపించుటా, అలా చైనాలో తయారు చేయబడ్డ అమెరికా ఫోనూ, అదే చైనాలో కూడా తయారు చేయబడ్డ న్యూజీలాండ్ కంప్యూటరూ “హిందీ చీనీ భాయీ భాయీ” అనేసుకుని ‘కుయ్’ అని కూసేసుకోవడంతో ఆ పిల్ల మళ్ళీ తన ఒరిజినల్ రంగుకీ, కిచ కిచకీ వచ్చేసి టక టకా మా ముగ్గురి పాస్ పోర్ట్ ల మీదా తాలూకా ఆఫీసులో గుమాస్తాలాగా రబ్బరు స్టాంప్ కొట్టేసి బయటకి అంటే “లోపలికి” అంటే విమానాశ్రయం బయటకీ, న్యూజీలాండ్ దేశం లోపలకీ పంపించింది. “ఎదిగొచ్చిన కొడుకు పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నువ్వూ ఉన్నావు, ఎందుకూ?” అంది మా క్వీన్ విక్టోరియా.
ఏది ఏమైతేనేం. మొత్తానికి నేనూ, మా అర్థాంగీ, పుత్ర రత్నమూ, మల్లిక్, కవి జొన్నవిత్తుల గారు, వోలేటి పార్వతీశం, సిడ్నీ నుంచి వచ్చిన విజయ మాధవి గొల్లపూడీ - ఈ ముఠా అటు సాహితీ సదస్సు లో పాల్గొనడమే కాక న్యూజీలాండ్ లో రెండవ పెద్ద నగరం అయిన క్రైస్ట్ చర్చ్ అనే నగరం, దక్షిణ ధృవానికి దగ్గరలో ఉండే క్వీన్స్ టౌన్, మధ్యలో వైటామో మంచు గుహలూ, రాత్రి పూట దక్షిణ ఆకాశంలో మాత్రమే కనపడే నక్షత్రాలూ, సరస్సులూ, మామూలు కొండలూ, గ్లేషియర్స్ అనే మంచు కొండలూ, ఎక్కడ చూసినా పచ్చదనంతో అత్యంత సౌందర్యంగా ఉండే ప్రకృతితో మమేకం అయి, పది రోజుల పాటు మెదడుకి పట్టిన తుప్పు వదిలించుకుని మళ్ళీ అమెరికా వచ్చి పడ్డాం. ఈ సారి పోతన గారు కూడా మాతోనే వచ్చాడు కానీ. రాగానే కోవిడ్ బారిన పడ్డాడు. విమాన ప్రయాణం అనగానే అదేమిటో మరి. కొందరు దుక్కగానే ఉంటారు. కొందరు బక్కగా అయిపోతారు. కదా!.
మరి ఇంతా చెప్పి అసలు ప్రపంచ సాహితీ సదస్సు వివరాలు చెప్పాలి కదా?
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు రూపకల్పన చేయబడిన ఈ కార్యక్రమం తొలి రెండు రోజులు "న్యూజిలాండ్ తెలుగు సంఘం" వారి 25వ వార్షికోత్సవ సందర్భంగా ఆక్లాండ్ మహానగరంలో శనివారం ప్రారంభమై, భారతకాలమానం ప్రకారం అంతర్జాలంలో ఆదివారం మధ్యాహ్నం వరకు జరిగింది. ప్రారంభ సభలో భారతదేశం నుండి కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వోలేటి పార్వతీశం, అమెరికా నుండి వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, మల్లిక్ పుచ్చా, న్యూజిలాండ్ తెలుగు సంఘం సమన్వయకర్త మగతల శ్రీలత, అధ్యక్షురాలు అనిత మొగిలిచెర్ల, సునీల్, ఆస్ట్రేలియా నుంచి గొల్లపూడి విజయ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ వెదికలో వేదికపై న్యూజీలండ్ నుంచి వెలువడిన మొట్ట మొదటి తెలుగు కథాసంపుటి “ప్రవాస చందమామ కథలు (సతీష్ గొల్లపూడి రచన). కవి జొన్నవిత్తుల గారి విమాన వేంకటేశ్వర శతకం, మరో మాయాబజార్ – కథాసంపుటి (రాధిక మంగిపూడి) అమెరికోవిడ్ కథలూ-కాకరకాయలూ (వంగూరి చిట్టెన్ రాజు), డయాస్పోరా కథానిక -16వ సంకలనం తో సహా తో సహా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించిన ఐదు పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి.
ప్రారంభ వేదిక అనంతరం, రెండవ వేదిక నుండి ప్రారంభమై 16 గంటల పాటు అంతర్జాలంలో 25 దేశాలనుండి సుమారు 100 మంది వక్తల ప్రసంగాలతో ఈ సదస్సు కొనసాగింది. ఈ అంతర్జాల వేదికలకు ప్రారంభ ఉపన్యాసం సినీకవి శ్రీ భువనచంద్ర అందించగా, సంగీత దర్శకులు స్వర వీణాపాణి సదస్సుకొరకు ప్రత్యేకించి ఒక అంకిత గీతాన్ని రచించి స్వరపరిచి ఆలపించారు. మలేషియా మరియు అమెరికా నుండి రెండు చర్చా వేదికలు కూడా నిర్వహింపబడ్డాయి. పద్య ఆలాపన, దేశభక్తి సాహిత్యం మీద వోలేటి పార్వతీశం గారి ఉత్తేజపూరితమైన ప్రసంగం అభికులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అంతర్జాల వేదికపై కెనడాకు చెందిన రచయిత్రి కొమరవోలు సరోజ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకొనగా, ముగింపు సమావేశ సమయంలో ఓలేటి పార్వతీశం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు. న్యూజిలాండ్ వేదికలలో అక్కడ నివసించే తెలుగు రచయితలు, కవులు తమ ప్రసంగాలను అందించగా, మొత్తం 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం వివిధ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
"ప్రత్యేకంగా భారతీయ వక్తల, అతిధుల ప్రసంగాలతో అక్టోబర్ 2వ తేదీ ఈ సదస్సు యొక్క మూడవరోజు కార్యక్రమం అంతర్జాలంలో మరొక 12 గంటల పాటు నిర్వహించబోతున్నామని" సదస్సు ముఖ్య నిర్వాహకులు వంగూరి చిట్టిన్ రాజు [అంటే నేను] తెలిపారు.
సహ నిర్వాహక సంస్థల ప్రతినిధులుగా డా. వంశీ రామరాజు, శాయి రాచకొండ, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, రాపోలు సీతారామరాజు, డా వెంకట ప్రతాప్, లక్ష్మీ రాయవరపు, డా. వెంకట్ తరిగోపుల కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. సింగపూర్ సాంకేతిక ప్రత్యక్ష ప్రసార కేంద్రంగా నడిచిన ఈ కార్యక్రమానికి గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, మధు చెరుకూరి తదితరులు సాంకేతిక నిర్వాహకులుగా సేవలందించారు.
మళ్ళీ కలుద్దాం!
*****