MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వంగూరి పి.పా.
కుండీలో ‘కొట్టి మీరా’
వంగూరి చిట్టెన్ రాజు
క్రిందటి శీతాకాలం లో సాధారణం గా వేడిగానే ఉండే మా హ్యూస్టన్ లో కూడా అసాధారణమైన చలి తో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉషోగ్రతలతో మేము ఇంట్లోనే పిడచ కట్టుకు పోయి బతికి బయట పడితే, ఇక మా తోటలో ఉన్న పదిహేను అడుగుల కర్వేపాకు చెట్లూ, ఏడడుగుల మందారాలూ, అరడజను పైగా సొగసైన మల్లె పొదలూ, కుండీలలో వేసుకున్న సకల ఫలపుష్ప విరాజిత శోభిల్లతలూ, నలుగురికీ పంచిపెట్టగలిగేలా ఐదారు గెలలు కాసే అరటి చెట్లూ, ఆఖరికి అరవై అడుగులు ఎదిగి మాకేసి దర్జాగా చూసే ఒకానొక అమెరికా తాడి చెట్టూ కూడా ఠావుల్ దప్పి ఠపీమని చచ్చి పడ్డాయి.
“చలి ముందు” , “చలి తర్వాతా” లాంటి ఫోటోలు ఒక్కొక్క మొక్కకీ విడి, విడిగానూ, కలిసి మెలిసీ నా దగ్గర చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఇంచు మించు అమెరికా లో వచ్చే కొన్ని ప్రకటనల లాంటివే. అంటే, మా “వాట్కిన్స్ ప్రణాళిక ప్రకారం తినే ముందూ, తిన్న తర్వాతా అని ‘ముందు ఫోటో’ లో ఒక భారీ బొండాం గారి బొజ్జని మాత్రమే చూపించే ఫోటో, ‘తిన్న తర్వాత’ ఫోటోలో లాంగ్ షాట్ లో బాగా చిక్కిపోయిన బొజ్జా, బలిసిన కాళ్ళు, కండరాలు చూపించే లాంటివి అనమాట. కావాలంటే చలికి తట్టు కోలేక నిర్జీవం అయిపోయిన మా తోట ఫోటో, ప్రస్తుతం కాస్త పునరుద్ధరించిన ఫోటో ఒకటీ ఇక్కడ జపరిచాను. ఆ కథాక్రమం బెట్టిదనినా-
తీరా చలి కాలం వెళ్ళి పోయి, వసంత ఋతువు మరియు పక్షుల కిలకిలా రావములు, చెట్లు చిగురించుట, సామూహికంగా అందరూ కలిసి ఆన్-లైన్ లో ఉగాది పచ్చడి తినడం నటించుట -కోవిడ్ కదా -అందుకన్నమాట, జరిగాక మళ్ళీ మా పెరట్లోకి వెళ్ళి చూద్డును కదా! పక్షుల మాట దేవుడెరుగు- ఏగలూ, దోమలూ నా మీద దాడి చేశాయి. కేవలం గులాబీలు మాత్రం వెంటిలేటర్ మీద బతికే ఉన్నాయి. అరటి పిలకలు తొంగి చూడడం మొదలు పెట్టాయి. అనుకోకుండా మల్లె మొక్కలు భూమి నించి తన్నుకుంటూ బయటకి రావడానికి అవస్థపడుతున్నాయి. కానీ, కర్వేపాకు కానీ, మందారాలు కానీ, బోగన్ విలియా కానీ ఎక్కడా కుయ్, కయ్ అనకుండా నిశ్చలంగా అలాగే పడిఉన్నాయి. ఎంతో ప్రేమగా మూడు కుండీలలో వేసుకున్న కనకాంబరాలు గోవిందా, గోవింద!
ఇప్పుడు ఇద్దరు పాత్రలు రంగ ప్రవేశం చేశాయి. ఒక పాత్ర పేరు ఫెర్నాండెజ్. వాడి వృత్తి గడ్డి కోయుట. ప్రవృత్తి నా ప్రాణం తీయుట. ఇందులో వృత్తి కోసం చిన్న ట్రాక్టర్ సైజులో ఉన్న లాన్ మూవర్ వాడితే, ఆ యంత్రం కొనడం కోసం మరియు ప్రవృత్తి కోసం భాషా దోషాన్ని వాడతాడు. అనగా, నాకు వచ్చిన తెలుగు వాడికి రాకా, వాడు మాట్లాడేది ఏ భాషో నాకు తెలియకో ఇద్దరం రెండు పిల్లులో, శునకాలో పలకరించు కున్నట్టు పలకరించుకుంటాం. ఆ భాషలో మ్యావ్, మ్యావ్ అన్నా, భౌ భౌ అంటే దాలా, దాలా అని అర్ధం. ఉదాహరణకి మొన్నటి మా ఇద్దరి సంభాషణ ఈ క్రింది విధంగా జరిగింది.
“ఈ కర్వేపాకు మొక్కలు మళ్ళీ వస్తాయా?”
“డో నో...హండ్రెడ్ దాలా”
“మరి మందారాలో?”
“ఐ డిగ్. ఐ బై నూ గివ్ బిల్, య బై ఒకే.... టు హండ్రెడ్ దాలా లేబా”
ఈ పై సంభాషణ తర్జుమా చెప్తే చాలు. అసలు విషయం అర్ధం అయిపోతుంది.
నేను అడిగిన మొదటి ప్రశ్నకి సదరు ఫెర్నాండెజ్ వారి సమాధానం “ఏమో ఎవడికి తెలుసు. మా మెక్సికన్లకి ఇలాంటి మొక్కల గురించి తెలీదు. కావాలంటే మొత్తం ట్రిమ్ చేసి కొన్నాళ్ళు చూద్దామ్. ఖర్చు వంద డాలర్లు”.
ఇక రెండో ప్రశ్నకి వారి సమాధానం “పాతవి తవ్వి పారేసి కొత్తవి వెయ్యాలి. నేను కొంటే బిల్లు ఇస్తాను. నువ్వే కొనుక్కొస్తే నీ ఇష్టం. రెండు వందల డాలర్లు లేబరు.
ఇక మళ్ళీ మా పెరటిని నందన వందనంలా చెయ్యాలంటే ఒకటా రెండా ముందు మొత్తం పరిశుభ్రం చేసి, చెత్తా చెదారం బయట పారెయ్యడం, కొత్త మట్టి కొని వెయ్యడం, అదేదో దిక్కుమాలిన ఆ మల్చ్ అనే పదార్ధం ఆ పైన వెయ్యడం. కుండీలలో వెయ్యడానికి కొత్త పుష్ప రాజములు కొని వెయ్యడం ఇలా రాసుకుంటూ పొతే, వేసుకుంటూ పోతే, ఖర్చు పెట్టుకుంటూ పోతే గోవిందా, గోవింద.
ఇక రెండవ పాత్ర ప్రవేశం నాకు ఎప్పుడూ అంచనాలని మించినదే కాక ఊహలకి అందనిదే. ఈసారి మరీనూ! ఎందుకంటే ఈ సారి ఆవిడ చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. దాని పేరు టీవీ రిమోట్. ఇది వరకూ ఏదైనా టీవీలో చూడాలి అనుకుంటే ఆ వెధవ సెర్చ్ డబ్బాలో అక్షరాలు ఈ రిమోట్ తో కొట్టడానికి గంటల కొద్దీ సమయం పట్టేది. కానీ ఈ మధ్య ఆ రిమోట్ ని నోటి దగ్గర పెట్టుకుని ”జగన్ మోహన్ రెడ్డి“ అంటే చాలు. యూ ట్యూబ్ కొన్ని వందల చానెళ్ళు, ప్రసంగాలూ తెర నిండా కనపడతాయి. మా అర్దాంగి మటుకు అలా ఆ రెడ్డి గారి జోలికో, మరో నాయుడు గారి జోలికో వెళ్ళకుండా ఏ చాగంటి వారితోతో, గరికిపాటి వారితోనో సరిపెట్టుకునేది. ఇప్పుడు ఒక విధంగా నా కొంప ములిగింది. దానికి ప్రధాన కారణం నేను మళ్ళీ మా పెరటి పునరుద్ధరణ ప్రయత్నం లో మా ఫెర్నాండెజ్ తో నా తను సంభాషణ వినెయ్యడం, వినేసి “అంత డబ్బు ఖర్చు పెట్టావంటే చంపేస్తాను” అని నాకు వినయంగా కాకుండా తన సొగసైన చూపుడు వేలు ఊడి పోయి కింద పడేంత విసా, విసా ఆడిస్తూ ఇంట్లోకి పరిగెట్టి ఆ రిమోట్ ని అందుకుంది. ఆ ఫెర్నాండేజుడికీ, ఈ రిమోట్ కీ నాకు ఎక్కడా కనెక్షన్ అందక అదేదో పరిశోధన చేద్దాం అని కుతూహలంగా చూడగా ఆ శ్రావ్యమైన గొంతుక రెండే రెండు మాటలు రెండే రెండు భాషలలో ఆ రిమోట్ ని ఇంచుమించు నోట్లో కుక్కేసుకుని, టీవీ కేసి లుక్కేసుకుంది మా క్వీన్ విక్టోరియా.
ఆ రెండు మాటలూ “కంటైనర్ గార్డెనింగ్”, “ఇంట్లోనే మొక్కలు పెంచుట” వగైరా...వెనువెంటనే ఆవిడని బాగా ఆకర్షించినవీ, నాకు ఒళ్ళు మండించినవీ "అమెరికాలో బిగినర్స్ కోసం వెజ్జీస్ పెంచడం కోసం 8 మాడర్న్ మెథడ్స్”, “ఇంట్లో కొట్టి మీరా”, “ఈజీగా మెంతి కూర గ్రో చెయ్యడం ఎలా?”ఇలా రకరకాల యూ ట్యూబ్ లంకెలు వచ్చి పడ్డాయి. ఏ రాయి అయితేనేమిలే అనుకునో, తెలిసో, తెలియకో వాటిల్లో “అమెరికా లో బిగినర్స్ కోసం అనబడే యూ ట్యూబ్ మీద కసిగా బాదింది మా క్వీన్ విక్టోరియా నాలుగు సెకండ్ల సేపు “వంటిల్లు శుభ్రం చేసే సబ్బు నురగ” ప్రకటన చూసి తరించగానే ఒకానొక పెట్టుడు పట్టు చీర కట్టుకుని వాళ్ళ వంటింట్లో నుంచి మనకి నమస్కారం పెడుతూ కనపడుతుంది. ఆవిడ ఆ సబ్బు నురగ వాడదు అని ఆ వంటిల్లు వాలకం చూడగానే మనకి అర్ధం అయిపోతుంది.
“హాయండీ. ముందు మా చానెల్ కి సబ్ స్క్రయిబ్ చెయ్యడానికి పక్కనే ఉన్న గంట కొట్టండి. అప్పుడు మీకు రోజు కొక యూట్యూబ్ మా అల్లుడు గారు పంపిస్తారు. ఆయన వర్కింగ్ ఫ్రమ్ హోమండి. అప్పుడు మీరు ఒక రోజు కొట్టి మీరా, మరొక రోజు మెంటి కూరా, పెసలూ, ఇలా నెల్లాళ్ళ లో అమెరికాలో మన హోమ్ లోనే అనీ గ్రో చేసుకోవచ్చును. అలా గ్రో చేసుకున్నాక ఎలా కుక్ చెయ్యాలో కావాలంటే మా అమ్మాయి చానెల్ కీ, అవి ఎలా తినాలో తెలియడానికి మా అల్లుడు గారి చానెల్ కి ఇచ్చిన లింక్ లు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నేను బిఫోర్ కోవిడ్ గైగోలు పాడు నుంచి మా అమ్మాయి సూద్దారానికి వొచ్చేనండి. తీరా వొచ్చాక ఇయన్నీ సరదాగా నేర్చుకోగానే అందరూ మాకూ లెర్నింగ్ సెయ్యమని అడుగుతా ఉంటే ఈ యూ ట్యూబ్ అవిడియా మా అల్లుడు గారు సెప్పారండి. సెప్పాను కదండీ ఆయన వర్కింగ్ ఫ్రమ్ హోమండి. గంట కొట్టారు గా. ఇప్పుడు మా సైట్ లోకి ఎంటర్ అయిపోదామాండీ?
అప్పుడు చూశాను. ఆ యూట్యూబ్ ని చూసిన వారు అక్షరాలా 98, 772 మంది చూస్తుండగానే అది 98, 773 కి పెరిగింది. ఇప్పుడు మా క్వీన్ విక్టోరియా తో కలిపి అనమాట. హారినీ, ఇంట్లో నే కొట్టి మీర లాంటివి పెంచుకుందాం అని ముచ్చట పడే వాళ్ళు ఇంత మంది ఉన్నారా అని అబ్బుర పడుతూ ఉండగా “ఒక్క బొట్టు కూడా మిగలకుండా అరక్షణం లోనే సబ్బు నురగ అంతా పీల్చి పారేసే కాగితం ముక్క” అనే మరొక ప్రకటన వచ్చింది.
తీరా చూద్దును కదా. ఈ పెద్దావిడ ఒకానొక సరిగ్గా అదే కాగితం ముక్కలు నాలుగు తీసుకుని, అందులో ఒక కప్పుడు ధనియాలు వేసి, అప్పడాల కర్రతో రుద్ది, రుద్ది, బద్దలు చేసి, మడతలు పెట్టిన ఆ కాగితాల పొరల మీద పైన నాలుగు నీటి చుక్కలు చల్లి, ఆ యూట్యూబ్ ఫాస్ట్ ఫార్వార్డ్ చేసింది. అంటే కేలండర్ తేదీ మారిపోయి రెండు రోజులయింది అనమాట. ఇక్కడ నేను గమనించిన ప్రగాఢమైన విషయం ఏమిటంటే సదరు అల్లుడు గారు తమ అత్త గారిని రెండు రోజుల తర్వాత కూడా అదే పెట్టుడు పట్టు చీర కట్టుకోవాలి అనైనా చెప్పి ఉండాలి, లేదా, ఆవిడ అల్లుడి మాట వినకండా కాస్ట్యూమ్ మార్పుకి ఒప్పుకోని మొండి అత్తగారు అయినా అయి ఉండాలి. ఇక మొత్తానికి అర గంట లో ఆ కేలెండర్ పది, పదిహేను రోజులు తిరిగాక, మరొక రెండు, మూడు ప్రకటనల తర్వాత కూడా అత్తగారూ – అదే పట్టు చీరలతో, అదే “గబ్బిలం తెలుగు యాస” లో బిగినర్స్ కోసం అమెరికాలో వంటింట్లోనే కొట్టి మీర కట్టలు కాయించారుట.
“చూశావా, మొగుడూ ఆ వెధవకి అనగా ఆ ఫెర్నాండెజుడి గాడికి వెయ్యి డాలర్లు ధార పోసే బదులు మూడు “ఇంట్లో కుండీలు” పెట్టి ఈ సారికి ఇలా కానిద్దాం. ఏమీ కొనక్కర లేదు. లక్ష్మి బ్రాండ్ ధనియాలు, మెంతులు పట్రా.” అంది మా క్వీన్ విక్టోరియా.
“మరి పచ్చి మిరపో?” – అవి లేందే మరి పని జరగదు కదా!
ఇక్కడే మా ఇద్దరికీ మొగుడూ-పెళ్ళాల ఆట మొదలయింది. అంటే, మనం పూర్వం రోజుల్లో అంటే పెళ్లి చూపుల రోజుల లాంటివి ఉండేవి కదా. అప్పటి రోజులన్నమాట. మొగుడేమో తన కంటే పొట్టిగా, ఉప’కారం’గా ఉండే అమ్మాయి కావాలి అనుకునే వాడు కదా. అదే ఆ అమ్మాయి తన కంటే పొడుగ్గా బాగా మమ’కారం’గా ఉండే వాడు కావాలని కోరుకునేది కదా. మా ఇద్దరికీ ఈ మిరప కాయల విషయంలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చి, ఆట మొదలయింది. ఆ చైనా వాడి మొక్కల దుకాణం లో ఆవిడేమో అతి చిన్నవిగా, బాగా కారంగా ఉండే ఆ థాయ్ మిరప మొక్కలు కొనమంటుంది. నేనేమో సన్నగా, పొడుగ్గా, కమ్మగా ఉండే మిరప కాయలు హాయిగా కొరుక్కుని తినొచ్చును కాబట్టి ఆ మొక్కలు కొంటాను అని నేను అంటాను. మా మొగుడూ, పెళ్ళాల ఆట ఆ చైనా వాడు చూసి, మా గొంతులు పెరగడం, జనాలు పోగవడం చూసి బెంగెట్టేసుకుని, ఆ రెండు రకాల మిరప మొక్కలూ చెరో రెండూ ఉచితంగానూ, అప్పటికే మేము ఆ చక్రాలు డబ డబ లాడుతున్న చక్రాల బండి మీద కుదేసిన నాలుగు వంగ మొక్కలూ, మూడు టొమేటో మొక్కలూ, రెండు బెండ మొక్కలతో సహా అన్నీ మా కారు ట్రంక్ లో కుక్కేసి మమల్ని అక్కడి నుంచి తరిమేశాడు. నమ్మండి, నమ్మక పొండి, అన్నీ కుండీల లో పెంచడానికే మాత్రమే. ‘వాటిని వేటినీ నేల మీద పాతను బాబోయ్’ అని నా చేత ముందే చేతిలో చెయ్యేసి వొట్టేయిచుకుంది మా క్వీన్ విక్టోరియా. అది చూసి ముచ్చట పడిపోయాడు పాపం అమాయకుడు ఫెర్నాండెజుడు. వాడికేం తెలుసు వాడి వెయ్యి డాలర్లు హుష్ కాకీ అని.
మొత్తానికి గత నెల్లాళ్ళగా నానా అవస్థా పడి ఇంట్లోనే కూరలు పండించే ప్రయత్నం లో కట్టల మాట దేవుడెరుగు ఒక్కటంటే ఒక్క ‘కొట్టి మీర’ ఆకు మొహం కూడా ఎలా మొలుస్తుందో చూడ లేదు. ఇక లాభం లేదు అనుకుని “ఏమోయ్, హనీ, ఇండియా స్టోర్ కి వెళ్తున్నాను. కొత్తి మీర మూడు కట్టలు చాలా, ఇంకా ఏమన్నా కావాలా?” అని అడిగాను మా క్వీన్ విక్టోరియా ని.
“ఆ చేత్తోటే రెండు కట్టలు మెంతి కూర, నాలుగు వంకాయలు, కాసిన్ని టొమేటోలు, థాయ్ మిరపకాయలూ కూడా పట్రా!” కిచెన్ లోంచి ఎంతో నీరసం గా మా క్వీన్ విక్టోరియా గొంతుక. తీరా చూస్తే పాపం ఆ హోమ్ కంటైనర్లు అన్నింటి లోంచీ, ఆ వెధవ పేపర్ టవల్స్ తీసి పారేసి, సబ్బు నురగతో కడుతోంది మా మహారాణి. అవును. ఆ బ్రాండే.
“ఒకే పట్టు చీర పది రోజులు కట్టుకుంటేనే కానీ వంటింట్లో ఏమీ మొలకలు రావు. ఎంత చెప్పినా విన్నావు కాదు” అని అర్జంటుగా ఆవిడ చేతికి అందకుండా బయటకి పారిపోయాను. “గుడ్ మార్నింగ్ , రాహూ” అంటూ ఎదురుగుండా కనపడ్డాడు నా ఆప్త మిత్రుడు ఫెర్నాండెజుడు.
కావాలంటే, శీతాకాలం లో నిర్జీవంగా అయిపోయిన మా తోట ఫోటో ఒకటీ, ఫెర్నాండెజుడి వెయ్యి డాలర్ల ప్రణాళిక ప్రకారం కాస్త పునరుధ్ధరించగలిగిన అదే తోట ఫోటో ఒకటీ- కనకాంబరాలతో సహా - ఇక్కడ జతపరిచాను.
*****