MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వంగూరి పి.పా- 29
అనుమానప్పిశాచి కథ
వంగూరి చిట్టెన్ రాజు
ప్రతీ వాడి జాతకమూ తాతముత్తాతల దగ్గర నుంచీ కూడా గాలిలోనే నిక్షిప్తం అయిపోయిన ఈ రోజుల్లో- అడగ్గానే గూగులమ్మ మనకి కూడా తెలియని, గుర్తు ఉండని, గుర్తు పెట్టుకోదల్చుకోని విషయాలు మనకే కాదు ఆయా ఇన్స్యూరెన్స్ వాళ్ళకి కూడా చెప్పేసే ఈ అమెరికా దేశంలో ఇంత మంది అనుమానప్పిశాచాలు ఎందుకున్నారో నాకైతే అర్ధం కాదు. ఏ రకమైన ఇన్స్యూరెన్స్ కంపెనీని తీసుకున్నా అందందే కలదు ఒక అనుమానప్పిశాచి...లేదా పిశాచుడు.
పైకి ఎంతో మర్యాదగా మాట్లాడుతూనే, తన కంప్యూటర్ లో అన్నీ చూస్తూనే మనల్ని ఆ చచ్చు ప్రశ్నలు ఈ భీమా గాళ్ళు ఎందుకు అడుగుతారో కూడా తెలీదు. భీమా గాళ్ళు అంటే- మనకి ఏదైనా ఇన్స్యూరెన్స్ కావలసి వస్తే ముందు ఆన్-లైన్ లో ఒక అతి చిన్న మాట గూగుల్ చెయ్యగానే మనల్ని తగులుకునే వాళ్లన్న మాట. ఇంతకీ విషయం ఏమిటంటే, కొత్త సంవత్సరం వచ్చింది కదా! అదెప్పుడూ నా ప్రాణాలకి ప్రాణ సంకటమే. ఒకటి కాదు, రెండు కాదు, పంచ ప్రాణాల సంకటం. కారు, ఇల్లు, మెడికేర్, ఆరోగ్యం, మందుల కొనుగోలు - ఇవే ఆ పంచ ప్రాణాలు. ఏడాది పొడుగునా విశ్రమించి, అప్పుడు ‘నాకు కొత్తది కొనిపెడతావా. పాతదే కంటిన్యూ చేస్తావా. అస్సలు ఏమీ చెయ్యవా?” అని ఆ ఐదు ఇన్స్యూరెన్స్ ల వాళ్ళూ నాకు మెసేజ్ ల మీద మెసేజ్ లు పంపించడం సుమారు అక్టోబర్ నెలాఖరు నుంచి మొదలెడతారు. ఎందుకంటే నా విషయంలో వీటన్నిటికీ కొత్త సంవత్సరం నాడు కాలదోషం పడుతుంది.
ముందుగా మాకున్న రెండు కార్ల ఇన్స్యూరెన్స్ సంగతే తీసుకుందాం. “చెప్పకులే. వాటి వయసుకీ, నీకూ పెద్ద తేడా లేదు” అంటుంది మా క్వీన్ విక్టోరియా నిట్టూరుస్తూ. అంటే ఇక్ష్వాకుల నాడు కొని, వాటి మీద లక్ష మైళ్ళు దాటిన వయసు కార్లు అనమాట. అమెరికాలో రోజూ టీవీలో చూసే ప్రకటనలు లిబర్టీ మ్యూచువల్, గైకో, ఆల్ స్టేట్, ఫార్మర్స్- ఇలా పది దాకా ఉంటే, టీవీ ప్రకటనలు రానివి మరో సవా లక్ష ఉంటాయి. వీటన్నింటికీ ఒకే ఒక కామన్ సిధ్ధాంతం ఉంది. అదేమిటంటే - ఏదో ఒక ఏడు మనల్ని తక్కువ ప్రీమియమ్ తో మభ్య పెట్టి, మీరు వాళ్ళ ఇన్స్యూరెన్స్ తీసుకోగానే, ఏడాది తర్వాత రిన్యూవల్ సమయానికి ఆ ప్రీమియమ్ పొలోమని పెంచేయడం. కానీ మనమేమన్నా తక్కువ వాళ్ళమా? అసలు సిసలు పవిత్ర భారతీయులం.అందునా తెలుగు పుట్టుకాయే. అంచేత ప్రతీ ఏడూ కనీసం అరడజను కారు ఇన్స్యూరెన్స్ వాళ్ళ రేట్లు తెప్పించుకుని ఎవడు చవగ్గా ఉంటే అక్కడికి జంప్!అసలు పద్మవ్యూహం అంతా ఇక్కడే ఉంది. మనం నానా అవస్థా పడి, బ్రిలియంట్గా లెక్కలు వేసేసుకుని ఫలానా గణేశా భీమా కంపెనీది అతి తక్కువ రేటు అనుకుంటామా? రేటు తక్కువే కానీ కవరేజ్ తక్కువ ఉంటుంది. ఆ దిక్కుమాలిన డిడక్టిబుల్, అంటే ఏదైనా ప్రమాదం జరిగితే మనం ముందు కట్టవలసిన డబ్బు రెట్టింపు ఉంటుంది. లేదా, మనం అవతలి వాడిని గుద్దితే పది డాలర్లూ, అవతలి వాడు మన కారుని ఢీకొని పచ్చడి చేస్తే పావలా మాత్రమే ఇచ్చుటా - ఇలా చాలా తేడాలు ఉంటాయి. అన్నీ లోపల ఎక్కడో దాక్కుని ఉంటాయి. ఐదారు కంపెనీలలో ఇలా ప్రతీ అంశాన్నీఒక దానికొకటి పోల్చి చూడగలిగితే దానికి ఒక డాక్టరేట్ డిగ్రీ వచ్చేస్తుంది. అమెరికా పరిభాషలో చెప్పాలంటే ఏపుల్స్ నీ ఆరెంజెస్ నీ పోల్చినట్టే. ఈ కార్ల ఇన్స్యూరెన్స్ పరిభాషలో ‘అమెరికొలిజన్’ మరియు “అమెరికాంప్రెహెన్సివ్” అనే మాటలకి నాకు ఈ జన్మలో సరి అయిన అర్ధాలు తెలియవు. మన కారు అవతలి వాడు, కొండొకచో మనమే అవతలి వాడి కారుని ఢీకొడితే ఎవడు ఎవడికి ఎంత ఇవ్వాలీ అనేదే ఈ రెండు మాటలూ నిర్ణయస్తాయిట. ఇక అప్పుడప్పుడు సరదాగా ఏదో ఫ్రీ వే మీద పదేసి కార్లు ఎడా పెడా గుద్దేసుకుని చక్కర్లు కొట్టుకుంటే ఇక అంతే సంగతులు. ఈ దిక్కుమాలిన కొలిజన్, కాప్రెహెన్సివ్ లెక్కలు హుష్ కాకే కదా!
ఇక ఈ ఏడు అంటే 2023 లో మా ఇంటి ఇన్స్యూరెన్స్ సంగతే తీసుకుంటే, మాకు ప్రస్తుతం ఉన్న కంపెనీ వారు ఈ ఏడు రేటు 40 శాతం పెంచేశారు. ఎందుకంటే కిందటేడు శీతాకాలం టెక్సస్ లో చాలా మంది తమ ఇళ్ళకి డేమేజ్ అయింది అని ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం బాగా వాయించారుట. ఆ వాయింపు ఇప్పుడు ఏ పాపం ఎరగని నాకు తగులుకుంది అన్నమాట.
ముందుగా అవతలి వేపు నుంచి మాట్లాడుతున్నది కంప్యూటర్ అమ్మాయి ఎక్కడో ఫిలిప్పీన్స్ లోనో, తైవాన్ లోనూ కాకుండా ఇక్కడే పవిత్ర అమెరికాలోనే ఉన్న ఆడపిల్ల అనీ నిర్ధారించుకున్నాను. ఆ తర్వాత మా సంభాషణ ఇలా జరిగింది.
“గత పాతికేళ్ళుగా నేను ఒక్కసారి కూడా ఏదో తుఫాను, వరద, అగ్ని ప్రమాదం వగైరాల వలన మా కొంప ములిగింది అని మిమ్మల్ని పైసా కూడా అడగకుండా మీరు అడిగినంత ప్రీమియం కడుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇలా హఠాత్తుగా 40 శాతం పెంచేస్తే ఎలా?” – నా ఆక్రోశం.
“మీతో మాట్లాడడం చాలా సంతోషం. మీ పూర్తి పేరు, చిరునామా?” -అనుమానప్పిశాచి అనుమానం.
‘ఇప్పుడే అన్నీ చెప్పానుగా”
“ఇప్పుడు మన ఆత్మీయ సంభాషణ రికార్డు చెయ్యడానికీ, దీనిని ఇతర భీమా ఉద్యోగస్థుల కి ట్రైనింగ్ కోసం కానీ, మరెందుకైనా కానీ ఉపయోగించుకోడానికి మీరు అనుమతి ఇస్తారా? చస్తారా?” అనుమానప్పిశాచి.
“ఇవ్వక చస్తానా? ఇచ్చెదను. ఇంతకీ నా ఇంటి ఇన్స్యూరెన్స్ సంగతి ఏమిటి?’’
“ధన్యవాదములు. దయచేసి కాస్సేపు ఆగండి. మీ ఎకౌంట్ వివరములు చూచెదను.”
పది నిమిషములు భయంకర నిశ్శబ్దం. ఆ పిల్ల ఉందో, ఊడిందో తెలీదు. ప్రపంచం లో అంత కంటే దుర్భరమైన వైటింగ్ సమయం క్వీన్ విక్టోరియాతో మూడు ముళ్ళూ వేసెయ్యడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నప్పుడు ముందు పది నిమిషాలూ పురోహితుడి గారు అలా మంత్ర ఘోష పెడుతూ ఉండడమే అనే చెప్పుకోవాలి.
“మీ పుట్టిన తేదీ ఏమిటి? - అనుమానప్పిశాచి పునఃప్రవేశం.
“ఎందుకా అనుమానం? ఇందాక చెప్పానుగా”
“మీ చిరునామా”
“మళ్ళీనా? ఇందాక చెప్పానుగా”.
ఇలా ‘ఇందాక చెప్పానుగా‘ అనే నా ఉవాచ “ఇహ నేను చస్తే ఇంకేమీ చెప్పనుగాక చెప్పను. అన్నీ నీ కంప్యూటర్ లోనే చూసుకో అమ్మాయ్” అనే దాకా వచ్చింది. లేకపోతే ఏమిటి చెప్పండి. మీ ఇల్లు వైశాల్యం ఎంత, ఎన్ని అంతస్తులు, ఎన్ని బాత్ రూములు, రోజుకి ఎన్ని సార్లు వాడతారు? ఇది వరకూ ఎప్పుడైనా నిప్పు అంటుకుందా, వరదల్లో ములిగిందా? ఇవన్నీ తెలిసీ అడగడం ఆ అమ్మాయి అనుమానం పిశాచి కాకపోతే మరెందుకూ? పైగా అన్నీ ఆ పిల్ల ఎదురుగుండా కంప్యూటర్ లో కనపడుతూనే ఉంటాయి. నిజానికి ఆ గూగుల్ ఫొటోలో మా ఇల్లంతా పైనా, లోపలా ఆ పిల్లకి కనపడుతూనే ఉంటుంది. అయినా అడుగుతూనే ఉంటుంది.
“ఇంతకీ మీ ఇంటి పెంకుల వయసు ఎంతా? -అనుమానప్పిశాచి ఆఖరి ప్రశ్న.
“మా ఇంటి పెంకుల వయసు మా అర్ధాంగి వయసు కన్నా నలభై ఏళ్ళు తక్కువ, ఆవిడ వయసు మా పెళ్ళినాటికి నాకంటే తొమ్మిదేళ్లు తక్కువ. నాకు 29వ ఏట పెళ్ళయింది. నా పుట్టిన రోజు ఇందాకా నాలుగు సార్లు అడిగావు కదా. ఇప్పుడు మా ఇంటి పెంకుల వయసు నువ్వే లెక్కెట్టుకో! అన్నట్టు ఈ ఇల్లు కొన్నాక, పెంకులు మార్చలేదు. అలాగే మా మొగుడూ-పెళ్ళాం ఇద్దరం కూడా ఒరిజినలే. ఆవిడ సంగతి తెలీదు కానీ నాకు మార్చే ఉద్దేశ్యం లేదు.” – నా ఆవేశం.
“అటులనా...మీ ఇంటికి ఇన్స్యూరెన్స్ నా వల్ల కాడు...సారీ..వల్లకాదు. మా సూపర్ వైజర్ మాత్రమే దానికి అర్హులు. మిమ్మల్ని ఆయనకి తగిలిస్తాను. మా కంపెనీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మీతో మాట్లాడుట ఎంతో ఆనందముగా యున్నది”. దాం దుంపదెగా. ఇంత కన్న అబధ్దం మరొకటి ఉంటుందా?
మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం. పది నిమిషాల తర్వాత సూపర్ వైజర్ వీరుడి ప్రవేశం.
“మీరు ఇంకా 20 ఏళ్ళ వయసు ఉన్న పాత బడిపోయిన పెంకుల ఇంట్లోనే ఉంటున్నందున, దానికి నిప్పు అంటుకున్న యెడల భగ్గు మని కాలిపోవును కావున మీకు ఇన్స్యూరెన్స్ నిరాకరించబడింది. కొత్త పెంకులు వేయించాక మళ్ళీ పిలవండి. అంత వరకూ గుడ్ బై”...అని ఆ సూపర్ వైజర్ క్షణాలలో తేల్చేశాడు.
పెంకుల మంట దేవుడెరుగు,నాకు మటుకు ఒళ్ళుమండి పోయి “మరి మా పెళ్ళి వయసు అంతకు రెట్టింపు పాతది కదా. అదీ మార్చమంటావా?’ అని అరిచాను కానీ అవతలి వేపు అంతా నిశ్శబ్దమే!
ఇలా గత నెల్లాళ్ళుగా ఈ పంచ ప్రాణాలకీ భీమా ఏర్పాట్లు చేసుకోవడంతోటే కుస్తీ పడుతున్నాను. అన్నట్టు మర్చేపోయాను. ఈ మధ్య నాకు ఆరో ప్రాణం వాళ్ళు కూడా తగులుకున్నారు. అదేదో “శ్మశానం ఇన్స్యూరెన్స్”ట. అంటే మనం బాల్చీ తన్నేస్తే కావలసిన ఏర్పాట్లకయ్యే ఖర్చులు వారు ఇస్తారుట. ప్రీమియం ఎంతో తెలీదు. ఇక ఆ అనుమానప్పిశాచులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తల్చుకుంటేనే పై ప్రాణాలు పైకే పోతున్నాయి!
ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు జరిగినా, ఎన్ని మార్పులు జరిగినా, కేవలం కేలండర్ లో తేదీ మార్పు మాత్రమే జరిగినా అందరి జీవితం ఆహ్లాదంగా, సుఖసంతోషాలతో జరగాలని కోరుకుంటూ - అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
****