MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
పుస్తక విమానం కథ
వంగూరి చిట్టెన్ రాజు
సెప్టెంబర్ 23-24, 2017 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ లో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు మరియు మొట్ట మొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. సుమారు 160 మంది ప్రతినిధులు, 30 సాహిత్య ప్రసంగాలు, పుస్తక విక్రయ శాల వగైరాల తో రెండు రోజులు అందరం సాహిత్యానందం అనుభవించాం. నాకు వ్యక్తిగతంగా మటుకు భలే ఇబ్బందులు వచ్చాయి. ఎప్పటి లాగానే ఇలాంటి సభలకి విరాళాలు రావు కాబట్టి నేను పడే ఆర్థిక ఇబ్బందుల మాట కాదు... పుస్తక విమానాల బాధ.
విషయం ఏమిటంటే... ఈ సదస్సు కోసం నేను వాషింగ్టన్ వెళ్ళడానికి ఎక్కే విమానానికి ‘పుస్తక విమానం’ అని పేరు పెట్టుకున్నాను. అలా అంటే సరస్వతీ దేవి నన్ను కటాక్షించి నా విమాన ప్రయాణాలు ఇబ్బంది లేకుండా జరుగుతాయేమో అని ఆశ. కానీ నా జాతకం ఇలా ఉంటే ఆవిడ మటుకు ఏం చెయ్యగలదూ? ఆ వ్రాత వ్రాసింది వాళ్ళాయన బ్రహ్మ గారే కదా.
ముందుగా విమానాశ్రయం లో కారు పార్కింగ్ దగ్గర మొదలయింది నా మొదటి పుస్తక విమాన కష్టం. ఎందుకో తెలీదు కానీ, నేను ఎప్పుడు వెళ్ళినా, పార్కింగ్ భవనం ఐదారు అంతస్తులలో ఏ అంతస్తు లో పార్క్ చేసినా దాని దుంప తెగ నాకు ఎప్పుడు పార్కింగ్ స్పాట్... ఎలివేటర్ కి ఆమడ దూరం లోనే ఉంటుంది. అంటే ఒక పెద్ద పెట్టె, కంప్యూటర్ సంచీ… అన్నీ మైలు దూరం నానా అవస్థా, ఆయాసం పడుతూ లాక్కుని వెళ్ళాలి. ఆ పెట్టెలకి చక్రాలు ఉన్నాయిగా అంటారేమో. కానీ నా జాతకం ప్రకారం నాలుగు చక్రాలలో మూడు మాత్రమే పనిచేస్తాయి. అన్నీ పెట్టెలకీ కుంటి కాళ్ళే. అక్కడ తోపుడు బళ్ళు ఉంటాయి కదా అంటారా? భలే వారే. అవి కూడా ఆ ఎలివేటర్ దగ్గరే ఉండి చస్తాయి. అన్నట్టు ఇప్పుడే ఈ ఎలివేటర్, లిఫ్ట్ అనే అంగ్ల పదాలకి తెలుగు మాట ఏమిటీ అని గూగుల్ వారిని అడిగాను. వారు ఎలివేటర్, లిఫ్ట్ అనే సమాధానం చెప్పారు. నేను ఎంత గింజుకున్నా ఆ మాటలని తెలుగు లో ఎలా వ్రాయాలో తెలీడం లేదు. పైకీ కిందకీ పాకే పెట్టె అనుకున్నాను కానీ నప్ప లేదు. సారీ…
సరే, కష్ట పడి ధగ ధగ లాడే దీపాలు వెలుగుతున్న పుస్తక విమానం లాంజ్ (ఈ తెలుగు మాట కూడా గూగుల్ వారే చెప్పారు) లోకి వెళ్లి పెట్టెలు వాళ్ళ మొహాన కొట్టి, ప్రవేశ పత్రం తీసుకుని చేతి సంచీ తో భద్రతా గుమ్మం (ఈ మాట నా సొంతం ..ఎందుకంటే గూగుల్ వారి మీద నమ్మకం పోయింది.) దగ్గరకి వెళ్తే అక్కడ పెద్దాపురం చేంతాడంత క్యూ.. అన్ని వందల మందిని చూసి పుస్తక విమానం ఖచ్చితంగా తప్పిపోతానని భయం వేసింది. సరే, అరగంట తర్వాత ఆ భద్రతా బెల్టు దగ్గర వారి ఆదేశాల ప్రకారం నా బెల్టు, గిల్టు చెప్పులు, పర్సు, సెల్ ఫోన్... ఒకటేమిటి చొక్కా, లాగూ, చెడ్డీ తప్ప అన్నీ ఆ యంత్రం లోకి తోసేసి నేను కూడా మరో మాంత్రికుడి గుహలో అడుగుపెట్టాను. అక్కడ చేతులు పైకెత్తి ఏదో వెధవ పని చేసిన వాడిలా నుంచున్నాను. ఆ యంత్రం నా చుట్టూ ఒక సారి చుట్టు ముట్టి కుయ్యో , మొర్రో అంది. నాకు భయం వేసి ఏడుపు మొహం పెట్టాను. అప్పుడు ఆ భద్రత బంటు వాడు నన్ను పక్కకి తీసుకెళ్ళి మరో చేతి యంత్రంతో చుట్టు ముట్టినా అది కూడా అలాగే గొడవ చేసింది. నేనేం చేసేది లేక చస్తుంటే ఈ రహస్యం ఛేదించడం కోసం కఠోర నిర్ణయం తీసుకున్న ఆ భద్రత వాడు సొంత చేతులతో నా ఒళ్లంతా తడమడం మొదలెట్టాడు. అదేదో భద్రత అమ్మాయి సున్నితమైన తడుపుడు అయితే బావుండును అని ఆ క్షణం లో ముచ్చట పడినా...వాడి ఆత్మీయ తడుముడికి సహజంగానే నాకు కిత కితలు వచ్చాయి. నవ్వితే తంతాడేమో అని నేను ఉగ్గ బట్టుకుని సిగ్గు పడుతుంటే వాడి చేతికి నా పంట్లాం వెనక జేబులో ఏదో తగిలింది… వాడు కొంచెం ఆవేశంగా నా జేబులో చెయ్యిగాని పెడతాడేమో అనుకున్నాను కానీ నన్నే తియ్యమన్నాడు. తీరా చూస్తే అది ఒక పెన్నీ నాణెం. పర్సు లోంచి పడి పోయి ఉంటుంది. ఎక్కువ విలువ లేని ఒక చిన్న నాణెం. అయినా నన్ను టెర్రరిస్ట్ స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసిందన్న మాట.
ఆ గండం నుంచి బయట పడిన తర్వాత ఘట్టం పుస్తక విమానం లోపలి వెళ్ళే గుమ్మం... అనగా బోర్డింగ్ గేట్... మళ్ళీ దాని దుంప తెగా… ఇది కూడా ఎప్పుడూ చిట్ట చివరే ఉంటుంది వాడు గేట్ నెంబర్ ఒకటి అంటే ఆ మైలు దూరం ఉన్న వరండాలో అటు వేపు నుంచి ఒకటి. లేదా గేట్ నెంబర్ 45 అంటే అది అదే మైలు దూరం వరండాలో ఇటు వేపు నుంచి 45… ఎటు నుంచి ఎటు నరుక్కొన్నా...మన గమ్యనికి అది ఆఖరి గుమ్మమే. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే భవదీయుడు కాస్సేపు కూర్చుని విశ్రమించడానికి ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేదు. ఓరి నాయనోయ్ అనుకుని నా ప్రవేశ పత్రం చూడగానే... గుండె గుభేలు మంది. ఎందుకంటే ఈ ప్రవేశ పత్రంలో తమరు ఎన్నో బోర్డింగ్ గుంపు లో ఏ సంఖ్య లో ఉంటారో అలాగే విమానం ఎక్కాలి. ఎవరు ముందు లోపలికి వెళ్తే అంత మంచి సీటు వస్తుంది. బ్రహ్మ వ్రాత ప్రకారం నాది ఆఖరి గ్రూప్ లో ఆఖరి నెంబరు. అనగా మా చిన్నప్పుడు అందరి భోజనాలూ అయ్యాక, ఇంటి బయట వరండాలో మా ఆఖరి పనివాడికి వేసిన విస్తరాకు లాంటిది అన్నమాట. అనగా... మిగతా ప్రయాణీకులు అందరూ పుస్తక విమానం లో మంచి కుర్చీలలో కూచోగా ఆఖర్న మిగిలిన డొక్కు కుర్చీ మనది అన్నమాట. ఈ ఆఖరి కుర్చీ ఎప్పుడూ ఆఖరి వరసలో ముగ్గురులో మధ్య కుర్చీ. అనగా వెనక వేపు టాయ్ లెట్ గోడ. అనగా సరదాగా ఒక బటన్ నొక్కి కుర్చీని కులాసా పొజిషన్ లో పెట్టే అవకాశం లేక “కుర్చీలో శవం”… భంగిమ... ఆ పాత్ర అద్భుతంగా పోషించాను. ఎందుకంటే ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు 20 గంటలు రిహార్సల్ చేశానుగా...
తీరా ఆఖరి వాడిగా పుస్తక విమానం లో ఆఖరి కుర్చీలో కూచున్నానా... అక్కడ మరో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే విమానం కిటికీ పక్కన కూచున్నావిడ నల్లగా ఉంది అని మాత్రమే కాకుండా శారీరక వివరాలని బట్టి ఆమె పేరు తాటకి అని నా అనుమానం. ఆవిడ వ్యక్తిగత వివరాలు నాకు అనవసరమే కానీ నా మధ్య కుర్చీలో ఆవిడ పిష్ఠ భాగం సగం పైగా ఆక్రమించడం అంత సంఘ మర్యాద అనిపించలేదు. గత్యంతరం లేక నేను కుదించుకు పోయి, నా సైజు తగ్గించుకోడానికి కాలు మీద కాలు వేసుకుని మధ్య సీటులో సగం భాగం లోనే సద్దుకొన్నాను. కానీ రెండో పక్క సీటులో మరో ఇబ్బంది వచ్చింది. ఈవిడ పరవాలేదు కానీ భుజం మీద ఒకానొక చంటి వెధవ వేళ్ళాడడం తో ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఆ చంటి వెధవకి కుదురు లేదు. తలకాయ అమ్మ వేపు పెట్టి కాళ్ళు నా లాంటి ప్రముఖ వ్యక్తి మొహం మీదా, ఇతర చోట్లా ఎడా పెడా తన్నడం వాడికి సరదాగానే ఉంది కానీ నాకు ప్రాణ సంకటంగా పరిణమించింది. పైగా ఈ తెల్లావిడకి అటు నల్లావిడ, పక్కనే తూ.గో జిల్లా గోధుమ రంగు చిన్నాయనా తో ప్రయాణం చెయ్యడం అంత ఇష్టం ఉన్నట్టు లేదు. లేకపోతే ఆ చంటి వెధవ గొంతెత్తి అరుస్తూ , ఏడుస్తూ మూడు గంటలు నిర్విరామంగా నన్ను ఎందుకు ఏడిపిస్తాడు? వాళ్ళ అమ్మ గిల్లి ఉండకపోతే!
ఏది ఏమైతేనేం... పట్టు వదలని విక్రమార్కుడి లా నా పుస్తక విమానం ప్రయాణం పూర్తి చేసి వాషింగ్టన్ వెళ్లి 10 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కి వెళ్లగలిగాను.
మరదే... తిరుగు ప్రయాణంలో పుస్తక విమానం ఫ్లైట్ తప్పిపోయి రాత్రి అంతా ఆ విమానాశ్రయంలోనే గడిపి... వాషింగ్టన్ నుంచి హ్యూస్టన్ కి రావడానికి 24 గంటలు గడిపిన ఖ్యాతి కూడా భవదీయుడిదే… ఎందుకు లెండి.. . డోలు వెళ్లి మద్దెల తో మొరపెట్టుకుందిట.
***