MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
ఎస్పీ బాలూ – నేనూ – 40 ఏళ్ళూ
వంగూరి చిట్టెన్ రాజు
అతను నాకు పరిచయం అయినప్పుడు సినీ పాటల రంగంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం మొదలు పెట్టిన యువ గాయకుడు. ఆ తర్వాత గత సుమారు 40 సంవత్సరాలలో అనేక రంగాలలో ఆ ఎవరెస్ట్ శిఖరం దాటి పోయి, ఇంకెవరూ అందుకో లేని ఎత్తుకి ఎదిగి, అంత కంటే ఒదిగి ఉంటూ, నాలాంటి సర్వ సాధారణమైన వాడి స్నేహాన్ని కూడా పదిలంగా పొదివి పట్టుకున్న ఒకే ఒక్కడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. నేను బతికి ఉండగా అతని “జ్ఞాపకాల“ తో ఇటువంటి వ్యాసాన్ని వ్రాయవలసి వస్తుంది అని కలలో కూడా అనుకో లేదు. ఏ నాడూ కనదల్చుకోని ఆ కలనీ, అనుకోని ఆ వ్యాసాన్నీ వ్రాయిస్తూ, యావత్ భారత జాతికీ, అందునా తెలుగు వారికీ మరొక సారి అన్యాయం చేసి, అకాలంగా తనలో ఐక్యం చేసుకున్న ఆ దేవుడి మీద చాలా కోపంగా ఉంది. ఇక కలకాలం తన దగ్గరే గంధర్వగానం బాలూ ఆలపిస్తూ ఉంటాడు అని అనుకుంటున్న ఆ దేవుడి కి “అబ్బే, భూగోళం మీద సంగీతం ఉన్నంత కాలం బాలూ ఇక్కడే ఉంటాడు” అని ఖరాఖండీగా చెప్తున్నాను.
బాలుతో సుమారు నలభై ఏళ్ల అనుబంధం గురించి నలభై పేజీలు సునాయాసంగా వ్రాయగలను కానీ, అతనితో మొదటి సారి ఏర్పడిన స్నేహ పరిమళాన్ని మాత్రమే ఈ వ్యాసం లో ప్రస్తావిస్తాను.బాధాతప్త హృదయంతో.
అది 1981 ఆగస్ట్ అని జ్ఞాపకం. అప్పటికి అఖండ విజయం సాధించిన శంకరాభరణం చిత్ర బృందాన్ని మా హ్యూస్టన్ ఆహ్వానించి, “శంకరా భరణం నైట్” అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించే అదృష్టం నాకూ, అనిల్ కుమార్ కీ కలిగింది. ఈ బృందం లో సభ్యులు కె. విశ్వనాథ్ గారూ, ఏడిద నాగేశ్వర రావూ, జె.వి. సోమయాజులూ, సాక్షి రంగారావూ, తులసి, మాధవపెద్ది సురేష్, గణేష్, ఈశ్వర్, శేషగిరి మొదలైన ఐదుగురు మ్యుజీషియన్స్. మరియు ఎస్. పీ బాలూ, భార్య సావిత్రి గారూ, ఏడెనిమిదేళ్ళ కొడుకు చరణ్, పది పన్నెండేళ్ళ కూతురు పల్లవి, ఇంకా వోణీలు వేసుకున్న చెల్లెలు ఎస్. పీ శైలజా వెరసి సుమారు 15 మంది, వాళ్ళ 30 పైగా సూట్ కేసులూ, వాయిద్యాలూ....ఇండియా నుంచి ఏ కళాకారులు వచ్చినా విమానాశ్రయం లో స్వాగతం పలికి, ఆహ్వానించి ఇళ్ళలో ఆత్మీయంగా ఆశ్రయం ఇవ్వడం అప్పటి మా ఆచారం. మా అందరివీ కార్లు చిన్నవే కానీ మనసులు పెద్దవే అని కూడా చెప్పుకోవచ్చును.
మొత్తానికి ఎన్నికార్లు కావాలి అని లెక్క వేసుకుని ఐదారుగురం హ్యూస్టన్ విమానాశ్రయానికి వెళ్ళి ఈ శంకరాభరణం బృందానికి స్వాగతం చెప్పాం. అక్కడో తమాషా జరిగింది. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరు ఎవరి ఇంట్లో ఉండాలీ అని విశ్వనాథ్ గారితో సహా అక్కడికక్కడ వాటాలు, వంతులూ వేసుకోగా, మిగిలిన ఐదుగురు మ్యుజీషియన్స్ నీ ఎవరూ పట్టించుకోక పోవడం నేను పట్టించుకున్నాను. “ఈ ఐదుగురు వాయిద్య బృందం మా ఇంట్లో ఉంటారు” అని నేను అనీ అనగానే ఈ ఎస్పీ బాల సుబ్రమణ్యం హఠాత్తుగా నా కేసి చూసి” ఈ పొట్టాయన ఎవరో కానీ, నేనూ ఆయన ఇంట్లోనే ఉంటాను” అన్నాడు. నిజానికి “పొట్టాయన” అని ఆయన అన లేదు కానీ అతను అప్పుడు నా భుజం మీద చేసిన చెయ్యి అర్ధం అదే. అంతే....బాలూ కుటుంబం, అప్పటికి ఇంకా కీ బోర్డ్ ప్లేయర్ గానే ఉన్న మాధవపెద్ది సురేష్, మిగతా నలుగురూ కలిపి మా చిన్న మూడు గదుల ఇంట్లో సద్దుకున్నారు. సద్దుకోవడం అంటే, బాలూ కుటుంబం అంతా ఒకే ఒక మంచం ఉన్న చిన్న గదిలో! ఆ గదిలోనే అంతకు కొన్ని నెలల ముందే మహాకవి శ్రీశ్రీ గారు ఉన్నారు. నేను సరదాగా ఆ మాట చెప్పగానే అప్పుడే ఆ గదిలోకి వెళ్ళి మంచం మీద కూచున్న బాలూ ఠపీమని లేచి నుంచుని- ”రాజు గారూ, నేను అదే మంచం మీద పడుకోడానికి అర్హత లేదు” అని కాస్సేపు లబ లబ లాడిపోయాడు. ఆ మాటతో నాలుగైదు రోజులూ ఇద్దరం కార్పెట్ మీదనే దుప్పటీ వేసుకుని పడుకున్నాం. అప్పటికే బాలూ అనే ఈ యువకుడు ఘంటసాల గారి మత్తు నుంచి తెలుగు జాతిని తన వేపు మళ్ళించుకుంటున్న అసమాన గాయకుడు. గాన గంధర్వుడు అనే శాశ్వత ముద్రకి పునాది పడిన శంకరా భరణం సినిమా గాయకుడు.
ఇక్కడో చిన్న తమాషా. ఓ రోజు అర్ధరాత్రి ఎక్కడో శబ్దాలు వినపడుతూ ఉంటే లేచి చూశాను. బాలూ సోఫాలో కూచుని టీవీ చూస్తున్నాడు. “ఏమిటి మేష్టారూ, నిద్ర పట్టడం లేదా?” అని అడిగాను. “అబ్బే అదేం లేదు. ఇండియాలో మాకు కలర్ టీవీలు లేవు. ఉన్నా ఇలా చూసే సమయం ఉండదు కదా” అన్నాడు కానీ అతనికి నేల మీద పడుకోవడం ఇబ్బంది గానే ఉంది అనీ, హంస తూలికా తల్పం మాట దేవుడెరుగు, కనీసం మెత్తటి పరుపు అయినా వెయ్యలేకపోయానే అని ఇప్పటికీ నాకు బాధగానే ఉంటుంది. మరొక 35 ఏళ్ళ తరవాత హైదరాబాద్ లో hmtv వారు ఏర్పాటు చేసిన SPB 50 అభినందన సభలో నేను కూడా పాల్గొన్నప్పుడు తన స్పందనలో బాలూ ఆనాటి మా ఆతిధ్యం, మా ఇంటి వెనకాల ఉన్న ద్రాక్ష పందిరీ, ఇతర విషయాలూ మాట్లాడాడు కానీ ఈ విషయం మటుకు ప్రస్తావించనే లేదు.
ఇక ఆ మర్నాడు సాయంకాలం ఒక పెద్ద ఆడిటోరియంలో పెట్టిన ఈ కార్యక్రమానికి మధ్యాహ్నమే వెళ్ళిపోయాం నేనూ బాలూ, సురేషూ, మ్యుజీషియన్స్ తో సహా. డబ్బులు పుచ్చుకుని అన్నీ సమకూర్చే సాంకేతిక నిపుణులని భరించే ఆర్ధిక స్తోమతా, అలా అందుబాటులో ఉండే ఇండియన్ వాళ్ళు కూడా లేని ఆ రోజుల్లో ఇంచుమించు అన్ని తెలుగు కార్యక్రమాలకీ అనిల్ కుమార్ ఆడియో ఏర్పాట్లు అన్నీ చేసేవాడు. నేను సహాయం చేసేవాడిని. కనీసం ఖర్చులు ఇవ్వడానికి కూడా అతడిని భలే ఇబ్బంది పెట్టేవారు. అయితే ఈ శంకరాభరణం నైట్ నిర్వహణ మాదే కాబట్టి మైకులూ, సింథసైజర్, పెద్ద పెద్ద స్పీకర్లూ వగైరాలు అన్నీ ఏర్పాటు చేశాక, బాలూ అన్నీ చెక్ చేసి “అపూర్వ సోదరులారా. ఫీడ్ బాక్ మానిటర్లు ఏవీ?” అన్నాడు అనిల్ నీ, నన్నూ ఉద్దేశించి. మా గుండెల్లో రాయి పడింది. మేము ఇద్దరం ఆ మాటే మర్చిపోయాం. “ఫీడ్ బాకే లేక పోతే మేము ఏం పాడుతున్నామో మాకు తెలీదు. హాయిగా అపశృతులు పాడేస్తాం” అని బాలూ, అప్పటికప్పుడు ఎక్కడి నుంచి అవి తేగలమా అని మేమూ గిజ గిజ లాడిపోతూ ఉంటే బాలు ఒక్క సారి “రాజు గారూ కారెక్కండి. మీ ఇంటికి వెళ్దాం” అని నా భుజం మీద చెయ్యి వేసి ముందుకి తోశాడు. నేనూ, అనిలూ అతని కేసి అదోలా చూడగానే “రాజు గారూ, మీ ఇంట్లో టీవీ పక్కనే రెండు స్పీకర్లు ఉన్నాయి. అవి ఫీడ్ బాక్ మానిటర్స్ గా కరెక్ట్ గా పనిచేస్తాయి. వాటిని ఇక్కడ మన సిస్టమ్ కి కనెక్ట్ చెయ్యడమే. I am sure it works” అన్నాడు. అంతే..ఇద్దరం ఆఘమేఘాల మీద ఇరవై మైళ్ళ దూరం లో ఉన్న మా ఇంటికి వెళ్ళిపోయి, మా టీవీ నోరు నొక్కేసి, ఆ రెండు స్పీకర్ల వైర్లూ కోసేసి, పీకేసి హాలుకి పట్టుకెళ్ళి, హడావుడిగా అక్కడ సిస్టమ్ కి కనెక్ట్ చెయ్యగానే బాలు అవి టెస్ట్ చేసి, అంత పెద్ద మనిషీ ఆనందంగా కుప్పిగంతులు వేశాడు. ఆ నాటి శంకరా భరణం నైట్ లో రెచ్చి పోయిన బాలూ, శైలజల గాత్రం, విశ్వనాథ్ గారి ఆత్మీయ ప్రసంగం, కొన్ని ఆ సినిమాలో సీన్ లతో ఇప్పటికీ నాకే కాదు, అది అనుభవించిన హ్యూస్టన్ వారికీ, శంకరా భరణం బృందం వారికి ఆతిధ్యం ఇచ్చిన రత్న పాప, మల్లిక్ పుచ్చా, రవి తమిరిశ తదితరులకీ కలకాలం గుర్తు ఉంటాయి. ప్రోగ్రాం ఐన మర్నాడు ఆ రెండు స్పీకర్లని ని మళ్ళీ మా టీవీ కి బిగిస్తే అవి పని చెయ్యడం మానేశాయి. బాలూ, నేనూ ఇద్దరం ఎంత తంటాలు పడినా ఆ కలర్ టీవీ చూపులకి సుందరాంగిలా ఉంది కానీ నోట మాట లేదు. ‘వాటి వైర్లు కట్ చేశాం కదా. కోపం వచ్చింది అన్నమాట” అనుకుంటూ” ఆ రోజు ఎంత నవ్వుకున్నామో .
ప్రోగ్రాం అయ్యాక అందరినీ హ్యూస్టన్ లో ప్రపంచ ప్రసిద్ధమైన ‘నాసా’ కి తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది. మా ఇంటికి ఆ నాసా సుమారు గంట సేపు ప్రయాణం. కారులో బయలు దేరగానే నేను సావిత్రి గారితో కబుర్లు చెప్తూ ఉండగా... బాలూ మా కారు డాష్ బోర్డ్ మీద ఆ శంకరా భరణం నైట్ కార్యక్రమాలనికి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన మిత్రుడు ప్రచురిస్తున్న ‘తెలుగు అమెరికా” పత్రిక కాపీలలో ఒకటి తీసుకుని పేజీలు తిరగేస్తూ “అరె. రాజు గారూ, మీరు కథలు కూడా రాస్తారా? “ అని అందులో ఉన్న నా ‘జులపాల కథ’ పేజీలు చూపించి చదవడం మొదలుపెట్టాడు. అది చిన్న కథే కాబట్టి పది నిముషాలలో చదివేసి డ్రైవ్ చేస్తున్న నా భుజం తట్టి ఒకే ఒక్క మాట అన్నాడు. అదే “శభాష్”...ఆ రాత్రి వసంత & మల్లిక్ వాళ్ళింట్లో బాలూ చేసిన ఎన్టీఆర్, రాజ్ బాబూ వగైరాల మిమిక్రీ, చెప్పిన జోకుల మీద జోకుల హడావుడి అంతా, ఇంతా కాదు.
అతని ‘పాటకారీ’ తనం ప్రపంచానికి తెలిస్తే మాటకారీ తనం సుమారు నలభై ఏళ్ళ్ క్రితమే గంటల కొద్దీ అనుభవించి, ఆనందించిన అదృష్టవంతుడు ఈ వంగూరి చిట్టెన్ రాజు. ఆ ప్రస్థానం ఇన్నేళ్ళూ కొనసాగడానికి ఒక అసమాన స్నేహశీలిగా అతని హృదయ ఔదార్యం మాత్రమే కారణం. దానికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలను. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. నేను ఒక సారి ఇండియా వెళ్ళినప్పుడు అది ఎలాగో బాలూకి తెలిసింది. ఒక రోజు హైదరాబాద్ లో మా అక్క ఇంట్లో ఫోన్ మోగింది. “చిట్టెన్ రాజు గారు ఉన్నారా?” అవతలి వ్యక్తి అడిగాడు. “లేడండీ, కాకినాడ వెళ్ళాడు. మీరు ఎవరండీ?” అడిగింది. “నా పేరు ఎస్పీ బాల సుబ్రమణ్యం అండి. ఆయనతో నేను పిలిచాను అని చెప్పండి”. మా అక్క నిర్ఘాంతపోయి వెంటనే కాకినాడ లో నన్ను పిలిచి “ఓరి నాయనోయ్. ఎస్పీ బాలూ నీ కోసం పిలవడం ఏమిట్రా” అని విపరీతంగా ఆశ్చర్యపోయింది. కథ అక్కడితో ఆగిపోలేదు. ఆర్నెల్లు పోయాక అమెరికాలో మా ఇంట్లో ఫోన్ మోగింది . “అన్నదాత గారూ, ఎలా ఉన్నారు?” అలా నన్ను పిలిచేది ఎవరో నాకు తెలుసు. “హాయ్, బాలూ గారూ. ఎక్కడ నుంచి? అమెరికా వచ్చారా? మా ఊరు ఎప్పుడు?” అని నేను అడుగుతూ ఉండగా “ఆగండి, మిత్రమా. మీ మీద కోపంగా ఫోన్ చేస్తున్నాను. ఆ మధ్య మీరు ఇండియా వచ్చినట్టు తెలిసింది. అక్కడికి వచ్చి కూడా నన్ను పలకరించక పోవడం బాగా లేదు. అసలు మా సినిమా వాళ్ళు అంత అంటరాని వాళ్ళమా, హన్నా?” అన్నాడు ఎస్పీ బాలూ. నేను కూడా నవ్వేసి “అదేం కాదు, బాలూ గారూ, మీరు అమెరికా వస్తే మీకు మేము కావాలేమో కానీ, మేము ఇండియా వెళ్తే మా బంధువులని చూడడానికే సమయం ఉండదు. ఇక మీ వెనకాల పడడానికి విఠల్ గారొక సైంధవుడులా ఉన్నాడు కదా!’ అనగానే గలా గలా నవ్వాడు..బాలూ. ఒక్క బాలూ మాత్రమే అలా నవ్వ గలడు. నవ్వించగలడు. ఆ రోజుల్లో ఈ విఠల్ అనే బాలూ గారి మిత్రుడే ఆంతరంగిక కార్యదర్శిగా ఉండి బాలూకి ఫోన్ చెయ్యాలంటే ఈయన్ని దాటుకుని వెళ్ళాల్సి వచ్చేది.
ఆఖరిగా..
బాలూకి ఈ మధ్యనే ..అంటే సుమారు పదేళ్ళ క్రితమే నేను అతని కంటే ఏడాది పెద్ద వాడిని అనే ఒక చిన్న విషయం తెలిసింది. అది నాకు చిన్న విషయమే కానీ అతని పెద్ద మనసుకి పెద్ద విషయమే. అప్పటి నుంచీ ఏ తానా, నాటా, పాడుతా తీయగా లాంటి సభల్లో కనపడినా, ఆ ‘పద్మ భూషణ్”, అనేక పర్యాయాలు జాతీయ ఉత్తమ గాయకుడిగా విజేత అయిన అంత పెద్ద మనిషీ నన్ను చూడగానే లేచి నిలబడి అత్యంత ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని గౌరవించడం ఇప్పటికీ నమ్మలేని విషయం. అతని సంస్కారానికి అంతకంటే మరొక ఉదాహరణ అక్కర లేదు కానీ నేను స్వయంగా అనుభవించిన అనేక సంఘటనలు చెప్పగలను. నాకు అనేక వేదికల మీద అతను చేసిన సత్కారాలు, నేను ఏదో సినిమా తీద్దాం అనో, టీవీ సీరియల్ తీద్దాం అనో ఆవేశ పడినప్పుడు “ మీకేమ్నా బుద్ధుందా? మీకున్న పేరు, ప్రఖ్యాతులూ, గౌరవమూ చాలవా?” అని నాకు గంటల కొద్దీ “ క్లాసులు పీకినా”, ఈటీవీ, మా టీవీ వాళ్ళకి “మా రాజు గారు” అని పరిచయం చేసిన మహానుభావుడూ, హఠాత్తుగా ఫోన్ చేసి “ఇప్పుడే హ్యూస్టన్ వచ్చాను. ఫలానా హోటల్ లో ఉన్నాను. సాయంత్రం సంజీబ్ కుమార్, రాజేష్ ఖన్నా, ప్రాణ్ లతో హిందీ ప్రోగ్రాం ఉంది. అంతా గుజ్జూ గోల. తప్పట్లు కొట్టడానికి మీరు రావాలి. టిక్కెట్లు హోటల్ లాబీలో పెట్టించాను. గిరిజ గారిని తీసుకురావడం మర్చిపోకండి” అని ఆత్మీయంగా చెప్పినా, అది బాలుకే చెల్లును. నేను ఒకానొక సమాజ సంక్షేమ కార్యక్రమానికి ఫేస్ బుక్ లో పెట్టిన అభ్యర్ధన చూసి “మిత్రమా, ఎంత కావాలి? ఎలా పంపించాలి? మా నాన్న గారి పేరిట ఉన్న సాంబమూర్తి ట్రస్ట్ నుంచి పంపిస్తాను. ఇది మన మధ్యనే ఉండాలి.. ఎవరికీ చెప్పకండి” అని తన టాబ్లెట్ మీద స్వహస్తాలతో స్పందించినా అది బాలుకే చెల్లుతుంది. మా తరం నుంచి ఈ తరానికి అలవోకగా అల్లుకు పోయిన ఏకైక మహా గాయక మిత్రుడు, మహా మంచి వ్యక్తి ఎస్పీ బాలూ.
ఇక బాలూ హాస్య చతురతకి అతి చిన్న ఉదాహరణ: ఒక సారి అతను ఏదో వ్యక్తిగతమైన పనులకి హ్యూస్టన్ వచ్చాడు. అది ఎలాగో తెలిసిన ఒకానొక రెస్టారెంట్ వారు అతని గౌరవార్ధం విందు ఏర్పాటు చేసి “బాలూ గారిని మీరే పరిచయం” చెయ్యాలని ఆయన చెప్పారు అని నన్ను కూడా ఆహ్వానించారు. నేను ఆ రెస్టారెంట్ కి వెళ్ళగానే బాలూ, పక్క కుర్చీలో ఒకావిడనీ చూడగానే నా సహజ సిధమైన “కోతి” ప్రవృత్తితో “సావిత్రి గారూ ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి” అని ఆవిడకి అమెరికన్ పద్ధతిలో పెద్ద హగ్ ఇచ్చి పారేశాను. వెంటనే బాలూ నవ్వు ఆపుకోలేక “రాజు గారూ, మరీ అంత గట్టిగా కావిలించుకోకండి. ఈవిడ మా ఆవిడ సావిత్రి కాదు. మా మరదలు. ఆవిడ భర్త శాస్త్రి ఇడుగో. మా తోడల్లుడు. తస్మాత్ జాగ్రత్త” అని పక్క కుర్చీలో కూచున్న శాస్త్రిని చూపించి ఒహటే నవ్వు. అప్పటి నా పరిస్థితి తల్చుకుంటే ఇప్పటికీ బాలూ ఎంత సహజమైన వాడో గుర్తుకి వస్తుంది. సావిత్రి గారూ, ఆవిడ చెల్లెలూ ఒక్క లాగే ఉంటారని నాకేం తెలుసూ?
ఈ వ్యాసం లో 1981 లో మా తొలి పరిచయం నాటి ఫోటో, మరి కొన్ని ఆత్మీయమైన ఫొటోలు జతపరుస్తూ.. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యానికి నా నివాళి అర్పిస్తున్నాను.
***