MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
సరి కొత్త పి.పా కథ
వంగూరి చిట్టెన్ రాజు
మరదే!
కొన్ని వారాల క్రితం ప్రసేపా వారి ఆవిర్భావ దినోత్సవ మహాసభలో పీకే గారి ప్రసంగమూ, అదే కోవలో సాగుతున్న మాటా మంతీలు వింటే ఒక విషయం స్పష్టంగా తెలిసింది. అనగా.. అతనికి రాజకీయ నాయకుడు కావలసిన వారికి ఉండవలసిన తిక్క అయితే ఉంది కానీ దానికి లెక్క మాత్రం లేదు సుమా అనిపించింది. ఎందుకో ఆ మధ్య రంగనాయకమ్మ తను వ్రాసిన “ఇదండీ మహా భారతం” గురించి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ “అర్థం పర్థం లేని యక్ష ప్రశ్నలకి అంత కన్నా అర్థం పర్థం లేని సమాధానాలు చెప్పిన ధర్మరాజు ఇవాళ ఐదో క్లాసు కూడా పాస్ అవలేడు” అని నొక్కి వక్కాణించిన మాట జ్ఞాపకం వచ్చి, అలాగే ఈ పీకే రాజకీయ లెక్కలలో కనీసం అన్నగారి లాగా అత్తెసరు మార్కులతో అయినా పాస్ అయినా అవుతాడా అనే అనుమానం వేస్తోంది.
నిజానికి రాజకీయాల్లో ప్రశ్నించడానికి మాత్రమే వస్తున్నట్టు ప్రకటించిన ఈ పీకే ముందు ఒంటి నిండా బూడిద పూసుకున్న ఏ పంతులు గారినో అర్థ రాత్రి ఎవరూ చూడకుండా చేతి రేఖలో, జాతకమో చూపించుకుని ప్రశ్నించి ఉంటే ఆయన వేదాలూ, తాళ పత్రాలూ చూసి “ప్రజ” లకీ “కాపు పార్టీ” లకీ పొసగదూ అని శాస్త్రం చెప్తోందీ, నువ్వనుకునే ప్రజా సేనకి మారు పేరు జన సేన లాంటిదే కదా!. “ప్రజా రాజ్యం” అనే పేరు పెట్టాక మీ అన్న గారు కాంగ్రెస్ లోనూ, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు గోదాట్లోనూ కలిసిపోయారు కదా, అంచేత నువ్వు హాయిగా పకపా... అంటే నీ పేరిటే పవన్ కల్యాణ్ పార్టీ అని పెట్టేసుకో, ఈ జనం జోలికి వెళ్లొద్దు అని ఆ పంతులు చెప్పి ఉండే వాడు కదా!
అదేమిటి అంత మాట అనేశావ్...అలా కులం పేరు ఇలా పబ్లిగ్గా రాసేస్తే నీ కులం కొంపలంటుకు పోవూ అని ఎవరైనా నన్ను అంటే “అబ్బే పరవా లేదు లెండి. మా కులం కొంపలు ఏనాడో కాలి బూడిద అయిపోయాయి. ఆ బూడిదలో పెట్రోలు పోసినా మళ్ళీ అంటుకోదు. అలా అని కాలి బూడిద, చేతి బూడిద, మోచేతి బూడిద అని రకరకాల వెరైటీ బూడిదలు ఉండవు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాలలో అంతా బాహాటంగా కులాల వారీగానే పంపిణీ అవుతుంది. ఉదాహరణకి ఇటీవల ఆం.ప్ర బడ్జెట్ పద్దు చూస్తే అధికార వర్గం వారికి అనధికార కేటాయింపులు ఎలాగా ఉంటాయి కాబట్టి ఇతర కులాల వారికి పేరు పేరునా ఫలానా కులానికి ఇరవై లక్షల నుంచి ఇరవై కోట్లు, ఫలానా మరో కులానికి ఇరవై కోట్ల నుంచి నలభై కోట్లు..వగైరా. కేటాయింపులు జరిగాయా లేదా! అందుకే సీతారామ శాస్త్రి జగమంత కులం నాది. ఏకాకి జీవితం నీది లాంటి పాట ఏదో రాశాడు. ఏకాకి అనగానే మళ్ళీ నాకు గబ్బర్ సింగే జ్ఞాపకం వస్తున్నాడు. పక్కనే ఎప్పుడైనా కెవ్వు కేకలు వేస్తూ ఎవరైనా కనపడతారేమో అని రెండేళ్ళ నుంచీ ఎదురు చూస్తున్నాను కానీ ఆయన దగ్గర ఉన్న రెండు స్క్రిప్ట్స్ లోనూ మరో పాత్ర లేనే లేదు.
అంటే... రాజకీయ నాయకులందరికీ సినిమా ఒకటే కానీ జేబులో కనీసం రెండు స్క్రిప్ట్స్ ఉంటాయి. ఒకటి కామెడీ. మరోటి ట్రాజెడీ. ఇప్పుడు చూడండి. న.మో గారు ఆయన పేరు నిలబెట్టుకున్నారు కదా...న.మో...అంటే నమ్మక ద్రోహం. సుమారు నాలుగేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం, లేక పొతే అంత కంటే ఎక్కువ అయిన ప్రత్యేక పేకేజీ ఇస్తాం అని కామెడీ చేసి తీరా సినిమా ఆఖరికి వచ్చే సరికి “భశుం” కార్డ్ వేసేసి “తాయిలాలు ఇవ్వం. తన్నుకు చావండి” అని మోదీ గారు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి గోచీ లాకున్నారా లేదా!
పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి దాకా చంద్ర బాబు గారి బూట్ పాలిష్ చేస్తున్నట్టు కనపడి, ఇప్పుడు మోడీ గారి గెడ్డం దువ్వుతున్నట్టు కనపడుతున్నాడా లేదా?
వై ఎస్ జగన్ కి అయితే ఒక స్క్రీన్ ప్లే లో శత్రు వైరుధ్యం..అనగా చంద్ర బాబు మీద బురద జల్లడం ప్రధాన అంశం అయితే రెండో స్క్రీన్ ప్లే లో మిత్ర వైరుధ్యం...అంటే తన మీద కేసులు మాఫీ చెయ్యాలంటే భాజపా తో స్నేహంగా ఉండి తీరాలి కానీ పైకి మటుకు “నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించు” అనే డ్రామా ప్రకారం అప్పుడప్పుడు భాజపా రాష్ట్రానికి ఏమీ చెయ్యడం లేదు అని విమర్శించడం అనమాట.
ఇక ఇప్పుడు అరణ్య వాసంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ నాడు తలుపులు మూసి అంధ్ర ప్రదేశ్ ని గోచీతో తో బయటకి గెంటేసి, ఈ నాడు తలుపుల బయట ఉండి, లోపలికి రానిస్తే చాలు, అన్ని హామీలకీ మాదే పూచీ అనడం కొత్త సీసా లో పాత సారా లాంటిదే. అందుకే మహా కవి శ్రీశ్రీ “సీసా లేబుల్ మారిస్తే బ్రాందీ విస్కీ అగునే?” అన్నాడు.
ఇక..40 ఏళ్ల “సుదీర్ఘ తెలివి తేటలు” ఉన్న చంద్ర బాబు గారు అటు ప్రత్యేక హోదా విషయంలో కానీ, ప్రత్యేక పేకేజీ విషయంలో కానీ మోదీ చేతిలో రాజకీయ ఓటమి చవి చూశారు అనే చెప్పుకోవాలి. కనీసం ప్రస్తుతానికి. అది భాజపా వారి వచ్చే ఏటి ఎన్నికల వ్యూహం లో భాగమే...ఎందుకంటే..ఎటు నుంచి ఎటు చూసినా – జగన్ మీద కేసులు కొట్టేస్తే తప్ప - ఆంధ్ర ప్రదేశ్ లో చంద్ర బాబు ఉన్నంత కాలం రాష్ట్ర స్థాయిలో భాజపా పదవిలోకి రాలేదు సరి కదా, లోక్ సభ సీట్లు కూడా ఒకటో రెండో తప్ప స్వంతంగా గెల్చుకో లేదు. అంచేత ఈ ప్రత్యేక హోదా కి అయ్యే డబ్బు ఇతర రాష్ట్రాలలో పెట్టుబడిగా పెట్టుకోవడం మంచిది అనే వ్యూహంతో మోదీ తెదేపా ని మోదేశారు. ఇక్కడితో భాజపా ఆగదు. వచ్చే ఎన్నికల దాకా తెదేపాని కేంద్ర ప్రభుత్వ అధికారంతో ఏదో రకంగా వేధిస్తూనే ఉంటుంది. ఉదాహరణకి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి రక రకాల సాంకేతిక, ఆర్ధిక అడ్డంకులు కలిగించడం ఖాయం. తెదేపా ప్రభుత్వం మీదా, అవసరం అయితే చంద్ర బాబు మీదే అవినీతి ఆరోపణలు ఇప్పటికే మొదలు అయ్యాయి – పవన్ కళ్యాణ్ గారు లోకేశ్ మీద చేసిన వ్యాఖ్యలు వాటికి నాందీ ప్రస్తావన.
ఇక భాజపా సరదాగా ఆడుకోడానికి పాత లక్క బొమ్మ వైకపా, కొత్త హీరో బొమ్మ పకపా ఉండనే ఉన్నాయి. సరదా ఏమిటంటే కాంగ్రెస్ కూడా ఆ బొమ్మల తోటే ఆడుకుంటుంది. అందరికీ రాజకీయ శత్రువు..ప్రస్తుతం ఏకాకి కానీ ఏకైక వీరుడు చంద్ర బాబు నాయుడు. మొదటి నుంచీ ఆయన పదజాలంలో కూడా “నేను” అనే మాట ఎక్కువగా వినపడినా, ఇప్పుడు కేంద్రం తో పోరాటానికి రాష్ట్రం మొత్తం కలిసి రావాలి కాబట్టి “మనం” అనే మాట వినపడుతోంది. పవన్ కళ్యాణ్ ఇంకా చాలా కాలం “నేను” మాయలోనే ఉంటాడు. జగన్ గారు వాళ్ళ నాయన పేరు లేకుండా సొంతంగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ఉన్నా, అవి పబ్లిగ్గా చెప్పుకునేవి కాదు.
రాబోయే ఏడాదిలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా, పేకేజీ లాంటి విషయాల మీద ఎవరు ఎంత అరిచి గగ్గోలు పెట్టినా అదంతా చెవిటి వాడి ముందు శంఖం ఊదడమే. కేవలం దవడలు నొప్పి పెట్టడం తప్ప మరేం లేదు. ఆ అరుపులు కేంద్రం దాకా దేవుడెరుగు కనీసం తెలంగాణా దాకా కూడా వినపడవు. తెలంగాణా ప్రస్తావన ఎందుకు అంటే.. కేంద్రం మీద తెదేపా, వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సాటి తెలుగు రాష్ట్రాన్ని సమర్ధించక పోయినా కాస్త అర్ధం చేసుకో వచ్చును కానీ “పక్కింట్లో పెళ్లవుతుంటే మా ఇంటికి రంగులు ఎందుకు?” అని ఒకానొక తెరాస పార్టీ సీనియర్ సభ్యుడు అనడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక నా అనుమానం ఏమిటంటే త్వరలోనే కాస్త సద్దు మణిగాక ఎన్నికల సమయంలో ఇదే మోదీ గారు అవసరం అనిపిస్తే ...విశాఖ రైల్వే జోనూ ఇస్తారు. కడప ఉక్కు కర్మాగారమూ ఇస్తారు....వాటికి క్రెడిట్ మటుకు తెలుగు దేశం పార్టీకి చెందకుండా జాగ్రత్త పడతారు.
త్వరలోనే జగన్ మీద కేసులు కొట్టేసి ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిగానూ, తెలంగాణా లో కొంచెమూ సరి కొత్త రాజకీయ వాతావరణం – నిజానికి సంక్షోభం - సృష్టించి ఎన్నికలలో భాజాపా తన వ్యూహానికి పదును పెట్టుకుంటుంది అని నాకు అనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశం ఈ మొత్తం ప్రణాళిక లో ఒక భాగం మాత్రమే.
ఈ పార్టీలన్నింటిలోనూ నాకు నవ్వొచ్చేది ఆ యు టర్న్ అనే మాట. ప్రతీ పార్టీ మరొక పార్టీ ని ‘యు టర్న్ తీసుకున్నారు, మళ్ళీ యు టర్న్ తీసుకున్నారు” అని అనని రోజు లేదు. జామెట్రీ ప్రకారం విషయం ఏమిటంటే..ఒక యు టర్న్ అయితే వచ్చిన వేపే మళ్ళీ ప్రయాణం కొనసాగించడం, రెండో యు టర్న్ తీసుకుంటే సరిగ్గా ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టామో అక్కడికే చేరుకోడం. అనగా అన్ని పార్టీలు ఎక్కడ వేసిన గొంగళీలు అక్కడే ఉన్నాయి అని అర్ధం.
ఇక అసలు విభజన చట్టం ప్రకారం అంశాల ప్రకారం ఏయే అంశానికి ఎంత డబ్బు, ఎప్పుడు , ఏ ప్రణాళిక ద్వారా కేంద్రం రాష్ట్రానికి సమకూర్చాలి, ఎంత సమకూర్చారు... ఎవరూ స్పష్టంగా లెక్కలు చెప్పక పోవడం, చెప్పినా అవి “పంచ్” డైలాగుల మధ్య ఆవిరై పోవడం నాకు అర్ధం కాని విషయం. పవన్ కళ్యాణ్ గారు జయ ప్రకాష్ నారాయణ్, ఉండవల్లి వగైరాలతో ఒక నిజ నిర్ధారణ సంఘం వేసినా దానికి సాధికారత లేదు. ఈ రాజకీయ రణగొణలలో దాని రిపోర్ట్ ఎవరూ పట్టించుకో లేదు. “విభజన చట్టం ప్రకారం ఇన్ని లక్షల కోట్లు ఇవ్వాలి, అన్ని లక్షల కోట్లు కావాలి” అని మాత్రమే గొంతెత్తి చాటుతూ, ఇంత వరకు అసలు ఏమైనా సహాయం చేశారా, చేస్తే ఎంతా అనే విషయం ఎక్కువ మాట్లాడని తెదేపా ధాటికి “ఇంతకి ఇంత ఇచ్చాం” అని గణాంకాలతో సులభంగా నిరూపించుకోగల కేంద్రం ఆ పని చెయ్యక, లేదా చెయ్య లేకపోవడానికి కారణం బీజీపీకి రాష్ట్రం లో “పెద్ద గొంతుక” ఉన్న బలమైన నాయకులు లేక పోవడం ఒక కారణం. ఇది డబ్బు ఒకటే కాదు...విద్యా సంస్థలు, రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం, అమరావతి నిర్మాణం లాంటి మౌలిక వసతుల ఏర్పాటుల విషయంలో కూడా చట్ట ప్రకారం కేంద్రం ఏం చెయ్యాలి, ఏం చేసిందీ ..ఈ విషయాలలో కూడా రాష్ట్రం కానీ, కేంద్రం కానీ ఒక శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవాలు మనకి తెలియజేస్తే బావుండును. కానీ బావుండదు కదా....అందుకని అది జరగదు.
కేవలం తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల పట్ల ఆయనకున్న నిరాసక్తత నాకు విచారం కలిగిస్తుంది తప్ప చంద్ర బాబు నాయుడు ఒక స్పష్టమైన అవగాహన, రాష్ట్ర భవిషత్తు మీద ఒక మంచి విజన్, దానికి తగ్గ రూప కల్పన ఉన్న నాయకుడు. దానికి సాయం లోకేశ్ నాయుడు రాకతో కనీసం మరో యాభై ఏళ్ళు అటువంటి భావ జాలం ఉన్న పరిపాలన కొనసాగేలా అన్ని రకాల గానూ ఆయన వర్గం సమర్ధించడం చెప్పుకోదగ్గది. ఈ సమర్ధన అమెరికాలో కూడా బాగా విస్తరించింది. ఇక్కడ ఏ ఊళ్లో చూసినా ఎన్నారై టీడీపీ ఆర్భాటాలు, కొన్ని జాతీయ సంఘాలు, చాలా స్థానిక తెలుగు సంఘాలు వారి ఆధీనంలోనే నడవడం దానికి ఉదాహరణలు.
ఆఖరిగా...సరదాగా..
ఇన్ని పార్టీలు చూస్తుంటే.... భాజపా, ఇంకాంపా, వైకాపా, ప్రసేపా, మాకపా, భాకపా....గుర్తు పట్ట లేదేమో...వీటిల్లో ఆఖరి రెండూ కమ్యూనిస్ట్ పార్టీలు లెండి...నేను మటుకు ఒక. పి.పా ఎందుకు పెట్టుకో కూడదా అనిపిస్తోంది....పి.పా అంటే ఏం లేదు..పనికిమాలిన పార్టీ...అప్పుడు నేను కూడా ఎంత చెత్త వాగినా అన్ని టీవీలలోనూ కనపడ వచ్చును కదా! ఏమంటారు?
***