top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

జులై - సెప్టెంబర్ 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వంగూరి పి.పా -27

 

అమెరికా తెలుగు కథాసాహిత్యం పుట్టుక, పురోగతి, భవిష్యత్తు

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు

(అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై వారి 24వ ‘నెల నెలా వెన్నెల’ అంతర్జాల సాహిత్య కార్యక్రమంలో చేసిన ప్రసంగపాఠం.  నాకు ఈ అవకాశం ఇచ్చిన పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారికీ, ముఖ్యంగా యర్రమిల్లి రామకృష్ణ గారికీ, వారి బృందానికీ,  నన్ను పరిచయం చేసిన ఈ నాటి వ్యాఖ్యాత, నాకు ఎంతో ఆప్తురాలు, మా అమెరికా అమ్మాయి, ప్రముఖ రచయిత్రి, సారంగ పక్ష పత్రిక సహ సంపాదకురాలు  శ్రీమతి కల్పనా రెంటాల కీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.)

ఈ వ్యాసంలో అమెరికా కథ అంటే అమెరికా సంయుక్తరాష్ట్రాలు, కెనడా దేశాలు ఉన్న ఉత్తర అమెరికా ఖండం కథ అనీ, అందువలన అవసరం అయినప్పుడు కెనడా కథల గురించి కూడా ప్రస్తావించాను. కానీ ఈ ప్రసంగం ప్రధానంగా అమెరికా కథా పరిణామం గురించే. మధ్యలో అక్కడక్కడ నా పేరు వినిపిస్తే అది ఆ సందర్భానుసారంగా వాడినదే కానీ ఏదో నా గొప్ప చెప్పుకోడానికి కాదు అని మనవి చేసుకుంటున్నాను.  

 

అది ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక ఏప్రిల్ 17, 1964 సంచిక. ఆ పత్రికలో “మనలో మన మాట” అనే పది వాక్యాల సంపాదకీయంలో ఆ తరువాత వారం వచ్చే పత్రిక గురించి వ్రాస్తూ, చివరి వాక్యంగా “ఆ సంచికలో అందరికీ ఆనందం కలిగించే విశేషం ఒకటి ఉంటుంది” అని ఆనాటి లక్షలాది పాఠకులని ఊరించారు సంపాదకులు శివలెంక వారు. ఆ తర్వాత ఏప్రిల్ 24, 1964 లో 32వ పేజీలో ‘ఆర్ఫియస్’ కలం పేరుతో వచ్చిన “వాహిని” అనే కథ ప్రచురించి “మనలో మన మాట” సంపాదకీయం మొదటి పేరాలోనే “ఆర్ఫియస్ ప్రస్తుతం కెనడాలోని ఓట్టావా యూనివర్శిటీ లో న్యూ క్లియర్ కెమిస్ట్రీ శాస్త్రం లో పిహెచ్.డి కి కృషి చేస్తున్నారు” అని పరిచయం చేసి “అందరికీ ఆనందం కలిగించే విషయం ఒకటి ఈ సంచికలో ఉంటుంది అని వ్రాశాము. అదేమిటో వేరే చెప్పక్కర లేదు” అని వ్రాశారు.

అదే ఉత్తర అమెరికా నుంచి వెలువడిన మొట్టమొదటి తెలుగు కథ. ఉత్తర అమెరికా నుంచి ఒక తెలుగు కథ ప్రచురణకి రావడం ఆనాటి తెలుగు సాహిత్య ప్రపంచానికి ఆశ్చర్యం, ఆనందం కలిగించిన విషయం. ఆ కథ పేరు “వాహిని”. రచన “ఆర్ఫియస్” అనే కలం పేరు. ఆయన అసలు పేరు 40 ఏళ్ళ పిన్న వయసులోనే 1978 లో పరమపదించిన పులిగండ్ల మల్లికార్జున రావు గారు. ఎవరి నిర్వచనం ప్రకారం చూసినా అదే మొట్టమొదటి అమెరికా తెలుగు డయస్పోరా కథ...లేదా డయస్పోరా తెలుగు కథ.

58 సంవత్సరాల క్రిందట అలా తత్తరపాటుతో మొదలయిన ఉత్తర అమెరికా తెలుగు కథా సాహిత్యం అంచెలంచెలుగా ఎదిగి ఈ నాడు తనదంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకుంది.  అప్పటి నుంచీ గత 58 సంవత్సరాలలో ఉత్తర అమెరికా తెలుగు కథ తనదే అయిన ప్రత్యేకత సంతరించుకుని, ఒక విభిన్న రూపం, రుచీ, వాసనలని పొదివి పట్టుకుంది. ఉత్తర అమెరికా తెలుగు కథ చారిత్రక ప్రధాన్యతకి కొన్ని కారణాలు మాత్రం ఉదహరిస్తాను.

మొదటిది చారిత్రక కారణం -

తరతరాలుగా ఎందరో తెలుగు వారు మన మాతృదేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు తరలి వెళ్ళారు, బర్మా, మలేషియా, ఫిజీ, ఇండోనీషియా, దక్షిణ ఆఫ్రికా, మారిషస్, సింగపూర్, ఇంగ్లండ్. ఒకటేమిటి? ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకీ విస్తరించిన మన తెలుగు వారు ప్రధానంగా వలస కూలీలు. వారి అనుభవాలు మొదటి తరం వారి కష్టనష్టాలూ, తరవాతి తరం వారి సమస్యలూ, సుఖాలూ, దుఃఖాలూ ఏదో ఒక రూపం లో పదిల పరుచుకోవాలి అనే ఆలోచన బహుశా ఉన్నా, అది కార్యరూపం చెందడానికి కావలసిన మేధావి వర్గం ఆ తొలి తరాలలో లేని కారణాన వారి జీవిత చరిత్రలు మరుగున పడిపోయాయి. అయితే ఉత్తర అమెరికాకి తెలుగు వారు వలస రావడం కేవలం 1960లలోనే మొదలు పెట్టి, పెద్ద ఎత్తున వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోవడం 1970లలో ప్రారంభం అయి అలా వలస వచ్చిన వారు ఇంచుమించు అందరూ మధ్య తరగతి కి చెందిన మేధావి వర్గానికి చెందిన వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం. అదే ఇతర ఖండాల వలస దారులకీ, ఉత్తర అమెరికా వలస దారులకీ ప్రధానమైన తేడా. ఈ నేపధ్యంలో పుట్టినది అమెరికా తెలుగు కథ.

రెండవ కారణం: డయాస్పోరా ఇతివృత్తాలు -

1910లో ప్రచురించబడిన గురజాడ వారి ‘దిద్దుబాటు” కథని తెలుగులో మొట్టమొదటి ఆధునిక కథగా గుర్తించబడింది. అంటే ఇప్పటికి 112 సంవత్సరాలు అయింది. అందులో 58 సంవత్సరాలు  ఉత్తర అమెరికా కథ సమానాంతరంగా ప్రయాణం చేస్తూ తెలుగు కథాసాహిత్యపు నదీ ప్రవాహంలో ఒక కొత్త పాయగా చేరింది.  చేసింది. ఆ ప్రయాణంలో తనతో పాటు విదేశాలలో నివసిస్తున్న వారి స్థానికత, విభిన్న సంస్కృతుల మధ్య జీవితం ప్రధాన ఇతివృత్తాలుగా వచ్చిన అమెరికా కథలు డయాస్పోరా కథలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అంటే తెలుగు కథా సాహిత్యం అనే అఖండ గోదావరీ ప్రవాహంలో చేరి, పరిపుష్టం చేసిన మంజీరా లాంటి ప్రధాన ఉప నది అమెరికా తెలుగు కథ. లేదా, అఖండ గోదావరి నుంచి గౌతమీ నదిలాగా విడి పోయి తనదంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకున్న కథ అమెరికా తెలుగు కథ.   

మూడవది: అమెరికా కథకులకి ఉన్న భావ స్వాతంత్ర్యం -

భారత దేశం కంటే భిన్నంగా అమెరికా కథకులకి స్వీయ నియంతణ తప్ప మరే ఎల్లలూ లేవు. అంతులేని భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఎవరి గుర్తింపు కోసమో, మరే విధమైన సామాజిక, ఆర్ధిక ప్రయోజనాల కోసమో రచనలు చేసే అవసరం లేకపోవడం,  సమాజంలో ఎవరికీ “భయపడవలసిన” అవసరం లేకపోవడం, స్థానిక అమెరికా, కెనడా దేశేయులే కాక అనేక ఇతర దేశాల డయాస్పోరా సంస్కృతులని దగ్గరగా గమనించే అవకాశాలు ఉండడం, భిన్న సంస్కృతుల వారితో  సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఉండడం, కుటుంబ పరంగా భార్యా భర్తల సంబంధాలు, ముఖ్యంగా పిల్లల సమస్యలు, తెలుగు సమాజమే కాక, భారతీయ సమాజం, అమెరికన్ సమాజంతో బతుకు తెరువు ఇలా  చెప్పుకుంటూ పొతే అమెరికా కథలకులకి ఉన్న “కేన్వాస్” హద్దు లేని ఆకాశం అంత ఉంది. అయితే అంతటి అద్భుతమైన అవకాశాన్ని అమెరికా రచయితలు ఇంకా పూర్తి స్థాయిలో అందుకో లేదు అని నా అభిప్రాయం.

ఇక అమెరికా కథ పుట్టుక, పురోగతి గురించి క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా కథా సాహిత్యాన్ని మూడు దశలుగా విభజించవచ్చును.

ప్రారంభ దశ: 1960-1975 - అంటే బాల్యం

ఈ తొలిదశలో అమెరికా గడ్డపై కాలుమోపిన అతి కొద్దిమంది తెలుగువారు, ఆ సరికొత్త  వ్యవస్థలో సర్ధుకుపోలేక విపరీతమైన ఒత్తిళ్ళకులోనై సాహిత్యం జోలికిపోలేదు అని అనుకోవచ్చును. 1964లో కెనడా దేశం నుంచి తొలి తెలుగు కథ “వాహిని” వ్రాసినది స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారు అయితే  1966 లో అదే ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన దోతంశెట్టి వీరభద్ర రావు గారి  “గోడమీద గడియారం” అనే కథ అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం నుండి వచ్చిన మొదటి తెలుగు కథ. చిన్నతనం లోనే అమెరికా వచ్చిన మాచిరాజు సావిత్రి గారి మొదటి కథ “మోసం”, ఆగస్ట్, 1969 లో ఆంధ్ర ప్రభలో ప్రచురించబడింది.  ఆ తర్వాత 1970లో  సీ.యెస్సీ. మురళి గారి “మనిషి”  అనే కథ భారతిలో ప్రచురించబడింది. ఇవి ఉత్తర అమెరికా ఖండం నుంచి వెలువడిన తొలి నాలుగు కథలు.

కెన్నెడీ గారి ధర్మమా అని 1965లో భారతీయులు కూడా గ్రీన్ కార్డ్ కి అర్హులే అని మౌలికమైన మార్పు వలన పరిస్థితులు మారాయి. తెలుగు వారి సంఖ్య పెరిగి, ప్రధాన నగరాలలో తెలుగు సంఘాలు ఏర్పడి, అవి చిన్నవో, పెద్దవో లిఖిత పత్రికలు ప్రచురించడం మొదలుపెట్టాయి. సాహిత్య సృజనకి తగిన వాతావరణం ఏర్పడింది. ఫోన్ సదుపాయాలు బాగానే ఉన్నా ఒక నగరం నుంచి మరొక నగరం వారికి ఉత్తరాలు వ్రాసుకునే వారు. కేవలం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు లాంటి మేధావి వర్గమే అనేక నగరాలలో కొద్ది పాటి సంఖ్యలో నివశిస్తున్న ఆ నేపధ్యంలో ఏప్రిల్ 1970 లో పెమ్మరాజు వేణుగోపాలరావు గారు ప్రధాన సంపాదకులుగా, గవరసాన సత్యనారాయణ, రావిపూడి సుబ్బారావు, పరిమి కృష్ణయ్య సంపాదకులుగా అట్లాంటా నుంచి “తెలుగు భాషా పత్రిక” అనే వ్రాత పత్రిక వెలువడింది. “మన మాతృభాషను మనము నిత్యము వాడుటకు ప్రయత్నించి మనకు తెలిసిన విజ్ఞానము మనకు తెలిసిన భాషలో వ్రాయగల స్తోమతను సాధించుటయే ఈ పత్రిక ఆదర్శము” అనేది ఆ పత్రిక ధ్యేయం.  అమెరికాలో వెలువడిన ఆ తొలి తెలుగు పత్రికలో చెరుకూరి రమాదేవి రచించిన “పుట్టిల్లు”, కోమలా దేవి రచించిన “పిరికి వాడు”,  కస్తూరి రామకృష్ణారావు గారి “యవ్వన కుసుమాలు వాడిపోతే” అనే మూడు కథలు ఏప్రిల్, 1970 సంచికలో ప్రచురించబడ్డాయి. అమెరికాలో ప్రచురించబడ్డ తొలి తెలుగు కథలు అవే. ఈ కథల్లోని కథా వస్తువు, వాతావరణం ఆంధ్రరాష్ట్రానికి సంబంధించినవే కాక, అ కథకులు స్వదేశం లో ఉన్నప్పుడు వ్రాసినవే కావడం విశేషం. 1970, 71 ప్రాంతాలలో వేమూరి వెంకటేశ్వర రావు గారి “గాలి దోషం” “భూతద్దాలు” కథలు అమెరికాలో మొదటి శాస్త్ర విజ్ణాన ..అంటే సైన్స్ ఫిక్షన్ కథలు.  1971 లో వేలూరి వెంకటేశ్వర రావు గారు “స్కాచ్ టేప్” “మెటమార్ఫసిస్” మొదలైన కథలు ప్రచురించారు. 70వ దశకం లోనే శ్రీరాం పరిమి గారి కథలు ఒకటి, రెండు యువ లో ప్రచురించబడ్డాయి అని ఎక్కడో చదివాను కానీ అంతకన్నా వివరాలు నాకు తెలియవు.

పులిగండ్ల మల్లికార్జున రావు, పెమ్మరాజు వేణుగోపాల రావు, చెరుకూరి రమాదేవి, కోమలా దేవి, కస్తూరి రామకృష్ణారావు, సీ యెస్సీ మురళి, వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి వెంకటేశ్వర రావు, మాచిరాజు సావిత్రి, చెరుకుపల్లి నెహ్రూ, గవరసాన సత్యనారాయణ, కందుల సీతారామ శాస్త్రి, వేమూరి వెంకట రామనాధం మొదలైన వారిని అమెరికాలో తెలుగు సాహిత్యానికీ, ముఖ్యంగా కథకీ ప్రారంభ దశ అయిన 1960-75 లలో “రాళ్ళెత్తిన కూలీలు” గా గుర్తించ వచ్చును. వీరిలో చెరుకూరి రమాదేవి గారు, వేమూరి గారు, వేలూరి గారు, సావిత్రి గారు, మురళి గారు ఇప్పటికీ కథలూ, కమామీషులూ వ్రాస్తూ తెలుగు సాహిత్యానికి నిరంతరంగా సేవలు అందిస్తూ ఉండడం అత్యంత ప్రశంసనీయమైన విషయం. ఆ మాటకొస్తే త్వరలోనే రమాదేవి గారి “ట్విన్ టవర్స్” అనే పెద్ద నవల వంగూరి ఫౌండేషన్ ద్వారా ప్రచురితం అవుతుంది.

రెండవ దశ: 1975-90 - కౌమారం - నిలదొక్కుకున్న అమెరికా కథ.

ఇక 1975-1990 లని రెండవ దశగా భావించవచ్చును. ఈ 15 సంవత్సరాలనీ అమెరికా మొదటి తరం సాహిత్యం అనీ, “నాస్టాల్జియా తరం” అనీ కూడా అనవచ్చును. ఎందుకంటే ఈ కాలం లోనే అమెరికాలో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో బాగా నిలదొక్కుకోడం, స్థానిక సంస్థలు వారి సామాజిక, సాంస్కృతిక అవసరాలని తీర్చడానికి భారీ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం, 1977లో జాతీయ స్థాయిలో తానా సంస్థ ప్రారంభం మొదలైనవి ప్రచురణావకావకాశాలని తగిన స్థాయిలో కలిగించాయి. తెలుగు భాషాపత్రిక తర్వాత తెలుగు జ్యోతి (1980, న్యూజెర్శీ),  తెలుగు వెలుగు (1975, చికాగో, న్యూయార్క్), మధురవాణి (1976, హ్యూస్టన్), తానా పత్రిక (1980, న్యూ జెర్శీ) తెలుగు పలుకు మొదలైన సంస్థాగత పత్రికలు ప్రారంభం కావడంతో వాటిల్లో రచయితలకి చోటు దక్కింది. జాతీయ స్థాయిలో ప్రతీ రెండేళ్ళకీ జరిగే తానా మహా సభల ప్రత్యేక సంచిక (సావనీర్) రచయితలకి ఒకే ఒక్క  అంత వరకూ లేని “ఔట్ లెట్” నీ, కథలు వ్రాయడానికి ఉత్సాహాన్నీ కలిగించింది. ఆ రోజుల్లో ఇండియాలో ఏ రచన పత్రికలోనో ఎవరైనా ఏదైనా ప్రచురించినా “మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసుకున్నారు” అనే వారు. అంతకంటే అన్యాయంగా ఇండియాలో సాహితీవేత్తలకి “మాతృదేశం మీద మమకారం చావక ఏదో రాసుకుంటున్నారులే” అని అమెరికా వారి కథలూ, కవిత్వాల మీద చాలా చిన్న చూపు ఉండేది. ఆనాటి మొదటి తరం వారి కథల్లో “తెలుగు కథ చెప్పడం లో కొత్త కోణం బయట పడింది” అన్నారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.  వంగూరి, వేమూరి లాంటి ఒకరిద్దరు మినహా 1975-90 ల మధ్య వచ్చిన అమెరికా కథలు ఇంచుమించు తెలుగు వారి మాతృదేశం జ్ఞాపకాలలోంచీ, నిట్టూర్పులలోంచీ, అనుభవాలలోంచీ, అసంతృప్తులలోంచీ పుట్టింది. అంటే అది అమెరికా కథా సాహిత్యం లో నాస్టాల్జియా యుగం అనుకోవచ్చును. ఈ కథకులు ఇంచుమించు అందరూ అమెరికా వచ్చాక కలం పట్టిన వారే. అందరూ తెలుగు భాష మర్చిపోని అదృష్టవంతులే. ఆ నాటి కథల్లో “అయ్యో కోల్పోయామే”, “అక్కడ అయితేనా?” “ఇక్కడ భరించలేక పోతున్నాం” లాంటి భావనలు కనపడతాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా హాస్యానికి పెద్ద పీట వేస్తూ వ్రాస్తున్నది వంగూరి చిట్టెన్ రాజు. సైన్స్ ఫిక్షన్ కథలు వ్రాస్తున్నది వేమూరి వెంకటేశ్వర రావు గారు. కథా రచనని ఒక అసిధారా వ్రతంగా తీసుకుని విస్తృతంగా అనేకానేక కథా వస్తువులతో వ్రాస్తున్నది సత్యం మందపాటి. స్వీయ రచనలు, అనువాదాలతో అత్యున్నత స్థాయి రచనలు అచిరకాలంగా చేస్తున్న వారు నిడదవోలు మాలతి. సాహిత్య విమర్శ, విశ్లేషణల మీద ప్రత్యేక దృష్టిపెట్టిన కథకులు వేలూరి వెంకటేశ్వర రావు. ఈ 1975-90 దశలలో అమెరికా తెలుగు కథకి గట్టి పునాదులు పడ్డాయి. అటు కవితా వికాసం కూడా తోడు కావడం, స్థానికంగానూ, జాతీయ స్థాయిలో తానా జ్ణాపికలలోనూ ప్రచురణ అవకాశాలు పెరగడంతో అమెరికా తెలుగు సాహిత్యానికి ఒక స్థిరత్వం వచ్చింది. 1975-90 ల నాటి కథల్లో చెప్పుకోదగ్గవి చెప్పాలంటే పెద్ద పట్టికే అవుతుంది కాబట్టి ఆయా కథకుల ఒక్క కథని మాత్రమే ప్రస్తావిస్తాను. వాటిల్లో వంగూరి చిట్టెన్ రాజు వ్రాసిన జులపాల కథ, వేలూరి (మెటామార్ఫసిస్), వేమూరి (పంటి కింద పోక చెక్క), చెరుకూరి రమాదేవి (యాదృచ్చికం) యార్లగడ్డ కిమీర(వీడిన నీడలు), కోలగొట్ల సూర్యప్రకాశ రావు (గ్రంధచౌర్యం), నిడదవోలు మాలతి (నిజానికీ, ఫెమినిజానికీ మధ్య), విజయలక్ష్మీ రామకృష్ణన్ (మనసు-మనుగడ), కొమరవోలు సరోజ (ఉష్ణం, ఉష్ణేణ శీతలం), మాచిరాజు సావిత్రి (దయ్యం పట్టింది), భాస్కర్ పులికల్ (సైబీరియన్ క్రేన్స్), రాణీ సంయుక్త (వంచన), భండారు సులోచన(స్వయంకృతం), భావరాజు మూర్తి (రజిత, వసుధ), వసంత లక్ష్మీ పుచ్చా (అంతతరంగంలో అలలు), పుచ్చా అన్నపూర్ణ (విలినీత) , సుధేష్ణ సోమ (రోస్ట్ అయిన వోటు), సత్యం మందపాటి (పుత్రకామేష్టి) మొదలైనవి. 1975-90 దాకా అమెరికాలో సుమారు 100 కథలు వచ్చాయి. ఇంచుమించు అన్నీ తానా సావనీర్లు, తెలుగు జ్యోతి, అమెరికా తెలుగు సంస్థల స్థానిక పత్రికలలోనూ ప్రచురించబడినవే. కొన్ని కథలు ఇండియాలో రచన మాస పత్రికలో ప్రచురించబడ్డాయి.

 

మూడవ దశ: 1990-2005 - పురోగతి దశ

అమరికా తెలుగు సాహిత్యం - ముఖ్యంగా కథా సాహిత్యం మరింత వేగంగా పరిపుష్టి చెంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఈ సమయం లో రెండు కారణాలని ప్రధానంగా చెప్పుకోవచ్చును. కంప్యూటర్ లో తెలుగు యుగం ప్రారంభం, Y2K ప్రభావం తో పుంఖానుపుంఖాలుగా కంప్యూటర్ నిపుణులైన యువతీయువకులు అమెరికా తరలి రావడం ఒక కారణం అయితే తెలుగు రచయితలనీ, భాషని అమితంగా ప్రేమించేవారినీ ఒకే వేదిక మీదకి తెచ్చే గొప్ప సంకల్పంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా లాంటి సంస్థలు ప్రారంభించబడడం మరొక ప్రధాన కారణం. ఈ కోవలో చెప్పుకోదగ్గ ఇతర సంస్థలు అజో విభో (అప్పాజోస్యుల  సత్యనారాయణ), తెల్సా (విశ్వనాధ అచ్యుత దేవరాయలు, సీయెస్సీ మురళి), సప్నా (శారదా పూర్ణ శొంఠి) మొదలైనవి. ఇదే సమయంలో తానా సంస్థ చీలిపోయి, ఆటా ఏర్పడడం మొదలైన రాజకీయ పరిణామాలు జరిగినా సాహిత్య పోషణ, పురోగతులపై వాటి ప్రభావం తక్కువ అనే చెప్పాలి. 1995లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మొదలు పెట్టిన ఉగాది పోటీల ద్వారా కొత్త కథలు రావడమే కాకుండా కొత్త కథకులు రంగ ప్రవేశం చేశారు. 1995లో ఆ సంస్థ ప్రచురించిన అమెరికా తెలుగు కథానిక- మొదటి సంకలనం తో అమెరికా కథకి రాజయోగం పట్టింది. “ముందు మనలో జీర్ణించుకుపోయిన తెలుగు సాహిత్యపు అలవాటులోంచి బయటపడి ఇక్కడ ఈ నేల మీద కొత్త సాహిత్యం తయారు అవుతోంది, అది చదివి అర్ధం చేసుకునే పధ్ధతి కూడా కొత్తగా ఉండాలి- అన్న స్పృహతో చదివితే , ఇలాంటి కొత్త సాహిత్యం ఇంత వరకూ లేని ఆకారాన్ని పొందుతోంది అన్న జ్ఞాపకంతో చదివితే - అప్పుడు ఓ కొత్త ప్రపంచానికి కాస్త కాస్త తలుపులు తెరుచుకుంటాయి” అన్నారు ఆచార్య వెల్చేరు నారాయణ రావు గారు ఒక పుస్తక పీఠికలో.  అలా ఒక కొత్త సాహిత్య ప్రపంచానికి, అమెరికా సాహిత్య ప్రపంచానికి తలుపులు పూర్తిగా తెరచినది 1998లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన మొట్టమొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు. ఆ సాహిత్యానికి డయాస్పోరా సాహిత్యం అనీ, అది సృష్టిస్తున్న రచయితలని డయాస్పోరా రచయితలు అనీ, నాస్టాల్జియాతో సహా అక్కడి కథా వస్తువులతో వచ్చిన కథలని డయాస్పోరా కథలు అనీ కాలక్రమేణా వాడుకలోకి వచ్చింది. ఈ ధశలో కూడా చాలా మంది రచయితలు అమెరికా వచ్చాక కలం పట్టిన వారే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రచురించబడిన 15 అమెరికా తెలుగు కథానిక సంకలనాలు అమెరికా తెలుగు కథ పరిణామానికి అద్దం పడతాయి.

1990-2005 లని పురోగతి దశ అనుకుంటే, ఆ కాలం లో కథ నిలదొక్కుకోడానికి పైన పేర్కొన్న వారు తమ కృషిని కొనసాగిస్తూ ఉండగా, అక్కినపల్లి సుబ్బారావు, అపర్ణ ములుకుట్ల గునుపూడి, జయప్రభ శ్రీనివాసన్, మరువాడ రాజేశ్వర రావు, రాధిక నోరి, శ్యామలా దేవి దశిక, పూడిపెద్ది శేషుశర్మ, శ్యామ్ సోమయాజుల, విశ్వనాధ వారి కుమారులు అచ్యుత రాయలు గారు, కనక ప్రసాద్, ఎస్. నారాయణ స్వామి, కె.వి.ఎస్. రామారావు, మంగళా కందూర్, శాయి బ్రహ్మానందం గొర్తి, ఆరి సీతారామయ్య, పిప్పళ్ళ సూర్యప్రకాశ రావు, ఫణి డొక్కా, కె.వి. గిరిధర రావు, కలశపూడి శ్రీనివాస రావు, వేదుల వెంకట చయనులు, అక్కిరాజు భట్టిప్రోలు, మాచిరాజు వెంకటరత్నం, విప్లవ్ పుట్టా, తమ్మినేని యదుకుల భూషణ్, తాడికొండ శివకుమార శర్మ  మొదలైన వారు ఈ దశలోనే కలం చేతపట్టడమే కాక, అచిరకాలం లోనే సిద్ధహస్తులు అయ్యారు అని కూడా చెప్పవచ్చును. ఈ దశలో కథల సంఖ్య గణనీయంగా పెరిగింది. వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది పోటీలు, తానా, ఆటాలు పోటీలు పడి నిర్వహించిన పోటీలు ఒక కారణం అయితే తెలుగు వెబ్ పత్రికలు, బ్లాగ్ విప్లవం కథా రచన, ప్రచురణలో ఎవరి నియమాలు వారే నిర్దేశించుకునే వాతావరణం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చును. 1998లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన మొట్టమొదటి తెలుగు సాహితీ సదస్సు స్ఫూర్తిగా వెలువడిన తొలి వెబ్ పత్రిక ఈమాట ఇప్పటికీ తనదైన శైలిలో సాహిత్య సేవలు అందిస్తున్నారు. సుమారు 500 కథలు వచ్చిన ఈ  1990-2005 పురోగతి దశలో అమెరికా కథకి ఒక నిర్ధుష్టమైన రూపం వచ్చింది అని చెప్పవచ్చును. దానికి నిదర్శనంగా సత్యం మందపాటి “భేతాళ కథలు”, ఆరి సీతారామయ్య (జీతగాళ్ళు, గట్టు తెగిన చెరువు), ఎస్. నారాయణ స్వామి (తుపాకీ), శేషు శర్మ (పదహారేళ్ళ వయసు, సంఘర్షణ), సుధేష్ణ సోమ (పాసింగ్ ఫేజ్), రాధిక నోరి (కాగల కార్యం..), సాయి బ్రహ్మానందం గొర్తి (వలస జీవితం), పెమ్మరాజు వేణుగోపాల రావు (దాంపత్యానికి అనుబంధం), పుచ్చా అన్నపూర్ణ (పెళ్ళి), విప్లవ్ పుట్టా (ఎ నైట్ ఆన్ ది ఫిఫ్త్ స్ట్రీట్), తాడికొండ శివకుమార శర్మ (స్టిల్ ఏన్ ఇండియన్), కల్పన రెంటాల (టింకూ ఇన్ టెక్సస్),   శ్యామలా దేవి దశిక (జానకి), కమల చిమట (అమెరికా ఇల్లాలు), సావిత్రి మాచిరాజు (పాస్ పోర్ట్), నిడదవోలు మాలతి (ఉభయ భాషా ప్రవీణ), చంద్ర కన్నెగంటి (బతుకు), ఫణి డొక్కా (అవధాని మామయ్య), అపర్ణ ములుకట్ల (ఘర్షణ), అక్కిరాజు భట్టిప్ఱోలు (నందిని), కె.వి. గిరిధర రావు (వాయుగుండం), నిర్మలాదిత్య ఎక్కడి నుంచి), కె,వి.ఎస్.రామారావు (అదృష్టవంతుడు), వేమూరి వెంకటేశ్వర రావు (కించిత్ భోగే భవిష్య్తతి), వేమూరి వెంకటేశ్వర రావు (క్లబ్బుల్లో చెట్టు కథ)..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

అమెరికాలో తెలుగు కథా సాహిత్యం ఒక పరిణితికి ఈ దశలో వచ్చింది అనుకోడానికి మరొక కారణం సాహిత్య విమర్శ అనే ప్రక్రియ మీద కొందరు గళం విప్పడం.  దీనికి పరోక్షంగా ఆచార్య వెల్చేరు నారాయణ రావు స్పూర్తి అనుకోవచ్చును. అయితే అమెరికా కథల విమర్శ దగ్గరకి వచ్చే సరికి అది వక్రమార్గం పట్టింది అని నా వ్యక్తిగత అభిప్రాయం. 1990-2005 సమయంలో ఈ స్వయంప్రకటిత సాహిత్య విమర్శకులు అలనాటి కట్టమంచి వారి సిద్ధాంతాలనీ, వల్లంపాటి వారి ప్రమాణాలనీ ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని అమెరికా కథకి అన్వయించి వాటిని కొడవగంటి, రాచకొండ వారి కథలతో పోల్చి అమెరికా కథలని కొట్టిపారెయ్యడం, లేదా నిర్లక్ష్యం చెయ్యడం, కేవలం తమకి నచ్చిన, కొండొకచో తమ వర్గానికే చెందిన కథకులకే పట్టం కట్టడం ఈ సమయం లోనే చోటుచేసుకోవడం కొంచెం ఇబ్బంది కలిగించినా అది అమెరికా కథా సాహిత్యం పరిణితి చెందింది అనడానికి నిదర్శనంగా నేను భావిస్తాను. కొందరయితే కథా విమర్శ అంటే తిట్టడం అనే అర్ధం లోనే తప్ప కథా విశ్లేషణ అనే అర్ధం తీసుకోలేదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. వీటికి మూలాలు బహుశా అంత వరకూ అమెరికా కథల మీద ఇండియాలో ఉన్న కొన్ని అభిప్రాయాలు కూడా కావచ్చును.

 

ఉదాహరణకి:

1998లో అప్పటి దాకా వచ్చిన అమెరికా కథానిక సంకలనాల మీద  వచ్చిన కొన్ని అభిప్రాయాలని పరిశీలిస్తే వాటి స్థాయి మీద మనకి కొంత అవగాహన వస్తుంది. “ఈ సంకలనం లో చెప్పుకోదగ్గ కథలు తక్కువే”; “కథలు విరివిగా వస్తున్న మాట నిజమేగాని, ఈ కథల్లో మంచి కథలు ఎన్ని వస్తున్నాయి అన్నది విచారించాలి” "అమెరికా తెలుగు కథానికల్లో చాలా వాటిని చూస్తే, కొద్దిగా నిరుత్సాహం కలుగుతుంది. కొన్ని కథలు బొత్తిగా సెకండ్‌రేటు కాలేజీ మేగజైనుల్లో థర్డ్‌రేటు కథల్లా ఉంటున్నాయి". ఈ అభిప్రాయాలలో కొసమెరుపుగా "ఈ సమస్యలన్నీ అమెరికా తెలుగు కథానికకు మాత్రమే పరిమితమైనవి కాదు. ఆంధ్రదేశంలో ప్రచురితమవుతున్న చాలా కథల పరిస్థితీ ఇలానే ఉంది”. అక్షరాలా ఈనాడు ఆంధ్రదేశం లో పుడుతున్న కథలకి భౌతికంగా, మానసికంగా భిన్నమైనవి. సామాజిక అభద్రతా ఇతివృత్తాలకంటే ‘ఐడెండిటీ’ సమస్యని ఎక్కువగా తాకే కథలు ఇవి. “ఇక మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆ పత్రిక వారు వేశారు కానీ”; “పాపం మాతృదేశ జ్ఞాపకాలతో ఏదో రాస్తున్నారు.” లాంటి చులకన మాటలు చాలా సార్లే విన్నాం.

నాలుగవ దశ: 2005-2020 - పరిణతి దశ  

గత 15, 20 సంవత్సరాలగా అమెరికా తెలుగు కథ పూర్తిగా పరిణితి చెందింది అనే  చెప్పుకోవాలి. ఈ దశలో యువతరం కథకులు చాలా మందే ఎవరి కథలని వారే తమ బ్లాగ్ లలోనూ, వాట్సాప్ సమూహాలలోనూ, ఫేస్ బుక్ లోనూ ప్రచురించుకునే ప్రక్రియ ఒక పరాకాష్టకి చేరింది. ముద్రించే పుస్తకాల కంటే స్మార్ట్ ఫోన్ల లోనే గబ గబా చదివేసుకుని, తక్షణమే స్పందించే సంస్కృతి నిలదొక్కుకుంది. రాశి బాగా పెరగడం, ఎవరి సమూహాలకి వారు పరిమితం అయి సంతృప్తి పడడంతో రచయితలు ఆన్-లైన్ లోనే కానీ వ్యక్తిగతంగా కలుసుకోడానికి తగిన అసక్తి, అవకాశాలు కనుమరుగు అయిపోయాయి. అమెరికాకీ, భారత దేశానికీ ఎల్లలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయి, ఏది అమెరికా కథ, ఏది కాదు అనే తేడా కూడా తుడిచిపెట్టుకు పోయి అసలు అలాంటిది అవసరమా అని కూడా ప్రశ్నించుకునే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరు వ్రాస్తున్నారు, ఎలాంటి కథలు వ్రాస్తున్నారు అనేది అంచనా వెయ్యడం, సమీక్షించడం చాలా శ్రమతో కూడిన పని. అయితే ఈ  దశలో వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన 10 అమెరికా కథా సంకలనాలు ఒక అవగాహన కల్పిస్తాయి. ఈ దశలో నాస్టాల్జియా కథలు వెనక పడ్డాయి. భారత దేశం నుంచి వచ్చిన అధిక శాతం కథలలో కూడా అమెరికా జీవితం, వ్యక్తుల ప్రస్థావన బాగా పెరిగింది.

ఇదివరలో ప్రస్తావించిన వారు కాక, ఈ దశలో మంచి వైవిధ్యమైన కథలు వ్రాసిన వారిలో కొందరు  కల్పనా రెంటాల (ఐదో గోడ), అఫ్సర్ (సాహిల్ వస్తాడు), డా. కె.గీత (ఇవాక్యుయేషన్), దంతుర్తి శర్మ (కామెర్లు), దీప్తి పెండ్యాల (ముసుగు), అనిల్ రాయల్ (మరపు రాని కథ), సుభద్ర వేదుల (హోమ్ ఆటోమేషన్), ఉమా భారతి కోసూరి (త్రిశంకు స్వర్గం), మధు పెమ్మరాజు (డోరాదార్), ప్రజ్ఞ వడ్లమాని (హైటెక్ అత్తగారు), పాలపర్తి ఇంద్రాణి (కోటిగాని కతలు), నారాయణ గరిమెళ్ళ (మొగమాటస్తుని డైరీ నుండి), కొత్తావకాయ – సుస్మిత (ఎంతెంత దూరం), విజయ కర్రా (రీచ్ ఔట్), ఉమ ఇయ్యుణి (అమెరికాలో ఆస్తిత్వం), జె.బి.యు.వి. ప్రసాద్ (గొర్రెల స్వామ్యం), కలశపూడి శ్రీనివాస రావు (ఇల్లు అమ్మి చూడు), ఇర్షాద్ (వెడ్డింగ్ బెల్స్), శివ సోమయాజుల (శ్రీరాముడికో లైక్), శారద పూర్ణ శొంఠి (ప్రతీచి లేఖ), తాటిపాముల మృత్యుంజయుడు (చివరకు మిగిలేది), శ్రీనివాస భరద్వాజ కిశోర్ (వలస తెచ్చిన మార్పు) మొదలైనవి.  

 

మొత్తం అమెరికా తెలుగు కథలని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చును.  

  1. మాతృభూమి జ్ఞాపకాలు - సాంస్కృతిక ఔన్నత్యం (నాస్టాల్జియా)

  2. అమెరికన్ సంస్కృతి - విద్యా విధానాలు పట్ల అవగాహన కల్పించే కథలు.

  3. అమెరికాలో తెలుగు వారి తరాల మధ్య సంఘర్షణలని చిత్రించిన కథలు.

  4. వివాహ సమస్యలు - భార్యాభర్తల అనుబంధాలు

  5. విభిన్న సంస్కృతులు - వైవాహిక జీవిత సమస్యలు

  6. మధ్య వయస్సు- వృద్ధాప్యం -ఒంటరితనం కథలు

  7. గృహ హింస

  8. అమెరికన్ సంస్కృతిలో మమేకం-అమెరికాలో పిల్లల పెంపకం

  9.  హాస్య కథలు

  10.  ఇతర ఇతివృత్తాలు

ఆఖరుగా - 

 

అమెరికా తెలుగు కథ సంకలనాలు, సంపుటుల ప్రచురణ వివరాలకి వస్తే 1995 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి అమెరికా తెలుగు కథానిక -మొదటి సంకలనం, సత్యం మందపాటి గారి స్వీయ ప్రచురణ “అమెరికా భేతాళుడి కథలు” తొలి ప్రచురణలు గా చెప్పుకోవచ్చును. ఆ తర్వాత ఇప్పటి దాకా 100 దాకా ఆయా రచయితల కథా  సంపుటులూ, కథా సంకలనాలు వెలువడ్డాయి అని ఇక అంచనా వేస్తే వాటిల్లో సుమారు 50 శాతం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురించారు.  

అమెరికా కథ భవిష్యత్తు:  రావలసిన కథలు

ఇక అమెరికా తెలుగు కథకి ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది అనే చెప్పాలి. తమకి ఉన్న భావ స్వాత్రంత్ర్యాన్ని సముచితంగా వినియోగించుకుంటూనే, యావత్ ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఉన్న పాఠకులకి అర క్షణంలో చేరువ అయే అవకాశాలని అంది పుచ్చుకుని ఇప్పటి దాకా ఎవరూ స్పృశించని కథా వస్తువులనీ, సరి కొత్త సంవిధానం లో కథలని వ్రాసి తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసే సువర్ణావకాశాలు అమెరికా కథకులకే కాదు, భారత దేశంతో సహా అన్ని తెలుగు కథకులు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

అమెరికా కథకులు ఇంకా తగిన స్థాయిలో స్పృశించని కథా వస్తువులు : చిన్నప్పుడే అమెరికా వచ్చినా ఇప్పుడు వీసా సమస్యలతో సతమతమవుతున్న యువతరం, గృహ హింస, అక్కడ మితిమీరుతున్న కుల, ప్రాంతీయ సమస్యలు ఇక్కడికి దిగుమతి, లోపించిన హాస్య, ఆహ్లాద కథా రచన,  మారుతున్న సాంస్కృతిక, సామాజిక అవసరాలు, పరుగులు పెట్టిస్తున్న టెక్నాలజీ సమస్యలు,  వర్క్ ప్లేస్ కి సంబంధించిన కథలు, సైన్స్ ఫిక్షన్ మొదలైన విస్తృతమైన కేన్వాస్ మీద ఎన్నెన్నో కథలు రచించవలసిన బాధ్యత, అలౌకికమైన ఆనందం అమెరికా కథకులదే!

నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారికీ, కల్పనా రెంటాల గారికీ మరొక్క సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శలవు తీసుకుంటున్నాను.  

*****

flyer1.jpg
bookcover1.jpg
bottom of page