MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
మరొక అమెరిక్యూపాన్ల కథ
వంగూరి చిట్టెన్ రాజు
మొన్నీ మధ్య నాకూ, మా క్వీన్ విక్టోరియాకీ చిన్న విషయం మీద పెద్ద యుధ్ధమై, ఐ - పోయింది. అంటే కాస్సేపు యుధ్దం అయి, అయిపోయింది...ఇలాంటి కీచులాటలు పది, పదిహేను నిముషాలవీ, అపుడప్పుడు అరగంటా, అరుదుగా రోజంతానూ, వారానికో సారి జరుగుతూనే ఉంటాయి కానీ యుధ్ద విరమణ తర్వాత శాంతియుతంగా కలిసి పెసరట్లు వేసుకుని కాపరం చేసుకునే బదులు ఈ సారి నా మనసంతా కలవరపడి పోయింది.
అసలు ఏం జరిగిందంటే...
మొన్న ‘కరోనా స్పెషల్ పిజ్జా, అంటూ సొంటూ లేకుండా కరోనా అంటకుండా మా కుంపటి నుంచి తిన్నగా మీ కొంపకే...20 శాతం తగ్గింపు’ అనే ప్రకటన టీవీలో చూసి ఆవిడకి నోరు ఊరి పోయి, కనీసం కాసిని బంగాళా దుంపలు అయినా వేయించడానికి కూడా బధ్ధకించి మా ఇద్దరి బక్కా, దుక్కా ప్రాణాలకి రెండు రోజుల కి సరిపడా ఏకంగా 24 అంగుళాల పిజ్జా ఆర్దర్ చేసింది. ఆ పిజ్జా మీద ఆవిడకి ఇష్టమైన హేలపీనో పచ్చి మిరపకాయలు దండిగా ఎలాగా వేయిస్తుంది ...అంటే నూనె లో వేయించడం కాదు...ఆ పిజ్జా మీద చక్రాలు గా తరిగిన ఆ మిరపకాయలు ఆ పిజ్జా వాడికి చెప్పి వేయించడం అనమాట..అలాంటి ఘాటు పిజ్జా వాడి కోసం చీటికీ, మాటికీ గుమ్మం కేసి కళ్ళప్ప్పగించి ఎదురు చూడ్డం మొదలుపెట్టాను. సరిగ్గా ఆవిడ కళ్ళప్పగించి చూస్తున్న టీవీ సీరియల్ లో పాపం మాంచి పట్టు చీర అత్తగారిని జీన్స్ పంట్లాం కోడలు వెనకాల నుంచి కత్తితో పొడవబోయే ముందు ఆ పిల్ల నిఝంగా పొడుస్తుందా లేదా, లేదా అనే సస్పెన్స్ భరించలేని సమయంలో కొంప ములిగిపోయేటట్టు వీధి గంట మోగింది. నేను ఠక్కున లేచి. ముందు తలుపు కన్నంలో చూసి, క్షేమమే అని నిర్ధారించుకుని, తలుపు తీయగానే ఓ గోధుమ సోదరుడు..అంటే పాకిస్తానీ వాడో, గుజ్జూ భాయో, ఇరానీ వాడో తెలియని ఓ మానవుడు గారు నిలబడి ఉన్నాడు. ఒక చేత్తో పిజ్జా డబ్బా చూపిస్తూ, రెండో చెయ్యి ఆమ్యామ్యా కోసం వెకిలి నవ్వుతో ఆ మానవుడు చెయ్యి చాపగానే, డబ్బు కోసం మా కిచెన్ బల్ల మీద ఉన్న మా క్వీన్ విక్టోరియా తను రోజూ భుజాల మీద వేలాడేసుకునే ఆ పెద్ద తోలు సంచీ తెరవ బోయాను. అంతే! ఆవిడ గావు కేక పెట్టి “ఆగాగు” అని టీవీలో ఆ జీన్స్ పంట్లాం తో ఒక గావు కేకా, “ఆగాగు. అది ముట్టు కోకు” అని నాకేసి చూసి ఒక కెవ్వు కేకా పెట్టింది మా క్వీన్ విక్టోరియా. ఆ కేక మీద కేకలకి గుమ్మం దగ్గర పిజ్జా వాడు బిక్క చచ్చి పోయి ఆ పిజ్జా తనే తినేసి ఆ అట్ట పెట్టె అక్కడే వదలి పారిపోవుటయా, లేక అక్కడే బాసిమ్మటం వేసుకుని యోగాసనం వేసి కూచొన వలయునా అని తెలియక గిజగిజలాడుతుండగా నేను గత్యంతరం లేక నా పంట్లా వెనక జేబులో కుక్కుకునే వాలెట్ అనబడే భారీ పర్సు ని కష్టపడి బయటకి లాగి, నా సోషల్ సెక్యూరిటీ డాలర్లు కొన్ని ఆ పిజ్జా మానవుడి చేతిలో పెట్టి సాగనంపాను. ఆ క్షణం లో ఆ మానవుడు నాకేసి చూపు చూసిన చూపు ఏదో సత్యజిత్ రాయ్ సినిమాలో ఓ బెంగాలీ బాబు “జాగ్రత్త బాబూ” అనే డైలాగ్ చెప్తున్న సీన్ గుర్తు చేసింది.
అప్పుటి నుంచీ నన్ను గత నాలుగు రోజుల పాటు తీవ్రంగా వేధించిన సమస్య “ఆ తోలు సంచీ మీద నా చెయ్యి పడగానే, ఆమె తారాస్థాయిలో ఎందుకు గీ పెట్ట వలె? ఆ సంచీలో దాచుకున్న రహస్యం ఏమిటి? అది ఛేదించు మార్గమేమి?” అని ఘోర తపస్సు చేయగా ఆ నిన్న రాత్రే వందో సారి చూసిన ‘పాతాళ భైరవి’ ప్రత్యక్షమై “వెర్రి వెధవా? ఆవిడ నిద్రపోతున్నప్పుడు, గుట్టు చప్పుడు లేకుండా సదరు సంచీ జిప్పు జప్పున లాగి పరిశోధింపుము కానీ ఇలాంటి చచ్చు కోరికలకి నన్ను నిద్ర లేపకుము” అని అంతర్ధానమై పోయింది. ‘కదా” అని నేను ఇవాళ మధ్యాహ్న కాల దుర్ముహూర్తాన ఆవిడ గాఢ నిద్రలో ఉంది కదా అనుకుని మా క్వీన్ విక్టోరియా భుజాల మీద వేలాడేసుకుని తిరిగే ఆ పెద్ద తోలు సంచీ ని ఆంజనేయ దండకం చదువుకుంటూ తెరచి చూసేశాను. అందులో మర్రి చెట్టు తొర్రలో చిలక ప్రాణాల టైపు లో తన సింగారం సామాగ్రి తడీపి మోపెడు. నాకు తెలియక అడుగుతానూ, ఈ కరోనా ముసుగులో పెదాలు ఎవడికీ కనపడవు కాబట్టి రంగు వేసుకునే అవసరమే లేదు కదా!. మరి అన్ని రంగుల లిప్ స్టిక్కులు ఆ సంచీలో ఎందుకున్నాయో నాకు అర్ధం కాలేదు. అవే కాక, నేను సహ సంతక దారుడి గా కమిట్ అయిపోయిన క్రెడిట్ కార్డుల ప్రత్యేక అరా, నాలుగు రకాల మాస్క్ ముసుగుల తో సహా తను పనిచేసే ఆసుపత్రి సరుకులూ, అక్కడ నుంచి కొట్టుకొచ్చిన పెన్నులూ, పెన్సిళ్ళూ, తల నొప్పి మాత్రల డబ్బాలూ, ఎందుకైనా మంచిదని కాబోలు ఒక పవిత్ర భారతీయ అమృతాంజనం డబ్బా, ఓ అరటి పండూ, క్రిస్ మిస్ పళ్ళూ, జీడిపప్పు పొట్లాం, పాత కాలపు ఫోన్ నెంబర్ల చిన్న పుస్తకం, మా పిల్లల చిన్నప్పటి ఫొటోలూ, పెద్దప్పటి కరాటే, కూచిపూడీ ఫొటోలూ ఒక ఎత్తయితే ఆ సంచీ రహస్య గదులలో అమితాబ్ బచ్చన్, హృతీక్ రోషన్, బ్రాడ్ పిట్టూ లాంటి దౌర్భాగ్యుల అందమైన ఫొటోలు చూసి, నెరవేరని ఆవిడ గొంతెమ్మ కోరికలకి నాకు భలే చికాకు వేసింది. అస్సలు ఎక్కడా నా ఫొటో లేకపోవడం అంత కన్నా ఎక్కువ చికాకు వేసింది.
ఇక వీటన్నింటి కిందనా...ఒక డాలర్లు పెట్టుకునే ఒక దట్టమైన అమెరి“కరెన్సీ కవరు” కనపడింది. “హా, హా, తెలిసెన్, ఇంటి దొంగ రహస్యంగా దాచుకున్న వందలాది డాలర్ నోట్ల కట్టలు దొరికెను కదా, అందువలననే కదా నేను తన సంచీ మీద చేయి వేయగనే హాహాకారములు చేసెను. జై పాతాళ భైరవీ” అని ఆ ప్లాస్టిక్ కవర్ ని తెరచి చూడగానే....నేను డంగై పోయాను. అందులో నోట్ల కట్టా లేదు. నా బొందా లేదు. ఉన్నవల్లా ఓ ఇరవై క్లియర్ ప్లాస్టిక్ అరలూ, వాటిల్లో నీటుగా, వాటుగా కత్తిరించి దాచుకున్న దట్టమైన అమెరిక్యూపాన్ల కట్టలూ. అవి ఆయుర్వేదం చూర్ణాల దగ్గర నుంచి టాయ్ లెట్ పేపర్లు, టూత్ పేస్ట్, పేపర్ టవల్స్, పాలూ, పెరుగూ, లిప్ స్టికను బొమ్మల పెన్సిళ్ళూ,,,,ఒకటేమిటి, ఈ అమెరికా చరా చర ప్రపంచం లో ఏ వస్తువు మీద ఎక్కడ 20 శాతం తగ్గింపు క్యూపన్ కనపడినా, అవి ఆ అరల్లో పొదగబడి ఉన్నాయి.
అసలు ఆ అతి పెద్ద తోలు సంచీ భుజాన లేకుండా మా క్వీన్ విక్టోరియా ఏ బట్టల కొట్టుకీ, పచారీ కొట్టుకీ ఎందుకు వెళ్ళదో ఇప్పుడు నాకు అర్ధం అయింది.
ఆవిడ నిద్ర లేచి నేను తన తోలు హేండ్ బేగ్ తెరుస్తుండగా చూసిందంటే నా పని గోవిందా, గోవింద కాబట్టి గుట్టు చప్పుడూ కాకుండా దాని జిప్పు లాగేసి మూసేస్తుండగా అప్పుడు జ్ఞాపకం వచ్చింది.....
అదే ఆ మధ్య ప్రతీ నాలుగో శనివారమూ క్షవరం చేయించుకోడానికి వెళ్ళే ఆనవాయితీ ప్రకారం నేను మా చైనా మంగలి పిల్ల దగ్గరకి బయలుదేరుతుంటే “ఆగు. నేనూ వస్తాను” అని ఆ పెద్ద తోలు సంచీతో బయలు దేరింది మా క్వీన్ విక్టోరియా. నాకు సిగ్గేసి, “ఆ బార్బర్ షాప్ కి ఇలా పట్టు చీర కట్టుకుని వెళ్తే ఆ చీర నిండా నల్లా, తెల్లా, ఇతర రంగు రంగుల కేశములు..అనగా వెంట్రుకలు అల్లుకు పోతాయి” అని నా తీవ్రమైన అభ్యంతరం వెలిబిచ్చాను. ఆవిడ ఒక క్షణం ఆగి “అలా అంటావా?” అని కుచ్చెళ్ళు సద్దుకుని “సరే...అలా అయితే ఇదిగో ఇది పట్టుకుని హైర్ కడ్డీ ...అదేలే..హైర్ షాప్ట్ అనే బార్బర్ షాప్ కి వెళ్ళు.” అని ఇరవై డాలర్ల తగ్గింపు క్యూపాన్ నా చేతిలో పెట్టింది మా క్వీన్ విక్టోరియా! అప్పుడైనా నేను ఊహించలేకపోయాను మా క్వీన్ విక్టోరియా క్యూపన్ రహస్యం. అసలు ఈ క్యుపాన్ల రోగం ఆవిడకి ఎప్పుడు అంటిందో ఈ కరోనా ఎప్పుడు పోతుందో అనే ప్రశ్నలకి సమాధానాలు నా ఊహకి అందనివే!
*****