MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
మహానటితో మూడున్నర నిముషాలు...
వంగూరి చిట్టెన్ రాజు
మూడు, నాలుగు వారాల క్రితం నా అర్ధాంగి తో కలిసి “మహా నటి” సినిమా చూశాను. కానీ సినిమా చూడ లేదు. మహా నటి జీవిత ఆవిష్కరణ చూశాను. సినిమా అవగానే బయటకి వచ్చాక మా ఆవిడ నన్ను చూసి “అదేం. అలా ఉన్నావు? “ అని అడిగింది. ఆ బయో పిక్ చూసిన తర్వాత హాలు బయటకి వచ్చిన వారందరూ అలాగే ఉన్నారు. సరిగ్గా అదే ప్రశ్న మా ఆవిడ నలభై ఏళ్ల క్రితం అడిగినప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలానే ఉన్నాను. ఎందుకంటే ‘మహానటి’ ని చూస్తున్నంత సేపూ నా మనస్సు సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఆ మూడున్నర నిముషాలే పదే, పదే గుర్తుకు వచ్చాయి. అదే నేను మహానటిని మొదటి సారీ, ఆఖరి సారీ నిజ జీవితంలో చూడడం.
అసలేం జరిగిందంటే.....అది 1978 వ సంవత్సరం. మే నెల మొదటి వారంలో ఒక రోజు. మాకు అప్పటికి విశాఖపట్నంలో పెళ్లి అయి వారం, పది రోజులు దాటి, వెంటనే కాకినాడ మా ఇంటికి వెళ్లి సత్యనారాయణ వ్రతం మొదలగు కార్యక్రమాలయ్యాక సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో మద్రాసు వెళ్లాం...కొత్త పెళ్ళాం...అంటే నాకు పెళ్ళీ కొత్తే..ఆ అమ్మాయీ కొత్తే....నాకు ఎలాగా గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి అది గర్వంగా జేబులో పెట్టుకుని ఆవిడకి అమెరికా వాడి వీసా కోసం మద్రాసు వెళ్లాం అన్నమాట. అక్కడ కాన్సలేట్ కి ఎదురుగా ఉన్న పామ్ గ్రోవ్ హోటల్లో ముందు రోజు రాత్రి బస చేసి, మర్నాడు అమెరికా కాన్సలేట్ లో వీసా అప్లికేషన్ పడేసి, మధ్యాహ్నం సుప్రసిద్ధ జానపద గాయని అవసరాల అనసూయా దేవి గారి ఇంటికి వెళ్లాం. ఆవిడ మా హ్యూస్టన్ నర్తకి రత్నపాప కన్న తల్లి. కొత్త పెళ్ళాన్ని ఆవిడకి చూపించి మార్కులు కొట్టేయాలి అని నా దురూహ. ఆ రోజుల్లో టెలి ఫోన్లు లేవు కాబట్టి చెప్పా పెట్ట కుండా ఆవిడ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళే టప్పటికి ఆవిడ ఖంగారు పడిపోయారు పాపం. అంత కంటే ఎక్కువ గా ఆనందపడిపోయి అప్పటికప్పుడు లోపల ఎక్కడో గోడ మీద ఉన్న ఒక అజంతా శిల్పం చిత్ర పటాన్ని తీసేసి మాకు పెళ్లి బహుమతిగా ఇచ్చారు అనసూయ గారు. అలాగే అప్పటికప్పుడు ఆవిడ చేసి పెట్టిన పకోడీలు కూడా తినేసి, కాఫీ తాగేసి, కబుర్లు చెప్పేసుకుని మళ్ళీ సర్కార్ ఎక్స్ ప్రెస్ లోనే తిరుగు ప్రయాణానికి మద్రాసు సెంట్రల్ స్టేషన్ కి వెళ్లి పోయాం నేనూ, మా ఆవిడా. ఆ బొగ్గు రైలు రాత్రి సుమారు 9 గంటలకి.
కొత్త దంపతులం, హనీమూన్ రోజులు కదా.....అంచేత రైల్లో ఫస్ట్ క్లాస్ కూపే తప్పదు...అందులో ఇద్దరం మా రెండు పెట్టెలు..రేకు పెట్టెలు అనే జ్ఞాపకం, పైగా పెట్టెలకి చక్రాలు లేని రోజులు...అవి సీటు క్రింద సద్దేసుకున్నాం. ఆ రోజుల్లో ఇప్పటిలా రైల్వే వారే దుప్పట్లు, తలగడాలు ఇచ్చే వారు కాదు. అంచేత మేమే తెచ్చుకున్న వాటిని రెండు క్రింద బెర్తుల మీద పరుచుకుని సెటిల్ అవుతున్నాం. ఇక రైలు కదలడానికి పదిహేను నిముషాలు సమయం ఉంది అనగా....కిటికీ లోంచి చూస్తే ప్లాట్ ఫార్మ్ అంతా కలకలం. అది కూడా మా కంపార్ట్ మెంట్ గుమ్మం దగ్గరే. ముగ్గురు ఆడవాళ్ళు ఒకావిడని మా ఫస్ట్ క్లాస్ పెట్టెలో కి ఎక్కించడానికి నానా అవస్తా పడుతున్నారు. “నువ్వ్వు ఇక్కడే అలాగే కూచో” అని మా ఆవిడకి చెప్పి నేను సహాయం చేద్దాం అని గుమ్మం దగ్గరకి వెళ్లి వాళ్ళ పెట్టె అందుకో బోతూ ఆవిడ కేసి చూసి కొయ్యబారి పోయాను. ఆవిడే మహా నటి సావిత్రి.
ఆ మహా నటిని అసలు ఎప్పుడైనా చూస్తాను అని కానీ, చూసినా అలాంటి పరిస్థితిలో చూడవలసి వస్తుంది అని కానీ నా జన్మలో అనుకో లేదు. మొహం కాస్త ఉబ్బి ఉంది. శరీరం బాగా భారీగా ఉండి కాలు పైకి ఎత్తి కంపార్ట్మెంట్ లోకి ఎక్కే ఆ మూడు మెట్ల మీద పెట్టడానికి కష్టపడుతున్న సావిత్రిని, ఆవిడని పట్టుకుని సహాయం చేస్తున్న ఇద్దరు స్త్రీలనీ నిస్సహాయంగా చూస్తూ....ఆవిడ పెట్టె మాకు రెండు కంపార్ట్మెంట్ల పక్కన ఉన్న దాంట్లో పెట్టి మా కూపే లోకి వచ్చేశాను. “అదేం. అలా ఉన్నావు?” అని అడిగింది మా ఆవిడ. “సావిత్రిని చూశాను. పక్క కంపార్ట్మెంట్ లో ఉంది.” “ఎవరూ? మహా నటి సావిత్రే! పద. పలకరిద్దాం” అని లేచింది మా ఆవిడ. “వద్దులే. తట్టుకోలేవు.” అని ఆవిడని కూచోపెట్టేశాను. నేను అప్పటికే నాలుగేళ్ళు అమెరికాలోనే ఉన్నా, అంతకు ముందు బొంబాయిలో ఎనిమిదేళ్ళు ఉన్నా, సావిత్రి జీవితంలో కష్టాల గురించి పుకార్లు, అప్పుడప్పుడు వింటూనే ఉన్నాను. మహానటి పరిస్థితి గురించి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా...
ఆ నాటి కథ అక్కడితో అయిపోతే బావుండును. కానీ....
అప్పుడు ఎవరో ఇద్దరు ఒకాయన్ని ఇంచు మించు మోసుకొచ్చి ఒక కింద బెర్త్ మీద పడుకోబెట్టేశారు. ఆ మానవుడు స్పృహలో లేడు. అతడిని చూడగానే మా కొత్త పెళ్ళాం రెండు సార్లు కెవ్వున కేక పెట్టింది. మా పెళ్లి అయిన తర్వాత ఆవిడ కెవ్వు కేకలు వినడం లో అదే నా మొదటి అనుభవం. అయినా టీకా తాత్పర్యాలు తెలిసిపోయాయి. మొదటి కేక ఎందుకంటే ఆవిడకి తాగుబోతులంటే విపరీతమైన భయం.. ట. అదెందుకూ అంటే తన చిన్నప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే ఓ తాగుబోతు వాడు తూలుతూ వెనక నడుస్తుంటే ఈవిడ హడిలి పోయి వెనకాల వాడి కేసి చూస్తూ ముందు ఉన్న గోతిలో పడిపోయింది.. ట.
ఇక రెండో కేక సమయానికి నేను కూడా ఆ మానవుడి కేసి చూసి కేక పెట్ట లేదు కానీ ఆవిడ కేక ఎందుకో గ్రహించాను. ఎందుకంటే ఆ మానవుడు మరెవరో కాదు. “ఆంధ్రా దిలీప్” అని పేరు పొందిన సినీ నటుడు చలం. అప్పటికే చాలా హీరో పాత్రలు, ప్రేమించి చూడు లాంటి సినిమాలలో హాస్యం పాత్రలూ వేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. పాపం ఎన్ని మంచి సినిమాలు తీసినా, ఎంత బాగా నటించినా తగినంతగా రాణించని, తగిన గుర్తింపు పొందని నటుల్లో చలం ఒకడు. ఆవిడ “ఊర్వశి” కాక ముందు సినీ నటి శారదని వివాహం చేసుకున్నాడు కానీ అది వర్క్ ఔట్ అవలేదు. బహుశా ఆ రోజులలోనే అదుపు లేని మద్యపానానికి అలవాటు పడ్డాడేమో మరి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే ...నిజానికి ఆయనకి ఇచ్చినది ఈ కూపేలో పై బెర్త్ కానీ అది ఎక్కే పరిస్థితిలో ఆయన లేడు. ఎక్కించే పరిస్థితిలో నేను లేను. మా ఆవిడ కూడా ఈ రోజుల్లో ఆడపిల్లల లాగ చెంగున పైకి గెంతి పై బెర్త్ మీద కి వెళ్ళే టైపు మనిషి కానే కాదు. అలా అని పోనీ వాళ్ళిద్దరూ క్రిందన ఉన్న చెరో బెర్త్ మీద సద్దుకుంటే నేను పై బెర్త్ మీదకి వెళ్ళొచ్చును కదా అనుకుంటే ఆ తాగిన వాడు పక్క బెర్త్ లోనే ఉండగా ఇక్కడ పడుకో మంటావా, పైగా సినిమా వెధవ కూడానూ...అని ఆ కొత్త అర్ధాంగి కుడి కంట్లో రెండు కంటి బొట్లు. “అది కాదోయ్. వాడు శుభ్రంగా తాగేసి పడిపోయాడు కదా. తెల్లారే దాకా కళ్ళు తెరవడు. తాగ కుండా ఉన్న సినిమా వాడిని నమ్మకూడదు కానీ ఇలాంటి వాడు చాలా సేఫ్” అని నచ్చ జెప్పడానికి ప్రయత్నం చేసినా అవేమీ ఫలించనే లేదు. ఇంకేం చేస్తాం. రాత్రి అంతా అటు కొత్త పెళ్ళాన్నీ, ఇటు మైకంలో ఉన్న ఆంధ్రా దిలీప్ నీ నేనే ఒక కంట కనిపెట్ట వలసి వచ్చింది. ఆయనని మోసు కొచ్చిన వాళ్ళు పక్క నే ఉన్న మూడో తరగతి పెట్టెలో ఉండి, ఏదైనా పెద్ద స్టేషన్ లో ఆగినప్పుడు వచ్చి చూసి వెడుతున్నారు. దీన్నే కంచి గరుడ సేవ అంటారు.
ఇక ఆ రాత్రి జాగరణ చేస్తూ, చేస్తూనే మధ్యలో మా ఆవిడ నిద్రపోగానే, పక్క బెర్ట్లో ఇంకా అచేతనంగా పడుకుని ఉన్న చలంని చూసి ఇక పరవా లేదులే అని పై బెర్త్ ఎక్కి కాస్త కునుకు తీశాను. తెల్లారి లేచే సరికి చూద్దును కదా...మా ఆవిడా, సినీ నటుడు చలమూ హాయిగా మాట్లాడేసుకుంటున్నారు. తీరా చూస్తే అది విజయ వాడ స్టేషన్. నేను కిందకి దిగగానే ఆయన షేక్ హాండ్ ఇచ్చి, పరిచయం చేసుకుని “ఇడ్లీలు తెపిస్తాను. ఉండండి” అనే సరికి ఆశ్చర్య పోయాను. నేను ఆశ్చర్యపోయింది ఇడ్లీల గురించీ, పచ్చడి గురించీ కాదు. వాళ్ళిద్దరూ హాయిగా మాట్లాడుకుంటూ ఉండడం గురించి. ఏం జరిగిందంటే.. పొద్దుటే ఆయన మామూలు మనిషి అయి లేచి కూచోగానే మా ఆవిడ కంగారు పడి ఠక్కున లేచి, నన్ను లేపడానికి నుంచోగానే ఆయన ఆవిడని పలకరించి ఎంతో మర్యాదగా మాట్లాడి ఊరూ, పేరూ కనుక్కున్నాడు. తను నా గురించీ, అమెరికా గురించీ చెప్పగానే ..ఇంకే ముందీ ఆయన గౌరవం రెట్టింపు అయిపోయి “చెల్లెమ్మా” ని పిలిచేయడంతో ఈవిడ మురిసి పోయింది. అన్నీ సద్దుకున్నాయి.
ఆ తర్వాత మేము ఇద్దరం ఆయన మరో మూడు గంటలలో తణుకులోనో, తాడేపల్లిగూడెం లోనో దిగి పోయేటప్పటికి గొప్ప స్నేహితులం అయిపోయాం. ఎందుకంటే అప్పుడు చలం జీవిత ద్యేయం ఎలాగైనా అమెరికాలో చింతామణి నాటకం వెయ్యాలీ అని. ఆ నాటకంలో చలం కొన్ని వందల సార్లు వేసిన సుబ్బి శెట్టి పాత్ర కి చాలా పేరు తెచ్చుకున్న నటుడు. కానీ ఎప్పుడూ ఆయనకి అమెరికాలో ఉండేవారు ఎక్కడా కలువలేదు... ఆ రోజుల్లో ఈ ఎన్నారై అనే మాట వాడుక లో లేదు.....ఫారిన్ రిటర్న్డ్ అనే అనే వారు....అలా ఫారిన్ రిటర్న్డ్ గా పరిచయం అయిన మొదటి వ్యక్తిని నేనే ..ట...అలా కలుసుకున్నాక మా ఇద్దరి మధ్యా రెండు, మూడు సంవత్సరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఆ రోజుల్లో ఉండే ఒకే ఒక్క జాతీయ సంస్థ తానా లో ఒక డైరెక్టర్ గా ఉన్నప్పటికీ, చింతామణి బృందం అందరినీ..సుమారు 8 మందిని అమెరికా తీసుకు వచ్చి ప్రదర్శనలు ఇప్పించడానికి ఒప్పించలేక పోయాను. ఇప్పుడు నేనే వెళ్ళలేను! ఆ అతి మంచి నటుడు “ఆంధ్రా దిలీప్” 1989 లో తన 60 వ ఏట మరణించాడు.
మహానటి ధర్మమా అని...మళ్ళీ నలభై ఏళ్ళ నాటి రాత్రి విశేషాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అంత కంటే ముఖ్యంగా మహానటి సావిత్రి సినిమాలతో పెరిగిన మా తరం ఎంత అదృష్టవంతులమో అని కూడా అనిపిస్తోంది. చాలా సినిమాలలో ఆ నాటి సావిత్రిని చూసి ప్రేక్షకులు కంట తడిపెట్టే వారు. ఈ నాటి హీరోయిన్లని చూడలేక భోరుమంటున్నారు. అంతే తేడా!
***