MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వంగూరి పి.పా-25
ఊ అంటావా? ఊ ఊ అంటావా?
వంగూరి చిట్టెన్ రాజు
మొన్న డిశెంబర్, 2021….అనగా గత రెండు, మూడు వారాలనుంచీ ఎవరి నోట విన్నా అదే కూత. నేనూ సరదాగా మా సతీమణితో “ఇవాళ మామిడి కాయ కొబ్బరి కాయ పచ్చడి చేద్దాం. ఊ అంటావా, ఊ అంటావా” అనగానే ఆవిడ గయ్ మని లేచింది. “చంపేస్తాను. ఏమిటా వెధవ మాటలు. ఇన్నేళ్ళోచ్చాయ్” అంటూ దండకం చదివింది. అంటే ఆవిడకి కూడా ఊ అంటావా, ఊ ఊ అంటావా అంటే దేని గురించో తెలిసిపోయింది అన్నమాట. అవును మరి. యూ ట్యూబ్ లో కేవలం ప్రచారం కోసం విడుదల చేసిన ఆ పాట వీడియోని ఏకంగా 78 మిలియన్ల మంది సమంతని చూస్తూ ఆ పాట విన్నారూ అంటే ఎవరూ చూడకుండా తప్పించుకోలేకపోయారనేగా?! ఆ డిఎస్పీ అనే సంగీత దర్శకుడి కి కావలసిన మసాలా ఉంటే చాలు. ఆఫ్రికన్ అమెరికన్ మాస్ బీట్ తో రెచ్చిపోతాడు. ఇది వరకూ వచ్చిన ‘కెవ్వు కేక’ కూడా అతని ట్యూనే!. ఈ బీట్ మసాలాకి కావలసినదల్లా కుర్రకారు చేత గెంతులేయించే అమ్మాయి, కొంచెం అశ్లీలం ఈ డాన్స్ హీరోయిన్ చేత చేయిస్తే ఇమేజ్ దెబ్బతింటుందేమో అని దాన్ని ఐటెం సాంగ్ లా మరో అమ్మాయితో సినిమా మధ్యలో ఇరికించెయ్యడం ఒక ప్రమోషనల్ టెక్నిక్. ఇలాంటి వాటికి ఈ సుకుమార్ అనే దర్శకుడు ఆదర్శప్రాయుడు. 2021 ఆఖరి రోజుల్లో వచ్చిన ఈ సినిమా మన తెలుగు సినిమా ప్రస్తుత వికాసానికి ఒక ఉదాహరణ.
నిజానికి ఈ పాటలో మరీ అంత అశ్లీలం లేదు. ఇంతకన్నా ద్వందార్ధాలతో ఎల్లారీశ్వరి చాలానే పాటలు పాడింది. కానీ ఈ సారి పురుషులలో కొంత మంది పుణ్య పురుషులకి కోపం వచ్చి ఈ పాటనీ, సమంతనీ బహిష్కరించాలి అనీ, సినిమాలో ఆ పాట తీసెయ్యాలి అనీ కోర్టులో దావా వేశారుట. ఇక ఈ పాట రిలీజ్ అవగానే రాగానే పేరడీల వర్షం ప్రారంభం. ఈ పాటకి మగ వెర్షన్ అంటే అబ్బాయిలని వాడుకునే అమ్మాయిల బుధ్ధి గురించి కొందరూ, ఆఖరికి అన్నమాచార్య కీర్తనలు పాడే ఆత్మీయ గాయని “పద్మశ్రీ” శోభారాజు గారితో సహా చాలా మంది స్పందిస్తూ అదే ట్యూన్ కి ఎవరి వెర్షన్ వాళ్ళు రాసేసి మన మీదకి వదిలేశారు.
ఈ హడావుడి అంతా గమనించి, నాకూ కుతూహలం పెరిగిపోయి మా అర్ధాంగితో, ఎంతో అనురాగంతో “ఏమోయ్, ఈ వెధవ కోవిడ్ మూలాన హాలులో సినిమా చూసి ఏడాది దాటిపోయింది కదా. మరేమో అదేదో పుష్ప అనే సినిమా మన ఇంటి దగ్గరే హాల్ లో విడుదల అయిందిట. టికెట్లు కొంటాను. ఊ అంటావా, ఊ ఊ అంటావా?” అని అడిగాను, భయం భయం గానే. కొంచెం దూరంగా నుంచుని. ఆవిడ నాకేసి అదోలా చూసి, తన కేలుక్యులేషన్లు చక చకా చేసేసుకుని “ఒక కండిషన్ మీద ఐతే ఊ అంటాను” అంది. సంబర పడిపోయి “ఏమిటా కండిషన్, అక్కడ సమోసాలు కొనిపెట్టాలా, పకోడీలా?” అని అడిగాను. “సమోసాలూ కాదు. నా మొహమూ కాదు. ఆ పాట వచ్చినప్పుడు నువ్వు హాలు బయటకి పోవాలి” అంది మా సతీమణి. మళ్ళీ అదోలా చూస్తూ. నాకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయిపోయి కొంచెం బతిమాలుతూ నెగోషియేషన్స్ మొదలుపెట్టి నానా అవస్థా పడగా మొత్తానికి మా ఇద్దరికీ మధ్యవర్తిగా లేదా నాకు కాపలాదారుగా మాతో కూడా మా ఆప్త మిత్రుడిని కూడా తీసుకుని వెళ్ళడానికి రాజీ పడి, చాలా రోజుల తర్వాత ముగ్గురం ఆ సినిమాకి వెళ్ళాం.
మూడు గంటల పాటు , ఇంటర్ వెల్ కూడా లేకుండా ఈ ‘పుష్ప’ అనే ఆ సినిమా విధించిన కఠిన శిక్ష అనుభవించి, ఇంటికి వచ్చిన మా ముగ్గురి లో ఏ ఒక్కరికీ ఆ సినిమా అస్సలు అర్ధం అవలేదు. అసలు ఆ హీరో కూడా మంచి వాడో, లేక ఒక భారీ ఎర్ర చందనం స్మగ్లరో కూడా తెలియ లేదు. సుమారు యాబై పాత్రలు. పైగా అంతా స్థానిక మాండలీకం. 90 శాతం సినిమా అంతా కొట్టుకు చచ్చిపోవడాలే. హీరోయిన్ తో ఉన్న అరా కొరా రొమాన్స్ సన్నివేశాలు కూడా మధ్యే మధ్యే ‘కషాయం’లా ‘చవక’ బారు గానే ఉన్నాయి. చవక అని ఎందుకు అంటున్నానూ అంటే ఆ అందమైన అమ్మాయి హీరో కేసి చూడడం కోసం రేటు వెయ్యి రూపాయలు అయితే ముద్దు పెట్టుకోడానికి ఐదు వేలుట. ఇదీ మరి కథానాయకి పరిస్థితి. ఇక సినిమా అంతా హీరో ఫైటింగ్ల తోటి ప్రేక్షకులని ఆకట్టుకోడానికి నానా తంటాలూ పడ్డారు. కాస్తో, కూస్తో విషాద రసం, సెంటిమెంటూ కావాలి కాబట్టి హీరోని వంకర బుద్ధితో అక్రమంగా పుట్టించి, టపా కట్టేసిన ఒక మగ మహానుభావుడు అప్పుడప్పుడు తెరమీదకి వస్తాడు. నవ రసాలలోనూ ఈ సినిమాలో పూర్తిగా లోపించినది హాస్య రసమే! ఉన్నదంతా భీభత్స రసమే!
మా రోజుల్లో అయితే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ ఊ అనాలా ఊ అనాలా అనే ప్రశ్న పెళ్ళిచూపులు రోజునే జన్మానికి ఒకే సారి వచ్చేది. ఒక సారి ఊ అనేశాక, జీవితాంతం ఊ ఊ అనడానికి అవకాశం లేదు. ఈ రోజుల్లో కొన్నేళ్ళ డేటింగూ, సహజీవనమో, రెండూనో అయ్యాక కూడా పెళ్ళికి ఊ అనాలా ఊ ఊ అనాలా అనే ప్రశ్న వస్తూనే ఉంది. అప్పుడు ఊ అనేసి, కొన్నేళ్ళు కాపురం చేశాక ఊహూ ఊహూ ఇదేం వర్క్ ఔట్ అవడం లేదు అని విడాకుల ప్రసక్తి వచ్చేటప్పటికి ఇద్దరూ కలిసి ఊ అనేసుకుంటే కోర్టు వారికి ఇబ్బంది లేదు. కానీ ఒకరు ఊ అనీ, ఇంకొకరు ఊ ఊ అనీ పంతాలకి పోతే అంతే సంగతులు. పిల్లల పెంపకాలు, ఆస్తుల పంపకాలు, మనోవర్తి, మొదలైన విడాకుల కేసులకి అమెరికాలో లాయర్ల ఫీజులు లక్ష డాలర్ల పైనే.
ఇక ఇవి ఏడాదిలో చివరి రోజులు కాబట్టి, కొత్త సంవత్సరం మొదలయ్యేటప్పుడు ఊ అనాలో ఊ ఊ అనాలో తేల్చుకోవలసిన అసలు పనులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మా ఇంటి ఇస్యూరెన్స్ కి పాత కంపెనీ వాడు రేటు ఏకంగా 30 శాతం పెంచేశాడు. ఇప్పుడు వాడికి ఊ అనాలా ఊ ఊ అనాలా? అలాగే కారు ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇలా అన్నీ పెరిగిపోవడమే. అంచేత వెంటనే ఊ అనకుండా, ప్రతీ దానికీ షాపింగ్ చేసి, కొంతమంది కొత్తవాళ్ళకి ఊ అనీ, పాతవాళ్లకి ఊ ఊ అనీ పాట పాడాలి. అసలు 2021 కి వీడ్కోలు పలకడానికీ 2022 కి స్వాగతం చెప్పడానికీ ఎందుకో అంత ఉత్సాహంగా లేదు. అలా కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. మనమందరం ఈ కొత్త సంవత్సరంలో మంచివాటికి ఊ అంటూ, మంచిది కానీ వాటికి ఊ ఊ అంటాం అని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు.
*****