top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వంగూరి పి.పా.

 

వెళ్ళమ్మా, వెళ్ళు...  ఇక చాలు!

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు

చెప్పొద్దూ, తద్దినం పెట్టడం కూడా ఇంత సంతోషంగా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకో లేదు. సాధారణంగా ప్రతీ ఏడూ ఒక కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఆ ముందు రోజు న్యూ యార్క్ టైమ్ స్క్వేర్ లో జనం తాగి తాగి తందనాలు ఆడుతూ దానికి స్వాగతం చెప్తూనే ఉంటారు. ఆ బంతి పై నుంచి కిందకి జారుతూనే ఉంటుంది. ఈ ఏడూ జారుతుంది కానీ అంతర్జాలం లోనేట. అలా తాగి తందనాలు ఆడడం కూడా ఇళ్ళలోనేట.

 

మామూలుగా అయితే కొత్త ఏడాది వస్తోంది అంటే ఎంత హుషారు గా ఉంటుందో, పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడం అంత విచారంగానూ ఉంటుంది కానీ ఈ సారి ఈ 2020 సంవత్సరానికి పో, పో , మళ్ళీ వచ్చావో , అంతే సంగతులు అని సంతోషంగా తద్దినం పెట్టి  సాగనంపడానికి భలే సంతోషం గా ఉంది. అలా అని 2021 వస్తోంది అంటే పెద్ద సంబడం గా కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంత నిర్లిప్తత, నిరాసక్తకకీ కారణం చైనా చేపల బజారే. అక్కడ బయలు దేరిన ఈ దిక్కుమాలిన కోవిడ్ 19 అనే సూక్ష్మ క్రిమి కి భయపడి ఎల్లలు లేని అంతర్జాలం లోనే సాహిత్య సమ్మేళనాలూ, దేశ దేశాల రాజకీయ నాయకుల శిఖరాగ్ర సమా’వేషాలూ’, పెళ్ళిళ్లూ, పండగలూ.. శ్రాధ్ధాలూ, పిండ ప్రదానాలూ కూడా అన్నీ గాలి లోనే. మన  నెట్టింట్లోనే లుంగీ కట్టుకుని  ప్రపంచ సాహితీ సదస్సులు నిర్వహించి అవతల పారెయ్య వచ్చును. అలా పొలో మని సాహితీ సదస్సుల మీద సమా'వేషాలు' నిర్వహించి పారేస్తున్న వారు కోకొల్లలు.  మొన్న అక్టోబర్ లో మేము కూడా ఆ పనే చేసి చరిత్ర సృష్టించాం అని చెప్పుకుని చరిత్ర సృష్టించాం. 

నిజానికి ఈ 2020 సంవత్సరాన్ని సమీక్ష అని వంక పెట్టి మళ్ళీ జరిగిన దౌర్భాగ్యాలన్నీ ఏకరువు పెట్టడం తగని పనే. కానీ మొత్తం జీవన విధానం అంతా అస్తవ్యస్తం అయినప్పుడు వాటిల్లో కొన్నింటిని తల్చుకుని భోరుమనడం, మరి కొన్నింటిని తల్చుకుని భలే అదా అనుకోవడం లో తప్పు లేదు కదా!. 

ఒక సారి వెనక్కితిరిగి చూసుకుంటే...

ఏడాది క్రితం నేను మాస్క్ పెట్టుకుని పబ్లిక్ లో కనపడితే ఒట్టు. ఇప్పుడు ఆ మాస్క్ లేకుండా పబ్లిక్ లోనే కాదు, మా వంటింట్లో కూడా కనపడితే ఒట్టు. ఏడాది క్రితం కిరాణా కొట్టులో  “ఆ అమ్మాయి ఎంత బావుందో’ అని లోలోపల అనుకుని  మెచ్చుకోవటం ఒక సరదా. ఇప్పుడు ఈ ముసుగు వెనకాల వీర వనితా, లేక వీర వెధవా” అని తెలియక నా ముసుగు సద్దుకుని బుద్ధిగా ఉండడం ఈ ఏడే మొదలైన ఒక దౌర్భాగ్యం. 

ఏడాది క్రితం దాకా ట్రంప్ గారి పాలనలో స్టాక్ మార్కెట్ ప్రతీ రోజూ ఒక కొత్త రికార్డే. ట్రంప్ గారు కాలర్ ఎగరేసుకుని తిరగడమూ రోజువారీ దిన చర్యే.  అమెరికాలో ఈ స్టాక్ మార్కెట్ కి రెండే రెండు గతులు ఉంటాయి. ఒకటి పురోగతి ని సూచించే ఆంబోతు మార్కెట్. అనగా దేశం గొప్పగా అభివృద్ధి చెందుతోంది అని స్టాక్ బ్రోకర్లు అనేసుకుని, స్టాకులు కొనేసుకుని, ధరలు పెంచేసుకుని మా లాంటి వాళ్లకి లాభాలు చేకూర్చే పరిస్థితి ని ‘బుల్ మార్కెట్” అనమాట.. రెండోది దానికి పూర్తిగా వ్యతిరేకం అయిన ఎలుగుబంటి మార్కెట్.... అనగా, దేశం దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది కాబట్టి, స్టాకూ, లేదు గాడిద గుడ్డూ లేదు, అన్నీ అమ్మేసుకుని నగదు రూపంలో భోషాణం పెట్టెలో పెట్టేసుకుందాం అనుకునే నిస్సహాయ పరిస్థితిలో కొనేవాడు లేక కంపెనీ స్టాకులు చతికిల పడిపోయే “బేర్’ మార్కెట్. మధ్యే మధ్యే పానీయం అన్నట్టు ఈ ఆంబోతు కీ, ఎలుగు బంటికీ మధ్య కుక్కానక్కల మార్కెట్ లో ఈ స్టాకులు పడుతూ, లేస్తూ ఉంటాయి. అలా ఎలుగు బంటి సమయం లో మనం సాహితీ సదస్సు పెడితే  కాణీ కూడా విరాళాలు రావు. కానీ ఆంబోతు సమయం లో అడిగిన వాడిదే ఆలస్యం. డాలర్లు గల గలా రాల్తాయి. కానీ ఇప్పుడు ..అనగా 2020 లో అత్యంత విపత్కర పరిస్థతి వచ్చి పడింది.  అమెరికా చరిత్రలో ఈ స్టాక్  మార్కెట్ ఏకంగా 35% పడిపోవడానికి ఇది వరలో ప్రతీ సారీ సుమారు 11 నెలలు దాకా పడితే, గత 2020 ఫిబ్రవరి లో ఈ దిక్కుమాలిన కరోనా మహమ్మారి అమెరికాకి రాగానే కేవలం 23 రోజుల్లో స్టాక్ మార్కెట్ 35 శాతం పడిపోయింది. నేను మా ఇంటి పక్కనే ఉన్న గాస్ స్టేషన్ .అనగా పెట్రోల్ బంక్ లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి వెళ్తే అక్కడి పాకిస్తానీ యజమాని యూసఫ్ తనే ఇంకో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తూ కనపడ్డాడు. మరో నాలుగు రోజుల తర్వాత చూస్తే ఆ యూసఫూ లేడు, ఆ పెట్రోల్ బంకూ లేదు, పక్కనే ఉన్న చైనా వాడి లాండ్రీ దుకాణమూ లేదు, అవతల వేపు ఉండే రెస్టారెంటూ లేదు, గత ముఫై ఏళ్ళగా నా జులపాలు కత్తిరించిన ఆ వియత్నాం అమ్మాయి తాలూకు బార్బర్ షాపూ లేదు. అంతా కరోనా దెబ్బకి ఆం ఫట్!  కొన్ని వేల వ్యాపారాలు మూతబడ్డాయి. కొన్ని మిలియన్ల ఉద్యోగాలు ఆం ఫట్.

ఈ స్టాక్ మార్కెట్ పతనం అయ్యాక నాబోటి గాళ్ళం అందరం కలుసుకుని మూకుమ్మడిగా ఆశ్చర్యకరంగా పొలో మని కింద పడిపోయిన స్టాకులు ఐదారు నెలల్లోనే ఈ కోవిడ్-19 నియంత్రణం మీద ట్రంప్ గారు చేతులు ఎత్తేశారు  అని తెలిసి పోయి కాస్త అవగాహన రాగానే స్టాకులు అదే స్పీడుతో పుంజుకున్నాయి. గతం లో అలా 30 శాతం పుంజుకోడానికి నాలుగైదేళ్ళు పడితే, ఇప్పుడు నాలుగైదు నెలల్లోనే మామూలు స్థాయికి వచ్చేశాయి. ఈ పతనం రికార్డు గురించి సి ఎన్ ఎన్,  ఎమ్ ఎస్ ఎన్ బీసీ మొదలైన చానెల్ వారూ, బైడెన్ పార్టీ వారూ భోరుమని విలపిస్తూ అన్నింటికీ ఆయనే కారణం..అనగా ట్రంప్ మూలాన్నే ఇంత అనర్ధం జరిగింది అని ప్రచారం చేస్తే పుంజుకున్న స్టాక్ మార్కెట్ అధిగమించిన రికార్దుల గురించి మాత్రమే  ఫాక్స్ చానెల్ వారు, ట్రంప్ గారూ టాం టాం చేశారు. సరిగ్గా అదే విధంగా కరోనా తొలి దశ లో ఉద్యోగాలు ఊడిపోయి నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కూడా ముందు 30 శాతం పెరిగిపోయి, మళ్ళీ పాతిక శాతం తగ్గిపోయింది. కానీ ఘనత వహించిన మా అమెరికా ప్రభుత్వం వారి సహాయ భృతి వలన అనుకోకుండా కాసిన్ని డాలర్లు బేంక్ లో జమ అయ్యాయి. తీరా చూస్తే అది మా ఆవిడ బేంక్...ఎందుకంటే ఆవిడ ఇంకా ఉద్యోగం చేస్తోంది మరి. నా విషయం లో మనం ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే. ఎందుకంటే మనం స్వయం ప్రకటిత నిరుద్యోగి కేటగిరీ లోకి వస్తాం. 

ఇక అన్నింటికన్నా విచిత్రం మా అమెరికా ఎన్నికలు. వెధవ కరోనా వస్తే వచ్చింది అనుకుని వేల కొద్దీ జనం ట్రంప్ గారి ప్రవచనాలకి వస్తే, ఆ కరోనా ఆయనకే... అంటే సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడికీ, ఆయన సతీమణి కీ, అనుయాయులలో చాలా మందికీ వచ్చింది. “నాకే కాదు, కెనడా ప్రధాన మంత్రికీ, ఇంగ్లండ్ ప్రధాన మంత్రికీ కూడా కరోనా వచ్చింది కాబట్టి అది నా తప్పు కాదు. అది రాకుండా ఎలాగా ఆపలేమ్ కాబట్టి మాస్క్ లు పెట్టుకోక పోయినా పరవాలేదు. ఆ రోగం వచ్చిన తర్వాత నివారణకీ, రాకుండా చేసే వేక్సీన్ ల మీదా దృష్టి పెట్టి ట్రంప్ గారు ఓడిపోయారు. ఇక్కడ అసలు ప్రశ్న ట్రంప్ ఓడీపోయాడా లేక బైడెన్ నెగ్గాడా అనేదే! లేక పోతే తన ఇంట్లోనే బేస్ మెంట్ లోనే కూచుని ప్రచారం చెసిన బైడెన్ ఎక్కడో తొండి చెయ్యకపోతే ఎలా నెగ్గుతాడూ అనేది నమ్మ దగిన పెద్ద వాదనే కానీ దాం దుంపదెగా... ట్రంప్ గారి ప్రాణాలకి అది నిరూపించలేని వాదన. ఈ ఎన్నికలలొ కమల గారి పాత్ర నేను అనుకున్నదాని కన్నా చాలా తక్కువే ఉంది. కానీ బైడెన్ జాతకం వక్రీకరిస్తే ఆవిడ అమెరికా అధ్యక్షురాలు అయినా అవవచ్చును. ఏమో గుర్రం ఎగరా వచ్చును.  

ఇక ఎలా చూసినా ఈ 2020 దారుణాతి దారుణమైన సంవత్సరమే చెప్పడానికి గాన గంధర్వుడి అకాల అస్తమయం అతి పెద్ద ఉదాహరణ. అలాగే శోభా నాయుడు మరణం కూడా కరోనా చేసిన పాపమే. 

మొత్తానికి ప్రపంచ గతిని మార్చేసిన ఈ 2020 సంవత్సరానికి “హమ్మయ్య” అనుకుని వీడ్కోలు పలుకుతూ. “ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో??” అనే అనుమానం తో 2021 కి ఆహ్వానం పలుకుదాం.

***

bottom of page