MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
ఆరోగ్యమూ... ఆత్మకథా…
వంగూరి చిట్టెన్ రాజు
అప్పుడప్పుడు కొంత మంది కనపడినప్పుడు వాళ్ళకి ఎలా పలకరించాలో తెలియక నానా అవస్థా పడతారు. మామూలుగా అయితే “ఏమండీ, బావున్నారా?” అనో “ఏం, గురూ, ఎలా ఉంది లైఫూ, వైఫూ” అనో, “హౌ ఇజ్ ఇట్ గోయింగ్” అనో చచ్చు ప్రశ్నతో పలకరించడం చెయ్య వచ్చును. ఇలా అడిగిన వాడిని నేను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టి కాస్త ఆనందించడానికి “ఆ ఇట్ ఏమిటో చెప్తే ని అది ఎక్కడికి ఎందుకు ఎంత స్పీడుగా గోయింగో చెప్తాను. ఇక అన్నింటికన్నా అతి చిన్న పలకరింత హలో...కాదు, కాదు .హాయ్...
ఇదంతా ఎందుకు గుర్తుకు వచ్చిందీ అంటే ఇన్ని రకాల పలరింపులు ఉండగా ఈ మధ్య కొందరు నన్ను చూడగానే “ఆరోగ్యం బావుందా?” అని అడగడం మొదలు పెట్టారు. అంటే ఎక్కడో నా మొహంలో రోగిష్టి ఛాయలు కనపడడమో...లేక వాళ్ళ ఒంట్లో ఏదైనా మాయ రోగం వచ్చి అలా అడుగుతున్నారో తెలియదు. దానికి సమాధానంగా నేను “ఏమో నాకు తెలీదు” అన్నాను. “అదేమిటీ, మీ ఆరోగ్యం ఎలా ఉందో మీకు తెలీదా?” అన్నాడు ఆ అడిగిన మానవుడు. “అవును సార్, డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నా ఆరోగ్యం బాగానే ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళగానే రక రకాల రోగాలు తన్నుకు వస్తాయి. లేదా వస్తాయి అని సదరు డాక్టర్ గారు బెదిసిస్తారు. ఇంతకీ మీరు అంత అనుమానంగా నా ఆరోగ్యం గురించి ఎందుకు అడిగారు? నా మొహం చూడగానే మీకు ఏదైనా అనుమానం వచ్చిందా? “ నేను ఇలా రెచ్చి పోవడం ఆయనకి బొత్తిగా నచ్చ లేదు. కానీ నన్ను రెచ్చగొట్టింది ఆయనే కదా. దాని బదులు “మీ బేంక్ బేలన్స్ బావుందా? అని పలకరించాడు అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలో తెలీక నేను గింజుకు పోయేవాడిని కదా. ఉదాహరణకి ““నా మొహం లా ఉంది మేష్టారూ” అని నా బండారం నేనే బయట పెట్టుకోవాలి కదా. లేదా “అస్సలు అది నీకెందుకురా మిత్రమా” అని కూడా అనగలను.
ఏది ఏమైతేనేం ..వారంలో ఒకరిద్దరు నన్ను ఆరోగ్యం పలరింపులు చెయ్యగానే ఏడాదికొ సారి చేయించుకునే కంటి పరీక్ష జ్ఞాపకం వచ్చి, డా. మెక్ నమారా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాను.. నేను వెళ్ళింది కంటి పరీక్ష కి...కానీ అక్కడ మా సంభాషణ లో కొన్ని అంశాలు.
డయాబెటిస్, గుండె పోటు, తల పొగరు, కాళ్ళ వాపు, చేతి వాటం లాంటి రోగాలలో ఏమేమి ఉన్నాయి. ఉన్నచో అవి ఉన్నట్టు నీకు ఎలా తెలుసు.
ఆయా రోగాలకి ఇప్పుడు నువ్వు ఏం మందులు వేసుకుంటున్నావు, వాటి డోసులు ఏమిటి? అవి వేసుకున్నప్పుడు నీకు ఎలర్జీతో ఎప్పుడైనా ప్రాణం మీదకి వచ్చిందా?
మీ సహజమైన అమ్మా, నాన్నా బతికే ఉన్నారా? ముఖ్య గమనిక: సవితి తల్లి, సవితి తండ్రి వగైరాల వివరాలు అంగీకరించబడవు.
మీ సహజమైన అమ్మా, నాన్నా బతికి లేకపోతే ,వాళ్ళు ఎలా పోయారు? ఎందుకు పోయారు? కారణాలు వివరించండి. ఆయా కారణాలలో ఏమైనా మీకు వర్తిస్తాయా? తెలిసీ చెప్పకపోయారో భేతాళుడి కథ విన్నారు కదా.
ఇప్పుడు మీకు ఉన్న రోగములలో ఏమైనా మీ తాత ముత్తాతలకు కానీ, మావయ్యలు, బాబయ్యలు, అత్తయ్యలు, పిన్ని వగైరా రక్త సంబంధీకులకు ఉన్నాయా?
అంత కనా ముఖ్యం ..ఇవి కాక ఇతర ప్రముఖ రోగములు వారికి ఉన్నాయా?
మీ అమ్మా, నాన్నా ఏ దేశం లో పుట్టారు?
ఆఖరి ప్రశ్న: మీకున్న రోగములు మీ సహజ సంతానముకు కూడా ఉన్నాయా? సవితి పిల్లల రోగముల పట్ల మాకు ఆసక్తి లేదు.
నాకు తెలిసీ పైన ఇచ్చిన సమాధానాలు అన్నీ నిజాలే అని ఇందుమూలముగా ధృవపరచుచున్నాను...ఇక్కడ మీ సంతకం ...
ఈ ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలని పరిశీలించి అప్పుడు మీ కంటి పరీక్ష చేసి మీకు కావలసిన కళ్ళజోడు, లేసిక్ సర్జరీ, కేటరాక్ట్ కలిసి కానీ, విడి విడిగా కానీ నిర్దేశించబడును.
ఇప్పుడు విషయం ఏమిటీ అంటే.. హైదరాబాద్ లో డిశంబర్ 15-19, 2017 లో జరుగుతున్న తెలంగాణా ప్రపంచ తెలుగు మహాసభలలో తెలంగాణా ప్రభుత్వ ఆహ్వానిత అతిథిగా పాల్గొనడానికి ఇండియా వచ్చాను. కాకినాడలో మా మామిడి చెట్టు క్రింద కూచుని ఈ పి.పా వ్రాస్తుంటే ఒక అవిడియా వచ్చింది. అదేమిటంటే..మనం నిజంగా మన పూర్వీకుల ఆరోగ్య వివరాలు సేకరించి ఒక పుస్తకంగా వ్రాయ గలిగితే అది మన “ఆరోగ్య ఆత్మ కథ” అవుతుంది కదా. ఈ వినూత్న సాహిత్య ప్రక్రియని ప్రారంభించి సాహిత్య ఎకాడెమీ వారి బహుమతి పొందగలం కదా. నా అమెరికా తిరుగు ప్రయాణం ఎలాగా ఢిల్లీ మీద నుంచే కదా.
అక్కడ సాహిత్య ఎకాడెమీ కి వెళ్లి ఓ రాయి వేస్తే పోలే!
***