top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వంగూరి పి.పా -26

 

కప్ప- పాము-ముంగిస

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు

1945లో రెండవ ప్రపంచ యుధ్దంలో ఓడిపోయి, సరిగ్గా నేను పుట్టిన రోజునే తనకి తానే పిస్తోలుతో పేల్చుకుని చనిపోయి ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకున్న ఏడు సంవత్సరాల తర్వాత ఒకానొక నియంత  తిరిగి పుట్టినట్టు ప్రపంచానికి తెలియడానికి మరో 70 ఏళ్ళు పట్టింది. నియంతృత్వ పరిపాలన, స్వాతంత్ర్య దేశాలుగా విడిపోయిన దేశాలని మళ్ళీ కలుపుకోవడం,  అమెరికా మీద ద్వేషం, యూదు జాతి నిర్మూలన మొదలైన బూజు పట్టిన బూర్జువా భావజాలం అప్పటి ప్రపంచ యుద్ధానికి, ఈ నాటి యుక్రెయిన్ యుధ్డానికీ కొన్ని మౌలిక కారణాలు. అలా మళ్ళీ పుట్టిన ఆనాటి అడాల్ఫ్ హిట్లర్ ఈ నాటి పేరు వ్లాడిమర్  పుతిన్. ఈ నాటి యుధ్దం, యుక్రెయిన్ దేశ దురాక్రమణ మూడవ ప్రపంచ యుధ్దం అంచులలో ఊగిసలాడుతూనే ఉంది. 

నిజానికి రష్యా నియంత యుక్రెయిన్ ప్రజాస్వామ్య దేశాన్ని ఎందుకు ఆక్రమించ దల్చుకున్న పూర్వాపరాలు అప్రస్తుతం. పుతిన్ హిట్లర్ అవతారం అనీ, అంతకన్నా ఇంకా క్రూరుడేమో అనీ అభిప్రాయపడ్డానికి గత నెల్లాళ్ళగా భారత దేశంతో సహా ఏ దేశం టీవీ వార్తలు చూసినా కళ్ళకి కనపడుతున్న మారణ కాండ చాలు. వ్యక్తుల మధ్య కొట్లాటకి అదుపుతప్పిన భావోద్వేగాలు, స్వార్ధ ప్రయోజనాలు కారణాలు అవుతాయి. కానీ గురజాడ గారి “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే సూక్తి వర్తించ బట్టే దేశ నాయకుడు వెధవాయ్ అయితే దేశం కూడా మట్టి గొట్టుకుపోతుంది అనడానికి పుతిన్ ఒక ఉదాహరణ. మిలిటరీ స్థావరాల మీదనే కాకుండా సామాన్య ప్రజానీకాన్నిభయ భ్రాంతులని చేస్తే యుక్రెయిన్ ప్రభుత్వం లొంగిపోతుంది అనే నెపంతో జరుగుతున్న బాంబుల దాడి చూస్తుంటే ఈ పుతిన్ అసలు మనిషేనా అనే అనుమానం వస్తోంది. అయితే రష్యా టీవీలో ఇవేమీ  చూపించరు, రష్యా ఎంత గొప్పగా యుధ్దం నెగ్గి పారేస్టోందో,  ఎంత నేల ఆక్రమించుకున్నారో, ఎన్ని భవనాలు కూల్చేశారో, ఎన్ని బాంబులు వేశారో మొదలైనవి  రష్యా ప్రజలకే కాదు పుతిన్ కి కూడా ఏది నచ్చుతుందో అదే  ఆయన కింద పనిచేసే అధికారులు చెప్తారు, ఎంత మంది పిల్లలు, మహిళలు, వయో వృధ్దులు బాంబు దాడుల్లో పోయారో చస్టే చెప్పరు కదా! మూడు మిలియన్లకి పైగా యుక్రెయిన్ కుటుంబాలు పక్క దేశాలకి పారిపోయి తలదాల్చుకునే పరిస్థితి ఈ ఆధునిక సమాజం రోజుల్లో ఎలా వచ్చింది?

ఇక్కడ మధ్యలో ఇరుక్కున్నది భారత దేశమే. కరవమంటే కప్పకి కోపం. విడవమంటే పాముకి కోపం. ఇక్కడ కప్ప అంటే ఒక కప్ప కాదు. అన్నింటికన్నా పెద్ద కప్ప అయిన అమెరికా దూరంగానే ఉండి ఎలా కరవాలో, దేనితో కరవాలో ఆ పాము నోట్లో గిలగిల  లాడుతున్న చిన్న కప్పకి చెప్తూనే ఉంది. యుక్రెయిన్ అనే ఆ చిన్న కప్ప ఆ పాము ఏమాత్రం ఊహించని విధంగా ఆ పోరాటాన్ని ఎదుర్కొని నిలబడడం చూసి మిగతా యూరప్ కప్పలు బెక బెక లాడుతున్నాయి. కానీ పెద్ద కప్పతో సహా ఆ పాము తమ మీద కూడా పడి అణుబాంబు లాంటి విషం కాటు వేస్తుందేమో అని భయపడి తమ కర్రలతో కొట్టే ప్రయత్నం చెయ్యకుండా దూరం నుంచి తిట్టి పోస్తే చాలు అనుకుంటున్నాయి. పాముకి చెవుల్లేవు అని వాటికి తెలీదా? ఆ పాము చాలా కాలం నుంచీ బుస కొడుతున్నా వినీ విననట్టు చూసి వదిలేసినందు వలనే దానికి ఇంత ధైర్యం వచ్చింది అనుకోడంలో తప్పేం ఉంది?  ఇక మన పవిత్ర భారత దేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ పాముల్లో పాములాగా , కప్పల్లో కప్పలాగా “గోడ మీద పిల్లివాటం” అనే సిద్ధాంతం బాగా అనుసరిస్తూనే ఉంది.  ఇది వరలో క్రెమియా, చెచ్నియా ప్రాంతాలని తన వశం చేసుకున్నట్టుగా ఈ సారి కొన్ని తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలని ఆక్రమించుకుని, ప్రధాన నగరం అయిన కీవ్,  పశ్చిమ ప్రాంతాలనీ తన వశం చేసుకోవడం అసాధ్యం అనే మిలిటరీ నిర్ణయానికి వచ్చాక ఇప్పుడు రోజూ ప్రత్యక్షంగా బాంబుల దాడితో జరుగుతున్న ఈ అమానుష యుద్ధానికి ఇవాళ కాకపోతే రేపైనా పుతిన్ ఆపక తప్పదు. అయితే ఈ రావణ కాష్టం ఇప్పుడిప్పుడే ఆరదు అని చరిత్ర చెప్తోంది. యుక్రెయిన్ ప్రజలని అది కాలుస్తూనే ఉంటుంది.

ఈ నేపథ్యంలో నిన్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాను. చూస్తున్నంత సేపూ కాశ్మీర్ మన పాలిటి రావణ కాష్టం అయిన చరిత్రం అంతా కళ్ళ ముందు మెదిలింది.  అలనాడు షేక్ అబ్దుల్లా చేసిన బ్లాక్ మైల్ కి భయపడి, నెహ్రూ గారు ఆర్టికల్ 370 అనే అత్యంత అసహజమైన ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చినప్పటి మన కాశ్మీర్ లో ఆనాడు పాకిస్తాన్ రగిల్చిన రావణ కాష్టం ఇంకా రగులుతూనే ఉంది. నిన్న చూసిన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో అక్కడి పరిస్థితులు, ముస్లిం చేతిలో జరిగిన హింసా కాండ,  కాశ్మీరీ పండిట్ ల వలసలు అన్నీ కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించారు. నిజానికి పాకిస్తాన్ ఒక బురద పామే కానీ పెద్ద తాచు పాము అనేసుకుని కాటు వేయ్యబోయింది. పటేల్ గారి మాట చెల్లి ఉంటే ఆ బురద పాము అప్పుడే మట్టి కరిచేది. కాశ్మీర్ లో మంట చెలరేగేదే కాదు. కానీ ఐక్యరాజ్యసమితికి తీర్పు కోసం వెళ్ళడం, అక్కడ పెద్ద కప్పలు అమెరికా, బ్రిటన్ ల ప్లెబిసైట్ వ్యూహంతో ఆ అగ్నికి ఆజ్యం పోసి ఆ బురద పాముకి పాలుపోసి పెంచారు. కానీ భారత దేశం ఒక ముంగిస. శరీర ధర్మాల ప్రకారం పాము విషం కాటు వేసినా ముంగిసకి ఆ విషం ఎక్కదు. అంచేత  ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా పాము ఎంత పోరాడినా అలిసిపోయి ఓడిపోవడమే కానీ గెలుపు ఎప్పుడూ ముంగిసదే! కాశ్మీర్ విషయంలో భారత దేశం పూర్తి విజయం సాధించడానికి ఇప్పుడు రంగం సిధ్దం అయింది. ఆర్టికల్ 370 రద్దు అయింది. ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో జరగబోయేదీ అదే! టక్కున మింగేద్దాం అనుకున్న కప్ప పిల్ల యుక్రెయిన్ పుతిన్ పాము పాలిట ముంగిసగా తనంతట తానే విజయం సాధించబోతోంది. ఆ విజయానికి తమ మద్దతే కారణం అని కప్పలు బెక బెక లాడుతూనే ఉంటాయి.  ఏ దేశం అయినా యుద్ధంతో సహా ఏ విషయంలో అయినా నెగ్గడానికి కారణం ఆ దేశ ప్రజలే. దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే మనుషులోయ్!

*****

bottom of page