top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వంగూరి పి.పా.

 

కొలరాడో లో బోల్డరూ-బైడెన్ గారి బోర్డరూ-మూడు నెలల ముచ్చట్లు 

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు

పై మకుటం చదవగానే ఈ సారి నా పిచ్చా పాటీ ఏ అంశాల మీద ఉంటుందో చదవక్కర లేకుండానే ఊహించుకోవచ్చును.  అసలు ఈ అమెరికాని ఎలా అర్ధం చేసుకోవాలో ఈ మధ్యకాలం లో నాకు అస్సలు అర్ధం అవడం లేదు. మొన్న మార్చ్, 2021 లో ఒక రోజు  అట్లాంటా లో ఒక దౌర్భాగ్యుడు మూడు మసాజ్ పార్ల్రర్ ల లో ఎనిమిది మందిని కాల్చి చంపాడు. అందులో ఆరుగురు చైనా, కొరియా మొదలైన ఆసియా జాతికి చెందిన వారు. దానికి ఆ దుర్మార్గుడు చెప్పిన కారణం “స్త్రీలోలత్వం’ ట  అని పోలీసులు మనకి చెప్పారు. అది మనం నమ్మాలి. అంతే కాని చైనా వాళ్ళ లాగా కనపడే వాళ్ళ మీద ద్వేషం అసలు కారణం అని మనం అనుకోకూడదు. ఎలా?  అలా అనుకోకుండా ఎలా ఉండడం? అసలు ఈ చైనా వారి మీద అయిష్టం పెంచుకోవడానికి కారణం మాజీ అధ్యక్షుడు ట్రంప్ గారు ఈ కోవిడ్ ని “చైనీస్ వైరస్” అంటూ చీటికీ, మాటికీ అన్నింటికీ ఆ చైనా వారే అని ప్రచారం చెయ్యడం ఒక కారణం ట. అక్కడా, ఒక్కడా చెదురు మొదురు సంఘటనలు జరిగినా, ఒకానొక దుర్మార్గుడు చేసిన హింసాకాండ ప్రాతిపదికగా చేసుకుని అమెరికా దేశం అంతా చైనా వాళ్ళ మీద ద్వేషం తో రగిలిపోతున్నట్టూ, దానికి మూల కారణం ట్రంప్ గారే అన్నట్టూ ప్రచారం చెయ్యడం సరి అయిన పని కాదు. ఆ దుర్మార్గుడు కనక ఏదో ఒక చైనా వ్యతిరేక సంస్థలో భాగం అయితే అది వేరే సంగతి. ఆ మాటకొస్తే జనవరి 6, 2021 నాడు సాక్షాత్తూ అమెరికా పార్లమెంట్ భవనాన్నే ఆక్రమించి, అప్పటి వైఎ ప్రెసిడెంట్ పెన్స్ నీ, స్పీకర్ పెలొసీ నీ హతమార్చే ప్రయత్నం చేసిన కె.కె.కె, క్యుఎనాన్ మొదలైన తెల్ల జాతి ఆధిపత్య తీవ్ర వాదులది ఒక మూకుమ్మడి ప్రయత్నం. అది రెచ్చగొట్టినది అప్పటి అధ్యక్షుడు అయిన ట్రంప్ గారే కదా! 

ఇంకా అట్లాంటా దారుణం జీర్ణించుకునే లోపుగా అటు కొలరాడో రాష్ట్రంలో బోల్డర్ (Boulder) అనే చిన్న పట్నం లో సిరియా దేశం నుంచి ఈ దేశం వలస వచ్చిన మరొక దౌర్భాగ్యుడు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి అకారణంగా పది మందిని కాల్చి చంపాడు. మరి దీన్ని ఎలా చూడాలిటా? అట్లాంటా లో ఆసియా ద్వేషం అయితే బోల్డర్ లో అమెరికా ద్వేషం అనుకోవాలా? అస్సలు ఆ స్థాయిలో ఏమీ అనుకోకూడదు అనేది నా మతం. కానీ ఆ బోల్డర్ మారణకాండ గురించి కానీ ఆ సిరియా హంతకుడి గురించి అమెరికా టీవీల వారు ఎక్కువ మాట్లాడడం లేదు.  నాకు మటుకు ఆ బోల్డర్ పట్టణం తో ఉన్న అనుబంధం వలన మరింతగా ‘అయ్యో’ అనిపించింది. ఎందుకంటే మా సుపుత్రుడు అక్కడే యూనివర్శిటీ ఆఫ్ కొలరాడొ లో చదువుకున్నాడు. సుమారు లక్ష మంది జనాభా ఉన్న బోల్డర్ చిన్న అందమైన నగరం. డెన్వర్ కి గంటన్నర దూరం లో ఉన్న ఆఅ నగరాన్ని మొత్తం అరగంటలో చుట్టితిరిగి ర్రాగలిగే చిన్న ఊరు. అక్కడ కార్ల కంటే సైకిళ్ళే ఎక్కువ ట. ఎందుకంటే అతి సమీపం లోనే ఉన్న రాకీ పర్వత శ్రేణి లో సైకిల్ మీదా, కాలి నడకనా ట్రెకింగ్ చెయ్యడం ఆ నగర వాసుల ప్రధాన వ్యాపకం. మేము బోల్డర్ వెళ్ళినప్పుడు ఆ ఘోరం జరిగిన కింగ్ సూపర్ మార్కెట్ లోనే కూరలు కొనుక్కున్నాం. 

ఈ సంఘటనలు ఒక ఎత్తు అయితే బైడెన్-హేరిస్ ల మూడు నెలల పరిపాలన ఎలా ఉందో స్థూలం గా చూస్తే అది ఎలా ఉంటుంది అనుకున్నానో అలాగే ఉంది. కానీ అనుకున్న దానికన్నా వేగంగా ట్రంప్ గారి నిర్ణయాలన్నింటినీ పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. వాటిల్లో అతి ముఖ్యమైన కోవిడ్ వ్యాప్తి నియంత్రణ లో ఇప్పటికే 100 మిలియన్ల అమెరికన్లకి వాక్సీన్ వేయించిన ఘనత ఒకటి. నిజానికి ఆ వైరస్ కి కేవలం 9 నెలల సమయం లోనే ఫైజర్, మెడొనా, జాన్సన్ & జాన్సన్ మొదలైన ఫార్మా కంపెనీల్ చేత వేక్సీన్ రూపొందించి, మిలియన్ల కొద్దీ డోస్ లు తయారుచేయించిన ఘనత ట్రంప్ గారిదే కానీ ఆ వేక్సీన్ లని “ట్రంప్ వేక్సీన్” అనకుండానే కాక, అసలు ఆయనకి తగిన గుర్తింపు రాకుండా అందరూ జాగ్రత్తపడ్డారని నా అభిప్రాయం. 

కోవిడ్ నిరోధించడం లో బైడెన్ జాతకం బాగానే ఉంది కానీ, మెక్సికో బోర్డర్ విషయం లో అక్కడ ట్రంప్ గారు కడుతున్న అడ్డుగోడ ని తక్షణం ఆపించెయ్యడం, అమెరికా అందరినీ ఆహ్వానించే మానవతా వాది అని కాస్త ఓవర్ ఏక్షన్ చెయ్యడం బెడిసి కొట్టింది అనే అనుకోవాలి. ఎందుకంటే మెక్సికో, గౌటమాలా, సెంట్రల్ అమెరికా దేశాల నించి అష్టకష్టాలూ పడి  అమెరికా సరిహద్దు గుమ్మాల దగ్గరకి పరిగెట్టుకుని వచ్చిన వేలకొద్దీ బాల బాలికలు, యువతీయువకులనీ ఆదుకుని తీరవలసినవ అగత్యం బైడెన్ ప్రభుత్వానికి ఏర్పడింది. వాళ్ళని వెనక్కి పంపిస్తే అది వెనక్కి వెళ్తే నుయ్యి, లోపలికి రానిస్తే ముందు వెళ్తే గొయ్యి లాంటి ఇరకాటం అనమాట. అంచేత అది నుయ్యో, గొయ్యో తెలియకుండా పత్రికా విలేఖరులనీ, మీడియా వాళ్ళనీ ఆ కాందిశీకుల పరిస్ఠితులు తెలిసే చోట్లకి వెళ్ళకుండా ఆంక్షలు విధించారు ప్రభుత్వం వారు. అయినా ‘దాగాలంటే దాగదు లే” లాగా వాళ్ళ కోవిడ్ వివరాలతో సహా బయట పడూతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సరిహద్దు వలస వెల్లువ సమస్యా పరిష్కారానికి కమల గారిని నియమించి బైడెన్ గారు పక్కకి తప్పుకున్నారు. మరి భారతీయ సంతతికి...అందునా తమిళ బ్రాహ్మణావిడకి కుమార్తె అయినా, రాజకీయ ఎదుగుదల కోసం తను నల్ల జాతి కి చెందిన మహిళగానే పరిగణించుకునే ఈ “కమలా ఆంటీ’  ఏమి చేస్తారో చూడాలి. ఈ సరిహద్దు సమస్య మరీ కొత్తది కాదు కాబట్టి కాలానుగుణంగా మామూలు పరిస్థితికి వస్తుంది అనీ, అంత వరకూ రిపబ్లికన్ పార్టీ వారూ, డెమొక్రాటిక్ పార్టీ వారూ ఎవరి రాజకీయ ప్రయోజనాలకి తగ్గట్టుగా వారి, వారి చానెళ్ళూ, పత్రికల ద్వారా ప్రచారాలు చేసుకుంటారు అనీ నాకు అనిపిస్తుంది. అనకూడదు కానీ, అప్పుడప్పుడు అమెరికాకి కనక మన భారత దేశం సరిహద్దు దేశం అయిఉంటే ఎలా ఉండేదా అనే దురూహ కలిగినప్పుడు భలే భయం వేస్తుంది. ప్రస్తుత బైడెన్ బోర్డర్ సిధ్ధాంత వైఫల్యాన్ని మరో నాలుగేళ్ళ పాటు....అంటే 2024 లో జరిగే ఎన్నికల దాకా రిపబ్లికన్ పార్టీ వారు వాడుకుంటారు. కరోనా నివారణ, వ్యాప్తిలో తమ ఘన విజయాన్ని డెమొక్రటిక్ పార్టీ వారు వాడుకుంటారు. ఇక రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాలతో వివాదాలు, తాత్కాలిక వివాహాలూ, కొన్నాళూ విడాకులూ ఎప్పుడూ ఉండేవే. అమెరికా అధ్యక్ష పదవిలో ఏ పార్టీ ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా విదేశాలతో వారి అనుబంధాలు అంతా రాజకీయంగా తూతూ మంత్రమే. వాస్తవానికి అంతా వ్యాపార నిమిత్తమే.  

ఇక భారత దేశం-అమెరికా అంటారా? అదొక బ్రహ్మ పదార్ధం. ఎందుకంటే, మనం ఇండియా పేపర్లు కానీ, టీవీలు కానీ చూస్తే.....”కాళ్ళ బేరానికి వచ్చిన అమెరికా”, “ఇండియాని బతిమాలిన బైడెన్”. “కోవిడ్ వేక్సీన్ తయారీ లో ప్రపంచానికే ఆదర్శం” ఇలా పతాక శీర్షికలు కనపడుతూ ఉంటాయి.  తీరా చూస్తే ఆ “పతాక శీర్షిక” కి మూలం ఎవరో ఒక అనామిక డెప్యూటీ, అసిస్టెంట్ టు జాయింట్ డెప్యూటీ అసిస్ టెంట్...అనబడే ఒకానొక అత్యంత తక్కువ స్థాయి అమెరికా ఉద్యోగి అలాంటి ఒకానొక భారత ప్రభుత్వ ఉద్యోగి తో టీ తాగుతూ చెప్పిన మాట కి ఈ పత్రిక ఆఫీసులో కూచున్న ఆఖరి స్థాయి ఉప సంపాదకుడు పెట్టిన పతాక శీర్షిక అన్నమాట. ఇక అమెరికా టీవీలలో కానీ, పత్రికలలో కానీ ఎప్పుడైనా ఇండియా ప్రస్తావన వస్తే, గిస్తే అది ఎప్పుడూ విమర్శనాత్మకమే కానీ ప్రశంసాత్మకం కానే కాదు. మనం ఇప్పటికీ ఒప్పుకోలేనిది “మనకి అమెరికా కావాలి కానీ అమెరికా కి ఇండియా అక్కర లేదు” అనే వాస్తవం. ఈ మాట కాస్త కటువు గా ఉండవచ్చు కానీ కఠోరమైన వాస్తవమే....కాస్త అటూ, ఇటూ గా. అందుకే ఇండియా-అమెరికాల సంబంధబాంధవ్యాలు ఒక బ్రహ్మ పదార్ధం అంటాను. ప్రభుత్వాల పరంగా అది 45 ఏళ్ళ క్రితం నేను అమెరికా వచ్చినప్పుడు ఎలా ఉందో..ఇప్పుడూ అలాగే ఉంది. గొంబళీ గొంబళీయే...గింబళీ గింబళీయే! 

ఇక ట్రంప్ గారిని ట్విట్టర్, గూగుల్, ఫేస్ బుక్ మొదలైన వారు అందరూ బహిష్కరించడం కాస్త అన్యాయం అయినా బహుశా అవసరమే. వారు ఆ పని కనక చెయ్యకపోతే ఖాళీగా ఉన్న ట్రంప్ గారి కారుకూతలతో అమెరికా దేశం అతలాకుతలం అయిపోయేది. పైగా ఆయనని అత్యంత ప్రతిభావంతంగా సమర్ధించే రష్ లింబా అనే రేడియో టాక్ హోస్ట్ కూడా చనిపోవడంతో రిపబ్లికన్ పార్టీ లో అతివాద కన్ సర్వేటివ్ ప్రతినిధులకి కేవలం ఫాక్స్ న్యూస్, న్యూస్ నేషన్ లాంటివి మాత్రమే ఆధారం అయ్యాయి. 30 ఏళ్ళు ఒక రేడియో వ్యాఖ్యాతగా అత్యంత ప్రాచుర్యం పొందిన  ఆ రష్ లింబా చాలా మందికి తెలియక పోవచ్చును. నేను అతడి రేడియో టాక్ షోని పదిహేనేళ్ళకి పైగా విన్నాను. చాలా సార్లు చికాకు వేసినా, అప్పుడప్పుడు అతని రాజకీయ వ్యాఖ్యలు భలే కుతూహలంగానూ, ధైర్యంగానూ ఉండేవి కానీ అతను ప్రధానంగా ఎంటర్ టైనర్ అనే చెప్పుకోవాలి. అమెరికా ప్రజలంత మంచి వారు, దయార్ద్ర హృదయులూ  ఇంక ఏ దేశం లోనూ లేరు అనీ, వారికి అన్ని విషయాలలోనూ, ముఖ్యంగా సంపద సృష్టి, ఆ సంపద ని స్వంతం చేసుకోడం లో ప్రభుత్వం కలగజేసుకోడం తగదు అనీ అనేక మౌలికమైన విషయాల మీద లోతైన అవగాహన ఉన్న వాడు రష్ లింబా. అయితే ఆ రేడియోని దాటి టీవీలో కానీ, ప్రసంగ వేదికల మీద కానీ అడుగుపెట్టినప్పుడు అతను విజయవంతం కాలేదు సరి కదా నవ్వులపాలు అయిన సందర్భాలు నేను చూశాను. అంటే తను నిర్మించుకున్న ఇంట్లో రామయ్య అంతే! వీధిలో కృష్ణయ్య కాదు. 

ఈ మూడు నెల్లలోనూ నాకు జరిగిన ఉపకారం నా బైడెన్ గారి పట్టుదల మీద కోవిడ్ సహాయం పేరిట ఏకంగా 1,7 బిలియన్ డాలర్ల విడుదల అయిన నిధులలో మా వాటా గా 2800 డాలర్లు మా బాంక్ అకౌంట్ లో పడడం. ఆ ధన సహాయం డబ్బున్న వారికి కాదు కాబట్టి దాంతో మా బండారం బయట పడిపోయింది!. బైడెన్ గారు తలపెట్టిన మరొక బిల్లు అమెరికా ఇమ్మిగేషన్ పోలిసీ సమగ్ర ప్రక్షాళన. దానికి రిపబ్లికన్ పార్టీ వారు చస్తే ఒప్పుకోరు. ఆ బిల్లుని అడ్డుకోడానికి వారికి ఉన్న బ్రహ్మాస్త్రం ఈ ఫిలిబస్ట్రర్ అనే ప్రక్రియ. అంటే బిల్లు వోటింగ్ కి రాకుండా గంటల తరబడీ సెనేటర్లు ఒకరి తరవాత ఒకరు మాట్లాడేసి, సమయం వృధా చేసి పారేసి, ఇక సమయం అయిపోయింది కాబట్టి అందరూ మూటకట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఆ బిల్లు కంచికి వెళ్ళిపోవడం అనమాట. ఏనాడో 1806 లో కాకతాళీయంగా అమలు లోకి వచ్చిన ఈ ఫిలిబస్ట్రర్ ప్రక్రియ ఎక్కువ వాడకం లో

ఈ మూడు నెలల్లోనూ జార్జియా రాష్ట్రానికి కొత్తగా ఎన్నిక అయిన సెనెటర్ రాఫియేల్ వార్నాక్ భవిష్యత్తులో గొప్ప నాయకుడు అయే లక్షణాలు కనిపిస్తున్నాయి. అతను జార్జియా రాష్ట్రం నుంచి ఎన్నిక అయిన మొట్ట మొదటి నల్ల జాతీయుడు కావడం,  మార్టిన్ లూథర్ కింగ్ పని చేసిన చర్చ్ లోనే ఆయన వారసుడి గా పాస్టర్ గా పేరు తెచ్చుకోవడం, మంచి వాక్చాతుర్యం, అటు దైవ బల ప్రాధాన్యత నీ, ఇటు ప్రజా పరిపాలన మీద మౌలికమైన అభిప్రాయాలనీ సుస్పష్టంగా, రాజకీయాలకి అతీతంగా ప్రకటించగలగడం..ఇవన్నీ ఆయనకి కలిసివచ్చే సుగుణాలు. కానీ ఆ రాష్త్రం లోనే కాక రిపబ్లికన్ పార్టీ అధికారం లో ఉన్న ప్రతీ చోటా ఎన్నికల చట్టాలలొ తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వోటరు హక్కుల కంటే, ఆ వోట్లని నెక్కించే వారికే అధికారాలకే  ఎక్కువ ప్రాధాన్యత, అధికారాలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

చూద్దామ్....ఏ పార్టీ ట్రంప్ కార్డ్ లు ఎలా ఉంటాయో? స్కూళ్ళు తెరవాలా, వద్దా, తెరిస్తే ఎలాగ తెరవాలి అనేది మరొక ప్రధాన అంశం. దానికి ఏ విధమైన ట్రంప్ కార్డ్ లూ లేవు. ఎవరి రాజకీయ ఆటలు వారివే. ఇక పిల్లల ఆటపాటలూ, చదువు, సంధ్యలూ పట్టించుకునే వారు ఎవరు? వాళ్ళని తెర ముందు కూచోబెట్టేయడం అమెరికా సంప్రదాయమే కదా!

*****

bottom of page