MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
తెలుగు సాహితీ శోభ
ప్రసాద్ తుర్లపాటి
తెలంగాణాలో విరిసిన తెలుగు సాహితీ శోభ - 2 (రెండవ భాగం)
(తెలంగాణాలో విరిసిన తెలుగు సాహితీ శోభ - మొదటి భాగం)
బమ్మెర పోతానామాత్యుడు
ఓరుగల్లుకు సమీపాన విలసిల్లిన బమ్మెర పోతానామాత్యుడు తెలుగు సాహిత్యంలో మకుటాయమయిన ఆంధ్ర మహాభాగవతాన్ని, భక్తి, కథావస్తువుగా, శ్రీకృష్ణుడు నాయకుడిగా, మందార మకరంద మాధుర్యముతో, శ్రీరామాంకితంగా రచించాడు.
పోతన నివసించిన కాలము. 1450 -1510.
ఆంధ్ర మహాభాగవత గ్రంధకర్త బమ్మెర పోతానామాత్యుడు తన భాగవత కథా సుధా స్రవంతి లో ఆంధ్రలోకాన్ని భక్తి పారవస్యములో తరింపచేసారు. వీరి పద్యాలు మందార మకరంద మాధుర్యముతో పఠితులను అమంద ఆనంద కందళిత హృదయారవిందులను గావించును.
శ్రీకైవల్య ప్రాప్తియే ఆకాంక్ష కల పోతనామాత్యుడు భక్త సుధారస స్వాదనలో తరించారు.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
విశ్వనాధ సత్యనారాయణ గారన్నట్లు 'తెలుగుల పుణ్యపేటి' పోతనామాత్యుడు. ఆ రామాంకితముగా -
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుడట
నే పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాధ పలుకగనేల
అని విభుద జనులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరచునని వినమ్రతతో చాటుకున్న సహజకవి పోతన.
ముగ్గురమ్మలకు పద్యకుసుమాలను అలంకరించి తన కవితా వ్యాసంగానికి శ్రీకారం చుట్టాడు -
శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
అమ్మలఁ గన్నయమ్మ, ముగ్గురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
పోతన తన భాగవత ప్రారంభములో చెప్పినట్లు -
“ అని యిష్టదేవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి, ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి, హయగ్రీవదనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కథాసుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి, మృధు మధురవచన వర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి, కతిపయ శ్లోక సమ్మోదితసూరు మయూరు నభినందించి, మహాకావ్యకరణ కళావిలాసుం గాళిదాసుం గొనియాడి కవి కమల రవిన్ భారవిన్ బొగడి విదళితాఘు మాఘు వినుతించి, యాంధ్రకవితాగౌరవజనమనోహరి నన్నయ సూరిం గైవారంబు సేసి, హరిహర చరణారవిందవందనాభిలాషిం దిక్కమనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి, వర్తమాన కవులకుం బ్రియంబు వలికి, భావి కవుల బహూకరించి, యుభయకావ్యకరణ దక్షుండనై “
సహజ వినయముతో భగవత రచనా దీక్షుడైనాడు.
జంధ్యాల పాపయ్య శాస్త్రిగారన్నారు- “పోతన కవితకు ఇంత మాధుర్యం ఎలా వచ్చింది. తన గంటము పంచదారలో ముంచి వ్రాసెనేమో” అని. సమస్త తెలుగు జాతికి భక్తి యోగంబును ప్రసాదించిన పోతన ఒక మహాయోగి.
తరువాత సంచికలలో మరిన్ని విషయాలను తెలుసుకుందాము.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
****
సశేషము.
ప్రసాద్ తుర్లపాటి
సాహిత్యం పట్ల, అందునా ప్రాచీన సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కల ప్రసాద్ తుర్లపాటి గారు విభిన్న కవితా శైలులని, కవులు మరియు రచనలని చక్కగా విశ్లేషిస్తారు.
మూడు దశాబ్ధాలుగా సాంకేతిక రంగంలో కీలక పదవులెన్నో నిర్వహించి, టీ.సీ.యెస్ లో ఉన్నతోద్యోగం చేస్తున్న ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో జన్మించారు.
సాహితీ విభాగంలో కృషికి గానూ 2016 లో NATA వారి Excellence Award అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు సాధించారు. ప్రస్తుతం శాన్ ఆంటోనియోలో వాస్తవ్యులైన వీరు నగరంలోని హిందూ టెంపుల్ పాలకమండలి సభ్యులు గా వ్యవహరిస్తున్నారు.
***