MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
సాహిత్యం - కొన్ని ఆలోచనలు
తెలుగు-కన్నడలలో మహిళా కవిత్వం - ఒక చూపు.
రాజేశ్వరీ దివాకర్ల
విస్తృతమైన సాహిత్య పరిణామ చరిత్రలో ఆరంభ కాలం నుండి మహిళలు తమ ప్రాముఖ్యాన్ని స్థిరీకరించుకుంటూనే ఉన్నారు. సామాజిక స్థితిగతులను అనుసరించి స్వయంప్రతిభను సానుకూలం కావించుకున్నారు. కాలానుగుణమైన స్వతంత్ర ప్రతిపత్తిని అనుసరించి వివిధ ప్రక్రియలలో వైవిధ్యాన్ని కలిగిస్తున్నారు. నేటి సాహిత్యం స్థితిగతులను చర్చించేందుకు నేపథ్యంగా తెలుగు కన్నడాలలో గల మహిళా రచయిత్రుల కవిత్వ రచనా ప్రతిభను నాటి నుండి నేటి వరకు పరిశీలించడం ఈ వ్యాస రచనా ఉద్దేశం.
నన్నయగారి కంటె 50 సంవత్సరాలకు పూర్వమే విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం లో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి. ఇది తెలుగులో మొట్ట మొదటి వృత్త పద్య శాసనం. ఇది విరియాల వంశస్థులయిన కాకతి రాజుల కీర్తిని తెలుపుతుపుతుంది. స్తంభం పై చెక్కిన ఈ శాసనం లో తక్కిన మూడు వైపులా కన్నడ అక్షరాలున్నాయి. అలంకార శైలిలో ఉన్న ఈ పద్యాలను ఆమెయే రాసిందని ఆమెను ప్రథమ కవయిత్రిగా పేర్కొంటారు. ఈ శాసనం వరంగల్లు లోని జనగామ తాలూకాలో ఉంది. అలాగే 12 వ శతాబ్దంలో కాకతి రాజ వంశస్థుల కోడలైన కుప్పాంబిక రాసిన బూదాపుర శాసనంలో ఒక పద్యాన్ని ఆనంతర కవి అయ్యల రాజు రామ భద్రుడు ఉదహరించాడు. ఆ పద్యం నాయకి విరహాన్ని వర్ణిస్తుంది. కాకతి ప్రతాప రుద్రుని భార్య మాచల్దేవి విదుషీ అన్న సంగతి ని శ్రీనాథుని క్రీడాభిరామం తెలుపుతుంది.
కన్నడభాషలో కావ్యపరంగా ప్రాముఖ్యతను నిలుపుకున్న తొలి మహిళ అత్తిమబ్బె. పదవ శతాబ్దం ఉత్తరార్థం లో జీవించిన అత్తిమబ్బె కన్నడం లో అజిత పురాణాన్ని రచించిన రన్న కవి కి ఆశ్రయమిచ్చి ఘనత వహించింది. పొన్న కవి రచించిన శాంతి పురాణం 1500 హస్త ప్రతులను తాళ పత్రాల మీద రాయించి రత్న ఖచితమైన జిన విగ్రహాలతో పండితులకు పంచింది. ఆమెను రన్నకవి అజిత పురాణం ప్రథమాధ్యాయం లో "కవివర కామ ధేనువు" అని ప్రశంసించాడు. "పవిత్రం అత్తిమబ్బె చరితం" అని శ్లాఘించాడు. ఆమె కన్న పూర్వికురాలైన విజయ భట్టారిక నలుపు రంగు లో ఉన్న తాను నల్లగా ఉన్న సరస్వతిని అని చాటుకుంటూ, ధవళ వర్ణ గా సరస్వతీ దేవిని ప్రశంసించిన దండి ని పరిహసించిందట.
తెలుగు కన్నడ భాషలు రెంటిలో స్త్రీలు తమ రచనలను అనువాదాలతో కాక, స్వతంత్ర రచనలతో ఆరంభించడం విశేషం. తెలుగులో మహిళా రచన తాళ్ళపాక అన్న మాచార్యుల భార్య తిమ్మక్క రచించిన సుభద్రా కళ్యాణం తో ఆరంభం అయింది. సుమారు 15 వ శతాబ్దానికి చెందిన ఆమె గృహిణిగా సంసార బాధ్యతలను నిర్వహిస్తూనే రచనా ప్రతిభను కనుపరచింది. కడుమంచి తేటపలుకులతో చెప్పిన పాటగా తన కావ్యాన్ని పేర్కొంది. తన కావ్యాన్ని సుభద్ర పేరిట రాయడం, సాందర్భికంగా రుక్మిణితో "పురుషులకు అధికంగా చనువును ఈయకూడదని సుభద్రకు హితబోధను చెప్పించడం, ఇత్యాదులతో, సుభద్రా కళ్యాణం స్త్రీలకోసం స్త్రీ రచించిన గ్రంథం గా ప్రసిద్ధమయింది.
కన్నడ భాషకు విశ్వ కీర్తిని కలిగించాయి వచనాలు. కన్నడంలో శైవ కవయిత్రులున్నారు. కన్నడంలో 12 వ శతాబ్ది నాటికే మహిళలు సాహిత్య రంగ ప్రవేశం కావించారు. అంతేకాదు, వారందరూ సామాజికపరమైన చైతన్యాన్ని ఆశించారు. ఉద్యమకారుడైన బసవేశ్వరుని నాయకత్వంలో "కష్టపడి శ్రమించుటయే శివుని సన్నిధి కైలాసం" (కాయకమే కైలాసం) అని శ్రమజీవనాన్ని ప్రతిపాదించారు. లౌకికమైన వృత్తి ధర్మంలో పార లౌకికతను ప్రవచించారు. గృహిణులుగా సతీ ధర్మాలను నిర్వహిస్తూనే భక్తి భావనతో అంతరాత్మను పరిశుద్ధం కావించుకున్నారు. వచన ఉద్యమం లో ఉజ్జ్వల నక్షత్రం గా ప్రకాశించింది అక్క మహాదేవి. ఆమె ప్రప్రథమంగా లింగ వివక్షతను గూర్చి జైవిక పరంగా ఆలోచించింది. ఆడ మగ ఇరువురిలో గల ఆత్మ ఆడుదా? లేక మగ వాడా అని ప్రశ్నించింది. అక్క మహాదేవి స్వీయ వ్యక్తిత్వం కూడా ఎంతో భిన్నమైనది.
తెలుగులో రామాయణాన్ని రచించిన మొల్ల స్త్రీలు కావ్య రచనను కావించగల సమర్థులు అని నిరూపించింది. మొల్ల, అక్క మహాదేవి, ఇరువురూ, స్వతంత్రమైన జీవనాన్ని గడిపారు. అక్క వివాహితయై భర్తను త్యజించిందని ఐతిహ్యం చెప్తుంది. అక్క శైవాచార తత్పరులైన తల్లిదండ్రులకు జనించింది. మొల్ల తండ్రి కేశన శెట్టి శివ పూజా తత్పరుడు. వీర శైవం తెలంగాణా లో, ముఖ్యంగా వరంగల్లులో ఆనాడు విస్తరించింది. అక్క మొల్ల ఇరువురూ స్త్రీల ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా గౌరవాన్ని పొందారు. మొల్ల రాజాస్థానం లో తెనాలి రామ లింగకవిని అపహాస్యం చేసింది. అక్క అనుభవ మంటపం లో అల్లమ ప్రభువును వివాదం లో గెలిచింది. ఈనాటికీ కన్నడ రచయిత్రులు అక్క మహాదేవి వలె కవిత్వం రాయాలని, తెలుగు రచయిత్రులు మొల్ల వలె తేనె సోకగా చవులూరునట్లు రాయాలని అనుకుంటారు. మొల్ల కవిత్వం లో రూప వాదాన్ని గురించి ప్రస్తావించింది. అక్క మహాదేవిని గూర్చిన తపాలా బిళ్ళను విడుదల చేసి ప్రభుత్వం మహిళా కవయిత్రిని గౌరవించింది. కన్నడం లో వచన ఉద్యమం లేక పోతే మహిళలు రచనకు పూనుకునే వారా లేదా అన్నది సంశయాస్పదమైన అంశమని విమర్శకులు భావిస్తారు.
17 వ శతాబ్దంలో తెలుగు కన్నడ రచయిత్రులు రాజాస్థాన గౌరవాన్ని పొందారు. మైసూరు రాజు చిక్క దేవరాయల రాణికి ప్రియసఖి యైన సంచె హొన్నమ్మ 468 సాంగత్యాలతో కూడిన" హదిబదియె ధర్మ"ను రచించించింది. గృహిణీ ధర్మాలను ప్రబోధించే ఈ కావ్యంలో ఆడది ఆడది అని కించ పరుస్తారెందుకు, కళ్ళు కానని మూర్ఖులు- అన్న సాంగత్యం మహిళల అసమానతను గూర్చి నిరసిస్తుంది. మహిళయే కదా మననందరిని కన్న తల్లి అంటూ మాతృ ఘనతను గూర్చి తెలిపిన ఈ రచనను చదవడం సులభమే అయినా మరువడం సాధ్యం కాదు అని అంటారు. ఈ కాలం లోనే శృంగారమ్మ, చెలువాంబె , హెలవన కట్టె గిరియమ్మ లు పురాణ కథారితములైన రచనలను కావించారు.
17 వ శతాబ్దం లో విజయ రాఘవునికి ప్రేయసి యైన రంగాజమ్మ మన్నారు దాస విలాసము యక్ష గానాన్ని, ఉషా పరిణయ ప్రబంధాన్ని, రామాయణ ,భారత,భాగవతాల సంగ్రహరూప కావ్యాలను రచించింది. విజయరాఘవుని కాలం లోని రచయిత్రులు అష్ట భాషా ప్రవీణులు. ఈ కాలం లోని మధురవాణి కనకాభిషేక గౌరవాన్ని పొందింది.
మహిళాపరమైన సాహిత్య ప్రమాణాలకు మలుపు తెచ్చింది ముద్దుపళని. ఈమె శృంగార ప్రధానమైన రాధికా స్వాంతనము కావ్యాన్ని రచించింది. ముద్దు పళని శృంగార కావ్య రచనలలో పురుషులకు స్త్రీలు తీసి పోరని నిరూపించింది. ఆ కాలం లో ఆమె రచనకు ఏ మాత్రం గౌరవము లభించిందో ఏమోకాని ఆధునిక కాలం లో మాత్రం విమర్శకు లోనయింది. సంఘ సంస్కర్త వీరేశలింగం గారు ఈ కావ్యంలోని సంభోగాది వర్ణనలను నిరసించారు. వారి నిరాకరణకు ఘాటైన జవాబు నిస్తూ బెంగళూరు నాగ రత్నమ్మ గారు, 1910 లో మంచి పీఠికతో ఈ గ్రంథాన్ని పునర్ముద్రించారు.
ముద్దు పళనికి తరువాత 50 సంవత్సరాలకు తరిగొండ వెంగమాంబ భక్తి యుతమైన తాత్విక గ్రంథాలను పలు ప్రక్రియలలో రచించింది.
తెలుగులో 1940 సంవత్సరానికి ముగ్గురు కవయిత్రులు సంకలనాలలో స్థానాన్ని పొందారు. ఆధునిక కాలంలోని ప్రథమ ఘట్టం లో ని కవయిత్రి, సమాజ సేవకి యైన కొటికల పూడి సీతమ్మ గారు శతకాలు, పద్య భగవద్గీత, సతీధర్మము, అహల్యా బాయి మున్నగు రచనలను చేసారు. స్త్రీ నీతి గీతాలు సతీ ధర్మములు, సరస్వతీ పరిదేవనములను రచించిన పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ స్త్రీ జనాభ్యుదయానికి శ్రమించారు. కాంచనపల్లి కనకాంబ గారు, స్త్రీలు సహజ పండితులు అని నిర్ణయించారు. గుడిపూడి ఇందుమతి, కనుపర్తి లక్ష్మీ నరసమ్మ గార్లు తమ రచనలను స్త్రీ జన సంక్షేమానికి ఉద్దేశించారు. కనుపర్తి లక్ష్మీ నరసమ్మ గారు ప్రప్రథమంగా గృహలక్ష్మీ స్వర్ణ కంకణాన్ని గ్రహించారు. గేయ రచనలో ప్రవీణులైన చావలి బంగారమ్మ గారు -భావ గీతాలనూ, ప్రణయ గీతాలను రాసిన సౌదామని (బసవ రాజు రాజ్య లక్ష్మమ్మ) గారు -అభ్యుదయ కవిత్వాన్ని రాసిన తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ గార్లు 1935 లో ముద్దు కృష్ణ గారు సంకలనం కావించిన వైతాళికులు లో చోటు దక్కించుకున్నారు. దొప్పల పూడి అనసూయ గారు రచించిన "కాన్పు "కవిత కాటూరి వెంకటేశ్వర రావు గారు సంకలనం కావించిన తెలుగు కావ్యమాలలో చేరింది. పుట్టపర్తి కనకమ్మ గారు దుఖితులైన, యశోధర, సీతలను కవితలలో చిత్రించారు.
1940 ల లోనే ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ గారు "ఆంధ్ర కవయిత్రులు","అఖిల భారత కవయిత్రులు "అనే గ్రంథాలను రచించారు. 'నా తెలుగు మాంచాల' వీరి పద్య కావ్యం. అభ్యుదయ భావాలను పండించుకున్న కొండపల్లి కోటీశ్వరమ్మగారు అశ్రు సమీక్షణము అనే కావ్యాన్ని రచించారు.
యూనివర్సిటీ విద్యలలో ఉత్తీర్ణులైన నాయని కృష్ణ కుమారి, యశోదా రెడ్డి గార్లు ఆధునిక కవయిత్రులలో రెండవ ఘట్టానికి చేరిన వారు. వీరిద్దరు మారిన యుగ సమాజంలో మనిషి జీవన చిత్రణను కావించారు.
కన్నడ భాషలో 18,19 శతాబ్దాలకు చెందిన హరపన హళ్ళి భీమవ్వ, గలిగలి అవ్వ, మున్నగు వారు అజ్ఞాత రచయిత్రులుగా మిగిలారు. ముద్రణా సౌలభ్యం లభించిన కాలం లో కూడా వెలుగులోనికి రాక తుదకు 20 వ శతాబ్దం ఉత్తరార్థంలో సాహిత్య రంగానికి తెలిసిన మొదటి కవయిత్రి నంజనగూడు తిరుమలాంబ. ఆమె రచయిత్రి, పత్రికా సంపాదకురాలు, ముద్రణా కర్త. తమ 14 వ ఏట వైధవ్యానికి లోనైన ఆమె, స్వీయ అభ్యాస దీక్షతో చదువు నేర్చుకున్నారు. తనలోని దుఃఖాన్ని మరచేందుకు భక్తి గీతావళిని రాసారు. తన సహోదరి పెళ్ళి సందర్భంలో పెళ్ళి పాటలను రాసారు. సోదరుని సాయంతో "కర్నాటక నందిని” పత్రికను స్థాపించి, సంపాదకత్వం వహించారు. సతీ హితైషిణి గ్రంథమాలకు ప్రకాశకులుగా గ్రంథ ముద్రణ ను కావించారు. గీతావళి కావ్యాన్ని రచించారు.1980 వ సంవత్సరం లో కన్నడ సాహిత్య పరిషత్తు, 1981 లో కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారాలను పొందారు.
బెంగళూరులోని ఎన్ ఎం కె ఆర్ వీ కాలేజీ ప్రధానాచార్యులైన సి ఎన్ మంగళ గారు, తిరుమలాంబ గారి పేరిట మహిళా అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. తిరుమలాంబ గారి పేరిట ప్రతి సంవత్సరం భారతీయ భాషలన్నింటిలో ఉత్తమ మహిళా రచన ఒక్కటికి విశిష్ట బహుమానం ఏర్పాటు కావించారు.
శ్రీమతి తిరుమల రాజమ్మ గారు భారతి పేరుతో దేశభక్తి గీతాలను రాసారు. ఆమె రాసిన జై భారత భూమిగె ప్రార్థనాగీతంగా ప్రసిద్ధమయింది. ఆమె వీణా వాదనను గాంధీ గారు మెచ్చుకున్నారు.
జనకజ అన్న పేరుతో జానకమ్మ గారు కవితలు రాసే జానకమ్మ గా ప్రసిద్ధమయ్యారు. ఆమె కవితా సంపుటం "కల్యాణ."ఆమె కవితలు కన్నడ పత్రికలు "ప్రబుద్ధ కర్నాటక " లో ముద్రణను పొందాయి. జానకమ్మ ప్రథమ కన్నడ భావ కవయిత్రి. పురుషులను గూర్చి"లంచ కోరువు నువ్వు, వంచన కావింతువు మృదువైన స్త్రీ తనమునకు, -ఫలములనిచ్చు వృక్షమని తలంతువొ ఆమె ఒడిని నీవు” అని స్త్రీల దుఖాన్ని తెలుపుతూ, పురుషుల అహాన్ని ప్రశ్నించారు. ఆమెకు సుకవయిత్రి అని బిరుదు ఉంది.
కన్నడ భాష లోని ఆధునియుగం రెండవ ఘట్టం లో ఎల్ జి సుమిత్ర, శైలజా ఉడుచణె మొదలైన వారు విద్యాధికులై తమ చుట్టూ జరుగుతున్న. మార్పులను కవిత్వం లో విశదీకరించారు.
కవిత్వం కేవలం భావ ప్రకటనకు మాత్రమే కాదు, తమకు జరిగే అన్యాయాలను ప్రశ్నించాలి అని స్త్రీలు గట్టిగా ఎదురు నిలిచి సవాలు చేసిన కవిత్వం తెలుగు కన్నడ భాషల లో 1975 వ సంవత్సరం ఆంతర్జాతీయ మహిళా సంవత్సరం తో ఆరంభం అయింది. స్త్రీవాద కవిత గా ప్రసిద్ధమైన ఈ కవిత్వం స్త్రీ లోని వివిధ సంఘర్షణలను బలం గా నిరూపించింది. స్త్రీవాద కవయిత్రులు అనేకులు వివక్షతలకు పదునైన రూపం లో ఒరిపిడిని కలిగించారు. తెలుగులో రేవతి కన్నడ భాష లో విజయా దబ్బె గార్లు స్త్రీవాద ప్రథమ కవయిత్రులు
వివక్షతల అంచులలో దళిత శోషణకు నిరసనను తెలిపిన కవయిత్రులు తెలుగు కన్నడాలలో క్రమంగా కొలకలూరి స్వరూపరాణి, మద్దూరు విజయశ్రీ, లలితా బి టి నాయక్, విజయశ్రీ సబరద మున్నగు వారున్నారు. దళిత కవిత్వం 1986 లో జరిగిన దళిత మహా సభతో చైతన్యం పుంజుకుంది.
పూర్వ కవయిత్రులను గూర్చి పేర్కొనగలిగినట్లు నేటి కవయిత్రులను గూర్చి పేర్కొనుట సాధ్యం కాదు. కన్నడ భాషలో 20 వ శతాబ్ది కవయిత్రుల పట్టికను కులశేఖరి గారు "శతమానద కవయిత్రియరు "గ్రంథం లో సమకూర్చారు. ఈ గ్రంథం లో 400 మంది కవయిత్రులు రచించిన 750 కవన సంపుటాలను గురించి ప్రస్తావించారు. ఆ బృహద్గ్రంథం తరువాత లెక్కకు మించిన కవత్వ సంపుటాలు వెలువడ్డాయి. తెలుగులో డా. కె. లలిత వసంతా కన్నభిరాం, సుసీ తారు బృందం సంపాదించిన మనకు తెలియని మన చరిత్ర అపురూపమైన పరిశోధనా గ్రంథం.
ఆరంభ కాలం నుంచీ స్త్రీ పరమైన సంవేదన మహిళా రచనలలో గాఢతను చుంబిస్తూనే ఉంది. ఆనాడు సంప్రదాయ పరిధికి లోబడిన వివక్ష ఈనాటికీ బహుముఖాలుగా స్త్రీ స్వేచ్ఛను హరిస్తూనే ఉంది. ఒక వంక స్త్రీలు సాధికారతను సాధించి విజేతలై విజయాలను సాధిస్తున్నారు. మరొక వంక పురుషాహంకారానికి బలి యైన దీనస్వరాలు వినవస్తూనే ఉన్నాయి. స్త్రీవాదం ఎన్నటికీ చెక్కు చెదరని మౌలికతా ధ్యానాన్ని అవలంబిస్తోంది.
ఇక 2014 లో రాష్ట్ర విభజన తెలంగాణా మాండలికతకు సాంస్కృతిక సాహిత్య విస్తృతిని అపారంగా కలిగించింది. రచనలలో వివిధ మాండలిక భాషలకు ప్రాచుర్యం కలిగింది.
గత పదేళ్ళ సాహిత్య రంగానికి సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన వేదికగా మారింది. పుస్తకాన్ని చదువుతూ గుండెలకు ఆనించుకుని ఆలోచనలలో ఊహలలో తేలి పోయే కలల నిదుర తేలిపోయింది. ఆ పుస్తకానికి బదులు "ఈ "మాధ్యమం ప్రతి మనిషికి చేరువయింది. వంటింటి సాహిత్యంగా వనితల చేతిలో పుటలు తిరిగిన నవల పూర్వపు చనువును మరచింది. ప్రతి ఇల్లాలి గుప్పిటలో ఇప్పుడు వాట్స్ ఏప్ అనేక ఆసక్తి కరమైన సందేశాలను విప్పింది.
సాహిత్యం లో "ద్వై సాంస్కృతిక డయస్ఫోరా" పదం అందరికీ పరిచయమై పోయింది.
ముద్రణ అవసరంలేని అక్షరాల అచ్చు, కాగితమూ కలమూ అవసరం లేని లిపి అతి సామాన్యునికి చేతికందింది.
ఒక వైరస్ వచ్చి మానవుని విశ్వ మానవునిగా మార్చింది. నాది నేను అన్న భావనను వదిలి మనము అన్న భావన మేల్కొంది. కుల వర్గ భేదాలు సమసి మానవ కులమంతా ఒక్కటే అన్న ఆత్మీయత కలిగింది. ఆపదలో అనేక అనర్థాలు కలిగిన విపత్కర సన్నివేశం లో రచనలు అంతర్జాల వేదికలో కాంతా సమ్మితాలుగా దేశమంటే మట్టికాదు మనుషులు అన్న అవిస్మరణీయ సందేశాన్నిస్తున్నాయి.
*****