MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
తెలుగు కథకుడు
జయంతి ప్రకాశ శర్మ
ఆధునిక తెలుగు కథ పుట్టిన తర్వాత, నాటి నుండి నేటి వరకు కథా సాహిత్యంలో మార్పులు చేర్పుల మీద చాలా చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. అలాగే ఈ మార్పులు చేర్పుల మీద చాలా వ్యాసాలు, గ్రంధాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అలాగే వీటి మీద పరిశోధనలు, పరిశీలనలు జరిగాయి, జరుగుతునే ఉన్నాయి. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తెలుగు కథా గమనం, కథా వస్తువు, భాష, శిల్పం, శైలి మొదలగు విషయాలలో మెరుగులు, తరుగులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు కథని ముందు తరాలకి పదిలంగా ఎలా అందించాలి, మరో పది కాలాలు పాటు ఎలా బ్రతికించుకుని, బట్ట కట్టించాలనే విషయాలు తెలుగువారు ఆలోచించవలసిన సమయం వచ్చింది. అయితే మిగతా విషయాల జోలికి పోకుండా "కథ సృష్టికర్త రచయిత" అతని పాత్ర గురించే ఈనాటి నా వ్యాసంలో ప్రస్తావిస్తాను.
నాటి కథకుడి నుంచి, నేటి కథకుడి వరకు వారి ఆలోచనా రీతులు, వారి వారి మనోగతాలను పరిగణలోకి తీసుకుని మేధోమథనం జరగి, దిశా నిర్దేశం జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతూ, ఆ దిశలో పెద్దలందరూ ఆలోచించడానికి ఈ వేదిక కంటే మరో ఉత్తమమైన వేదిక దొరకదని భావిస్తున్నాను.
కథకుడు గురించి చెప్పుకునే ముందు, కథ గురించి సూక్ష్మంగా చెప్పుకోవాలి. ఏవేవో ఆలోచనలు మెదడులో చోటు చేసుకుని, కథా వస్తువుకి అంకురార్పణ జరిగి, కథగా అవతరించి, కథా రూపంలో అందించే ప్రక్రియతో కథకుడు పాత్ర మొదలవుతుంది. సమాజం పట్ల ఉండవలసిన బాధ్యతగానే భావించి, కథ ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలనే తపనతో రచయిత ముందడుగు వేసాడు. ఈ ఆలోచనలు చాలామందికే రావొచ్చు. అయితే వారి స్పందనలు వేరే రూపాంతరాలు దిద్దుకుంటాయి. అలా రూపాంతరాలలో అక్షరరూపం ఇవ్వగలిగే అదృష్ణం కొందరినే వరిస్తుంది. అయితే అక్షరశిల్పి కావడానికి స్పందించే హృదయం ఉంటే సరిపోదు. తపన, భాషాపరిఙ్ఞానం, సమాజ స్థితిగతుల మీద అవగాహన ఉండాలి. కొద్దో గొప్పో కృషి కూడా అవసరం ఉంది. వ్యవహారిక భాష జననం తర్వాత తెలుగు గడ్డ మీద కొన్ని వందల మంది రచయితలు ఈ ఆలోచనలతోనే కలం పట్టారు. ఆధ్యాత్మిక కథలు నుంచి విప్లవపంథాలో నడిచే కథల వరకు, అలనాటి కన్యాశుల్కం నుంచి సామాజిక అసమానతలు వరకు కనబడే ప్రతీ అంశం మీద రచయిత కలం ఝుళిపించాడు. కాలానుగుణంగా వచ్చిన మార్పులలో మంచిచెడులను రచయిత బాహాటంగా కథారూపాల్లో సమాజానికి అందించాడు. రవి గాంచని చోటల్లా కథకుడు గాంచాడు. సమాజంలో మార్పుకు తనవంతు సేవలు అందించాడు. నవరసాలను అక్షరమాలలుగా అల్లి కథారూపాలలో అందించాడు. కాదేది కవితాకనర్హం అన్నట్టు కథాంశానికి అనర్హత అనేదే లేకుండా రచయిత కథల్లాడు. అలా అమితమైన ఇష్టంగా, అపురూపంగా కని, పెంచిన తన రచనను ఆ రచయిత మిక్కిలి గౌరవంగా చూసుకున్నాడు.
బాలరసాల సాల నవపల్లవ
కోమల కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె
సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల
కౌద్దాలికులైన నేమి
నిజదారసుతోదర పోషణార్ధమై.
లేత చిగుళ్ళలా కోమలమైన కావ్యం అనే కన్యను అమ్ముకుని, నీచపు తిండి తినడం కంటే, నిజమైన కవి.తన భార్యాపిల్లల ఉదరపోషణ కోసం నాగలి పట్టిన వ్యవసాయదారుడైనప్పటికి తప్పులేదు, అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలతో జీవించినా సరే తప్పులేదని పోతనగారు చెప్పినట్లు, మన రచయిత కూడా తన రచనలను పవిత్రంగానే ఉంచుకున్నాడు. ఇస్తే- పారితోషికం తీసుకున్నాడే గాని, తన కథలను అమ్మకానికి పెట్టలేదు.
ఈ పరిస్థితి గతంలోనే కాదు, వర్తమానంలో కూడా ఉందనే చెప్పాలి.
కొండకచో ఉదరపోషణార్థం అక్కడక్కడా రచయితలు ఘోస్ట్ రచయితలుగా అవతారం ఎత్తి, అక్షరమాలలను అమ్మకానికి పెట్టిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యంగా సినిమాలోకంలో ఈ పరిస్థితులు కనబడతాయి!
అలనాటి రచయితలు అప్పట్లో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద కలం ఝుళిపించి కథలు రాసారు. సమాజం పట్ల బాధ్యతగా కథలు రాసారు. అవి నచ్చని పాలకుల దగ్గర నుంచి ఇబ్బందులు ఎదురైన సరే, రచయితలు వెనుకడుగు వేయలేదు. కథ అంటే సమాజంలో ఉన్న న్యాయాన్యాయాలని ఎత్తి చూపడమేనా, ఒక 'ఇజం' మూసలోనే కథలు రావాలా, అవే కథలని గుర్తించాలా? అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. అయితే ఏ రచయిత ఆ 'ఇజం' చట్రంలోనే కథలు రాయనక్కరలేదు. ఏ విషయం మీదనైనా నవరసభరితమైన కథలు రాయగలిగే సృజనాత్మకతను ఒడిసిపట్టుకుని కథలు రాయవచ్చు. ప్రకృతి నుంచి శృంగారం వరకు, పరిశోధనల నుంచి హాస్యం వరకు, రాజకీయ వ్యవస్థ నుంచి, కుటుంబ వ్యవస్థ వరకు, సాంప్రదాయాల్నుంచి సాయుధ పోరాటాల వరకు, మానవ సంబంధాల నుంచి దేశసమస్యల వరకు తెలుగు కథా రచయితలు ఏ విషయాన్నీ వదిలిపెట్టలేదు. నేటికీ ఈ ఒరవడి ఉందనే చెప్పాలి!
అయితే ఇప్పుడొచ్చిన సమస్య ఏమిటనేది ప్రశ్న!
పాతతరం రచయితలలో ప్రస్పుటంగా కనబడే 'చింతన', నేటి తరం రచయితలలో కనబడటం లేదని, లేదా ఆ చింతనలో మార్పు వచ్చిందనే వాదనలు వర్తమానంలో మనకి ఎక్కువగా వినబడుతున్నాయి.
ఈ సందర్భంలో మనం మన పూర్వికులలో కొంతమంది కథారచయితల మాటలను మరోసారి మననం చేసుకోవాలి.
"రచయిత తను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించాలి. మంచికి హానీ, చెడుకు సహాయం చేయకూడదు!" అని రావిశాస్త్రిగారు చెప్పేవారు.
"కథ చెప్పడంలోనూ, పాత్రల చిత్రణలోనూ, పాత్రల స్వభావంలోనూ గుంభనకు ప్రముఖ స్థానం ఇవ్వాలి! అలాగే మనిషి తన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోడానికి పరిశీలనాశక్తి ఒక్కటీ సరిపోదు. జనం పట్ల అమితమైన ప్రేమ ఉండాలి. వారి జీవిత ఆకాంక్షల పట్ల కూడా ప్రేమ ఉండాలి!" అనే విషయాలు కాళీపట్నం రామారావు మాష్టారి కథలు చదువుతుంటే తెలుస్తాయి.
"ఆయన కథల్లోని పాత్రలు ఘోరమైన కష్టాల్లో ఉండవు. మనసును కకావికలం చేసే విషాదాలూ కథల్లో ఉండవు. కథని రంజుగా చెపుతారు. ఎంత కఠినమైన జీవితసత్యమైనా, అలగ్గా చులాగ్గా కథలో చెపుతారు. ఆయన వాక్యాలు చురుగ్గా, కరుగ్గా, నిష్కర్షగా, మొహమాటం లేకుండా ఉంటాయి గాని, అవి చెప్పేవి మాత్రం మృదువైన విషయాలు, ప్రియమైన సంగతులు!" అంటూ భమిడిపాటి రామగోపాలంగారి కథల గురించి నండూరి రామమోహనరావుగారు అంటారు.
"చెప్పదలుచుకున్న కథ, ఎంత తక్కువ మాటల్లో రాయగలిగితే అంత సామర్ధ్యం ఉన్నట్టే. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు విషయాన్ని అందించాలి. అప్పుడే కథ చదివేవారిని ఆకర్షిస్తుంది!" అంటూ ఇల్లిందల సరస్వతీదేవిగారు చెప్పేవారు.
"రచయిత ఒక 'దృష్టి'ని ఏర్పరచుకోవాలి. ఆ దృష్టి మనిషిని అసత్తు నుంచి సత్తులోకి, చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళేదిగా వుండాలి. అందుకు సృజనాత్మక కృషి రచయితకి అవసరం. అవి సాధించినవాడు తప్పకుండా ప్రజల గుండెల్లో ఉన్నతంగా నిలుచిపోతారు!" అంటూ బలివాడ కాంతారావుగారు వర్ధమాన రచయితలకు హితవు చెప్పేవారు.
"కథల్లోనూ, నవలల్లోనూ కొన్ని విషయాలను తడమడానికి, సంక్షిప్తంగానైనా చర్చించడానికి సమయం సందర్బం ఉండాలి. లేకపోతే అవి కృత్రిమంగా బలవంతంగా లాక్కొచ్చి ప్రవేశపెట్టినట్టుగా ఉండి, పాఠకులకు అవగాహన బదులు విసుగు కలిగిస్తాయి. అలాకాకుండా సందర్భోచితంగా ఉంటే పాఠకుడి అవగాహన పెంచి, ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి!" ఈ విషయాలు మునిపల్లె రాజుగారి కథల్లో కొట్టొచ్చినట్లు కనబడతాయి.
"మనం రాసే కథా వస్తువులో నిజాయితీ కనబడాలి. బాగా తెలిసిన జీవితం, బాగా మధనపెట్టిన ఆలోచనలే కథా వస్తువుగా ఉండాలి. మనకు తెలియని జీవితాలు, ఎవరో ప్రతిపాదించిన ఆలోచనలు కథలలో ఇమిడిస్తే, అవి పొరపాటున కూడా ప్రతిఫలించవు. రచయిత నిజాయితీకి ఇదే కొలమానం!" అనే అబ్బురపరిచే విషయాలు అబ్బూరి ఛాయాదేవిగారి కథలు చదివితే గోచరిస్తాయి.
ఇలా ఒకరేమిటి?ఎందరో తెలుగు కథకులు ఎన్నో సూచనలు అందించారు. వారితో పాటు వారు సృష్టించిన పాత్రలు కూడా ఇప్పటికి చిరంజీవులుగా ఉన్నాయంటే, వారి కథలలో శైలి, గమనం, నిగూఢంగా కనబడే ఓ సందేశం- ఇలా ఎన్నో లక్షణాలు కనబడతాయి. వాటి వెనుక ఆ రచయితల జ్ఞానసంపద మెరుస్తుంది. వాడుక భాష మీద ఉన్న పట్టుతో తాను నమ్మిన సిద్ధాంతాల మీద ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత కనబడుతాయి.
ఒకప్పటి రచయితలు ఆయా దేశ కాలమానా పరిస్థితులలో స్వయంగా అనుభవించిన ఆర్ధిక, సాంఘిక సమస్యలు, చుట్టూ ఉన్న సమాజం, రాజకీయ సంక్షోభాలను స్వయంగా రుచి చూశారు. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, దురాచారాలను నిర్మూలించాలనుకోవడం వంటి విషయాలమీద, వారిలో మానసికంగా లోనైన ఆ అంతర్గత, బహిర్గత ఘర్షణల వలన మంచి కథలు రావడానికి ఒక కారణం అయింది. ఒకరకమైన ఆదర్శవాదం, దానికి కావలసిన చిత్తశుద్ది ఉండేది. ఇప్పటి కాలంలో ఇవి కరువవుతున్నాయి. సమస్యలు లేవని కాదు. వాటి రూపురేఖలు, తీవ్రత తక్కువైంది.
అలాగే ఒకప్పుడు కొంత మంది రచయితలు డబ్బుకోసమే రాశారు. సినిమాల కోసం రాసే కథలు, నవలలు రాసేవారు. ఇప్పుడు కథలు విరివిగా ఉండడం వల్ల సినిమావాళ్ళే కథలు, మాటలు రాసుకుని, దర్శకత్వం కూడా చేస్తున్నారు.
అయితే ఇప్పటి రచయితలకు వచ్చే పారితోషికం పెద్దగా మమకారం లేదు, కానీ వాళ్ళకు కలిగేదల్లా స్వయం తృప్తీ. దాంతో తృప్తి చెంది, మంచి సాహిత్యం రాయాలనే దృష్టి వాళ్ళకు రావడం లేదు. చాలామందిలో రాసే శక్తి, ఆలోచన, చిత్తశుద్ది కూడా ఉండటం లేదు.
అప్పట్లో కథావస్తువుపై పరిశీలన చేసి రాయగలిగే సమయం ఉండేది, లేకపోతే చేసుకునేవారు. ఇప్పుడు ఆ సమయం తీసుకోగలిగే ఆలోచన కరువైంది. ఆ అవసరం లేదని అనుకుంటున్నారు.'మేం మనుషులను చదివి రాస్తున్నాం. అంతకంటే ఏం కావాలి?' అంటూ వాదించే ఈ తరం వారికి అర్ధం కాని విషయం ఒకటే. మనుషులు మరణించినా, మరణం లేనిది కథే! వందేళ్ల తెలుగు కథ ఇప్పటికీ అజరామరంగా ఉందంటే, ఆ కథ వెనుక ఆ రచయితలు పడ్డ శ్రమ తెలియాలి. ఎన్ని పుస్తకాలు చదివారో, సమాజాన్ని ఎంతలా చదివారో తెలుసుకోవాలి!
దురదృష్టం ఏమిటంటే-'రాసిన ప్రతీ కథా బహుమతి కోసం రాసాం' అనే భావన నేటి రచయితలలో ఎక్కువగా నాటుకుపోయింది. ఈ తరం వారికి డబ్బు ప్రధానం కాకపోవచ్చు. అయితే ఏమి రాసినా ప్రచురించడానికి సాంఘిక, సాహిత్య మాధ్యమాలున్నాయి. అవి కూడా ప్రచురించకపోతే స్వంత బ్లాగులున్నాయి. అంచేత సాహిత్యానికి విస్తృతి కలిగింది, ఏది కావాలంటే అది ప్రచురించే అవకాశం వచ్చింది. బహుమతి ఉన్నా లేకపోయినా, బహుమతి కేవలం స్వయం తృప్తే!
అయితే మరోవైపు పరిశీలిస్తే- “కథల్లో నాణ్యత ఉన్నా, లేకపోయినా పోటీలకు పుంఖాను పుంఖాలుగా కథలు వస్తుంటే, మిగతా సమయాల్లో అసలు కథలు రావడం లేదనే” పత్రికల వారి ఆవేదన కనబడుతున్నది. "నా కథ పోటిలో బహుమతికి ఎంపిక కాకపోతే సాధరణ ప్రచురణ చెయ్యొద్దనే" అనే ఆంక్షలు కనబడుతున్నాయి. రచయిత తన మీద తనకు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు, కానీ కథకీ మిగతా ప్రపంచం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఈ సందర్భంలో కథ గురించి ఓ పెద్దాయన మాటలు గుర్తుకొచ్చాయి. అవి-
కథ- మదిలో మెదిలినప్పుడే వ్రాయాలి.
కథ- నమ్మిన సిద్ధాంతాలకు ప్రతీకగా ఉండాలి!
కథ- పాఠకుల మదిలో గూడు కట్టుకోవాలి!
రాశి కంటే వాసి ముఖ్యమని తెలుసుకుని రచనలు చేసినప్పుడే, తెలుగు కథకి పూర్వ వైభవం వస్తుంది!
చివరిగా ముఖ్యమైన మరో విషయం చెప్పాలి! ఆటగాడు, పాటగాడు, నటుడు వీరి కోవకు చెందిన వాడే రచయిత కూడా! అయితే వారికి దక్కుతున్న 'సెలెబ్రిటీ' గౌరవం రచయితకు దక్కడం లేదు. వారు ఎంత కృషి చేస్తారో, రచయిత కూడా అంత కృషి చేస్తాడు. ఇంకా సూటిగా చెప్పుకుంటే- ఓ సినిమాకు మంచి కథ, సంభాషణలు అందించే రచయితకు- ఆ సినిమా విజయంలో గుర్తింపు వుండదు. మంచి ఆదరణ పొందే పాటకి- గాయకుడ్ని, సంగీత దర్శకుడ్ని మెచ్చుకుంటారు గాని ఆ పాట రచయితకి పేరు రాదు. ఈ దుస్థితికి కూడా 'మందు' కనిపెట్టాలి! రచయితని కూడా ముందు వరసలో నిలబెట్టిన నాడు తెలుగు కథ మరింత వెలుగులను విరజిమ్ముంది!
అందుకు అందరూ తలో చెయ్యి వేయాలి!!
స్వస్తి!
(న్యూజిలాండ్ ప్రత్యక్ష వేదికగా అంతర్జాలంలో జరిగిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు - 2021 లో చేసిన ప్రసంగం నుంచి -)