MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
తెలుగు భాషకు గొడుగు గిడుగు
ప్రసాద్ తోటకూర
గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంధ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పత్రికా రచయిత, విద్యావేత్త, ప్రజాస్వామిక వాది, మానవతావాది, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, వ్యావవాహారిక భాషోద్యమ పితామహుడు, గ్రాంధిక భాషావాదుల నెత్తిన పిడుగు, వాడుక భాషకు గొడుగు గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి స్థానం తెలుగు సాహిత్య చరిత్రలో అజరామరం.
పండితులకే పరిమితమైన సాహిత్యం, ఏ కొద్దిమందికో పరిమితమైన గ్రాంధిక భాష - గిడుగు వారి ఉద్యమంవల్ల వ్యావహారికభాషలో సాగి సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఆగష్టు 29 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే. మరొక్కసారి వారి గురించి సమగ్రంగా ఈ వ్యాసరూపంలో తెలుసుకుందాం.
దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, జాతికి భాషా స్వాతంత్ర్యం కూడా అంతే ముఖ్యమైనదని గట్టిగా నమ్మిన మహనీయుడు గిడుగు.
ముందుగా వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం.
ఆరువేల నియోగుల వంశానికి చెందిన వీరి పూర్వీకులది తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన అమలాపురం దగ్గరలో ఉన్న ఇందుపల్లి అనే గ్రామం. 1830 లో కోనసీమలో వచ్చిన అనావృష్టి కారణంగా గిడుగు వేంకట రామమూర్తి గారి తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ గారు అక్కడనుండి వలసవెళ్లి శ్రీకాకుళం జిల్లాలో స్థిరపడ్డారు. వీర్రాజు గారు శ్రీకాకుళం జిల్లాలో లోని పర్వతాలపేట సంస్థానంలో రెవిన్యూ శాఖ లో నెలకు 30 రూపాయల జీతం పై పని చేసేవారు. ఆగష్టు 29, 1863 న పర్వతాలపేట అనే గ్రామంలో గిడుగు వేంకట రామమూర్తి గారు జన్మించారు.
తొలి జీవితం మీదుగా వీక్షణం -
పర్వతాలపేట లో విద్యా సౌకర్యాలు అంతగా లేకపోవడంతో ప్రక్కనే ఉన్న గోనెపాడు అనే గ్రామం నుండి వారణాశి గున్నయ్య శాస్త్రి గారు వచ్చి ఇంటి వద్దే చదువు చెప్పేవారు. ఆ తర్వాత బైరాగి పట్నాయక్ అనే గురువు గారు గిడుగుకి విద్యాబోధన చేసారు. తండ్రి వీర్రాజు గారు తనకు ఖాళీ ఉన్న సమయంలో భారత, భాగవత పద్యాలు, శ్లోకాలు నేర్పారు. ఇలా 1875 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. రామమూర్తి గారు సూక్ష్మగ్రాహి, ఆయన ధారణ అసాధారణం. 8 ఏళ్ళకే “సంస్కృత శబ్దమంజరిని” నేర్చుకున్నారు. వీర్రాజు గారి కి చోడవరం బదిలీ అయినప్పుడు, తన భార్య, ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు వేంకట రామమూర్తి గారిని తన మామగారింటికి విజయనగరం పంపించారు. 1875 లో వీర్రాజు గారు చోడవరంలో విష జ్వరంతో చనిపోయారు.
ఆ తరువాత రామమూర్తి గారి తల్లి వెంకమ్మ గారు కష్టపడి రామమూర్తి గారిని, తన ఇద్దరు చెల్లెళ్ళను చదివించారు. రామమూర్తి గారు విజయనగరం మహారాజావారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకు చదువుకున్నారు. 1879 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు గారు రామమూర్తికి సహాధ్యాయి. ఆ యేడే, 1879 లో తన 16 సంవత్సరాల వయస్సులో భీమునిపట్నానికి చెందిన రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణమ్మ గారితో రామమూర్తి గారికి వివాహం అయింది. 1880 లో ముఫ్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో చరిత్ర బోధించే ఉపాధ్యాయుడిగా చేరారు. సంసార బాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తి గారిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్.ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు ప్యాసయ్యాడు. 1896 లో మూడోభాగం ప్యాసై బి. ఎ పట్టా పుచ్చుకున్నాడు. ఆంగ్ల, సంస్కృతాలు గాకుండా, చరిత్ర ప్రధాన పాఠ్యాంశంగా తీసుకుని రాష్ట్రంలోనే ద్వితీయ ఉత్తమ విద్యార్ధి గా బి.ఎ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడే రాజావారి ఉన్నత పాఠశాల కళాశాలగా మార్పు చెందడంతో ఆయనకు కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే అధ్యాపక పదవి లభించింది.
సవర భాష పాండిత్యంపై మక్కువ -
ఆ రోజుల్లోనే దగ్గరలో ఉండే అడవుల్లో కొండ జాతి ప్రజలు మాట్లాడే సవర ల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచీ వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని "శబరు"లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి, అధ్యాపకులకు జీతాలు చెల్లించి, సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్" బిరుదునిచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఆంగ్లంలో సవర భాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఆంగ్ల కోశాన్ని నిర్మించాడు.
మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931 లోను, సవర-ఆంగ్ల కోశాన్ని 1938 లోను అచ్చువేశారు. 1934 లో ప్రభుత్వం ఆయనకు 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి సముచిత గౌరవాన్ని అందించింది.
శాసనాల అధ్యయనంలో అసాధారణ పరిశీలనలు -
హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని అధ్యయనం చేసాడు. విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగ వంశీయుల గురించి రామమూర్తి ఆంగ్లంలో ప్రామాణిక వ్యాసాలు వ్రాసి “Indian Antiquary” లోను, “Madras Literature & Science Society Journal” లోనూ ప్రచురించాడు. 30 ఏళ్ళ పాటు అధ్యాపకునిగా పని చేసిన గిడుగు ఆ అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా1911 లో పదవీ విరమణ చేశాడు. అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషా సంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.
మూర్తిమంతమైన సంస్కారమే ఆయన వ్యక్తిత్వం -
రామమూర్తికి చిన్నప్పటినుంచే విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలని పేరు. సవరలుని హరిజనులనీ, అంటరానివారనీ సమాజం వివక్ష చూపే ఆ కాలంలోనే, అతను సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి, భోజనం పెట్టేవాడు. 1930 లలో ఒడిషా రాష్ట్రం ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒడిషా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిషాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని నిరసన చూపిస్తూ అతడు 1936 లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే రోజు ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే తన సొంత ఇంటినీ, అన్నింటినీ వదిలేసి కట్టుబట్టలతో రాజమహేంద్రవరం చేరుకొని అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకుంటారు.
గిడుగుకు తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా తనకు పేరు రావాలన్న ఆలోచన, పట్టింపు ఉండేవి కావు ఒక వ్యాకరణం పుస్తకంలో గిడుగును ప్రస్తావించకుండా అతని రచనలోని భాగాలు వాడుకున్నారని భావరాజు వెంకట కృష్ణారావు అనే మిత్రుడు బాధపడితే "అక్షరాలు కనిపెట్టినవాడి పేరెవరికైనా తెలుసునా? అట్లాగే నా పేరు తెలిస్తేనేం, తెలియకపోతేనేం?" అని గిడుగు తన మిత్రుడ్ని ఓదారుస్తూ జవాబిచ్చాడు.
గిడుగు వాదం దిశగా అడుగులు - వచన భాష సంస్కరణోద్యమం ఉధృతి
1907లో J. A. Yates అనే బ్రిటిష్ దొర ఉత్తర కోస్తా జిల్లాలకు పాఠశాలల పర్యవేక్షకుని గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకన్ని తేడాలనే విషయం అతనికి అంతుపట్టలేదు. అంతకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో A.V.N. కళాశాల ప్రాచార్యులు గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఆంగ్లంలో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి యేడూ జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవభాష ప్రాధాన్యత గురించి ఉపన్యాసాలిచ్చేవాడు.
1906 నుండి 1940 వరకు దాదాపు 34 సంవత్సరాలు గిడుగు రామమూర్తి కృషి అంతా తెలుగు భాషా సేవకే. యేట్స్ ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంధరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యుడయ్యాడు. వీరేశలింగం పంతులు గారి ఊతం కూడా ఈయనకు లభించింది. 1919-20 ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు' అనే మాసపత్రిక నడిపాడు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925 తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు గిడుగు. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.
విద్యార్ధి తాను సులభంగా, సరిగ్గా ఏదైనా చెప్పడానికి భాషా బోధన తోడ్పడాలని, వాస్తవ విషయాలను గురించి ఊహించగల శక్తి, లోక జ్ఞానం విద్యార్ధులలో పెరగాలని, విషయ గ్రహణ శక్తి బాగా అలవడాలంటే వాడుక భాష ఒక్కటే మార్గమని గిడుగు ప్రతిపాదించారు.
గిడుగు కృషివల్ల 1912-13 లో ఎస్. ఎస్. ఎల్. సి. లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని వ్రాయవచ్చునని విద్యా కార్యదర్శి ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఇచ్చాడు. ఆధునికభాషకు లక్ష్యంగా బ్రౌన్ తెలుగు రీడర్ ను, ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్రను ఉదహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు" ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసి మళ్ళీ ఆ ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించేలా చేసారు.
విద్యాలయాలలోని పుస్తకాల్లో గ్రాంధికభాషే పాతుకుపోయింది. కొన్నిటిలో వీరేశలింగం ప్రతిపాదించిన సరళ గ్రాంధికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంధికంలో ఏ రచయితా నిర్దుష్టంగా వ్రాయలేడని నిరూపించాడు. 1919 లో గిడుగు "తెలుగు" అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది.
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28 న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడుగా, గిడుగు కార్యదర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" స్థాపించారు. 1933 లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవాన్ని ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో "Miscellany of Essays" (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు.
ఇలా మరి కొన్ని ప్రభావశీలమైన మార్పులు దశలవారీగా ఉద్యమ ఫలితాలని సామాన్యజనానికి చేరువ చేసాయి.
1924 లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది.
1936 లో నవ్య సాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే "ప్రతిభ" అనే సాహిత్య పత్రికను ప్రచురించారు.
1937లో తాపీ ధర్మారావు సంపాదకుడుగా "జనవాణి" అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు వ్రాయటం మొదలుపెట్టింది.
కన్యాశుల్కం అనే బహుళ ప్రజాదరణ పొందిన నాటకాన్ని గురజాడ అప్పారావు వ్యవాహారిక భాషలోనే రాసారు. 1915 లో గురజాడ మరణించారు.
గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషావ్యాప్తికి చాలా సంతృప్తి గా ఉన్నట్టుగా వ్యక్తీకరించారు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టక పోవడంతో బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు -
“దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజన వ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. గ్రాంధికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంధికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంధికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదువవద్దనీ, విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా - వ్రాసేవారికి కష్టమే; వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని, గ్రాంధికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు, వినేవాండ్లు తమ సొంత వాడుక మాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏ భాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.
పేరు, ప్రతిష్ట, పదవి, హోదా, ధనం ఏదీ కోరుకోకుండా నిర్మలంగా, నిస్వార్థంగా వాడుకభాష వ్యాప్తి కోసం పరితపించిన కృషీవలుడు గిడుగు రామమూర్తి జనవరి 22, 1940 న చెన్నై లో కన్ను మూశారు.
రామ్మూర్తిపంతులు గారి కుమారుడు గిడుగు సీతాపతి కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ' కళాప్రపూర్ణ ' బిరుదు పొందిన తండ్రీ కొడుకులు వీళ్ళిద్దరే!
అశేష జనసామాన్యం నుంచి అపరిమితమైన అభిమానాన్ని, గౌరవాన్ని అప్రయత్నంగానే సాధించుకున్న గిడుగు రామమూర్తి పంతులు గారి సేవలకి ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలు, ప్రముఖుల ప్రశంసలు -
1913 లో బ్రిటిష్ ప్రభుత్వం “రావు సాహెబ్” బిరుదు ఇచ్చింది.
1934 లో బ్రిటిష్ ప్రభుత్వం “కైజర్ ఎ హింద్” బిరుదు ఇచ్చి స్వర్ణ పతకంతో గౌరవించింది.
1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు “కళాప్రపూర్ణతో” గౌరవించింది.
ఈ వ్యాసం ముగిస్తూ రామ్మూర్తి పంతులు గారి గురించి కొందరు ప్రముఖుల మాటలు వారిమాటల్లోనే తలుచుకుందాము.
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి: "ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదులూ, పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే"
విశ్వనాథ సత్యనారాయణ: "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట"
"రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు"
పులిదిండి మహేశ్వర్: "గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు గిడుగు, వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు,
తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు"
*****
(మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చేసిన ప్రసంగవ్యాసం.)