top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

వ్యాస​ మధురాలు

కవిత్వంలో తాత్వికత

vinnakota.JPG

విన్నకోట రవిశంకర్

 కవిత్వంలో తాత్వికత అనే విషయం గురించి చర్చించటానికి ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి. కవి అనేవాడు తాత్వికుడు  కావలసిన అవసరం లేదు. కవికి చెమర్చే కన్ను, చలించే హృదయం ముఖ్యం. “నానృషిః కురుతే కావ్యం” అన్నారు గానీ అక్కడ కవిని ఒక ద్రష్టగా - అంటే  ఒక అనుభవంలో గాని , ఒక సంఘటనలో గాని, ఒక ప్రకృతి దృశ్యంలో గాని ఇతరులు చూడలేని దాన్ని చూసి, ఆవిష్కరించగలిగేవాడిగా భావించి చెప్పినది. తాత్వికత అంటే ఒక స్థిరమైన తాత్విక సిద్ధాంతం గురించి రాసినది కూడా కాదు. గాంధీయిజం, మార్క్సిజం, మావోయిజం, అంబేద్కరిజం వంటి రకరకాల సిద్ధాంతాల ప్రభావంతో రాసిన కవిత్వం చాలా ఉండవచ్చు. ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది దానిని గురించి కాదు. ఇది ఒక అన్వేషణకి, లోచూపుకి సంబంధించినది. నిత్య జీవితంలో మనకెదురయ్యే సమస్యలు, సవాళ్లు వంటి వాటి గురించి కాకుండా, ఈ సృష్టి గురించి, విశాల విశ్వంలో మానవుడి పాత్ర గురించి మనిషి అంతః ప్రపంచంలో జరిగే మథనం గురించి ఒక తపనతో, వేదనతో రాసే కవిత్వం ఇక్కడి అంశం.

దాదాపు 20 సంవత్సరాల క్రితం మధురాంతకం నరేంద్ర సంపాదకత్వం లో “తాత్విక కథలు” అనే సంకలనం వచ్చింది అందులో చలం “ఒక పువ్వు పూసింది”, కారాగారి “భయం”, ఆర్. వసుంధర దేవి గారి “పెంజీకటి కావల”, మధురాంతకం మహేంద్ర “ఒగినేకల్” మొదలైన వాటితో పాటు అనేక మంచి కథలున్నాయి. చాలా వాటిలో మృత్యువు ఒక సామాన్య అంశంగా కనిపిస్తుంది. వీటిని చదివినప్పుడు, తాత్వికత లేదా తాత్వికమైన ఆలోచన అన్నది అనివార్యంగా మృత్యువుతో ముడిపడి ఉన్నదేనా అన్న సందేహం కలుగుతుంది. మృత్యువు నిదానమైన మన జీవితాన్ని ఒక్కసారి కుదిపి, ఇందాక చెప్పినలాంటి ఆలోచనల వైపు మళ్లించటం సహజంగా జరిగేదే. ఐతే, అదేదో స్మశాన వైరాగ్యంతోనో, మెట్ట వేదాంత ధోరణిలోనో రాస్తే అది రచనగా మారిపోదు. దానికంటే లోతైన, గాఢమైన స్పందన ఏదో మనలో కలిగించేదే మంచి రచనగా నిలుస్తుంది.

ఉదాహరణకి రావిశాస్త్రిగారి “కార్నర్ సీటు” కథని తీసుకోవచ్చు. నా చిన్నతనంలో చదివిన శాస్త్రిగారి కథా సంపుటి “ఆరు సారో కథలు మరో ఆరు కథలు” లో ఈ కథ ఉండేది. అందులో కథలన్నీ నిజానికి దీర్ఘ కవితల్లాంటివే – “జరీ అంచు తెల్లచీర”, “నీడలు”, “వర్షం”, “ఆఖరి రోజులు” మొదలైనవి. జగన్నాథ శర్మగారు చెప్పేవారు - ఈ కథల్లో కొన్ని నోటికి వచ్చేవని. అలా గుర్తుండటానికి కారణం అవి కవితల్లాంటివి కావటమే. “కార్నర్ సీటు” కథ కూడా మృత్యువుతో ముడిపడి ఉంటుంది. కథలో ముగింపు వాక్యాలు ఇందాక నేను చెప్పినలాంటి స్పందననే పాఠకునిలో కలిగిస్తాయి. తెలుగు కథ మీద ఆర్.యస్.సుదర్శనం గారు రాసిన ఒక వ్యాసంలో ఈ కథ గురించి విశేషంగా ప్రస్తావిస్తారు.

 

కథైనా, కవితైనా తాత్వికతన్నది వస్తువు కాదు, అది ఒక స్వభావం, ఆ రచన రూపొందిన విధానం. వస్తువు మీద రచయిత లేదా కవి చూపిస్తున్న దృక్కోణం. తాత్విక స్వభావానికి అన్వేషణ ముఖ్యం. జవాబుల కంటే ప్రశ్నలే ముఖ్యం. ఎందుకంటే ప్రశ్నలు శాశ్వతం, జవాబులు మారుతూ ఉంటాయి. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కవిత “ఏది పాపం? ఏది పుణ్యం” గుర్తు చేసుకోవచ్చు కవిత మొత్తం ప్రశ్నలుగానే ఉండటం అన్వేషణలో భాగంగా అనిపిస్తుంది. శ్రీ శ్రీ మరొక కవిత “సదసద్సంశయం” కూడా ఇటువంటిదే.

ఎన్నో సందేహాలు, ఎన్నో సంతాపాలూ

జీవితపు చిక్కు ముడులు

వీడవెంత సడలించిన

ఈ సృష్టికి ఏమర్థం?

మానవునికి గమ్యమేది?

ఒక సకాలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా?

అలాగే కృష్ణ శాస్త్రి కవితా ప్రస్థానం కూడా ఒక అన్వేషణ అని ఇస్మాయిల్ గారు అంటారు. మనిషి ఆత్మ కేంద్రంలో ఒక మహా శూన్యం తో పుడతాడు. దానిని ప్రపంచ సౌందర్యంతో దాని వల్ల కలిగే ఆనందంతో నింపగలిగే పనిని కొద్దిమంది సృజనకారులు మాత్రమే చేస్తారు. వారిలో కృష్ణశాస్త్రి గారు ఒకరని ఇస్మాయిల్ గారు చెబుతారు. “కృష్ణపక్షం”, “ప్రవాసం”, “ఊర్వశి”లో సాగిన ప్రస్థానం ఆ శూన్యం నుంచి ప్రకృతితో తాదాత్మ్యత, అన్వేషణ, దుఃఖం, పరివేదన మొదలైన సాధనాల ద్వారా స్వేచ్ఛకి, సౌందర్యానికి ప్రతీక అయిన ఊర్వశిని చేరుకునేదాకా సాగిందని ఆయన అభిప్రాయం.

ఇటువంటి అన్వేషణ గురించే తిలక్ తన కవిత “శిఖరారోహణ”లో గొప్పగా వర్ణిస్తాడు. నిజానికి ఈ కవిత ఉగాది కవి సమ్మేళనం కోసం రాసిన కవిత అని తెలుస్తూ ఉంటుంది. ఉగాది కవి సమ్మేళనాలలో వచ్చిన విశిష్టమైన కవితగా దీనిని చెప్పుకోవచ్చు. "షేక్స్పియర్, డాంటే, కాళిదాసు, శంకరుడు, మార్క్స్, మహాత్ముడు, పికాసో, సార్త్రే ఎవరైనా ఇది నిత్య నూతన పరిశోధన. సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ" అంటాడు. అలాగే, ఈ కవితలోనే మరొక చోట -

అపుడు నా మీదకి భవిష్యద్గగనం వంగి

నా చెవిలో చెప్పిన రహస్యం విన్నాను

చెదిరిన మబ్బుల మధ్య సూర్యుణ్ణి చూసాను

అపుడు ఈజిప్ట్ పిరమిడ్ల మధ్య

బాబిలోనియా స్థూపాల మధ్య

మొహంజొదారో శిథిలాల మధ్య

నిలిచి కలలు కన్నాను

అలా అలా అనాది అంధకార భయంకరాటవుల మధ్య

సృష్టి సింహం చేసిన ప్రథమ గర్జన విన్నాను.

అని రాస్తాడు. ఇలా సాగుతూ ఒక గంభీరమైన చారిత్రక దృశ్యాలలోకి మనల్ని తీసుకొనిపోతూ, సృష్టి పట్ల, కాల గమన రీతుల పట్ల మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది ఈ కవిత.

దిగంబర కవుల మొదటి సంకలనంలో కూడా కొంత అస్తిత్వ వేదన అన్వేషణ ఉన్నాయని తరువాతి సంపుటాల్లో అది మాయమై విప్లవ రాజకీయాలు చోటు చేసుకున్నాయని ఆర్‌ఎస్ సుదర్శనం గారు అంటారు. నగ్నముని కవిత “జైల్లో సముద్రం” లో ఒక జిజ్ఞాస అన్వేషణ కనిపిస్తాయి.

 

సూర్యునికి అడ్డంగా నుంచున్న

ఆ మబ్బుతునక పేరేమిటి?

..

అర్థంకాని అనంతమైన శూన్యం మీదకి

ఆకారంలేని కుర్చీనొకటి లాక్కుని

అర్థవంతమైన బ్రతుకు వెన్నెల చుక్కల్ని కప్పులో ఒంపి

ఒక్కొక్క క్షణం పెదవుల కానించి విషాదాన్ని ఆరాధిస్తూ ఉంటానా

హొయలు హొయలుగా, పొగలు పొగలుగా, కెరట కెరటాలుగా

కాలం నా కాళ్ళని ముంచెత్తుతూ ఉంటుందా

ఎందుకో ఒక్కసారి ఏకాంతంలోకి నిర్జనారణ్యాలు నడిచి వస్తాయి

నిబిడాంధకార గహ్వరాలు తెరుచుకుంటాయి

..

 

ఇలా సాగిన కవిత చివరిలో ..

 

నీకు నాకు నడుమ

నాకు, ఈ నటనకి నడుమ

ప్రపంచ దేశాల ప్రళయ పరాచికాల నడుమ

సత్యానికి, సత్యానికి నడుమ నిలుచున్న

ఆ మబ్బుతునక పేరేమిటి?

అని ముగుస్తుంది. ప్రశ్నతో మొదలైన కవితను ప్రశ్నతోనే ముగించటం ఒక అన్వేషణాత్మక ధోరణికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.

 

ఇందాక చెప్పినట్టు మృత్యువు వంటి విషాదకరమైన అంశమే కానక్కరలేదు జీవితోత్సవం లాంటి ఆనందకరమైన అంశం కూడా ఒక తాత్వికతను నిర్దేశించవచ్చు. అలాగే ఒక కవితను బట్టి కాకుండా అనేక కవితలలో ఒక కవి పాటించిన ధోరణిని బట్టి అతని తాత్వికతను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇస్మాయిల్ గారు తన కవితల ద్వారా సూచించినదేమిటి? సృష్టి వైభవం నుంచి ఆయన గ్రహించినదేమిటి? అని ఆలోచించినప్పుడు, సకల చరాచర సృష్టి మీద ఒక అవ్యాజమైన ప్రేమతో ఆ జీవితోత్సవాన్ని తిలకించి అందులో అనుక్షణం భాగం కావటమే తన కవిత్వ పరమార్థంగా ఆయన భావించారని నాకనిపిస్తుంది. అందుకే ఆయన కవితలలో ఆకులు చప్పట్లు కొడతాయి. ఏరు వంతెన కిందుగా ఊహల్లోకి గెంతుతూ పారుతుంది. కొబ్బరి చెట్టు గంపెడు కాయలతో ఆశ్చర్యపడి నిలుచుంటుంది. మబ్బు ముప్పొద్దులు, కాలువలో మొహం చూసుకొని ఆశ్చర్యపడుతూ. బావి భూమి బుగ్గల మీద నవ్వు సొట్టలా? ముడుచుకొని ఉంటుంది.

హైకూ కూడా ఒక తాత్విక నేపథ్యం ఉన్న ప్రక్రియ. మన వాళ్ళు చాలా మంది ఏవో మూడు పొట్టి లైన్లు రాసి హైకూ అని పేరు పెడతారు కానీ జెన్ బుద్ధిజం ప్రాతిపదికగా ఏర్పడిన హైకూ తత్వాన్ని తెలుసుకొని ఒకరకమైన ధ్యానంతో దానిని దృశ్యమానం చేయగలిగినప్పుడే అది రాణిస్తుంది. విషయానికి, విషయికి, చూసేవాడికి, చూడబడే దానికి మధ్య అంతరాన్ని తొలగిస్తూ తర్కానికి, ఆలోచనకి తావులేకుండా అనుభూతం చేసేదే హైకూ. ఒక మాటలో చెప్పాలంటే అది ప్రకృతితో మమేకత్వాన్ని సాధించటం. హైకూ రాయటానికి ప్రకృతి మీద అపారమైన ప్రేమ అంతర్ముఖత్వం రెండు ఏక కాలంలో కావాలి దానికి ఒక మానసికమైన వైఖరి అవసరం. అందుకే అందరూ హైకు రాయలేరు. గాలి నాసరరెడ్డి, బివివి ప్రసాద్, ఇస్మాయిల్ వంటివారు మంచి హైకూలు రాశారు ఉదాహరణకి -

 

తుఫాను హడావుడిలో

పాప ఒక్కర్తే అడిగింది

చంద్రుడేమయ్యాడని

 

మా చిన్నప్పటి ఫోటోలు

కాలం ఆత్మకి అప్పిచ్చి

దేహాన్నించి వసూలు చేసింది

 

గేదెల్ని కడుగుతూ

కాలువలో ఈతకొట్టే పిల్లలు

ఎంత అదృష్టవంతులు?

 

అజంతా, వేగుంట మోహనప్రసాద్, ఇటీవలి కాలంలో ఎం ఎస్ నాయుడు వంటివారు రాసిన కవిత్వం కూడా ఇతర కవులు రాసిన కవిత్వం కంటే చాలా భిన్నంగా గంభీరంగా ఉంటుంది. అయితే అందులో తాత్వికత కంటే అధివాస్తవికత ఎక్కువగా ఉంటుంది.అనేక ఆలోచనలు, భయాలు ఊహలు పదచిత్రాలు కలగలిసిపోయి పాఠకుడి అవగాహనకి సవాలుగా నిలుస్తాయి. ఒక రకంగా చూస్తే అవి మనిషి అంతఃప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి కాబట్టి ఆ కోణంలో వాటిని కూడా తాత్విక కవితలుగా భావించవచ్చు. ఉదాహరణకి “సాంధ్య భాష” అన్న సంపుటిలో మో రాసిన ఒక కవిత చూడవచ్చు. సరస్వతి అనే దానిని మార్చి “స్వరరతీ!” అని పేరు పెట్టారు. ఆ కవిత ఇలా సాగుతుంది..

నీ ప్రాణ వీణియ వెన్నెముక మెట్లు

ఒకటొకటే దిగిపోతున్నపుడు

పురా ప్రపంచాల పరిపరి జన్మలు

రహస్య సరస్తీరాన మిణుగురు పూలు

గుంపులు గుంపులుగా దృశ్యా దృశ్యాల్లా

మాయమై ప్రత్యక్షమవుతూ

 

వీణ తీవియ వేలికి చుట్టుకున్నపుడు

సరస్వతీ నాదంలో ఆగిపోతాయ్

సగంలో సంగతులు

ఆనందపు అంచున జారిపోయే

భయానక అగాధపు ఆశ్చర్యంలో

ఇక నేను తెగీ నలిగీ సాగిలే వీణనై పోతాను!

 

మో కవితలో వెలుగు చీకటి కలగలిసినట్టు ఉంటాయి. అందులో ప్రతి పదమూ, ప్రతి వాక్యమూ అర్థం కాకపోయినా ఒక గంభీరమైన ఆలోచన వైపు, సహజ పరిధిలో మన ఆలోచన పోని దారుల వైపు ఆ కవితలు మనల్ని మళ్లిస్తాయి. ఎంత సంక్లిష్టమైన ఊహల్ని కవి సృష్టించగలుగుతున్నాడో అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.

 

ఈ సందర్భంలో త్రిపుర గారి గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి. తెలుగు కథకు ఒక కొత్త ఒరవడిని చూపించి ఎవరూ అనుసరించలేని మార్గంలో దానిని నడిపించిన అరుదైన కథకుడు త్రిపుర గారు. అంతఃప్రపంచంలోని చీకట్లని మనిషి స్వభావంలో ఉండే వెలుగునీడల్ని అత్యంత ప్రతిభావంతంగా తన కథల్లో చిత్రించారు. రావిశాస్త్రి కథల్లాగే త్రిపురగారి కథలు కూడా కవితల్లాంటివి. అయితే శాస్త్రిగారు విడిగా కవితలు రాసారో లేదో తెలియదు కానీ త్రిపురగారు మాత్రం కొన్ని కవితలు రాసారు. శాస్త్రిగారి కథల్లో కవితా వ్యాఖ్యలు కూర్చి “వెన్నెలో వెన్నెల” పేరుమీద కవితా సంపుటిగా తీసుకువచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ త్రిపుర కవితలను కూడా పుస్తకంగా తెచ్చాడు. ఆయన కథల్లో తారసపడే అస్తిత్వ వేదనే కవితల్లోనూ కనిపిస్తుంది. కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తి పాఠకుల్ని అంతర్ముఖులని చేస్తుంది.

 

వాడ్రేవు చిన వీరభద్రుడు వ్యాసాలు, ఉపన్యాసాల లాగానే అతని కవిత్వంలో కూడా ఒక తాత్వికమైన చింతన, అభివ్యక్తి మనకు కనిపిస్తాయి. “నిర్వికల్ప సంగీతం” మొదలుకొని “ఒంటరి చేల మధ్య ఒక్కతే అమ్మ” మొదలైన సంపుటాలలో దీనిని చూడవచ్చు అలాగే “పునర్యానం” కావ్యం. మొదట్లో ఒక తాత్విక అన్వేషణ, గంభీరమైన కొన్ని ఆలోచనల్ని ఆవిష్కరించే క్రమంలో ఈ కావ్యం రూపొందింది అనిపించింది. గిరిజన అధికారిగా చేరి పనిచేసిన కొన్ని సంవత్సరాలలో కలిగిన అనుభవాల గురించి రాసిన “కొన్ని కలలు కొన్ని మెలకువలు” చదివాక “పునర్యానం” అదే అనుభవానికి కవితా రూపం అని అర్థమైంది.

 

ఇస్మాయిల్ ప్రభావంతో రాసిన బి వి ప్రసాద్, ఇస్మాయిల్,త్రిపుర ఇద్దరి వల్ల ప్రభావితుడై రాసిన మూల సుబ్రహ్మణ్యం వంటివారి కవితలలో ఒక విధమైన తాత్వికత అంటే సాధారణమైన అనుభవాలను తాత్వికరించే ప్రయత్నం మనకు కనిపిస్తుంది. బి వి ప్రసాద్ మొదట్లో రాసిన హైకూలలో సునిశితమైన దృష్టి హైకూ తత్వం మీద మంచి అవగాహన ఉంటాయి నిజానికి తెలుగులో విజయవంతంగా హై కూలు రాసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు.

గోడలో పూచిన పువ్వు

పరిచయం చేసింది

మా గోడను

 

ఇస్మాయిల్ గారు “దృశ్యాదృశ్యం” ముందుమాటలో చెప్పినట్టు కవిత్వానుభూతి, పదచిత్రాల సమన్వయం ఈ కవితల ముఖ్యలక్షణం.

 

మూలా సుబ్రహ్మణ్యం లో కూడా ప్రకృతితో తాదాత్మ్యత, చిన్న చిన్న పదచిత్రాలతో లోతైన భావాన్ని స్ఫురింపజేసే నేర్పు కనిపిస్తాయి ఉదాహరణ కి-

పున్నమి రాత్రి సముద్రం నన్ను రా రమ్మని పిలుస్తుంది

పారే నది నాకు దారిచూపుతూ

చంద్రుడు దారంతా వెలుగుపరుస్తాడు

ఒంటరి పడవలో చిన్న నేను

ఇందులో సముద్రం మరణానికి, నది జీవితానికి ప్రతీక అనుకుంటే తన అస్తిత్వమనే చిన్న పడవలో మనిషి ప్రయాణం చేస్తున్నాడని అనుకోవాలని అతని పుస్తకాన్ని సమీక్షించిన వంశీకృష్ణ రాశాడు. అలాగే మరొక కవితలో

నదిలో నుంచి దోసిలి నీళ్ళు తీసుకొని

తిరిగి నదికి అర్పిస్తూ చేతులు జోడిస్తాను

అంటాడు. దాదాపు ఇదే భావం ఆది శంకరులు రాసిన ఒక గీతంలో వ్యక్తమవుతుందట.

ఇటీవలి కాలంలో రాం డొక్కా రాసిన కవితల్లో కూడా ఇటువంటి తాత్వికమైన కవిత్వానికి కావలసిన అంతర్ముఖీనతను గుర్తించే ప్రయత్నం చూడవచ్చు. ఆయన పుస్తకం "అవ్యక్తం"కి నేను రాసిన ముందు మాటలో ఈ అంశాలు వివరంగానే ప్రస్తావించాను.

కలల వనంలో

కాలగతి చెదరని

కావ్య తరువులయ్యే కవితాంకురాలు మొలకెత్తాలంటే

ఎంతటి అంతర్యుద్ధం జరగాలి?

 

ఇటువంటి యుద్ధం అవసరాన్ని గుర్తించటం దానికి సిద్ధపడటమే కవి తన పాత్రను తాను తెలుసుకున్నాడని అనుకోవటానికి నిదర్శనం.

ఇటువంటి కవిత్వం రాసేటప్పుడు జాగ్రత్త పడవలసిన అంశాలు రెండున్నాయి. అవి నిజానుభవం, నిజాయితీ. ఎంత తాత్వికమైన కవిత్వమైనా దానికి పునాది మాత్రం అనుభవమే కావాలి. తాను చూసిన, ఆస్వాదించిన, అవగతం చేసుకున్న ప్రపంచాన్ని తనదైన దృక్పథంతో వ్యాఖ్యానించటం కవి చెయ్యవలసిన పని. అప్పుడే ఆ స్వరంలో నిజాయితీ గోచరిస్తుంది. అంటే నగరంలో నివసిస్తూ అడవుల్లో ఉన్నట్టుగా రాయకూడదు. ఒక స్వచ్ఛమైన అంతర్ముఖీనత, అన్వేషణ కేవలం కవితా వ్యూహంగానే కాకుండా ఒక స్వభావంగా జీవన విధానంగా కలిగిన కవి తన భావాల్ని ఒక స్వచ్ఛమైన, నిర్దిష్టమైన స్వరంతో వ్యక్తం చేసినప్పుడు అవి పాఠకుణ్ణి కూడా తనలో తాను చూసుకునేటట్లు చేసి, లోపల దీపం వెలిగిస్తాయి.

 

*****

bottom of page