MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
తప్పొప్పుల తక్కెడ – 2
పౌరవిధిని పాటించాలి
ఎలనాగ
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
ఉపోద్ఘాతం:
ఈ "తప్పొప్పుల తక్కెడ" శీర్షికకై ఎలనాగ గారు ప్రతీ సంచికలో ఒక చిన్న పేరాని అందిస్తారు. పాఠకులు/ భాషాభిమానులు అందులో తప్పులేవో కనిపెట్టగలిగితే కింద కామెంట్లలో చెప్పవచ్చు. లేదా sahityam@madhuravani.com కి సెప్టెంబర్ 15 లోగా పంపవచ్చు. గడువు తేదీ లోపల వచ్చిన జవాబులను పరిశీలించి, వచ్చే సంచికలో పాఠకులకు ఒక్కో పదం గురించిన తప్పొప్పుల వివరణ ఇస్తారు. ఔత్సాహికులైన సాహిత్యాభిమానులు మెండుగా ఉన్న మన పత్రిక లో మొదలవుతున్న ఈ వినూత్న ఈ శీర్షిక, పాఠకులకి ఆసక్తికరంగా మరియు ఉపయుక్తంగా ఉండబోతుందని సంతోషంగా ప్రకటిస్తున్నాము.
మరి మీరు తప్పొప్పుల తూకానికి సిద్ధమేనా? తప్పులు కనిపెట్టిన వెంటనే చెప్పేయండి.
సాహితీ బంధువులిక మీ భాషాజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ పారాగ్రాఫ్ లోని తప్పొప్పులను సూచించండి.
తప్పొప్పుల తక్కెడ – 3 : పౌరవిధిని పాటించాలి
రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు విసుగు చెంద దల్చుకోకూడదనుకుంటే కధల పుస్తకం చదవాలి. ఆ మాటకొస్తే మనకు నచ్చుతుందనిపించే ఏ గ్రంధాన్నైనా చదవవచ్చు. మనసు చికాకుగా ఉన్నప్పుడు అది కొంత ఉపషమనాన్ని కలిగించే అవకాశముంది. కళల పట్ల ఆసక్తి లేనివారు తమకు ఇష్టమైన పనులతో కాలక్షేపం చేస్తారు. ఉదాహరణకు కొందరు కార్డ్ గేమ్ ఆడుతారు. కొందరేమో లోకాబిరామాయణం మొదలు పెడతారు. సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం వినేవాళ్లు కూడా కొందరుంటారు. మధ్యపానం చేసేవాళ్లు కూడా అఱుదుగా దర్శనమిస్తారు. కొందరు వేరు శనక్కాయలు, అరటి పళ్లు మొదలైనవాటిని తిని, వాటి పొట్టులను, తొక్కలను తాము కూర్చున్న దగ్గరే కింద పడేస్తారు. అయితే వీళ్లందరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, పక్కవారికి ఇబ్బందిని కలిగించక పోవడం. కార్డ్ గేమ్ ఆడుతూ పెద్ద పెద్ద శబ్ధాలతో నవ్వడం, అటూయిటూ విపరీతంగా కదులుతూ పక్కవారిని డీకొనడం... ఇది మంచి పని కాదు. పాటలు సంగీతం వినేవాళ్లు రేడియో, లేదా స్మార్ట్ ఫోన్ లోంచి సాధ్యమైనంత తక్కువ శబ్దం వచ్చేలా జాగ్రత్త పడాలి. రైలులో మందు తాగడం చాలా గర్హనీయం. పొట్టులను, తొక్కలను రైలుపెట్టె లోని చెత్తడబ్బాలోనే వేయాలి. ఈ జాగ్రత్తలన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తే, దేశపౌరులుగా బాధ్యతను నిర్వహించినవాళ్లమౌతాము.
గత సంచికలోని రెండవ పేరా "అస్పష్ట కవితలు కొరకరాని కొయ్యలు " లో తప్పొప్పుల వివరణలు:
2. అస్పష్ట కవితలు కొరకరాని కొయ్యలు
కొన్ని రకాల కవిత్వం చాలా మందికి సరిగ్గా అర్ధం కాదు. వేగుంట మోహన ప్రసాద్ కవిత్వాన్ని ఇక్కడ ఉదహరించవచ్చు. స్మైల్ రాసిన కవితా సంపుటి, ఒక్కడేలో కూడా అటువంటి కొన్ని కవితలున్నాయి. పూర్తిగా అర్ధం కాకపోయినా కనీసం దగ్గరి అర్ధం తెలిస్తే కొంచం స్వాంతన దొరుకుతుంది. కదా? విశ్వనాధ రచనలతో కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇబ్బంది తలెత్తుతుంది. కానీ దానికి కారణం పదాల అర్ధాలు తెలియకపోవడమే. అవి తెలిస్తే విషయం సులువుగా బోధపడుతుంది. ఇది ఛందోబద్దమైన పద్యాలకు కూడా వర్తిస్తుంది. సాధారణ పాఠకులు ఛందోశాస్త్రం చదువుకోరు కదా? ‘మో’ లాంటి ఆధునిక అస్పష్ట కవుల కవిత్వంతో తలెత్తే ఇబ్బందికి కారణం పదాల అర్ధం తెలియకపోవడం కాదు. వారి కవితలలోని పదాలన్నీ అర్ధమైనా భావాన్ని గ్రహించడం కష్టమౌతుంది. అయితే, ఇటువంటి కవిత్వాన్ని కూడా ఉత్కృష్ఠమైనదిగా పరిగణిస్తారు కొందరు. ఆధునిక జీవన సరలిలోని సంశ్లిష్ఠత వలననే ఈ రకమైన కవిత్వం ఉద్భవించిందని చెప్తారు విమర్శా రంగంలో ఉన్న సాహితీపరులు.
జవాబులు (తప్పొప్పులు):
తప్పు ఒప్పు
1.అర్ధం అర్థం
2. ఉదహరించవచ్చు ఉదాహరించవచ్చు
3. కొంచం కొంచెం
4. స్వాంతన సాంత్వన
5. విశ్వనాధ విశ్వనాథ
6. ఛందోబద్దమైన ఛందోబద్ధమైన
7. ఛందోశాస్త్రం ఛందశ్శాస్త్రం
8. ఉత్కృష్ఠమైనది ఉత్కృష్టమైనది
9. సరలిలోని సరళిలోని
10. సంశ్లిష్ఠత సంక్లిష్టత
11.విమర్శా రంగంలో విమర్శ రంగంలో
వివరణలు:
ప్రతిదానికీ వివరణ అవసరం లేదని భావించి, కొన్నిటికి మాత్రమే ఇస్తున్నాను.
1.చాలా చోట్ల అర్ధం అని ఉంది. ప్రతిచోటా అది తప్పే. అర్థం అని రాస్తేనే ఒప్పు. అర్ధ లేక అర్ధము అంటే సగం. అర్థవివరణ అంటే అర్థం గురించిన వివరణ. అర్ధవివరణ అంటే సగం వివరణ (half explanation).
2. ఉదాహరణ అనే నామవాచకపు క్రియారూపం ఉదాహరించుట. ఉదహరించుట కాదు. నిరాదరణ – నిరాదరించుట; సమీకరణ – సమీకరించుట; వశీకరణ – వశీకరించుట ఒప్పులు. అట్లానే ఉదాహరణ – ఉదాహరించుట. ఒకరెవరో ముందు తప్పుగా రాస్తే చాలా మంది అట్లానే రాస్తారు. పత్రికల్లో కూడా అదే రూపం మళ్లీ మళ్లీ దర్శనమిస్తుంది. ఇక తర్వాత ఆ పదస్వరూపం సరైనదేనా కాదా అనే అనుమానమే రాదు!
4. సాంత్వనకు బదులు స్వాంతన అని రాస్తారు కొందరు. ముద్దు పళని రాసిన శృంగార కావ్యం పేరు రాధికా సాంత్వనము. సాంత్వనము అంటే ఊఱట, ఉపశమనం. ఈ రోజుల్లో చాలా మంది ఊఱటకు బదులు ఊరట అని రాస్తున్నారు.
5.నాథుడు అంటే భర్త, రాజు. ఒకటి రెండు చాలా పాత నిఘంటువుల్లో నాధుడు ఇవ్వబడిన మాట వాస్తవమే. కానీ మిగతావాటిలో నాథుడు ఉంది. ఇదే స్థిరపడిందని అనుకోవచ్చు. ఇప్పుడైతే దాదాపు అందరూ నాథుడు అనే పదాన్నే వాడుతున్నారు. కాబట్టి విశ్వనాథ అని రాయడమే సమంజసమని భావించవచ్చు.
6.బద్ధమైన అన్నది సరైన పదస్వరూపం కనుక, ఛందోబద్ధమైన ఒప్పు.
7.ఛందస్సు + శాస్త్రం = ఛందశ్శాస్త్రం. ఇది విసర్గ సంధి. ఈ సంధి చాలా రకాలుగా ఉంటుంది. శిరః (శిరస్సు) + మణి = శిరోమణి అవుతుంది. మళ్లీ ఉషాకాంతి, తపోఫలం తప్పులు. ఉషఃకాంతి, తపఃఫలం సరైనవి. కానీ ఎన్నో ఇతర అక్షరాలలాగే విసర్గను కూడా ఈ రోజుల్లో చాలా మంది రాయండం లేదు.
10. సంశ్లిష్ఠం అనే పదస్వరూపం లేదు. సంశ్లిష్టం ఉంది. కలిసిన, ఎడతెగని, కౌగిలించుకున్న మొదలైన ఎన్నో అర్థాలున్నాయి దానికి. కానీ ఈ సందర్భంలో చెప్పదల్చుకున్న పదం complexity కనుక, సంక్లిష్టత సరైన మాట.
11.విమర్శ(నము) స్త్రీలింగ శబ్దమైతే విమర్శా రంగం సరైన సమాసం. కానీ అది నపుంసక లింగ పదం కాబట్టి, విమర్శ రంగం సరైనది. ఒకవేళ పుల్లింగ (పుంలింగ) శబ్దమైనా విమర్శ రంగం సరైనదవుతుంది.
చివరగా, భాషా సవ్యత ప్రకారం 'ఒక్కడే' అన్నది రైటే. కానీ, స్మైల్ అని ఒక మంచి కవి ఉండేవాడు. ఇస్మాయిల్ అనే మరో కవి వేరే వ్యక్తి. ఆయన అనుభూతి కవిగా, చెట్టుకవిగా ప్రసిద్ధుడు. స్మైల్ రాసిన చిన్న కవితా సంపుటి పేరు "ఒఖడే". నిఘంటువుల ప్రకారం "ఒఖడే" అనే మాట తెలుగుభాషలో లేదు. కానీ గొప్ప శిల్పంతో ఆధునిక కవిత్వం రాస్తున్నప్పుడు కొందరు మాటలతో ఇలా ప్రయోగాలు చేస్తారు. అటువంటి సందర్భాల్లో ఆధునికులు భాషాసవ్యతకన్న భావోద్దీపనకు, అరుదైన నుడికారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అలా "ఒఖడే" అన్న పదాన్ని ఎంచుకున్నారు స్మైల్.
*****