MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
తప్పొప్పుల తక్కెడ – 5
ఆడంబరం అభిలషణీయం కాదు
ఎలనాగ
ఉపోద్ఘాతం:
ఈ "తప్పొప్పుల తక్కెడ" శీర్షికకై ఎలనాగ గారు ప్రతీ సంచికలో ఒక చిన్న పేరాని అందిస్తారు. పాఠకులు/ భాషాభిమానులు అందులో తప్పులేవో కనిపెట్టగలిగితే కింద కామెంట్లలో చెప్పవచ్చు. లేదా sahityam@madhuravani.com కి మార్చి 15 లోగా పంపవచ్చు. గడువు తేదీ లోపల వచ్చిన జవాబులను పరిశీలించి, వచ్చే సంచికలో పాఠకులకు ఒక్కో పదం గురించిన తప్పొప్పుల వివరణ ఇస్తారు. ఔత్సాహికులైన సాహిత్యాభిమానులు మెండుగా ఉన్న మన పత్రిక లో మొదలవుతున్న ఈ వినూత్న ఈ శీర్షిక, పాఠకులకి ఆసక్తికరంగా మరియు ఉపయుక్తంగా ఉండబోతుందని సంతోషంగా ప్రకటిస్తున్నాము.
మరి మీరు తప్పొప్పుల తూకానికి సిద్ధమేనా? తప్పులు కనిపెట్టిన వెంటనే చెప్పేయండి.
గత సంచిక తప్పొప్పుల తక్కెడ – 4 లో తప్పులు గుర్తించినవారిలో అత్యధికంగా తప్పులని గుర్తించిన సాహితీ మిత్రులు శ్యామ రాధిక [రాధిక సూరి] గారికి అభినందనలు.
సాహితీ బంధువులిక మీ భాషాజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ క్రింది పారాగ్రాఫ్ లోని తప్పొప్పులను సూచించండి.
~~~~~~
తప్పొప్పుల తక్కెడ – 5 : ఆడంబరం అభిలషణీయం కాదు
ఒక దేశ ప్రదానమంత్రి గారి షష్ఠిపూర్తి ఉత్సవాలను రంగరంగ వైభవంగా జరపాలని పార్టీ వాళ్లు ఊహించారు. అలా చేస్తే పార్టీ ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వారి అభిప్రాయం. కానీ వారి ఉద్దేశ్యం ఆయనకు నచ్చక, వారి బలిష్టమైన కోరికను తిరస్కరించాడు. దాంతో వారి ఉత్సాహం చప్పగా మారింది. ఆయన నియమనిష్టల మనిషి అని అందరికీ తెలుసు. ఆడంబరానికి దూరంగా ఉండాలన్నది ఆయన పెట్టుకున్న నియమాలలో ఒకటి. మంచిదే అని చెప్పవచ్చు. రాజకీయ ప్రాభల్యం ఉన్నంత మాత్రాన గర్వపోతు కావాలా. ప్రజలు కూడా తమ నేత అభీష్ఠాన్ని మెచ్చుకుని భలా అన్నారు రాబోయే ఎన్నికల్లో ఆయన విజయానికి ధోకా లేదు అని విశ్వసణీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది
~~~~~~
ఇక గత జులై సంచికలోని "తప్పొప్పుల తక్కెడ – 4 : సౌష్టవం లేని వాక్యం వృధా" లోని తప్పుప్పుల వివరణ పరిశీలిద్దాం.
సౌష్టవం లేని వాక్యం వృధా. వాక్యనిర్మాణంలో నిర్ధిష్టత లేకపోతే ఆ రచనలో సౌష్టవం కొఱవడొచ్చు. రచన బాగున్నదనే ప్రశంసే రచయితకు చేకూరే లబ్ది. అది దొరకనప్పుడు రచయిత మనసులో ఒక రకమైన శూన్యత చోటు చేసుకోవచ్చు. కాబట్టి, మనం రాసిన ప్రతి రచనను మరల మరల పరీక్షించుకొని, దోషాలను సరిదిద్దుకోవాలి. వీథిలోనికి పోయినప్పుడు మంచి రచయితగా మన్ననలు పొందడం మన థ్యేయం కావాలి. ఆ మన్ననలు మన మనోవీధిలో మనోహరమైన గ్నాపకాలను నెలకొల్పుతుంది. వాక్యం కుదురుగా, శ్రేష్టంగా, విశిష్ఠంగా వుండేలా రాయగలిగే నైపుణ్యతను సంపాదించితే, వచనరచన చాలా వరకు సులభం అవుతుంది. వర్థమాన రచయితలందరూ ఈ విషయాన్ని అనవతరం మనసులో పెట్టుకోవాలి.
జవాబులు (తప్పొప్పులు):
తప్పు ఒప్పు
1. సౌష్టవం – సౌష్ఠవం
2. వృధా – వృథా
3. నిర్ధిష్టత – నిర్దిష్టత
4. కొఱవడొచ్చు – కొరవడవచ్చు/కొరవడొచ్చు
5. లబ్ది – లబ్ధి
6. శూన్యత – శూన్యం
7. మరల మరల – మళ్లీ మళ్లీ
8. వీథిలోనికి – వీధిలోనికి
9. థ్యేయం – ధ్యేయం
10. గ్నాపకాలను – జ్ఞాపకాలను
11. శ్రేష్టంగా – శ్రేష్ఠంగా
12. విశిష్ఠంగా – విశిష్టంగా
13. నైపుణ్యతను – నైపుణ్యాన్ని
14. సంపాదించితే – సంపాదిస్తే
15. వర్థమాన – వర్ధమాన
16. అనవతరం – అనవరతం
17. పరీక్షించుకొని – పరీక్షించుకుని
వివరణలు:
6. నైపుణ్యత, సారూప్యత, వివక్షత, శూన్యత మొదలైన ఎన్నో పదాలను రాస్తుంటాం మనం. కానీ నైపుణ్యం, సారూప్యం, వివక్ష, శూన్యం అన్నవే విశేష్యాలు (నామవాచకాలు) ఐనప్పుడు వాటి చివర మళ్లీ ‘త’ను తగిలించే అవసరం లేదు. తగిలిస్తే అవి తప్పులవుతాయి. నైపుణ్యంను నిపుణత అనీ, సారూప్యంను సరూపత అనీ కూడా అనవచ్చు/రాయవచ్చు.
7. మరల, మరియు, క్రితం మొదలైన మాటలు గ్రాంథికభాషలోనే చక్కగా ఒదుగుతాయి. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు, “మరలనిదేల రామాయణంబన్నచో….” అని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వాక్యం గ్రాంథిక వచనానికి అచ్చమైన ఉదాహరణ. మరల = మళ్లీ; ఇదేల = ఇదెందుకు; రామాయణంబు = రామాయణము; అన్నచో = అంటే... ఇవీ వ్యవహారిక భాషలో వాటి అర్థాలు. కాబట్టి, అదే వాక్యాన్ని మనం ఈనాటి వ్యవహారభాషలో అయితే, ‘మళ్లీ ఈ రామాయణం ఎందుకు?’ అని రాస్తాం. అయితే క్రితం, మరియు, వలన మొదలైన మాటలను మనం వ్యవహారికభాషలో కూడా రాస్తున్నాం. నిజానికి కింద, ఇంకా/అదనంగా, వల్ల అని రాయాలి. కానీ అలా రాయకపోయినా అవి అంతగా ఎబ్బెట్టుగా అనిపించవు. కాబట్టి, మరల అనే మాట పెద్ద తప్పేం కాకపోవచ్చు. అయితే ఒకసారి వాడితే అంత ఎబ్బెట్టుగా అనిపించదు కానీ, వరుసగా రెండుసార్లు మరల మరల అని రాసినప్పుడు ఆ గ్రాంథికత మరీ కొట్టొచ్చినట్టుగా ద్యోతకమౌతుంది.
8. వీధికి బదులు వీథి అని చాలా మంది రాస్తుంటారు. అది తప్పు. వీధి సరైన పదం. అదేవిధంగా శీథువు తప్పు, శీధువు ఒప్పు. మళ్లీ నిశీధి తప్పు నిశీథి ఒప్పు.
11. శ్రేష్టం, కనిష్టం, గరిష్టం, ప్రతిష్ట ఇవన్నీ తప్పులే. శ్రేష్ఠం, కనిష్ఠం, గరిష్ఠం, ప్రతిష్ఠ ఒప్పులు.
12. ఉత్కృష్ఠం, విశిష్ఠం అని రాస్తుంటారు కొందరు. ఉత్కృష్టం, విశిష్టం సరైన మాటలు. మళ్లీ కాష్టం తప్పు, కాష్ఠం సరైన మాట.
14. ఇవ్వబడిన పేరాగ్రాఫు (పారాగ్రాఫు) లోని భాష వ్యవహారికంలో ఉంది కనుక, పదాలు అన్నీ వ్యవహారికభాషలో ఉండటమే సబబు. సంపాదించితే అనేది ఇందులో ఒదగదు. సంపాదిస్తే అని రాయాలి.
16. అనవరతం అంటే ఎల్లప్పుడు. అనవతరం అన్నది అర్థం లేని మాట. అసలు ఆ పదం తెలుగు భాషలో లేదు. అయితే, పరీక్షగా గమనించకపోవడం వల్ల అక్షరదోషాలను గుర్తు పట్టకపోవడం జరుగుతుంది చాలా సార్లు.
17. చదువుకొని అంటే చదువును కొని (ఖరీదు చేసి) అనే అర్థం వచ్చే అవకాశముంది. ఆ మాటను జోకులలో వాడటం కూడా కద్దు. ఆ భయం చేత ఇటువంటి క్రియా పదాలలోని ‘కొని’ని కుని అని రాస్తారు కొందరు. కానీ ఎందరో భాషావేత్తలు చదువుకొని అని రాస్తుంటారు. కాబట్టి ఇది తప్పు ఒప్పుల నడుమ ఉండే మధ్యస్థమైన మాట.
*****