MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
తప్పొప్పుల తక్కెడ – 1
కాపీ వేరు, కాఫీ వేరు.
ఎలనాగ
ఉపోద్ఘాతం:
madhuravani.com పాఠకులకు కొత్త సంవత్సరం సందర్భంగా చిన్న కానుకగా ప్రసిద్ధ సాహితీవేత్త, తెలుగువారికి చిరపరిచితమైన భాషాభిమాని శ్రీ ఎలనాగ గారు అందిస్తున్న శీర్షిక - "తప్పొప్పుల తక్కెడ".
తెలుగు భాషాకోశ పరిధి విస్తృతమైనది. వైవిధ్యమైనది. ఇరుగుపొరుగు కర్నాటరాట మరాఠ భాషలెన్నో తెలుగులో సొంతమంత పదిలంగా ఒదిగిపోయాయి. అతిథిగా వచ్చి ఆక్రమించిన ఆంగ్ల, నైజాము పదాలూ అంతే అందంగా వ్యావహారికభాషలో అజంతంగా అమరిపోయాయి. ఏ భాషాపదమైనా తెలుగంత స్వచ్ఛంగా పలుకుతామేమో మరి, తెలుగుదనానికి మరిన్ని సొబగులే అద్దాయి అవన్నీ. కాలక్రమేణా 56 అక్షరాలతో మనం రాసుకునే వేనవేల పొందికైన అచ్చ తెలుగు పదాల అమరికలలో మన ప్రమేయం లేకుండానే కొన్ని అక్షరాలు తారుమారయి వేరుగా మారిపోయాయి, వాటి ధ్వనులూ మసకబారిపోయాయి. తెలుగుభాషా వాడకంలో మనకు తెలియకుండానే చేసే పొరపాట్లు ఎన్నో. ఒక్కోసారి అనివార్యమైన చోట ఒత్తులు వదిలేస్తే, మరోచోట విరామ చిహ్నాలని అసంబద్ధంగా కలిపేస్తాము. ఈ పొరపాట్ల సవరణకై, తప్పొప్పులు తెలిపేందుకై ఈ శీర్షికని మనకై అందిస్తున్నారు ఎలనాగ గారు.
ఈ "తప్పొప్పుల తక్కెడ" శీర్షికకై ఎలనాగ గారు ప్రతీ సంచికలో ఒక చిన్న పేరాని అందిస్తారు. పాఠకులు/ భాషాభిమానులు అందులో తప్పులేవో కనిపెట్టగలిగితే కింద కామెంట్లలో చెప్పవచ్చు. లేదా sahityam@madhuravani.com కి ఫిబ్రవరి 15 లోగా పంపవచ్చు. గడువు తేదీ లోపల వచ్చిన జవాబులను పరిశీలించి, వచ్చే ఏప్రిల్ సంచికలో పాఠకులకు ఒక్కో పదం గురించిన తప్పొప్పుల వివరణ ఇస్తారు. ఔత్సాహికులైన సాహిత్యాభిమానులు మెండుగా ఉన్న మన పత్రిక లో మొదలవుతున్న ఈ వినూత్న ఈ శీర్షిక, పాఠకులకి ఆసక్తికరంగా మరియు ఉపయుక్తంగా ఉండబోతుందని సంతోషంగా ప్రకటిస్తున్నాము.
మరి మీరు తప్పొప్పుల తూకానికి సిద్ధమేనా? అయితే మొదటి పేరా కింద చదవండి. తప్పులు కనిపెట్టిన వెంటనే చెప్పేయండి.
1. కాపీ వేరు, కాఫీ వేరు.
కర్నాటక శాస్త్రీయ సంగీతంలో కాపీ అనే రాగం ఒకటి ఉంది. ఇది హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని కాఫీ అనే రాగానికి పూర్తిగా భిన్నమైనది. ఈ రెండు రాగాల మధ్య సంబంధం లేదు. కాపీకి హిందుస్తానీ శైలిలో సమానమైనది పీలూ రాగం. పురంధరదాసు స్వరబద్ధం చేసిన ‘జగదోద్ధారణ’ కీర్తన కాపీ రాగంలోనే ఉంది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఈ కీర్తనను ఎంత బాగా పాడిందో? మనం సుబ్బలక్ష్మి గానాన్ని ఆలకిస్తే, అలౌకిక పారవశ్యం మన సొంతమవుతున్నది. ఇక హిందూస్తానీ సంగీతాన్ని ఆలపించే గిరిజా దేవి గానంలో మార్ధవంకన్న ఎక్కువగా జీఱ ఉంటుందని గమనించ వలెను. ఆమె కాఫీ రాగంలో టుమ్రీలను, టప్పాలను చక్కగా పాడిన విషయం సంగీత ప్రియులకు తెలుసే.