MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
తప్పొప్పుల తక్కెడ – 2
అస్పష్ట కవితలు కొరకరాని కొయ్యలు
ఎలనాగ
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
ఉపోద్ఘాతం:
ఈ "తప్పొప్పుల తక్కెడ" శీర్షికకై ఎలనాగ గారు ప్రతీ సంచికలో ఒక చిన్న పేరాని అందిస్తారు. పాఠకులు/ భాషాభిమానులు అందులో తప్పులేవో కనిపెట్టగలిగితే కింద కామెంట్లలో చెప్పవచ్చు. లేదా sahityam@madhuravani.com కి జూన్ 15 లోగా పంపవచ్చు. గడువు తేదీ లోపల వచ్చిన జవాబులను పరిశీలించి, వచ్చే సంచికలో పాఠకులకు ఒక్కో పదం గురించిన తప్పొప్పుల వివరణ ఇస్తారు. ఔత్సాహికులైన సాహిత్యాభిమానులు మెండుగా ఉన్న మన పత్రిక లో మొదలవుతున్న ఈ వినూత్న ఈ శీర్షిక, పాఠకులకి ఆసక్తికరంగా మరియు ఉపయుక్తంగా ఉండబోతుందని సంతోషంగా ప్రకటిస్తున్నాము.
మరి మీరు తప్పొప్పుల తూకానికి సిద్ధమేనా? అయితే గత సంచిక జవాబుల తరువాత ఈయబడిన రెండవ పేరా [2. అస్పష్ట కవితలు కొరకరాని కొయ్యలు] చదవండి. తప్పులు కనిపెట్టిన వెంటనే చెప్పేయండి.
దానికి ముందుగా గతసంచిక లో ఈయబడిన మొదటి పేరాలోని తప్పొప్పుల వివరణ చదవండి.
తప్పొప్పుల తక్కెడ – 1 జవాబులు:
తప్పొప్పుల తక్కెడ – 1
కాపీ వేరు, కాఫీ వేరు.
కర్నాటక శాస్త్రీయ సంగీతంలో కాపీ అనే రాగం ఒకటి ఉంది. ఇది హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని కాఫీ అనే రాగానికి పూర్తిగా భిన్నమైనది. ఈ రెండు రాగాల మధ్య సంబంధం లేదు. కాపీకి హిందుస్తానీ శైలిలో సమానమైనది పీలూ రాగం. పురంధరదాసు స్వరబద్ధం చేసిన ‘జగదోద్ధారణ’ కీర్తన కాపీ రాగంలోనే ఉంది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఈ కీర్తనను ఎంత బాగా పాడిందో? మనం సుబ్బలక్ష్మి గానాన్ని ఆలకిస్తే, అలౌకిక పారవశ్యం మన సొంతమవుతున్నది. ఇక హిందూస్తానీ సంగీతాన్ని ఆలపించే గిరిజా దేవి గానంలో మార్ధవంకన్న ఎక్కువగా జీఱ ఉంటుందని గమనించ వలెను. ఆమె కాఫీ రాగంలో టుమ్రీలను, టప్పాలను చక్కగా పాడిన విషయం సంగీత ప్రియులకు తెలుసే.
***
జవాబులు (తప్పొప్పులు):
తప్పు ఒప్పు
1. కర్నాటక కర్ణాటక
2. పురంధరదాసు పురందరదాసు
3. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
4. ఎంత బాగా పాడిందో? ఎంత బాగా పాడిందో!
5. సొంతమవుతున్నది సొంతమవుతుంది
6. గానంలో గాయనంలో
7. మార్ధవం మార్దవం
8. జీఱ జీర
9. గమనించవలెను గమనించాలి
10. టుమ్రీలను ఠుమ్రీలను
11. తెలుసే తెలిసిందే
వివరణలు:
1. ఇప్పటి దక్షిణభారతదేశ ప్రాంతాన్ని ప్రాచీనకాలంలో కర్ణాటక అని వ్యవహరించేవారు. కాబట్టి, కర్ణాటక అంటే ఈనాటి కర్ణాటకరాష్ట్ర ప్రాంతం కాదు, అది మొత్తం దక్షిణభారత దేశానికి వర్తిస్తుంది. కర్ణాటక సంగీతం ప్రధానంగా దక్షిణ భారతదేశం లోనే వేళ్లూనుకుని ప్రచలితమై ఉంది కనుక, కర్ణాటక సంగీతం అనడమే సబబు. అయితే, ఈ మాట చెవులకు ఇంపైనది అనే అర్థాన్ని సూచిస్తుందంటున్నారు కొందరు. కానీ కర్ణాటక లోని సంధిని విడదీయాలంటే, కర్ణ + అటక, లేదా కర్ణ + ఆటక అని చెప్పాలి. అయితే, నాకు తెలిసినంత వరకు మన సందర్భానికి సరిపోయే అర్థాలు అటక, ఆటకలకు లేవు. అసలు తెలుగుభాషలో ఆ పదాలే లేవు. కన్నడ, తమిళ, మలయాళ భాషలలో ఉన్నాయా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
2. ‘పురందరుడు’కు ఇంద్రుడు, శివుడు, విష్ణువు మొదలైన అర్థాలున్నాయి. పురంధరుడు అనే మాట లేదు కాబట్టి, పురంధరదాసు తప్పు.
3. ఆ గాయని పేరు సుబ్బలక్ష్మి కాదు, సుబ్బులక్ష్మి. ఇక ఎమ్మెస్ తప్పు, ఎమ్. ఎస్. సరైనది అని జవాబు రాశారు కొందరు. స్ట్రిక్టుగా (గట్టిగా, ఖండితంగా) చూస్తే వీరి వాదన సరైనదే కావచ్చు. కాని, ఎమ్మెస్ రామారావు, ఎమ్మెస్ విశ్వనాథన్, ఎమ్మెస్సీ, ఎమ్మెల్యే మొదలైన ఎన్నో పదాలు మన భాషలో స్థిరపడిపోయాయి. ప్రయోగ శరణం వ్యాకరణం అన్నారు కదా పెద్దలు! ఈ ధారావాహికలో మనం గ్రాంథికభాషను రెఫరెన్స్ (ఉపప్రమాణం?) గా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తప్పొప్పుల మధ్య కచ్చితమైన విభజనరేఖను నిర్ణయించడం కొన్నిసార్లు కష్టం.
4. ఇక్కడ ప్రశ్నార్థక చిహ్నానికి బదులు ఆశ్చర్యార్థక చిహ్నం ఉండాలి. ఎందుకంటే, ఈ వాక్యం ద్వారా మనం ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాము తప్ప జవాబును ఆశించడం లేదు.
5. నిజానికి వేరువేరు సందర్భాలలో ఈ రెండు పదాలూ సరైనవే. కానీ సొంతమవుతున్నది అనే పదం ఇప్పుడు జరుగుతున్నదాన్ని వివరిస్తుంది. మనమేమో సాధారణంగా (జనరల్ గా – అంటే అన్ని కాలాలలో) జరగడాన్ని సూచిస్తున్నాం. కాబట్టి, సొంతమవుతుంది అని రాస్తేనే సమంజసంగా ఉంటుంది.
6. గానం అంటే పాట, గాయనం అంటే పాడడం లేక పాడే విధానం. మనం ఇక్కడ రెండవదాన్నే ఉద్దేశిస్తున్నాము.
7, 8. మార్ధవం, జీఱల గురించి ప్రత్యేకంగా వివరించే అవసరం లేదనుకుంటాను.
9. గమనించవలెను అన్నది గ్రాంథికభాషలో చక్కగా ఒదుగుతుంది. వ్యవహారికభాషలో ఒదగదు. కాబట్టి, గమనించాలి అని రాస్తేనే బాగుంటుంది.
10. ఠుమ్రీ సరైన మాట.
11. ఈ వాక్యంలో ‘తెలుసే’ అసంబద్ధంగా ఉంది. తెలిసిందే అని రాస్తే చక్కగా పొసగుతుంది.
***
పాఠకులారా! ఇక మీ భాషాజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ పారాగ్రాఫ్ లోని తప్పొప్పులను సూచించండి.
2. అస్పష్ట కవితలు కొరకరాని కొయ్యలు
కొన్ని రకాల కవిత్వం చాలా మందికి సరిగ్గా అర్ధం కాదు. వేగుంట మోహన ప్రసాద్ కవిత్వాన్ని ఇక్కడ ఉదహరించవచ్చు. స్మైల్ రాసిన కవితా సంపుటి, ఒక్కడేలో కూడా అటువంటి కొన్ని కవితలున్నాయి. పూర్తిగా అర్ధం కాకపోయినా కనీసం దగ్గరి అర్ధం తెలిస్తే కొంచం స్వాంతన దొరుకుతుంది. కదా? విశ్వనాధ రచనలతో కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇబ్బంది తలెత్తుతుంది. కానీ దానికి కారణం పదాల అర్ధాలు తెలియకపోవడమే. అవి తెలిస్తే విషయం సులువుగా బోధపడుతుంది. ఇది ఛందోబద్దమైన పద్యాలకు కూడా వర్తిస్తుంది. సాధారణ పాఠకులు ఛందోశాస్త్రం చదువుకోరు కదా? ‘మో’ లాంటి ఆధునిక అస్పష్ట కవుల కవిత్వంతో తలెత్తే ఇబ్బందికి కారణం పదాల అర్ధం తెలియకపోవడం కాదు. వారి కవితలలోని పదాలన్నీ అర్ధమైనా భావాన్ని గ్రహించడం కష్టమౌతుంది. అయితే, ఇటువంటి కవిత్వాన్ని కూడా ఉత్కృష్ఠమైనదిగా పరిగణిస్తారు కొందరు. ఆధునిక జీవన సరలిలోని సంశ్లిష్ఠత వలననే ఈ రకమైన కవిత్వం ఉద్భవించిందని చెప్తారు విమర్శా రంగంలో ఉన్న సాహితీపరులు.
***