top of page

మధురవాణి ప్రత్యేకం

తప్పొప్పుల తక్కెడ – 7

7. చదువులు – పరీక్షలు

elanaga.jpg

ఎలనాగ

భాషాప్రియులైన పాఠకులకు స్వాగతం.

ముందుగా తప్పొప్పుల తక్కెడ - 6 ను చూద్దాం.

    

                   చిన్నపిల్లలకు విద్యాభోదన

 

     ప్రాధమిక పాఠశాలల్లో చదివే పిల్లలకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాభోదన జరగాలనే వాదనను సమర్ధించని వారుంటారా! ఒకవేళ ఉంటే, అది దురదృష్టమైన విషయం. పిల్లలు తమ బాల్యంలో ఎక్కువ వరకు మాతృభాషనే, వినడం జరుగుతుంది కనుక ఆ లేత వయసులో వారికి ఆ భాషలో పాఠాలు నేర్చుకోవడమే ఈజీగా ఉంటుంది. ఆదశ లో ఆంగ్లాన్ని వాల్లమీద రుద్దితే, అది వారి మస్తిష్కాల మీద అనవసరమైన భారాన్ని మోపుతుంది. అప్పుడు వాళ్లకు మనస్థాపంతో వేగిపోతూ స్థిమితం లేని పరిస్తితి ఏర్పడుతుంది. ఎందుకంటే, ఆ చిన్న వయసులో ఒక కొత్తభాషను నేర్చుకునేందుకు వారి మేధస్సు అనువుగా ఉండదు. కేవలం ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా ఉంటే కొంత వరకు అది ఓకేనేమో. కాని మీడియంగా మాత్రం ఉండకూడదు.

 

తప్పులు                                             ఒప్పులు            

1. విద్యాభోదన                                      విద్యాబోధన

2. ప్రాధమిక                                          ప్రాథమిక

3. వాదనను                                           వాదాన్ని

4. సమర్ధించని                                      సమర్థించని

5. వారుంటారా!                                     వారుంటారా?

6. దురదృష్టమైన                                 దురదృష్టకరమైన                 

7. మాతృభాషనే,                                    మాతృభాషనే

8. కనుక                                                  కనుక,

9. ఈజీగా                                                 సులభంగా

10. ఆదశ లో                                           ఆ దశలో

11. వాల్లమీద                                            వాళ్లమీద

12. మనస్థాపంతో                                    మనస్తాపంతో

13. స్థిమితం                                             స్తిమితం

14. పరిస్తితి                                               పరిస్థితి

15. మేధస్సు                                            మేధ, మెదడు

16. కేవలం ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా         ఇంగ్లిష్ కేవలం ఒక సబ్జెక్టుగా

17. ఓకేనేమో                                             సరేనేమో, బాగుంటుందేమో            

18. మీడియంగా                                       బోధనా మాధ్యమంగా

 

వివరణలు:

1. బోధనకు బదులు భోదన అని రాసేవాళ్లు, పలికేవాళ్లు అరుదుగా తటస్థిస్తుంటారు మనకు. మళ్లీ, భోరున వర్షం కురుస్తోంది అనకుండా, బోరున వర్షం కురుస్తోంది అని రాసేవాళ్లూ, పలికేవాళ్లూ ఉంటారు. బోధన, భోరున సరైన మాటలు అని గ్రహించాలి.

2. ప్రాథమిక అని రాసే బదులు ప్రాధమిక అని రాయడమే కాకుండా, అలా పలికేవాళ్లూ ఉంటారు కొందరు.

3. వాదన, వాదనం అంటే వీణ మొదలైన సంగీత పరికరాలను వాయించడం అన్న అర్థమే ఇవ్వబడింది చాలా నిఘంటువుల్లో. ఇటీవలి ఒకటి రెండింటిలో వాదించడం (argument) అని ఇవ్వబడిన మాట వాస్తవమే. కానీ argument కు సరైన తెలుగు మాట వాదం.

5. వారుంటారా అనే ప్రశ్నార్థక పదంలో ఆశ్చర్యం ఎంత మాత్రం లేదు కనుక, అక్కడ ఆశ్చర్యార్థక చిహ్నానికి బదులు ప్రశ్నార్థక చిహ్నం రావడమే సబబు. ఐతే, ‘అబ్బో అక్కడ ఎంత మంది ఉన్నారో,’ అని రాసినప్పుడు చివర్న ఆశ్చర్యార్థక చిహ్నం రావడమే సమంజసం.

6. దురదృష్టం అంటే అదృష్టం లేకపోవడం, దురదృష్టకరం అంటే విచారించతగినది. కాబట్టి, ఈ సందర్భంలో రెండవదే సరైన పదం. విచారించడంకు పరిశీలించడం, వాకబు చేయడం సరైన అర్థాలు అని వాదించవచ్చు, ఎవరైనా. కానీ ప్రామాణిక నిఘంటువుల్లో రెండు అర్థాలు ఇవ్వబడినాయి.

7. ఈ వాక్యంలో మాతృభాషనే తర్వాత విరామం అవసరం లేదు కనుక, అక్కడ అల్పవిరామచిహ్నం (comma) రాకూడదు. ఏ విరామచిహ్నమూ రాకూడదు.

8. కనుక, కాబట్టి, అదే విధంగా మొదలైన మాటల తర్వాత విరామం వస్తుంది కాబట్టి, అక్కడ కామా ఉండటం అవసరం.

9. ఎంత ప్రయత్నం చేసినా తెలుగు మాట దొరకనప్పుడు, లేదా దొరికినా దానికన్న ఆంగ్లపదమే సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఇంగ్లిష్ మాటను వాడటం వేరు. ఇక్కడ సులభంగా అని రాస్తే అర్థం సుబోధకంగా ఉంటుంది కనుక, దాన్నే రాయాలి.

12. మనసు (మనః/మనస్) + తాపం = మనస్తాపం అవుతుంది. తాపంకు బదులు అక్కడ థాపం ఉండి సంధి జరిగితే (నిజానికి థాపం అనే మాట లేదు), మనస్థాపం సవ్యమైన పదబంధం అయివుండేది.

13. స్థిమితం అనే పదం నాకైతే ఏ నిఘంటువులోనూ కనిపించలేదు. ఐనా అది అన్నిచోట్లా దర్శనమిస్తున్నది. పత్రికల్లో ఐతే దాన్ని విరివిగా చూస్తున్నాం మనం. కానీ సరైన మాట స్తిమితం.

14. పరిస్తితి కూడా తప్పే. పరిస్థితి సరైన మాట. ఇక స్తితి తప్పు, స్థితి ఒప్పు. ప్రసిద్ధుడైన ఒక రచయిత ఎవరో ప్రయోగాత్మకంగా స్తితి అని రాసినందుకు కొందరు దాన్నే వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. కానీ వ్యాకరణం ప్రకారం అందులో భాషాదోషం ఉన్నదనడంలో అనుమానం లేదు.

15. తెలుగు భాషలో మేధస్సు అనే పదమే లేదు. మేధ, మేదస్సు ఉన్నాయి. మొదటిదాకి అర్థాలు బుద్ధి, తెలివి. రెండవదానికి కాలు, చేయి, కాలేయము, ఊరిరితిత్తి వంటి ఒక శరీరభాగం (మెదడు) అని అర్థం. కానీ మేధోశక్తి, మేధోసంపత్తి, మేధోమథనం మొదలైన ఎన్నో అపసవ్య సమాసాలు విరివిగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల ఐతే మేధోవలస కూడా కనిపిస్తున్నది. మేధ సంస్కృత పదం, వలస అచ్చతెలుగు పదం కనుక, మేధోవలస వైరిసమాసం కూడా అవుతుంది. అంటే అది రెండు విధాలుగా తప్పు అన్నమాట.

16. ఈ వాక్యంలో ‘కేవలం’ సరైన స్థానంలో లేదు. ‘కేవలం ఇంగ్లీషు’ అంటే ఇంగ్లీషు మాత్రమే అని అర్థం. ‘కేవలం ఒక సబ్జెక్టుగా’ అంటే ఒక సబ్జెక్టుగా మాత్రమే అని అర్థం. బాగా పరిశీలించి చూస్తే స్వల్పభేదం (nuance) అవగతమౌతుంది. 

17. ఓ.కే. (okay) ఆంగ్లపదం కనుక, ఓకేనేమోకు బదులు సరేనేమో అని రాయడమే సబబుగా ఉంటుంది. 

18. మీడియం (medium) కూడా ఆంగ్లపదం కనుక, అక్కడ బోధనా మాధ్యమం అన్న పదాన్ని వాడవచ్చు.

 

     రాబోయే సంచిక కోసం తప్పొప్పుల తక్కెడ – 7 ను కింద ఇస్తున్నాను. చదివి, జవాబులు రాయండి.

7. చదువులు – పరీక్షలు

     అద్విత వుమెన్స్ కాలేజీలో చదువుతోంది. కొద్దిరోజుల్లోనే ఆమెకు పరీక్షలు మొదలు కనుక, అద్వితలో టెన్షన్ ఎక్కువైంది. ఆమెలోని బిడియం, బెఱుకు సమస్యలుగా మారాయి. ఆమె కోపధారి అసలే కాదు. అద్వితకు నైమిష్య మంచి స్నేహితురాలు. ఆమె తరచుగా ఉద్భోద చేస్తూనే ఉంటుంది, అద్వితా నీ సున్నితం నీకు ఇబ్బందికరంగా మారగలదు. దాన్ని పోగొట్టుకో అని. కానీ పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు? సున్నితం అన్నది మనస్తత్వానికి సంబంధించిన విషయం. పరీక్షలు మొదలైయ్యాయి. ఆనాడు మొదటి పరీక్ష. అద్విత పెళ్ళైన స్త్రీ. పరీక్షలకు నిరాలంకారంగానే పోవాలనుకుంది. కానీ వారం రోజుల క్రితమే కొనుక్కున్న సింధూరం రంగు చీర తొడుక్కుని వెళ్లింది. ప్రశ్నాపత్రం చూడగానే ఆమెలో ఆందోళన ఎక్కువైంది. తెలియని కొన్ని ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉండడం దానికి కారణం. టెర్రరిస్టుల జీవితాల కథలతో తీసిన హార్రర్ సినిమా చూస్తే ఎలా గుబులు కలుగుతుందో అలా భయం కలిగింది ఆమెకు. సమాధానాలు రాని ప్రశ్నలకు జవాబులు రాసే ప్రశక్తే లేదు, అనుకుంది మనసులో. ఏదో విధంగా మనో ఒత్తిడిని తట్టుకుని, జవాబులు రాసి వచ్చింది. అన్ని పరీక్షలను దాదాపు అలానే రాసింది. పరీక్షల్లో తను ప్యాసవనని విపరీతమైన మనోవేదనతో వేగి పోయింది. కానీ పరీక్షా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఆమె ప్యాసైంది.

                    *****

bottom of page