top of page

“శ్రీని” వ్యాస వాణి

గెలుపెవరిది?

Srinivas Pendyala, Madhuravani,Srinivas Pendyala Madhuravani

శ్రీనివాస్ పెండ్యాల

రాజావారు ఇంట్లోకి ఎలుకలు దూరాయని ఇల్లు తగులబెట్టిన తాలూకు పొగలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి.డిమానిటైజేషన్ పుణ్యమా అని బిచ్చగాడి నుండి రాహుల్ బజాజ్ దాకా అందరూ ఈ సునామీలో తడిసి ముద్దయి -" మేము నల్లబాబులము కాము, పాలకంటే తెల్లటి తెలుపు రంగుకి ప్రతినిధులము" అని నిరూపించారు. ఎంతటి తెలుపంటే? బట్టల సబ్బు ప్రకటనలా- తళతళలాడే తెలుపు! సూపర్ రిన్ లా మరింత తెల్లని తెలుపు!  XXX లా- సంస్కారవంతమైన తెలుపు! టైడ్ లా అవాక్కయ్యే ఈ తెల్లటి తెలుపు చూసి తెల్లబోవటం ప్రపంచం వంతయింది. నిజంగా ఇంత తెల్లధనముందా ఈ దేశంలో! ఏ క్షణంలో అడిగినా అణాపైసలతో సహా లెక్కలు చెప్పగలిగే వందకోట్ల ప్రజానీకమున్న దేశమా మనది! ఇంతకీ ఈ రాజసూయ యాగం తర్వాత రాజా వారు సాధించినది రాజ్యమా లేక చోద్యమా? అవినీతి అంతమొందించటం అవసరమే. కానీ, ఇలా ఎలుకల కోసం ఇల్లు తగలేట్టే రీతిలో మాత్రం కాదు. సుమారు వందకోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగలిగే నిర్ణయం ముందు జరుగవలిసిన కసరత్తు జరిగిందా! లక్ష్యాలను నిర్ణయించడంలో ఎంతమేరకు సఫలీకృతులయ్యారు? అయిన ఖర్చు ఎంత? వచ్చిన రాబడి ఎంత?  నల్లధనం కాదు, కనీసం నల్లబాబులని గుర్తించగలిగారా? లాంటి ప్రశ్నలు భేతాళ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. డిమానిటైజేషన్ అనేది ప్రపంచంలో ఇదే తొలిసారి కాదు. వెనెజులా లాంటి ఎన్నో దేశాలు ఈ అస్త్రాన్ని ప్రయోగించి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బహుశా మనం వారి గుణపాఠాలను  అధ్యయనం చేయటంలో విఫలమయ్యామేమో!

బహుశా రాజావారు తప్పులో కాలేసిన సంగతి పసిగట్టి 'డిజిటల్ ఇండియా', 'మేక్ ఇన్ ఇండియా' లాగా 'క్యాష్ లెస్ ఇండియా' స్లోగన్ అందుకున్నారు. ఎందుకంటే ఇది ఒక్క గడువులో పూర్తయ్యి ఫెయిలో, పాసో నిర్ణయించలేరు కదా.

 

అమెరికా ఏమీ ఒక్క అర్ధరాత్రిలో క్యాష్ లెస్ గా మారలేదు. అంతెందుకు. ఇప్పటికీ అమెరికాలో Used Cars బేరాలు క్యాష్"మోర్" గానే నడుస్తాయి. కానీ, అలాంటి లావాదేవీలు చాలా స్వల్పం! మరి ఇండియాలాంటి వైవిధ్యభరితమైన దేశంలో అక్షరం రాని పక్షులెన్నో. వారంతా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, తమ కార్డులు గీకి సంవత్సరాంతాల్లో జమా పద్దులు లెక్కజెప్పే క్యాష్ లెస్ గా మారటమనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. దానికి కొంత సమయం పడుతుంది. కూరగాయలమ్మి గంపలోకి  సెల్ ఫోన్ చేరటం ఒక్కరోజులో జరుగలేదు కదా. పక్కవారిని కనీసం పలకరింపుగానయినా చూడకుండా నెట్టింటి జనానికి వాట్సప్ లో హాయ్ లు, ఫేస్బుక్కుల్లో లైకులు  ఒక్కరోజులో అలవాటయ్యాయా?

 

పీ.వీ నరసింహారావు గారు చెప్పినట్టు,  "సబ్ కుచ్ హోగా, లెఖిన్ టైం లగేగా!"... మొత్తానికి, ఏదేమైనా, డిమానిటైజేషన్ కొంత మంచిని కూడా తట్టిలేపింది. పాల వాడి నుండీ పరమాత్మ దాకా కోల్పోయిన మానవ సంబంధాలను తిరిగి కలిపింది. ఆటో వాడే కదా అని కసరకుండా, అతడూ మన ఫైనాన్సియరే అని గుర్తించేలా చేసింది. కూరగాయలమ్మిని కూడా యోగక్షేమాలడిగి, ఈ వారం డబ్బంతా ఒకేసారి చెల్లిస్తానని ఒప్పందాలు చేసుకోవటం నేర్పింది. మొత్తానికి పోపుల డబ్బాలు భళ్లున పగిలి పొదుపు మంత్రాలు బయటకి వచ్చాయి. 

సినిమాలు తీసేవారికి కాసులు రాలలేదు కానీ, కావలిసినంత కథా సరుకు మన ATM ల వద్దే లభ్యమయ్యాయి ఇలా చెప్పుకుంటూ పోతే, నల్లడబ్బేమో కానీ ప్రజల హృదయాలు తెల్లవయి తేలికయ్యాయి. లేకపోతే మనకెక్కడిదీ పక్కవాడిని పలకరించే తీరిక?

 

ఎటొచ్చీ ఏతావాతా తెలిసిందేమిటంటే- మన రాజా వారికి తెలిసిన ఆర్థిక శాస్త్రం ఓ పోస్టల్ స్టాంపుపై రాయగలిగేంత మ్యాటరేనని.

 

ఇలా డిమానిటైజేషన్ ప్రజలని ఒక్కతాటిపైకి తెచ్చినా ఉద్యమాలని ప్రేరేపించకపోవటం శుభ పరిణామమే.

 

కానీ, ఈ మధ్య జరిగిన కొన్ని మెరుపు ఉద్యమాలు ప్రజాస్ఫూర్తిని నిరూపించాయి. మరి ఇవి తప్పా, ఒప్పా అనేది తర్కానికి అనర్హం. మనం చూడవలిసింది కేవలం ఉద్యమ స్ఫూర్తి. అదే జల్లికట్టు.

 

జంతువులని హింసించటం మా సంప్రదాయమని నినదించిన తమిళ శంఖారావం విస్మయపరిచింది. మూగజీవాలకి తాగరానివి తాగించి, బరితెలతో బాదించి, పరిగెత్తించి, వాటిపై రాక్షసుల్లా లంఘించి, కొమ్ములని విరిచి నేలకరిపించటం మా సంప్రదాయమన్న తమిళ తంబిలు జంతుప్రేమికులని నివ్వెరపరిచారు. యధావిధిగా ఢిల్లీ దర్బారు వారు, మునుపటి రాజమాతని పోలిన నిర్ణయాలతో, మేము సైతం ఓట్ల రాజకీయాలకి అతీతం కాదని నిరూపించారు. "(PETA) పెటా లేదు, గీటా లేదు. పూట గడవాలంటే ఓటు పడాల్సిందే! అన్నట్టుగా వ్యవహరించారు.

"గోరక్ష మా సిద్ధాంతం" అని చెప్పేవారు మరి ఈ జంతుహింస తప్పు అని చెప్పలేకపోయారెందుకో? ఒక పశువు తల నరికితే దానికి తగిలే బాధ క్షణకాలమే! కానీ, బరితెలతో బాదితే కలిగే బాధ చెప్పనలవి కానిది. అయినా చెప్పటానికి వాటికి నోరుంటే కదా!

మనది కర్మ భూమి, ధన్య భూమి అని గొప్పలు చెప్పుకుంటాము కానీ, ఈ దేశంలోనే గోవులని రక్షించటానికీ, భక్షించటానికీ... ఇప్పుడు శిక్షించటానికి కూడా చట్టాలొచ్చాయి. రాం గోపాల్ వర్మ ట్వీటినట్టు -"ఒక మనిషి వెనుక వెయ్యి గిత్తలని వదిలితే గిత్తలకు అనుకూలంగా చట్టాలు చేస్తారా?" 

అనుకున్నది సాధించాక ప్రశాంతంగా అశాంతితో ఆడుకోక, ఈ రక్తపాతాలు ఎందుకు సృష్టించారో తంబిలు? బహుశా, వచ్చే వెయ్యేళ్ళకి ఈ రాజ శాసనాన్ని ఇలాగే పదిలపర్చటానికేమో. ముందు చెప్పినట్టు ఇందులో ఉద్యమ స్ఫూర్తినే చూస్తే, మనకి స్ఫురించే సమస్యలెన్నో! పరిష్కారాలెన్నో!

 

అభివృద్ధిని ఉద్యమంలా అందిపుచ్చుకోలేమా?, ఆటలలో ప్రపంచాన్ని జయించలేమా? అక్షరాస్యతలో వందశాతాన్ని సాధించలేమా? ఆడవారిపై లైంగిక దాడులని స్వయంప్రకటిత పోలీసుల్లా అడ్డుకోలేమా?

ఆలోచించండి.

*****
 

bottom of page