top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

శేషేంద్ర తొలి రచనలు - ఒక విహంగ వీక్షణం

vinnakota.JPG

విన్నకోట రవిశంకర్

 

సుదీర్ఘ కాలం సాహితీ జీవనం గడిపి, అనేక రచనలు చేసిన కవులు, రచయితల పరిణామక్రమం  రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది, వారి తొలి రచనలు తాజాదనం, కొత్తదనం, ఊహా వైచిత్రి, ప్రయోగం వంటి వాటితో తళుక్కున మెరిసి, ఆ మెరుపు తదనంతర రచనలలో క్రమంగా మాయం కావటం. తొలిరచనే అత్యంత ప్రసిద్ధి పొందినప్పుడు, దాని ప్రభావం తరువాతి రచనల మీద  పడే అవకాశం ఉంది. అలాగే, తమకంటూ ఒక పాఠకవర్గం ఏర్పడ్డాక, వారిని సంతృప్తి పరిచే బాధ్యత కూడా వారి రచనలను ప్రభావితం చెయ్యవచ్చు. తెలుగులో మొదటి ప్రచురణతోనే విశిష్ట  ప్రసిద్ధిపొందిన రచనలు శ్రీశ్రీ “మహాప్రస్థానం”, నవీన్ “అంపశయ్య” వంటివి కొన్ని ఉన్నాయి. 

దీనికి భిన్నంగా, కొందరి రచనలలో కాలం గడిచేకొద్దీ పరిణతి, కూర్పులో నేర్పు, గాఢత వంటివి ఏర్పడి, తొలి రచనలకంటే మెరుగ్గా రూపుదిద్దుకుంటాయి. ఉదాహరణకి, ఇస్మాయిల్ గారి తొలి పుస్తకం కంటే, తరువాత వచ్చిన “చిలకలు వాలిన చెట్టు”, “రాత్రి కురిసిన రహస్యపు వాన” వంటి కవితా సంపుటాల్లో కవితలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తిలక్ “అమృతం కురిసిన రాత్రి” లో బాగా ప్రసిద్ధి పొందిన కవితలలలో చాలా వరకు ఆయన నలభైలలో ఉండగా అంటే 1960 ప్రాంతాల్లో రాసినవే. శివారెడ్డి గారి కవిత్వం విషయంలో కూడా తొలినాళ్ళ సంపుటాల కంటే ఇటీవలి కాలంలో వచ్చిన సంపుటాల్లోని కవితలే నాకు ఎక్కువగా నచ్చుతాయి. 

ఎన్నేళ్ళుగా రాస్తున్నా, వారి రచనలలో పెద్దగా మార్పులేనివారు రూ కొందరుంటారు. వారు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. 

ఏది ఏమైనా, సుదీర్ఘకాలం రచనలు చేసినవారి తొలి రచనలను పరిశీలించటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రముఖ కవి, పండితుడు, ఆలోచనా శీలి, బహుగ్రంథకర్త గుంటూరు శేషేంద్ర శర్మ గారి తొలి రచనలలో విశేషాలు కొన్ని ప్రస్తావిస్తాను.

ఎం.శేషాచలం&కో వారు ఒక కాలంలో ఇంటింటా గ్రంధాలయం పేరుతో ఎన్నో పాకెట్ పుస్తకాలు ప్రచురించారు. వాటిలో ఆధునిక కవిత్వానికి సంబంధించిన అతికొద్ది పుస్తకాల్లో శేషేంద్ర కవిత్వానికి సంబంధించిన పుస్తకం కూడా ఉంది. అందులో నాకు గుర్తున్నంత వరకు మూడు సంపుటాలు ఉంటాయి. వాటిలో మొదటిది “ఋతుఘోష”. ఇది పద్య కావ్యం. ఛందో బద్ధమైన పద్యాల్లో వివిధ ఋతువులపై తాత్వికమైన ఆలోచన, వాటి శోభను చిత్రించే వర్ణన, మనుషులపై అవి చూపే ప్రభావం గురించిన పరిశీలన ఇందులో కనిపిస్తాయి. ఋతువులపై కవిత్వం రాయటం కవులు సాధారణంగా చేసే పనే. ఋతుసంహారం రచించిన  కాళిదాసు  దగ్గరనించి, ఇప్పటి ప్రవాస కవుల వరకూ ఇది కొనసాగుతూ వస్తున్నదే. శేషేంద్ర తనదైన దృష్టితో వాటిని ఆవిషరించటం ఇందులో ప్రత్యేకత. ప్రౌఢత్వం, పదసంపద, తాత్విక సామాజిక కోణాలలో చేసిన పరిశీలనలు పాఠకులను ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు, కొన్ని పద్యాలు పరిశీలిద్దాం.

 

మొదటిది 

 

ఆసల్ దీరునే దృష్టిచే మహిత గాఢాలింగనా యుక్తిచే

నా సంయోగ నిరంత వేదనములే అద్వైత సంసిద్ధికో 

నైసర్గంబగు ఏ యగాధ కుహరాంతః ప్రజ్వలనంద కీ 

లాసంతర్పణకో శరీరంబొక  కారాగారమై తోచగన్. 

 

అద్వైతమనే భావనని ఆధ్యాత్మిక అర్థంలో కాకుండా, ప్రేమ సాఫల్యమనే అర్థంలో ఇక్కడ వాడినట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రేమ భావనకు సాఫల్యం ఆత్మ సంయోగం వల్ల ఏర్పడేదేగాని, కేవలం చూడటం వల్లనో, ఆలింగనం వల్లనో సమకూరేది కాదు. అటువంటి సంయోగానికి అవరోధంగా నిలుస్తుంది కాబట్టి, శరీరం ఒక కారాగారంగా తోస్తున్నది.

మరొక పద్యం ప్రకృతిలో  నీలిమ గురించి రాసినది 

 

నీలి జలంబు నీలి ధరణీ వలయంబు వినీల శైలముల్ 

నీలి తరు ప్రపంచములు నీలి యనంతము యెందు జూచినన్ 

నీలిమ నీలిమా కలిత నిర్భర కంఠము పిల్చినట్లు   నా 

నీలిమ దేహ పంజర వినిర్గతమై పరుగెత్తె నెంతయున్ 

 

ప్రకృతిలో వున్న సత్వ రజస్తమో గుణాలలో తమో గుణానికి నీలిమ ప్రతీకగా నిలుస్తుందని విశ్వనాథ వ్యాఖ్యానిస్తారు. 

ఐతే, అమెరికాలో నీలిమ ప్రగతివాదులకి ఇష్టమైన రంగు. అందువల్ల వారు ఆ అర్థంలో ఈ పద్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇండియాలో   ప్రగతి వాదానికి సిందూరం, రక్తచందనం, రుద్రాలిక, నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక వంటివి కావాలి. అవే ఇక్కడ వాడితే వికటిస్తుంది. రంగుల సంకేతార్థం ఎంత సాపేక్షమో దీనిని బట్టి అర్ధమౌతుంది. 

ఋతువుల సామాజిక ప్రభావం వర్ణించే సందర్భంలో   శేషేంద్ర లో ఉన్న బడుగు జన పక్షపాతం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వోద్యోగిగా ఉన్నప్పుడు  ఆయన కొంత కాలం డిప్యూటీ మునిసిపల్ కమీషనర్ గా పనిచేశారు. అందువల్ల ఆయనకు వారి కష్టాల పట్ల అవగాహన ఉండివుంటుందని మనం భావించవచ్చు. చలికాలం గురించి రాసిన పద్యంలో ఇలా అంటారు -

 

చలి పులివోలె దారుల పచారులు చేయుచు నుండ ఊరికా 

వల పెను మఱ్ఱి  కింద నెలవంకయె  దీపముగా పరున్న పే 

దల పసిపాప లెవ్వరికి తప్పు దలంచిరి కాలమే హలా

హలమయి  పోయి ఆ శిశువు లాకలితో చలితో నశింపగన్ 

 

ఐతే, ఆధునిక భావాల్ని పాత పద్యాల చట్రాలలో బిగించటానికి ప్రయత్నించటం ద్వారా శేషేంద్ర తన శక్తి సామర్థ్యాల్ని వృధా చేస్తున్నారని ఆరుద్ర విమర్శించారు. బహుశా అదే ఉద్దేశంతో కావచ్చు శేషేంద్ర తరువాతి కాలంలో వచన కవితకు మాత్రమే పరిమితమయ్యారు. 

 

ఛందో పరంగా చేసిన ఒక ప్రయత్నం ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది. మామూలుగా పద్యంలో అది ద్విపదైతే రెండు పాదాలు, మిగతా సందర్భాల్లో నాలుగు పాదాలు ఉంటాయి. శేషేంద్ర త్రిపదలని కొన్ని రాసారు. శరదృతువు గురించి రాసిన ఈ పద్యాల్లో పద చిత్రాలు కూడా ఎంతో హృద్యంగా ఉంటాయి. 

 

నిర్మలా కాశపు నీలాటి రేవులో 

పండు వెన్నెల నీట పిండి ఆరేసిన 

తెలిమబ్బు వలువలు తరలిపోతున్నాయి 

ఈ పుస్తకానికి “కావ్య తత్వ ప్రకాశము” పేరిట విశ్వనాథ రాసిన పీఠిక చదవదగినది. ఏదో మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇందులో కవికి ఉండవలసిన లక్షణాలను ఆయన బాగా వివరించారు. పద్యాల నాణ్యతను పోల్చటానికి బియ్యంలో, వరి వంగడాలలో రకాలను ఉపయోగిస్తూ చేసిన వ్యాఖ్య సరదాగా ఉంటుంది. 

 

ఋతుఘోష కంటే ముందు, 1958లో శేషేంద్ర రాసిన ఒక పద్యం ఆర్.ఎస్.సుదర్శనం గారు ఒక వ్యాసంలో ప్రస్తావిస్తారు. అది యిలా సాగుతుంది -
 

ఓ పరమేశ్వరా! ఒక మహోజ్వల ప్రేమ రసైక రాశినిం 

జూపవు, ఈ భయంకర పశుత్వము నాపవు గాంగ నిర్జరీ 

దీపిత శీత శృంగముల దేలెడు వాయు తరంగ డోలలన్ 

దూపవు నా నిరీక్ష కెపుడోయి సమాప్తము లోక రక్షకా!

 

పై పద్యంలో నిరీక్షణకు ఫలితంగా ఇందిరా దేవి ఆయన జీవితంలో ప్రవేశించిందని, ఆ ప్రేమ సాఫల్యానికి ప్రతీకగా ఆయన పుస్తకం “శేషజ్యోత్స్న” లో పద్యాలు రూపు దిద్దుకున్నాయని సుదర్శనం గారు భావిస్తారు. ఇది మనం పరిశీస్తున్న రెండవ కవితా సంపుటి. నిజంగానే ఇందులో అనేక ప్రేమ కవితలు, ఆవిడ గురించి రాసిన కవితలు కనిపిస్తాయి. “ఆ రెండు కళ్ళు” అన్న కవితలో "ఆ కనులు - నా సువర్ణ ఇంద్ర నీలాల గనులు" అని రాస్తారు. ఆవిడ పుట్టిన రోజు గురించి “ఆ రోజు” అన్న కవితలో వర్ణిస్తారు. కేవలం శరీర సౌందర్యం గురించే కాకుండా, ఆమెను తన కవితకు ప్రేరణగా భావిస్తూ రాసిన కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు "నీవు" అనే కవితలో ఈ క్రింది వాక్యాలను చూడవచ్చు. ఈ కవిత పారిస్ లో ప్రేమ దేవత వీనస్ శిలా విగ్రహాన్ని చూసిన తరువాత ఉత్తేజితుడై రాసినట్టుగా పేర్కొన్నా, ఈ వాక్యాలు ఇందిరాదేవి గారి పట్ల ఆయన ప్రేమను సూచించటానికి కూడా ఉపయోగపడతాయి.

 

ఓహో ఏమి జరిగింది నీ కౌగిట్లో నాకు 

తొలి ఋషుల అగ్ని కీలల్లో మంత్ర గ్రామాలు దర్శించినట్లు 

నీ కౌగిట్లో ప్రేమ జ్యోతిని చూచాను 

నేను నీ భౌతిక మూర్తి కోసం రాలేదు 

వచ్చానొక కిరణం కోసం 

ఒక కవితా చరణం కోసం 

కిరణాల్లో స్నానం చేసాను 

మృదు మధుర స్మరణల్లో గానం చేసాను 

నన్ను నేను చేరుకున్నాను 

 

ఆధునిక తెలుగు వచన కవులలో గొప్ప ప్రేమ కవిత్వం రాసిన అతి కొద్దిమందిలో శేషేంద్ర ఒకరని చెప్పుకోవచ్చు. 

 

శేషజ్యోత్స్న లో మరొక విశేషం ఏమిటంటే, ఆయన తరువాత రచించిన కొన్ని కావ్యాల పేర్లు ఇందులోని కవితల్లో తారసపడతాయి. ఉదాహరణకు  చెట్ల గొంతుకలు అన్న కవితలో 

 

అతడు అంధకారంలో ఆక్రందన చేసే పసిపిల్లల  కంఠస్వరాల 

కవితకు నీరై పారిపోయినవాడు. 

 

అని ఉంటుంది. “నీరై పారిపోయింది” శేషేంద్ర తరువాతి కాలంలో రాసిన ప్రసిద్ధ దీర్ఘ కావ్యం. 

 

అలాగే, “గోపురాలు” అన్న కవితలో  

 

మా ఇనప నరాల తీగెలు త్రెంపకండి

అందులో నిదురించే గొంతు జాగృతమైతే 

మండే సూర్యుడు రెండు ముక్కలుగా విరిగి 

మనిషి కళ్ళుగా మారతాడు 

 

అంటారు. 

 

శేషజ్యోత్స్న తరువాత వచ్చిన కవితా సంపుటి పేరు “మండే సూర్యుడు”. శేషేంద్ర కవితా సంపుటులన్నిటిలోనూ నాకు బాగా నచ్చిన పుస్తకం ఇదే. నిజానికి, శేషేంద్ర కవిత్వంలో ఒక ముఖ్య లక్షణం కోటబుల్ లైన్స్. పూర్తి కవిత కంటే అక్కడక్కడా తళుక్కుమని మెరిసే వాక్యాలు, పదచిత్రాల ప్రభావం ఎక్కువ. 

ఆయన ప్రసిద్ధ వాక్యాలు ఎక్కువగా ఈ రెండు సంపుటాల్లోనే ఉన్నాయి ఉదాహరణకి :

 

కొండల నిశ్శబ్దాన్ని 

బొట్టు బొట్టుగా చప్పరిస్తున్నప్పుడు 

చప్పుడు చేసే నా గుండెను కూడా 

క్షమించలేను 

 

మరొకటి -

 

రైతు నాగలిని మోస్తున్నాడు 

క్రీస్తు సిలువను మోసినట్లు  

 

శిలువ ప్రతీక శేషేంద్ర కవితల్లో తరచుగా కనిపిస్తుంది. “నూతన తీరాలు” అన్న కవితలో "నమ్ముతావా నెచ్చెలీ ఈ రోజులింకా క్రైస్తుల క్రాసుల రోజులని" అంటారు. అలాగే, "నా దేశం నా ప్రజలు" కావ్యంలో ఒకచోట పిల్లల్ని ఉద్దేశించి "పలక తీసుకుని మీరు బడికి పోతుంటే శిలువ మోసుకు వెళుతున్న బాల కీస్తుల్లా కనిపిస్తారు నా కళ్ళకి" అని రాస్తారు. 

శేషేంద్ర కవితలు ఎక్కువగా ఒక మూర్తమైన అనుభవం నుంచి వచ్చినవి కాకుండా, ఒక తలపోత నుంచి, ఆలోచన నుంచి వచ్చినట్టుగా అనిపిస్తాయి. కానీ, మూర్తమైన అనుభవం గురించి రాసిన కొద్దీ కవితల్లో “మండే సూర్యుడు” లో వాన గురించి రాసిన కవిత ఒకటి. అందులో చివరి వాక్యాలు నాకెంతో ఇష్టమైనవి 

 

జలదానం చేసిన మేఘాలకి 

జోహార్లు చెప్పాయి చరాచరాలు 

భూమిలో ఉన్న చిన్నారి గింజ 

మీద బయట పెట్టి 

మొదట వచ్చిన రెండాకుల్ని 

చేతులుగా జోడించింది కృతజ్ఞతతో

శేషేంద్ర మరణానంతరం శేషేంద్ర సాహిత్యం పేరుతో  ఆయన collected works ఇందిరా దేవిగారు ప్రచురించారు. వాటిలో మొదటి సంపుటిలో “శేషజ్యోత్స్న”, “మండే సూర్యుడు” ఉన్నాయి. ఎందువల్లనో “ఋతు ఘోష” అందులో చేర్చలేదు.  ఇందులో ప్రత్యేకత ఏమిటంటే కవితలతో బాటు వాటి ఆంగ్లానువాదం కూడా పక్కనే చేర్చారు. అనువాదం శేషేంద్ర చేసినదే. తమాషా అయిన విషయమేమిటంటే “శేషజ్యోత్స్న”లో ఒకటి రెండు కవితలకు మూలం ఆంగ్లమే. తెలుగులో ఉన్నదే అనువాదమన్నమాట.

ఈ సంపుటిలో ఉన్న మరొక పుస్తకం పేరు “రక్త రేఖ”. ఇది కవి తనకై తాను రాసుకున్న డైరీ లేదా నోట్సులాంటిది. (దీనికి దగ్గరగా ఉన్న పేరుతో  "కాల రేఖ" అని శేషేంద్ర మరో పుస్తకం ఉంది. అది సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ పుస్తకానికి 1995 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది.) కవిత్వం , కవితా శాస్త్రం , ఆంద్ర దేశంలో అప్పటి సాహిత్య వాతావరణం మొదలైన వాటి గురించి ఆయన ఆలోచనలు, కొంత చరిత్ర, కొంత రాజకీయాలపై వ్యాఖ్యలు ఇలా ఒకదానికొకటి సంబంధంలేని వివిధ అంశాల మీద కొంత తెలుగులో, కొంత ఆంగ్లంలో రాసుకున్న నోట్సుని యథాతథంగా “రక్త రేఖ” లో అచ్చువేశారు. ఇటీవలి కాలంలో కొంతమంది కవులు తమ ఫేస్ బుక్ పోస్టులని పుస్తకంగా తీసుకువస్తున్నారు. ఇది దాదాపు అటువంటిదే. ఇందులో శేషేంద్ర పాండిత్యం, వివిధ విషయాల మీద ఆయనకున్న నిశితమైన అవగాహన, ఆలోచనా పటిమ మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఉదాహరణకి భారతీయ కవితా శాస్త్రం గురించి ఎన్నో విలువైన విషయాలు రాశారు. మన దగ్గర రసవాదం, అలంకార వాదం, రీతి వాదం, ధ్వని వాదం, వక్రోక్తి, ఔచిత్య వాదం -ఇలా ఆరు రకాల కవితా సిద్ధాంతాలున్నాయని, భారతీయ కవితా శాస్త్రం పాశ్చాత్యుల కవితా శాస్త్రం కంటే ప్రాచీనమైనది ఆయన పేర్కొంటారు.

ఇందులో ఒక చోట ద్రష్టగా కవికున్న ప్రాధాన్యతను గురించి ఆయన చేసిన వివరణ ఆసక్తికరంగా ఉంటుంది. D.H.Lawrence కొటేషన్ The perfect rose is a running flame emerging and flowing off and never in any sense at rest, static, finished అన్నది ఉదాహరణగా తీసుకుని, ఒక గులాబీ పువ్వులో పరుగెత్తే మంటను చూడగలగటం కవి ద్రష్ట అనటానికి  నిదర్శనమని, అదే కవికి ఋషిత్వాన్ని ఆపాదిస్తుందని చెబుతారు. మంత్ర పుష్పంలో ఒకచోట “యో అపాం  వేదా పుష్పవాన్ భవతి” అన్నప్పుడు  కూడా నీటిలో పుష్పాన్ని చూడటం కవికున్న దృష్టిని సూచిస్తుంది. ఒక వస్తువులో వేరేవారికి కనిపించనిది చూడగలగడమే ఋషిత్వం. నిజానికి, ఇది  రెండు రకాల వారికి వర్తిస్తుంది. ఒకటి ఋషి, రెండవది బాలుడు.  శేషేంద్ర కవిలో ఋషిని చూస్తే, ఇస్మాయిల్ గారు బాలుణ్ణి చూసారని చెప్పుకోవచ్చు. 

వారిద్దరికీ మధ్య మరొక సామ్యం విరసంపై సమరం. విరసం తెలుగు సాహిత్యాన్ని తన ఉక్కు పిడికిలిలో బిగించి ఉంచాలని చూసిన రోజుల్లో దానికి వ్యతిరేకంగా రచనలు చేసిన వారిలో ఈ ఇద్దరూ ముఖ్యులు. ఐతే, ఇస్మాయిల్ గారికి మార్క్సిజం పట్ల సైద్ధాంతికంగా విభేదం ఉంది. బహుశా శేషేంద్రకి అది లేకపోవచ్చు. 

వస్తువు ఒక్కటే కవిత్వం కాదని, ఒక వస్తువు కవితంగా మారటానికి చేసే నిర్మాణంలోనే కవి ప్రతిభ దాగివుంటుంది ఆయన పదేపదే చెబుతారు. అది గ్రహించని వారి మీద ఆయన కి అసహనం చాలా ఎక్కువ.  తెలుగు సాహిత్య పరిస్థితి మీద, ముఖ్యంగా కవుల మీద తీవ్రమైన విమర్శ ఆయన తరువాతి కాలంలో రాసిన “కవిసేన మానిఫెస్టో” లో ఉంటుంది. ఐతే రక్త రేఖలో కూడా  కొన్ని ఘాటు వ్యాఖ్యలు లేకపోలేదు . ఒక ఉదాహరణ – “తెలుగు సాహిత్యం దొంగ కవులు, దొంగ విమర్శకుల joint stock company అయిపొయింది. కాననివాని నూతగొని, కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి .. అన్న చందంగా ఉంది తెలుగు సాహిత్యం.”  తెలుగులో కవిత్వం రాయాలనుకొనేవారు తప్పక చదివి, తెలుసుకోవలసిన విషయాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. 

తదుపరి కాలంలో శేషేంద్ర కవిత్వంలో సంక్లిష్టత పెరగటంతో బాటు ఆయన తన కవితాత్మకి దూరంగా జరిగారేమోనన్న అసంతృప్తి ఆయనను అభిమానించని వారికి, అభిమానించేవారిలో కూడా కొందరికి ఉందనుకుంటాను. అందుకే, ఆయన నిజమైన కవితాత్మను తెలుసుకోవటానికి ఆయన తొలి రచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. శేషేంద్ర గురించి ఆసక్తి ఉన్న వారందరూ ఆయన సాహిత్య పఠనాన్ని ఈ వ్యాసంలో ప్రస్తావించిన నాలుగు పుస్తకాలతో ప్రారంభిస్తే బాగుటుందని నా సూచన. 

 

 -విన్నకోట రవిశంకర్

bottom of page