top of page

సత్యాన్వేషణ - 12

హీరోగారొస్తున్నారు, హారతి పట్టండి!

 

సత్యం మందపాటి

adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“హీరోగారొస్తున్నారు.. రండి రండి, ఆయన కారు సైటయింది” కంగారుగా అన్నాడు కనకంగారు రైల్వే వారి భాషలో. ఆయన ఆ అభిసంకి అధ్యక్షుడు కదా మరి.

ఆడా మగా, పిల్లా పీచూ, తెంగ్లీషూ ఇంగ్లిలుగూ, ముసలీ ముతకా అంతా లేచి నిల్చున్నారు. 

“హారతి.. పళ్ళెం.. హారతి పళ్ళెం.. ఎక్కడ.. ఎక్కడ పెట్టారు?” హడావిడి పెట్టింది ఆరతి. ఆవిడ ఆ అభిసంకి సెగ్రటరీ కదా మరి.

అవును. ఇంతకీ ఆ హీరో ఎవరు చెప్మా?

ఏమో నాకు తెలీదండీ. ఆ అభిసం ఎవరిదో, దాని బ్రతుకుకి ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఆయనే ఆ హీరో అయివుండవచ్చు అని ప్రస్తుతం అనుకుందాం. 

అసలు నాకు ఇలాటి సినిమా వాళ్ళ సొళ్ళు కబుర్లు ఏవయినా నాలుగుసార్లు చెబితే కానీ బుర్రకెక్కదు. ఎవరా హీరో అంటే నేనేం చెబుతాను. 

అందుకే నా ఆలోచనలు ఎటో వెళ్ళిపోయాయి. 

హీరోలంటే ఎవరు? ఎలా వుంటారు? ఎక్కడ వుంటారు? అనే పిచ్చి ప్రశ్నలు నా చిన్న బుర్ర నిండా తిరుగుతూనే వున్నాయి. 

 ***

అసలు వ్యక్తి పూజ అనేది దాదాపు అన్ని సంస్కృతులలో వుంది. కొన్ని చోట్ల కొంచెం వుంటే, ఇంకొన్ని చోట్ల ఇంకొంచెం ఎక్కువగా వుంది. మరి కొన్ని చోట్ల మరి కొంచెం ఎక్కువగా వుంది. మన పవిత్ర భారతదేశంలో మరీ ఎక్కువ అని మనకందరికీ తెలుసు.

ముస్లిములు మన దేశాన్ని ఆక్రమించుకుంటుంటే, మనలో మనం కొట్టుకుని, వాళ్ళని హీరోలుగా చేసి, మన దేశాన్నే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాం. ఈనాటికీ అక్బర్ ప్రేమ కథలు చెప్పుకుని సినిమాలూ, సీరియల్సూ చూస్తాం కానీ, అతను భారతదేశానికీ, సంస్కృతికీ చేసిన ద్రోహం గురించి చెప్పుకోము. కావాలంటే అతన్ని హీరోగా చూపిస్తూ చరిత్ర పుస్తకాలు కూడా మార్చేస్తాం. 

తర్వాత బ్రిటిష్ వాడు వ్యాపారం పేరుతో మనల్ని దోచుకుని నెత్తికెక్కుతుంటే, మళ్ళీ మనలో మనమే కొట్టుకుని, వాళ్ళని హీరోలుగా చేసి, వాళ్ళకి పాదపూజలు చేసి, మన దేశాన్నే నైవేద్యంగా సమర్పించాం. ఆ స్వాతంత్ర సమరంలో ప్రాణాలొడ్డి పోరాడిన మహాత్మా గాంధీ అంటే ఎవరో సరిగా తెలియని పరిస్థితిలో వున్నాం ఈనాడు. కొంతవరకూ చరిత్ర తెలిసిన వారిలో కొందరు, వారి అవస్దరాల దృష్ట్యా ఆయనని ఒక టెర్రరిష్టుగా కూడా చిత్రిస్తుంటే వినటానికి బాధగా వుంటుంది. 

మనకి ఇష్టమైన వారికి దండలు వేసి, కాళ్ళు కడిగి పూజ చేయటం రోజూ చూస్తూనే వున్నాం. అలాగే ఇష్టం లేనివారిని, కడగవలసినంతగా కడిగి, ఉతక వలసినంతగా వుతికి, ఆరేయవలసినంతగా ఆరేయటం మన రక్తంలో వుంది కూడాను. ఇక్కడ వారు చేసిన మంచి లేదా చెడు పనులతో సంబంధం లేదు. 

భారతంలో ఈ వ్యక్తి పూజ విపరీతంగా కనపడేది ముఖ్యంగా సినిమా హీరోలతో. ఆనాటి ఎఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్, చిరంజీవి, శివాజీ, ఎంజీఆర్, రాజ్ కపూర్, అమితాబ్, ఖాన్లతో మొదలుపెట్టి, ఈనాడు భారతదేశంలో అలాటి చాలమంది కొడుకుల, కూతుళ్ళ, మనవల, తమ్ముళ్ళ వ్యక్తి పూజతో, తెలుగుదేశంలో మూడు కులాల, ఆరు మాఫియాల సౌభాగ్యంతో ఇంకా నడుస్తూనే వుంది. 

నేను నాలుగు దశాబ్దాల క్రితం ఇండియాలో వున్నప్పుడు, ఎవరి హీరోల బొమ్మల మీద వాళ్ళు దండలు, వేయటమే కాకుండా, వారి హీరోలు కాని వారి మీద శ్రేష్టమైన గేదె పేడతో, ఆ బొమ్మల మీద రెండు చేతులతోనూ

 

సుభ్భరంగా అలికి, ముఖాల మీద కుసింత పేడ ముగ్గులు వేసి, వారి నెత్తిన గొబ్బెమ్మలు కూడా పెట్టేవారు. ఈనాడు కులాభిమానుల, మతాభిమానుల ఆర్ధిక, సామాజిక సహాయ సహకారాలతో, జీరోలు కూడా హీరోలుగా చెలామణి అవుతూ, వ్యక్తి పూజలు చేయించుకుంటూనే వున్నారు. 

ఇలా తమకి నచ్చిన హీరోలకి హారతి పట్టే రంగాల్లో ఒకటి సినిమా రంగం అయితే, రెండవది వ్యక్తి పూజ జరిపించుకునే బాబాలు, స్వాములు. ముఖ్యంగా దొంగ బాబాలు, దొంగ స్వాములు. వీళ్ళకి దేవుళ్ళకన్నా ఎక్కువగా అభిమానులు వుండటం కూడా తరచూ చూస్తున్నాం. 

మోసగాళ్ళు కళ్ళల్లో కారం కొడతారంటారు కానీ, ఒక బాబా నమ్మిన వాళ్ళ కళ్ళల్లో విభూది కొట్టి భక్తులకు ఇలలోనే దేవాధిదేవుడయాడు. జిత్తులమారి మాజిక్కులు చేసి ప్రజలని తన జేబులో వేసుకున్నాడు.  శిష్యబృందంతో పాద పూజలు చేయించుకున్న హీరో. వెళ్ళేటప్పుడు ఒక్క ‘లగేజ్’ కూడా చెకిన్ చేయనివ్వరు కనుక, రెండు చేతులా, రెండు కాళ్ళా సంపాదించిన కోట్లకి కోట్లతో సహా అన్నీ వదిలేసి, కట్టుబట్టలు కూడా కాటికి ఆహుతి చేసి, పుట్టినరోజు కట్టిన బట్టలతోనే తిరిగి వెళ్ళి’పో’యాడు. 

ఆమధ్య మావూళ్ళోనే ఇద్దరు స్వాముల గొప్పతనం చూశాను. ఒకాయన రాధకి ఒక మందిరం కట్టి, ఇటు భారతీయులకీ, అటు అమెరికా వాళ్ళకీ గొప్ప రాసస్వామి అయిపోయాడు. పాదపూజలు చేయించుకున్నాడు. అంతటితో ఆగక, కక్కుర్తి పడి ఇంకా వయసు రాని తెల్ల ఆడపిల్లలతో రాసక్రీడలు చేస్తుంటే పట్టుబడ్డాడు. ఇది అమెరికా కనుక బడిత పూజలు తప్పించుకున్నాడు కానీ, కోర్టు శిక్షని తప్పించుకోలేక పోయాడు. రెండు రోజుల్లో శిక్ష వేస్తారనగా, తన అభిమాన శిష్య బృందం సహాయంతో అర్ధరాత్రి, గడ్డం మీసం గీసేసుకుని, ఇస్త్రీ పాంటూ చొక్కా వేసుకుని, మెక్సికోకి పారిపోయి, అక్కడినించీ భారతదేశాన్ని ఉద్ధరించటానికి అలా చల్లని గాలిలో అంతర్ధానమై వెళ్ళిపోయాడు. మా వూళ్ళో ఇప్పటికీ ఆ మహా గొప్ప ‘హీరో’ స్వాములవారి ‘అమాయకత్వం’ గురించి చెప్పుకుని, హారతి పట్టే వాళ్ళున్నారు. 

ఇంకొక హీరో ఎవరంటే భౌతిక భవబంధాలన్నీ తెంచుకుని సన్యాసం తీసుకున్న మరో స్వామి. భారతదేశంలో, తెలుగునాట ఒక పెద్ద పట్టణంలో, భక్త కోటి ఇచ్చిన కోట్ల రూపాయల కట్టలతో ఒక పెద్ద ఆశ్రమం ప్రేమగా కట్టుకుని, ఆ డబ్బులు చాలక, అన్నీ వదులుకుని డాలర్ల కోసం అమెరికాలో ఎన్నో నగరాలు తిరిగిన సన్యాసి. ఆయన వేదాలు, ఉపనిషత్తులు చదవలేదు కనుక, మా వూరి గుడిలో ఏవో అర్ధంకాని కాకమ్మ కథలకు అర్ధం వున్నట్టుగా చెబుతుంటే ఒక విషయం తెలిసింది. ఆమధ్యనే ఆయన భారతదేశంలో ఒక భక్తురాలిని ఆశీర్వదిద్దామని చేయి చాచి, ఎలాగూ చేయి చాచానుగదా అని ఆ చేత్తోనే ఇంకా ఏదో చేయబోయాడుట. అప్పుడు ఆవిడ తన స్నేహితులకు చెప్పి, వారితో కలిసి ఆయన్ని పచ్చడి చేసి రోడ్దు మీద పారేసింది. ఆ ఉదంతం అక్కడి మీడియాలో కూడా వచ్చిందిట. ఆయన మాత్రం అమెరికాలోని చాల వూళ్లల్లో, పేరంటంలో ఏదో చేసి ఏమీ తెలియనట్టుగా కూర్చున్న ముత్తయిదులా ముఖం పెట్టి, తల ఒక్కరికి అక్షరాలా నూట పదహారు డాలర్లు పుచ్చుకుని పాద పూజలు చేయించుకుని, భక్తుల తలల మీద వాళ్ళే ఇచ్చిన అక్షింతలు చల్లి, తను మాత్రం ఒక పెద్ద సూట్ కేసెడు డాలర్లు తీసుకుని భారతదేశం వెళ్ళిపోయాడు. అదీ హీరోగారికి హారతి పళ్ళెం పట్టటం అంటే. ఎంత హీరోలకి అంత హారతి మరి! 

హీరోల గురించి వ్రాస్తానని, మరీ విలన్ల గురించి వ్రాస్తావేమిటయ్యా అనుకుంటున్నారని నాకు తెలుసు. మరేం చేస్తాం. కొందరి హీరోలు, మరెందరికో విలన్లు. ఇది జరుగుతున్న విషయం కనుక చెప్పక తప్పలేదు. 

తర్వాత ఇండియాలో దాదాపు అదేస్థాయిలో హీరోలకి హారతి పట్టే ఇంకొక రంగం రాజకీయ రంగం. ఇక్కడ కూడా పైన చెప్పిన రెండు రంగాలలాగానే, హీరోలకి సమర్దత వుండనఖ్కర్లేదు. జనాన్ని మభ్యపెట్టి, కొన్ని తలలు తాకట్టు పెట్టించేసి, నాలుగు వందల బస్తాలో, నాలుగు వేల సూట్కేసులో వెనకేసుకునే బుర్ర వుంటే చాలు. వీళ్ళు హీరోల అవతారం ఎత్తాలంటే, ఒక ‘ట్రంపు’ కార్డు వాడాలి. నేను ఇంతకుముందు, నా ‘అమెరికా వంటింటి పద్యాలు’ పుస్తకంలో ఈ విషయమే సరదాగా చెప్పాను. పుస్తకావిష్కరణ చేసిన సి.నారాయణరెడ్డిగారికి అది ఎంతో నచ్చింది కూడాను. ఆయన దాని గురించి చాలసేపు మాట్లాడారు. ఆ పజ్యం పేరు జోకరు.

“బీజేపీలో బకురుద్దీన్ సాహెబ్ గారు

టీడీపీలో ఒక రెడ్డి శాస్త్రి మాష్టారు

కాంగ్రెస్ మనుగడకి గాంధీగారి పేరు

ఆట గెలవాలంటే కావాలి ఒక జోకరు!’

ఈ రాజకీయరంగంలో ఒక గోపాలకృష్ణ గోఖలే లాగానో, ఒక లాల్ బహదూర్ లాగానో, ఒక టంగుటూరి లాగానో, ఒక వావిలాల లాగానో, ఒక మార్టిన్ లూథర్ కింగ్ లాగానో, ఒక నెల్సన్ మాండేలా లాగానో పేరుకెక్కాలంటే, వాళ్ళు హీరోలమని మెడలో ఎముకల దండ వేసుకుని చాటుకోనఖర్లేదు. ప్రజలే వారిని అలా గుర్తించారు. గౌరవించారు. వారిని అనుసరించారు. హృదయంలో దాచుకున్నారు. కానీ పూజించలేదు. హారతులివ్వలేదు. ప్రతి వూళ్ళోనూ, వూరు బయటా విగ్రహాలు పెట్టలేదు. స్టేడియంల దగ్గర నించీ మిరపకాయ బజ్జీలమ్మే కొట్ల దాకా వాళ్ళ పేర్లు పెట్టలేదు. 

కాకపోతే పైన చెప్పిన జోకర్లు, తమ ట్రంపు కార్డుని ఎన్నుకున్న పధ్ధతి చూస్తే భయమేస్తుంది. కులాభిమానం కార్డు, మతాభిమానం కార్డు, మిగతా కులమతాల వారిపై ద్వేషం కార్డు, రౌడీయిజం కార్డు, హత్యల కార్డు, కుంచాలతో లంచాల కార్డు, పీపాలతో సారాల కార్డు, బస్సులు రైళ్ళూ తగలబెట్టే కార్డు, బందుల కార్డు, హర్తాళ్ కార్డు.. ఒకటేమిటి ఎన్నో ట్రంపు కార్డులు. ఎలా గెలిచారన్నది వాళ్ళకీ అనవసరం. ఆటలో గెలవటమే ముఖ్యం. వారికి వాళ్ళకి హారతి పట్టేవారితోనే అవసరం. మంచి ధర పలికితే భారతదేశాన్ని ఇటు పాకిస్థానుకో, అటు చైనాకో అమ్మటానికి కూడా వెనుకాడని హీరోలు ఈనాటి రాజకీయనాయకులు. అలాటి రాజకీయ నాయకులతో అవసరమున్న వారికి మరి వారే హీరోలు. వారికే హారతులు.   

తర్వాత ఇక నాలుగో రకం వ్యక్తి ఆరాధన క్రికెట్ ఆటగాళ్ళకి. పైన చెప్పిన మూడు రకాల జీరోలకన్నా వీళ్ళకి కనీసం ఆటలో ఎంతో నైపుణ్యం వుంటేనే రాణిస్తారు. ఒకవేళ నాన్నల రికమెండేషన్ మీద అవకాశాలు ఇచ్చినా, నాలుగు సున్నాలు కొట్టిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ ఆటలనించీ ‘ఔట్’ అవుతారు. కాకపోతే వారి అభిమానుల పిచ్చి అభిమానులది. పాపం!

 క్రికెట్ గ్రౌండులో ఆట ‘పిచ్చి’ మీద ఆడతారు కనుక, క్రికెట్ ఒక నేషనల్ పిచ్చి అయిందంటాడు నా మిత్రుడొకడు. మనవాళ్ళు ఒక విదేశంలో ఆటలు ఆడినట్టు ఆడి ఓడిపోయాక, కేప్టన్ ధోనీ అన్నాడు, “అక్కడి ‘పిచ్చి’ చదవటంలో మేము పొరపాటు చేశాం’ అని. అంటే ఆంగ్లంలో “We made a mistake in reading their pitch’ అని అనువాదం. అది ‘ఈనాడు’ దినపత్రిక వారి తెంగ్లీషు అనుకోండి. 

అమెరికాలో ఫుట్బాల్ ఆట లేకపోతే, అమెరికా ఇతర దేశాల మీద ఇంకా ఎన్నో యుధ్ధాలకు కాలు దువ్వేది అంటారు కొందరు అమెరికన్స్. అలాగే ఇండియాలో క్రికెట్ ఐదు రోజుల ఆటలతో, మూడు రోజుల ఆటలతో, ఒక రోజు ఆటలతో, ఒక పూట ఆటలతో భారత యువతను క్షణం తీరిక లేకుండా చేసి, దేశాన్ని గురించి, దేశాభివృధ్ధి గురించి, చదువుల గురించి, దేశ పారిశ్రామిక ఉత్పత్తుల గురించీ, రాజకీయ దురిత సంహారుల గురించి, దేశ భవిష్యత్తు గురించి ఏమీ పట్టించుకోకుండా, వారిని నిర్వీర్యం చేస్తున్నాయంటారు. ఇక్కడా మళ్ళీ ఎవరి హీరోలు వాళ్ళకి. ఎయిర్పోర్టులో దిగగానే ఆటగాళ్ళకు నుదుట కుంకుమ బొట్లు, హారతులు, మెడలో దండలు. మనవాళ్ళు గెలవాలని గుడిలో అష్టోత్తరాలు, ముడుపులు, నిలువు దోపిడీలు. భళా.. చాంగు భళా! 

ఆమధ్యన ఒక తెలుగమ్మాయి షటిల్ బాట్మింటన్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటే, ఆ అమ్మాయిది ఏ కులమో చెప్పమని గూగులమ్మ గూబలు వాయించారుట. తమ కులమయితే, దండలు వేద్దామనో, హారతిద్దామనో తెలియదు కానీ, అత్యధిక సంఖ్యలో గూగులమ్మని కులంకోసం సమాచారం వెతకమని అడిగి మనవాళ్ళు గూగుల్ రికార్డు పెట్టేశారుట! 

నిజంగా నా ఉద్దేశ్యంలో, కేవలం నా ఉద్దేశ్యంలో, చాలమంది నిజమైన హీరోలు వేరే వున్నారు. మీలో కనీసం కొంతమందైనా నాతో ఏకీభవిస్తారని తెలుసు. వాళ్ళందరూ నిత్యజీవితంలో అసలు సిసలు హీరోలు. ఏమాత్రం పేరుగానీ డబ్బుకానీ ఆశించని హీరోలు. ఈతరంలోని చాలమందికి తెలియని, తెలిసినా ప్రజలు ఎక్కువగా పట్టించుకోని సామాన్య మానవ మాత్రులు. మనిషిగా పుట్టినందుకు మనిషిగా జీవిస్తున్న మనుష్యులు. 

వీరిలో కొంతమందిని ముఖాముఖీ చూస్తుంటాం, వారి గురించి చదువుతుంటాం, వింటుంటాం, విన్న తర్వాత టాటా చెప్పేస్తాం. కొంతమంది ఏమీ ఆశించకుండా, తమకుతాముగా తమకు చేతనైనవి గుప్తంగా చేస్తూ సమాజానికి సహాయపడుతుంటారు. అలా చేస్తున్న వారికి మనం హారతిపట్టనఖ్కర్లేదు. పాదపూజలు చేయనవసరం లేదు. వారు చేస్తున్నది కనీసం కొంతవరకూ మనం చేసినా లేదా అలా చేస్తున్నవారికి మనంవారికి అండగా నిలిచినా, కనీసం అలా చేసేవారికి అడ్డం వస్తూ, ఉచితంగా విమర్శలు చేయకపోయినా, అవే నూరు నీరాజనాలు. 

మోహన్లాల్ కరంచంద్ గాంధీ, దక్షిణాఫ్రికాలో, శ్వేత జాత్యహంకారుల చేతిలో, నల్లవారు తదితరులు వారి ద్వేషానికి గురై బాధలు పడుతుంటే భరించలేక అడ్డుకుని, జైలు పాలయాడు. అయినా పట్టు వదలలేదు. అలా ఇరవై ఒక్క సంవత్సరాలు, ‘మనమందరమూ సమానమే’ అనే ప్రాతిపదిక మీద పోరాడాడు. భారతదేశంలో చిన్నాభిన్నంగా బ్రిటిష్ వారిపై పోరాడుతున్న ప్రజానీకం మరణం పాలవుతుంటే, గోపాలకృష్ణ గోఖలే, గాంధీని భారతదేశానికి రమ్మని పిలిచాడు. భారతదేశ స్వరాజ్య పోరాటానికి నాయకత్వం వహించమన్నాడు. ఆయన ‘నాయకులని నియోగిస్తే నాయకులు అవరు. ఏ అవసరానికైనా వారంతట వారే ముందుకు రావాలి’ అని ఆయన నిరాకరించారు. అదీకాక తను రెండు దశాబ్దాలుగా భారతదేశంలో లేననీ, తనకి అప్పటి దేశ పరిస్థితులతో అవగాహన లేదనీ అన్నారు. పట్టుదలతో గోఖలే కోరిక మీద, దేశమంతా తిరిగి బ్రిటిష్ వారి కాలిక్రింద నలిగి పోతున్న భారతీయుల దీనావస్థ చూసి, రంగంలోకి దిగారు. ప్రాణాలకు తెగించి పోరాడారు. ప్రజలే ఆయన్ని నాయకుడిని చేశారు. ఆయన వెంట నిలిచారు. దేశాన్ని అంతటినీ ఒక్క త్రాటి మీద నిలబెట్టి, బ్రిటిష్ వారిని గడగడలాడించాడు. తను ఎన్నోసార్లు జైలు పాలయి, నిరాహార దీక్షలు చేసి చివరకు వారిని బయటకు త్రోలి, దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టి, వారి చేతే ‘మహాత్మా’ అని పిలిపించుకున్నాడు. ఈనాడు ఆయన మన గోడల మీద ఒక పటంగా మాత్రమే నిలిచిపోయాడు. గాంధీలు కాని గాంధీల చేతుల్లో గాంధీయిజం టెర్రరిజం అయిపోయింది. తిన్నది అరక్క, పొట్ట నిమురుకుంటూ, బీరు త్రాగుతూ ‘గాంధీ వల్లనే, హిందూ ముస్లిం గొడవలు వచ్చాయి, very arrogant fellow’ అనేవాళ్ళని కూడా చూసే ఖర్మపట్టింది నాకు ఈమధ్య. కనీసం వాళ్ళు భారత దేశ చరిత్ర చదివినా బాగుండేది.  

అలాగే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం, కట్టబ్రహ్మన, సరోజినీ నాయుడు, అబ్దుల్ కలాం అజాద్.. ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరంలో, నిస్వార్ధంగా ప్రాణాలొడ్డి పనిచేశారు. వాళ్ళకి హారతులు ఇవ్వొద్దు. వారు సంపాదించి పెట్టిన స్వతంత్రాన్ని విదేశీ స్వదేశీ ఉగ్రవాదులనించీ కాపాడండి. అది చాలు.  

విదేశాల్లో మార్టిన్ లూథర్ కింగ్, డెస్మండ్ టూటు, మేండేలా.. ఇలా ఎంతోమంది హీరోలున్నారు. 

 

మదర్ థెరీసా నడుపుతున్న ‘నిర్మల్ హృదయ్’లో నిస్వార్ధంగా జరుగుతున్న మానవ సేవ చూస్తుంటే, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. రాత్రింబగళ్ళూ అనాధ పిల్లలకు ప్రేమ పంచుతూ పెంచుతున్న తీరు చూస్తుంటే, ‘మానవసేవే మాధవసేవ’ అనే మాటకి అర్ధం తెలుస్తుంది. నా ఉద్దేశ్యంలో అలాటి చోట్ల పనిచేసే వారందరూ హీరోలే. ఎవరికీ హారతి పట్టనఖ్కర్లేదు, దుష్ప్రచారాలు చేయకుండా వుంటే చాలు. ఆ విషయంలో కూడా, అది మత మార్పిడి కోసం చేస్తున్న పని, సేవా లేదూ గీవా లేదు అనే మాటలు విన్నాను. పోనీ ఆ మత మార్పిడి ఏదో చేయకుండా, అలా అన్నవాళ్ళే అలాటి గొప్ప పనులు చేసి మానవ సేవ చేయవచ్చు కదా! అలా చేసే ఉద్దేశ్యమే వుంటే, ఇలాటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తారు? 

ఈమధ్యనే ఒక పదిహేడేళ్ళ పిల్ల గ్రేటా థన్బర్గ్, స్వీడెన్ నించీ అన్ని దేశాలు తిరుగుతూ అమెరికా కూడా వచ్చింది. ఆమె లక్ష్యం పర్యావరణ రక్షణ. ఇంతకు ముందు – అంటే ఒకటిన్నర సంవత్సరాల క్రితం – ఇదే పత్రికలో ఇదే శీర్షికలో, నేను ‘భూగోళం బ్రద్దలవుతున్నది’ అనే ఒక వ్యాసం వ్రాశాను. ఆమె చెప్పేది కూడా అదే. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నాం, మన భూగోళాన్ని రక్షించుకోవటం తక్షణ కర్తవ్యం అని. సమయం మించిపోతున్నది, వెంటనే మనమందరం జాగ్రత్త పడాలి అని మన తర్వాత తరం ప్రతినిధిగా ఆమె చెబుతుంటే, అన్ని దేశాల నేతలూ ముందుకి వచ్చి నడుం బిగించారు. సైన్సు ఏమాత్రం చదువుకోని పామరుడు, నిజానిజాలు చూడలేని కబోది, అమెరికా అధ్యక్షుడు మాత్రం అహంకారంతో ‘నువ్వా నాకు చెప్పేది’ అని, బొగ్గు గనులన్నీ మళ్ళీ తెరిపించి, కార్బన్ మోనాక్సైడుని, కార్బన్ డయాక్సైడుని గాలిలోకి వదిలిపెట్టి, గుండెలనిండా ఆ గాలిని పీల్చుకోమన్నాడు. ‘మూర్ఘుని మనసు రంజింపలేక’ ఆ సుమతి, అమెరికాలో ఆశలు వదులుకుని, మిగతా దేశాల నాయకులని కలిసి, కొత్త చట్టాల కోసం నిరంతరం తపిస్తున్నది. చిన్న పిల్లే అయినా, నాకు ఆమె ఒక పెద్ద హీరో. 

 మలాల అనే ఒక పాకిస్తాన్ అమ్మాయి, ముస్లిం దేశాలలో ఆడపిల్లలకి చదువుకునే అవకాశం ఇవ్వాలని ఉద్యమం మొదలుపెట్టి, తాలిబాన్ చేతుల్లో తన్నులే కాక, వాళ్ళ కాల్పులకు చావు దెబ్బలు కూడా తిని, అక్కడి నించీ తప్పించుకుని, తన మానాన తను ఆ ఉద్యమాన్ని ధైర్యంగా సాగించింది. తను తర్వాత ఇంగ్లండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటిలో చదువుకోవటమే కాకుండా, నిరంతరం తన లక్ష్య సాధన కోసం శ్రమిస్తూనే వుంది.  

ప్రపంచంలో ప్రతి ఐదు సెకండ్లకీ ఒక చిన్న పిల్లవాడో, పిల్లో ఆకలితో చనిపోతున్నారని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. కొన్ని దేశాల్లో తక్కువ, మరికొన్ని దేశాల్లో ఇంకా ఎక్కువ. ఆ ఇంకా ఎక్కువ దేశాల్లో, భారతదేశం ఒకటి. నారాయణన్ కృష్ణన్ బెంగుళూర్ తాజ్ హోటల్లో వంటవాడుగా పనిచేస్తూ, గొప్ప పేరు సంపాదించి స్విడ్జెర్లాండులో మంచి ఉద్యోగం సంపాదించి, సుఖంగా వుండేవాడు. అతను ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు, ఒక అతి బీద ముసలివాడు ఆకలికి ఆగలేక, తన మలమూత్రాలతో తనే కడుపునింపుకుంటుంటే చూడలేకపోయాడు. వెంటనే అతనికీ, అక్కడ వున్న ఇతరులకీ కడుపునిండా భోజనం పెట్టించాడు. అంతటితో ఆగలేదు. తను చేస్తున్నది ఏమాత్రం చాలదని గ్రహించాడు. స్విడ్జెర్లాండులో ఉద్యోగం వదిలేసి, తన స్వంత వూరు మధురైలో అక్షయ ట్రస్ట్ అని మొదలుపెట్టి, ప్రత్రి రోజూ కొన్ని వందల పేదవారికి భోజనాలు పెడుతున్నాడు. దాదాపు పదిహాడేళ్ళనించీ ఇంకా అలా చేస్తూనేవున్నాడు. అతనొక్కడే కాదు, జైపూరులో కృతి గుప్తా, ఢిల్లీలో అంకిత్ కవాత్రా, ఇలా ఎందరో మహానుభావులు అతిబీదవారికి అన్నదానం చేస్తూనే వున్నారు.

అనుక్షణం తమ ప్రాణాలకు తెగించి, దేశరక్షణకు పోరాడే సైనికులు, తమ జీవితాలని కూడా ఖాతరు చేయకుండా నింగికి ఎగిసి సర్వాన్నీ మసి చేసే మంటలని ఆర్పే ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ప్రజా రక్షణే ముఖ్యంగా రాత్రీ పగలూ మన క్షేమం కోసం పనిచేసే పోలీసులు, సెక్యూరిటీ వారు ఇలా ఎందరో వున్నారు. అందరూ మరి హీరోలే!


అలాగే మనకి ఎలాటి అంటురోగాలు వున్నా, వారి కులం మతం చూడకుండా ముక్కూ ముఖం తెలియని వారిని కూడా, తమ అక్కున చేర్చుకుని ప్రాణాలు పోసే నర్సులు, డాక్టర్లు, మిగతా అన్ని రకాల వైద్య సిబ్బందికీ ఎలా ధన్యవాదాలు చెప్పుకోగలం? 


ఇప్పుడు ప్రపంచమంతటా కనీవినీ ఎరుగని భయంకరమైన అంటువ్యాధి కరోనా కోరల క్రింద దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఆ వ్యాధి సోకి నలిగిపోతుంటే, వారిలో కొన్ని వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, ఇలాటి వైద్య సిబ్బంది, తదితరులూ, తమకి ఆ వ్యాధి సోకుతుందేమోననే భయం లేకుండా, మన ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ మానవతా యజ్ఞంలో చనిపోయిన కొన్ని వేలమందిలో, ఎందరో వైద్య సిబ్బంది కూడా వున్నారు. వాళ్ళు అసలైన హీరోలు. వారికీ మనం మౌనంగా నీరాజనం పలుకవలసింది.    


ఈ నిస్వార్ధ సేవకుల పేర్లు ఎక్కడా కనపడవు. వాళ్ళు చేసే ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకి ప్రజలు హారతి పడతారని చేయటం లేదు. ధనవంతులవుతారని చేయటం లేదు. మనుష్యులుగా పుట్టినందుకు, మనుష్యులుగా జీవించటం కోసం చేస్తున్నారు. మానవ సౌభాతృత్వం కోసం చేస్తున్నారు. మనం చేయగలిగిందల్లా, అలాటి వారిని గుర్తుపెట్టుకుని గౌరవించటం! వారి బాటలో నడవటం! 

*****

bottom of page