top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సత్యాన్వేషణ

సత్యం మందపాటి

వైద్యో నారాయణో హరిః

ఈమధ్య టీవీ చూస్తుంటే, వెంటనే నా దృష్టిని ఆకర్షించినది ఒక మందుల ప్రకటన.

అదేదో డయబీటిస్ మందు. దాంట్లో నాకు నచ్చని ముఖ్యంగా మూడు అభ్యంతరాలు.

మొదటిది వాళ్ళు ముందే చెప్పారు, ఈ ప్రకటనలో కనపడేవారు నటులు, నిజమైన రోగులు కాదు అని.

ఆ ప్రకటనలో కనపడ్డ ఒకావిడ, ఒకాయన మాత్రం మహా గొప్ప నటులు.

“నాకు మధుమేహ వ్యాధి పదేళ్ళుగా వుంది. ఎంతో బరువు తగ్గిపోయాను. ఆరోగ్యం పాడయిపోతున్నదని ఒకటే బెంగగా వుంది. మొన్ననే మా డాక్టర్ ఈ ‘డంకుఢమా’ అనే మాత్రలు వ్రాసి ఇచ్చాడు. నిన్ననే ఒక మాత్ర వేసుకున్నానా, నా వ్యాధి ఇవాళే ఇట్టే తగ్గిపోయింది. మళ్ళీ ఒక మామూలు మనిషినయాను. మీరు కూడా మీ డాక్టర్ని వెంటనే కలిసి ‘డంకుఢమా’ మాత్రలు వ్రాసివ్వమని చెప్పండి’ అన్నది ఆవిడ ముఖమంతా నవ్వు పులుమేసుకుని.

తర్వాత వచ్చిన నటుడు కూడా తన పాత్రలో జీవించి, ‘తను చచ్చిపోబోతుంటే, డాక్టర్ అప్పుడే పోవద్దని చెప్పి ఈ ‘డంకుఢమా’ మాత్రలు వ్రాసి ఇచ్చాడనీ, అవి వేసుకోగానే తన వ్యాధి డభేల్మని పారిపోయిందని, తనని నమ్మాలనీ, మీ డాక్టర్ని కూడా కలిసి ఈ మందే వాడమనీ’  గొప్పగా నటించి మరీ చెప్పాడు.

అంటే నటుల చేత వాళ్ళే నిజమైన రోగులుగా నటింప చేసి, మాటలూ పాటలూ వ్రాసి, వారికి ఈ మందుతో వ్యాధి తగ్గిపోయి, వైకుంఠ ప్రాప్తి జరిగినట్టు చెబుతున్నారన్నమాట. ఇది నా మొదటి అభ్యంతరం. అంటే ఈ ప్రకటనలో నిజం ఎంతవుందో నేతి బీరకాయలో నెయ్యి అంతే వుందన్నమాట!

చిన్న పిల్లలు ఏ బొమ్మనో, తాయిలాన్నో టీవీలో చూసి, వాళ్ల నాన్నని అడిగి కొనుక్కున్నట్టు, డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ వ్రాయించుకుని, మింగమని చెబుతున్నారు. ఇదే నా రెండవ అభ్యంతరం.

ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, మెడిసిన్ కాకుండా ఇంజనీరింగ్ చదివిన నాకన్నా, నాలాటి వారికన్నా, అది చదివిన డాక్టర్లకే ఏ మందు మంచిదో, రోగ నిర్ధారణకు ఏ మందు సరైనదో తెలుస్తుంది. కానీ నేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ‘డాక్టర్ గారూ, డాక్టర్ గారూ. నాకు ఈ మందు వ్రాసి ఇవ్వరూ. టీవీలో చూశాను, ఒకాయనకీ, ఒకావిడకీ అట్టే వేసుకుంటే, ఇట్టే తగ్గిపోయింది!’ అని ఎలా చెప్పను?

ఇక మూడో అభ్యంతరం ఏమిటంటే, ఆ ప్రకటన పూర్తిగా పూర్తవకుండానే, నిశ్శబ్దంగా వెడుతున్న బులెట్ ట్రైన్ లాగా - వినపడీ వినపడకుండా, కనపడీ కనపడకుండా, మనవేపు ఎక్కాలు బట్టీ పట్టి - రెండొకట్లు రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండ్మూళ్ళారు, రెంణాళ్ళెనిమిది.. అని అప్పజెప్పే కుర్రాడిలా ఒకాయన గబగబా మూడు వందల ఇరవై మైళ్ళ స్పీడులో చెబుతున్నాడు. ఏమని?

‘మీరు ఈ మందు వేసుకుంటే మీకు జలుబూ, తుమ్ములూ రావచ్చు, కాలు నొప్పీ, కీలు నొప్పీ రావచ్చు, కంటి నొప్పీ, తుంటి నొప్పీ రావచ్చు, రక్త ప్రసరణ తగ్గితే తగ్గవచ్చు, పెరిగితే పెరగవచ్చు, నోట మాట రాకపోవచ్చు, నోటి పళ్ళు రాలిపోవచ్చు, బరువు పెరగా వచ్చు, తరగా వచ్చు, గుండె లబ్ డబ్ అనక పోవచ్చు, దరిమిలా ఆగి పోవచ్చు, మీరు పోనూ పోవచ్చు...’ ఇలా అర్ధమయీ అవకుండా చకచకా చెప్పేసి, అదరగొట్టేశాడు.

ఇవన్నీ విన్నాక ఎవరూ ఆ ‘డంకుఢమా’ మాత్రలు ధైర్యంగా వేసుకుంటారని అనుకోను.

ఇలాగే ప్రతి మాత్ర వెనుకా, ఒక చక్కటి పరిష్కారంతో పాటూ, ఎన్నో ‘పక్క వాయింపులు’ (ఆంగ్లంలో సైడు ఎఫెక్టులు అంటారుష!) వుంటూనే వున్నాయి. ఒకావిడకి సిగ్గు పడకుండానే, బుగ్గలు ఎర్రపడిపోతుంటే, వాళ్ళ డాక్టర్ ఆ మందు మార్చి ఇంకో మందు ఇచ్చాడు. వెంటనే బుగ్గల్లో ఎరుపురంగు మాయమయింది.

ఉన్నట్టుండి నా మిత్రుడి బరువు ఎనిమిది కిలోలు పడిపోయింది. ఎంతో సమయం, డబ్బులు, శ్రమా ఖర్చు పెట్టి, తల నించీ, కాలి చిటికెన వ్రేలు దాకా స్కాన్ చేయించి, అంతా బాగానే వుందని నిర్ధారించుకున్నారు వైద్యులవారు. డాక్టర్ ఏమీ అర్ధంకాక బుర్ర గోక్కుంటుంటే, మా మిత్రుడికి ఏంచేయాలో తెలియక, ‘మరి బరువెందుకు తగ్గానమ్మా’ అని ఆయన గూగులమ్మని అడిగాడుట. ‘చీమా, చీమా నన్నెందుకు కుట్టావు?’ అని అడిగితే, ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే మరి కుట్టనా’ అందని నేను చిన్నప్పుడు చదువుకున్నకథలోలాగానే, గూగులమ్మ ‘నువ్వేసుకునే మందుకి అది పక్క వాయింపు, ఆ మందు కొట్టటం మానేస్తే అన్నీ సద్దుకుంటాయి’ అందిట. ఆయన ఆ మందు మానేయగానే, మళ్ళీ నెల రోజుల్లో గాలి కొట్టిన బెలూనులా తయారయాడు.

                   ౦                           ౦                           ౦

అంతేకాదు, ఈ మందుల కంపెనీ వాళ్ళు – సహజ నివారణకు ఎన్నాళ్ళ నించో వాడుతున్న పదార్ధాలు వాడకుండా, వాటిని విస్మరించమని చెప్పటం కూడా చూస్తూనే వున్నాం. ఉదాహరణకి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అలాగే పసుపు ఆంటీ సెప్టిక్. మనకి అవేమీ పనికిరావనీ, అమ్మమ్మ వైద్యాలనీ చెప్పే ఫార్మా కంపెనీలు, చడీ చప్పుడూ లేకుండా గార్లిక్ మాత్రలూ, పసుపు మాత్రలూ అమ్ముతున్నాయి. అలాగే వేల సంవత్సరాలుగా వాడుతున్న, పసుపుకి మెడిసినల్ వాల్యూ వుందని, దాన్ని అమెరికాలో పేటెంట్ చేసేసింది ఒక కంపెనీ.

ఈ మందులు తయారు చేసే కంపెనీల వాళ్ళు కొంతమంది ఈమధ్యనే చేసిన గొప్ప పనేమిటయ్యా అంటే..

     

గ్లాస్కో స్మిత్ క్లైన్ అనే కంపెనీ న్యాయ విరుధ్ధంగా, చెప్పవలసినవి రహస్యంగా వుంచేసి, దాచేసి మోసం చేసేసి మందులు అమ్ముతున్నదని, శ్రీన్యాయస్థానం వారు వారికి మూడు బిలియన్ డాలర్ల జరిమానా విధించారు. 

ఫైజర్ అనే కంపెనీ వారు, మీకంటే మీమే ఎక్కువ మందు కొట్టాం అని, అచ్చంగా అలానే చేస్తే, వారిని కూడా శ్రీన్యాయస్థానం వారు రెండున్నర బిలియన్ డాలర్ల జరిమానాతో సత్కరించారు.

మరి మేమో అంటున్న మెర్క్ కంపెనీ వారిని కూడా, మరీ చిన్నబుచ్చలేక, వారి మందులు అమ్మటానికి డాక్టర్లకి లంచాలు ఇచ్చిన కారణంగా అక్షరాలా ఆరు వందల యాభై మిల్లియన్ల డాలర్ల ఫైన్ విధించారు.

ఒక మందుల కంపెనీ యజమాని, తన మందుల ధర అకారణంగా ఆరు వేల శాతం పెంచేసి, పట్టుబడి, జైలుకి వెడుతుంటే, ‘చెరసాల పాలైనావా...’ అని నేపధ్యంలో పాత పాట పాడాల్సివచ్చింది.

ఇలా ఎందరో మందుభాయిలు. అందరికీ జరిమానాలు.

                   ౦                           ౦                           ౦       

ఇది ఇలా వుండగా.. నా స్వానుభవం ఎలా వుందయ్యా అంటే..

పాతికేళ్ల క్రితం. అంటే నేను యాభయ్యో పడిలో పడటానికి, ఇంకో రెండేళ్ళు పడుతుందనగా..

మా ఇంటి దగ్గరే వున్న ముగ్గురు (మరాఠీలు కాదు, తెలుగు వాళ్ళే) – పాతిక/ముఫై ఏళ్ళ కుర్రవాళ్ళతో టెన్నిస్ ఆడేవాడ్ని. కొత్త పిచ్చాడు పొద్దెరగడని, శనాదివారాలు ప్రోద్దున్న ఏడున్నర నించీ, మధ్యాహ్నం పన్నెండు దాకా ఆడేవాళ్ళం. వాళ్ళు ఇంకా వుడుకు రక్తంతో వున్న కుర్రాళ్ళు, నేనేమో తెల్ల జుట్టుకి నల్లరంగు వేస్తున్న పెద్ద మనిషిని. అయినా ఉత్సాహంగా ఆడుతుండేవాడిని.

ఒకానొక దుర్ముహూర్తాన, నెట్ దగ్గర జారి పడుతున్న బంతిని పరుగెత్తుకుంటూ వచ్చి, అవతలి కోర్టుకోకి పంపించి ఆట గెలిచానని ఆనందపడే సమయాన, బోర్లా పడిన నేను మళ్ళీ పైకి మాత్రం లేవలేదు. నా నడుము నువ్విక సరిగ్గా నడవలేవు బాబూ అంది. మర్నాడే మా కుటుంబ వైద్యులవారి దగ్గరికి వెడితే, ‘ఏం సరదాగా వుందా, నా దగ్గరికి వచ్చావు. స్పెషలిస్టుని కలవాలి’ అని అక్కడికి పంపించారు. ఆయన ఆర్థోపీడిక్ సర్జనుడు. రావటమే చేతిలో కత్తి నూరుకుంటూ వచ్చాడు. (నిజం చెప్పొద్దూ.. మా పెళ్ళయిన కొత్తల్లో గుడివాడలో మా అత్తారింట్లో నాకు గడ్డం చేసే వెంకటేశ్వర్లు గుర్తుకి వచ్చాడు)

ఎక్స్ రే చూడగానే ఠక్కున చెప్పేశాడు. ‘నీకు నడుం విరిగింది. రేపు ప్రొద్దున్నే ఆపరేషన్ చేయక పోతే చాల కష్టం’ అన్నాడు.

‘అమ్మో.. నాకు ఆపరేషన్ అంటే చచ్చే భయం’ అన్నాను.

‘ఆపరేషన్ చేయకపోతే అదే నీకు చివరకు మిగిలేది’ అన్నాడు సర్జనుడు.

అతను అలా అంటుండగానే ఒక నరసమ్మగారు వచ్చి, ‘రేపు ప్రొద్దున్నే ఏడింటికి వచ్చేయండి. ఆపరేషన్ చేసేద్దాం. టేబులూ, కత్తులూ, కఠార్లూ అన్నీ రెడీగా వున్నాయి. అదయాక కొన్నాళ్ళు హాస్పిటల్లోనే వుండాలి. థెరపీ అదీ వుంటుంది కదా’ అని ఒక ముఫై పేజీల పుస్తకం నా చేతిలో పెట్టి – ‘ఇదంతా చదవి అర్ధం చేసుకోవాలంటే యుగాలు యుగాలు పడుతుంది. అందుకని చదవకుండా ఇక్కడ మీ ఆటోగ్రాఫ్ పెట్టేయండి’ అన్నది పెన్ను ఇస్తూ.

 

ఊరికే అలా పేజీలు తిప్పుతుంటే, నా గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆపేసి, మళ్ళీ హడావిడిగా కొట్టుకోవటం మొదలు పెట్టింది. దాంట్లో ఏముందయా అంటే..

అసలు దాని పేరు డిస్క్లోజర్ లేదా డిస్క్లైమర్. అంటే తెలుగులో ‘నేను చెప్పేది నేను చెబుతాను. తర్వాత నీ అదృష్టం లేదా నీ దురదృష్టం’ అని.

‘అన్ని ఆపరేషన్లలోనూ వెన్నెముక ఆపరేషన్ చాల ప్రమాదకరమైనది. వెన్నెముక వెనకనే ఎన్నో నరముల సముదాయము వుండును. నేను ఆపరేషన్ చేసే సమయములో నా చెయ్యి కొంచెము వణికినచో, నేను ఎక్కువగా చేయి ఝాడించినచో, అది ఏ నరమునకో తగిలే అవకాశము కలదు. ఆ పిమ్మట కత్తివాటుకి ఆ నరము తెగే అవకాశము కూడా కలదు. ఆ నరము ఏ నరమో ఈ నర మానవునికి తెలియదు కనుక, మిమ్మల్ని ముందుగనే హెచ్చరించుచున్నాము. ఆ తెగిన నరముని బట్టి, మీకు చీమ కుట్టినంత నొప్పి నుంచీ, ప్రాణము పోవునంతవరకూ.. ఆ మధ్యన వున్న అన్ని అవాంతరములతో సహా- ఏమైనా జరగవచ్చును. అంటే మీకు కళ్ళు పోవచ్చును, మెదడు పని చేయకపోవచ్చును, పిచ్చెక్కవచ్చును, గుండె ఆగిపోవచ్చును.. ఏమైనా జరగవచ్చును. మాలో ఎవరము ఏమి తప్పు చేసినా, పోయేది మీ ప్రాణము కనుక మీకు ముందుగానే తెలియజేయటమైనది. అప్పుడు సంతకం పెట్టటానికి మీరు వుండకపోవచ్చు కనుక, మీరు ఇప్పుడే మీ సంతకం పెట్టగలరు. అంతేకాదు, అక్కడ బయట బల్ల మీద కూర్చున్న మీ ఆవిడతోనో, ఆవిడ పక్కనే కూర్చున్న పక్కింటి పిన్నిగారితోనో ‘ఇందుకు సాక్షులు’ అన్న చోట సంతకం పెట్టించగలరు’ అని సంక్షిప్తంగా ఆ కాగితాల సారాంశం.   

  

కురుక్షేత్రంలో అర్జనుడు దీనంగా కృష్ణుడిని చూసినట్టు, ఒకసారి ఆ సర్జనుడి వేపు చూశాను. నాకెందుకో అతనప్పుడు దుర్జనుడిలా కనపడ్డాడు.

అందుకే ‘నేను కొంచెం ఆలోచించుకుని సంతకం పెడతాను. ఆపరేషన్ చేయించుకోవటానికి కూడా, కొంచెం కన్నా ఎక్కువగానే ఆలోచించి నిర్ణయం తీసుకుని మళ్ళీ కలుస్తాను’ అని అసత్యం చెప్పి ఇంటికి వచ్చేశాను. 

తర్వాత రెండు రోజుల్లో ఇంకో స్పెషలిష్టుని కలిశాను. ఆయన వేరే హాస్పిటల్లో ఫిజికల్ థెరపిష్టుని చూడమన్నాడు. ఆవిడకి నలభై ఏళ్ళు వుంటాయేమో. తెల్లావిడ. మంచావిడ.

‘ఎవరు మీకు సర్జరీ చేయాలని చెప్పిన ఆ దుర్జనుడు? ఆపరేషనూ అఖ్ఖర్లేదు, గీపరేషనూ అఖ్ఖర్లేదు. మీ నడుమూ బాగానే వుంది. గిడుమూ బాగానే వుంది. మూడు నెలలు నేను మీకు థెరపీ చేసి, మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. మళ్ళీ టెన్నిస్ ఆడేలా చేస్తాను’ అని శపధం చేసింది, మంగమ్మగారిలా.

నా నడుము సంరక్షణ కోసం, నేను ఏవేమి చేయాలో, ఏవేమి చేయకూడదో, కారులోనూ ఆఫీసులోనూ ఎలా కూర్చోవాలో, ఎలా కూర్చోకూడదో, నా లంబార్ ఎముకలని ఎలా కాపాడుకోవాలో.. ఇలా ఎన్నో చూపించింది. కొన్ని ఎక్సరసైజులు నేర్పించింది. రోజుకి పదిసార్లు చేయమంది. వాటర్ ఏరోబిక్స్ కూడా చేయించింది.

ఆవిడ చెప్పినవీ, చెప్పనివీ అన్నీ తూచా తప్పకుండా మూడు నెలలు, అంటే తొంభై రోజులు చేశాను. నా నడుము నొప్పి పారిపోయింది.

పాతికేళ్ళ నించీ, అప్పటినించీ ఇప్పటిదాకా ఏమాత్రం నడుము నొప్పి రాలేదు. ఇది సత్యం. దాని తర్వాత మా ఆస్టిన్ నగరం నించీ, లాస్ ఏంజలిస్, డిట్రోయిట్, అట్లాంటా, మయామీ, యల్లో స్టోన్ మొదలైన వూళ్ళకి కొన్ని వేల మైళ్ళు కారు నడిపినా, నడుము నొప్పీ రాలేదు, గిడుము నొప్పీ రాలేదు.

                   ౦                           ౦                           ౦

అమెరికాలో జరిగే నడుము సర్జరీల్లో పదిహేడు శాతం పైన అనవసరంగా చేసేవేనని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా డాక్టర్లు, హాస్పిటళ్ళు నూటాభై ఏడు మిలియన్ల డాలర్లు ‘అఖ్ఖర్లేని’ ఆపరేషన్ల ద్వారా సంపాదిస్తున్నారుట. 2005 నించీ ఇప్పటిదాకా, కొన్ని వేల మంది సర్జనులు మాల్ ప్రాక్టీస్ పరిహారాలు చెల్లించారుట.

                   ౦                           ౦                           ౦

అమెరికాలో జరుగుతున్నంత మెడికల్ రీసెర్చి ఇంకే దేశంలోనూ జరగటం లేదు. అమెరికాలో కనిపెట్టిన, కనిపెడుతున్న మెడికల్ పరీక్ష పరికరాలు, వైద్య పరికరాలు ఎన్నో ఎన్నెన్నో ఆసుపత్రులకు చేరుతున్నాయి. అలాగే మందుల తయారీ. ఎన్నో రకాల మందులు. ఎన్నో రకాల హాస్పిటల్స్. అక్కడ రోగులకు ఇచ్చే వైద్య సహాయం. సదుపాయాలు. అన్నీ ఎంతో గొప్పగా వుంటున్నాయి.

మరి అమెరికన్ ప్రజలు ఎంతో అదృష్టవంతులు కదూ..

పప్పులో కాలు వేశారు... కాదు. ఆ అదృష్టం కొద్ది మందిదే.

బాగా డబ్బులున్న వారికీ, ఉద్యోగరీత్యా మంచి ఇన్స్యూరెన్స్ వున్నవారికీ ఏ ఇబ్బందీ లేదు.

ఆ రెండూ లేనివారే అమెరికా జనాభాలో ఎక్కువ.

‘అంగట్లో అన్నీ వున్నాయి, అల్లుడి నోట్లో శని’ అన్నట్టుగా వైద్యరంగంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ దేశంలో, సామాన్య ప్రజలకు వైద్య సదుపాయాలు ఏమాత్రం అందుబాటులో లేవు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎఫోర్డబుల్ హెల్త్ కేర్ ఏక్ట్ తీసుకు వచ్చి, దాదాపు నలభై మిలియన్ల ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాడు.

‘లింగడు అద్దంకి పోనూ పోయాడు, రానూ వచ్చాడు’ అన్న సామెతలా, ఆ వచ్చినది అలాగే రిపబ్లికన్ ఆశల పార్టీ వారి ‘ధర్మమా’ అని అలానే ఎగిరి పోయింది.

మళ్ళీ నలభై మిలియన్ల ప్రజలకు వైద్య సదుపాయాలు కరువై పోయాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని నూట తొంభై దేశాలలో ఫ్రాన్స్, ఇటలీ, శాన్ మరీనో, ఆండోరా, మాల్టా దేశాలు ప్రజలందరికీ ఉచిత వైద్య సదుపాయాలు అందించి, ప్రపంచ దేశాలన్నిటిలోనూ మొదటి ఐదు స్థానాల్లో వున్నాయి.

ప్రపంచంలోనే ఎంతో ధనవంతమైన అమెరికా ముఫై ఏడవ స్థానంలో వుంది.

మన ఇండియా నూట పన్నెండవ స్థానంలో వుందనుకోండి. అదిక్కడ అనవసరం.   

అమెరికాలో వైద్య సదుపాయాలు ఇంత ఖరీదుగా వుండటానికి కారణం, మెడికల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు, మందులు తయారు చేసే కంపెనీలు, హాస్పిటల్సూ, వారి అత్యాశ, వారిచ్చిన డబ్బులు జేబులో వేసుకుని, వారికి మద్దతునిచ్చే ప్రభుత్వ సెనెటర్లూ, కాంగ్రెస్ సభ్యులూ.

సమయానికి సరైన వైద్యం అందక ఎందరో దరిద్ర నారాయణలు హరీ మంటున్న దేశం అమెరికా!

                             ౦                 ౦                 ౦       

నేను చూస్తున్న నిజాలని నిజంగా చెబితే నిష్టూరంగా వుంటుందేమోనని, ఇది కుసింత హాస్యంగా చెప్పటానికి ప్రయత్నం చేసినా, నిజం నిజమే కదా! నిష్టూరం నిష్టూరమే కదా!

మరి సత్యం అని పేరు పెట్టుకుని అబధ్ధం ఆడితే బాగుండదు కదూ!

                                     ౦                  ౦                  ౦

bottom of page