MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
సత్యాన్వేషణ
సత్యం మందపాటి
గోవులు గర్జించేదెప్పుడు?
వాళ్ళల్లో వాళ్ళు సరదాగా యుద్ధాలు చేసుకునే ఆటలు ఆడుకుంటున్న కొందరు రాజులు, మహారాజులు, ఆరోజుల్లో వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాడిని, తమ కిరీటాల పక్కనే నెత్తి మీద పెట్టుకుని, ఒక రాజు మీద ఇంకో రాజుని ఉసి గొలిపే ఆటలు కూడా ఆడటం మొదలుపెట్టారు. ఈ ఆటల్లో బలవంతులు గెలవటం, బలహీనులు ఓడటం సహజం కదూ. అందుకని బలహీనులకి ఒక అండాదండా కావలసి వచ్చింది. దానికోసం దండ పట్టుకుని తిరుగుతుంటే, బ్రిటిష్ వాడు తెల్లగా బుర్రగా చంకలో తుపాకీతో కనపడ్డాడు.
‘దొరికిన ఒక్క రొట్టెముక్కనీ రెండు పిల్లులు ఎలా భాగాలు చేయాలో తేల్చుకోలేక కోతిని సహాయం అడిగిన తెలుగు కథ’ ఆ ఇంగ్లీషు వాడికి కూడా తెలుసుట. అందుకని, ‘సరే ఎలాగూ నెత్తి మీద ఎక్కాం కదా ఇక దిగటం ఎందుకులే’ అని వాడు మహారాజుల తలల మీదనించీ క్రిందకి దిగలేదు. దిగకపోగా అక్కడే బాగుందని, వాళ్ళ తలపాగా మీద పాగా వేసి, చాప క్రింద నీరులా దేశమంతటా ఆక్రమించాడు. దానితో భారతదేశం రెండు వందల సంవత్సరాల ‘బ్రిటిష్ రాజ్’ అయిపోయింది.
ఆ రెండు వందల సంవత్సరాల్లో సగటు భారతీయుడిని బానిసగా చేసుకుని, తమ కాలి క్రింద పెట్టుకున్నారు. వజ్రాలు, సుగంధాలు, బంగారంతో పాటు మన దేశ సంపదనంతటినీ పూర్తిగా దోచుకున్నారు. జనం చేత ఊడిగం చేయించుకున్నారు. అంతటితో ఆగలేదు. లేనిపోని శిస్తులు పెట్టి రైతులని అణగదొక్కారు. ఎదురు తిరిగిన ప్రజలని, ఎవరైనా సరే, నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ప్రార్ధన చేసుకుంటున్న వందల కొద్దీ సిక్కు మతస్తులని జలియన్వాలా బాగులో తలుపులు మూసి మరీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేశారు. శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం చేస్తున్న సాధారణ ప్రజానీకాన్ని తూటాలతో తుడిచిపెట్టేసారు. సైమన్ కమిషన్ చేస్తున్న అత్యాచారాలని ఖండించిన వారి జీవితాలని అక్కడికక్కడే అంతం చేసారు. తన అహింసా సిధ్ధాంతాన్ని విడనాడని మహాత్ముడి దగ్గరనించీ, స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న పటేల్, గోఖలే, తిలక్, అజాద్, ప్రకాశం, భోగరాజు, సరోజిని మొదలైన కార్యకర్తలతో సహా, మారు మూలల వున్న మామూలు మనుష్యుల దాకా జైళ్ళ పాలయారు.
అప్పుడే గోవులు గర్జించాయి!
బ్రిటిష్ వాడి వాడి తగ్గేదాకా ఆ గర్జన ఆగలేదు!
ఏమీ చేయలేని పరిస్థితిలో రవి అస్తమించని సామ్రాజ్యం, ఇండియాలో అస్తమించింది.
భారతదేశం స్వతంత్ర భారతదేశం అయింది.
అందమైన మూడు రంగుల భారత పతాకం స్వేచ్ఛగా భారత దేశంలో తల ఎత్తుకుని మరీ రెపరెపలాడింది.
౦ ౦ ౦
అంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇంగ్లండ్, యూరప్ దేశాలలోని తెల్లవాళ్ళు ఆఫ్రికాలోని నల్లవారిని బానిసలుగా తెచ్చుకుని, వారిని సాటి మనుష్యులని మరచిపోయి ఎంతో హింస పెట్టారు. చచ్చేంత చాకిరీ చేయించుకున్నారు. పని చేసి, చేసి, చేసి అలసిన వారి వీపుల మీద కొరడా దెబ్బలు కురిపించారు.
అప్పుడే కొలంబస్ అనే ఒక సముద్రపు దొంగ యూరప్ నించీ ఇండియాలోని బంగారాన్నీ, వజ్రాలనీ, సిల్కు వస్త్రాలనీ సుగంధాలనీ దోచేయాలని, ఇండియా వున్న తూర్పు దిశ ఎక్కడ వుందో తెలియక, దిక్కు తోచక పడమటి దిశగా వెళ్లి అమెరికా దేశాన్ని కనుక్కున్నాడుట! దానితో తెల్లవాళ్ళ నివాసానికి ఇంకొక దేశమే కాదు, అమెరికా ఖండమే దొరికింది. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా వున్న స్థిర నివాసుల్ని అణగదొక్కి, అడ్డం వచ్చివారిని అడ్డంగా కోసేసి, మొత్తం అమెరికా ఖండాన్నే ఆక్రమించుకున్నారు తెల్లవారు. అంతేకాదు అక్కడ వున్న స్థిర నివాసుల్ని, కొలంబస్ దయ వల్ల, ఇండియన్స్ అని కూడా ఈనాటికీ పిలుస్తూనేవున్నారు.
ఆక్రమించుకున్నాక, మరి అప్పనంగా వచ్చిన అన్ని కోట్ల ఎకరాల భూమిని సాగు చేయటానికీ, వారి సుఖాలకి తగ్గట్టు బానిసత్వం చేయటానికీ, ఆఫ్రికానించీ మళ్ళీ ఇంకొంతమంది నల్లవారిని తెచ్చుకున్నారు. వారి చేత ఎంత పని చేయించుకున్నా, బానిసలు కనుక వారిని మనసు వున్న మనుష్యులుగా చూడలేదు. ఆరోజుల్లోని ఒక్కొక్క నల్లవాడి వీపు మీద, ముఖం మీదా, శరీరమంతటా వున్న కొరడా దెబ్బలు వాటికి సాక్షి. అంటరానివారుగా వున్నా, నల్ల ఆడవారి మీద తెల్ల దొరలు చేసిన ఎన్నో మానభంగాలు సాక్షి.
నల్లవారి బానిసత్వం కథల పుస్తకాలు చదివిన రోజున, వాటి ఆధారంగా తీసిన సినిమాలు చూసిన రోజున నాకు నిద్రపట్టదు. ఒళ్ళు ఉడికిపోతుంటుంది. తెల్లవారు తినే చోట నల్లవారు తినకూడదు. తెల్లవారు ఎక్కే వాహనాలలో నల్లవారికి ప్రవేశం లేదు. వున్నా కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి. మన మాల పల్లెలలాగా, అమెరికాలోనూ నల్లవారి నివాసాలు దూరంగా ఎక్కడో వుండేవి. ఆఖరికి అన్నిచోట్లా తెల్లవారి మరుగుదొడ్లు వేరు. అక్కడ నల్లవారికి ప్రవేశం లేదు. నల్ల వారికే కాదు, యాభై ఏళ్ళ క్రితం దాకా భారతీయులతో సహా ఇతర శరీరపు రంగులవారికి ఎవరికీ ప్రవేశం లేదు.
శతాబ్దాల క్రితం క్రిస్పస్ అట్టుక్స్, గాబ్రియల్ ప్రొస్సర్, డెన్మార్క్ వెసీ, హారియట్ టబ్మన్, ఫ్రెడ్రిక్ డగ్లస్, మొదలైన నల్లవారు, హక్కుల సంగతి సరేసరి, కనీసం సాటి మనుష్యులుగా చూడమని ఎంత పోరాడినా వారిని ఖాతరు చేయలేదు. వీరిలో కొంతమందిని చంపేశారు కూడాను. అబ్రహాం లింకన్ సివిల్ రైట్స్ న్యాయ సమ్మతం చేసాక, దక్షిణాది రాష్ట్రాలు ఏడు కన్ఫెడరేషన్ రాష్ట్రాలుగా మారి, నల్లవారిని ఇంకా ఎక్కువగా ఊచకోత కోయటం ప్రారంభించాయి. కేకేకే మొదలైన సంస్థలు శ్వేతజాతి ఆధిక్యతకి రక్షణ దళాలుగా మొలకెత్తాయి.
అమెరికాలో ఇలా జరుగుతుంటే, దక్షిణాఫ్రికాలో తెల్లవారు నల్లవారి మీద సంఖ్యలో ఎంతో తక్కువయినా, వారిని కాలి క్రింద తొక్కిపట్టారు. మారణహోమం చేయసాగారు.
అప్పుడే గోవులు గర్జించాయి!
అమెరికాలో ఇ.డి.నిక్సన్, బుక్కర్ వాషింగ్టన్, క్లాడేట్ కోల్విన్, జాన్ కేనన్, రోసా పార్క్స్, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ మొదలైన కార్యకర్తలు ముందుకు వచ్చి ఉద్యమం నడిపించారు. మహాత్మా గాంధీ నడిపించిన ఆహింసా వాదమే మార్టిన్ లూథర్ కింగ్ పాటించిన మార్గం. ఆ శాంతి యుద్ధంలో ఎందరో ప్రాణాలర్పించారు. ఈ మానవతా యజ్ఞంలోనే, వారికి అండగా నిలిచిన రాబర్ట్ కెన్నెడీలాటి వారు కూడా బలి అయిపోయారు.
దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా, ఒల్వెడా ఎక్విన్, డెస్మండ్ టుటు మొదలైన గాంధేయుల నాయకత్వంలో మానవత్వం కోసం యజ్ఞం మొదలయింది. అక్కడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు
గోవుల గర్జన ఆగలేదు!
అమెరికాలో ప్రెసిడెంట్ జాన్సన్ నల్లవారికి సమాన హక్కులు ఇస్తూ కాగితం మీద సంతకం పెట్టె దాకా ఆ గర్జన ఆగలేదు!
దక్షిణ ఆఫ్రికాలో నల్లవారికి పార్లమెంటులోనూ, సమాజంలోనూ సమాన స్థానం వచ్చేదాకా ఆ గర్జన ఆగలేదు!
౦ ౦ ౦
ఆనాడు కన్యాశుల్కం నాటకంలో గురజాడవారు ‘తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి’ అని చెప్పినట్టు, బ్రిటిష్ వాడు వెడుతూ వెడుతూ, ‘స్వరాజ్యం ఇచ్చాం. ఇక కొట్టుకు చావండి’ అని వెళ్ళిపోయాడు.
ఏదో మన రెండు వందల సంవత్సరాల బాసుగాడు చెప్పాడు, వినకపోతే బాగుండదని ‘అలాగే సార్!’ అన్నాం. అని ఇచ్చిన మాట తప్పని హరిశ్చంద్రులం కనుక, డెభై ఏళ్ళనించీ కొట్టుకు చస్తున్నాం.
కులాల కురుక్షేత్రం యధాశక్తి కొనసాగిస్తున్నాం. కొనసాగించటమే కాదు, అదే ప్రాణవాయువుగా పీలుస్తూ జీవిస్తున్నాం.
మతాల మారణహోమం ఏమాత్రం ఆగకుండా జాగ్రత్త పడుతున్నాం.
రాజకీయాలని బాగా కుళ్ళబెట్టి ఆ రొచ్చుగుంట దుర్గంధాన్ని ఆనందంగా పీలుస్తూ శ్వాసకోశాల్లో బంధిస్తున్నాం.
లంచాలు, కల్తీలు, బంధుప్రీతి, అస్మదీయుల అభిమాన సంఘాలు, తస్మదీయుల దురభిమాన దౌర్జన్యాలు ఎక్కువయిపోయాయి. బాధ్యతల్ని పూర్తిగా మరచి హక్కుల కోసం పోట్లాడుతున్నాం. మనిషికీ మనిషికీ మధ్య గీతలు గీసుకుని విడిపోతున్నాం. స్త్రీలని, బలహీనుల్ని అణగత్రొక్కటం, కులాల పేరుతో కోటాలు పెట్టి సమర్ధతని వెనక్కి నెట్టటం, చదువులని విజ్ఞానం కోసం కాక బజార్లో అమ్మకానికి పెట్టటం ఎక్కువయింది. దౌర్జన్యం, రౌడీయిజం, పట్టపగలే రోడ్డు మీద హత్యలు, మానభంగాలతో శాంతియుత సమాజానికి వలువలు విప్పి, విలువలు లేకుండా చేస్తున్నాం. ప్రభుత్వాలే ఎక్కడపడితే అక్కడ లాభాల కోసం పీపాలతో మద్యం అమ్ముతూ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటున్నారు. సెక్సూ, దౌర్జన్యం, కులం, హింసాకాండలతో మన సినిమాలకి రక్త సిందూరం పెట్టి, యువతని తప్పుదారి పట్టిస్తున్నాం. నిర్వీర్యం చేస్తున్నాం.
ప్రపంచంలోనే ఎక్కువ జనాభాగల దేశం కదా మనది, మరి వంద కోట్ల పైన వున్న జనం ఏం చేస్తున్నారు?
శ్రీశ్రీగారు అన్నారు – సముద్రంలో స్నానం చేద్దామని వెళ్ళాడుట ఒక పెద్ద మనిషి. అక్కడే అలాగే నుంచుని వుంటాడుట కానీ, ఎన్ని రోజులయినా సముద్రంలో దిగడు. అదేమిటయ్యా అంటే సముద్రంలో అలలు వున్నాయి, అవి తగ్గాక స్నానం చేస్తానన్నాడుట. సముద్రంలో అలలు తగ్గటం అంటూ వుండదు. అది దాని లక్షణం. అలాగే వున్నారు మన ప్రజలు అన్నారు ఏనాడో శ్రీశ్రీ. అప్పటినించీ ఇప్పటి దాకా అది ఏమాత్రం మారినట్టు లేదు.
‘సంభవామి యుగే యుగే!’ అని కృష్ణ భగవానుడి ఉవాచ.
మరి ఈ యుగంలో దిగి వచ్చే ఆ ‘హీరో’ కోసం తలుపు దగ్గర, మన జనం ఇంకా ఎదురు చూస్తున్నారేమో!
‘If you want to see a change, you be the change’ అన్నారు మహాత్మా గాంధీ.
‘గాంధీగారా? ఆయనెవరు?’ అనే స్థితిలో వుంది మన యువత!
‘ఏ బృహత్కార్యమైనా ఒక్కడితోనే మొదలవుతుంది’ అని చరిత్ర చెబుతోంది.
భలేవాళ్ళే, మనం చరిత్ర పుస్తకాలు చదవం కదా!
అయితే మరి, మళ్ళీ గోవులు గర్జించేదెప్పుడు?
౦ ౦ ౦
మేము మూడు, నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా వచ్చే సమయానికి, ఇక్కడ సమాజంలో చాల మంచి మార్పులు వచ్చాయి. ఆరోజుల్లో అమెరికాలో ఎక్కువమంది భారతీయులు వుండేవారు కాదు. తెలుగువారే చాల తక్కువ. ఏ భారతీయ భాష వినపడ్డా, వెనక్కి తిరిగి వారితో పరిచయం చేసుకునే వాళ్ళం. ఇండియా నించీ వచ్చిన ఇంజనీర్లంటే మంచి ఉద్యోగులు అనే నమ్మకం ఎక్కువగా వుండేది. ఆరోజుల్లో మాకు ఉద్యోగాలు తొందరగానే వచ్చేవి. మా ఇళ్ళ దగ్గర కూడా పక్కింటి అమెరికా పిన్నిగారితోనూ, ఎదురింటి ఎడ్వర్డ్ గారితోనూ బాగా కలిసిపోయేవాళ్ళం.
అక్కడక్కడా, ముఖ్యంగా మా టెక్ససులో డిస్క్రిమినేషన్ వుండేది కానీ, పైకి అంతగా కనపడేది కాదు. అది నాకెప్పుడూ అడ్డు రాలేదు. మన పిల్లలకి స్కూల్లో మంచి పేరు వుండేది. మేము ఊహించుకున్న అమెరికా, వుంటున్న అమెరికా ఒకేలా వుండటంతో జీవితం హాయిగా వుండేది.
దరిమిలా పరిస్థితులు మారిపోయాయి. ఇండియాలో మనకి స్వతంత్రం తెప్పించి, దేశంలో స్వేఛ్చావాయువులు తెప్పించిన కాంగ్రెస్ పార్టీ ఎలా భ్రష్టు పట్టి దేశ వినాశనానికి కారణం అయిందో, అదేవిధంగా అమెరికా దేశాన్ని చక్కటి రాజ్యాంగంతో ఇంత గొప్పగా ముందుకు తీసుకువెళ్ళిన గ్రాండ్ ఓల్డ్ రిపబ్లికన్ పార్టీ కూడా అంతకన్నా భ్రష్టు పట్టింది. గత తొమ్మిది ఏళ్ళల్లో అమెరికాని ఒక శతాబ్దం వెనక్కి తీసుకువెళ్ళింది.
రెండు వందల నలభై సంవత్సరాల అమెరికా చరిత్రలో, తెల్లవాళ్ళు తప్పితే నల్లవాళ్ళు పెద్ద పెద్ద పదవులకి రాని ఈ దేశంలో, మొట్టమొదటిసారిగా, ఒక నల్ల వ్యక్తి అధ్యక్షుడు కావటం కొంతమంది రిపబ్లికన్ పార్టీకి చెందిన శ్వేత జాతీయాహంకారులకి నచ్చలేదు. ఆయనకి ప్రతి విషయంలోనూ ఏ పనీ చేయనీయకుండా యధాశక్తి అడ్డుపడ్డారు. అయినా ఆయన ఎదురీది, పూర్తిగా దిగజారిపోయిన ఆర్ధిక పరిస్థితిని మెరుగు చేయటం, వైద్యం అందుబాటులో లేని కొన్ని మిలియన్ల సామాన్య ప్రజానీకానికి మొట్టమొదటిసారిగా మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇవ్వటం, నిరుద్యోగాన్ని తగ్గించి ఎంతోమందికి ఉపాధి కల్పించటం, ప్రపంచ దేశాలతో స్నేహంగా వుంటూ సమస్యలు పరిష్కారం చేసి అనవసరంగా యుధ్ధాలకి కాలు దువ్వక పోవటం, మిగతా దేశాల వద్ద అమెరికా గౌరవాన్ని పెంచటంలాటి ఎన్నో మంచి పనులు చేసి, అమెరికా చరిత్రలోనే ఒక గొప్ప ప్రెసిడెంట్ అయాడు. దానితో ఆ జాత్యహంకారులు అసూయతో తట్టుకోలేకపోయారు. అమెరికాలో తెల్లవారిలోని అధిక సంఖ్యాకుల గురించి నేను చెప్పటం లేదు. వారు నిర్మించిన ఆ స్నేహపూరిత వాతావరణం వల్లనే, మనందరం ఈనాడు అమెరికాలో వుంటున్నాం. ఈ జాత్యహంకారుల సంఖ్య తక్కువే అయినా, మనందరికీ తెలుసు ఒక గ్లాసెడు పాలలో, ఒక్క చుక్క విషం కలిపితే ఏమవుతుందో. ఇప్పుడు అదే జరిగింది. జరుగుతున్నది.
నల్లవారు, మెక్సికన్లు, ముస్లిములు, ఎన్నో ఇతర దేశాలవారు, అమెరికా కోసం రకరకాల యుధ్ధాలలో పాల్గున్న అమెరికన్ పౌరులు అంటే ఏమాత్రం గౌరవం లేని ఒకాయన పదవిలోకి వచ్చాడు. ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయకపోయినా, రాజ్యాంగంలో వున్న కొన్ని వెసులబాటులని ఆశ్రయించి అధ్యక్షుడు అయాడు. దానికి డేవిడ్ డూక్ లాటి కేకేకే సంస్థ నాయకుల సహాయం ఎంతో వుంది. ఇదేమీ రహస్యం కాదు. ఎన్నోచోట్ల సభల్లో, ఆయన కాబోయే అధ్యక్షుడి పక్కనే నిలబడి ప్రచారం చేశాడు. అంతేకాదు ఆయన పదవిలోకి వచ్చాక కేకేకే వాళ్ళు, నియో నాక్జి వాళ్ళు చేసిన అల్లర్లను ఖండిచకపోగా, వారిని సమర్ధించి, వంద సంవత్సరాల క్రితం అమెరికా ఎలావుందో చవిచూపించాడు.
ఈనాడు అమెరికాలో చాలామంది తెలుపు, తెలుపు కాని ఇతరుల మధ్య దూరం విపరీతంగా పెరిగింది. నల్లవారిని, మెక్సికన్లని, ముస్లిములని, కొందరు భారతీయులతో సహా ఏమీ కారణం లేకుండా అరెస్ట్ చేయటం, వారి నిత్య జీవితంలో భద్రత లేకుండా చేయటం కూడా చూస్తున్నాం. బీదవారికి మళ్ళీ మెడికల్ ఇన్ష్యూరెన్స్ లేకుండా చేయటానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నాళ్ళ క్రితమో సరైన వలస పేపర్లు లేకుండా వచ్చి, అమెరికాలో స్థిరపడిన వారిని వెనక్కి పంపించేస్తున్నారు. ఉద్యోగాల్లో అవసరమైన ఇమ్మిగ్రంట్సుని రాకుండా చేస్తున్నారు.
కొందరు మనవాళ్ళు కూడా, ఏరు దాటారు కనుక తెప్ప తగలేసి, ఇలాటి వాటిని సమర్ధించే దాకా వచ్చింది పరిస్థితి.
మరి ఎన్నాళ్ళుంటుందో ఈ ముసళ్ళ పండగ.
మళ్ళీ ఇంకొక రోసా పార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్ అవసరమవుతారా?
గోవులు మళ్ళీ గర్జిస్తాయా?
మరి గోవులు గర్జించేదెప్పుడు?
౦ ౦ ౦
.
సత్యం మందపాటి
తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయ పురంలో పుట్టి గుంటూరులో పెరిగిన సత్యం మందపాటి గారు కాకినాడ, విశాఖపట్నం లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టభద్రులు. త్రివేండ్రం లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ నాటి యువ, జ్యోతి ల నుండి ఈ నాటి రచన, ఆంధ్రభూమి, నవ్య, చతుర, కౌముది, సుజన రంజని మొదలైన అనేక పత్రికలలో ఐదు దశాబ్దాలుగా 200 కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు, పత్రికలో దీర్ఘకాలిక శీర్షికలు రచించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు రచించిన కథకుడు సత్యం గారే. ఆయన రచనలు ఇంచుమించు అన్ని తెలుగు పత్రికలలోనూ ప్రచురించబడి అనేక పురస్కారాలని అందుకున్నారు. కథా సంపుటులు, నవలలు, కవితా సంపుటి వెరసి 10 పైగా గ్రంధాలు ప్రచురించారు. గేయ రచయితగా ఆయన రచించి ప్రదర్శించిన సంగీత రూపకం “వేయి వసంతాలు” సాలూరి వాసూ రావు సంగీత దర్శకత్వంలో ఎస్.పి. బాలూ, శైలజ ఆలపించారు. 1998 నుంచి ఆరు నెలలకొకసారి టెక్సస్ లోని అనేక నగరాలలో టెక్సస్ సాహిత్య సదస్సుల నిర్వహణ లో కీలక పాత్ర వహిస్తున్నారు. పిల్లల కోసం తెలుగు బడి, భాషాప్రియులకోసం నెల వారీ ఆస్టిన్ సాహిత్య సమావేశాలూ నిర్వహిస్తున్న సత్యం మందపాటి గారు సతీమణి విమల గారితో నాలుగు దశాబ్దాలుగా ఆస్టిన్ నగర నివాసి..
***