top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సత్యాన్వేషణ - 14

ద్వేషమా! నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా వున్నారా?

 

సత్యం మందపాటి

ప్రేమ! 

ఎంత తీయని పదం అది!

ఆ ప్రేమని ఆస్వాదించిన వారికే మాత్రమే ఆ తియ్యదనం తెలుస్తుంది. 

ప్రేమ అనే పదానికి రకరకాల మనుష్యులు రకరకాల నిర్వచనాలు చెబుతారు. నాకు మాత్రం ఆ అనుభూతికి నిర్వచనాలు అనవసరం. ఆ ఇచ్చిపుచ్చుకునే ప్రేమలోని ఆనందాన్ని ఆస్వాదించగలిగితే చాలు అనిపిస్తుంది. 

మరి ఆ ప్రేమ అనేది ఎక్కడినించీ పుడుతుంది? 

మనిషి పుట్టుక ఇంకా మొదలవక ముందునించే ఈ ప్రపంచంలో ప్రతి జీవిలోనూ, ఒక జీవికీ ఇంకొక జీవికీ మధ్య కూడా ఎనలేని ప్రేమ వుంది. 

మనుష్యుల్లో కూడా మనం అమ్మ కడుపులో వున్నప్పటికి ముందే ఆ ప్రేమ అనేది వుంది. ఆ ప్రేమ వల్లే ఒక యువతి ఒక యువకుడికి భార్య అవుతుంది. తర్వాత ఆ ప్రేమ వల్లే తల్లి అవుతుంది. మనల్ని ప్రేమించి, మనకి ప్రేమించే మనసుని ఇచ్చే ఒక అమ్మ అవుతుంది. 

తొమ్మిది నెలలు కష్టాలూ నష్టాలూ ఓర్చి, మనల్ని తన ప్రాణం కన్నా మిన్నగా కడుపులో దాచుకుని, తన శరీరాన్ని మనతో పంచుకుని, తను తినే దాంట్లోనే కొంత మనకీ ఇచ్చి, మన బరువుని మోసి, కష్టాన్నీ సంతోషాన్నీ కలబోసిన ఆనందపు బాధతో పెద్ద అరుపు అరచి, మనకి ప్రాణం పోసి, మనల్ని ఈ భూమి మీదకు తీసుకువస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. అంత బాధలోనూ అరమోడ్పు కన్నులతో, ఆనంద భాష్పాలతో మన వేపు ప్రేమగా చూస్తుంది. అదే మనం పసిపాపలా కళ్ళు మూసుకుని అనుభవించే ఆ తీయని ప్రేమకి మొట్టమొదటి అనుభూతి. ఆ ప్రేమతో పాటు మమత, మమకారం, అనురాగం రంగరించి తన స్థన్యం ఇస్తుంది. అడుగడుగునా తన జీవిత కాలమంతా మనకి తన ప్రేమని అందిస్తూనే వుంటుంది. అందుకే ప్రేమకి నిర్వచనం వెతుక్కునే వారికి, మొట్టమొదటి నిర్వచనం అమ్మ అనే రెండక్షరాల మాట అని చెబుతాను. 

అమ్మ అలా ఎనలేని ప్రేమ పంచుతుంటే, అలాటి ప్రేమతోనే మనకి అనుక్షణం రక్షణ ఇస్తుంటాడు నాన్న. తన చేతుల్లో జాగ్రత్తగా ఎత్తుకుని ఆడిస్తాడు, నవ్విస్తాడు, పిల్లల భాషలో మాట్లాడుతుంటాడు. తనూ చిన్న పిల్లాడిలా మారిపోయి అప్పుడే ఒక మంచి స్నేహితుడిగా కూడా అయిపోతాడు. చేయి పట్టుకుని నడిపిస్తాడు. క్రింద పడితే లేవటం నేర్పిస్తాడు. పెద్దయాక జీవితంలో కూడా క్రింద పడ్డాక, లేవటం ఎంత ఉపయోగపడుతుందో మనకి ఆ తర్వాత కానీ అర్ధం కాదు. మన చదువులో, క్రమశిక్షణలో, సంస్కారంలో, మానవతా విలువలలో, ఒక మంచి మనిషిగా తయారు చేయటంలో కావలసిన విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న. 

మన జీవితాంతం గురువులు, బంధువులు, స్నేహితులు, జీవన భాగస్వాములు… ఒకరేమిటి ఎంతో మంది వారి ప్రేమని మనకి అందిస్తుంటారు, మన దగ్గర పుచ్చుకుంటుంటారు. మనిషిగా పుట్టినందుకు సాటి మనిషిగా వారిని ప్రేమిస్తూనే వుంటాం. ప్రేమించబడుతూనే వుంటాం.

ప్రేమ అనేది సార్వకాలీనం, సార్వజనీయం. 

ఆ ప్రేమ అలా విశ్వాంతరాల్లో వ్యాపించి వుండటం ప్రాణకోటి మనుగడకి ఎంతో అవసరం కూడాను.

మరి అలాటి ప్రేమతో నిండిన ఈ భూప్రపంచంలో ద్వేషం ఎందుకుంటుంది? అనేది ఒక పెద్ద ప్రశ్న.

   

౦ ౦ ౦ 

ప్రతి మనిషికీ కొన్ని ఇష్టాలూ, కొన్ని అయిష్టాలూ వుండటం సర్వ సహజం. నాకు కూడా ఎన్నో ఇష్టాలు, కొన్ని అయిష్టాలు వున్నాయి. సులభమైన ఉదాహరణ చెప్పాలంటే, నాకు వంకాయ కూరంటే ఎంతో ఇష్టం, కానీ ‘ఇంకో’ కూరంటే అయిష్టం. కష్టపడి చేస్తారు కనుక తింటాను కానీ, అంత ఇష్టంగా కాదు. అలాగే మీకూ ఎన్నో ఇష్టాయిష్టాలున్నాయని మీకూ తెలుసు, నాకూ తెలుసు. వాటివల్ల తప్పు ఏమీలేదు. మనకి అయిష్టమైన వాటిని ఇష్టపడే వారిని గౌరవిస్తూనే వుంటాం. కానీ ఇది చిన్న ఉదాహరణ కాబట్టి సరిపోయింది, కొన్ని విషయాల్లో కొందరు విషయపరమైనవి వదిలేసి, ఆ అయిష్టాలని తప్పుగా తీసుకుని, వాటిని పరిధులు మించి చూస్తుంటారు.  అందువల్లే కొన్ని ఇష్టాలనించీ ప్రేమ ఎలా పుడుతుందో, అలాగే కొన్ని అయిష్టాలనించీ ద్వేషం కూడా పుట్టే అవకాశం వుంది. 

ఉదాహరణకి నేను తెలుగు కథలంటే ఎంతో ఇష్టపడేవాడిని. ఆ ఇష్టం సాహిత్యం మీద ప్రేమగా మారింది. కనపడ్డ పుస్తకమల్లా చదివేవాడిని. తెలుగు సాహిత్యం మీదా, భాష మీదా వున్న ఆ వల్లమాలిన ప్రేమే నన్నొక రచయితని చేసింది. ఐదు దశాబ్దాలుగా నా చేత రచనలు చేయించింది. ఎన్నో సాహిత్య సదస్సుల్లో పాల్గొనటమే కాక, వాటిని నిర్వహించే ఉత్సాహాన్ని కూడా ఇచ్చింది. ఈనాడు కూడా నేను వ్రాసే ప్రతి కథా సాహిత్యం ఆ ప్రేమతోనే, ఆ ఆపేక్షతోనే వ్రాస్తున్నాను. 

అలాగే ఒకతనికి తన కులం అంటే ఇష్టం. దానివల్ల తప్పు ఏమీ లేదు. ఎవరి ఇష్టం వారిది. అతను అక్కడితో ఆగలేదు, ఆ ఇష్టం మిగతా కులాలవారిని అయిష్టపడేలా చేసింది.  ఆ అయిష్టం వల్ల మిగతా కులాల వారిని దూరంగా వుంచేవాడు. తక్కువగా చూసేవాడు. తర్వాత ఆ అయిష్టం ద్వేషంగా మారింది. అతను ఇతర కులాల వారి మీద ఎనలేని ద్వేషం పెంచుకున్నాడు. పదవిలో వున్నాడు కనుక, మిగతా కులాల వారిని తొక్కేస్తుంటాడు. అన్నీ తన కులం వారికే ఇస్తుంటాడు. ఇక్కడ కులం అని ఉదాహరణకు అన్నాను కానీ, ఇది మతం కావచ్చు, తెలుపు-నలుపు రంగుల వివక్షత కావచ్చు, నా దేశం నీ దేశం అనే భావన కావచ్చు. ఇంకా ఏదయినా కావచ్చు. ఇలాటి విషయాల్లోనే ఇష్టం ప్రేమగా ఎలా మారుతున్నదో, అయిష్టం ద్వేషంగా మారటం చూస్తుంటాం. 

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, కొన్ని విషయాల్లో ఈ ద్వేషం అనేది అన్ని పరిధులూ దాటి, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. మతపరమైన ఉగ్రవాద చర్యలు దేశవిదేశాల్లో ఎన్నో వేలమందిని ఇప్పటికే బలి తీసుకున్నాయి. చాల ‘తెల్ల’ దేశాల్లో తెల్లవారు, నల్లవారినీ ఇతరులనీ ఒకప్పుడు తెర వెనుక కొంచెంగానూ, ఇప్పుడు బహిరంగంగా ఎక్కువగానూ ఎలా తొక్కి వేస్తున్నారో రోజూ పేపర్లలోనూ, టీవీలోనే కాక, మన ఎదురుగా కూడా చూస్తూనే వున్నాం. మనలో కొంతమంది అలాటి బాధితులం కూడాను. 

ఇక మన భారతదేశంలోనూ కుల మత ప్రాంతీయ భాషా అయిష్టాలూ, ద్వేషాలూ బాగానే వున్నాయి. మన తెలుగు రాష్ట్రాలే మూడున్నర దశాబ్దాలుగా కులద్వేషాలతో కుళ్ళిపోయి ఎంత ప్రమాదకరమైన స్థితిలో వున్నాయో అందరికీ తెలుసు. రాజకీయ రంగమే కాకుండా, కుల రాజకీయాలు సినిమా రంగంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ, చదువుని ‘అమ్ముకునే’ ఈనాటి విద్యారంగంలోనూ, ఇతర చోట్లా పూర్తిగా ఆ కుల ప్రాతిపదిక మీదనే నడుస్తున్నాయి. 

అక్కడి రాజకీయ నాయకుల దీవెనలతో, ఇక్కడ అమెరికాలోనూ మనవాళ్ళలో కుల గజ్జి, ప్రాంతీయ గజ్జి వచ్చేశాయి. అదృష్టవశాత్తూ ఆ గజ్జిని గజ్జిలాగానే వుంచుకుని రోజుకి మూడుసార్లు గోక్కుంటూ తృప్తిగా వున్నారు కానీ, అవి ఇంకా ముదరలేదు. అలా జరగకూడదనే నా ఆశ

౦ ౦ ౦

ఏదేశ చరిత్ర చదివినా కానీ, ఈనాడు జరుగుతున్న సంఘటనలు చూసినా కానీ, ద్వేషం అనేది ఎలా కాన్సర్ వ్యాధిలా వ్యాపించిందో స్పష్టంగా కనిపిస్తున్నది. 

ఇది చెప్పుకునే ముందు ఒక విషయం చెప్పాలి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ రంగు వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా, ఈ సంస్కృతి వారైనా, వారిలో ఇంతగా ద్వేషాలు వున్నవారు చాల కొద్ది మంది మాత్రమే వుంటారు. అందరూ కాదు. కానీ ఒక గ్లాసెడు పాలని విషపూరితం చేయటానికి ఒక్క బొట్టు విషం చాలు. దేశదేశాల చరిత్ర చదువుతుంటే అది స్పష్టంగా కనబడుతుంది. 

“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?

నరజాతి చరిత్ర సమస్తం, పర పీడన పరాయణత్వం” అన్నారు మహాకవి శ్రీశ్రీ.

ఉదాహరణకు ప్రపంచ౦వ్యాప్తంగా జరిగిన కొన్ని ద్వేషపూరిత దారుణాల గురించి చూద్దాం. 

ప్రపంచ చరిత్రలో ఈ ద్వేష పూరితమైన చర్యల్లో, మొట్ట మొదటగా చెప్పుకోవలసింది, యూరప్ దేశాల నించీ అమెరికాకి వలస వచ్చినవారు ఇక్కడ స్థానికులను (ఇండియాలో వీరిని రెడ్ ఇండియన్స్ అంటారు) ఊచకోత కోసి ఎలా వారి భూములను, జీవితాలను ఆక్రమించారు అని. దాదాపు నూట పధ్నాలుగు మిలియన్ల స్థానికులని వేటాడి, చంపి, వారి జీవితాలనీ, వారి భూములనీ ఆక్రమించుకున్న అమెరికా చరిత్ర చదువుతుంటే కళ్ళు చెమర్చటం కాదు, దుఖం ఆగదు. ప్రపంచ చరిత్రలోనే అది అనూహ్యమైన హత్యాకాండ. ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడే వున్న ఈ దేశాలని ‘కనుక్కున్న’ కొలంబస్ అనే ఒక సముద్రపు దొంగ ఒక్కడే ఎన్నో మిలియన్ల స్థానికులని చంపాడు అని అమెరికన్ చరిత్రే గర్వంగా చెప్పుకుంటున్నది. ఈనాడు కూడా ‘కొలంబస్ డే’ అని ఒక పండుగగా చేసుకుంటున్నది. 

కొన్ని వేల సంవత్సరాలుగా తరతరాలుగా నివాసం వుంటూ, పంటలు పండించుకుంటూ నిష్కల్మషంగా వుండేవారు కష్టజీవులైన ఈ స్థానికులు. తుపాకులు భుజాన వేసుకుని వలస వచ్చిన వారు ఎవరు ఎంత భూమి ఆక్రమించుకుంటే వారికి అంత. స్థానికులకు బాణాలు, బల్లేలూ తప్ప ఇతర ఆయుధాలేవీ లేవు. వారిని బెదిరించి, చంపి భూమితో పాటు అక్కడ నివసించే స్థానికులను కూడా బానిసలుగా వారి స్వంత చేసుకున్నారు. కాదంటే సమాధానం తుపాకీలతోనే చెప్పేవారు. అలా చనిపోయిన వారి సంఖ్యే పైన చెప్పినది. యూరప్ నించీ ఆరోజుల్లో అమెరికాకి వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది వారి దేశాల్లో నేరస్థులు. లేదా నేరాలు చేసి తప్పించుకుపోయి అమెరికా వచ్చినవారు అని వారు వ్రాసిన పుస్తకాలే చెబుతున్నాయి. ఈ ప్రపంచపు చరిత్రలో ఇంత మారణహోమం జరిగిన ప్రదేశమూ ఎక్కడా లేదు. ఇన్ని మరణాలూ ఎక్కడా లేవు. 

కొన్ని వేల సంవత్సరాల క్రితం చిపాంజీలనించీ మానవ జీవన పరిణామంలో వచ్చిన మొట్టమొదటి మనిషి ఆఫ్రికాలోని నల్లటి రంగు మనిషి అని అందరికీ తెలిసిందే. అక్కడినించీ కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో ఇతర ప్రదేశాలకి వలస వెళ్ళి, కొత్త వాతావరణ పరిస్థితుల వల్లా, తదితర పరిణామాల వల్లా, రంగూ రూపం మారిపోయి రకరకాల రంగుల, భాషల, సంస్కృతుల మనుష్యులుగా మారిపోయింది ఆనాటి మానవాళి. మరి నువ్వు నలుపూ, నేను తెలుపూ, నువ్వు పసుపూ, నేను గోధుమా అని ద్వేషం ఎందుకు పెంచుకున్నాం? మానవ జాతి చరిత్రలో భరించలేని మారణహోమం ఇలా ఎందుకు జరిగింది? నల్లవారి చరిత్ర చదివితే, ఎంతటి పాషాణమైనా కన్నీరు కార్చే ఘోరమైన చరిత్ర వారిది అని తెలిసిపోతుంది. అది ఆనాటిదే కాదు, ఈనాటిది కూడా. ఇంకా జరుగుతూనే వుంది.  

శ్వేతజాతి అహంకారుల చేతుల్లో ఇప్పటికి ఎన్నో కోట్ల నల్లవారు చంపబడ్డారు. పదిహేడవ, పధ్ధెనిమిదవ శతాబ్దాలలో, ఆఫ్రికానించీ ఇరవై రెండు మిలియన్ల నల్లవారిని, ఇనుప సంకెళ్ళు వేసి బలవంతంగా అమెరికా దేశానికి బానిసలుగా తీసుకువచ్చారు. ఒక బానిసకి వివాహమయి పిల్లలు పుడితే, అతని భార్యా పిల్లలు కూడా అతని యజమానికే బానిసలయిపోయేవారు. యజమాని మాట కాదంటే వారిని హింసించేవారు. చాలమంది ఆడవారిని యజమాని, అతని సంబంధిత వ్యక్తులు, వారిని భర్త ఎదుటనే మానభంగం చేసేవారు. కుటుంబాలని విడదీసి, వారిలో కొందరిని పిల్లలతో సహా బానిసలుగా ఇంకెవరికో అమ్మేసేవారు. కాదన్నవారిని చెట్లకి తల్లక్రందులుగా వ్రేలాడదీసి, క్రింది మంట పెట్టి చంపేవారు. పిల్లలూ, ఆడవారూ ఇళ్ళల్లో పడుకున్న నిద్ర సమయంలో ఇళ్ళనే తగల బెట్టేవారు. ఆరోజుల్లోనే ఈ హింసాద్వేషాలు కేకేకే (కు క్లక్స్ క్లాన్) అనే శ్వేత జాత్యహంకార సంస్థ పుట్టుకకి కారణం అయాయి. ముఖం కనపడకుండా తెల్లని ముసుగులు వేసుకుని, శరీరానికి తెల్లని బురఖాలు వేసుకుని, నల్లవారిని చెట్లకు వ్రేలాడదీసీ, శిలువలకు కట్టేసీ మంట పెట్టి సజీవ దహనం చేసేవారు. అగ్నికి ఆహుతి చేసేవారు. అదే సంస్థ ఇప్పుడు ఈనాటి అమెరికా అధ్యక్షుడికి ప్రత్యక్షంగానే ధన సహాయం చేస్తున్నది. ఆయన కూడా వారి గురించి మంచిగా చెబుతూనే వున్నాడు. ఆయన చేసే టీవీ ప్రసంగాలలో, ఆయన పక్కనో, వెనకనో ఒక ప్రసిధ్ధ కేకేకే నాయకుడు వుండటం బహిరంగంగానే కనబడుతుంది. ఆ సంస్థ అతని ద్వారా తన లక్ష్యాలు సాధించుకుంటున్నది. అనుమానం వున్న వాళ్ళు గూగులమ్మని అడిగితే ఎన్నో ఫొటోలు చూపిస్తుంది ఆవిడ!  

అంతేకాదు ఈనాటి అమెరికా అధ్యక్షుడు మెక్సికోనించీ, తదితర ‘మధ్య అమెరికా ఖండం’ నించీ అమెరికాకి వలస వచ్చిన కుటుంబాలని విడదీసి, న్యాయ సమ్మతం కాని విధంగా వచ్చిన తల్లిదండ్రులని వారి దేశాలకి పంపించేసి, అమెరికాలో పుట్టిన వారి ‘రెండేళ్ల నించీ పదేళ్ళ వయసు’ పిల్లలని పంజరాలలో (Cages) పెట్టి, సరైన ఆహారమూ, వైద్య సదుపాయాలూ ఇవ్వక, వలస వచ్చిన వారి మీద అలా పగ తీర్చుకుంటున్నాడు. వారిలో కొంతమంది పిల్లలు చనిపోయారు కూడాను. 

ఇప్పుడు అమెరికా జనాభాలో దాదాపు పదమూడు శాతం మాత్రమే నల్లవారు. అయినా వాళ్ళలో ఇరవై ఎనిమిది శాతం ప్రజల్ని చిల్లర తప్పులు చేసినా, చాల కేసుల్లో ఏ తప్పూ చేయకపోయినా, జైలుకి పంపించటం రివాజు అయిపోయింది. దానికి ఒక కారణం ద్వేషం అయితే, ఇంకొక కారణం జైళ్ళను గవర్నమెంటే ప్రైవేట్ కాంట్రాక్టుకి ఇవ్వటం వల్ల అవి నింపవలసి రావటం. వారిలో నలభై రెండు శాతం మందికి, ఎంతోమంది అమాయకులైనా కూడా తెల్ల న్యాయవేత్తలు మరణ శిక్ష విధించారు. ఇంకా విధిస్తున్నారు. ఎన్నో కేసుల్లో ఆ ఖైదీని చంపేసిన తర్వాత, అతను నిర్దోషి అని బయటపడింది కూడాను. ‘నల్లవారి చరిత్ర’ మీద వ్రాసిన ఎన్నో పుస్తకాలు చదివినా, సినిమాలు చూసినా అవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. కళ్ళల్లో రక్తం తెప్పిస్తాయి. 

ఈనాడు రోడ్దు మీద స్కూలునించీ చేతిలో పుస్తకాలతో ఇంటికి వెడుతున్న నల్ల పిల్లవాడినీ, చేతిలో ఏ తుపాకీ లేకుండా రోడ్డు మీద నడుస్తున్న నల్ల అమ్మాయినీ, తమ ‘ఆత్మ రక్షణ కోసం’ అని చెప్పి పోలీసులు పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చేస్తున్నారు. కోర్టులో అలాటి అమాయకులను హత్య చేసిన పోలీసుల్ని నిర్దోషులుగా నిర్ణయించి వదిలేస్తున్నారు తెల్ల న్యాయవేత్తలు. శ్వేత జాతి జ్యూరీ. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పోలీసు విడియోలు, ప్రజల తీసిన విడియోలు తప్పు పోలీసులదే అని స్పష్టంగా కోర్టుల్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ చూపించినా ఏమాత్రం న్యాయం జరగకపోవటం. 

‘మేమూ మనుష్యులమే’, ‘నల్లవారి జీవితాలను పట్టించుకోండి’ అని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గుంపులను, ఆర్మీని, హోంలాండ్ సెక్యూరిటీని తీసుకువచ్చి మరీ కాల్చిపారేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ పోరాటం చేస్తున్న నల్లవారితో చేతులు కలిపింది, మానవత్వాన్ని గౌరవించే ఎంతోమంది తెల్లవారే కాక అన్ని రంగుల వారు కూడాను. ఇలా ఈ ‘రంగు’ విద్వేషాలకి గురవుతున్న వారిలో మన భారతీయులు కూడా కొంతమంది వున్నారు. ఇదీ క్లుప్తంగా శ్వేతజాతి అహంకారులు ద్వేష చరిత్ర. 

నాకు అర్ధం కానిదేమంటే, తెల్లవారు అని చెప్పుకునే తెల్లవారు తెల్ల కాగితంలా తెల్లగా వుండరు. నల్లవారు అని దూరంగా పెట్టే ఆ నల్లవారు బొగ్గులా నల్లగా వుండరు. గోధుమలు అని పిలువబడే మనం గోధుమల్లా వుండము. పసుపు రంగు మనుష్యులు అనే చైనా, జపాన్ వారు మనం పులిహోరలో వేసుకునే పసుపులా పసుపు పచ్చగా వుండరు. మరి ఆ రంగుల్లో లేనివారిని, ఆ రంగుల్లో వున్నారని అనుకుంటూ, అంటూ మనిషికీ మనిషికీ మధ్య గీతలు గీయటం ఎందుకో అర్ధం కాదు. 

అంతరిక్ష నౌక కొలంబియాలో, ఎన్నో వేల మైళ్ళ దూరంనించీ చూస్తున్న భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా ఏమన్నదో తెలుసా? “From where I am in Space, I see a beautiful blue planet called Earth. I don’t see any lines on that” అని. అవును, అవి మరి ద్వేషంతో మనం గీసుకున్న గీతలే కదూ! 

ఇక మూడవ పెద్ద మారణహోమం గురించి తెలుసుకోవాలంటే హిట్లర్ గురించీ, అతని విపరీతమైన ద్వేష పూరిత చర్యల గురించే తెలుసుకోవలసిందే. జ్యూయిష్ మతస్థులను హాలోకాస్ట్ పేరుతో ఒక సంస్కృతినే సర్వనాశనం చేయటమే కాకుండా, మొత్తం ప్రపంచాన్నే తన కాళ్ళ క్రింద పెట్టుకోవాలని ప్రయత్నించాడు. జర్మనీ ఆస్ట్రియా పోలెండ్ మొదలలైన ఎన్నో దేశాల్లో నివసించే ఇరవై ఒక్క మిలియన్ల జ్యూయిష్ మతస్థులను, తను తయారు చేసిన నాక్జీ, స్వస్తికా గ్రూపులతో నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. కొందరిని తుపాకులతోనూ, కొందరిని అగ్నికి ఆహుతి చేస్తూనూ, కొందరిని సజీవంగా పూడ్చి పెట్టి తన ద్వేషాన్ని నిరూపించుకున్నాడు. అక్కడ కూడా మగ, ఆడ, పిల్లలూ పెద్దలూ అందరినీ పంజరాలలోనూ (Cages), వేధించే శిబిరాల్లోనూ (Concentration Camps) పెట్టి, తిండి పెట్టకుండా మాడ్చి, గుడ్డలు లేకుండా కొంకర్లు పోయే చలిలో నిలబెట్టి మరీ చంపాడు. రాక్షసత్వంలో హిట్లర్ని మించినవాళ్ళు కనపడరు. చివరికి అమెరికన్, బ్రీటిష్ మొదలైన దేశాల సైనికులు చుట్టుముడుతుంటే, ఒక గుంటలో దాక్కుని, ఆర్మీ అతన్ని సమీపిస్తుంటే, తన భార్యకి విషం పెట్టి చంపేసి, తనని తనే తుపాకీతో కాల్చేసుకుని కుక్క చావు చచ్చాడు నియంత హిట్లర్. నేను జెరూసేలం వెళ్ళినప్పుడు హాలోకాస్ట్ మ్యూసియంలో, హిట్లర్ చంపిన పసికందుల బొమ్మలు చెక్కిన ఒక పెద్ద నల్లరాతి విగ్రహం ముందు, అది చూస్తూ ఇలాటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధంకాక కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే, కదలక మెదలక నేనూ ఒక రాయిలా ఎంతోసేపు నుంచున్నాను. 

నాలుగవది మత మౌఢ్యంతో గత పాతికేళ్ళుగా జరుగుతున్న ఉగ్రవాదం. ఈ ఒక్క మత పిచ్చి ఉగ్రవాద చర్యల్లో ప్రతి సంవత్సరం సగటున 21,000మంది ప్రపంచ వ్యాప్తంగా చంపబడుతున్నారు. ఒక్క 2014లోనే 44,000 మందిని చంపేశారు. ఇలా జరిగిన, జరుగుతున్న చర్యల్లో ముఖ్యమైనవి కొన్ని. వీటిల్లో అమెరికాలో జరిగిన 9/11 జంట భవనాల కూల్చివేత, కెన్యాలో అమెరికన్ ఎంబెసీ దాడులు, స్పైన్ దేశంలో రైలుబండి పేల్చివేత, బాలి ఇండొనీషియాలో బాంబులు, ముంబై నగరం హోటల్లో కాల్పులు, సిరియాలో బాంబులు.. ఇలా ఒకటా రెండా, దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నోసార్లు ఎంతోమందిని అమానుషంగా చంపేసిన, ఈ మత మౌఢ్యులు వారి ఉన్మాదంతో ఏం సాధిస్తున్నారో అంతుబట్టదు. 

ఈ మత మౌఢ్యుల విషయంలోనే కాక, కేకేకేలోనూ, మిగతా కుల, మత, రూపు, రంగు మొదలైన అన్ని ద్వేషపూరిత కార్యక్రమాల్లోనూ మనకి స్పుటంగా కనపడేది, వారికి చిన్నప్పటినించే ఆ ద్వేషం అనేది నూరిపోయటం. వారి బుర్రల్లో వున్న తెలివితేటల్నీ విచక్షణా జ్ఞానాన్ని పూర్తిగా కడిగి పారేసి, ద్వేషంతోనూ వివక్షతతోనూ నింపేయటం. ఇలాటి వాటిల్లో ఎన్నో ట్రైనింగ్ కాంపులు కూడా వున్నాయంటే ఆశ్చర్యం లేదు. 

మరి ఈ ద్వేషాలు ఇంతగా ప్రబలి రావటానికి కారణాలు ఏమిటి? ఇలా ద్వేషాలు పెంచుకుని, వారు బావుకునేదేమిటి? 

శ్రీశ్రీగారు అంటారు, 

“వైషమ్యం, స్వార్ధపరత్వం, కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ఢలు, 

మాయలతో మారుపేర్లతో చరిత్ర గతి నిరూపించినవి” 

ఆయనే ఎన్నో దశాబ్దాల క్రితమే ఆ కారణాలు అన్నీ చెప్పేశారు. ఇక నేను వాటి గురించి వ్రాయనఖ్కరలేదు. ఏనాడో ఆయన చెప్పిన ఈ ప్రపంచ చరిత్రలో, ఈరోజు దాకా కూడా ఇలా మానవత్వం మరచి, ద్వేషాన్ని ప్రేమించే జనాభా ఎందుకు పెరిగిపోతున్నదో అర్ధమవుతున్నది. 

ఈ ద్వేషం అనే మహమ్మారి ఎప్పుడు ఈ రాక్షసులని వదలి వెళ్ళిపోతుందో తెలియదు కానీ, అది ఎంత త్వరగా పోతే, అంత త్వరగా జనావళి మానవత్వంతో మళ్ళీ మనుష్యులుగా బ్రతకగలుగుతారు.

ఆ రోజు ఎప్పుడో!

౦ ౦ ౦

 

(ఈ వ్యాసం వ్రాసేటప్పుడు నేను నిర్మొహమాటంగా కొన్ని దేశాల గురించీ, కొంతమంది నియంతల గురించి, కుల, మత, సాంస్కృతిక ద్వేషాల గురించీ వ్రాయవలసి వచ్చింది. మకుటపరంగానూ, విషయపరంగానూ ఈ వ్యాసం వాటి గురించే కనుక అవి వ్రాయటం తప్పదు. నా మటుకు నేను ఇలాటి ద్వేషాలని ఏమాత్రం భరించలేను.  ‘మానవ సేవే మాధవ సేవ’ అని నమ్మిన ఒక మానవత్వం వున్న మామూలు మనిషిని నేను. ఈ విశాల ప్రపంచంలో మన మనసులో వున్న సుఖ సంతోషాలనే కాక, నన్ను ఇబ్బంది పెట్టే ఇలాటి విషయాల గురించి కూడా నిర్మొహమాటంగా వ్రాసే బాధ్యత వున్న ఒక సామాన్య రచయితని. అంతేకానీ, నేను ఒక రాజకీయ పక్షానికిగానీ, కులానికిగానీ, మతానికిగానీ, సంస్కృతికిగానీ ప్రతినిధిని కాను. - సత్యం మందపాటి)

bottom of page