top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సత్యాన్వేషణ-  5

సత్యం మందపాటి

హైలాండ్ పార్కులో హైదరాబాదు  

అది అమెరికాలో ఒక పెద్ద అందాల హైటెక్ నగరం. ఆ నగరంలో సాఫ్ట్ వేర్ విద్వాంసులు కొంచెం ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ వాల్మార్ట్ షాపుకి వెళ్ళినా, కాస్ట్కో అనే ఇంకో పెద్ద షాపుకి వెళ్ళినా ఎక్కువగా కనపడేది తెలుగు వాళ్ళు, అక్కడ వినపడేది తెలుగులా అనిపించే ఇంగ్లీషు కనుక.

మా రోజుల్లో ఏ గ్రీన్ కార్డో, అమెరికా పౌరసత్వమో వస్తే కానీ ఇల్లు కొనుక్కునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుని హెచ్ వన్ వీసా మీద వచ్చిన వాళ్ళూ, అప్పటిదాకా ఒక అపార్ట్మెంట్లో వుండి ఒక పసిపాప వున్నవాళ్ళూ ధైర్యంగా ఇళ్ళు కొనేస్తున్నారు. అలాటి వారు ఎక్కువగా వున్న సబ్ డివిజన్లలో ఒకటి ‘హైలాండ్ పార్కు’. అక్కడ ప్రతి పన్నెండు - పదిహేను ఇళ్ళల్లోనూ, కనీసం మూడో నాలుగో భారతీయుల ఇళ్లు. అందులో కనీసం ఒకటో రెండో తెలుగు వారి ఇళ్లు. అక్కడ ఇళ్లు కొనే మనవాళ్ళే ఆ ప్రాంతంలో ఇళ్ళ ఖరీదులు ఎంతో పెంచేశారని అంటుంటారు.

మా రోజుల్లో మేము స్థానికులందరితోనూ కలిసిమెలిసి వుండేవాళ్ళం. మేము ఇళ్లు కొన్నప్పుడు మేము ఒక్కళ్ళమే తెలుగు వాళ్ళం. ఇద్దరమో ముగ్గురమో భారతీయులం. మిగతా అందరూ తెల్లవాళ్ళు, చైనీస్, నల్ల వాళ్ళు, మెక్సికన్స్... మా కాలనీ పేరు ‘లోలాండ్ హైట్స్’. దాని పక్కనే కొత్తగా వచ్చింది ‘హైలాండ్ పార్క్’. మాది లోలాండూ కాదు, వాళ్ళది హైలాండూ కాదు. అన్నమాచార్యులవారు చెప్పినట్టు అంతా సరి భూమే. అదీకాక లోలాండులో మళ్ళీ ఆ ‘హైట్లు’ ఏమిటో అర్ధం కాదు.

ఒకసారి ఏదో పార్టీలో హైలాండ్ పార్కులోనే వుండే ఒక తెలుగు అతనిని అడిగాను. “ఏం బాబూ, ఇంతమంది తెలుగు వాళ్ళు ఒకేసారి ఇక్కడికి వచ్చేశారు, ఏమిటి కారణం?’ అని.  

‘స్కూళ్ళు సార్. స్కూళ్ళు. ఇక్కడ హైస్కూల్ హోల్ మొత్తం దేశంలోనే టోటలుగా నెంబర్ వన్’ అన్నాడు.

‘మరీ పాతికేళ్ళ కుర్రాడిలా వున్నావు, నీకు అప్పుడే హైస్కూలుకి వెళ్ళే పిల్లలున్నారా’ అని అడిగాను ఆశ్చర్యపోతూ, అమాయకంగా.

అతను కొంచెం సిగ్గుపడి, ‘నాకు పెళ్ళయి ఆరు నెలలే అయింది సార్. ఇంకా మా ఆవిడే అమెరికా రాలేదు. అప్పుడే పిల్లలేమిటి?’ అన్నాడు.

నాకేదో ‘ఆలూ లేదు, చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం’ అనే సామెత గుర్తుకొచ్చింది కానీ, ఏమీ అనలేదు. అయితే స్కూల్ అన్నమాట కారణం. అదీకాక మాకు తెలిసిన తెలుగు వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలు వెళ్ళే స్కూలే ‘హోల్ మొత్తం దేశంలోనే టోటలుగా నెంబర్ వన్’ అనటం కూడా మామూలే. మా పిల్లలు మాత్రం మామూలు స్కూళ్ళల్లోనే చదువుకుని ‘హోల్ మొత్తం దేశంలోనే టోటలుగా నెంబర్ వన్’ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు! ☺

ఇంతమంది.. ఇంకా పిల్లలు లేనివాళ్ళు.. స్కూలు కోసం అక్కడికి రావటానికి కారణం ఇదేమిటో నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే హైస్కూల్లో చేరటానికి పిల్లలు పుట్టిన తర్వాతనే, కనీసం పదిహేను సంవత్సరాలు పడుతుంది. అమెరికాలో పదిహేను సంవత్సరాలు ఒకే కంపెనీలో పని చేసేవారు అరుదు. అదే వూళ్ళో వున్న ఎన్నో మారుమూల ప్రదేశాలకీ, రకరకాల వూళ్ళకీ  ఉద్యోగరీత్యా మారుతుంటారు. అమెరికాలో వున్న నలభై ఏళ్లలో మేమే రెండు అపార్ట్మెంట్లలో అద్దెకు వున్నాక, ఇంటి తర్వాత ఇళ్లు నాలుగిళ్ళు మారాము. కానీ తర్వాత అతనే చెప్పాడు అక్కడ హైస్కూలే కాదుట, డేకేర్ సెంటర్, ఎలిమెంటరీ స్కూలూ కూడా నెంబర్ వన్నేనుట. నేను అనుకున్నది ఏమిటంటే అవేమీ కారణాలు కాదనీ, ఎక్కువగా మనవాళ్ళు వున్న చోటే ఇళ్లు కొనుక్కుంటే కొంచెం ధైర్యంగానూ, అవసరానికి సహాయంగానూ వుంటుందని.      

         

సరే ఆసలు కథలోకి వెడదాం. మరి ఆ కాలనీ పేరే హైలాండ్ పార్కు కదా, మరి అక్కడ పార్కు లేకపోతే ఎలా అని పెద్దలు కుసింత ఆలోచించి, ఒక శుభ ముహూర్తాన అక్కడ ఒక చక్కటి పార్కు కట్టారు. ఆ పార్కు పేరు కూడా మీరు అనుకుంటున్నట్టుగానే హైలాండ్ పార్కు.

అది వసంత ఋతువు. మార్చి నెల. బయట పగలు చల్లగా, హాయిగా వుంటుంది. ఉద్యోగస్తులందరూ సోమవారం నించీ శుక్రవారం దాకా ఆఫీసుల్లో బిజీగా పని చేసుకుంటూ, సాయంత్రం ఆరున్నర దాటాక ఇళ్ళకి చేరుకుంటారు. పిల్లలు మాత్రం డేకేర్ నించీ, స్కూలు నించీ మూడు గంటల కల్లా ఇంటికి వచ్చేస్తారు. సరిగ్గా నాలుగు గంటలు అయేసరికీ పిల్లలని తీసుకుని, వాళ్లకి సాయంగా భారతదేశంనించీ వచ్చిన అమ్మమ్మలూ, బామ్మలూ, తాతయ్యలూ పార్కుకి చేరుకుంటారు. అప్పుడే అక్కడ సందడంటే సందడి మొదలయేది.   

అమెరికాలో వుంటున్న మన వాళ్ళకి తెలుగు దేశంనించీ రకరకాల సహాయాలు చేయటానికి తల్లిదండ్రులు వస్తుంటారు. పిల్లల కాన్పుల కోసమనీ, కాన్పులయాక పసిపిల్లలని చూసుకోవటానికీ, పిల్లలు పెరుగుతున్నంత కాలం వాళ్లకి బేబీ సిట్టింగులు చేయటం కోసం, తర్వాత గ్రాడ్యుయేషన్లూ, పెళ్ళిళ్ళూ ... అలా జీవన చక్రభ్రమణం జరుగుతున్నంత వరకూ, ఎవరో ఒకళ్ళు వస్తూనే వుంటారు. అలా వచ్చేవాళ్ళకు ఇంటి పనులనించీ కొంత విరామం, మిగతా వారితో కాలక్షేపం ఇచ్చేవి శనివారం పార్టీలు, వారం రోజులూ ఇలాటి పార్కులు.

ఈ పార్క్ మధ్యలో కూడా చక్కటి కొలను, దాని మధ్యలో పైకి నీళ్ళు చిమ్ముతూ ఒక వాటర్ పౌంటెన్. ఎంతో అందంగా వుంటుంది.  

ఆరోజు బుధవారం. మధ్యాహ్నం నాలుగు గంటలు దాటుతున్నది. కొంతమంది పిల్లలని స్ట్రోలర్లలో తోసుకుంటూనూ, కొంతమంది పిల్లల చేతులు పట్టుకునీ మెల్లగా నడుచుకుంటూనూ వస్తున్నారు. రోజూ చూసే వాళ్ళే కనుక, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటున్నారు.

స్ట్రోలర్లలో పడుకున్న పిల్లలు నోట్లో వేలేసుకుని ఇటూఅటూ చూస్తుంటే నడిచొచ్చే పిల్లలు పరుగెత్తుకుంటూ  ఉయ్యాల, జారుడు బండల కేసి వెడుతున్నారు. ఆడవాళ్ళు పక్కనే గడ్డిలో కొన్ని గ్రూపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవటానికి సిద్ధమవుతుంటే, మగవాళ్ళు అక్కడే పార్కు బెంచీల మీద, చెట్ల క్రిందా ‘మేము మీకన్నా ఏం తక్కువ తినలేదని’ అంతకన్నా ఎక్కువ గ్రూపుల్లో కూర్చుంటున్నారు.

కలల కామాక్షిగారు అంటున్నారు, ‘మా అమ్మాయికీ, మనవరాలికీ నేను ఇక్కడ వుండటమంటే ఎంతో ఇష్టం. నాకూ అంతే, అమెరికాలోనే వుండిపోవాలని నా కోరిక. మేమిప్పటికి రెండుసార్లు వచ్చామా.. రెండుసార్లూ మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి మనసొప్పలేదు. ఎందుకో ఆ దేవుడే మాకు ఇక్కడే వుండాలని అలా అమెరికా రుచి చూపిస్తున్నాడేమోనని అనిపిస్తుంటుంది’

అది విని ఇలల ఇందిరగారు అన్నారు, ‘అది సరే! దానికి ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఒప్పుకోరు కదా. మీ అమ్మాయికి ఇంకా గ్రీన్ కార్డు రావాలి, సిటిజన్ అవాలి, అప్పుడు మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే.. కలియుగానంతరమే మీకు ఆ వీసా వచ్చేది’

‘అదేమో నాకు తెలీదు. నాకు మాత్రం ఇక్కడే వుండాలని వుంది’ అన్నది కామాక్షి.

‘మరి మీ మనవరాలు పెద్దయిపోయాక, మీ అవసరం వుండదు కదా!’ అంది ఇందిర.

‘అప్పుడో మనవడుంటాడు కదా. వాడిని చూసుకుంటూ వుంటాను’ అని ఇందిర ఇంకా ఏదో అనబోతుంటే, మళ్ళీ ఆవిడే అంది, ‘మీ అనుమానం నాకు తెలుసు. వాడూ పెద్దయితే.. ఇంకెవరి పిల్లలకో బేబీ సిట్టింగ్ చేస్తాను. కానీ అమెరికాలోనే స్థిరపడిపోతాను’ అంది ధృడంగా.   

నరసింహంగారికి ప్రతిదానికీ విపరీతమైన అనుమానాలు. రోజూ ఇండియా వార్తలు తెలుగు టీవీలో చూస్తూనే వుంటారు. ఆయన అంటున్నాడు ‘కేంద్రంలో బీజేపీ నిలుస్తుందంటారా, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా? రాష్ట్రంలో నాయుడు సచివాలయాన్ని అమరావతిలో కడతాడా, సింగపూరులోనా? కేసీఆర్ మరి తన వాళ్ళందరికీ పదవులు ఇచ్చినట్టేనా, పాపం ఇంకెవరైనా మిగిలిపోయారా? పవన్ కల్యాణుకి కూతురు పుడితే సినిమాల్లో చేరుస్తాడా? పాలిటిక్సులోనా?”

విష్ణుమూర్తికి ఇలాటివి నచ్చవు. ‘వాళ్ళేమయితే మీ కెందుకండీ? బీజేపీ నిలిస్తే మీకు పద్మభూషణ్ ఇస్తుందా? కాంగ్రెస్ గెలిస్తే మీకు భారతరత్న ఇస్తుందా? నాయుడు ఏ నిమిషానికి ఏ దేశంలో సచివాలయం కడతాడో, ఆనాడే పోయిన అతని మామకీ తెలీదు, ఈనాడు వున్నా లేడనిపించే బామ్మరిదికీ తెలీదు. ఇహ మీకేం తెలుస్తుంది?’ విసుక్కుంటున్నాడు విష్ణుమూర్తి.

ఇంకో పక్క కూర్చున్న పంకజం అంటున్నది ‘ఖాళీగా వుంటే పిచ్చెత్తుతుందని, ఈ మధ్య ఆవకాయ, మాగాయ పెట్టి ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్లకి రుచి చూపిస్తే, బాగున్నాయని మెచ్చుకున్నారు. అంతటితో ఆగితేనా, మాకు ఇది కావాలని అది కావాలనీ అడిగి చేయించుకుంటున్నారు. అంతే కాదు చిన్న సీసాకి పది డాలర్లు, పెద్ద సీసాకి పాతిక డాలర్లు ఇస్తున్నారు. ఇప్పుడు వాటితోపాటే గోంగూర, చింతకాయ, దోసావకాయ అన్నీ చేస్తున్నాను. మా అల్లుడు కూడా, అదేదోనమ్మా.. వెబ్బో గిబ్బో.. దాంట్లో పెట్టి అమ్ముతాను అంటున్నాడు. అమెరికాని  అవకాశాల దేశం అంటారుట కదా.. ‘

అనసూయగారు అందుకున్నారు. ‘అవును. అమెరికా అవకాశాల దేశమే కానీ, ఆవకాయల దేశం కాదు కదా. మనవాళ్ళ కోసమే బిజినెస్ చేస్తే లాభం లేదు. మా ఆయన రెండేళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు, తన డయాబెటిస్, బ్లడ్ ప్రషర్ లాటి వాటికోసం సంవత్సరానికి సరిపడా మందులు తెచ్చుకున్నాడు. అమెరికాలో మెడికల్ ఇన్స్యూరెన్స్ లేకపోతే, మందుల ఖర్చులు అంతరిక్షంలో వుంటాయట కదా. పక్కింటి తెల్లాయనకి ఉద్యోగం, మెడికల్ ఇన్స్యూరెన్సూ పోయి, మందులు లేక ఇబ్బంది పడుతూ, మా ఆయనకి తన కష్టసుఖాలు చెప్పుకునేవాడు. మా ఆయన ఆర్నెల్ల వీసా అయిపోగానే ఇండియాకి వెడుతూ, ఆయనకి ఆ మందులు ఇస్తే, ఆయన సంతోషించటమే కాకుండా, వాటికి డబ్బులు కూడా పే చేశాడు. మేము ఇండియాలో కొన్నదానికన్నా ఆయన ఇచ్చింది చాల ఎక్కువే. అప్పటినించీ, వచ్చినప్పుడల్లా ఎన్నో మందులు తెచ్చి ఎంతోమందికి ఇలాటి వారికి ఇస్తున్నాం. మా టిక్కెట్టు ఖర్చులు కలిసి వస్తున్నాయి. కాకపొతే వెబ్బులో పెట్టి అమ్మటం నేరం. అందుకని అడిగిన వాళ్ళకే ఇస్తున్నాం. ఇప్పుడిక్కడ చాలామందికి తెలుసు. వాళ్ళే మేము వచ్చే ముందర ఏయే మందులు కావాలో ఈమైల్ ద్వారా చెబుతుంటారు’

జానకి అంది ‘మనమా అవకాశాల్ని అందుకోవాలే కానీ, ఎక్కడుంటేనేం. అన్ని దేశాలూ అవకాశాల దేశాలే. పంకజం ఆవకాయ అమెరికాలో అయితే అమ్ముతున్నది కానీ, తన ఇంటి పక్క వాళ్లకి హైదరాబాదులో అమ్ముతుందా? అక్కడ పరువు తక్కువ కదూ. నేనిక్కడ కావలసినవాళ్లకి జాకెట్లు, ఫాల్స్ కుడతాను. మరదే సికింద్రాబాదులో మా ఇంట్లో చేస్తే, చుట్టపక్కల చుట్టాలు పక్కాలు ఏమనుకుంటారు? అలాగే అమరేష్ పటేల్ గారికి అమెరికాలో కారు డ్రైవింగ్ లైసెన్సు వుంది కదా అని, మనవాళ్ళకి డబ్బులు తీసుకుని కారు డ్రైవింగ్ కొన్నేళ్లుగా గుప్తంగా నేర్పిస్తున్నాడు. మరి అదే అహ్మదాబాదులో చేస్తాడా?’

‘ఏమిటి? లుంగీ కట్టుకుని వచ్చారు పార్కుకి?’ అప్పారావుని అడుగుతున్నాడు అజరుద్దీన్.

‘మా ఇంటి పక్కనే కదా ఈ పార్కు. ఏ డ్రస్ అయితేనేం. అయినా అలా చూడండి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. వాళ్ళ కన్నా ఎక్కువ బట్టలే కట్టుకున్నాను కదా’ అన్నాడు అప్పారావు.

‘ఏమో.. నీళ్ళు చూసినప్పుడల్లా, నాకు లఘుశంకకి వెళ్లాలనిపిస్తుంది. మధుమేహం వల్లనేమో.. మా ఇల్లేమో అర కిలోమీటరు దూరం మరి’’ అన్నాడు మధు లేచి నిలబడుతూ.

‘స్విమ్మింగ్ పూల్ కేసి చేస్తూ అంటున్నారు, మనసులో ఏవో ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. అలాటి ఆలోచనలు మానేయండి. మంచిది కాదు. అలా చెట్టు వెనక్కి వెళ్ళండి’ అన్నాడు చలపతి.

‘అయ్యా, ఇది చింతలపూడి కాదు అలా చెట్టు పక్కకి వెళ్ళటానికి. పట్టుబడితే జైల్లో వేస్తారు. కాస్త బిగ పట్టుకుని ఇంటికి వెళ్లి రండి. లేదా మా ఇంటికి వెడదాం రండి. మీ ఇంటికన్నా మా ఇల్లు దగ్గరే” అన్నాడు బాబూరావ్.

‘మొన్న ఇక్కడ కట్టిన హిందూ దేవాలయానికి వెళ్ళాం. మా అయనకి దేవుడంటే విపరీతమైన భక్తి. తన దగ్గరవున్న యాభై డాలర్లలో పది డాలర్లు తీసి అక్కడ హుండీలో పడేశాడు’ అంది పద్మ.

‘పది డాలర్లే? అంటే ఆరు వందల అరవై రూపాయలు. పది డాలర్లతో ఇక్కడ డాలర్ షాపులో ఎన్నో కొనుక్కోవచ్చు. మావారు ఎప్పుడు ఇక్కడ గుడికి వెళ్ళినా పది రూపాయల నోటు వేస్తారు. మన దేవుడికి మన రూపాయలు ఇస్తే తప్పేమిటి అంటారు. మన మంత్రాల్లో కూడా విష్ణు రూపాయ, శివ రూపాయ అంటుంటారు కదా’ అన్నది రూప.

కొంచెం అవతలగా కూర్చున్న అనంత్ అంటున్నాడు, ‘నాకు మాత్రం అమెరికా రావాలంటే భయం. ఇక్కడ ఏమీ తోచి చావదు. హైదరాబాదులో ప్రొద్దున్న నిద్ర లేచినప్పటినించీ ఎంతమందో పలకరిస్తుంటారు. రోడ్డు మీదకి వస్తే, మెడికల్ షాపతనికీ, ఫాన్సీ షాపతనికీ, మంగలి షాపతనికీ, ఆఖరికి మా కూరగాయలమ్మే అమ్మాయితో సహా  నన్ను పేరు పెట్టి పలకరిస్తారు. ఇక్కడెవరో మీ బోటివారు తప్ప మనుష్యులే కనపడరు. కనపడ్డా పలకరించరు. పలకరించినా మనకా అమెరికన్ ఇంగ్లీషు అర్ధమై చావదు. ఎలా చావటం? పిల్లలేమో ప్రొద్దున వెడితే రాత్రికి కానీ రారు. అలా షాపింగు బయటికి వెడదాం అనుకుంటే నడిచి వెళ్ళనీయరు. అమెరికాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అని ఉపన్యాసం ఇస్తారు. కారు డ్రైవింగ్ చేయనీయరు. చేయనిచ్చినా, రోడ్డుకి ఎడమ పక్కన నడపనీయరు. అసలు కుడి పక్కన స్టీరింగే వుండదు. అదో తికమక డ్రైవింగ్ రూలు’

‘పోనీ నాలాగా టీవీ చూడచ్చు కదా.. పుస్తకాలు చదవచ్చు కదా’ అన్నాడు చలపతి.

‘అమెరికన్ టీవీలో మనమేం చూస్తాం? ట్రంపు కంపు తప్ప. తెలుగు టీవీలో ఆ భాష భరించలేం. ఈటీవీ నాయుడుకి బాకా, ఆటీవీ జగన్ రెడ్డికి, మాటీవీ చిరంజీవికి. ఇక పుస్తకాలా.. మన పిల్లలకి తెలుగు చదవటం రాదు కనుక, తెలుగు పుస్తకాలు చదవరు. అసలు మా పిల్లలకి ఏ పుస్తకాలూ చదివే అలవాటు లేదు. ఈ కొత్త తరం అంతా అంతే!  నేను తెచ్చుకున్న రెండు తెలుగు పుస్తకాలు, రామకోటిలా కోటిసార్లు చదివాను ఇప్పటికి. ఎప్పుడు మళ్ళీ మన దేశానికి వెళ్ళిపోదామా అని వుంది’ అన్నాడు బాబూరావు.

ఈలోగా అక్కడికి వచ్చారు సుబ్బారాయుడుగారు. ఆయన అమెరికా వచ్చి యాభై ఐదేళ్లు దాటిపోయింది. మనసా వాచా పూర్తిగా అమెరికన్ అయిపోయారు ఆయన. అక్కడికి ఎవరినో చూడటానికి వచ్చినట్టున్నారు.

లుంగీ పైకి లాక్కుని మడుస్తూ, ఆయన్ని చూసి అన్నాడు అప్పారావు, ‘మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే ఇక్కడ? ఈ వూళ్ళో మీ అమ్మాయో అబ్బాయో వుంటారా? ఇండియానించీ ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఎన్నాళ్ళు వుంటారు’ అని.

సుబ్బారాయుడుగారికి అతని ధోరణికి కోపం వచ్చినట్టుంది, ‘నేను మీరు పుట్టక ముందే ఈ దేశానికి వచ్చాను. మా పిల్లలూ, మనవలూ అందరూ ఇక్కడే వుంటారు’ అంటూ అప్పారావు కట్టుకున్న లుంగీని అదోలా చూస్తూ వెళ్ళిపోయారు.

౦ ౦ ౦

(ఒకరోజు సాయంత్రం డల్లస్ దగ్గరవున్న పుష్పగిరి (ఫ్లవర్ మౌండ్) అనే వూళ్ళో వుంటున్న ప్రసాద్ అనే మిత్రుడూ నేనూ,  ఫోన్లో ఈ విషయం మీద సరదాగా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన ఇచ్చిన స్పందనతోనే ఈ వ్యాసం హాస్య ధోరణిలో వ్రాశాను. ఆయనకి ధన్యవాదాలు. ఇది కేవలం హాస్యం కోసం వ్రాసిన వ్యాసం. ఎవరూ భుజాలు తడుముకో వద్దు. సరదాగా చదువుకోండి!)

 

౦ ౦ ౦

                                

bottom of page