MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
సత్యాన్వేషణ - 15
ఎందుకని ‘మాయాబజార్’ అంత గొప్ప చిత్రమయింది?
సత్యం మందపాటి
ఈ కోవిడ్ రోజుల్లో, కలివిడిగా వుండే మనమందరం విడివిడిగా వుండవలసి వచ్చింది. అందువల్ల ఇంట్లో వుండే సమయం బాగా ఎక్కువయింది. ఆ నేపధ్యంలో మన తెలుగు సినిమా వంశ పరంపర నట శూన్యుల, కుల శేఖరుల సినిమాలు చూడటం ఏనాడో మానేసి, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నేను. అలాటిదే ఒక తెగులు సినిమా ఎవరో బాగుందంటే చూడటం మొదలుపెట్టాను. కాసేపటికే ఆ జీరోల కుప్పిగంతులు, ఒత్తులుగానీ, అక్షరాలుగానీ ఈమాత్రం పలకటం చేతగాని వాళ్ళ తెలుగు సంకర భాష, అర్ధంపర్ధంలేని కథ, మాటలు, భావాలు ఏమాత్రం చూపించలేని ఆ ముఖాలూ, కీచు గొంతుతో అరిచే పాటలు, సెక్సు, వయొలెన్సు చూడలేక, టీవీ ఆపేసి ‘హమ్మయ్య’ అనుకున్నాను.
మరేం చేయాలా అని ఆలోచిస్తూ టీవీలో వెతుకుతుంటే, పాత ‘మాయాబజార్’ సినిమా కనపడింది. ఈ బొడ్డేంద్రుల సినిమాలు చూసినందుకు పాప ప్రక్షాళన అవుతుందని, ఆ తెలుపు-నలుపు సినిమా చూడటం మొదలు పెట్టాను. హాయిగా వుంది. ఎన్నోసార్లు చూసినా ఎప్పుడూ కొత్తగానే వుండే చిత్రం అది.
అప్పుడే అనిపించింది, ఎందుకని ‘మాయాబజార్’ చిత్రం ఆనాటికీ, ఈనాటికీ, అంత గొప్ప చిత్రరాజమయింది అని. లెఖ్కపెట్టలేనన్నిసార్లు చూసినా ఎప్పుడూ నాకు కొత్తగానే వుంటుంది ఆ సినిమా. అసలేముంది ఆ చిత్రంలో? ఈసారి మరికొంచెం పరిశీలనగా చూస్తూ ఆలోచించటం మొదలు పెట్టాను.
౦ ౦ ౦
చాల ఏళ్ళ క్రితం మా వూరి అమ్మాయి శాండ్రా బులక్ నటించిన ఒక హాస్య రసభరితమైన సినిమా ఒకటి, ‘మిస్ కంజీనియాలిటీ’ అనే పేరుతో వచ్చింది. ఆ చిత్రంలో మిస్ అమెరికా పోటీల్లో, శాండ్రా బులక్ కూడా చివరి ఐదు మంది దాకా గెలుస్తూ వస్తుంది. జడ్జి అందరినీ ఒకే ప్రశ్న అడుగుతుంటాడు, ‘మీరు గెలిస్తే ప్రపంచంలో దేని కోసం పాటుబడతారు?’ అని. ప్రతివాళ్ళూ ‘ప్రపంచ శాంతి’ (వరల్డ్ పీస్) అని చెబుతుంటారు. వేలమంది ప్రేక్షకులకు ఆ జవాబు నచ్చి విపరీతంగా చప్పట్లు కొట్టేస్తుంటారు. చివరికి శాండ్రా వంతు వస్తుంది. ఆవిడ అనాధల కోసం పాటుపడతాననీ, అదనీ ఇదనీ ఏవేవో చెబుతుంటుంది. అందరూ ‘వరల్డ్ పీస్’ అని ఎప్పుడు చెబుతుందా అని ఎదురు చూస్తుంటే, చివరికి ‘అండ్ వర్ల్డ్ పీస్’ అంటుంది. దానితో అందరూ నుంచుని మరీ చప్పట్లు కొడతారు.
సరదాగా వున్నా ఇదెందుకు చెప్పానంటే, ఏ వయసులో వున్నా తెలుగు తమిళ కన్నడ వారిని ‘ఇంతవరకూ వచ్చిన చిత్రాల్లో మీకు నచ్చిన ఒకే ఒక చిత్రం ఏమిటి?’ అని అడిగితే, నూటికి కనీసం తొంభై మంది ‘మాయాబజార్’ అని చెబుతున్నారు. ఎందుకని?
నా ఇన్నేళ్ళ జీవితంలో ఎన్నో భాషల్లో కొన్ని వందల సినిమాలు చూశాను. వాటిల్లో ఎంతో బాగున్నాయి అనుకునే చిత్రాలని చూస్తే, నాకు ఆ విజయాలకి ఎన్నో ముఖ్య కారణాలు కనిపిస్తాయి. అవేమిటంటే…
గొప్ప కథ, కథనం, మంచి సాహిత్యంతో కలబోసిన మధురమైన సంగీతం, చక్కటి గాత్రం వున్న గాయకులు, గాన పటిమ, తెలుగు భాషలోని అందాలను పలికించే చక్కటి సంభాషణా చాతుర్యం, కథలో లీనమయిపోయి నటించే మంచి నటులు, ఏపాత్రనయినా తమ హావభావాలతో అలరించే వారి గొప్ప నటనా చాతుర్యం, మన సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపించే సంఘటనలు, కడుపుబ్బ నవ్వించే సున్నితమైన సహజ హాస్యం, హృదయాన్ని ఆకట్టుకునేటట్లు కథని తెరకెక్కించే దర్శకత్వ ప్రతిభ, ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ చూడాలనే ఉత్సాహం కలిగించే నిర్మాణ విలువలు, అన్నిటికీ మించి ఒక ఉత్తమ చిత్రాన్ని ప్రజలకు అందించాలనే సంస్కారం, క్రియాశీలత వున్న నిర్మాతల కార్యదక్షత, తపన. వీటిలో కొన్నయినా వున్న ఎన్నో చిత్రాలు మన తెలుగు సినిమారంగంలో ప్రజల మన్నన పొందాయి, కలకాలం మన ముందు నిలబడ్డాయి. అంతేకాదు నిర్మాతల కష్టాలని ఆర్ధికంగా సమర్ధించాయి. మరి ఏవో కొన్నే కాకుండా, పైన చెప్పినవన్నీ వున్న ఒకే ఒక తెలుగు చిత్రం ఏమిటో చెప్పండి అని అడిగితే, ఎంతోమంది ఒకే జవాబు చెబుతారు! అదే ఈ వ్యాసానికి స్పందన. మూలం.
౦ ౦ ౦
‘మాయాబజార్’ అంత గొప్ప చిత్రం అవటానికి ఎందరో మహానుభావులందరూ కారకులే అయినా, నేను మాత్రం ముందుగా ఇద్దరితో మొదలుపెడతాను. వారే విజాయా ప్రొడక్షన్స్ పేరిట విజయ పతాకం ఎగరేసిన నాగిరెడ్డి, చక్రపాణి. పైన చెప్పిన సంస్కారం, క్రియాశీలత, కార్యదక్షత, మంచి చిత్రం అందించాలనే తపన వున్న నిర్మాతలు. అవేకాక వారిద్దరూ విజాయా పతాకం క్రింద తీసిన అన్ని సినిమాలు విజయవంతమవటానికి ముఖ్య కారణం ఒకటి వుంది. నాగిరెడ్ది చిన్నప్పటినించీ కుటుంబ వ్యాపారాల్లో ఆరితేరిన వ్యాపారదక్షత కలిగిన వ్యక్తి. చక్రపాణి సాహిత్య పిపాసి. స్వతహాగా ఎన్నో కథలు వ్రాసిన రచయిత. వారిద్దరూ చేతులు కలిపి విజయా సంస్థకి రెండు కళ్ళు అయారు. నాగిరెడ్డి చిత్ర నిర్మాణ ఖర్చులూ, పారితోషకాలూ, ఆదాయం మొదలైన వ్యవహారాలు చూసుకోవటం తప్ప, ఎన్నడూ చిత్ర కథా కథనాల్లో అడ్డురాలేదు. అలాగే చక్రపాణి లెఖ్కలు తప్ప, తక్కిన బాధ్యతలన్నీ తనే చూసుకుంటూ, ఏనాడూ నాగిరెడ్డిని ప్రశ్నించలేదు. శంకించలేదు. ఎవరి డిపార్ట్మెంటు వారిదే. వారి వ్యాపారపరమైన స్నేహమే, ఒకరి మీద ఒకరికి వున్న నమ్మకమే వారి విజయానికి కారణం.
ఏఎన్నార్, ఎన్టీఆర్, హరినాథ్ లాటి ముగ్గురు హీరోలు, సావిత్రి, జమునలాటి ఇద్దరు హీరోయిన్లు నటించిన సినిమాలో సూర్యకాంతాన్ని హీరోగా చేసి, ఆ పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ సినిమా తీసిన ధైర్యం వారిదే. అలాగే మళ్ళీ నాగేశ్వర్రావు, రామారావులను పక్కన పెట్టి, హీరోగా రంగారావుని, హీరోయినుగా సావిత్రిని చూపించిన చిత్రం ‘మాయాబజార్’. నా ఉద్దేశ్యంలో అయితే ఈ చిత్రంలోని ప్రతి పాత్రా హీరోనే. ఎలాగో తర్వాత చెబుతాను.
మాయాబజార్ భారతంలో ఎక్కడా లేని కథ. ఎక్కడో చూచాయగా చెప్పిన చిన్న అంశం మీద అల్లిన కథ ‘శశిరేఖా పరిణయం’ పేరిట ప్రచారంలో వుంది. దాన్ని పింగళి నాగేంద్రరావు, కెవిరెడ్డి, చక్రపాణిలు కలసి తయారు చేసిన కథ ‘మాయాబజార్’. ఈ కథలో విశేషం ఒకటుంది. బాపు, రాముడు సీతలతో మాటలు మాట్లాడించకుండా ఒక సినిమాని దృశ్యకావ్యంగా తీశారు. పింగళి, కేవీ, చక్రపాణి పాండవులు లేకుండా అభిమన్యుడి మహాభారత కథని తీశారు. అదే ఈ కథలోని గొప్పతనం.
పింగళిగారి మాటలూ, పాటలూ ఈ చిత్రానికి ఆయువుపట్టు. ఎన్నో కొత్త కొత్త తెలుగు పదాలకు నాంది పలికారు. ‘ఎవరూ పుట్టించకపోతే, మాటలెలా పుడతాయిరా! వెయ్యరా వాడికో వీరతాడు’ అనే డైలాగే చెబుతుంది, పింగళిగారికి మనం ఎన్ని వీరతాళ్ళు వేయాలో!
అలాటి మాటల్లో కొన్ని. హై హై నాయకా, హై హై జియ్యా, కుడ్యాసురుడు, అసమదీయులు, తసమ దీయులు. దుషటచతుషటయం. గింబళి. గిల్పం. పరవేస దవారం. అసైచయిరం.
పింగళి సంభాషణలు ఎంతో గొప్పగా వ్రాశారు. వాటిలో కొన్ని.
‘శక్తిని దాచుకుని, యుక్తికి పాల్పడటం మంచిది కాదు’ - బలరాముడు
‘శక్తి వున్న చోట అపశకునాలా?’ - శకుని
‘ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి వుండనే వుంది’ - శకుని
‘వారికి వందనం చేయను. నమస్కారం మాత్రమే చేస్తాను’ – లక్ష్మణ కుమారుడు
‘పేరు చెప్పి శరణు కోరరా, నావాడవవుతావు’ – ఘటోత్కజుడు
‘అందాలకు అనుబంధాలు’ – నగలు
‘పాండిత్యం కన్నా జ్ఞానమే గొప్పది’ – ఘటోత్కజుడు
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగానున్నవి’ – ఘటోత్కజుడు
ఇలా చాల వున్నాయి.
ఇక పాటలగురించి చెప్పనఖ్కరలేదు. ప్రతిదీ ఈనాడు కూడా ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే వుంటుంది. ఏ కచేరీలోనైనా పాడుతూనే వుంటారు. ‘చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా’ ‘నీవేనా నను తలచినది’, ‘విన్నావ యశోదమ్మా’, ‘చూపులు కలిసిన శుభవేళా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘భళి భళి భళి దేవా’, ‘నీ కోసమె నే జీవించునది’, ‘దయచేయండి, దయచేయండి, తమంతవారిక లేరండీ’, ‘అహ నా పెళ్ళంట’, ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము’, ‘వివాహ భోజనంబు’… ఏ పాట దేనికి తీసిపోతుంది? ఈ సినిమా పాటల పల్లవుల పేరుతో (చూపులు కలిసిన శుభవేళ, అహ నా పెళ్ళంట, వివాహ భోజనంబు, లాహిరి లాహిరి మొదలైన పేర్లతో) తర్వాత సినిమాలు కూడా వచ్చాయి.
సాహిత్యం అంత గొప్పగా వుంటే ఘంటసాల మాష్టారి సంగీతం గురించి చెప్పనఖ్కరలేదు. ఆ చక్కటి పద లాలిత్యానికి తగ్గ మధురమైన బాణీలు. ఘంటసాల, లీల, మాధవపెద్ది, సుశీల, వసంతకుమారి పాడిన పాటలు హాయిగా వుంటాయి. మాధవపెద్ది, ఘంటసాల, సీయస్సార్, లీల పాడిన పద్యాల గురించి చెప్పనఖ్కరలేదు. ఘంటసాల నేపధ్య సంగీతం ప్రతిచోటా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ‘మోహినీ భస్మాసుర’ నృత్య నాటిక కేవలం పాటలు లేకుండా సంగీత నృత్యాలతో నడుస్తుంది. అక్కడ ఘంటసాలవారు ఇచ్చిన కథా సందర్భమైన వాద్య సంగీతం అమోఘం. ఆ అంశం గొప్పతనానికి కేవీరెడ్డి దర్శకత్వపు ప్రతిభకు కూడా నిదర్శనం. అలాగే బలరాముడికి, హస్తినా పురంలో దుర్యోధనుడు ఇచ్చే ఆహ్వానానికి ఘంటసాల ఇచ్చిన నేపధ్య వాయిద్య సంగీతం అద్భుతంగా వుంటుంది.
సినిమా మొదలుపెట్టినప్పటినించీ చివరిదాకా కేవీరెడ్డి దర్శకత్వ కళా నైపుణ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆరోజుల్లోనే రెండు హైటెక్ పరికరాలు కనిపిస్తాయి. ఒకటి లై డిటెక్టర్. సత్యపీఠం. రెండోది లాప్టాపులో విడియో స్ట్రీమింగ్. దానిపేరు ప్రియదర్శిని. సత్యపీఠం మీద నుంచుంటే అన్నీ నిజాలే. ఎవరూ అబద్ధాలు చెప్పలేరు. ప్రియదర్శిని ద్వారా ముఖ్యపాత్రలను పరిచయం చేసిన తీరు బాగుంది. శశిరేఖకు అభిమన్యుడు కనిపిస్తే, బలరాముడికి దుర్యోధనుడు కనిపిస్తాడు. భానుమతీదేవికి నగలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడికి శకుని కనిపిస్తాడు. అలాగే ఘటోత్కచుడి పరిచయం చాల గొప్పగావుంటుంది. అక్కడ మాధవపెద్ది పద్యం ప్రత్యేకాకర్షణ. బలరామకృష్ణులు సంగీత నృత్య కార్యక్రమం వీక్షిస్తుంటే,ద్రౌపది వస్త్రాపహరణం చూపించిన తీరు దర్శకత్వపు ప్రతిభను చూపిస్తుంది. అలాగే లాహిరి లాహిరి పాట చిత్రీకరణ. కథానుగుణంగా మూడు జంటలు మారుతూ నౌకా విహారం చేయటం ముచ్చటగా చిత్రీకరించారు రెడ్దిగారు.
‘కాల మహిమ కాకపోతే, ఈ వయసులో నౌకా విహారమా?’ అని ఛాయాదేవి అంటే, ‘అది కాల మహిమ కాదు, ప్రకృతి మహిమ’ అంటాడు గుమ్మడి ఆ వెన్నెల రాత్రి, ఆ అందమైన నదీతీరంలో.
ఘటోత్కజుడు ద్వారకలో అంతఃపురంలోకి ప్రతి ద్వారం దగ్గరా కాపలావారిని నిద్రపుచ్చిలోనికి వెడుతూ వుంటే అడ్డం వస్తాడు, ఒక పొట్టి వృద్ధ బ్రాహ్మణుడు. ఘటోత్కజుడు ఆయన్ని ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోతాడు. ఆ ఘట్టం చిత్రీకరణ అద్భుతం అని చెప్పవచ్చు. ఆ నటుడి పేరు గుర్తులేదు కానీ, ఎస్వీఆర్ ముందు నటనకి ఏమాత్రం తీసిపోని నటుడు. చిన్న సీనే అయినా, నేను బాగా గుర్తుపెట్టుకున్నదది. ‘చిరంజీవ, చిరంజీవ. సుఖీభవ, సుఖీభవ. అటువున్నది ఇటు లేదు. ఇటు వున్నది అటు లేదు. చిన చేపను పెద చేప. చిన మాయను పెను మాయ. అది స్వాహా. ఇది స్వాహా’ అంటుంటే, ఘటోత్కజుడికి తెలిసిపోతుంది. అదే శ్రీకృష్ణుడని. వెంటనే నమస్కారం చేస్తాడు. ఇక్కడ దర్శకుడి ప్రతిభ, రచయిత క్లుప్తంగా వ్రాసిన మాటలు, నటన మరచిపోలేము.
ఇక నటన గురించి మాట్లాడితే ఈ చిత్రంలో ప్రతి నటుడూ, నటీ హీరోనే. ఆ గొప్ప పాత్రలు ధరించటానికే పుట్టిన మహానటులు. మహానటీమణులు. కాకపోతే ముందుగా ఇద్దరు నటుల గురించి చెప్పుకుని తీరాలి. ఒకరు మహానటి సావిత్రి. రెండు భారతదేశపు అగ్రనటుడు ఎస్వీ రంగారావు. వారిద్దరే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు. ఇద్దరూ ఈ చిత్రంలో ఒకరినొకరు అనుసరిస్తూ ద్విపాత్రాభినయం చేయటం విశేషం. సావిత్రి అందమైన అమాయకపు శశిరేఖలా ఎంత ముగ్ధమనోహరంగా వుందో, ఘటోత్కజుడిలా గంభీరంగా నడుస్తూ కళ్ళు భయంకరంగా తిప్పుతూ నటించిన తీరు అమోఘం.
ఇక ఈ చిత్రానికి వెన్నెముక ఎస్వీఆర్. ఆయన కనిపించిన ప్రతి సీనులోనూ, ఆ నటన చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఇటు హాస్యం కానీ, అటు గాంభీర్యంగానీ, కోపంగానీ, సహజ నటనలోగానీ అంతకుమించిన నటుడు కనపడడు. బాపూగారిలా ఈయనకి కూడా తెలుగునాట రావలసినంత పేరు రాలేదుగానీ, ఇంకే దేశంలో వున్నా ఎన్నో ఆస్కార్లు రావలసిన మహానటుడు. కుడ్యాసురుడిని అభిమన్యుడు ఓడించిన తర్వాత, సుభద్ర పాడిన పద్యం వింటూ ఘటోత్కజుడు చూపిన ముఖకవళికలు చాల గొప్పగా వుంటాయి. అలాగే చిత్రం చివరలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు, పద్యం పాడుతూ చూపిన హావభావాలు చిరస్మరణీయం. హాస్య నటనలోనూ, సంభాషణలు చెప్పటంలోనూ, వివాహ భోజనంబు పాటలోనూ ఆయన నటన నభూతో నభవిష్యతి.
వీరిద్దరి తర్వాత తన నటనతో ఆశ్చర్యపరిచేది సిఎస్సార్. శకుని మామ అంటే ఇలా వుంటాడు అని ఆ పాత్రకే ఒక నిర్వచనం ఇచ్చిన మహానటుడు. ఆయన హావభావాలు, సంభాషణలు, ఒక పద్యం, ముఖ్యంగా సత్యపీఠం మీద నిలుచుని ఆయన చెప్పిన మాటలు ఆయన ఎంత మహానటుడో చెబుతాయి. ఆయన వున్న ప్రతి సీనూ ఆయనదే!
ఈ చిత్రంలో వున్నంతమంది హాస్య నటులు ఇక ఏ చిత్రంలోనూ లేరేమో. చిన్నమయ్య రమణారెడ్డి, లక్ష్మణ కుమారుడు రేలంగి, ఆడపెళ్ళి వారి తరఫున చదలవాడ కుటుంబరావు, నల్ల రామ్మూర్తి, మగపెళ్ళి వారి తరఫున వంగర వెంకట సుబ్బయ్య, అల్లు రామలింగయ్య, బాలకృష్ణ.. ఒకరేమిటి అందరూనూ. చివరికి ఆర్. నాగేశ్వరరావు, మిక్కిలినేని కూడా హాస్య పాత్రలలాగానే కనపడతాయి.
ఘటోత్కజుడి ప్రవేశం దగ్గరనించీ హాస్యమే హాస్యం. ఈ చిత్రంలోని హాస్య సన్నివేశాల్లో నవ్వు రాకపోతే, జంధ్యాలగారు చెప్పినట్టు, ‘నవ్వక పోవటం ఒక రోగం’. మా రెండున్నర ఏళ్ళ మనవరాలికి ‘ఒక మంచి తెలుగు సినిమా చూపించాలి ఏది చూపించమంటావు’ అని మా అబ్బాయి అడిగితే, ‘మాయాబజార్’ చూపించు అని చెప్పాను. భాష పూర్తిగా తెలియని చిన్న పిల్లలని కూడా నవ్వించే చిత్రం అది.
యస్వీ రంగారావు, సావిత్రులతో పాటు, నాగేశ్వరరావు, రామారావు, గుమ్మడి, ముక్కామల, సీఎస్సార్, ఆర్. నాగేశ్వర్రావు, నాగభూషణం, సంధ్య, ఋషేంద్రమణి, చాయాదేవి, సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి, నల్ల రామ్మూర్తి, చదలవాడ, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య, వంగర, మాధవపెద్ది సత్యం, ఇలా ఎందరో నటులు. అందరూ వారివారి పరిధుల్లో చాల గొప్పగా నటించిన చిత్రం.
ఇంకొక విషయం చెప్పకుండా ఈ వ్యాసం పూర్తి చేయటం భావ్యం కాదు. 1957లో మాయాబజార్ విడుదల అయిన రోజుల్లో తెలుగులో రంగుల సినిమాలు లేవు. డిజిటల్ ఎఫెక్ట్స్ లేనే లేవు. హై డెఫినిషన్ అనేది ఊహాతీతం. అటువంటి సమయంలో ఆకాశంలో బాణాలు, గదలూ కొట్టుకోవటం, గింబళీలు వాటంతట అవే చుట్టుకుపోవటం, గిల్పాలు గిరగిరా తిరగటం, చెప్పులు వాటంతట అవే నడిచిరావటం, ఎన్నో గిన్నెలూ, చెప్పులూ, ఆభరణాలు పరుగెత్తుకుంటూ వచ్చి అలమార్లలలో కూర్చోవటం, ఎంత సహజంగా వున్నాయంటే ఆరోజుల్లో అదొక విచిత్రం అయిపోయింది. ఘటోత్కజుడు ఒక్కసారిగా సైజు పెరిగిపోవటం, లడ్లు, అరిసెలు, ఒకటేమిటి అన్ని ఆహార పదార్ధాలూ, ద్రావకాలతో సహా వాటంతట అవే అతని నోట్లోకి వెళ్ళటం, అనాటి పదమూడేళ్ళ పిల్లాడిగానే కాక, పెద్దవాడిగా ఈరోజు కూడా ఆనందిస్తూనే వున్నాను. అవన్నీ అంత సహజంగా చిత్రీకరించినది ఫోటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే. ఆయన లేకపోతే, విజయావారు అనుకున్న విధంగా ఆ సినిమా వచ్చేదే కాదు. లాహిరి లాహిరి పాటను ఎండలో తీసి, ఆ రోజుల్లోనే ఫిల్ము మీద దాన్ని ఒక వెన్నెల రాత్రిగా మార్చిన గొప్పదనం కూడా ఆయనదే!
మరి ‘ఎందుకని ‘మాయాబజార్’ చిత్రం ఆనాటికీ, ఈనాటికీ అంత గొప్ప చిత్రరాజమయింది?’
రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అని అడిగాడుట వెనకటికి ఒకాయన.
ఎందుకంటే… ఇందాకటినించీ చెప్పింది అదే కదండీ!
అందుకని!
***