top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సత్యాన్వేషణ

సత్యం మందపాటి

ఎంత కప్పుకి అంత కాఫీ!

‘మనలో విలువలు నశించి పోతున్నాయి’ అనే మాట ఈమధ్య ఎక్కువగా వినిపిస్తూనే వుంది, కనిపిస్తూనే వుంది.

మన సినిమాల్లోనూ, టీవీలోనూ, పేపర్లలోనే కాక.. రోజువారీ జీవితంలో కూడా రోజూ చూస్తున్నవి పరిశీలిస్తే   మరి ఆ భావన రాకుండా వుండదు.

ఎక్కడ చూసినా హింసలూ, హత్యలూ, మానభంగాలూ, కులమత ద్వేషాలూ.. ఇలా దేనికీ తక్కువ లేదు.

మనవాళ్ళు  చెబుతుంటారు, ‘అరిషడ్వర్గాలకు మనం అతీతంగా వుండాలి’ అని.

అలా వుంటే ఇలాటివేమీ జరగటానికి వీలు లేదు అంటారు కొందరు పెద్దలు.

 

ఇది మన భారతదేశంలోనే కాదు, ఇతర సంస్కృతులలోనూ, ఇతర మతాలలో కూడా ‘అరిషడ్వర్గాలు’ అనే పేరు మీద కాకపోయినా, వీటిలో కొన్నిటి గురించి అందరూ చెప్పేదే!

అంతేకాదు మతపరంగానే కాక, వ్యక్తిత్వ వికాసంలోనూ, మానసిక శాస్త్రంలోనూ, ఈనాటి సైబర్ యుగంలోని కొన్ని కంపెనీలలో హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లలోనూ కూడా ఇలాటి కొన్ని విషయాల మీద చర్చలు కొంచెం ఎక్కువగా వినడుతూనే వున్నాయి.    

అసలు ‘అరిషడ్వర్గాలు’ అంటే ఏమిటో చూద్దాం.

అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనీ, వీటిని దూరంగా వుంచటం అవసరం అనీ చెబుతున్నాయి హిందూ మత గ్రంధాలు.

‘ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల మనుష్యుల మధ్య బ్రతుకుతున్నప్పుడు, మానసిక ఉద్రేకాలు సామాన్య మానవుడి మనుగడలో పెద్ద భాగం అయినప్పుడు, వాటికి దూరంగా వుండటం ఎంతో కష్టం కదూ!’ అనేవారు కొందరున్నారు.

 

‘ఇలాటివి చెప్పటం తేలికే కానీ, ఎంతమంది అవి పాటించగలుగుతున్నారు? కనీసం ఇలా నీతులు చెప్పే వారిలోనే ఎంతమంది వీటికి అతీతులు?’ అనేవారు కొందరు వున్నారు.

 

అంతేకాదు ‘ఎంతో వేగంగా పరుగెడుతున్న ఈనాటి భౌతిక జీవన పోరాటంలో గెలవటానికి, అలా నీతుల గీతలు గీసుకుని వుండటం అవసరమా?’ అని ప్రశ్నించే వారు ఇంకొందరు.

 

ఈ విషయాన్నే కొంచెం విశ్లేషించి చూద్దాం.

కామం అంటే ఎన్నో అర్ధాలున్నాయి, వాటిల్లో కోరిక అనేది ఒకటి ముఖ్యంగా కనపడుతుంది. కోరికలు ఎన్నో రకాలు. మనిషిగా పుట్టినవాడు సుఖంగా బ్రతకాలని కోరుకుంటాడు. తన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలని కోరుకుంటాడు. తనకంటూ ఒక సంసారాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటాడు. అందరూ సుఖంగా వుండాలని కోరుకుంటాడు. దానిలో తప్పేమిటి అనేది ఈనాటి ఒక వాదన.

 

కామానికి ఇంకో అర్ధం కూడా కనిపిస్తుంది. అదే స్త్రీ పురుషుల మధ్య వుండే లైంగిక వాంఛ. దానివల్లే సంతానం. వంశాభివృద్ధి. మరి దానికి అతీతంగా వుండవలసిన అవసరం వుందా అని ఒక ప్రశ్న.

 

అలాగే సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్ మొదలైన రంగాల్లో ఎన్నో విషయాల మీద, ఎన్నో ప్రయోగాలు చేయాలనే మానవుల కోరిక, ఎన్నో కొత్త విషయాలు కనుక్కునే దాకా వెళ్ళింది. ఆ తపన ఇంకా ఆగటం లేదు. అగకూడదు.

 

మంచి చదువు చదువుకుని పైకి రావాలని ఒకమ్మాయి కోరిక. మంచి ఉద్యోగం సంపాదించి, తన కాళ్ళ మీద తను నిలబడి ఒక బాధ్యతగల పౌరుడిగా వుండాలని ఒకతని కోరిక. స్వచ్ఛంద సేవ చేసి, పేదవారికీ వికలాంగులకీ సహాయం చేయాలని ఒకావిడ కోరిక. ఇలా ఎన్నోరకాల కోరికలు. మరివ్వన్నీ మనిషికీ, సమాజానికీ, మానవత్వానికీ అవసరమేగా!

 

కానీ ఆ కోరికలు అవసరాలని మించి, గొంతెమ్మ కోరికలుగా మారి, అత్యాశతో మానవుడిని దానవుడిగా చేయటం, దాని ఫలితంగా ఎందరో అమాయకులు బలి అవటం చూస్తూనే వున్నాం. అంతేకాదు, ఈ అత్యాశతో తమ స్వంత జీవితాలను కూడా తమంతట తామే నాశనం చేసుకుంటుంటారు.

‘ఆవిడకి అందరికన్నా తనే గొప్ప అని, తన ఆధిక్యత చూపించాలనుకుంటుంది. అందుకే మొగుడ్ని పీడించి, తాహతుకి మించి ఎన్నో బంగారు నగలు, నెలనెలా కొత్త చీరలూ, ఈమధ్యనే ఒక కొత్త కారు కూడా కొనేదాకా వూరుకోలేదు. ఈవిడ బాధ భరించలేక, ఆయన లంచాలు తినటం మరిగాడు. ఏంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకుని ఆయన్ని జైల్లో వేశారు! తిక్క కుదిరింది’

 

‘తన స్వంత అన్ననే చంపి ముఖ్యమంత్రి అయాక, ఆయన నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు. ప్రభుత్వ భూముల అమ్మకాలు, దొంగ కాంట్రాక్టులు, అన్ని ప్రాజక్టుల్లోనూ కంపెనీల్లోనూ వాటాలు.. లంచాలు తినటంలో ఎన్నో కొత్త కొత్త పధ్ధతులు కనిపెట్టి మరీ డబ్బు చేసుకున్నాడు. సింగపూర్ నించీ స్విట్జర్లాండ్ దాకా అన్ని బాంకులూ నింపేశాడు. పైకి వెళ్ళేడప్పుడు, లగేజీ తీసుకువెళ్ళనీయరని తెలిసి కూడా ఎందుకో ఆ తపన!’

ముందు చెప్పిన కొన్ని మంచి కోరికలు ఒక పరిధిలో ఎంత అవసరమో, అవి దాటితే అవెంత ప్రమాదకరమో కూడా మనకి తెలుసు. అందుకని ఆ గొంతెమ్మ కోరికలకి కళ్ళాలు వేయటం ఎంతో అవసరం. అలా చేయకపోతే వినాశనానికే కారణమవుతాయి.

 

అలాగే క్రోధం. అంటే కోపం. ‘తన కోపమే తన శత్రువు’ అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. కానీ కోపం ఏమాత్రం లేని శాంతస్వరూపులని ఈ ప్రపంచంలో చాల తక్కువగా చూస్తుంటాం. 

 

‘కోపం రాకుండా ఎలా వుంటుంది. ఆ మంత్రిగారు అలా మనల్ని దోచేస్తుంటే! దేశాన్ని నాశనం చేసేస్తుంటే!’

‘ఏమండీ. మనవాడు ఈమధ్య స్కూలు ఎగ్గొట్టి, జులాయి తిరుగుళ్ళు తిరుగుతున్నాడుట. మీరు అలా వూరుకుంటే లాభం లేదు. కొంచెం కోప్పడండి!’

‘లంచం ఇవ్వందే ఒక్క పనీ చేయరు. అలా అప్పనంగా లంచాలు ఇవ్వాలంటే నాకు కోపం. మనం లంచం ఇవ్వకపోతే ఆయనకి కోపం. ఎలా చావాలి?’

‘మా ఆవిడకి కోపం ఎక్కువ. అలిగిందంటే, ఆ రోజు ఇక అన్నం పెట్టదు’

 

ఇలా కొందరు అనటం మనం రోజు వారీ చూసేదే!

అవును కోపం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా కోపం రావటం సహజమే. కాకపోతే, ఆ కోపాన్ని, కోపంన్నరో ఇంకా ఎక్కువో చేసుకుని, అదే మనసులో పెట్టుకుని జీవితాలని పాడుచేసుకునేవారున్నారు.

 

‘మా తాతలకి ఏవో కోపాలు వచ్చి కొట్టుకున్నారుట. రెండు మూడు తరాలనించీ మా మధ్య మాటల్లేవు’

అదే తెలుగు సినిమాల్లో అయితే, హీరోకి కోపం వచ్చి, ఒక పెద్ద కత్తి తీసుకుని కనపడ్డ వాళ్ళనీ, కనపడని వాళ్ళనీ నరికేస్తుంటాడు. అలాటి సినిమాలు చూసిన ఆ హీరో అభిమానులు, క్లాసు రూములో పరీక్ష వ్రాసుకుంటున్న అమాయకురాలు తనని ప్రేమించలేదని, పిచ్చి కోపంతో ఆమె మీద యాసిడ్ పోసి చంపేస్తారు.

 

ఒక మంత్రి అసెంబ్లీలో, వేరే కులం ఎమ్మెల్లే మీద వీర కోపంతో కుర్చీ విసిరేసి, అతని తల పగలకొడతాడు.

ఈ కోపాన్ని అదుపులో పెట్టకపోతే అనర్ధం తప్పదు అని తెలుసు. మరి దాన్ని అదుపులో పెట్టటం ఎలా?

 

‘కోపం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా, కొంచెంసేపు నిశ్శబ్దంగా వుండండి, కాసేపట్లో అదే తగ్గిపోతుంది’ అంటారు కొంతమంది. కోపాన్ని దిగమింగటం అంటారే... ఇదేనేమో!

 

‘కోపం వచ్చినప్పుడు, మనసులో ఒకటి నించీ పది దాకా లెఖ్క పెట్టుకుని, అప్పుడు ఇవ్వండి మీ జవాబు’ అంటారు మరి కొందరు. రెస్పాన్స్ టైమ్ కొంచెం ఎక్కువ చేయటం అన్నమాట.     

 

‘మా మేనేజరుకి కోపం ఎక్కువ. అందరి మీదా అరుస్తుంటాడు. ఆయన మీద ఎంతోమంది కంప్లంట్ చేశారు. ఆయన్ని ‘ఏంగర్ మానేజ్మెంట్ కోర్సు తీసుకోమన్నారు’

 

ఇది నిజంగా అమెరికాలో మా మేనేజర్ గారికి జరిగిన అనుభవం. ఆ కోర్స్ తీసుకున్నాక కూడా, తర్వాత తొంభై రోజులు ఆయన కోపం ఎలావుందో వారం వారం పరామర్శించేవారు హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు.

 

అలాగే మూడవది లోభం. లోభం అంటే పిసినారితనం అని మామూలుగా మనకి తెలిసిన అర్ధం. కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే, అది స్వార్ధానికి సంబంధించిన మాట. ‘నేను’, ‘నాకు’, నన్ను’ అనేవాటిని దాటి మనిషి బయటికి వెళ్ళలేనప్పుడు, అంతా ‘తనదే’, ‘తనకే’ అన్న ప్రలోభంలో పడి, దగ్గరి వారిని కూడా దూరం చేసుకునే పరిస్థితిలో కొందరు వుండటం మనం చూస్తూనే వుంటాం. 

 

తర్వాతది మోహం. మోహం అంటే కూడా ఎన్నో అర్ధాలున్నాయి.

 

విపరీతమైన మక్కువ (passion), ఆకర్షణ, భ్రమ, భ్రాంతి, వ్యామోహం, మూఢప్రేమ, అభినివేశం... ఇలా చాల అర్ధాలున్నాయి.

ఈ ‘మోహం’లో కూడా కోరికలలాగానే మంచీ, చెడూ వున్నాయి.

 

నేను మా కంపెనీలో మాన్యుఫాక్చరింగ్ జరిగే చోట, క్వాలిటీ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నా, లీన్  మాన్యుఫాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నా, ‘నీకు ఈ విషయాలంటే ఎంతో ఇష్టంతో మాట్లాడతావు. నీ పాషన్ నీ మెరిసే కళ్ళల్లో కనపడుతుంది’ మెచ్చుకుంటూ అనేవాడు మా ప్రెసిడెంట్. (ఈ వ్యాసంలో నాకు ఇష్టం లేకపోయినా, కొన్ని ఆంగ్ల పదాలు వాడవలసి వస్తున్నది. మన్నించాలి)

 

‘గాంధీగారి కథ అంటే నాకు గాఢమైన ప్రేమ. ఆయన మీద ఎన్నో పుస్తకాలు చదివి, ఎన్నో డాక్యుమెంటరీలు చూసి ఆ సినిమా తీశాను. దానివల్లే ‘గాంధీ’ సినిమా అంత గొప్పగా వచ్చింది’ అంటాడు రిచర్డ్ అట్టిన్బరో.

 

‘మా యాభై ఏళ్ళ వివాహ జీవితం ఇంత హాయిగా గడవటానికి కారణం, మాది మూఢప్రేమ. ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి విపరీతమైన ఇష్టం. అందుకే ఇన్నాళ్ళయినా మా మధ్య అంత అనుబంధం’ 

 

ఇవన్నీ మనలోవున్న మోహానికి మంచి ఉదాహరణలు. ఇలాటివి మానవుల మనుగడకి అవసరమైన మోహాలు.

 

మోహినిని (పేరులోనే వుంది మోహం) చూసి, ఆకర్షణలో పడి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు భస్మాసురుడు.

తమ రాజ్యకాంక్ష మీద వున్న వ్యామోహంతో, కుటిల యుధ్ధం కోరి నాశనమై పోయారు కౌరవులు.

పదవుల మీదా, డబ్బు మీదా, వాళ్ళ కులం మీదా  వున్న మోహంతో ప్రజలని దోచుకుతింటున్నారు, మన రాజకీయ నాయకులు.

అలాగే మద, మాత్సర్యాలు.

మదం అంటే అహంకారం. గర్వం. ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడటం.

 

ఒక సినిమా నటుడు, తనని ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో, రోడ్డు పక్కన నిద్ర పోతున్న పేదల మీద నించీ కారు పోనిచ్చి వాళ్ళని చంపేస్తాడు.   

తన జాత్యహంకారంతో, మిగతా జాతుల వారిని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు.

 

తన ధన మదంతో, ప్రపంచంలో దేన్ననయినా కోనేయగలను అనుకుంటాడు ఒక ధనజీవి.

 

పదవి మదంతో, తను విద్యామంత్రి కాకపోయినా, స్వంత ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని పోషించి డబ్బు చేసుకోవటానికి, మాతృభాషనే మటుమాయం చేయటానికి పూనుకుంటాడు ఒక అవిద్యాపరుడు.

 

‘అహంకారంతో అతని కళ్ళు మూసుకుపోయాయి’ అంటారు.

 

మాత్సర్యం అంటే ఈర్ష్య. ద్వేషం.

 

మిస్సమ్మ (పాత తెలుగు సినిమా)లో ‘బృందావనమది అందరిదీ.. ‘ అనే పాటలో ‘ఎందుకె రాధా ఈ సునసూయలు’ అని ఒక చరణం వుంది.

‘ఈ సునసూయలు’ ఏమిటండీ అని అడిగేవారు కొందరు. అది ఈసు, అసూయలని కలిపిన సమాసం. ఈసునసూయలు. ఈసు అంటే ఈర్ష్య.

 

అదన్నమాట ఇది!

 

‘తెలుగువాడు పైకొస్తున్నాడు, తోక్కేయండి!’

 

‘అమెరికావాడు ఇప్పుడు బోయింగ్ విమానాలు కనిపెట్టాడు కానీ, మనకి పుష్పక విమానాలు ఎప్పుడో వున్నాయి’

‘ఏమండీ! అనసూయకి వాళ్ళాయన రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడండీ. నాకు ఇంకా ఖరీదైన నెక్లెస్ కొని, వాళ్ళకన్నా మనమే గొప్ప అని చెబుదాం’

ఇవన్నీ ఈసునసూయలే! 

 

‘నన్ను ఈ దేశానికి అధ్యక్షుడిని చేస్తే, ముస్లిముల్ని మన దేశానికి రాకుండా చేస్తాను. ఇక్కడ వున్న ముస్లిముల్ని బయటికి పంపిస్తాను. మెక్సికోకీ మన దేశానికీ మధ్య పెద్ద గోడ కట్టేస్తాను. ఇండియన్సుకీ, మిగతా వలస వచ్చిన వారికీ  వీసాలు పీకేస్తాను. ఆడవాళ్ళని ‘ఏదో’ చేస్తాను. నల్లవాళ్ళని జైళ్ళల్లో తోసేస్తాను. ధనవంతుల్ని ఇంకా ధనవంతులుగా చేస్తాను. తెల్లవారి దొరతనం కాపాడతాను’ ఇవన్నీ టీవీలో బహిరంగంగా చెప్పిన మాటలు.

 

ఒక్క వాక్యంలో చెప్పాలంటే, తన ద్వేషంతో మానవత్వాన్ని మటుమాయం చేస్తాడని అర్ధం.

 

అలా కావాలనుకున్న వాళ్ళే, అతనికి ఓట్లు వేసారు. దేశాన్ని వంద ఏళ్లు వెనక్కి తీసుకువెడుతున్నారు.

 

ప్రేమతో దేన్నయినా సాధించవచ్చు. ద్వేషంతో ఏదైనా సర్వనాశనం చేసేయవచ్చు.

 

ఇవన్నీ ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారాలు.

 

మరి అరిషడ్వర్గాలను అదుపులోకి తెచ్చుకోవటం ఎందుకు జరగటం లేదు?

 

ఇవి కేవలం పుస్తకాల్లో దాచుకునే నీతి వాక్యాలుగా మిగిలిపోతాయా?

 

అంగట్లో అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత ఇలాటిదేనా?

 

వీటన్నిటినీ అదుపులోకి తెచ్చుకోలేకపోయినా, కొంతవరకూ, ఈ ఆరు అనర్దాలలో కొన్నిటిని అయినా అదుపులోకి తెచ్చుకోవచ్చు కదా!

 

ఎంత కప్పుకి అంత కాఫీ మరి!

                                     ౦                  ౦                  ౦

Bio

సత్యం మందపాటి

తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయ పురంలో పుట్టి గుంటూరులో పెరిగిన సత్యం మందపాటి గారు కాకినాడ, విశాఖపట్నం లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టభద్రులు. త్రివేండ్రం లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ నాటి యువ, జ్యోతి ల నుండి ఈ నాటి రచన,  ఆంధ్రభూమి, నవ్య, చతుర, కౌముది, సుజన రంజని మొదలైన అనేక పత్రికలలో ఐదు దశాబ్దాలుగా 200 కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు, పత్రికలో దీర్ఘకాలిక శీర్షికలు రచించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు  రచించిన కథకుడు సత్యం గారే. ఆయన రచనలు ఇంచుమించు అన్ని తెలుగు పత్రికలలోనూ ప్రచురించబడి అనేక పురస్కారాలని అందుకున్నారు. కథా సంపుటులు, నవలలు, కవితా సంపుటి వెరసి 10 పైగా గ్రంధాలు   ప్రచురించారు. గేయ రచయితగా ఆయన రచించి ప్రదర్శించిన సంగీత రూపకం “వేయి వసంతాలు” సాలూరి వాసూ రావు సంగీత దర్శకత్వంలో ఎస్.పి. బాలూ, శైలజ ఆలపించారు. 1998 నుంచి ఆరు నెలలకొకసారి టెక్సస్ లోని అనేక నగరాలలో టెక్సస్ సాహిత్య సదస్సుల నిర్వహణ లో కీలక పాత్ర వహిస్తున్నారు. పిల్లల కోసం తెలుగు బడి, భాషాప్రియులకోసం నెల వారీ ఆస్టిన్ సాహిత్య సమావేశాలూ నిర్వహిస్తున్న సత్యం మందపాటి గారు సతీమణి విమల గారితో నాలుగు దశాబ్దాలుగా ఆస్టిన్ నగర నివాసి..

***

bottom of page