top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

సత్యాన్వేషణ - 16

తెలుగునాట కళాకారులకు గౌరవం వుందా?

 

సత్యం మందపాటి

ఆమధ్య ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ఇదే ప్రశ్న వచ్చింది. మన కళాకారులకు తెలుగునాట గౌరవం వుందా అని. 

అప్పుడే అతను అడిగాడు “అసలు కళలు అనేవి మనిషి మనుగడకు అవసరమా చెప్పండి” అని. ఆ ప్రశ్న కొంచెం హాస్యాస్పదంగానే వున్నా, నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. 

ప్రపంచంలో ఏ సంస్కృతిని తీసుకున్నా, ఆ సంస్కృతికి చిహ్నంగా కొన్ని సంకేతాలు ఇది ఫలానా సంస్కృతికి సంబంధించినది అని చెప్పకనే చెబుతుంటాయి. ఉదాహరణకు రోమన్ శిల్ప శిధిలాలు చూడగానే అవే సంస్కృతికి సంబంధించినవో ఇట్టే తెలిసిపోతాయి. అలాగే మన గుడులు, గోపురాలు, భారతదేశంలోనే కాక ఏ దేశాల్లో వున్నా అవి ఏ సంస్కృతికి చెందినవో తెలుసుకోవటం ఎవరికైనా చాల సులభం. శిల్పకళ మనవాళ్ళు చెబుతున్న అరవై నాలుగు కళలలో ఒకటి.

 

అలాగే సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నృత్యం ఇలా ఎన్నో వున్నాయి. ఆహార వ్యవహారాలు కూడా ఏదో ఒక సంస్కృతికి చిహ్నాలే. అమెరికాలో కూడా మేము రాత్రి భోజనాలకి బయటికి వెడుతూ, ‘ఇవాళ మనం ఎక్కడికి వెడదాం, ఇటాలియనా, మెక్సికనా, చైనీసా, ఇండియనా’ అని మాట్లాడుకుంటాం. అదీ సాంస్కృతిక పరంగానే. అంటే ఈ కళలు అనేవి, పాకశాస్త్రంతో సహా, సంస్కృతిలో ఒక పెద్ద భాగమే.  

ఒక సంస్కృతిని నిలబెట్టటానికి కళలూ, భాషా, సంప్రదాయాలలాటివన్నీ అవసరమే. 

‘మనిషన్నాక, కూసింత కళా పోషణుండాలి. లేకపోతే మనిషికీ గొడ్డుకీ తేడా ఏమిటి?’ అంటారు ముళ్ళపూడి వెంకటరమణ, రావు గోపాలరావు నోటితో. 

***

నా చిన్నప్పుడు, అంటే 1950 దశకంలో గుంటూరులో పెరుగుతున్న రోజుల్లోనూ, 1960 దశకంలో గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంలో డిగ్రీ కోర్సుల్లో చదువుకుంటున్న రోజుల్లోనూ, నాకు ‘అసలు కళలు అంటే ఏమిటి, అవి ఎందుకు’ అనే విషయాలను ఆకళింపు చేసుకోవటమే కాక, వాటిని ఆనందించే అవకాశాలు కూడా ఎన్నో వచ్చాయి. వాటిని అంది పుచ్చుకుని, ఆనందించే వ్యక్తిత్వం కూడా నాకు అప్పుడే అబ్బటం నా అదృష్టం. 

గుంటూరులో శ్రీరామనవమికి పందిళ్ళు వేసి తొమ్మిది రోజులు పగలూ రాత్రీ మంచి హరికథలు, బుర్ర కథలు, కర్ణాటక సంగీత కచేరీలు, లలిత సంగీతం, సినిమా పాటలు, పౌరాణిక నాటకాలు మొదలైనవి వేసేవారు. అప్పుడు ఎవరికి కావలసిన కార్యక్రమాలు వాళ్ళు చూస్తుండేవాళ్ళం. అలాటి వాళ్ళల్లో ‘ప్రజంట్ సార్’ అంటూ నేనూ ఒకడిని. 

పౌరాణిక నాటకాల్లో అబ్బూరి వరప్రసాదరావుగారు, షణ్ముఖి ఆంజనేయరాజుగారు, వేమూరి గగ్గయ్యగారు మొదలైన ఎంతో గొప్ప నటులు ఆ నాటకాల్లో పాల్గొనేవారు. జనం ఈలలు వేసి, వన్స్ మోర్ అంటూ కొన్ని చక్కటి పద్యాలు మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేవారు. ఎక్కువమంది పౌరాణిక నాటక నటులు అప్పుడు ఆంధ్రా పారిస్ అని పేరుబడ్డ తెనాలిలో వుండేవారు. అప్పుడే మా నాన్నగారు కూడా గుంటూరులో ఒక సాంస్కృతిక సంస్థలో, పేరు నాగార్జున కళా సమితి అనుకుంటాను, సభ్యులేకాక కొన్నాళ్ళు వారి నిర్వహణ కమిటీలో కూడా ఏదో పదవిలో వున్నట్టు గుర్తు. అప్పుడు బాలమురళీ కృష్ణ, నేదునూరి, శ్రీరంగం గోపాలరత్నం మొదలైన విద్వాంసుల కచేరీలు, సురభి వారి నాటకాలు, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు కూడా ఎన్నో ప్రదర్శించేవారు. ఆ కార్యక్రమాలు కనీసమా సంస్థ సభ్యులకు అందుబాటులో వుండేవి. నేనూ కొన్ని నాన్నగారితోనూ, ఆయన వాటికి రాలేకపోయిన రోజున ఇంకెవరితోనో వెడుతుండేవాడిని. బాపుగారు చెప్పినట్టు ‘ఆ రోజులే వేరు’!

అలాగే ఆంధ్రా యూనివర్సిటీలో కె. వెంకటేశ్వర్రావుగారి దర్శకత్వంలో రావిశాస్త్రిగారి ‘నిజం’, కారాగారి ‘యజ్ఞం’ మొదలైన ఎన్ని గొప్ప నాటకాలు చూశానో లెఖ్కలేదు. 

దరిమిలా తెనాలి నించీ వచ్చే నాటకాలలో నటులకు, నాటక ప్రదర్శకులకు ఉపాధి కిట్టక చాలవరకూ అవి మూతపడ్డాయి కూడా. వారి కళలని కలల్లోనే పెట్టుకుని, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు చాలమంది. సాంఘిక నాటకాలు వేసే వారు కూడా అది ఒక వృత్తిగా తీసుకోక, ప్రవృత్తిగా మార్చుకుని సమయం దొరికినప్పుడు మాత్రమే తెలుగునాట నాటకరంగాన్ని ఇంకా బ్రతికిస్తున్నారు. అలాగే పరిషత్తు నాటికలు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరులలో ఎంతో ఘనంగా జరుగుతుండేవి. ప్రఖ్యాత సినీ దర్శకుడు, రచయిత, నటుడు జంధ్యాల, దాసరి, రచయితలు రావిశాస్త్రి, ఎన్నార్ నంది, ఆదివిష్ణు, కొర్రపాటి గంగాధరరావు మొదలైన రచయితలు ఎన్నో చక్కటి నాటికలు, నాటకాలు వ్రాశారు. అక్కినేని, ఎస్వీఆర్, గుమ్మడి, రేలంగి, జగ్గయ్య, సీఎస్సార్, అంజలీదేవి, సావిత్రి, జి.వరలక్ష్మి, సూర్యకాంతం, ఛాయాదేవి, ఎస్వరలక్ష్మి, రావు గోపాలరావు, ధూళిపాళ, నాగభూషణం, మిశ్రో, ఎల్బీ శ్రీరాం, సుత్తి వీరభద్రరావు, ధర్మవరపు, సుత్తి వేలు ఇలా ఎందరో నటులు నాటకాలనించీ సినిమా రంగానికి వచ్చిన వారే. ఆ రోజుల్లో నాటకరంగం ఎంతో కళకళలాడుతూ వుండేది. నాగభూషణం తెలుగు నాట తన ‘రక్తకన్నీరు’ నాటకం కొన్ని వందలసార్లు ప్రదర్శించి రికార్డు నెలకొల్పారు. 

ఈనాటి సినిమారంగంలోలాగా కుల మాఫియాలు, కుటుంబ మాఫియాలు లేని రోజులు కనుక, పెద్దా చిన్నా నటులందరూ గొప్ప నటులే, కళాకారులే! తర్వాత సినీ నటులు కూడా అయి, పేరూ ప్రఖ్యాతులు సంపాదించిన వారే!  

ఆరోజుల్లోనే తెనాలి నాజర్ దళం వారి బుర్రకథలు కూడా చూసిన అదృష్టవంతుడిని. ఎన్నో హరికథలు. ప్రతి పండుగకీ ఎక్కడ చూసినా ఎన్నో మంచి హరికథా కార్యక్రమాలే. అలాగే తోలు బొమ్మలాటలు. సంక్రాంతి పండుగకి హరిదాసులూ, డూడూ బసవన్నలూ కళకళలాడుతూ వుండేవి. పల్లెల్లో వినిపించే ఎన్నో గొప్ప జానపద గేయాలు కూడా, ఈనాడు పల్లెల్లో ఎక్కువగా వినపడటం లేదు. 

1970 దశకంలో తిరువనంతపురంలో స్పేస్ సెంటర్లో నేను పనిచేస్తున్నప్పుడు ఎన్నో చక్కటి కర్ణాటక సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు చూసే అవకాశం కూడా వచ్చింది. అక్కడ పెద్ద వెసులుబాటు ఏమిటంటే, సినిమాకి టిక్కెట్టు మూడు రూపాయలయితే, ఈమని శంకరశాస్త్రి, బాలమురళి, వసంతకుమారి, జేసుదాసు మొదలైన గొప్పవారి కచేరీలు కేవలం ఐదు రూపాయల టిక్కెట్టుతో చూడగలిగే వాళ్ళం. అంత చౌకగా చూపించటానికి కారణం వేలల్లో జనం వచ్చి, అలాటి సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేసేవారు. అలాగే ఎన్నో నృత్య ప్రదర్శనలు కూడా చూసేవాళ్ళం. మేము అక్కడవున్న పదేళ్ళలో సినిమాల కన్నా, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలూ ఎన్నో చూశాం. కానీ అదే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇలాటి కళా ప్రదర్శనలకు వచ్చే జనం చాల తక్కువ కనుక టిక్కెట్టు ఖరీదు చాల ఎక్కువగా వుండి, మధ్య తరగతి కుటుంబాలకి అందుబాటులో వుండేది కాదు.  

ఆరోజుల్లోనే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో అన్ని కళలలకూ, భాషకూ పెద్ద పీట వేసేవారు. కళలకూ, కళాకారులకూ ఎంతో గౌరవం, ఆదరణా, ఆర్ధిక పోషణా విపరీతంగా వుండేది. మంచి కళాకారులకు ఆర్ధిక ఇబ్బందులు వుండేవి కావు. ఆనాడే కాకుండా ఈరోజుల్లో కూడా, కళలకు ఆయా రాష్ట్రాల వారు ఇచ్చే గౌరవం చూస్తుంటే, పశ్చిమ దేశాల ప్రభావం ఎంతగా వస్తున్నా, భారతీయ సంస్కృతి మనుగడకి ఏమీ ప్రమాదం లేదనే ధైర్యం వస్తుంది.  

అదే సమయంలో ఆంధ్రప్రదేశంలో కళలకు ప్రాముఖ్యం తగ్గటం చూసి బాధ వేసేది. 

బాలమురళీకృష్ణగారిని తమిళ, కన్నడ, మలయాళ ప్రజలు ఎంతో ఆరాధించేవారు. అలాగే చిట్టిబాబు, గాయత్రి, ఈమని శంకరశాస్త్రి, మాండొలీన్ శ్రీనివాస్… ఇలా ఎందరో సంగీత విద్వాంసులకు తమిళనాడు, తదితర దక్షిణాది రాష్ట్రాల్లో వున్న ఆదరణ తెలుగునాట లభించలేదు. అంతేకాదు కర్ణాటక సంగీతానికి తెలుగులో ప్రాణం పోసిన త్యాగరాజస్వామి ఎవరో కూడా తెలుగునాట చాలమందికి ఈరోజుల్లో తెలియదు. ఏడెనిమిదేళ్ళ క్రితం గుంటూరులో రెండుసార్లు త్యాగరాజ ఉత్సవాలకు వెళ్ళాను. పట్టుమని పదిమంది కూడా లేరు. ఆ వున్నవాళ్ళు కూడా పాటలు పాడటానికి వచ్చినవారు, వారి బంధు మిత్రులూ. 

వెంపటి చిన్న సత్యంగారికి కుడా మద్రాసే శరణ్యమయింది. అక్కడికి వెళ్ళాకనే ఆయన కూచిపూడి నాట్యానికి ఎంతో గుర్తింపు, పేరు తెచ్చారు. భరతనాట్య తారలు వైజయంతిమాల, హేమమాలిని, రేఖ మొదలైనవారు కూచిపూడి నృత్యంలో ఆయన శిష్యులే. ఈనాడు అమెరికాలో ఆయన శిష్యురాళ్ళు ఎందరో ఎంతోమందికి కూచిపూడి నృత్యం నేర్పిస్తూ, ఆయన మొదలుపెట్టిన ఈ నృత్య కళా యజ్ఞాన్ని ఇంకా కొనసాగిస్తూనే వున్నారు.  కూచిపూడి గ్రామంలోని నాట్యాచార్యులు మాత్రం కొందరు రోజులు గడవకపోయినా నాట్య వృత్తిని నమ్ముకుని అక్కడే వుండిపోవటమో, లేదా మరి కొందరు చదువుకుని వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోవటమో కూడా జరిగింది.

లలిత సంగీతం పాడేవారికీ, సంగీతం సమకూర్చేవారికీ కూడా సరైన జీవనోపాధి దొరకటం లేదు. ఆరోజుల్లో ఆలిండియా రోజుల్లో పాడేవారికి కూడా, జీవనభృతికి సరిపడా ధన సంపాదన వుండేది కాదు. ఈ సంగీతకళని కూడా, ప్రవృత్తిగా తీసుకోవటమో, లేదా ఆ లలితకళలను, వారి కలలోనే వుంచుకుని వేరే ఉద్యోగాలకి వెళ్ళటమో చేసేవారు.    

సినిమాల్లో పాటలు పాడే అవకాశాలున్న కొద్దిమందికి రెండు పూటలా తిండి ఇబ్బంది లేకపోవచ్చుగానీ, ఆరోజుల్లోనే కాదు, ఈరోజుల్లో కూడా ఆర్ధిక స్థిరత్వం వచ్చినవారు చాల తక్కువ. 

చేనేత వస్త్రాలు, అద్దకాలు, బాటిక్ పైటింగ్, కొండపల్లి, నిర్మల్ బొమ్మలు అన్నీ పెద్ద దుకాణాదారుల లాభాల చేతుల్లోకి వెళ్ళి, ఆయారంగాల్లో నిపుణల చేత పని చేయించకుంటూ, వాళ్ళని మాత్రం సరిపడా సంపాదన లేకుండా రోడ్డెక్కించాయి. హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలూ మొదలైనవేవీ తెలుగువారికి ఎవరికీ అఖ్కర్లేదు. 

అలాగే చిత్ర లేఖనం. మన తెలుగువారిలో అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తక్కువలేని గొప్ప చిత్రకారులు, కార్టూనిష్టులు వున్నారు. వారిలో ఎంతోమంది దిన, వార, మాస పత్రికలకు కార్టూన్లు, బొమ్మలు వేయటం తప్ప, తమ వర్ణ చిత్రాలని ఆఫీసులకీ, హోటళ్ళకీ, ఆర్ట్ గ్యాలరీలకీ అమ్మి, తమ జీవన సరళిని మెరుగుపరుచుకున్న కథలు నేను వినలేదు. యూరపులోను, జపాన్, అమెరికాలోనూ, చైనాలలోనూ చక్కటి వర్ణ చిత్రాలకి ఎంతో విలువ వుంది. భారతదేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఎంతోమంది తెలుగేతర చిత్రకారులు మంచి పేరే కాక, ఆర్ధికంగా పుంజుకున్న వారు ఎందరో వున్నారు. మరి మన తెలుగు చిత్ర కళాకారులలో బాపుగారు, చంద్రగారు మొదలు ఈనాటి చిత్రకారుల దాకా ఎంతోమంది, వారెవరికీ తీసిపోని సత్తావుండి కూడా ఎందుకు ఆ స్థాయికి వెళ్ళలేకపోయారు? నాతో చంద్రగారే కాదు, బాపుగారు కూడా ఒకటి రెండుసార్లు అన్నారు, ‘పత్రికల వాళ్ళు చాలమంది పండగల ప్రత్యేక సంచికలకి అట్ట మీద బొమ్మలు, కథలకి బొమ్మలు, కార్టూన్లు వేయించుకుంటారు కానీ, డబ్బులివ్వటం మాత్రం మరచిపోతుంటారు’ అని. అదీ మన చిత్ర కళాకారులకి మనం ఇచ్చిన, ఇస్తున్న గౌరవం! 

గుంటూరులో మా ఇంటి పక్కనే ఒక పెద్ద గ్రంధాలయం రెండు అంతస్థుల భవనంలో వుండేది. పుస్తకాలు చదువుకునే వారితో ఎప్పుడూ కిటకిటలాడుతూ వుండేది ఆ లైబ్రరీ.  ప్రతి రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాకా, శనాదివారాల్లోనూ అక్కడే నా చిరునామా. చందమామ, బాలమిత్ర, బాల మొదలైన పిల్లల పత్రికలతో మొదలయింది నా పుస్తక పఠన ప్రయాణం. అవి చదువుతూ సాహిత్యం మీద సరదా పుట్టి గురజాడ, కందుకూరి, మొక్కపాటి, మునిమాణిక్యం, పానుగంటి, ముళ్ళపూడి, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కారా, పద్మరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర, శేషేంద్రశర్మ, తిలక్ ఇలా ఎందరో గొప్ప తెలుగు రచయితల పుస్తకాలు ఏవీ వదలకుండా చదివేవాడిని. తర్వాత కొన్ని గొప్ప ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ నవలలకు తెలుగు అనువాదాలు కనపడితే అవి చదివేవాడిని, మద్దిపట్ల సూరి, ముళ్ళపూడి వెంకటరమణ ఇంగ్లీషు పుస్తకాల అనువాదాలు చేస్తే, చక్రపాణి, బొందలపాటి శకుంతల, బొందలపాటి శివరామకృష్ణ ఎన్నో బెంగాలీ నవలలు తెలుగులోకి అనువదించారు. అవి చదివాక ఇంకా ఉత్సాహం వచ్చి ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం దాకా వెళ్ళాను. ఎందుకు చెబుతున్నానంటే, సాహిత్యం అరవై నాలుగు కళలలో ముఖ్యమైనది. కాలానుగుణమైన సంస్కృతులను అర్ధం చేసుకోవటానికీ, ఆనందించటటానికీ సులువైన మార్గం. అలా ఎన్నో పుస్తకాలు చదువుతుంటే నాకు తెలుగు భాష మీద ఎనలేని ప్రేమ కలగటమే కాక, నేనూ ఒక సన్నపాటి రచయితనయే అవకాశం కూడా వచ్చింది. అయినా నేను నిత్య పాఠకుడినే. ఇప్పటికీ ఏ మంచి కథ, కవిత, పుస్తకం కనపడినా వదిలిపెట్టకుండా చదువుతూనే వుంటాను.  

అప్పుడు విజయవాడలో గవర్నర్ పేట సెంటర్లో నవోదయా, నవభారత్, నవజీవన్, విశాలాంధ్ర, అనుపమ, అరుణ, అరుణోదయ… ఇలా ఎన్నో పుస్తక ప్రచురణకర్తలు వుండేవారు. అక్కడే కాక తెలుగునాట ప్రతి పుస్తకాల షాపు ఎన్నో వందల పుస్తకాలతోనూ, పాఠకులతోనూ కళకళలాడుతూ వుండేవి. తర్వాత తెలుగుతేజాన్ని ఢిల్లీదాకా తీసుకువెళ్ళిన ఒక ముఖ్యమంత్రిగారు తెలుగుదేశంలో గ్రంధాలయాలకి ధన సహాయం పూర్తిగా ఆపేసి, ఎన్నో చక్కటి గ్రంధాలయాలని మూసివేశారు. విజయవాడలో ఎన్నో పుస్తక ప్రచురణ సంస్థలు దివాళాతీశాయి. నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా విజయవాడలో నవోదయా రామ్మోహనరావుగారిని కలిసేవాడిని. ఆయనే ఇవన్నీ చెబుతూ, ఎలాటి రోజులు ఎలా తయారయాయో చెబుతూ బాధపడేవారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త ఆంధ్ర ప్రదేశంలో లైబ్రరీలు మళ్ళీ ఎక్కువగా పుస్తకాలు కొంటున్నాయి అని చెప్పారు కొంతమంది రచయిత మిత్రులు. ఎన్నో అవరోధాలు, అవస్థలు, అడ్డదారులు అడ్డం పడుతున్నా, కనీసం గ్రంధాలయాలు పుస్తకాలు కొంటున్నాయి అనేదే ఒక పెద్ద శుభవార్త!  

ఆరోజుల్లో కిళ్ళీ షాపుల్లో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, యువ మొదలైన ఎన్నో గొప్ప వారపత్రికలూ, మాస పత్రికలూ అమ్ముతుండేవారు. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కొసల్యాదేవి, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, బీనాదేవి, రావిశాస్త్రి, రంగనాయకమ్మ మొదలైన రచయితల సీరియల్స్ వస్తున్న పత్రికలు విడుదలయే రోజున, ఆ షాపుల దగ్గర క్యూలో నిలుచుని పత్రికలు కొనేవాళ్ళం. తర్వాత తెలుగుదేశంలో చదువులు అమ్మకానికి పెట్టి తెలుగు నేర్పటం మానేసిన తర్వాత, తెలుగు చదవగలిగిన వారి సంఖ్య తగ్గిపోయింది. తెలుగే చదవలేని తెలుగువారికి తెలుగు పత్రికలెందుకు? పుస్తకాలు ఎందుకు? 

ఐదు కోట్ల తెలుగువారి కోసం మూడు వేల కాపీలు వేసిన ప్రచురణకర్తలు, ఇప్పుడు పది కోట్ల తెలుగువారికి నాలుగు వందల కాపీలు వేయటానికి భయపడుతున్నారు. చివరగా మిగిలిన ఆంధ్రభూమి, తెలుగువెలుగు, విపుల, చతుర మొదలైన పత్రికలు కూడా ఈమధ్య ఒకటి రెండు నెలల్లో పూర్తిగా మూతపడ్డాయి. తెలుగునాట తెలుగు సాహిత్యానికి ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు సాహిత్యమే కాదు, ఇప్పుడు ఇంగ్లీషు పుస్తకాలతో సహా ఏ భాషా పుస్తకమైనా చదివే స్థితిలో లేరు మన తెలుగువాళ్ళు. చదవటం అనేదే మన తెలుగునాట అటకెక్కింది. 

నాకెంతో ఇష్టమైన సాహిత్య ప్రక్రియ అవధానం. చందోబద్ధమైన పద్యం తెలుగువారి స్వంతం. ఆ పద్యకళతో జ్ఞాపకశక్తిని జోడించి, మెదడుకి పదును పెట్టే అష్టావధానాలు, శతావధానాలు కొన్ని నా చిన్నప్పుడే చూశాను. అవి నా చిన్నప్పుడు పూర్తిగా అర్ధం కాకపోయినా, నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాకి వచ్చిననాటినించీ ఇప్పటి దాకా చూసి ఆనందిస్తున్నాను, పాల్గొంటున్నాను, నిర్వహిస్తున్నాను. అదొక తీరని దాహం. ఇప్పుడు ఎంతోమంది యువ అవధానులు రావటం కూడా చాల ఆశాజనకంగా వుంది. వారిలో కొందరు అమెరికాలో కూడా అవధానాలు చేయటం మాకు ఇక్కడ బాగానే వున్నా, వారి జీవనోపాథికి అవధానాలు ఎంత సహాయం చేస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. అవి చూసేవారు బాగా తగ్గిపోయారు. వారు కూడా అవధానాలని ఒక ప్రవృత్తిగా తీసుకోవలసి వస్తున్నది. ఇద్దరు ముగ్గురు ప్రముఖ అవధానులు, బ్రతుకుతెరువు కోసం టీవీలలో ప్రవచనాలు చేసుకుంటూ, అవధానాలు చేయటం తగ్గించారు. లేదా మానేశారు అనాలేమో!  

ఒకసారి గొల్లపూడి మారుతీరావుగారు నాతో చెప్పారు, “మా తెలుగు తల్లికీ మల్లె పూదండ” వ్రాసిన గొప్ప కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్యగారు, తన చివరి రోజుల్లో తినటానికి తిండి కూడా లేక, మద్రాసు సెంట్రల్ స్టేషన్ బయట కూర్చుని అడుక్కునేవారని. ఆయన వ్రాసిన ఆ పాట, మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా వుండేదని. మరి ప్రభుత్వం ఆయన్ని ఆర్ధికంగా ఎందుకు ఆదుకోలేదో! అలాగే ఇరవై ఏళ్ల క్రితం ఒక పత్రికకి సంపాదకుడైన నా సాహితీ మిత్రుడు, ‘ఆర్థికంగా దీనావస్థలో వున్న రచయిత ఎన్నార్ నందిగారు తన వృధ్యాప్యంలో, ఇంటి అరుగు మీద నించీ క్రింద బురద కాలువలో పడి చనిపోయారనీ, ఆయన అంత్యక్రియలు చేయటానికి కూడా డబ్బులు లేవనీ’ చెబితే, నాకు కన్నీళ్ళు ఆగలేదు. ‘మరో మహెంజోదారో’లాటి ఆనాటికీ, ఈనాటికీ ఎంతో గొప్ప నాటిక వ్రాసింది ఆయనే. 

నందిగారి ఎన్నో కథలు, నైమిశారణ్యంలాటి నవలలు, అక్కినేని ఆదుర్తి కలిసి నిర్మించిన సుడిగుండాలు సినిమాకి డైలాగులు అన్నీ మనసులో మెదిలాయి. నాకు తోచిన ధన సహాయం చేశాను కానీ, ఒక గొప్ప రచయిత కుటుంబాన్ని నిలబెట్టటానికి అదేమాత్రం సరిపోతుంది? అలాగే మహానటి సావిత్రి కోమాలో వున్నప్పుడు మన ప్రభుత్వం ఏమాత్రం ధన సహాయం చేయకపోవటం క్షమార్హం కాదు. ఆవిడ తుపానులు, వరదలులాటి ఎన్నో ప్రకృతి విలయ తాండవాలకి, తీక్షణమైన ఎండని కూడా ఖాతరు చేయకుండా ఆ మండుటెండలలో తిరుగుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేసిందో కూడా మరచిపోయింది మన ప్రభుత్వం!  

ఇంకొక విషయం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యంలో ఇచ్చే పురస్కారాలు, సాహిత్య అకాడెమీ పురస్కారాలూ, చాలవరకూ కుల రాజకీయ నాయకుల కుళ్ళు చేతుల్లోకి వెళ్ళి, వాటికి ఏమాత్రం విలువ లేకుండా చేశాయి. ఆనాటి బాలమురళీకృష్ణగారి నించీ, ఈమధ్య అస్తమించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి దాకా మన తెలుగు కళాకారులకి చాలమందికి ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదించటమే కాక, వారికవి తెప్పించినది కూడా తమిళనాడు ప్రభుత్వమే. మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. 

అలా మన తెలుగు కళాకారులని తెలుగు దేశంలో వారి కళా రంగాలనించీ మనమే తరిమేశాము. 

మన కళలనే కాదు, కళాకారులని కూడా గౌరవించేటంత సమయమూ, సంస్కారమూ మన తెలుగువారికీ లేదు. మన ప్రభుత్వానికీ లేదు. ప్రజలకి కుప్పిగంతు డాన్సుల సినిమా పిచ్చి. కుటుంబ హింసల సీరియల్సు పిచ్చి. మంత్రులకీ, ప్రభుత్వోద్యోగులకీ డబ్బు పిచ్చి. పదవీ అహంకారం. 

ఏ కళలూ లేకుండా సంస్కృతి అనేది వుండదు. 

అందుకే మన కళలను చంపేసుకుని, మన సంస్కృతిని మనమే చంపుకుంటున్నాము. 

యునెస్కో తెలుగు భాషని ‘కాబోయే మృత భాష’ అని ప్రకటించింది. ఎందుకంటే ఒక సంస్కృతి మాసిపోతే, ఆ సంస్కృతికి సంబంధించిన భాష మృతభాష అవుతుందీ అని! 

మరి మీరే దీర్ఘంగా ఒకసారి ఆలోచించండి మనం చేస్తున్నదేమిటో! 

మన చుట్టూ వున్న మిగతా రాష్ట్రాలనీ, దేశాలనీ పరిశీలిస్తే, సాంస్కృతిక కళారంగంలో మనం ఎక్కడ వున్నామో, ఎంతగా తొందరగా దిగజారి పోతున్నామో అర్ధం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు!

*****

bottom of page