MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
సత్యాన్వేషణ-9
నాన్నా! ఇప్పుడు నన్నేం చేయమంటావ్?
సత్యం మందపాటి
“నాన్నా, ఇప్పుడు నన్నేం చేయమంటావ్?” అడిగాడు సుపుత్రుడు.
సోఫాలో వెనక్కి ఆనుకుని టీవీ చూస్తుంటే అడ్డం వస్తున్న పొట్టని కొంచెం వెనక్కి లాక్కుంటూ, “నేను ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు నా మాట వినటం లేదు కదురా. మళ్ళీ ఏం చెప్పమంటావ్” అన్నాడు పితృదేవుడు.
“వాడు అడిగినప్పుడు చెప్పకుండా, అడగనప్పుడు చెవిలో దోమలాగా గుయ్యిగుయ్యిమంటే ఏమిటి ప్రయోజనం” అంది మాతృదేవత.
అమ్మ వేపు చురచురా చూశాడు పితాశ్రీ.
“మనలాటి వారి పిల్లలు కొందరు రాజకీయాల్లో దిగారు. కొందరు సినిమాల్లో వేషాలు వేస్తున్నారు. కొందరు తండ్రుల వ్యాపారాలు అర్ధం చేసుకుంటున్నారు. మీకు ఆ మూడూ వున్నాయి. ముందు సినిమాల్లో హీరోగా వేశారు. మీ పొట్ట, చట్రం పెరిగిపోగానే దర్శకుడయారు. దానితోపాటే ఎన్నో వ్యాపారాల్లో దిగి కావలసినంత డబ్బు సంపాదించారు. కులం పేరుతో రాజకీయ నాయకుడయారు. అయినా మీరు వాడికి ఎలాటి అవకాశాలు ఇవ్వలేదు. మరి వాడేం చేస్తాడు?” అంది మాతృశ్రీ.
చేతి గడియారం చూసుకుంటూ, కొంచెం ఇబ్బందిగా చూశాడు నాన్న. “సరే చెబుతాను. ఇంతకీ నీ ప్రశ్న ఏమిట్రా?” అన్నాడు.
“నాన్నా, ఇప్పుడు నన్నేం చేయమంటావ్?” అదే డైలాగు మళ్ళీ చెప్పాడు కొడుకు.
ఒక్క నిమిషం ఆలోచించాడు నాన్న.
“నేను రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ, వ్యాపారాల్లోనూ ఊపిరాడకుండా తిరుగుతున్నప్పుడు, నిన్నంతగా పట్టించుకోలేదు. నిజమే! కానీ ఇద్దరమ్మాయిల తర్వాత పుట్టిన మగ మహారాజువని నిన్ను మీ అమ్మ ఎంతో గారాబం చేసి, అడ్డగాడిదలా పెంచింది. నువ్వేమో గాడిదన్నరలా తయారయి, స్కూలుకి వెళ్ళి చదువుకోకుండా వఠి వెధవలతో తిరిగావు. మీసాలొచ్చాక మోటార్ సైకిళ్ళు, కార్లూ, క్లబ్బులు. అదే పని. ఇరవై ఏళ్ళు వచ్చాయి కానీ నీ బుర్ర ఇంకా ఎదగలేదు” అన్నాడు నాన్న.
“అవును మరి. చిన్నప్పటినించీ వాడి స్నేహితులు ఎవరు? అందరూ నాలుగు తరాలకు సరిపడా డబ్బున్న సినిమా వాళ్ళ పిల్లలు, మంత్రుల పిల్లలు. వ్యాపారుల పిల్లలు. వాళ్ళలాగానే వీడూ తయారయాడు” అంది అమ్మ.
“మన నారాయుడి స్కూల్లో చేర్పిస్తే ఒక్క రోజయినా సరిగ్గా వెళ్ళాడా? నారాయణ! నారాయణ! వీడికి మార్కులు వేయించి ఎలాగోలా స్కూలు చదువు అయిపోయిందనిపించాం. అదే నారాయుడి కాలేజీలో డిగ్రీ చేయరా అంటే మాట్లాడడు. బిజీగా వున్నాను అంటాడు. ఎప్పుడూ తిండీ, నిద్రా. అవి చేయనప్పుడు బలాదూర్ తిరుగుళ్ళు. రెండు నెలల క్రితం, అర్ధరాత్రి కారు స్పీడుగా నడిపి రోడ్డు మీద జనాల్ని గుద్దేసి పైకి పంపించాడు. తర్వాత నా పరపతితో కేసు కొట్టించటానికి ఎంత కష్టమయిందో తెలుసా? మిగతా వాళ్ళ పిల్లలు అలా లేరే? వాడికి చదువు అబ్బలేదు. అబ్బదు. అంతే!’ అన్నాడు నాన్న.
“వాడికి చదువు అబ్బలేదని వదిలేస్తే ఎలా? వాడి అబ్బకే చదువు అబ్బలేదు. ఇక వాడికి అబ్బకపోవటంలో అబ్బురం ఏముంది? మన ఇరుగింటి, పొరుగింటి పిల్లలు అమెరికాలో ఏల్, ఇంగ్లాండులో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు కదా. మనవాడినీ అక్కడికి పంపించకూడదూ” అంది అమ్మ.
“ఏలూరులో చదవలేనివాడికి ఏల్ యూనివర్సిటీలోనూ, ఆకివీడులో సీటు రాని వాడికి ఆక్స్ ఫర్డ్ లోనూ ఎవరు సీట్ ఇచ్చేది? అదే ఇక్కడయితే క్లాస్ రూం అంతా నేనే సీట్లతో నింపేవాడిని” అన్నాడు నాన్న.
“మీరు ప్రయత్నం చేస్తేనే కదా తెలిసేది? మనవాడికి మంచి తెలివెతేటలున్నాయి. మీరు అవకాశాలే ఇవ్వటంలేదు. కనీసం వాడిని ఏదన్నా వ్యాపారంలో పెట్టరాదూ” అంది అమ్మ.
“నేను వాళ్ళ చేతా, వీళ్ళ చేతా పెట్టుబడి పెట్టించి వీడి చేత వ్యాపారం చేయిస్తాను. చేస్తాడా?” నాన్న.
“కష్టపడకుండా తొందరగా డబ్బులు చేసుకునే వ్యాపారాలు వుంటే ఎందుకు చేయను?” అన్నాడు కొడుకు, గారాలు పోతూ.
“అప్పనంగా డబ్బులు రమ్మంటే రావు. దేనికైనా కష్టపడి పనిచేయాల్సిందే” నాన్న అన్నాడు.
“మీకు తెలిసినాయనెవరో పాల వ్యాపారం పెట్టి బాగా సంపాదిస్తున్నాడుట కదా” అంది అమ్మ.
“ఛీ ఛీ.. నేను గోవుల గోపన్నలా పాల వ్యాపారం చేయటమేమిటే అమ్మా?” అన్నాడు, గోపన్న ప్రతిరోజు ఇంటి దగ్గరకి గేదెలను తీసుకువచ్చి పిండిన గుమ్మ పాలు త్రాగి ఏపుగా పెరుగుతున్న కొడుకు మరి.
నాన్న పెద్దగా నవ్వాడు. “పాల వ్యాపారం అంటే పాలు పితికి అమ్ముకోవటం కాదురా కుంకా. మనకి సప్లయర్స్ ఇచ్చే కొంచెం పాలు, ఎన్నో నీళ్ళు, కొన్ని కెమికల్సుతో కల్తీ చేసి, రంగురంగుల లేబుల్స్ వేసిన సీసాల్లో పోసి, సూపర్ బజార్లలలో అమ్ముతాం. టీవీలో అందమైన అమ్మాయిల చేతనో, సెలబ్రిటీలతోనో టీవీలో ప్రకటనలు ఇస్తాం. అలా అయితే మన గోపన్న అమ్మే ధరకన్నా, పదిరెట్లకి అమ్మవచ్చు. కోట్లు సంపాదించవచ్చు. చేస్తావా?” అన్నాడు.
తల అడ్డంగా వూపాడు తనయుడు. “అన్యాయం నాన్నా. పసిపిల్లలు అవి త్రాగి రోగాలు తెచ్చుకుంటారు. సరిగ్గా ఎదగరు. మనం చేసే కల్తీ వల్ల చనిపోతారు కూడాను” అన్నాడు సత్య హరిశ్చంద్రుడు.
“ఇలాటి బుధ్ధ భగవానుడు ఇక వ్యాపారం ఏంచేస్తాడు” విసుక్కున్నాడు పితృశ్రీ.
“అదికాకపోతే ఇక వేరే మంచి వ్యాపారాలే లేవా? పోనీ సాఫ్ట్ వేరో, గీరో.. దాంట్లో... “ మాతృశ్రీ అంటుండంగానే, మళ్ళీ ఇంకోసారి విసుక్కున్నాడు నాన్న.
“ఒకటో ఎక్కం కూడా రాని వీడు, సాఫ్ట్ వేర్ వ్యాపారం చేస్తాడా..” అన్నాడు.
“మరి మన బాలయ్య, ఓ అంటే నా రాకపోయినా అలాటి వ్యాపారాలు చేస్తున్నాడుగా” అంది అమ్మ.
అమ్మ నాన్నకంటే నాలుగు క్లాసులు ఎక్కువే చదివింది మరి.
“అదా.. అమెరికాలో వాడి బామ్మర్ది ఒక కంపెనీ పెట్టి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినట్టు అపాయ్మెంట్ ఆర్డర్లు ఇచ్చేవాడు. బాలయ్య ఇక్కడే ఒక కంపెనీ పెట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి హెచ్ వన్ వీసాలు ఇప్పించి, అమెరికా పంపించేవాడు. వీళ్ళకి వీసాలు తీసుకుని అమెరికా వెళ్ళి, మీసాలు తీసేశాక కానీ అసలు ప్రపంచం కనపడలేదు. అక్కడ ఉద్యోగాలు లేవనీ, బెంచీలు మాత్రమే వున్నాయని తెలిసి, ఇక ఏం చేయాలో తోచలేదు. పోనీ వాళ్ళంతట వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుందామనుకుంటే, చదివిన చదువు ఉపయోగపడలేదు. కొన్నాళ్ళు ఆ బెంచీల మీద కూర్చుని, తర్వాత ఆనుకోవటానికి కూడా గోడలు దొరక్క, నానా ఇబ్బందీ పడ్డారు. అంతే కాదు, ఈమధ్య ఎవరో అక్కడ కోర్టుకెక్కితే, ఆ బామ్మరిదిగాడిని అమెరికాలో జైల్లో వేశారుట. అలాటి వ్యాపారం చేస్తే, మనవాడు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెడతాడు” అన్నాడు నాన్న.
“అలా అయితే మరిప్పుడు నన్నేం చేయమంటావ్, నాన్నా?” అడిగాడు పుత్రరత్నం.
“పోనీ సినిమాల్లో చేర్పించరాదుటండీ. వాడి స్నేహితుల్లో కొందరు పిల్లలు ఇప్పుడు సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలయారు. వాళ్ళ నాన్నలూ, అన్నలూ అందరూ ఒకప్పుడు సినిమా హీరోలు, నిర్మాతలూ. వాళ్ళ ఆసరా లేకపోతే ఆ స్టూడియో గేట్ దగ్గర కూడా ఆ పిల్లలకి గూర్ఖా ఉద్యోగాలు రావు. మనవాడు వాళ్ళకన్నా ఎన్నో రెట్లు నయం. మీరు కూడా మొన్నీమధ్య దాకా సినిమాల్లో ఒక వెలుగు వెలిగారుగా. ఆ ఆసరా, గీసరా మీరిస్తే, వాడిట్టే హీరో అయిపోతాడు” అంది మాతృమూర్తి.
“కానీ అమ్మా ఆ ఆసరా గీసరా నాన్న ఇచ్చినా, నాలో సత్తా వుండొద్దూ. నాకు సరిగ్గా మాట్లాడటమే రాదంటారు అందరూ. మరి డైలాగులు చెప్పటం ఎలా?” అన్నాడు అబ్బాయి అమాయకంగా.
“అదేం ఫరవాలేదురా. ఇప్పుడు ఎక్కువమంది నటులకి ఇటు తెలుగూ రాదు, అటు ఇంగ్లీషూ రాదు. ఇక డైలాగులేం చెబుతారు. అందుకే వాళ్ళ డైలాగులు డబ్బింగ్ చేస్తున్నారులే. మాటల్లోనే చక్కటి భావాలు పలికిస్తూ డైలాగులు చెప్పే సాయికుమార్, బాలు లాటి గొప్ప నటులతో డబ్బింగ్ చెప్పిద్దాంలే. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. సినిమాలో మాటలకి పెదిమలు కదలాలి కనుక, నువ్వు వన్ టూ త్రీ.. వన్ టు త్రీ అంటూ వుంటే చాలు. తర్వాత సౌండ్ ఇంజనీరు, ఎడిటరు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి, మిగతా విషయాలు చూసుకుంటారులే’ అన్నాడు నాన్న.
నాన్న అలా ఆసరా గీసరా ఇస్తుంటే సంతోషించింది అమ్మ.
“మరి నాకు డాన్సులు చేయటం రాదే.. “ అనుమానం వ్యక్తపరిచాడు కొడుకు.
నవ్వాడు నాన్న. “నువ్వేం చేయఖ్కర్లేదు. ప్రతిపాటకీ నీతో పాటూ పాతికమంది డాన్స్ చేస్తారక్కడ. వాళ్ళు డాన్స్ డైరెక్టర్ చెప్పినట్టు ఏం చేస్తే, నువ్వూ అదే చేయి. నీతో పాటు హీరోయిన్ కూడా డాన్స్ చేస్తుంది కదా. అందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదే వుంటాయి. చూపించాల్సినవన్నీ ఆ అమ్మాయే చూపిస్తుంది. ఇక నిన్ను చూసేదెవరు? ఎక్కడో అవసరం అయినప్పుడు నీ ముఖం చూపిస్తాం, కాళ్ళూ చేతులూ నడుమూ అన్నీ మిగతా వాళ్ళవీ, డాన్స్ డైరెక్టరువీ. నువ్వు కావాలంటే చెన్నైనించీ ప్రభుదేవాని తెప్పిస్తాను. అమెరికానించీ మైకెల్ జాక్సన్ని తెప్పిస్తాను” అన్నాడు నాన్న.
“మైకెల్ జాక్సన్ ఏనాడో చనిపోయాడండీ” అంది అమ్మ. ఇందాకే అనుకున్నాం కదా, అమ్మ నాన్నకన్నా నాలుగాకులు ఎక్కువే చదువుకున్నదని.
“పోతే..” అన్నాడు అమ్మ చదువుని ఏనాడూ గౌరవించని నాన్న.
అమ్మ నాన్నని వింతగా చూసింది.
“మరి నా ముఖం అంత అందంగా వుండదని.. “ నసిగాడు అమ్మగారి అందాల బంగారుకొండ.
“అదో పెద్ద సమస్య కాదు. మంచి మేకప్ మేన్ని బాలీవుడ్, కాకపోతే హాలీవుడ్ నించీ తెప్పిద్దాం” నాన్న.
“మరి నాకు అస్సలు నటించటమే రాదే” నిజాయితీతో అన్నాడు కొడుకు.
పెద్దగా నవ్వాడు తండ్రి. “ఇప్పటి హీరోలకి అది శుధ్ధ అనవసరం. వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు. అది డైరెక్టరూ, కేమరామన్ చూసుకుంటారు. లేకపోతే హాలీవుడ్ లెవల్లో గ్రాఫిక్సుతో అదరకొట్టేద్దాం. విడుదల అవకముందే రివ్యూలు రాయిద్దాం. అభిమాన సంఘాలు పెట్టిద్దాం. ఇక జనం ఏం చేస్తారు? కళ్ళు మూసుకుని మన సినిమా చూస్తారు”.
కళ్ళు మూసుకుని సినిమా ఎలా చూస్తారా అని అనుమానం వచ్చింది సుపుత్రుడికి. కానీ దానితోపాటూ ఇంకో అనుమానం కూడా వుంది కనుక, ముందు ఆ విషయం కనుక్కోవాలనుకున్నాడు.
“మరి ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే..” ఆ రెండో అనుమానం తీర్చుకుంటున్నాడు ఆ అమాయకపు బిడ్డ.
“ప్రొడ్యూసర్లేగా పోయేది. మన చేతి చమురు భాగోతం ఏమీ వుండదు. డోంట్ వర్రీ, బి హాపీ” నాన్న భరోసా ఇచ్చాడు.
సుపుత్రుడు ఒక్క అర నిమిషం దీర్ఘంగా ఆలోచించి అన్నాడు,
“ఏమో నాన్నా. అలా నిర్మాతలు రోడ్డెక్కితే నాకిష్టం వుండదు. సినిమాలు వద్దులే. ఇప్పుడు మన సినిమాలన్నీ కొడుకుల సినిమాలే కదా. జనం చూడలేక చస్తున్నారు. ఇంకా నేనెందుకు..” అన్నాడు.
అలా అన్నాక కొంచెం ఆగి, మిగతా అర నిమిషం కూడా మిగిలిపోకుండా దీర్ఘంగా ఆలోచించటం పూర్తి చేసి, “అమ్మా, మరిప్పుడు నన్నేం చేయమంటావ్?” అని అడిగాడు పుత్ర శిఖామణి.
“ఈరోజుల్లో దేనికీ పనికిరాని వాళ్ళందరూ రాజకీయాల్లో చేరి దేశాన్నీ, ప్రజల్నీ దోచుకు తింటున్నారు కదండీ. ఆమాత్రం మనవాడు చేయలేడూ?” అన్నది మహారాణి.
“చేయవచ్చు. కానీ ప్రజలకి నచ్చేటట్లు వీడు మాట్లాడకపోతే, వీడికి ఓట్లు ఎవరు వేస్తారు చెప్పు. వట్ఠి ముద్ద పప్పులా అర్ధంలేకుండా వాగితే, చూశావుగా ఈమధ్య ఎన్నికల్లో ఏమయిందో? ప్రజల్లో కొంత చైతన్యం వచ్చినట్టుంది. ఈమధ్య కులం కార్డు కూడా సరిగ్గా పనిచేయ లేదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి. వీడికి మూసిన గొడుగు తెరవటం కూడా తెలీదు. అమాయకుడు. రాజకీయాల్లోకి వెడితే, పదవుల మాట ఎలావున్నా, అక్కడ ఇమడలేడు. ఏదో లంచాల కేసులో ఇరికించి అపోజిషన్ పార్టీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, ఎసిబి వాళ్ళు జలగల్లా పట్టుకుంటారు. అప్పుడు మనం బాధపడాలి” నిర్మొహమాటంగా అన్నాడు మహారాజు.
“అవున్నాన్నా. నేనలాటి పనులు చేయలేను. చేయను, అలా చేస్తే దేవుడు కూడా నన్ను క్షమించడు కాక క్షమించడు” అన్నాడు యువరాజు, పాత తెలుగు సినిమాల్లో నాగేశ్వర్రావులా.
“డైలాగు బాగానే చెప్పాడే.. వీడికి సినిమాలే నయమేమో..” అనుకున్నది మాతృ వాత్సల్యం.
“నాలుగు తరాలకు సరిపడా సంపాదించాను. అది తింటూ కూర్చుంటే, ఏ ఇబ్బందీ వుండదు. ఎందుకు లేనిపోని వాటిల్లో చేతులు పెట్టి, తర్వాత ఆకులు పట్టుకోవటం” అనుకున్నది పితృ హృదయం.
తన చిన్న బుర్రకి మరింకేం చేయాలో తట్టకపోవటంతో, ఒకసారి బుర్ర గోక్కున్నాడు సుపుత్రుడు.
బుర్ర గోక్కోటం పూర్తయాక, మనసులో అనుకుందామనుకుని, అసంకల్పితంగా అలా అనుకోకుండా పైకే అనేశాడు.
““నాన్నా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్?” అని.
*****