MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
సర్వకళా సారం సాహిత్యం....
ఉమా భారతి కోసూరి
‘సర్వకళాసారం సాహిత్యం’– అన్ని కళలకి ఆయువుపట్టు సాహిత్యమే అన్నది ఇక్కడి విషయం.
ఐదవ వేదంగా పరిగణింపబడే నాట్యశాస్త్రంలో కూడా "రోజూవారీ జీవనంలో శ్రమించి విసిగి వేసారిన మనుషులకి.. ఆహ్లాదం, ఉల్లాసం అవసరం కనుక కళలు జనించాయని…. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుని ఉత్తేజపరచే సాధకాలే” అని ప్రస్తావించారు.
పై పేర్కొన్న సంగీతం విషయానికి వస్తే,
‘సంగీతం’ లోని ...గీతం ..సాహిత్యం. చక్కని సాహిత్యంతో మిళితమైతేనే ... ఓ రాగం, ఓ పల్లవి, ఓ ఆలాపన అపురూపమైన సంగీతం అవుతాయి.
నృత్య కళ సంగతికి వస్తే...అది ఓ కదిలే దృశ్యం, లయగతుల సమ్మేళనం.
నృత్యానికి జీవం పోసేది భావమైతే.. భావానికి భాషని సమకూర్చేది సాహిత్యం. సంగీతానికి మల్లేనే నృత్యకళకి కూడా అయువుపట్టు సాహిత్యం.
ఇక నేరుగా ‘సాహిత్య కళ’ విషయానికి వస్తే, ఓ కవి ఊహకి ... స్పందనకి ...కల్పనకి... అక్షర రూపం...రచనా సాహిత్యం. ఓ కవి తన సామర్ధ్యంతో, పదాల చాతుర్యంతో ...ఓ నర్తకినే కాదు...ఆమె నృత్యాన్ని కూడా మన కళ్ళెదుట అందమైన దృశ్యంగా ఆవిష్కరింపజేయగలడు. అంటే .. ఇతర కళల ఆధారం అక్కరలేని ఏకైక కళాస్వరూపం ‘సాహిత్యమే’, కవిత్వమే. కవిత్వం లోని అంతర్భాగమే సాహిత్యం.
మొత్తానికి...
గానంలో మధుర భావాల ఝరి సాహిత్యం
నర్తకి మోమున హావభావాల భాష సాహిత్యం
కవి యొక్క భావాలని కావ్యాలుగా మలిచేది సాహిత్యం..
............
మరో ఆసక్తికరమైన వివరణ ‘నాట్యశాస్త్రం’ నుండి ... అన్ని కళలకి వర్తించేలా ఉన్న ఆ వివరణ, మానవ జీవనంలో కళల యొక్క ప్రాముఖ్యతని చాటుతుంది.
ఆ వివరణ ఇలా...
'కళలు' ఉపదేసాత్మకమే కాక, హితమును, ధైర్యమును, క్రీడను, సుఖమును కూడా కలిగిస్తాయని, దుఃఖార్తులకు, శ్రమార్తులకు, శోకార్తులకు, దీనులకు, విశ్రాంతి కలిగిస్తాయని,
ఇంకనూ... నాట్యమైతే-భావ రాగా తాళ సమ్మేళనమై, త్రైలోక్య అనుకరణమై, మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగింప జేస్తుందన్నది ఆ ప్రస్తావన...
”కళ’ జీవితంలో ఒక భాగం అనేకన్నా, జీవనమే ‘కళ’ ని అనుకరిస్తుందని అనడం సమంజసం” అన్న ఆసక్తికరమైన సిద్దాంతాన్ని ఈ ప్రపంచానికి అందించారు ఆస్కార్ వైల్డ్ అనే మేధావి.
కళ - జీవితం.. ఎలా వేరు వేరు కావో వివరించి ... కళ నిత్యం అని, మానవ జీవనంలో ఎక్కువ భాగం కళాస్పర్శ ఉంటుందన్న విషయం గమనించాలని చెబుతూ- నిస్సారంగా వెలితిగా అనిపించగల రోజూవారి జీవనంలో రంగుల వెలుగులు నింపగలిగేది కళలే అని సూచించారు ఆస్కార్ వైల్డ్.
ఇక ‘జీవించడం కూడా ఓ కళ అని’, కళకళలాడే జీవనం అంటే ఆందోళన రహిత జీవన విధానం అని, అందుకోసం నిత్యచైతన్యానికి దారులు అన్వేషించాలనీ సూచించే సిద్దాంతం ఒకటి.
స్తబ్దత, విషాదం, నిరాశల నుండి మనసును కాపాడుకోవాలంటే ఆ మనసు నిత్యం మధురోహలతో నిండి ఉండాలనే సిద్దాంతం మరోటి.
పై రెండు సిద్దంతాలకి సరిపడా నాట్యశాస్త్రంలో పేర్కొన్న సంగీతం, కవిత్వం, నృత్యం, చిత్రలేఖనం, వంటి కళారూపాలు మనసులని రంజింపజేసే కళల కోవలోకే జేరుతాయి.
‘జీవించడం కూడా ఓ కళ’ అయితే ... ఆ కళకి కూడా ఆయువుపట్టు సాహిత్యమా? అంటే ‘సహితస్య భావం సాహిత్యం’ అన్నారు. అంటే అన్ని కళలు కలగలసినదే సాహిత్యం అని అర్ధం.. అంతే కాక సర్వ జన హితాన్ని అభిలషిస్తూ రాసేది ‘సాహిత్యం’.
సమాజం లోని సామాన్య ప్రజలకి, పండితులకి, విజ్ఞానవంతులకి, పిన్నలకి, పెద్దలకి... వ్యత్యాసాలు లేకుండా మానసిక ఉల్లాసాన్ని, సుఖ సంతోషాలని అందించే సాధకం ‘సాహిత్యం’.
ప్రసిద్ధ సాహితీవిమర్శకులు, విద్యావేత్త వెల్చేరు నారాయణరావుగారి మాటల్లో “పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మనకున్నగొప్ప సాహిత్య సంపదైతే, సమాజ పురోగతిని, ధర్మాధర్మాలని విశదీకరించే సాహిత్యం జీవనానికి అంతే గొప్ప మార్గదర్శకం.... అని చెబుతూ జీవనానికి, సమాజానికి సాహిత్యంతో ఉన్న కీలకమైన సంబందాన్ని విశదీకరించారు.
ఇక నిత్యజీవన స్రవంతిలో సాహిత్యం యొక్క పాత్ర ఏమిటా అంటే, లాలిపాటల సాహిత్యం నుండి భగవద్గీత ప్రబోధ ప్రవచనాల వరకు కూడా అడుగడుగునా సాహిత్య వల్లరే. అంతే కాక .. జాతి ఔన్నత్యాన్ని చాటే సాహిత్యం, స్ఫూర్తి నిచ్చే సాహిత్యం, హితవు పలికే సాహిత్యాన్ని కూడా మనం కొన్ని మార్లైనా వినే ఉంటాము, ప్రభావితం చెందే ఉంటాము కూడా.
శోకాన్ని, విచారాన్ని కూడా అధిగమించగల శక్తిని సాహిత్య కవిత్వాలు అందించగలవట. సతీ వియోగంతో కుమిలిపోతున్న సమయంలోనే మరి ..వాల్మీకి రామాయణం రాసాడట. మనిషి యొక్క ప్రవర్తన, పరివర్తనల పై కూడా సాహిత్యం యొక్క ప్రభావం మెండుగా ఉంటుంది అంటూ మా నాన్నగారు కూడా ఎన్నెన్నో పుస్తకాలు చదవడానికి తెచ్చిచ్చేవారు.
ఇదంతా తెలిసాక, తెలుసుకున్నాక మొత్తానికి ‘జీవించడం అనే కళతో’ సహా సర్వకళా సారం సాహిత్యం అనడం అతిశయోక్తి కాదు అన్నది నా మాట.
*****
[ఫ్లోరిడాలో జరిగిన వంగూరి తెలుగు ప్రపంచ సాహితీ సదస్సులోని ప్రసంగ పాఠం]