top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

సంక్రాంతి వైభోగమే

Gauthami_edited.jpg

శ్రీసత్య గౌతమి

సంక్రాంతి!

హిందూ పండుగలన్నింటిలో ఇదొక్కటే ఖగోళ సంబంధిత పండుగ. అంతరిక్షంలో సౌరమండలంలో జరిగే మార్పులను సూక్షమం గా ఆధ్యాత్మిక పరిభాషలో తెలియజెప్పే బృహత్తర సారాంశమీ పండుగ. అంతే కాదు మనిషి మనుగడ కు అవసరమైన ప్రకృతిని ఎలా ప్రేమించి, గౌరవించాలో కూడా ఈ పండుగ తెలియ జేస్తుంది. సౌరమండలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సాంప్రదాయ రీతులను కూర్చి ధనుస్సంక్రాంతి నుండీ, మకర సంక్రాంతి వరకు ఆధ్యాత్మిక సాధనల ద్వారా ప్రతి యేడూ పౌరాణిక కధలను జ్ఞప్తికి తెస్తారు. కుటుంబాలతో, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకొని ఐక్యతను కలిగి వుంటారు. చేతికొచ్చిన క్రొత్త పంటను తామే కాకుండా తమ క్రింద కష్ఠపడిన వాళ్ళకు కూడా పంచి, ఆ పంచుకోవడంలో వుండే ‘తమ వాళ్ళు’ అనే మానవతా భావాన్ని చాటుతారు. ప్రకృతికీ, మానవ స్వభావానికి ఒక పండుగ విశిష్టతని ఆపాదించి చేసుకొనే ఏకైక సాంప్రదాయం ఈ సంక్రాంతి! ప్రకృతిలో మధురక్రాంతి సంభవించే వెలుగుల విక్రాంతి! 

 

సూర్యుడు ఉత్తరాభి ముఖంగా ధనూరాశి నుండి, మకరరాశి లోకి గమిస్తూ చలితో వణుకుతున్న ప్రజలకు స్వాంతన కలిగిస్తాడు. అందుకే "మకర సంక్రాంతి" అని పేరు. ఇలానే సూర్యుడు పన్నెండు రాశుల్లో ప్రవేశిస్తుంటాడు. ఈ పన్నెండు రాశులూ మేషం, వృషభం, మిధునం, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ మరియు మీనం. ఈ పన్నెండు రాశుల్లోనూ తన గమనాన్ని పూర్తి చేసుకోవడానికి సూర్యునికి సంవత్సర కాలం పడుతుంది. 

 

మన హిందూ సాంప్రదాయంలో వచ్చే పండుగలన్నింటికీ శాస్ర, సాంకేతిక దృక్పదాలున్నాయి. పన్నెండు రాశుల్లో సూర్యగమనాన్ని లెక్కించడానికి మన వాళ్ళు నక్షత్ర సముదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అదే పాశ్చాత్య సాంప్రదాయంలో నక్షత్ర ప్రస్తావన వుండదు. వాళ్ళు భూభ్రమణాన్ని ఆధారంగా తీసుకొని 12 భాగాలుగా విభజించారు. వాటికి ఒక్కొక్క జన్మ రాశి (జోడియాక్ సైన్) ఇచ్చారు. భూమి యొక్క దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ఈ పన్నెండు రాశులూ వున్నాయి. భూమి ఈ ఒక్కొక్క రాశినీ ముప్ఫైసి రోజుల్లో దాటుకుంటూ పోతుంది. భూమి మీద వుండే మనకు, నెలకొక క్రొత్త నక్షత్ర సముదాయం ఒక్కొక్క రాశి క్రింద సంక్రమిస్తుంది. అందుకే సంక్రమణం అనే మాట వాడతాం. మన వాళ్ళకి నక్షత్ర జ్ఞానం బాగా వుంది. ఈ నక్షత్ర పరిజ్ఞానం ఒక సైన్స్. 

 

అసలు సూర్యగమనం ఎప్పుడు మొదలవుతుందంటే డిశెంబర్ 21, 22 తేదీల్లోనే ఉత్తరం వైపుకు మొదలవుతుంది. అప్పటి నుండీ పగటి సమయం ఎక్కువవుతుంది. అందుకే డిశెంబర్ లో 21-22 తేదీల సమయాన్ని "షార్టెస్ట్ డే ఆఫ్ థ యియర్" అని అంటారు. కానీ అప్పుడు మకర రాశి వుండదు, కాబట్టి మకర సంక్రమణం అప్పుడు జరుపుకోము. భూమి 23.45 డిగ్రీస్ లో దీర్ఘ వృత్తాకారంలో కాస్త వంపు కలిగి వుండడం వల్ల విశ్వత్తు (ఈక్వినాక్స్) కూడా వంగుతుంది. అందువల్ల మకర సంక్రమణం కూడా మెల్ల మెల్లగా ముందుకు అనగా జనవరి కి జరిగింది. ఎప్పుడో 1500 వేల సంవత్సరాల క్రితం ఆర్యభట్టు కాలములో ఉత్తరాభిముఖం గా సూర్యగమనం మరియు మకరరాశి కలిసి డిశెంబర్ 21 న వచ్చిందిట. ఆ తర్వాత నుండి జనవరి 14 కే మకరరాశి వస్తోంది, తప్పితే 15 వ తేదీ న వస్తోంది. కానీ ఉత్తరాయణం మాత్రం ధనుస్సంక్రాంతికే మొదలు. అటువంటప్పుడు మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే మకరరాశి ప్రారంభం నుండే సౌరమండలంలో మార్పులు సంభవిస్తాయి, పగటి కాలం పెరుగుతుంది, భూమి సూర్యుని వైపుకు తిరుగుతుంది, అందుచేత సూర్య కిరణాలు భూమి పై సూటిగా పడి భూమి వేడెక్కుతుంది. ఈ మార్పు డిశెంబర్ లో జరుగదు. చలి కాలమే కొనసాగుతుంది.  

 

5000 సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి ఫిబ్రవరిలో రావచ్చట. అనగా భూమి ప్రతి యేడూ అదే స్థానానికి రావడం లేదు. ప్రతి యేడూ ఖచ్చితంగా 365 రోజులు లెక్కకు రావడం లేదు, 365.24 అలా అవుతుంది. అందుకే 4 యేళ్ళ కొకసారి లీపు సంవత్సరం అని, అడ్జస్ట్మెంటు చేస్తుంటారు. ప్రాచీన భారతీయులకు సూర్యుని చుట్టూ భూమి తిరిగే కాల పరిమితులు అప్పటికే తెలిసి వుండడం వల్ల శూన్య మాసం లాంటి సవరణలు పంచాంగంలో చొప్పించారు. సూర్య సిద్ధాంత ధృగ్గణితాన్ని అనుసరించారు. 

 

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, అది తన ముందున్న ఏ నక్షత్ర సముదాయానికి ఎదురుగా వస్తుందో దాన్ని సూర్యరాశి గా పరిగణించారు. అదే సమయంలో మిగితా గ్రహాలు కూడా వాటి కక్ష్యల్లో ఏఏ నక్షత్ర రాశులకు ఎదురుగా వుంటాయో అవి వాటి రాశులుగా పరిగణించారు. మనకు గ్రహ స్థితులను నిర్ణయించేది నక్షత్రలే. అవి స్థిరమైనవి, అందుకే మన లెక్కలు తప్పవు. మనకున్న నక్షత్రాలు 27, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర మరియు రేవతి. అలాగే సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాన్ని బట్టి రాత్రింబవళ్ళని చెప్పడానికి హోరా శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.     

 

భూ కక్ష్యని బట్టి, అది ఏ నక్షత్ర సముదాయంలో వుందో దాన్ని సూర్యరాశి అని అన్నట్లు, మరి భూమికి అటువంటిది లేదా అనే ప్రశ్న రావొచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏ నక్షత్రానికి ఎదురుగా వస్తుందో అది భూ రాశి. దానినే మనం "లగ్నం" అంటాం. ఇలా మన లెక్కల ప్రకారం ఇంచుమించుగా జనవరి 14 తప్పితే 15 కే మకర సంక్రమణం వస్తుంది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా అదే రూఢీ చేశారు. అంటే మకర సంక్రమణాన్ని మనం శాస్తీయంగా జరుపుకుంటున్నాం.

 

సూర్య కుటుంబంలో గ్రహాలన్నింటికీ కేంద్ర శక్తి సూర్యుడు. సంధ్యావందన మంత్రంలో కూడా అదే చెప్తారు.

మిత్రోజనాన్ యాతి యద ప్రజానన్

మిత్రోదాధార పృధ్వీమృతద్యాం

 

మిత్ర అంటే సూర్యుడు. మిత్రోదాధార అనగా సూర్యుని ఆధారంగా చేసుకొని, పృద్వీ మృతధ్యం అంటే భూమి వుండును. అలాగే యావజ్జనులు సూర్యుని మీద ఆధారపడ్డారని దాని అర్ధం. అందుకే మన సంస్కృతిలో సూర్యోపాసన చాలా ముఖ్యమైనది. నిద్రలేస్తూనే మొదట దర్శించగల ప్రత్యక్ష్య దైవం సూర్యుడే. మిగితా దేవతలను నాటి ఋషులు తమ తపోబలాల వల్ల దివ్య దర్శనం గావించుకున్నారు గానీ, సూర్యుడు మాత్రం అందరికీ తేలికగా దర్శనమిచ్చే దైవం. అంతే కాకుండా ఏ దేవతలను ప్రార్ధించినా తూర్పు ముఖంగా సూర్యునికి ఎదురుగ కూర్చొని ప్రార్ధిస్తాం. జగత్తునంతటికీ సాక్షీ భూతుడు, కన్నులాంటి వాడు సూర్య భగవానుడు.

 

ఆంధ్రులకు ధనుర్మాసం నుండే సంక్రాంతి శోభ పరఢవిల్లుతుంది. వృశ్చిక రాశినుండి ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు 'ధనుస్సంక్రాంతి' అంటారు. ఈ రాశిలో నెల రోజులూ సూర్యుడు నివసిస్తాడు కావున దీనిని 'ధనుర్మాసమ'ని పేరు. ఈ 2019, వికారినామ సంవత్సరం లో ఈ (డిశెంబర్) నెలలో 16 వ తేదీ నుండి ధనుర్మాస ప్రారంభం. “నెలఘంట” అని కూడా అంటారు. ఈ నెలఘంట అంతా ప్రతి ఇంట్లో మహిళలు, ముఖ్యంగా కన్నె పిల్లలు వేకువనే లేచి వాకిళ్ళలో కల్లాపి జల్లి, అందంగా రంగవల్లులు దిద్దుతారు. ఆకాశాన్ని మైమరపిస్తూ పుడమిన చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు. ఇది ఒక ముగ్గుల వ్రతం. ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి, పూలతో అలంకరించి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఈలోపు మేలుకొలుపు గానాలతో హరినామ స్మరణ చేస్తూ హరిదాసులూ, శివనామ స్మరణ చేస్తూ గంగిరెద్దులనాడించేవాళ్ళు ఎద్దులను ఆడిస్తూ తమ కళాకౌశలాన్ని ప్రదర్శిస్తారు. అలాగే బుడబుడక్కల వారు, పగటి వేషగాళ్ళు తమ కళలను ప్రదర్శిస్తారు. ఈ కాలంలో ఋతువుగా హేమంత ఋతువుని చెప్పుకోవచ్చు. ఆకాశాన్ని ఆవరించుకొని వున్న హేమంతమంతా పుడమిని వరిస్తుంది.

 

ధనుర్మాసం చివరి రోజుని కూడా ఒక పండుగ గా జరుపుకొనే వైనం మన ఆంధ్రులది, అదే భోగి పండుగ. దక్షిణాయానికి చివరి రోజు. అందుకే భోగి రోజున భోగి మంటలు వేసి వెచ్చగా మకర సంక్రమణానికి స్వాగతం చెప్తారు. సౌరమండలంలో జరిగే మార్పులకు అనుగుణంగా భూమిపై ఆ వెచ్చదనాన్ని భోగి మంటలద్వారా అనుకరించడం, దాన్ని ఒక పండుగలా జరుపుకొని ఆనందపడడం గొప్ప సాంప్రదాయ విలువలని సంతరించింది. నువ్వులనూనె వంటికి రాసుకొని, నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేస్తారు. క్రొత్త దుస్తులు ధరించి, పెద్ద వారి దీవెనెలు పొందుతారు. ప్రతి ఇంటినీ పచ్చటి తోరణాలతో గుమ్మాలకు పసుపు కుంకుమలు అలంకరిస్తారు. మరుసటి దినం సంక్రాంతి నాడు పెద్దల దినం గా పరిగణించి చనిపోయిన వారికి తర్పణాలు వదులుతారు. వారి పేరున దానాలు ఇస్తారు. స్త్రీలు, పిల్లలు ప్రతి ఇంటికీ వెళ్ళి పసుపు, కుంకుమలు పంచుతారు. 

 

పూర్వాశ్రమంలో సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరాన వుంటే ఉత్తరాయణమనీ, దక్షిణాన వుంటే దక్షిణాయణమనీ పేర్కొంటే, ఖగోళ శాస్త్రం జనవరి 14 నుండి జూలై 16 వరకూ 6 నెలలు ఉత్తరాయణమనీ, దీని తరువాతి 6 నెలలూ దక్షిణాయణమనీ లెక్కలు తేల్చింది. పురాణాల్లో దక్షిణాయణం లో దేవతలు నిదురించి, ఉత్తరాయణంలో మేల్కొంటారని సూచించారు. మానవులయొక్క సంవత్సర కాలము దేవతలకు ఒక రోజుగా, దక్షిణాయణం రాత్రిగా ఉత్తరాయణం పగలుగా ఆధ్యాత్మిక శాస్త్రాలు బోధిస్తున్నాయి. సౌరకుటుంబంలో జరిగే ఈ మార్పును ఇన్ని శాస్త్రాలు నిగూఢంగా పరిశీలించి పరిశోధించి మనకందించారు కాబట్టి దీని వెనుక దైవరహస్యం దాగే వుంది. భారతంలో భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చేవరకూ తన మరణాన్ని వాయిదా వేసుకున్న విషయం అందరికీ విదితమే.  ఇది అతి సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా వివరించేందుకు పండుగను చేసుకొనే అలవాటును ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎక్కడో సౌరమండలంలో జరిగే మార్పుల ప్రభావాలు ప్రకృతిపై, జీవరాశులపై పడినప్పుడు, ఆ మార్పులను సాంప్రదాయ సిద్ధంగా ఆహ్వానించడం మన సంస్కృతి యొక్క గొప్పదనం. అందులో విశిష్టమైనదే ఈ మకర సంక్రమణం. 

*****

bottom of page