MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
కథా మధురాలు
సంకెళ్లు
గిరిజాహరి కరణం
స్టేషను చివర చాలా దూరంలో సామాన్లు దింపాడు కూలీ. పిల్లలతో నడవలేక ఆయాసమొస్తూంది.
‘‘ఇదేమిటీ ఇంత దూరంలో పెట్టావు సామాన్లు’’? అన్నాను. మీ బోగీ ఇక్కడే వస్తాదమ్మా. బండొచ్చేటయానికి కొస్తా’’ అనేసి వెళ్లిపోయాడు. ‘‘ ఏం భయంలేదమ్మా... ఈ బెంచీ మీద కూచోండి.’’ బాబునెత్తి బెంచీమీద కూర్చోబెట్టి స్టేషను వైపు వెళ్లాడు డ్రైవరు కూడా.
చాలా చిన్న స్టేషను ప్రయాణీకులు కూడా ఎక్కువ లేరు. కొద్ది మంది స్టేషన్ లోని షాపుల దగ్గర అటుఇటూ తిరుగుతున్నారు. లైట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి. నేను కూచున్నచోట చెక్క ప్రహరీకవతల చాలా పెద్ద చెట్టు ఉంది. మర్రిచెట్టు కాబోలు. దానికి అవతలున్న స్ట్రీట్ లైట్ వెలుతురు కొమ్మల సందునుంచి సన్నగా పడుతోంది. రాలిన మర్రి కాయలు మేమున్నచోట నేల మీద ఎర్రర్రెగా కనిపిస్తున్నాయి. దోమలు జుయ్ మని శబ్దం చేస్తూ మా చుట్టూ తిరుగుతున్నాయి. బ్యాగ్ లోంచి బ్లాంకెట్ తీసీ పిల్లలిద్దరికీ కప్పి, దగ్గరకు తీసుకుని కూర్చున్నాను. సమ్మర్ హాలిడేస్లో సెలవులు పెట్టి అందరం తిరుమలకెళ్లి అక్కడి నుంచి వాళ్లన్నయ్య వాళ్ల ఊరొచ్చాం. వారం రోజులకని వచ్చిన మూడో నాడే ఆఫీస్ నుంచీ ఫోనొచ్చిందని నన్నూ పిల్లల్ని వదిలి ఆయన వెళ్లిపోయారు.
ఎందుకొచ్చాంరా బాబూ ఈ ఊరనిపిస్తోంది. బావగారికి నిన్నటి నుంచీ హైఫీవర్. ఆయన్నొదిలి రమక్క కూడా స్టేషన్ కి రాలేకపోయింది. "డ్రైవరు చాలా నమ్మకస్తుడు ఏం ఫర్వాలేదులే’’ అని ధైర్యం చెప్పింది.ట్రైను వస్తున్న జాడలేమీ లేవు. పిల్లలిద్దరూ నిద్రపోయారు. ‘‘గీ’’ మని కీచురాళ్లో, చిమట్లో తేగ అరుస్తున్నాయి. కుక్కొకటి వచ్చి మా బెంచీ చుట్టూ తిరుగుతూ సామాన్లు వాసన చూస్తోంది. ‘‘ఫో’’ అని దాన్ని తరమాలన్నా భయంగా ఉంది.
ఇంతలో కణకణ మని గొలుసుల శబ్దం, గుండె ఝల్లుమంది. చుట్టూ చూడాలన్నా భయంగా ఉంది. శబ్దం దగ్గరవుతోంది, స్టేషను వైపునుంచే ధైర్యం తెచ్చుకుని చూశానటువైపు. ముగ్గురు మనుషులు బాగా దగ్గరగా వచ్చారు. అందులో ఇద్దరు పోలీసులు. మధ్యలో వున్నతనికి, మెడకు, చేతులు, కాళ్లకు ఇనుపరింగులు వేసి వాటిని కలుపుతూ గొలుసులు తగిలించారు.
సినిమాల్లో తప్ప ఇలా ప్రత్యక్షంగా చూడలేదెప్పుడూ.. వెన్నులోంచి వణుకొస్తుంది. కదలకుండా కూచున్నాను. వాళ్లు నన్ను దాటి వెళ్లి ఇంకొంచెం దూరంలో పడి వున్న పెద్ద చెట్టు మొద్దు మీద కూచున్నారు. బీడీపొగ, కడుపులో తిప్పుతోంది నాకు. ఇంతలో డ్రైవరొచ్చాడు. సొంతమనిషి చూసినట్లనిపించింది. ‘‘ఇక్కడే వుండు ట్రైనొచ్చేవరకూ, ఎక్కడికీ వెళ్లకు" అన్నాను మెల్లగా.
అర్థమైనట్లుందతనికి. "ట్రైను గంట లేటంటమ్మా వెయిటింగ్ రూంలో కూచుందురు పదండి. సామాన్లు పట్టుకు రమ్మని కూలీకి చెప్పాను.’’ అంటూ బాబును ఎత్తుకున్నాడు.
వెయిటింగ్ రూంలో లైట్లు బాగా వెలుగుతున్నాయి. గోడవారగా నాలుగు బెంచీలు , అవతలి గోడ దగ్గర నేల మీద ఐదారుగురు వరసగా ముసుగులు తన్ని పడుకున్నారు. వాళ్ల మధ్యలో దోమల కేమో ఓ చిన్న కుర్రాడు లేచి కూర్చుని కాళ్లూ చేతులూ గోక్కుంటూ చుట్లూ చూస్తున్నాడు విసుగ్గా. సామాన్లు తెచ్చి ఓ పక్కన పెట్టాడు కూలీ. ‘‘బాబూ.. అమ్మగారి సామాన్లు జాగ్రత్తగా సీటుకింద సర్దేసి డబ్బులు తీసుకో, కంగారు పెట్టకు ఇంకో పదెక్కువిస్తారులే" అని కూలీకి చెప్పి, నా వైపు తిరిగి- ‘‘అమ్మా.. బిడ్డకు జ్వరంగా వుందట. తొందరగా రమ్మని ఫోనొచ్చింది. అసలుకి నిన్నట్నుంచే పాపకు జ్వరం. అమ్మగారి మాట కాదన్లేక ఇంత సేపున్నాను ట్రైనెక్కించి వెళ్దామని. కూలీ నాకు తెలిసినోడేలేమ్మా ఏం ఫర్వాలేదు. నేనొస్తానమ్మా’’ అన్నాడు డ్రైవరు. చెప్పినా ఆగేలాలేడు, పాపకు జ్వరమంటున్నాడు చేసేదేంలేక సరేనన్నాను.
పిల్లలిద్దరికీ బాగా కప్పి పడుకోబెట్టాను. ఆ కుర్రాడింకా కూర్చుని రెండు చేతులతోటి దోమల్ని చంపుతున్నాడు. బ్యాగ్ లో వెతికి లుంగీ ఒకటి దొరికితే వాణ్ని పిలిచి ఇచ్చి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా చేతిలో పెట్టాను. వెళ్లి కూర్చుని లుంగీ కప్పుకుని బిస్కెట్లు తింటున్నాడు. బయట వర్షం పడుతున్న శబ్దం, చెమ్మతో కలిసిన గాలితెర రూం లోపలి దాకా వచ్చింది... వెనకనే మంచి వాసన కూడా దూరింది. ..ప్రాణానికి కాస్త హాయిగా అనిపించింది.
మళ్లీ ఆ గొలుసుల శబ్దం... వాళ్లు ముగ్గురూ వెయిటింగ్ రూంలోకొచ్చి బెంచీ మీద కూర్చున్నారు. బీడీ వాసన, వానకు తడిసిన బట్టలు, చెమట వాసన కలగాపులగమై రూమంతా వ్యాపించి వెగటుగా వుంది.
ఇంతలో ఒక ముస్లిం కుటుంబం... నలుగురు పిల్లలు భార్యాభర్తా ఒక పెద్దావిడా వచ్చారు లోపలికి. సందడి మొదలైంది. పెద్ద దుప్పటొకటి పరిచి అందరూ కూచున్నారు. అతనెళ్లి పిల్లలకేవో తింటానికి కొనుక్కొచ్చారు. ‘‘ రైలు ఇంకో అరగంట లేటంటుండారు’’ అన్నడతను భార్యతో ‘‘ ఇంతకు ముందు గంట లేటున్నారు? మళ్లీ లేటా?’’ అన్నానతనితో ‘‘తెల్లారేలోపల ఎప్పుడైనా రావొచ్చు. ఇట్టా అరగంట గంట అంటూ నే వుంటారు. ’’ అంటూ పోలీసుల పక్క కెళ్లి కూర్చున్నాడతను. ‘‘ఏం చేసినాడన్నా? ఏడకి తిస్కెళ్తన్నారు? ’’ పోలీసుల్నడిగాడతను. ‘‘ మర్డర్ చేసిండు, చర్లపల్లి జైలుకి తీస్కపోతున్నం’’ అని చెప్పాడు పోలీసు. "ఉరి శిక్షేసిండ్రా?" ముస్లిం మళ్లీ అడిగాడు కుతూహలంగా ‘ఏసే ఓళ్లే.. ఎట్నో తప్పించుకున్నాడు జీవిత ఖైదు పడింది.’’ తప్పించుకు పోయిన గొడ్డును వెదికి పట్టుకెళ్తూ దాని గురించి చెప్పినట్లు చెబుతున్నాడు పోలీసు.
అప్పుడు చూశానతన్ని పరీక్షగా... ఇరవై మూడు, ఇరవై నాలుగేళ్లుంటాయేమో, సన్నగా, బాగా వీక్ గా ఉన్నాడు. గడ్డం తల వెంట్రుకలు పెరిగి చింపిరిగా వుంది జుట్టు. కళ్ల చుట్టూ నల్లగా, చేతులు బెంచీమీద ఆన్చి కాస్త వెనక్కి వాలి తల పైకెత్తి రూఫ్ కేసీ చూస్తున్నాడు. నాకెందుకో అతన్ని చూస్తుంటే హత్యచేసేంత క్రూరంగా కనపట్టం లేదు. అయినా హత్యలు చేసేవాళ్లు ఎలా వుంటారో ఎలా తెలుస్తుంది. ఇలాగే వుంటారా.. మనిషిని చంపేంత కక్ష ఎందుకు కలిగిందో... ఆలోచనలు ముసురుకుంటున్నాయి.
దుప్పటి మీద పిల్లలు నిద్రకొరిగారు. వర్షం కొంచెం ఆగినట్టుంది. ఆ గొలుసులబ్బాయి, నా వైపు చూస్తున్నట్లుగా అనిపించింది. అవును... అతని కళ్లు దీనంగా ...నా వైపే చూస్తున్నాడు. ‘‘హైదరాబాద్ కా అక్కా’’ అన్నాడతను వున్నట్టుండి. వులిక్కిపడ్డాను... నన్నే అడుగుతున్నాడు సర్దుకుని "అవును".. అన్నాను. ఇందాకట్నించే ఆ పోలీసులిద్దరూ మాట్లాడుకుంటూనే, నావైపు దొంగ చూపులు చూస్తున్నారు... కంపరంగా వుంది. కానీ, ఇతని చూపు ..‘‘అక్కా’’ అని పిలుపూ నిజాయితీగా అనిపించింది.
కూలీ వచ్చి ‘‘బండొచ్చే టైమైంది పోదామమ్మా.. పిల్లోళ్లతో అంత దూరం నడిచేతల్కి టైమయితది ‘‘ సామాన్లెత్తుకుంటున్నాడు.
మళ్లీ ఆ చీకట్లోకి పోవాలంటే భయం మొదలైంది.
కూలీ గబగబా నడుస్తున్నాడు. బాబు ఎంతకీ లేవటం లేదు. నడవనని ఏడుపు మొదలు పెట్టాడు. అందరూ వెళ్లిపోతున్నారు. పోలీసులు లేచి వెళ్తున్నారు. అతను కాస్త వెనగ్గా నడుస్తూ నాదగ్గర ఆగాడు. జేబులోంచి ఓ కాయితాలకట్ట తీసి నా వైపు చూసి. ‘‘ చదువుతావా అక్కా నా కథ’’ అన్నాడు. ఒక్క క్షణం తోచలేదేమనాలో..అనాలోచితంగానే చెయ్యి చాచి ఆ పేపర్లు అందుకున్నాను. ‘‘ బ్యాగ్ లో పెట్టేసి’’ చాలా మెల్లగా అని వెళ్లిపోయాడు. పోలీసులతన్ని గమనించినట్లు లేదు. ముస్లిం పిల్లలు లేచి ఏడుపులు మొదలు పెట్టారు. అందుకే వాళ్లతని మాటలు విన్నట్లు లేదు.
బ్యాగ్ లో ఆ కట్ట పెట్టి జిప్ వేసేసి బాబు చెయ్యి పట్టుకున్నాను. అతని మాటలు, బిహేవియర్ చూస్తుంటే చదువుకున్న వాడిలా ఉన్నాడు.
ఇంటికొచ్చేశాను ఆరాత్రి పిల్లలు నిద్రపోయాక ఆ పేపర్లు బయటికి తీసి జరిగిందంతా ఆయనతో చెప్పాను. ఇద్దరం కలిసి మంచం మీద పేపర్లు పెట్టి సాపు చేశాం. పోలీస్ స్టేషన్ లో ఉపయోగించే పేపర్లేమో.. రెండు మూడు సైజుల్లో వున్నాయి. ప్రతీ పేజీ మీదా నంబరుంది. నంబర్ల ప్రకారం సర్ది చదవటం మొదలు పెట్టాం.
సాయంత్రం ఏడుగంటలు కావస్తూంది. ప్రైవేటు క్లాసయ్యేసరికి లేటయ్యింది. చెక్కగుటు తీసుకుని వాకిట్లోకడుగుపెట్టాను. అరుగు మీద కూర్చుని వక్కాకు దంచుతోందవ్వ.
‘‘మగ మహారాజులు నూరు చేస్తారు... అడిగేదానికి ఆడదానికి నోరు తెయ్యుచ్చునా... కుక్కిన పేనల్లే పడుంతాల. పేద్ద పట్టుపురావే మాదిరి మాట్లాడతాంది. తల్లిగారిచ్చిన మూటలు దెచ్చిఇల్లు నింపేసుంటారు. నన్ను చూసి ఆపింది అవ్వ ముందు గదిలో చెల్లిళ్లిద్దరూ హోం వర్కు చేస్తున్నారు. వెనక వసారాలో పొయ్యి ముందు కూర్చుని ఊదుడు గొట్టంతో గొంతునరాలు వుబ్బేలా వూదుతోంది అమ్మ. పచ్చికట్టెలేమో పొగవస్తూంది కానీ మండటం లేదు. పొయిలోని పొగకో, కడుపులోని మంటకో గాని అమ్మ కళ్లనీళ్లు కారిపోతున్నాయి.
‘‘ ఏంటమ్మా... అవ్వ మాట్లాడేది? పక్కనే వున్న పీట మీద కూర్చుని అడిగాను. కళ్లల్లో నీళ్లు నాక్కనబడకుండా తలవంచుకుంది అమ్మ. చెప్పమ్మా... అన్నాను. ‘‘ మిగిలున్న నాలుగెకరాల్లో ఇంకో ఎకరా అమ్మేశాడంట మీ నాయన. పక్కుల్లో కోడిపందాల కెళ్లడానికి బట్టల కోసం వచ్చాడింటికి. మొగ పిల్లతిట్నున్నాబతకతారు. ఇద్దరాడపిల్లలకి పెళ్లిళ్లన్నా చెయ్యొద్దా?.. ఇప్పుడు పొలము అమ్మాల్సినంత ఖర్చేమొచ్చింది? అని అడిగిగాను.
అమ్మ ఇంకేం చెప్పలేదు. నాకర్థమైంది వార్చిన అన్నం గిన్నె లోపలికి తీసుకెళ్తూ కాళ్లు మొహం కడుక్కురా అన్నం తిందువు అందీ.
శివగాడు పరుగెత్తుకుంటూ వచ్చి అవ్వెల్తాంది కనకమ్మింటికి, నేనూ ఎల్తానే, ఆల్లింట్లో కారు బొమ్ముంది. వాడి మాటింకా పూర్తి కానేలేదు. వీపు మీద దబదబాపడి పోయాయి దెబ్బలు. అమ్మతోసిని తోపుకి విసుర్రాయి మీద పడబోయాడు సీను. వాడిని పట్టుకుని వాణీ పక్కన కూర్చోబెట్టాను కళ్లుతుడిచి. కనకమ్మ పేరు మానోట విన్నప్పుడు తప్ప ఇంకెప్పుడూ అమ్మలో అంతకోపం చూడలేదు నేను.
‘‘ ఏవిటికీ.. పిల్లోన్నట్టా బాత్తున్నావు? రాత్రికి తోడు పండు కోవటానికి నేనెల్తన్నా, కనక పిల్లోన్ని బాగా చూస్తాది. బోర్నమిటా కూడా తెప్పించింది. నేనే రమ్మన్నా పిల్లోన్ని తీస్కపోతానేం జేస్తావ్. అవ్వ అన్నానికి కూర్చుంటూ అన్నది. వచ్చే దు:ఖాన్ని దిగమింగుకుంటూ అవ్వకు వడ్డిస్తోందమ్మ.
అన్నం తినాలనిపించలేదు... బయటికొచ్చేశా నాన్నతో పాటు కనకమ్మ తమ్ముళ్లిద్దరూ కూడా కోడి పందేలకు వెళ్లారేమో అవ్వతోడు వెళ్తూంది కనకమ్మకు.. తాతాకు పదెకరరాల తోట ఎనిమిదెకరాలు మాగాణీ వుండేదట లేకలేక కలిగిన ఒక్కగానొక్క కొడుకని అతిగారంబం చేసి అవ్వే నాన్నను చెడగొట్టిందని మా రంగమ్మవ్వ అనేది.
స్కూళుకెళ్లకుండా బలదూర్ గా తిరుగుతున్నా...తాత మందలించబోతే వూరుకునేది కాదట. పదహారేళ్లకే చెడు అలవాట్లు ఆ తర్వాత కనకమ్మ స్నేహం ముదిరి చదువు సంధ్య పక్కన బెట్టి ఎప్పుడూ వాళ్ల ఇంట్లోనే వుండే వాడట. ఇది తెలిసి ఊళ్లో వాళ్లెవ్వరూ పిల్లనివ్వకపోతే దూరపు సంబంధం పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసిందట అవ్వ.
నలుగురు అక్కాచెళ్లిళ్లలో మూడు ఆమె అమ్మ. పెళ్లికి ముందు ఇంట్లో దొంగతనం జరిగి పెళ్లికని వుంచుకున్న డబ్బూ నగలూ దొంగల పాలవగా అమ్మకు ఇవ్వాల్సిన కట్నం నగలూ ఇవ్వలేక పోయారట. పెళ్లై వచ్చిన కొత్తకోడలిని సాధించటం మొదలు పెట్టిందట అవ్వ. కనకం వ్యవహారం తెలిసి అమ్మెక్కడ గొడవ చేస్తుందోనని నాన్నకూడా అవ్వతో కలిసి కట్నం నగలూ తెమ్మనీ స్కూటరు కావాలని అమ్మను కొట్టి పుట్టింటికి పంపసేవాడట. వాకిట్లో అరుగు మీద కూచుని గోగునారతో తాళ్లు పేరుకుంటూ అప్పుడప్పుడూ కోడలి తరఫున ఒకటీ అరా మాటలు అనబోతే గయ్ మని అరుస్తూ నోరుమూయించేది అవ్వ. తాతపోయాక ఆ కాస్త దన్నూపోయి అమ్మపూర్తిగా మూగదయింది. ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్లు కవలలూ సీను పుట్టాడు. నాన్న కనకమ్మింట్లోనే మకాంపెట్టాడు. కోడలిమీద కసితో కొడుకును సమర్థిస్తూ తాను కూడా కనకమ్మింటికి రాకపోకలు సాగిస్తూంది అవ్వ.
పొలం అమ్మేశాక నాన్న అసలే ఇంటికి రావటం మానేశాడు. ఇంటర్మీడియెట్ పాసయ్యాను. మంచి మార్కులొచ్చాయి. డిగ్రీలో చేరి తర్వాతేదైనా ఉద్యోగం సంపాదించుకుని చెల్లెళ్లనూ తమ్ముణ్నీ చదివించి అమ్మను బాగా చూసుకోవాలనీ చెల్లెళ్లిద్దరికీ పెళ్లిళ్లు చేయాలనే ఎన్నెన్నో కలలు కనేవాణ్ని. నేనెప్పుడూ నాన్ననేమీ అడగలేదు. డిగ్రీ చదువుతానని అడగాలనుకున్నాను. ఆయన బయట కూడా ఎక్కడా కనపట్టం లేదు. కనకమ్మింటికి వెళ్లాలంటే మనసొప్పటం లేదు. ఆ రోజు కేశవతో కలిసి మాట్లాడుతూ లేటుగా ఇంటికెళ్లాను. అమ్మ ‘‘ మీ నాన్నకు ఒంట్లో బాగాలేదట్రా.. .అవ్వకూడా అక్కడే వుంటోంది. ఎలా వుందో ఏమో చెప్పేవాళ్లూ లేరు ఒక్కసారి కనుక్కుంటావా? అంది దిగులుగా. పొద్దుటే వెళ్తాలేమ్మా అన్నాను. ఆ తెల్లవారు ఝామునే నాన్న శవాన్ని మా ఇంటికి తెచ్చారు.
నాన్న పోయి మూడు నెలలైంది. ఆ మిగిలిన పొలం కూడా కనకమ్మ వాళ్లు కాజేశారు. నాన్నఇన్నేళ్లూ కనకమ్మ తమ్ముళ్లు కౌలుకు చేస్తునారు అనేవాడట అవ్వతో. ఇప్పుడు అవ్వ పొలం మా స్వాధీనం చెయ్యమని వాళ్లనడిగితే విక్రయ పట్టాలు చూపి బయటికి పంపారు ఆమెను. ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని తిరిగాను. ఎక్కడా దొరకలేదు. మీ తాత ఆస్తికదా మీ నాన్నకు అమ్మె హక్కు లేదు. కోర్టు కెళ్లమని సలహా ఇచ్చారు కొందరు. ఇంట్లో జరగటమే కష్టంగా వుంది. కోర్టుకెళ్లటానికి డబ్బెక్కడుంది ఇంత కష్టం లోనూ నా ఫ్రెండ్ కేశవొక్కడే నాకు ఓదార్పు చెప్పేవాడు. వాళ్ల నాన్న తో చెప్పి ఒక షాపులో ఉద్యోగం ఇప్పించాడు. మూడు నెలలు చేశాక వాళ్లు ఇంక రావద్దన్నారు. ఏం చెయ్యాలో తోచలేదు. ఒక రోజు కేశవ మా ఇంటికొచ్చి, ‘‘ రామూ.. ఊర్నుండి మా అంకుల్ వచ్చాడు. మా అమ్మకు దూరబ్బందువు నీ సంగతంతా చెప్పాను. ఆయన నిన్ను పిలుచుకు రమ్మన్నాడు. చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడట. నిన్ను పరిచయం చేస్తానురా అని చెప్పి నన్ను పిలుచుకెళ్లాడు.
చాలా స్నేహంగా మాట్లాతాడాయన. నాకు తప్పక హెల్ఫ్ చేస్తానని మాటిచ్చాడు. మా ఇంటికొచ్చి అమ్మకు ధైర్యం చెప్పి, చెల్లెళ్లను పలకరించి వెళ్లాడు. నాకాయన ఆత్మబంధువు అయినాడు. నాలుగు రోజులుండి ఊరెళ్తూ ఏం దిగులు పడకు నాతో సిటీకొచ్చెయ్ నీకు మంచి జాబ్, నీ చెల్లెళ్ల చదువులూ, పెళ్లిళ్లు అన్ని జరుగుతాయ్ తమ్ముడ్ని చదివించు, నీలాక్కాడు పెద్ద చదువు ఏం ఆలోచించుకో అని వెళ్లిపోయాడు. అమ్మ వాళ్లను వదిలి ఎలా వెళ్లాలా అని మదనపడుతుండగానే మూడు నెలలు గడిచాయి. రాను రానూ ఇల్లు గడవటం కష్టమైపోతూంది.
కళ్యాణ్ అంకుల్ వచ్చాడు నిన్న అని కేశవ చెప్పగానే వెళ్లి కలిశాను. నేనొచ్చేస్తానన్నా? అన్నాను, ఓకే మరీ నాతో వచ్చేయ్, ఎల్లుండి వెళ్తున్నాను, మరి ఫ్యామిలీని ఇక్కడే వుంచేస్తావా? నీతో పాటు తీసుకొస్తావా? అని అడిగాడు. అదే అర్థం కావడం లేదన్నా... నేనిక్కడలేక పోతే ఆ కనకం తమ్ముళ్లు నా చెల్లెళ్లను సేఫ్ గా వుండనివ్వరేమోనని భయంగా వుంది. ఇప్పుడే స్కూలు దగ్గర కొచ్చి అవాకులూ చవాకులూ వాగుతున్నారట... ‘‘ కళ్ల నీళ్లోచ్చేశాయి నాకు. సరే ఒక పని చెయి. అందరూ వచ్చేయండి. పిల్లల్నక్కడే స్కూల్లో చేర్పిద్దాం. నేను వెళ్లి చిన్న ఇళ్లొక్కటి చూస్తాను అందరూ ఒక చోటుంటే ఎంత కష్టమైనా పడొచ్చు. ఏం ఫర్వాలేదు అని ధైర్యం చెప్పాడు.
అమ్మనెలాగోలా ఒప్పించాను. అవ్వ రానంది. అందరం బయలుదేరి వెళ్లాం. చిన్న పోర్షన్ రెంటుకు తీసుకుని వుంచాడు కళ్యాణన్న. ఇంటి అడ్వాన్సు కట్టేసి కొంత డబ్బు ఇచ్చాడు. ఖర్చులకు మొహమాట పడ్డాను ఇంత సాయం చేస్తూ డబ్బుకూడా ఇస్తుంటుంటే. నీకు జాబ్ వచ్చాక అంతా ఇచ్చేద్దూగానిలే, లెక్కరాసి పెట్టుకో అని జేబులో పెట్టాడు.
రాణీ,వాణీ, శివ స్కూల్లో చేర్చతానికంతా కళ్యాణన్నే చూసుకున్నాడు. ఆయన ఆఫీస్ కు రోజూ పొద్దున్నే వెళ్లి రాత్రి వరకూ ఆయన చెప్పిన పనులన్నింటిని చేస్తున్నాను. ఒక రోజు రామూ.. మంచి రోజులొచ్చాయ్ నీకు దుబాయ్ వెళ్లే ఛాన్సొచ్చింది వెళ్తావా? షేక్ హాండిచ్చాడు ఆయన పాదాలకు దణ్ణం పెట్టాను. ఎక్కడికైనా వెళ్లానన్నా... మరి అమ్మా వాళ్లెట్లా అన్నాను. నీ కెందుకంతా, నేనున్నానుగా ఈ దిగుళ్లేవి పెట్టుకోకుండా వెళ్లి బాగా డబ్బు సంపాదించుకున్నాక వచ్చెయ్, చెల్లెళ్ల పెళ్లిళ్లువీ చూసుకోవచ్చు. అందాకా వాళ్ల భారం నా మీద పెట్టు, నిశ్చితంగా వెళ్లు అని భరోసాఇచ్చాడు. తానే దగ్గరుండి పాస్ పోర్ట్, వీసా అన్నీ రెడీ చేసి , టికెట్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఫ్లైట్ ఎక్కేముందు ఆ రామూ... చెప్పడం మరిచాను.. నీకు జీతం అక్కడివ్వరట, ఇక్కడ కంపనీ ఆఫీస్ కెళ్లి తీసుకోవాల్ట అని చెప్పాడు. కంగారు పడ్డాను అమ్మకవన్నీ తెలీదన్నా? ఎలా? అన్నాను.
నేవెళ్లి ప్రతి నెలా జీతం తీసుకెళ్లి అమ్మకిస్తా, ఏం భయం లేదు, మీ అమ్మ మా అమ్మ కాదా, నేనున్నానుగా వెళ్లు అని ధైర్యం చెప్పాడు. అక్కడ దిగగానే నా పేరు రాసిన కార్డు పట్టుకుని నిలబడ్డాడు ఒకతను. అతనితో వెళ్లాను, వాళ్లు చెప్పిన పని చెయ్యడం మొదలు పెట్టాను మొదట్లో ఈ పనా అనిపించింది కానీ... నా చదువుకి ఆఫీసర్ జాబ్ వస్తుందా? కళ్యాణన్న దయవల్ల ఇదైనా దొరికింది. అమ్మ వాళ్ల కోసం ఏపనైనా, ఎంత కష్టమైనా ఫర్వాలేదని సర్ది చెప్పుకున్నాను. రాత్రీ పగలూ పని చెయ్యటం, తెల్లవారు జామూనెప్పుడో గదికి రావటం. ఓ చిన్న గదిలో ఇరవై మంది వరకూ పడుకుని వుంటారు. వాళ్ల మధ్య పడుకుని పొద్దున్నే వ్యాన్ ఎక్కి పనికెళ్లటం. ప్రతీ నెలా కళ్యాణన్న ఫోన్ చేసేవాడు. జీతం పట్టుకెళ్లి అమ్మకిచ్చానని, అందరూ బాగున్నారని చెప్పేవాడు. ఆ ఫోన్ కోసం నెలంతా ఎదురు చూసేవాణ్ణి. రెండు సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఫోన్లు రెండు మూడు నెల్లకు వస్తున్నాయి. ఒక సారి ఫోన్ లో ఒక్క సారొస్తానన్నా... అమ్మవాళ్లను చూడాల్నుంది వారం వుండి వచ్చేస్తా..అని అడిగాను..
సరే... నీ పాస్ పోర్ట్ రాబర్ట్ కి ఇవ్వు..అయినా నేను ప్రతీ సారీ నీవు ఇండియా వస్తానన్నప్పుడల్లా చెబుతూనే వున్నాగా రామూ... ఒక్కసారి వచ్చేస్తే ఇంకా ఉద్యోగం వుండదని, సరే ఆ తిప్పలేవో నేను పడతాలే ఒక్కసారికీ అని అన్నాడు. రెండు రోజుల్లో రెన్యూల్ చెయించి తెచ్చిస్తానన్న పాస్ పోర్ట్ ఐదు నెలలైనా తేలేదు. అడిగినప్పుడల్లా ఏదో చెప్తున్నాడు. కళ్యాణన్న ఫోన్ చేసినప్పుడడిగితే తెస్తాడులే, అక్కడంత త్వరగా పనులు కావు అన్నాడు.
ఆరు నెలలు దాటింది... ఇంకా పాస్ పోర్ట్ రాలేదు. ఇప్పుడు నాకు అక్కడి వాళ్లు మాట్లాడే భాష కొంచెం కొంచెం అర్థం అవుతోంది. చిన్న చిన్న మాటలు మాట్లాడగలుగుతున్నాను .ఎప్పుడూ రాబర్ట్ వెనకాల తిరుగుతుండే టోనీ కనిపించాడోక రోజు రెస్టారెంట్ దగ్గర. రాబర్ట్ పేరెత్తానో లేదో మండి పడ్డాడు. నీ పాస్ పోర్ట్ నీకిక తిరిగివ్వరు. వీళ్ల దగ్గర పనిచేసే వాళ్లందరివీ అలాగే తీసుకుంటారు. వీళ్లదొక పెద్ద ముఠా, ఎదురు తిరిగి బతకలేం. అందుకే నేను వాడితో స్నేహంగానే వుంటాను..అని చెప్పాడు రహస్యంగా.
ఎలాగైనా పాస్ పోర్ట్ తెచ్చివ్వమని టోనీని బతిమాలాను. అది అయ్యే పనికాదు, నీకో ఉపాయం చెబుతా, నాకు తెలిసిన తెలుగు వాడొకడున్నాడు, ,వాడిని కలువు, డబ్బిస్తే ఏదైనా చేస్తాడేమో ఇంకెంత కాలం నీవిక్కడా పనిచేసినా లాభం లేదు. ఆ కళ్యాణ్ వీళ్ల మనిషే, జాగ్రత్త, దొరికితే చంపేస్తారు. అని ఒక ఫోన్ నంబరిచ్చాడూ జ్వరమని లీవు తీసుకున్నాను. నేను వచ్చినప్పటి నుంచీ ఎప్పుడూ లీవు తీసుకోలేదు. నమ్మారు, ప్రతీ నెలా వీళ్లు భోజనానికి ఖర్చులకూ ఇచ్చే డబ్బు తినీ తినక కూడ బెట్టాను. వెళ్లేందుకు, చెల్లెళ్లకు తమ్ముడికి ఏవైనా కొనుక్కెళ్లాలని అది పట్టుకుని వెళ్లి టోని చెప్పిన నంబరుకు కాల్ చేశాను. తెలుగు మాట్లాడే సరికి అతను చాలా హ్యాపీ అయ్యాడు. అతను రమ్మన్నదగ్గర కెళ్లాను. అతను చాలా బాగా మాట్లాడాడు. సాయం చేస్తానన్నాడు. తెలుగు వాడివి, పైగా మా జిల్లా వాడివి. తప్పక నిన్ను మీ ఊరికి పంపుతా అన్నాడు. నన్ను సందులూ గొందులూ తిప్పి ఒక చోట దాచాడు. ఒక వారం ఆ చీకటి గదిలోనే వున్నాను. నాలుగు రొట్టెలు తెచ్చిచాడు కుండలో నీళ్లున్నాయ్, వాటితోనే గడిపాను. పాస్ పోర్ట్ తెచ్చిచ్చి డబ్బుతీసుకున్నాడు. టికెట్ కు సరిపోయే డబ్బుంచుకుని మిగిలింది అతనికిచ్చేశాను. గొర్రెల్ని తోలుకెళ్లే లారీలో వాటి మధ్యలో కూర్చోమన్నాడు. ఎయిర్ పోర్ట్ దగ్గర దింపమని వాళ్లకు డబ్బిచ్చాడు. చేతులెత్తి దణ్ణం పెట్టానతనికి, బయలుదేరుతుంటే ఇది నీ ఒరిజినల్ పాస్ పోర్ట్, రాబర్ట్ వాళ్లు వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ల పాస్ పోర్ట్ లు నాకు తెచ్చిస్తారు. తర్వాత నా చేత వాటితో ఏ వో ఇల్లీగల్ పనులు చేయటానికి మార్పించుకుంటారు. మీ అమ్మ వాళ్ల పుట్టిన ఊరి దగ్గరే మా ఊరు. మీ తాత వాళ్లందరూ నాకు తెలుసు బంధుత్వం కూడా వుంది. అందుకే ఇదంతా చెప్పాను. ఎవ్వరితోనూ అనకు అన్నాడు. నిన్ను నమ్మి పాస్ పోర్టిచ్చాను. నీవు ఇండియాలో దిగగానే దీన్ని నాకు పంపు. ఇదిగో నా అడ్రసు రాసిన కవరు అని చెప్పాడు. వాళ్లకు అనుమానమొచ్చినా అవసరమొచ్చినా పాస్ పోర్ట్ అడుగుతారు నన్ను ఇరికించకు, వాళ్లు కిరాతకులు అన్నారు. తప్పక పంపుతానన్నాను.
ఏయిర్ పోర్ట్ లో దిగ్గానే ముందు పాస్ పోర్ట్ పోస్ట్ చేశాను. కళ్యాణ్ దగ్గరకెళ్లకుండా నేరుగా అమ్మవాళ్లుండే ఇంటికే వెళ్లాను. ఇ ఇంట్లో వేరే ఎవరో ఉన్నారు. అమ్మవాళ్ల గురించి అడిగితే తెలియదన్నారు. అర్థరాత్రి దాకా నేను వీధులన్నీ తిరిగి అలసి పోయి పేవ్ మెంట్ మీదేపడి నిద్రపోయాను. తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది. లేచే ఓపిక లేక అలాగే చూస్తున్నాను, కళ్యాణ్ ఇంట్లో పనిచేసే చెన్నమ్మ రోడ్ మీద వెళ్తూ కనిపించింది. లేచి ఒక్క పరుగున వెళ్లి ఆమెనడిగాను. ‘‘ మా అమ్మ చెల్లెళ్లు ఎక్కడున్నారని’’ ‘‘అయ్యో. బాబూ ఇంకెక్కడి చెల్లెళ్లు ? ఆ దుర్మార్గుడు ఆళ్లిదర్నీ హాస్టల్ లో ఏస్తాను, ఇంట్లో వాళ్ల చదువులు సాగవని మీ అమ్మను నమ్మించి కాలేజీ చదివిస్తానని తీసుకెళ్లి పోయాడు. ఈ పాటికెప్పుడో అమ్మేసుంటాడు బొంబాయికి, మీ అమ్మ ఒట్టి ఎర్రి బాగుల్ది, వాడి మాటలు నమ్మేసింది. నన్ను పని లోంచి తీసేశాడు. మీ అమ్మిప్పుడు వాడింట్లోనే పనిచేస్తావుంది. నా చెవులతో విన్నా బాబూ.. ఆడు ఫోన్ లో మీ చెల్లెళ్ల గురించి బేరమాడుతుంటే ఇంకా బెబుతూనే వుందామె. ఒక్క పరుగున కళ్యాణ్ ఇంటికెళ్లాను. ఆఫీసుగదిలో వున్నాడు. నన్ను చూడగానే ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. నీవా? ఎలా వచ్చావు? అన్నాడు ఖంగారుగా, ‘‘ నా చెల్లెళ్లేరీ? అడిగాను నిబ్బరంగానే, ఏంటి రాము? అమ్మ నా దగ్గరేవుంది. పిలువనా రాణీ,వాణీ హాస్టల్ లో వున్నారు. ఇంట్లో చదువు సాగటం లేదు. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ‘‘ ఏ హాస్టల్? వాళ్లను నేనిప్పుడే చూడాలి’’ అన్నాను అసహనంగా కూచో కూచో తొందరపడతావేం.. వాళ్లీఊళ్లో లేరు, సిటీలో చేర్చా, డాక్టర్లవుతామన్నారు. సిటీలో కోచింగ్ బాగుంటుందనీ’’ ‘‘ ఏ సిటీ, ఏ కోచింగ్ చెప్పు నేనిప్పుడే వెళ్తాను’’ కోపాన్నదుపు చేసుకోవాలన్నా నా వల్ల కావటం లేదు.
అతని గొంతు మారింది. ‘‘ ఏంటి? చెప్తుంటే అర్థం కాలేదా? మళ్లీ రాపో...’’ తలదించుకుని ఏదో రాసుకోవడం మొదలెట్టాడు, ఏంచేశావు వాళ్లని ? అమ్మేశావా? చెప్పు? వణుకొస్తోంది నాకు. ఆ... అవును అమ్మేశాను ఏంటంటా? ముందే చెడిపోయారు వాళ్లు ఇంకేంచెయ్యాలి? తలవంచుకునే అన్నాడు. దవడలు బిగుసుకున్నాయి. ఒళ్లంతా వణుకుతుంది. కంట్రోల్ చేసుకోలేకున్నాను. చిన్న నాటి నుంచీ ఓర్చుకున్న అవమానాలు అణగదొక్కుకున్న కోపం... ప్రాణానికి ప్రాణమైన నావాళ్ల దుస్థితి ..అన్ని ఒక్కసారిగా నా మీద తిరగబడ్డాయి. తట్టుకోలేకపోయాను, నేనేం చేస్తున్నానో తెలియలేదు. టేబుల్ పై నున్న పేపర్ వెయిట్ తీసీ బలంగా విసిరాను, కణతకు తగిలింది. ఆయువు పట్టున తగిందేమో కళ్యాణ్ ప్రాణం వెంటనే పోయినట్లుంది. అరెస్టుయ్యాను, జైలుకి అమ్మను తీసుకొచ్చింది. చెన్నమ్మ..కటకటాల మధ్య నుంచి చేతులు చూసి అమ్మా... అన్నాను. ఊహూ.. అమ్మ పలకటం లేదు. అలాగే కళ్లార్పకుండా చూస్తోంది. ఏడ్చేశాను. వెక్కిళ్లోస్తున్నాయి. అమ్మలో చలనం లేదు. చూస్తోంది. అమ్మను నేను చూసుకుంటూ, పిల్లోడు నాతోను వుంటాడు నీవు బయటికొచ్చేదానికి చూసుకో ...దిగులు పడకు ధైర్యం చెప్పి వాళ్లను తీసుకుని వెళ్లిపోయింది చెన్నమ్మ.
ఎలా? ఎలా చేయగలిగాను? ...మనిషిని చంపాను... నాలో ఇంతటి అమానుషత్వం? నేనంటే నాకే భయం వేస్తోంది. చిన్నప్పటి నుంచీ అమ్మ ఒళ్లో అమ్మకొంగు పట్టుకుని తిరుగుతూ అమ్మ చెప్పిందే చేస్తూ.. అమ్మలాగా ఆలోచిస్తూ.. బతికిన నేను హత్య చేయగలిగానా? అయ్యో.. కళ్యాణ్ పిల్లలు... వాళ్లేంచేశారు. ఎంతటి దు:ఖం మిగిల్చాను వాళ్లకు... ఎంతటి కిరాతకం చేశాను?
నా చెల్లెళ్లు .. జంట సంపెంగల్లా ఒకే రూపన.. నేను దుబాయ్ వెళ్లే రోజు.. వాళ్ల స్కూలు కాంపౌండ్ లో చెట్టుకింద నిలబడి నా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చిన నాచిట్టి చెల్లెళ్లు.. నా బంగారాలు.. చెన్నమ్మ చెప్పిన మాటలు నానరాల్లో.. రక్తంతో పాటు పరుగెడుతూ... నా అణువణునూ చిదుముతూ.. వాడు నీ చెల్లెళ్లను బొంబాయి వాళ్లకమ్మేశాడు.. నా చెవుల్తో విన్నాను బేరమాడుతుంటే.. .బెంచీ మీద వెల్లకిలా పడుకున్నాను. నా నలువైపులా జైలు గోడలు ఎత్తుగా చాలా ఎత్తుగా ఆకాశంలోకి ఎదిగి నిలబడిఉన్నాయి. చల్లగా చాలా చల్లగా వుంది గదిలో నా శరీరంలోంచి పెద్ద మంట పైకి లేచింది. ఎత్తుగా సాగుతోంది... చిటపట మంటూ.. చిన్నప్పుడేసిన భోగి మంటలా... నాన్న చితికి నేనంటించిన నిప్పు మంటలా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తూంది. నా ఒళ్లు మండిపోతుందా.. .కళ్లుమూసుకున్నాను.
కోర్టు బోనులో నిలబడ్డాను శిక్ష వేసే ముందు జడ్జీ గారు నీ వేదైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు అన్నారు. దయచేసి నాకు ఉరి శిక్ష వెయ్యండి సార్, జీవితఖైదు వెయ్యకండి, కర్కశపు తోడేళ్ల కుళ్లుదంతాల మధ్య నలిగే నా వాళ్లు నా కళ్లల్లో కదలుతున్నారు. వాళ్లనుభవించే నరకం నా నరాల్లో నిండి పోరాడుతూ అహర్నిశం నన్ను చిత్ర వధకు గురిచేస్తుంది. కష్టాల కరకు దెబ్బలకు నా శరీరం ఎన్నడో చచ్చిపోయింది. కానీ ఎక్కడో కాస్త ప్రాణం మిగిలే వున్నట్లుంది. మెదడూ బతికే వున్నట్టుంది. అందుకే ఆలోచనలు చావట్లేదు, ఇలా ఈ నరక సదృశమైన శరీరంతో నేను బతకలేను ప్రాణం పోయే దాకా ...దయచేసి నాకు ఉరి వేయండి. నాకు ఉరి శిక్ష వేయలేదు, యావజ్జీవం వేశారు... ఎంత నిర్దయ? గడిచే ఒక్కో నిమిషం నా శరీరంపై సుత్తిపోట్లు వేస్తూ పోతూంది. రక్తం ఓడుతూ ఎంతకాలం బతకను? ఎలా బతకను?
కొద్ది రోజుల్లో చర్లపల్లి జైలుకి తీసుకెళ్తారంట నన్ను. జైలు సెంట్రీని బతిమాలితే ఒక పెన్సిలు, అప్పుడప్పుడూ ఒకటి అరాసీ పేపర్లూ తెచ్చిచ్చేవాడు, నా కథంతా రాశాను. నేను హైదరాబాద్ జైలుకి ట్రైన్ లోవెళ్లేటప్పుడు వీలైతే ఎవరికైనా ఇస్తాను. తీసుకోరేమో... తీసుకోకపోతే ఎక్కడో జారవిడుస్తాను. చెత్తలోకి పోతుందా? లేక ఎవరైనా చదువుతారా?
నా కథ చదివిన వారెవరైనా దయచేసి అందరికీ తెలిసేలా చేయండి. ఎందుకంటే నాలా ఇంకెవ్వరూ మోసపోరాదు. ఇంకా ఎందుకంటే.. . నా చెల్లెళ్లు కనక ఇది చదివితే.. అన్నవస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని ఆశపెట్టుకోకుండా.. కవల కాళికలుగా మారి తమను వంచించిన రాక్షసులను చీల్చి చెండాడి.. ఆడపిల్ల అబల కాదని నిరూపించాలి. అమ్మను తమ్ముణ్ణి ఆదుకోవాలి ఇదే నా చివరి కోరిక.
పేపర్లన్నీ సర్దుతున్నాను... గుండె నిండిన దు:ఖం గొంతు దాటి పేపర్ల మీద టపటపా రాలినాయి కన్నీళ్లు, హత్యచేసి కసి తీర్చుకున్నాడు కానీ నేరానికి శిక్ష తప్పదుగా.. మా వారు ఈ మాట అని ఓ పెద్ద నిట్టూర్పు వదిలి అటువైపు తిరిగి పడుకున్నారు, నాకు తెలిసినతను దిన పత్రిక సబ్ ఎడిటర్ ఉన్నాడు ఆయనకిది చూసి వాళ్ల ఆదివారం ఎడిషన్ లో వేసుకొమ్మని అడుగుతాను అన్నారు కాసేపయ్యాక. అంతేనా..నేరానికి సరిపోయే శిక్షవేశేశాం అని చేతులు దులిపేసుకుంది న్యాయస్థానం, దాన్ని సరిగ్గా అమలు చేస్తున్నాం అంటూ విర్రవీగుతోంది రక్షణ శాఖ కానీ... ముక్కుపచ్చలారకనే ముంబయ్ కబేళాకు తరలించబడ్డ కన్నెపిల్లలు.. దగాపడి విధుల కంకితమైన అమాయకపు తల్లి, వీరిని ఎవ్వరు ఆదుకుంటారు? తన వాళ్లను రక్షించుకోవాలనే తాపత్రయం గుండెనిండి పొంగి పొరలుతున్న వాడిని సంకెళ్లు వేసి బంధించారు...
ఇంకెలా.. ఇంకెవరు వారికి రక్ష... ఇంకెన్నాళ్లకు విడుదల భగవంతుడా...?
*****