MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
ప్రబంధ సాహిత్యము - అల్లసాని పెద్దన
ప్రసాద్ తుర్లపాటి
( గత సంచికలో ప్రబంధ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ రామరాజ భూషణుని “ వసుచరిత్ర “ గ్రంధాన్ని క్లుప్తంగా పరిచయం చేయడం జరిగినది. ఈ సంచిక నుంచి ప్రబంధ కవుల గ్రంధాలను, కవితా శైలుల విశ్లేషణ, తదితర విషయాలను మీ ముందుంచుతాను! )
ఆంధ్ర కవితాపితామహుడు - అల్లసాని పెద్దన
“తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స“
అన్న శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో భువనవిజయాన్ని అలంకరించిన అష్టదిగ్గజ కవులలో అగ్రపీఠాన్ని అలంకరించినవాడు అల్లసాని పెద్దన. “ఆంధ్ర కవితా పితామహుడు” అన్న బిరుదముతో అలంకృతుడు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రథమ పూజ పెద్దన గారికే చెందుతుంది.
ఆరుద్ర గారన్నట్లు “ఆంధ్ర ప్రబంధ కవులలో ప్రథమ పూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. మన సాహితిరంగములో ఆందరి కన్నా ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్ర కవితా పితామహుడే. దీనికి కారణం శ్రీకృష్ణదేవరాయలవారు అందరికన్నా పెద్దపీట వేసి పెద్దన గారిని దాని మీద నిలబెట్టడం కానేకాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి. శ్రీకృష్ణ దేవరాయల వారికీ అందరుకవుల మీదకన్న, పెద్దన గారిమీద అభిమానము ఎక్కువ.“ రాయలవారు పెద్దనను ఎలా గౌరవించారో రాయల వారి మరణానంతరము చెప్పబడిన ఈ పెద్దన గారి చాటువు నుంచి గ్రహించవచ్చును –
“ ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి - కేలూత యిచ్చి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళ బురమేగఁ - బల్లకిఁ దనకేలఁ బట్టియెత్తె
బిరుదైన ఘనగండపెండేరమున కీవె - తగునని తానె పాదమున దొడగె
కోకట గ్రామా ద్యనేకాగ్రహారంబు - లడిగిన సీమలయందు నిచ్చె
నాంధ్రకవితాపితామహ! యల్లసాని
పెద్దన కవీంద్ర! యని నన్ను బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేగలేక
బ్రతికియున్నాఁడ జీవచ్ఛవంబు కరణి “
ఇవి అతిశయోక్తులు కానే కావు, సత్యమని ఋజువు చేయగల సాక్ష్యాధారాలు కూడా లభించాయి (నేలటూరి వెంకట రమణయ్య గారి ఉపన్యాసము – ఆష్టదిగ్గజ నిర్ణయము, ఆంధ్రభారతి.com).
వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగము గా కీర్తించబడిన యుగము ప్రబంధ యుగము. సంస్కృతములో దండి చెప్పిన సర్గబంధ ప్రక్రియను 12వ శతాబ్దానికి చెందిన నన్నెచోడుడు తెలుగులోకి తీసుకుని వచ్ఛాడు. తరువాత, అల్లసాని పెద్దన వంటి కవులు కూడా సర్గబంధ లక్షణానుసారమే, ప్రబంధాలను రచించారు. రాయల వారి యుగము (క్రీ,శ. 1500 – 1600) ప్రబంధ యుగమని చెప్పవచ్చును. అల్లసాని వారి మనుచరిత్ర, నంది తిమ్మన పారిజాతపహరణము, శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్త మాల్యద, రామరాజ భూషణుని వసు చరిత్ర, తెనాలి రామలింగని పాండురంగ మహాత్యము, దూర్జటి, శ్రీ కాళహస్తీశ్వర మహత్యము, చేమకూర వేంకటకవి, విజయ విలాసము మొదలగునవి ప్రబంధాలు. ఇక కల్పిత కథలైన పింగళి సూరన కళాపూర్ణోదయము, మాదయ గారి మల్లన రాజశేఖర చరిత్రము, కందుకూరి రుద్రయ నిరంకుశోపఖ్యానము కూడ, ప్రబంధ రచనలు గానే పరిగణింపబడుచున్నవి.
రాయలవారు పెద్దనతో, "అతుల పురాణాగమేతిహాసకథార్థ స్మృతియుతుడవు ఆంధ్ర కవితాపితామహుడవు, చతురవచోనిధివి, శిరీష కుసుమ పేశల సుధా మయోక్తుల పేర్కొన నీకు ఎవ్వరు’ ఈడనుచు ‘కృతి రచింపుము మాకు” అని ప్రార్థించాడు. మనువులలో “స్వారోచిష మనుసంభవ మరయ రససమంచిత కదలన్ విననింపు కలిధ్వంసకము కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పు’’ మని వస్తు నిర్దేశం చేసి మరీ ప్రేరేపించాడు. అందుకు ఆమోదించిన పెద్దన “మోదంబున అమ్మహాప్రబంధ నిబంధనంబునకు” శ్రీకారం చుట్టాడు. ఆ సుముహూర్తం లోనే ఆంధ్ర సాహిత్యం లో తెలుగు పంచకావ్యములలో ఒకటిగా పేరెన్నిక కన్న ‘మను చరిత్ర’ అనబడు ‘స్వారోచిష మనుసంభవం” అన్న మహాప్రబంధ రచనకు శ్రీకారం చుట్టబడినది.
అంతేకాదు, పెద్దన గారు కృతులు రచించే సమయా సందర్భములను కూడా వివరించారు -
"నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మ కింపైన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరకని గాక ఊరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!"
ఇల్లాలికి ఇష్టురాలైన చెలికత్తె (రమణీప్రియదూతిక) ప్రియమారగా తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం ఉండాలి. మనసుకు నచ్చిన (ఆత్మకింపైన) భోజనమూ, భోజనం చేశాక కర్పూర తాంబూలం వేసుకొని విలాసంగాఊగడానికొక ఉయ్యాలమంచం ఉండాలి. తాను చెప్పే కవిత్వంలో తప్పొప్పులు చూడగలిగే రసజ్ఞులూ, కవి ఊహను ముందుగానే తెలుసుకోగల వారూ అయిన ఉత్తమలేఖకులూ, ఉత్తమ పాఠకులూ దొరకాలి. వీళ్ళందరూ దొరికినప్పుడే కానీ ఊరికే కృతులు రచించమంటే కుదురుతుందా ? కుదరదు.
అల్లసాని వారు కవితా లక్షణాలని వివరిస్తూ చెప్పిన ఉత్పలమాలిక (చాటువు) –
"పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా
కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని
ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్
బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్
జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే
ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్
గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం
బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా
సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ
రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా
శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా
పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం
గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం
ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్ “
అల్లసాని వారి ప్రముఖ రచన మనుచరిత్ర. ఆరు ఆశ్వాసాలు కల ఈ ప్రబంధము 750 పైగా పద్య గద్యాలు, పధ్నాలుగు వర్ణనలతో అలరారుతున్నది. రాయలవారికి అంకితమిచ్చి పెద్దన గండపెండేరము తొడిగించుకున్నాడు. మనుచరిత్రకు మూలం సంస్కృత మార్కండేయ పురాణం. మారన దీనిని తెనిగిస్తే, పెద్దన ఈ రెండు గ్రంధాలు పరిశీలించి అద్వితీయ ప్రబంధంగా మనకందించాడు.
“అల్లసాని వారి అల్లిక జిగి బిగి .. “ జిగి అనగా కాంతి, బిగి అనగా సాంద్రత. రసపుష్టి మూలముగా జిగియు, భావ పరిపుష్టి ద్వారా సాంద్రతను కథలో అందముగా జొప్పించారు. శ్రీకృష్ణదేవరాయలవారి కాలం వరకూ సామాన్యముగా ఆంధ్రకవులు సంస్కృత గ్రంధములను తెలుగులోకి అనువదించుటయే తమ ముఖ్య కర్తవ్యమని భావించారు. కాని ఈ భాషాంతరీకరణము దాదాపు శ్రీనాధుని కాలముతో ముగిసింది. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా స్వతంత్ర రచనలనే ప్రోత్సహించేవాడు. పౌరాణిక కథను ఆధారంగా తీసుకున్న పెద్దన తన శైలిలో, వర్ణనలతో స్వతంత్ర రచనవలే మనకనదించాడు. మనుచరిత్ర తెలుగు లో స్వతంత్ర ప్రబంధమని చెప్పవచ్చును.
“స్వారోచిష మనుసంభవము” – అనగా మానవ జాతికి ధర్మశాసన మొనరింపగల మహాపురుషుడైన స్వారోచిష మనువు జననము. మనుచరిత్ర కథలో – వరూధిని ప్రవరుల వృత్తాంతము, మాయప్రవరునికి (గంధర్వుడు), వరూధిని కి జన్మించిన స్వరోచి వృత్తాంతము, స్వరోచి మనువుకు మనోరమ ద్వారా స్వారోచిష మనువు పుట్టుక ఇత్యాది అంశములు మనకు కానవస్తాయి. మానవ జీవితములో నిరంతరము ఆత్మేంద్రియాలకు కలుగుచున్న సంగ్రామమే మనుచరిత్ర యందు వర్ణింపబడినది. ఈ విషయాన్ని కడు సమర్ధతతో ప్రస్తావించడం జరిగినది. అల్లసాని వారి సంధాన నైపుణ్యము వర్ణనల యందును, పాత్రల సంభాషణల యందును, భావ ప్రకటనల యందునూ స్పస్టంగా కానవస్తుంది. ఈ కథను వర్ణనాత్మకముగా, శృంగార, శాంతి రస పోషణతో, సంస్కృత ప్రౌఢి - తెలుగు నుడికారములతో, అద్భుతమైన పాత్ర చిత్రణలతో పెద్దన మనకనదించాడు.
పింగళి లక్ష్మీకాంతం గారు ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర’ అనే గ్రంధములో మనుచరిత్ర గురించి ఈ విధముగా వివరించారు – “ మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్ధము. కధోపక్రమనిర్వహణముల యందు శాంతరసమే నిరూపణమైనది. శాంతమూర్తి యగు ప్రవరునితో ఆరంభమై ధర్మావతారామగు స్వారోచిష మనువు తో అంతమయ్యేను. ఈ కథలో కవి శాంత శృంగారములకు బద్ధ వైరము కల్పించెను. కథవసానమున శాంతము జయించి శృంగార మణిగిపోయినది. జయించినదే ప్రధాన రసము. వరూధినీ పరమైన శృంగార కథ ప్రాసంగీకము. కావ్య ప్రధానరసము శాంతము. “
మనుచరిత్ర – కవితా వైభవం – ఉదాహరణలు
అలంకారం - ఆరంభములో కావించిన గణేశ స్తుతి –
అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా:
ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్ కబళింపబోయి ఆ:
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా:
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్:
ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన తన మనుచరిత్ర ప్రబంధ ప్రారంభములో లో గజానుని స్తుతిస్తూ భ్రాంతిమతాలంకారములో, స్వభావోక్తి అలంకారములో చేసిన స్తుతి ఇది. అల్లసాని వారి అల్లిక అందుకే ‘జిగిబిగి’. ఇక్కడ మనకు అర్ధనారీశ్వరతత్వాన్నిసాక్షాత్కరింప చేశారు. బాల వినాయకుడు శివుని ఆభరణాలయిన సర్పములను చూసి తామరతూడులని భ్రాంతి చెందాడు. మనుచరిత్రలో కూడా వరూధిని మాయ ప్రవరురుని (గంధర్వుని) చూసి నిజమయిన
ప్రవరుడనిభ్రమిస్తుంది. ఆది లోనే కావ్యము యొక్క ధ్వనిని సూచించారు అల్లసాని వారు.
హిమాలయాల వర్ణన –
అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్,
గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్
ప్రకృతి సౌందర్యం తో పరవశం కలిగించే దృశ్యాల ఎన్నింటినో ప్రవరుడు తన హిమాలయ పర్వత సానువుల్లో చూసి పులకరించాడు. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు గా వున్నాయి. అక్కడ శిఖరాల పై నుంచి పడుతున్న జలపాతాలు, సెలయేళ్ల ప్రవహాలు ఎంతో శోభాయమానం గా వున్నాయి. లయబద్ధం గా వున్న ఆ ప్రవహా ధ్వనులు మృదంగ వాద్యాల ధ్వనుల వలై వీనులకు విందుగా వున్నాయి. ఆ ప్రవహాల నుంచి వస్తున్న నీటి తుంపురులు అన్నీ దిక్కులకు తుళ్లుతున్నాయి. వాటిని చూసి పులకరించిన నెమళ్ళు గుంపులు గుంపులు గా పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ఆ ప్రదేశమంతా ఎత్తైన చెట్లతో (మద్ది చెట్లు) అరణ్యంలా గోచరిస్తోంది. ఆ సాల వృక్షములను తమ తొండములతో అక్కడ వున్న ఆడ ఏనుగులు కదిలించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ప్రవరుడు ఈ హిమవతపర్వత సౌందర్యాలనన్నింటినీ చూసి పరవశించాడు.
ఈ పద్య విశేషాలను గమనిద్దాం –
హిమాలయ పర్వత వర్ణన కాబట్టి ఓజో గుణం వుంది. అంత్యనుప్రసాలంకారము సెలయేళ్ల ప్రవాహం ధ్వని సూచింపబడుచున్నది. రాబోవు కథను కూడా ఇక్కడ సూచించాడు పెద్దన, ఇక్కడ ఆడ ఏనుగులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆ మద్ది వృక్షాలు చలించడంలేదు. అంటే, రాబోయే కథలో వరూధిని అనే ఆడ మదగజం ఎంత ప్రయత్నించినా ప్రవరుడు అనే సాల వృక్షం చలించకుండా నిలబడతాడు.
మరియొక విధముగా నేటి యువతకు సందేశం – మన చుట్టూ ఎన్నో ఆకర్షణలున్నా, ఎంతోమంది ప్రలోభాలకు లోను చేస్తున్నా, ఏ మాత్రం చెదరకుండా యువత తన మనస్సును తన లక్ష్యం వైపే కేంద్రీకరించాలి.
తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన పద్యమిది.
పాత్రపోషణ – ప్రవరుడు –
ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా
షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై.
చిత్రింప అలవి కాని (అలేఖ్య) దేహ సౌందర్యంతో, బహు దేశాల సందర్శనమందు మక్కువ కలవాడు, మన్మధునిలా, పూర్ణచంద్రునిలా సౌందర్యవంతుడు, వాక్కునయందు రెండవ ఆదిశేషుడు, వివిధాధ్వర నిర్మల, ధర్మ దీక్షా పరతంత్రుడు, బ్రాహ్మణ కులమునకు అలంకార భూషితుడు, ఎల్లప్పుడూ వేదాధ్యానము నందు ఆసక్తి కలవాడు, ధర్మాచరణం, కర్మాచరణం తప్పనివాడు – అల్లసాని వారి ప్రవరాఖ్యుడు. ఉపమ, రూపకాలంకారాలతో ప్రవరుని రూపురేఖల్ని, ఆచార వ్యవహారాలను అందంగా వర్ణించే పద్యమిది. ఈపద్యములో మరియొక విశేషమున్నది. పెద్దన “ఆ పూరి పాయక ఉండు “ అన్న విశేషం వాడారు. అంటే, తన పురి ఐన అరుణాస్పదపురాన్ని ఎప్పుడూ వదలకుండా వుండు వాడు, కాని బహు ప్రాంతాల సందర్శనాభిలాషి కనుక సిద్ధుడు లేపనం ఇచ్చిన వెంటనే హిమాలయాలకు ఎగిరిపోయాడు.
పాత్ర పోషణ - వరూధిని –
అతఁ డా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని చేరఁ బోయి, కనియెన్ విద్యుల్లతావిగ్రహన్,
శతపత్రేక్షణఁ, జంచరీకచికురన్, జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్, నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్
వరూధిని ని దేవతా స్త్రీ గా వర్ణన చేశాడు పెద్దన. సర్వశుభలక్షణాలతో అత్యంత సౌందర్యంతో మెరుపుతీగ వంటి సౌందర్యం కల స్త్రీ, పెద్దన గారి వరూధిని. మాయ ప్రవరుడైన గంధర్వునితో, స్వారోచిష మనువును కనదగిన స్వరోచి కి జన్మనిచ్చింది.
ప్రవరుడు – వరూధిని ల సంభాషణ –
ప్రవరుడు –
ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ,ద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి, పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగున్
వరూధిని సమాధానం –
ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే
కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా
గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ
కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికిన్?
భూసురేంద్ర ! అంటూ వరూధిని ప్రవరుని సంభోదిస్తూనే, “ చెంపకి చారడేసి కళ్ళు పెట్టుకొని ఎవరినయ్యా త్రోవ అడుగుతున్నావు ? ఒంటరిగా వున్న జవరాలిని పలకరించాలన్న నెపం కాక ? అప్పుడే నీవు వచ్చిన త్రోవ మరచిపోయావా ? అంతా భయంలేకుండా ? నేనేమి చులకనగా కనపడుతున్నానా ? కాని నర్మగర్భంగా పలికిన వరూధిని ఎన్నో సూచనలను ఇస్తున్నది. “ నీవు ఇంద్రునితో సమానము, చక్కటి కన్నులు కాలవాడవు, నేను యుక్తవస్సులో వున్నదానను, ఒంటరి దానను.. “
ఈవిధముగా పెద్దన గారు సంభాషణ శైలి మనకు మనుచరిత్ర గ్రంధములో ప్రస్పుటముగా కనిపిస్తుంది.
నానుడులు, జాతీయాలు –
పెద్దన గారి కవిత్వములో సామెతలు, జాతీయాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అవి సందర్భానుసారముగా ప్రయోగించబడి కావ్యానికి నాటకీయత చేకూరుతుంది.
ఉదాహరణలు –
“ ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర “
“ అంధునకు కొఱయే వెన్నెల ..”
“ ఆనందో బ్రహ్మ “
“ అచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ .. “
“ తరమే బ్రహ్మకు నైన.. “
“ వనిత దనంత దావలచి వచ్చిన చులకన కాదే ఏరికిన్.. “
ఆంధ్ర వాజ్మయములో నవ్యకవితా పితామహుడిగా పెద్దన ప్రబంధ శైలిని సృష్టించాడు. అందుకే తెలుగు భాష లాలిత్యం, సౌకుమార్యం తెలవాలంటే మనుచరిత్ర చదవాలంటారు పెద్దలు. రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వంటి ప్రబంధ కవులు పెద్దన పద్య రచనను అనుకరించారు. పెద్దన కవిత శైలి అద్వితీయం. అత్యద్భుత కవితా ప్రతిభతో పెద్దన ముమ్మాటికి ఆంధ్ర కవితా పితామహుడే.
*****