MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
మహాభారతము – ఆంధ్రీకరణము – ఎఱ్ఱాప్రగడ
ప్రసాద్ తుర్లపాటి
అక్టోబరు 2020 సంచికలో ‘ కవిత్రయ మహాభారత ఆంధ్రీకరణము’ ప్రారంభించి నన్నయ గారి శైలి ని కొన్ని ఉదాహరణాలతో వివవరించాను. తదుపరి సంచికలో తిక్కన భారతం గురించి వివరించాను. ఈ సంచికలో కవిత్రయ త్రిమూర్తులలో ని ఎఱ్ఱాప్రగడ మహాభారత రచన గురించి వివరించే ప్రయత్నం చేస్తాను
భారత కావ్యహార మొక భాగము నన్నయభట్టు కూర్చే ము
క్తామరమణీయ వాక్యముల తక్కిన భాగము సోమయాజి పెం
పార నోనర్చె, రెంటి కలయన్ శివదాసుడు మధ్యనాయక
శ్రీ రచియించె శారద ధరింప, కవిత్రయ కీర్తి మించగన్
(తారక బ్రహ్మ రాజీయము - చింతల ఎల్లనార్యుడు)
సరస్వతి దేవి మక్కువతో ధరించే ముక్తారమణీయ కావ్యం మహాభారతమయితే, అందులో ఒక భాగాన్ని నన్నయ కూర్చితే, మరియొక భాగాన్ని తిక్కన సోమయాజి సమకూర్చాడు. ఈ రెండు భాగాలను శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడూ అయిన ఎఱ్ఱాప్రగడ తన ‘అరణ్యపర్వం’ అనే మణిశ్రీ తో సంధానించాడు. దానితో మహాభారతం పూర్తి అయినది, భారత భారతి కంఠసీమలో మణిహారమై ప్రభవిల్లినది మరియు కవిత్రయ కీర్తి తేజరిల్లింది.
14 వ శతాబ్ది తొలినాళ్ళలో అద్దంకి రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి, మరియు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదాంకితుడు ఎఱ్ఱన. ‘శబ్ధశాసనుడు’ నన్నయ, ‘సోమయాజి’ తిక్కన, ‘ప్రబంధ పరమేశ్వరుడు’ ఎఱ్ఱన. ఈ విధముగా విష్ణు సంభూతుడు నన్నయ, బ్రహ్మ – బ్రహ్మీభూతుడు తిక్కన, పరమేశ్వర స్వరూపుడు ఎఱ్ఱన. త్రిమూర్తులు గృహస్థ ధర్మానికి ప్రతీకలు. వారు లోకానికి అవిచ్ఛిన్నతని ప్రసాదిస్తుంటారు. వారి వలే, గృహస్థ ధర్మం ప్రధానాంశంగా కల మహా భారతాన్ని కవిత్రయ మూర్తులు మనకందించారు.
నన్నయ గారన్నట్లు –
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే
(నన్నయ ఆది పర్వము – మంగళ శ్లోకం )
పురుషోత్తమ = విష్ణు, అంబుజభవ = బ్రహ్మ , శ్రీకన్ధరా = శివుడు
(నన్నయ) (తిక్కన) (ఎఱ్ఱన)
భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు, | శ్రీవత్సగోత్రుండు, శివపదాబ్జ
సంతతధ్యాన సంసక్తచిత్తుఁడు, సూర | నార్యునకును బోతమాంబికకును
నందనుఁ, డిలఁ బాకనాటిలో నీలకం | ఠేశ్వరస్థానమై యెసకమెసఁగు
గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు | ధన్యుండు ధర్మైకతత్పరాత్ముఁ
డెఱ్ఱనార్యుండు సకలలోకైక విదితుఁ | డయిన నన్నయభట్టమహాకవీంద్రు
సరససారస్వతాంశప్రశస్తి దన్నుఁ | జెందుటయు సాధుజనహర్షసిద్ధిఁ గోరి.
ధీరవిచారుఁడు తత్కవి | తారీతియుఁ గొంతదోఁపఁ దద్రచనయకా
నారణ్యపర్వశేషము | పూరించెఁ గవీంద్రకర్ణపుటపేయముగాన్.
పైన పేర్కొనబడిన సీస పద్యము అరణ్య పర్వం చివరలో ఎఱ్ఱన రచించినది. ఈ పద్యం వలన ఎఱ్ఱన గురించిన వివరములు మనకు అవగతమవుతాయి. పాకనాటిలో నీలకంఠేశ్వరస్వామి వారి దేవస్థానమునకు నెలవైన గుడ్లూరు ఎఱ్ఱన జన్మస్థానము. అపస్తంబ సూత్రుడు, శ్రీవత్స గోత్రీకుడు, శివభక్తుడు, పోతమాంబ, సూర్యనార్యుల పుత్రుడు, భవ్య చరితుడు, ధర్మయిక తత్పరుడు ఎఱ్ఱన.
దాదాపు రెండున్నర శతాబ్దాల తరువాత నన్నయ కవితా రీతులను అవగతం చేసుకొని, సాధుజన హర్షాతిరేకముగా నన్నయ పేరిటనే అరణ్య పర్వ శేష భాగాన్ని పూరించిన వినయశీలి, ‘శివపదాబ్జసంతతధ్యాన సంసక్తచిత్తుఁడు’ ఎఱ్ఱన. నన్నయ సారస్వతాంశను, తిక్కన పలుకుబడిని రంగరించుకొని నన్నయ తిక్కన ల మధ్య మాన్యత గడించుకొన్న ప్రముఖుడు ఎఱ్ఱన.
“ ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబు నందారణ్యపర్వంబు నందు.. “
అని అరణ్యపర్వ ఆశ్వాసంత గద్యంలో వినయంగా పేర్కొన్నాడు.
ప్రబంధ యుగములోని అలంకారిక శైలికి ఆద్యుడు ఎఱ్ఱన. ఎఱ్ఱన ఇతర రచనలు – హరివంశము, నృసింహ పురాణము. ప్రబంధ లక్షణాలయిన కావ్య కవితా శైలి, ఇతిహాస కథా వస్తువు, కథా కథనం మరియు వర్ణన ఎఱ్ఱన అరణ్య పర్వ రచనలో మనకు కానవస్తాయి. ఎఱ్ఱన చూపిన ప్రబంధ శైలి పెద్దన నాటికి ప్రస్ఫుటంగా రూపొందింది. ఎఱ్ఱన చూపిన ప్రబంధ లక్షణాలను భావి కవులు కూడా స్వీకరించారు కనుకనే ఆయన ప్రబంధ పరమేశ్వరుడైనాడు. అందుకే ఆయన యుగకర్త. అరణ్య పర్వ శేష పూరణ తో బాటుగా, వ్యాస భగవానుని సంస్కృత మహాభారతము లో అంతర్భాగమయిన హరివంశమును తెలుగు లో అనువదించి పురాణేతిహాసంగా మనకందించాడు.
మహాభారత అరణ్య పర్వములో ఎఱ్ఱన చేసిన శారదా స్తుతి –
అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ | శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి! ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా
చుంబితదిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ! భా
వాంబరవీథివిశ్రుతవిహారి! ననుం గృపఁ జూడు భారతీ! (అరణ్య పర్వమ: 4:215)
అమ్మ సరస్వతి దేవి, క్రొత్త పద్మాల వలే ధగధగలాడే చేతులు కలదాన ! శరత్కాలం లో చంద్రుని వెన్నెల వంటి వెలుగుల వలే వెలుగొందుచున్న మనోహరమయిన ఆకృతి కలదాన ! దిక్కులన్నింటినీ ప్రకాశింప చేస్తున్న కాంతులు కల రత్నాభారణాలు ధరించినదాన ! వేదాలలోని సూక్తాలలో వెల్లడించబడిన స్వీయ మహిమ కలదాన ! ఆలోచనల ఆకాశపు దారులలో ప్రశస్త రీతిలో విహరించే అమ్మ ! నను దయతో కాంచవమ్మ !! దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అందుకే శంభుదాసుడు ఎఱ్ఱన, సరస్వతి వరప్రసాదుడు పోతన.
ఇద్దరూ వినయశీలురే.
గమనిక : ఈ పద్యం మనకు పోతన మహాభాగవతం లో కూడా కానవస్తుంది. అనుప్రాసాలంకార ప్రియుడైన పోతన ఈ పద్యాన్ని భాగవతంలో స్వీకరించాడని భావించ వచ్చు. పోతన ఈ క్రింద ఉదహరించిన శారద స్తుతి తరువాత ఎఱ్ఱన చేసిన సరస్వతి ప్రార్ధనను నిలిపాడు.
క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షితానత
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్
శారద నీరదేందుఘనసార పటీరమరాళమల్లికా
హారతుషార ఫేనరజతాచల కాశఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడుగల్గు భారతీ!
నన్నయ తెనిగించిన భారతంలో మైత్రేయ బృహదశ్యుడు, నారద వ్యాస మునీంద్రులు చెప్పిన కథాంశాలు పాండవుల అరణ్య వాస జీవితంతో పెనవేసుకొని విస్తృతంగా కనిపిస్తాయి. వీటిలో ధర్మరాజాదుల తీర్ధయాత్రా విశేషాలు మొదలగునవి. ఎఱ్ఱన పూరించిన భాగములో మార్కండేయ మహర్షి చెప్పిన కథాంశాలే ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తాయి. అంటే నన్నయ భాగములో ఇతిహాసానికి ప్రాధాన్యత వుంటే, ఎఱ్ఱన భాగములో పురాణానికి ప్రాముఖ్యత కల్పించబడినది.
ఎఱ్ఱన అరణ్య పర్వ శేషాన్ని విఖ్యాత మాధుర్య మనోహరంబుగా, సవిస్తార మధురముగా రచించాడు. అరణ్య పర్వ శేషములో ఘోషా యాత్ర, సైంధవుని వృత్తాంతం, కర్ణుని దాన, వీర గుణ విశేషాలు, యక్ష ప్రశ్నలు మొదలగునవి వివరించబడినాయి. ధర్మజుడి శాంత, శమ దమ ప్రవుత్తి, కర్ణుని త్యాగనిరతి అద్భుతంగా ఆవిష్కరింపచేస్తాడు.
సంస్కృత మహాభారతంలో అరణ్యపర్వం లోని శ్లోకాల సంఖ్య – 13,664, ఉప పర్వాలు – 16; తెలుగు భారతంలోని అరణ్యపర్వములో 2894 పద్య గద్యాలున్నాయి. నన్నయ 6981 శ్లోకాలు గల భాగాన్ని 1299 గద్య పద్యాలలోనూ, ఎఱ్ఱన 6683 శ్లోకాలు గల భాగాన్ని 1595 గద్య పద్యాలలోనూ నిర్మించారు. ఎఱ్ఱన భారతం ఎక్కువ వివరణలతో, వర్ణనలతో తిక్కన గారి పోకడలో సవిస్తరంగా సాగింది.
అశేష ఆగమ శాస్త్రతత్వ నిపుణుడు అయిన ఎఱ్ఱన వర్ణనా నిపుణుడు. ఎఱ్ఱన అనువాద శైలి మంజుల వాగామృత ప్రవాహం మరియు చతురలోక్తుల, మధురోక్తుల సమాహారం.
ఎఱ్ఱన రచించిన మహాభారతం లో కొన్ని ఉదాహరణలు -
ఎఱ్ఱన వర్ణనా వైచిత్రి -
నన్నయ శారద రాత్రుల వర్ణనతో అరణ్యపర్వాన్ని ‘పరిపూరితం’ చేస్తే, ఎఱ్ఱన శరత్కాలపు సూర్యోదయముతో బాల భానుడి అరుణ కిరణాల శోభతో తన కావ్యాన్ని చైతన్యవంతముగా ప్రారంభించారు.
స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్.
శరత్కాలంలో ప్రకాశిస్తున్న బాల భానుడి అరుణ కిరణాల కాంతుల తళతళల చేత సూర్యోదయ సమయాలు కనుల పండుగగా శోభిల్లాయి. మబ్బులు తొలగిపోయాయి. పద్మాలు వికసించి ఎంతో శోభాయమానంగా వెలుగొందినాయి. హంసలు, బెగ్గురు పిట్టలు, తుమ్మెదలు చేసే కలరవాలు వెల్లి విరియగా, దినారంభాలు మిక్కిలి శోభయమానముగా ప్రకాశించాయి.
ఈ విధముగా శరత్కాల పసిడి కిరణాలతో తెలుగు సాహిత్యం లో మకుటాయమానమైన మహాభారత రచనలో శేష భాగానికి శ్రీకారం చుట్టబడినది.
ఎఱ్ఱన శివకేశవ అభేద దృష్టి -
శంకరసన్నిభుండు జనశంకరుఁడున్ గరుణాకరుం డనా
తంకుఁ డుదంకుఁ డన్ముని వ్రతస్థితుఁ డై మరుభూమియందు ని
శ్శంకమతిన్ వసించి యనిశంబును నవ్యయు నచ్యుతున్ మనః
పంకజవేదిపై నిడి తపం బొనరించె ననేకవర్షముల్.
అరణ్య పర్వములో మార్కండేయ మహర్షి ఉదంకుడు అను మహర్షి ఏ విధముగా తపస్సు చేశాడో అని ధర్మరాజుకు వివరిస్తున్న సందర్భం లోనిదీ ఈ పద్యం. శివుడితో సమానుడైనవాడు, ప్రజలకు శుభాలను చేకూర్చువాడు, ఎదురులేనివాడు యగు ఉదంకుడు, దీక్షతో ఎడారి భూములయందు నివసించి ఎల్లప్పుడూ నాశనంలేనివాడు, అక్షరుడైన పతనం లేని ఆ విష్ణుభగవానుని తన మనస్సు అనేడి తామరపూవు తిన్నెపయి స్థాపించి పెక్కు సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతేకాదు ప్రత్యక్షమైన విష్ణువును ఉదంకుడు ఈవిధముగా స్తోత్రం చేశాడు –
విక్రమత్రయలీల నోలిన విష్టపత్రితయంబుఁ బె
ల్లాక్రమించితి, క్రూరులైన సురారివీరులఁ బ్రస్ఫుర
చ్చక్రవిక్రమకేళిఁ ద్రుంచితి, సర్వయజ్ఞ ఫలావహ
ప్రక్రియాత్ముఁడ వీవు నిశ్చలభక్తిగమ్య! జనార్దనా!
విష్ణుమూర్తి యొక్క త్రివిక్రమ రూపాన్ని మనతో దర్శనం చేయించాడు.
కలియుగములో జనపదాల స్థితిగతులను తెలిపే ఎఱ్ఱన పద్యం –
వివిధవ్యాఘ్రమృగోరగాకులము లై విస్తీర్ణశూన్యాటవీ
నివహాభీలము లై యరాజకములై నిర్మూలధర్మంబులై
ద్రవిళాభీరతురుష్కబర్బరపుళిందవ్యాప్తిదుష్టంబు లై
భువిలో నెల్లెడఁ బాడగున్ జనపదంబుల్ దద్యుగాంతంబునన్
అరణ్య పర్వము చతుర్దశ్వాసం లో కలియుగ లక్షణాలను మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ గలియుగధర్మంబులు చెప్పు సందర్భములో వివరించాడు. ఎఱ్ఱన కాలం లో జరిగిన సమిష్టి దేశభక్తి ఉద్యమములో పాల్గొన్న మహాకవి ఎఱ్ఱన. కలియుగ లక్షణాలంటే అప్పటి సమాజ పరిస్థితులే అని భావించి స్పందించిన ఆత్మీయతతో ఈ ఘట్టాన్ని రచించాడు. క్రూర మృగాల విహారంతో ప్రజలు భయాందోళనలు చెందటం, వ్యవసాయ భూములు తగ్గి అడవులు పెరగటం, గ్రామాల్లో న్యాయం లేకపోవడం మొదలగు లక్షణాలను వివరించాడు. ఖచ్చితంగా తురుష్కుల ప్రస్తావన వ్యాస భారతంలో కానరాదు. అంటే ఎఱ్ఱన తాను అనుభవించిన సమకాలీన పరిస్థితులను కూడా కథా సందర్భములో ప్రస్తావించాడని స్పష్టమవుతున్నది.
శివ సాక్షాత్కారం – ఎఱ్ఱన మధుర కవితకు ఉదాహరణ
నానాసిద్ధగణంబు గొల్వఁ బరమానందంబునం జంద్ర రే
ఖా నవ్యాంచితమౌళి భూరిభుజగాకల్పోజ్జ్వలాకారుఁ డీ
శానుం డానతశంకరుండు గిరిజాసంయుక్తుఁడై వచ్చెఁ ద
త్సేనానిం బ్రియాసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్
ఈశ్వరుడు కుమారస్వామి వద్దకు వచ్చిన సందర్భములోనిది ఈ పద్యం. ఎఱ్ఱన మధురోక్తి కి ఉదాహరణ ఈ పద్యం. బాలచంద్రధరుడు భక్తులకు శుభం కలిగించువాడు, నాగభూషణుడు అయిన ఈశ్వరుడు సిద్ధగణాలు తనను సేవిస్తూ ఉండగా, పార్వతి సహితుడై కుమారుడైన కుమారస్వామిని చూడటానికి ప్రేమతో విచ్చేశాడు.
కుమారస్వామి మహిషుడి పై యుద్ధం – ఎఱ్ఱన యుద్ధ వర్ణన
లోహితరత్నభూషణుఁడు లోహితమాల్యధరుండు విస్ఫుర
ల్లోహితలోచనుండు నవలోహితవస్త్రుఁడు లోహితాస్యుఁ డై
యాహవకేళికిం గడఁగునప్పుడు సూడఁగ నొప్పె లోకని
ర్దాహసమిద్ధ నూతనపతంగుఁడ పోలె రథాధిరూఢుఁ డై.
ఎర్రని మణులను ధరించి, ఎర్రని పూలమాలలు ధరించి. ఎర్రబడిన కన్నులతో, ఎర్రని వస్త్రములు ధరించి దేదీప్యమానమైన ప్రకాశంతో శోభిస్తూ యుద్ధానికి వచ్చాడు కుమారస్వామి. ఎరుపు కోపానికి చిహ్నం, శౌర్యాన్ని సూచించే కవిసమయం.
అరణ్య పర్వము ఆరవ ఆశ్వాసంలో, సప్తమాశ్వాసంలో మార్కండేయ మహాముని ధర్మరాజు రామాయణ గాధనంత చాలా విపులంగా వివరిస్తాడు. మార్కండేయ మహాముని సీతా రాముల వనవాస గాధను, బృహదశ్య మహాముని నలదమయంతుల గాధలను ధర్మరాజు కు వివరించారు. ఎఱ్ఱన రచించిన మహాభారత అంతర్గతమయిన రామాయణంలో సముద్ర వర్ణన ఎంతో అద్భుతంగా చేయబడినది.
లీలం గల్లోలమాలోల్లిఖితగగనమై, లీననానాకుళీర
వ్యాలోగ్రగాహమీనావళుల నెసఁగి, దుర్వారవారోఘగంభీ
రాలంఘ్యప్రౌఢవేగం బగుచు బహుతరాయామవిస్తారమై బి
ట్టాలోకింపంగ నుగ్రం బగు జలనిధి నంతంతటం గంటి మంతన్
ఆ కడలి కెరటాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెక్కు మొసళ్ళు, ఎండ్రకాయలు తదితర జీవులో లోతులలో నివసిస్తున్నాయి. ఆ సముద్రము మిక్కిలి నిడివి కలిగి దరిదాపులు లేకుండా భయంకరంగా కనపడుచున్నది.
మహాభారతంలో అరణ్య పర్వం ఎంతో కీలకమైనది. అందు ఎఱ్ఱాప్రెగ్గడ ప్రణీత మహాభారతములో - శ్రీకృష్ణుఁడు సత్యభామతోడఁ బాండవులయొద్దకు వచ్చుట, మార్కండేయుండను మహాముని పాండవులయొద్దకు వచ్చుట, మార్కండేయుండు ధర్మరాజునకు వైవస్వతు వృత్తాంతంబు, బ్రళయప్రకారంబు, కలియుగధర్మంబులు, ఇన్ద్రద్రద్యుమ్నుని కథ, గువలాశ్వుచరిత్రము, మధుకైటభుల చరిత్రము, కుమార స్వామి చరిత్ర, రామాయణ కధ, సావిత్రీఉపఖ్యానము వివరించుట, ద్రౌపది సత్యభామల సంభాషణము, ఘోషయాత్ర, సైంధవుని గర్వభంగము, యక్షప్రశ్నలు తదితర అంశములు ప్రసిద్ధములు. అరణ్య పర్వ శేషము చిన్నదైనా, వైచిత్రిలో గొప్పది. మహాభారత కధలో కీలకాంశాలైన మూడు అంశాలు అరణ్యపర్వ శేషము లోనే ఉన్నాయి – ఘోష యాత్ర, సైంధవుని పరాభవం, కర్ణుడు కవచకుండలాలను దానం చేయడం. ఎఱ్ఱన కర్ణ పాత్రను అద్భుతంగా చిత్రీకరించాడు. కర్ణుడు కీర్తి కాంక్షించి కాని, ముక్తి కాంక్షించి దానం చేయలేదని అభివర్ణిస్తాడు.
కీర్తి విడువఁజాలఁ; గీర్తితో మెలఁగంగఁ | జావు వచ్చెనేనిఁ జత్తుఁ; గాని
జగములోన నెల్ల ‘సడికంటెఁ జావు మే’ | లనఁగఁ బరఁగు మాట యనఘ! వినవె?
అని కర్ణునిచే పలికించాడు.
ఈ విధముగా “ శివపదాబ్జ సంతత ధ్యాన సంసక్త చిత్తుడైన.. ” శంభుదాసుడు ఎఱ్ఱన తన మహాభారత అరణ్య పర్వ శేష రచనచే ప్రబంధపరమేశ్వరుడయినాడు.
ఇక మిగిలిన మహాభారత పదిహేను పర్వాలు ఆంధ్రావళి సంతోషార్ధము ఆ హరిహారనాధుని కృపతో తిక్కన పూర్తిచేయగలిగాడు.
నన్నయ రచించిన సుమారు రెండువందల సంవత్సరముల తర్వాత తిక్కన, తదుపరి వంద సంవత్సరములకు ఎఱ్ఱన మహాభారతాన్ని సంపూర్ణంగా అనువదించారు. ఈ సాహితీ త్రిమూర్తులు విభిన్న కాలాలకు చెందిన వారు, వారి కాలంలో రాజకీయ, ఆర్ధిక మరియు సాంఘీక పరిస్థితులు వేరు. అయిననూ, మహాభారతం ఏకీకృత కావ్యం వలెనే మనకు గోచరిస్తుంది. నన్నయ రచనలో కథా కథనం, తిక్కన రచనలో నాటకీయత, ఎఱ్ఱన రచనలో వర్ణన ప్రధానాంశాలు. ఈ విధముగా మహాభారతం సారస్వత లక్షణాలను పుణికి పుచ్చుకొని శ్రవ్య, దృశ్య మరియు వర్ణనాత్మక గుణాలతో విరాజిల్లుచున్నది. ఈ మూడు శాఖలందునూ ఈ ముగ్గురే ఆది కవులు. తెలుగు సాహితి కి మంగళా శాసనం చేసిన కవితా మూర్తులు ఈ కవిత్రయం.
“ తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి “ అన్నది తెలుగు సామెత. మానవుని లోని అన్ని ప్రవృత్తులకు, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, ధర్మ సంఘర్షణలకు మహాభారతం దర్పణం పడుతుంది. అపూర్వ వ్యక్తుల మరియు సన్నివేశాల సంగమం మహాభారతం. శ్రీకృష్ణుని వంటి దివ్యపురుషులు, వ్యాసుని వంటి మహా పురుషులు, కర్ణుని వంటి త్యాగధనులు, భీష్ముని వంటి ధర్మవ్రతులు, అభిమాన్యుని వంటి సాహస వీరులు, పాండవుల వంటి పరిణిత మనస్కులు, సంసార యజ్ఞ సంరక్షకుల వంటి ఆదర్శ మహిళా మూర్తులు – మనకెందరో దర్శనమిస్తారు.
మహాభారతం జీవన వేదం. అందుకే మహాభారతం పంచమ వేదం.
మహాభారతాన్ని తెనిగించి మనకందించిన కవిత్రయ త్రిమూర్తులకు శతాధిక సాహిత్యాభివందనములు.
*****
మహాభారత ఆంధ్రీకరణము – వ్యాస పరంపరలో ఉపయుక్త గ్రంధములు –
-
కవిత్రయ విరచిత శ్రీ మదాంధ్ర మహాభారతము – తిరుమల తిరుపతి దేవస్తానము వారి ప్రచురణ
-
తెలుగు పద్య మధురిమలు - తెలుగు అకాడమీ
-
సాహితీ వైజయంతీ – శ్రీ పింగళి లక్ష్మీకాంతం, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి వ్యాసములు
-
ఆంధ్రవాజ్మయ చరిత్ర – ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు
*****