top of page

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

యద్భావం – తద్భవతి / యతోభావ: – తతోదృష్టి:

ప్రసాద్ తుర్లపాటి 

యద్భావం – తద్భవతి – అంటే మన మనసులో ఎలా ఉంటే ఎదుటి వారు అలా కనిపిస్తారు. కవి తన రచనలలో ఒక పాత్ర లో పరకాయ ప్రవేశం చేసి, పాత్ర పరంగా, తన భావాలను ఆ పాత్రతో పలికిస్తాడు లేక తన భావాలను సూటిగా పాఠకులకు చెబుతాడు.  ఈ భావనలు పఠితుల ఊహాలకు అందక పోవచ్చను. ఈ భావనలు మనో భ్రాంతి కలిగించవచ్చును, లేక సరికొత్త సృష్టి కావచ్చును.   


ఇంచుమించు ఇలాగే ‘ యతోభావ – తతోదృష్టి’ అంటే మన దృష్టి కూడా మనలో కలిగే భావములననుసరించియే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో విభిన్న యుగాలలో వచ్చిన కావ్యముల నుండి కొన్ని  ఉదాహరణలను పరిశీలిద్దాము. 


1.    నన్నెచోడ కవి రాజు – కుమార సంభవం కావ్యములో పార్వతి దేవి తపస్సు వర్ణన 
2.    తిక్కన సోమయాజి – ఆంధ్ర మహా భారతము – హరిహరనాథుని స్తుతి
3.    పోతన – ఆంధ్ర మహాభాగవతము – దశమ స్కంధము – శ్రీకృష్ణ లీలలు – యశోద దేవి – బాలకృష్ణుని దర్శనం 
4.    అల్లసాని పెద్దన – మను చరిత్ర లో విఘ్నేశ్వర స్తుతి 
5.    ధూర్జటి – శ్రీ కాళహస్తీశ్వర శతకం – ప్రకృతి పరమేశ్వరుని దర్శనం 
6.    విశ్వనాధ సత్యనారాయణ – శ్రీమద్రామాయణ కల్పవృక్షము – సుందర కాండలో – హనుమకు కలిగిన సీతమ్మ వారి దర్శనం 

1.    నన్నెచోడ కవి రాజు – కుమార సంభవం కావ్యములో పార్వతి దేవి తపస్సు వర్ణన :


బ్రహ్మాండ, శైవ పురాణాలలోని కధనెంచుకొని నన్నెచోడ కవిరాజు రచించిన  “కుమార సంభవము” అన్న  ప్రభంధ కావ్యము లోని పార్వతి తపోదీక్ష వర్ణన -
పవడంపు లత మీద, ప్రాలేయపటలంబు
                 పర్వెనా మొయినిండ భస్మమలది
లాలితంపగు కల్పలత పల్లవించెనా
                 కమనీయ ధాతు వస్త్రములు కట్టి
మాధవీలత కళమాలికత ముసరెనా
                  రమణ రుద్రాక్ష మాలికలు వెట్టి
వరహేమ లతికపై పురి నెమ్మి యూగెనా
                     సమ్మతంబగు జడలు పూని

హరుడు మహేశ్వరీ రూపమైన చెలువ
మభినయించెనో యని, మునులర్థి జూడ
గురు తపశ్శక్తి మూర్తి సేకొనిన కరణి
దగలి యుమ (ఉమ) తపోవేషంబు దాల్చి

పార్వతీ దేవి పసుపు ముద్దలాంటి తన శరీరం నిండా విభూది పులుముకుంది. అది ఎలా ఉందంటే- పగడాల తీగ మీద తెల్లని మంచు పడ్డట్టుగా ఉంది. ఎర్రని దీక్షా వస్త్రాలు ధరించింది. ఒక లత చిగురించినట్లున్నది. తను ధరించిన రుద్రాక్ష మాలల, ఆ చిగురించిన మాధవీలత మీద తుమ్మెదలు వ్రాలినట్టుగా ఉన్నాయి. ముడి వేయకుండా ఉన్న కురులు బంగారు తీగ మీద (హేమలతల పై) మగ నెమలి పింఛం ఆరబోసుకొని ఊగుతున్నట్టుంది.  ఈ రూపాన్ని చూస్తూ మునులు, సాక్షాత్తూ అటువంటి రూపాన్ని చూస్తూ మునులందరు పరమేశ్వరుడే పరమేశ్వరీ రూపాన్ని అభినయిస్తున్నాడా అని అనుకుంటున్నారు.

 
నన్నె చోడకవిరాజు కలిగిన భావం లో అంతర్లీనంగా - అద్వైతాన్ని, అర్ధనారీశ్వర తత్వాన్ని  ధ్వనింప చేశారు.  


2.      తిక్కన సోమయాజి – ఆంధ్ర మహా భారతము – హరి హరనాథ దర్శనం :


శైవ, వైష్ణవ సంఘర్షణల మధ్య‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే అంటూ’ మతసామరస్యాన్ని ప్రొత్సహించిన సంస్కర్త తిక్కన సోమయాజి.  ఇక్కడ కవి తన భావనలో నున్న  శివ కేశవుల అభేదాన్ని హరిహారనాధునిగా సాక్షాత్కరింపచేసి తన భారతాన్ని అంకితమొనరించాడు.   
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

‘లక్ష్మి దేవి’  అని ‘శ్రీ గౌరీ’ అని పిలువబడే వనితకు హృదయము ఉప్పొంగగా శుభప్రదమైన హరి హరులు కలసిన రూపాన్ని ధరించి, ‘ విష్ణు రూపుడైన శివుడికి నమస్కారమని’ కీర్తించే భక్తుల  వేదవిహితమైన ఉపాసనా పద్ధతికి మనసులో మెచ్చుకునే ఆ పరమాత్మను నా కోరిక ఫలించాలని ప్రార్థిస్తున్నాను.  ఇక్కడ తిక్కన ప్రతిపాదించిన హరి హారనాధుని సగుణంగా ఆరాధిస్తే హరి హర నాధ స్వామి, నిర్గుణంగా ఉపాసిస్తే పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మని ఈ విధముగా స్తుతిస్తున్నాడు - 

“కి మస్థి మాలం కిము కౌస్తుభం వా ! పరిష్క్రియాయం బహుమన్యసే త్వం 
కిం కాలకూట: కిము వా యశోదాస్తన్యం  ! తవ స్వాదు వదా ప్రభో ! మే”

తిక్కన తన దైవమయిన హరిహరనాధుని స్తుతిస్తూ, “ ఓ ప్రభూ, నీ అలంకరణలో ఎముకల దండలు వున్నాయి, కౌస్తుభరత్నం వున్నాయి. నీవు కాల కూటము త్రాగవు, యశోద చనుబాలు త్రాగావు”  వీటిలో ఏది నీకు రుచిగా ఉన్నది ప్రభూ !! 


కరుణారసము పొంగి తొరఁగెడు చాడ్పున | శశిరేఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందన మున్న | గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱియైన చెలువున నెఱసిన లోక ర | క్షణ మనంగ గళంబు చాయ దోఁపఁ
బ్రథమాద్రిఁ దోఁతెంచు భానుబింబము నా ను | రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప     

సురనదియును గాళిందియు బెరసినట్టి | కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నా మనంబు నానంద మగ్నముగఁ జేయ | నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు

ఆ హరి హర నాధుని శిరస్సుపై చంద్ర రేఖ ఉన్నది. ఆ చంద్ర రేఖ నుంచి స్రవించే అమృతం దయారసం పొంగి పొరలుతున్నట్లు ఉన్నది. ఆ స్వామి నాభి లోని తామర పుష్పము, ఇంద్ర నీలమణులు పొదగిన పాత్రలో గుభాళించే మంచి గంధము వలే ఉన్నది. కంఠం నలుపుగా ఉన్నది. అది లోక రక్షణ కొరకు నిలచిన గుర్తుగా ఉన్నది. రొమ్మున కౌస్తుభ రత్నం ఉన్నది. అది తూరుపు కొండమీద ఉదయించే సూర్య బింబము వలెనున్నది.  ఈ విధముగా,  గంగ, యమున నదుల కలయికలోని వెలుగుల వెల్లువవలె తిక్కనకు హరిహరనాధుడు ఈ విధముగా సాక్షాత్కరించాడు. 

ఇది ఆ సోమయాజి భావన – హరిహరాద్వైతం – శివ కేశవ అబేధం – నిర్గుణ పరబ్రహ్మ తత్వం. ఆ విధముగా ఏక మూర్తి ఐన భగవంతుని దర్శించాడు కనుకనే తిక్కన సోమయాజి బృహత్తరమైన మహాభారతాన్ని మనకనదించాడు. 

3.    పోతన – ఆంధ్ర మహాభాగవతము – దశమ స్కంధము – శ్రీకృష్ణ లీలలు – యశోద దేవి – బాలకృష్ణుని దర్శనం :
ఆంధ్ర మహాభాగవతము దశమ స్కంధములో పోతన గారు వ్రాసిన అద్భుత పద్యమిది. యశోద దేవి బాల కృష్ణుడిలో శివరూపాన్ని దర్శించింది. 

తనువున నంటిన ధరణీపరాగంబు; పూసిన నెఱి భూతిపూఁత గాఁగ;
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు; తొగలసంగడికాని తునుక గాఁగ;
ఫాలభాగంబుపైఁ బరఁగు గావలిబొట్టు; కాముని గెల్చిన కన్ను గాఁగఁ;
కంఠమాలికలోని ఘన నీలరత్నంబు; కమనీయ మగు మెడకప్పు గాఁగ;


హారవల్లు లురగ హారవల్లులు గాఁగ;
బాలులీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెలుప వెలయునట్లు

శరీరానికి  అంటుకొన్న మట్టి మరకలు రాసుకొన్న నిండైన వీబూది పూత అగుచుండగా; నుదుటిపై ప్రకాశించెడి ముత్యాల చేరు చంద్రుని రేఖ అగుచుండగా; నుదిటి మీద ఉండునట్టి నల్ల బొట్టు మన్మధుని జయించిన మూడవ కన్ను అగుచుండగా, మెడలోని హారము లోని ఘన నీల మణి అందమైనది ఐన కంఠము నందలి నల్లధనం అగుచుండగా; ముత్యాల హారపు పేటలు పన్నగ హారాలు అగుచుండగా, పసితనపు విలాసములతో అన్నీ తెలిసిన బాలకుండు పరమ శివుని వలె కనబడుచుండెను. బాల లీలలు చూపెడుతున్న బాలకుడు పరమశివునికి తనకు భేదము లేకపోవుటను తెలియచేస్తున్నాడు.  ఇంత చక్కగా శివ కేశవ అబేధాన్ని తెలుగు సాహిత్యములో మనకు అందించినవారు  ఋషులైన తిక్కన మరియు పోతన.

 ఆ యశోదా దేవికి ఆ భావం కలిగిందో లేదో కానీ, పోతన గారి సర్వమత సమన్వయ దృష్టి చే, మనకు అవగత మైనది. అదుకే తదుపరి పద్యాలలో విశ్వమంతా చూపించాడు. పోతన ఒక ప్రణాళికా ప్రకారం ముందు పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శింప చేసి తదుపరి విశ్వమంతా తనలోనే ఉన్నదని ఏక మయ భావాన్ని తెలియపరచాడు.  

అందుకే “ కలయో ! వైష్ణవ మాయాయో లేక ఇతర సంకల్పార్ధమో .. “ .  పోతన భావాన్ని మనకు అందించాడు భాగవతం దశమ స్కంధములో. 
   
4.     అల్లసాని పెద్దన – మను చరిత్ర లో విఘ్నేశ్వర స్తుతి :
అంకము జేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట తొండమున అవ్వలి చన్ కబళింప బోయి ఆ
వంక కుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాం కుర శంక నంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్ 

ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన తన మనుచరిత్ర ప్రబంధ ప్రారంభములో లో గజాననుని స్తుతిస్తూ, భ్రాంతిమతాలంకారములో చేసిన స్తుతి ఇది. అల్లసాని వారి అల్లిక అందుకే జిగిబిగి. ఇక్కడ మనకు అర్ధనారీశ్వరతత్వాన్ని సాక్షాత్కరింప చేశారు. బాల వినాయకుడు శివుని ఆభరణాలయిన సర్పములను చూసి తామరతూడులని భ్రమించాడట.  

అమ్మవారి ఒడిలో చేరి తల్లి స్తన్యాన్ని తాగే వేళలో బాల్యపు బుద్ధిచేత తన తొండము తో అటు ప్రక్కన వున్న స్తనాన్ని కూడాపట్టుకొనబోయాడు  గణపతి. అయితే అమ్మవారి ఇంకొక సగం అయ్యవారు, పరమ శివుడు కనుక, ఆయన మెడలో వున్న పాము తగిలింది ఆ తొండానికి. ఆయన ఏనుగు ముఖం కలిగిన వాడు కనుక, ఏనుగులు సహజంగా స్నానానికి చెరువుల్లోకి, సరస్సుల్లోకి దిగినప్పుడు అక్కడ వున్న తామర తూడులను వూరికే వినోదం కోసం పీకి పారేస్తూ వుంటాయి కనుక, ఈ పామును పొడుగ్గా వుండడం చేత, తామర తూడు అనుకుని, విచ్చుకుని  వున్న పడగను విచ్చిన తామరపువ్వు అనుకుని లాగ బోయాడు గణపతి. అటువంటి తన బాల్య చేష్టలతో తల్లి దండ్రులకు ఆనందాన్ని కలిగిస్తున్న ఆ గణపతిని నా అభీష్ట సిద్ది కై ప్రార్ధిస్తాను అని తన 'మనుచరిత్ర' ప్రబంధాన్ని ప్రారంభించాడు అల్లసాని పెద్దన. నిజంగా గణపతి, అమ్మవారు చేసి, ప్రాణం పోసిన పసుపు బొమ్మ. తన పెనిమిటి ఆ గణపతి శిరస్సు ఖండించటం, గజాననుని శిరస్సు అతికించడం మొదలగునది మనకు తెలిసిన కధ. కానీ ఎక్కడ గణపతి అమ్మ ఒడిలో పరుండి పాలు త్రాగడం, అదియును, అర్ధనారీశ్వర రూపములో నున్న పార్వతీ పరమేశ్వరుల ఒడిలో వుండటం కవి భావన !! 

 మనుచరిత్రలో కూడా వరూధిని మాయ ప్రవరురుని (గంధర్వుని) చూసి నిజమయిన ప్రవరుడని భ్రమిస్తుంది. మొదటిపద్యములోనే కావ్యము యొక్క ధ్వనిని సూచించారు అల్లసాని వారు.   

5.    ధూర్జటి – శ్రీ కాళహస్తీశ్వర శతకం – ప్రకృతి లో పరమేశ్వరుని దర్శనం: 


ఉదయ గ్రావము పానవట్ట, మభిషేకోద ప్రవాహంబు వా
ర్ధి, ధరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీప ప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్‌గాఁ దమోదూర సౌ
ఖ్యదమై శీత గభస్తి బింబ శివలింగం బొప్పెఁ బ్రాచీదిశన్

శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే ప్రబంధ కావ్యం, రెండవ ఆశ్వాసం లోనిది ఈ పద్యం. 

ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు అంతా  శివమయమే ! రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది. చంద్రుడు ఉదయించిన, తూరుపు పర్వతం పానవట్ట మయింది. ఆ శివమునకు (చంద్ర బింబానికి)  రుద్రాభిషేకం కావించగా ప్రవహించిన అభిషేక జలం తూరుపు సముద్రమైంది. సముద్రపు గట్టు మీద కనిపించే మసక చీకటి అగరొత్తుల ధూపంగా మారింది. చంద్రుడు వెదజల్లే వెన్నెలే శివ దీపారాధన వెలుతురు. ఆకాశంలో ప్రకాశించే తారలే శివపూజకు తెచ్చిన పూలు. ఈ విధంగా సర్వాంగ సహితంగా శివుడు కొలువైనాడు. తమస్సును దూరం చేసే చంద్రునికీ, తమోగుణాన్ని నిర్మూలించే పరమశివునికి  అభేదాన్ని భావించి ప్రకృతిలో మనందరికీ పరమేశ్వర దర్శనం కావించాడు ధూర్జటి. 

 

 

6.    విశ్వనాధ సత్యనారాయణ – శ్రీమద్రామాయణ కల్పవృక్షము – సుందర కాండలో – హనుమకు కలిగిన సీతమ్మ వారి దర్శనం:


      పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే
      హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ
      ర్మాకృతి కూర్చున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై

ఇది లంకాపురిలో అశోక వృక్షము క్రింద కూర్చుని వున్న సీతమ్మవారి  వర్ణన.  ఆ సీతమ్మ వారు ఎలా వున్నదంటే – ‘సీత నెరుంగకుండ రఘుశేఖరుడర్థము గాడు పూర్తిగా’  అని అనుకున్నాడట హనుమంతుడు. సీత  ఆకృతి రామచంద్ర విరహాకృతి యట. రామచంద్రుడు సీత విరహాకృతి, సీత రామచంద్ర విరహాకృతి. సీతారాముల పరస్పరానుబంధం అటువంటిది. 


‘ కన్బొమ తీరు స్వామి చాపాకృతి ‘ . కవులు సామాన్యముగా కనుబొమలను ధనుస్సుతో పొలుస్తూ ఉంటారు.  సీత కనుబొమలు రాముని ధనస్సులాగా ఉన్నవట. ఆ రామ ధనస్సు ద్వారా సంధించబడేదే రామ బాణం. రావణ సంహారానికి హేతువు.  
‘ కన్నులన్ ప్రభువు కృపాకృతి ‘ రామచంద్రుడెంత కృపాసముద్రుడో, రాముల వారి కృప హనుమకు అమ్మ వారి కన్నులలో ద్యోతకం అవుతూ ఉన్నది. 
‘ కైశికమందు రామ దేహాకృతి’ . సీత కేశములు, శ్రీరాముని దేహవర్ణం రెండూ – నల్లనివే.  రాముల వారి దేహ వర్ణం అమ్మవారి కేశములలో వ్యక్తమవుతూ ఉన్నది. 
‘ సర్వదేహమున్ యందును రాఘవ వంశమౌళి ధర్మాకృతి’ . “ రామో విగ్రహవాన్ ధర్మః “ అయన ఇల్లాలు భూజాత సీత ధర్మ ప్రతీక. ఈ పరస్పర ధర్మభావం మొత్తం ఆమె సర్వదేహంలోనూ మూర్తీభవించింది.  రావణ సంహారము, ధర్మ రక్షణా – రాముని కర్తవ్యం. అందుకే కవి  అమ్మవారి ఆకృతి లో రామ చంద్ర మూర్తి ని దర్శింపచేసి ధర్మసంస్థాపనకు సూచన చేశాడు.   


ఈ విధముగా తెలుగు కవులు తమ కావ్యాలలో వారి భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉదాహరణలు మనకు కానవస్తాయి. కవి తాను చెప్పదల్చుకున్న సందేశాలను వివధ పాత్రల ద్వారా పలికిస్తూ, సమాజ శ్రేయస్సుకై సదా పాటుపడుతూ ఉంటాడు. 


అందుకే “కవిః క్రాంతి దర్శనం“. దార్శనీకుడు కవి. 


యతోభావ: – తతోదృష్టి:


స్వస్తి.    

|| మంగళం మహత్ ||

bottom of page