MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
మొల్ల రామాయణం - 1
ప్రసాద్ తుర్లపాటి
"తేనె సోక నోరు తీయనయగు రీతి తోడ నర్ధమెల్ల" తోచేట్టు తేట తెలుగు మాటలతో తీయనైన రామాయణం రచించి తెలుగు వారికి కానుకగా అందచేసిన ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్ల.
తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగచెవిటివారి ముచ్చట యగును
రామాయణం సుధామధురం. వాల్మీకి మహర్షి అన్నట్లు రామాయణం “పాఠ్యే గేయేచ మధురం”. మధుమయ పదవిన్యాసాలకు మార్గదర్శి వాల్మీకి మహర్షి. రాముని చరిత్ర, వాల్మీకి కవిత్వముల సమైక్యమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. వాల్మీకి అనే కోకిల కవిత్వమనే కొమ్మ మీద కూర్చుండి “రామ, రామ“ అన్న మధురాక్షరాలను గానం చేస్తోంది.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ |
కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత: ||
వేదములచే తెలుపబడిన పరమపురుషుడు శ్రీరామచంద్రుడు గా అవతరింపగా, వేదం వాల్మీకి మహర్షి నోటి నుండి నాదాత్మకమై, రసాత్మకంగా రామాయణ సుధామధుర కావ్యంగా అవతరించింది.
వేద వేద్యే పురేపుంసి జాతే దాశరధాత్మజే
వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షా ద్రామాయణాత్మనా
ఆ సుమధుర రామాయణాన్ని తేనవంటి తెలుగులో సాహితీ సుగంధభరితంగా, మల్లె పూవు వలే స్వచ్చంగా మనకందించినది ఆతుకూరి మొల్ల. రామకథను చంపూ కావ్యంగా (పద్య, గద్య సహిత) రచించిన మొట్టమొదటి తెలుగు కవయిత్రి మొల్ల.
“గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” — మహాశివభక్తుడూ, కవీ ఐన కేసన మొల్ల తండ్రి. 'కేసయ వరపుత్రి నని' ఆమె ప్రారంభంలో చెప్పుకుంది. “దేశీయ పదములు దెనుగు సాంస్కృతుల్, సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి శయ్యలు రీతులుఁ జాటు ప్రబంధము లాయా సమాసంబులర్థములును” అంటూ వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, సమాసములు, మొదలైనవేవీ తనకు తెలియదు, “విఖ్యాత గోపవరపు శ్రీకంఠ మల్లేశు వరము చేత” కవిత్వం చెప్పటం నేర్చుకున్నానని సవినయముగా చెప్పిన వినయశీలి మొల్ల.
సుమారు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం మొల్ల నివసించిన కాలంలో తను విద్యావంతురాలు కావటానికి, కవయిత్రిగా కావ్యాలు రచించడానికి కావలసిన విజ్ఞానాన్ని సముపార్జించుట కొరకు సంఘములో ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చిందో మనము ఊహించుకోవచ్చును. పరిస్థితులు ప్రతికూలమైనా, అధ్యయన సౌకర్యాలు లేకపోయినా, మహాకవయిత్రి యైన మొల్ల నేటి యువతులందరికీ ఆదర్శప్రాయమైనది.
దేశీయ పదములు దెనుగులు సాంస్కృతుల్
సంధులు ప్రాఙ్ఞుల శబ్ద వితతి
శయ్యలు రీతులు జాటు ప్రబంధంబు
లాయా సమాసంబు లర్ధములును
భావార్ధములు గావ్య పరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకునరవి
బహువర్ణములును విభక్తులు ధాతుజ
లంకృతి ఛందోవిలక్షణములు(
గావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుగ విఖ్యాత గోప
వరపు శ్రీకంఠమల్లేశు వరము చేత
నెరి గవిత్వంబు జెప్పగా నేర్చుకొంటి
అలతి పదాలతో, చమత్కారాలూ, సామెతలూచేర్చి అందంగా చెప్తే ఆ కావ్యం పఠితులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగచేస్తుంది అంటుంది మొల్ల.
కందువమాటలు సామెత
లందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్
మొల్ల తన రామాయణాన్ని పోతన వలే శ్రీరామచంద్రునికి అంకితమిచ్చింది. పోతన, మొల్ల రచించిన ఈ రెండు పద్యాలు పరికిస్తే మనకీ విషయం అవగతమవుతుంది.
పోతన –
పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
మొల్ల -
చెప్పుమని రామచంద్రుడు
చెప్పించిన పల్కుమీద చెప్పెద నేనె
ల్లపుడు నిహపరసాధన
మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్
పోతన ఏవిధంగా అయితే . "ఇమ్మనుజేశ్వరాధముల" అన్నాడో అదే విధంగా మొల్ల కూడా "సల్లలిత ప్రతాప గుణ సాగరుడై విలసిల్లి ధాత్రిపై బల్లిదుడైన రామ నరపాలికుని స్తుతి చేసే జిహ్వకు" ఈ "చిల్లర రాజ లోకమును చేకొన మెచ్చంగ నిచ్చ బుట్టునే అల్లము బెల్లమును తినుచూ..." తాత్కాలిక సుఖాలకు అలాంటి నాలుక ఆశ పడుతుందా అంటూ నరాంకితము గావించక శ్రీ రామ చంద్రుడికే అంకితం జేసింది.
సల్లలిత ప్రతాప గుణ సాగరుడై, విలసిల్లి ధాత్రిపై
బల్లిదుడైన రామ నరపాలికునిన్ స్తుతి సేయు జిహ్వకున్
జిల్లర రాజ లోకమును జేకొన మెచ్చంగ నిచ్చ బుట్టునే
యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే!
రఘురాముని చరిత్రము ఎప్పుడు విన్నా క్రొత్తగా “లక్షణ సంపారయ్యమై“, “పుణ్య స్థితి వేదమై” తోస్తుందట. అలా కాకుంటే నేను ” వెర్రినై ఎందుకు చెప్పన్ “ అంటుంది తన రామాయణ అవతారికలో. ఆరు కాండముల మొల్లరామాయణం లో సుమారు 869 (పీఠికతో సహా) పద్యాలు ఉన్నాయి. తన పద్యకావ్యములోని అవతారికలో ఆమె ఇలా అంటున్నది.
రాజిత కీర్తియైన రఘురాము మున్ గవీశ్వరుల్
తేజ మెలర్ప చెప్పి రని తెల్సియు గ్రమ్మర జెప్పనేలనన్
భూజన కల్పకం బనుచు, భుక్తికి ముక్తికి మూలమంచు నా
రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పు గల్గునే?
రామ కథ, రామ నామం నిత్యనూతనం. ఎన్నిమార్లు జపించినా కొత్తగానే ఉంటాయి కదా!
ఇక ఆరంభంలో రామ కథను సంగ్రహంగా చెప్పి, సుందర మరియు యుద్ధ కాండలను విపులంగా ప్రస్తావించింది. మొదటి నాలుగు కాండముల లోని గద్య, పద్యాల మొత్తం సుందర కాండ లో వున్న గద్య పద్యాల మొత్తం కన్నా తక్కువే. మొదటి ఐదు కాండలను ఒక్కొక్క ఆశ్వాసంగా రచించినా, యుద్ధ కాండను మూడు ఆశ్వాసాలుగా రచించింది. ఈ విధమైన వ్యత్యాసం మనకు మూల రామాయణంలో కాని, మరి ఏ ఇతర రామాయణాలలో గాని గోచరించదు.
మొల్ల రామాయణం లోని పద్య గద్య వివరణలు –
పీఠిక - 24
బాల కాండము - 100
అయోధ్య కాండము – 43
అరణ్య కాండము - 75
కిష్కింధ కాండము - 27
సుందర కాండము - 249
యుద్ధ కాండము - 351 (ఆశ్వాసము: 1 – 121, 2- 93, 3 – 137)
ఇక మొల్ల రామాయణం లోని వివిధ కాండలలో మొల్ల రచించిన ఉదాహరణ పద్యాలను, సాహితీ సౌరభాలను తదుపరి సంచికలో వివరిస్తాను.
*****