top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

తెలుగు సాహిత్యం లో భక్తి శతకములు  - 1

ప్రసాద్ తుర్లపాటి 

తెలుగు సాహిత్యం లో భక్తి శతకములు  - 1

 

తెలుగు సాహిత్యము లో సుమారు 500 పైగా శతకాలు వెలువడ్డాయి.

 

శతకములు తెలుగున క్రీ.శ.12వ శతాబ్దినుండి వర్ధిల్లుచున్నవి. ఈ శతకాలలో ఎక్కువగా వచ్చినవి భక్తి శతకాలు. శతకాలు భక్తి,, జ్ఞాన, వైరాగ్య, నీతి, శృంగార, హాస్య భావాలతో కూడి ఉంటాయి. భగవతసన్నుతి తో నవ విధ భక్తి మార్గాలను అంతర్లీనంగా వ్యక్త పరిచే శతకాలు ఎన్నో వచ్చాయి. తెలుగులో వచ్చిన భక్తి శతకాలు శైవ, వైష్ణవ భక్తి పరంగా రచించబడినాయి. శతకం అంటే నూరు, అనగా నూరు పద్యాలతో కూడినది శతకం.

సామాన్యంగా శతకాలలో 108 పద్యాలు ఉంటాయి. (అష్టోత్తర శతనామావళి వలె ). తెలుగులో వచ్చిన శతక పద్యాలలో చివరి పాదంగా ఒక మకుటం (ఉదాహరణకు – ‘భద్రగిరి దాశరధి కరుణా పయోనిధి’ ) ఉంటుంది. అంతేగాక, శతక రచయిత తన స్వీయానుభూతి ఆధారంగా భగవంతుని పై పద్య రచన చేయడం జరుగుతుంది. ఎక్కువగా, భక్తి శతకాలను శైవ, విష్ణు భక్తి ప్రధానంగా విభజించవచ్చును. భక్తి శతకాలు ఇతర దేవతల పైన కూడా కొన్ని మనకు కానవస్తాయి. ఈ వ్యాసం మొదటి భాగంలో శైవ భక్తి ప్రపూర్ణమైన శతకాలను, తదుపరి సంచిక లో విష్ణు భక్తి శతకాలు, ఇతర భక్తి శతకాల గురించి వివరిస్తాను.

 

ఆదికవి నన్నయ తన మహాభారతము ఆది పర్వము లోని  ఉదంకోపాఖ్యానంలో నియమిత మకుటం తో నాలుగు  పద్యాలు రచించాడు. శతకం పూర్తిగా రచించక పోయినా, ఒకే మకుటంతో ప్రప్రథమముగా రచించబడినవి ఈ పద్యాలని చెప్పవచ్చు.

              బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ

సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు

స్సహతర మూర్తికిన్‌ జలధిశాయికిఁ బాయక శయ్య యైన య

య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్‌.  

   

              అరిది తపోవిభూతి నమరారులబాధలు వొందకుండఁగా

నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ డానమత్సురా

సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే

శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్‌.   

 

              దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్‌ విపులప్రతాపసం

భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర

త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహానుభావు లై

రావతకోటి ఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్ను లయ్యెడున్‌

 

గోత్రమహామహీధర నికుంజములన్‌ విపినంబులం గురు

క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి, సహాశ్వసేనుఁ డై

ధాత్రిఁ బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షుఁ డీక్షణ

శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్‌.

             

 

ఇటువంటి పద్యాలు మనకు తెలుగు సాహిత్యం లో అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి, కానీ ఈ కావ్యాలు శతక సాహిత్యం కోవలోనికి రావు. పాల్కురికి సోమనాధుడు రచించిన వృషాధిప శతకం శతక లక్షణాలతో తెలుగులో వచ్చిన తొలి  భక్తి శతకం.

 

శైవ భక్తి ప్రపూర్ణమైన శతకములు –

తెలుగు సాహిత్యంలో 12 – 14 శతాబ్దాల మధ్య వీర శైవ సాహిత్యం వృద్ధి చెందినది. ఈ కాలంలో వచ్చిన శతక సాహిత్యం మొత్తము శైవ భక్తి ప్రపూరితమే. పాల్కురికి సోమనాధుని విరచిత ‘వృషాధిప శతకం’, యధావాక్కుల అన్నమయ్య ‘సర్వేశ్వర శతకం’, ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం, ఇతర కవులు రచించిన ‘శ్రీ గిరీశ శతకం’, ‘గిరిజా నాయక శతకం’, ‘విరూపాక్ష లింగ శతకం’, ‘చెన్న మల్లేశ్వర శతకం’, ‘అంబిక శతకం’ మొదలగునవి.

 

శైవ భక్తి ప్రపూర్ణమైన కొన్ని శతకములను ఈ వ్యాసంలో ఉదహరిస్తాను.

 

పాల్కురికి సోమనాథుని విరచిత వృషాధిప శతకం -

వృషాధిప శతక పద్యాలలో పాల్కురికి సోమనాథుని శివ భక్తి తత్పరత, శైముషీ వైభవం, వేద వేదాంగ నైపుణ్యం కానవస్తాయి.

 

శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వలకీర్తి! సత్క్రియో

ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా

భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే

వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!

 

‘బసవా! బసవా! బసవా! వృషాధిపా!’ అన్న మకుటంతో, శాంత, శృంగార, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భక్తి తో కూడిన 108 పద్యాలు గల శతకం వృషాధిప శతకం.  బసవయ్యయే శివుడు ! సోమనాథుని ఆత్మ నివేదమే ‘వృషాధిప శతకం’.

 

రాగపరోపభోగ! గతరాగ! విధూతభవాదిరోగ! ని

ర్యాగ! మహానురాగ! బహిరంతర నిష్ఠితయోగ! సత్క్రియో

ద్యోగ! యకర్మయోగ! శివయోగ సమగ్ర సుఖాతిభోగ! దే

వా గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా!

 

ఇహపరసిద్ధ! సిద్ధ వృషభేశ్వర! ఈశ్వర భక్త! భక్త హృ

ద్గహన విలోక! లోకహిత కారణ! కారణజన్మ! జన్మదో

షహరణ దక్ష! దక్షరిపుసన్నిభ! సన్నిభరూప! రూప ని

ర్వహణ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!     

 

రుద్ర గణాదిరుద్ర! వినిరూపిత లింగసుఖాదిసంద్ర య

చ్ఛిద్ర! దయాసముద్ర! సవిశేష పరాక్రమ వీరభద్ర! య

క్షుద్ర జనావళీభవ నిషూదన రౌద్ర! సమస్త భక్త దే

వ ద్రుమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా

 

బసవ నిధానమా! బసవ భవ్యనిధీ! బసవామృతాంబుధీ!

బసవ మహానిధీ! బసవ భర్మగిరీ! బసవామరద్రుమా!

బసవ మహాబలీ! బసవ బండరువా! బసవోల్లసన్మణీ!

వసిగని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!         

 

నా యొడయండ! నా విభుఁడ! నా హృదయేశ్వర! నా మనోరమా!

నా యిలవేల్ప! నా వరుఁడ! నా గురులింగమ! నాదు జంగమా!

నా యదినాథ! నా వరద! నన్నుఁ గృపామతిఁ బ్రోవుమయ్య దే

వా యమిబృందవంద్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా

 

అంటూ, మధుర భక్తి ద్వారా నాయికా, నాయక భావాన్ని వ్యక్తపరిచాడు పాల్కురికి సోమనాథుడు.

 

యధావాక్కుల  అన్నమయ్య విరచిత సర్వేశ్వర శతకం –

 

ఇక శతక నియమాలను అనుసరించి వ్రాయబడ్డ శతకం యధావాక్కుల  అన్నమయ్య విరచిత ‘సర్వేశ్వర శతకం’.  శివ పూజ మహత్యం, భక్తి యోగం, శివ పంచాక్షరి మహిమ ఇత్యాది అంశాలు ఈ శతకంలో ప్రస్తావించబడినాయి. ఈ శతకం క్రీ.శ 1242 ప్రాంతంలో రచించబడినది అని  శ్రీ నిడదవోలు వెంకట రావు గారు తన పీఠిక లో ఈ విధముగా పేర్కొన్నారు.

శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు-

శ్లోకానందకరంబుగా మహిమలో శోభిల్ల సర్వేశ్వర

ప్రాకామ్యస్తవ మొప్పఁజెప్పె శుభకృత్ ప్రవ్యక్తవర్షంబునన్

శ్రీకారాధనవంతమై వసుధలోఁ జెన్నొంద సర్వేశ్వరా!

 

శాలివాహన శకాబ్దములు - వార్ధి 4, షట్క 6, పురజిత్ 11 అనగా 1164; వీనికి 78 చేర్చిన క్రైస్తవ శకాబ్దములు క్రీ.శ. 1242 అగును.

 

శ్రీకంఠుం బరమేశు నవ్యయు నిజశ్రీపాదదివ్యప్రభా-

నీకోత్సారితదేవతానిటలదుర్నీత్యక్షరధ్వాంతుఁ జి-

త్ప్రాకామ్యాంగు నపాంగమాత్రరచితబ్రహ్మాండసంఘాతు జం-

ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా!

 

అని ఆ సర్వేశ్వరుడైన పరమేశ్వరుని స్తుతి తో మొదలైన శతకరాజము ఈ సర్వేశ్వర శతకం. అన్నమయ్య తన కృతియందెచటనూ  ‘శతకము’ అని పేర్కొనలేదు.  ఈ శతకము ‘స్తవము’ అని పేర్కొనబడి యున్నది. ఈ క్రింది పద్యమున స్పష్టముగానిది ‘స్తోత్రము’ అని చెప్పబడియున్నది.

 

ధాత్రి న్భక్తజనానురంజనముగాఁ దత్త్వప్రకాశంబుగాఁ

జిత్రార్థాంచితశబ్దబంధురముగా, సేవ్యంబుగా, సజ్జన

శ్రోత్రానందముగా శుభాన్వితముగా శోధించి సర్వేశ్వర

స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా!

 

“ఇది స్తవము. స్తోత్రము అయినను నిందలి పద్యములన్నియు, ఒకే  మకుటముతో యున్నందున, నిది శతకముగా పరిగణిత మైనది. శతకమున సంఖ్యానియమము లేకున్నను మకుట నియమమున్నచో, నది శతక వాజ్మయమున చేరును."

 

“తనకు ముందుగాగల మల్లికార్జున పండిత, పాల్కురికి సోమనాథుల రచనలనే గాక, సంస్కృతమున గల శివస్తోత్రములను పరిశీలించి, వానియందలి భావముల నిందు పొందుపఱచి యున్నాడు. సర్వేశ్వరుడగు శివుడు గజాజినధారియే గాక వ్యాఘ్రచర్మాంబరధారి. కావున, అన్నమయ్య మత్తేభ శార్దూల వృత్తములతోనే శతకము రచించి, వృత్తరచన సార్థకము గావించెను.”

 

“అన్నమయ్య యీ కృతియందు నిరూపించినది యారాధ్యసంప్రదాయికమగు సవైదిక వీరశైవమే యైనను, నిందు ముక్తికి పరిశుద్ధమగు భక్తియోగము సాధనమని, భూతసేవాపరమైన జంగమ భక్తియోగము మూలసాధనమని వివరింపబడినది. విధ్యుక్తకర్మల నాచరించుచు, గురులింగ జంగమ జ్ఞానసంపత్తిని బడసి, తత్సేవాధర్మముల నిర్వర్తింపుచు నిశ్చలభక్తియోగమున ధ్యానమార్గమున శివానందము భక్తు డనుభవించునని యన్నమయ్య ప్రతిపాదన. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గములను నాల్గు యోగములలో భక్తియోగమే తక్కినవానికి మూలమని, భక్తియోగ ప్రకృష్టతను ప్రపంచించి యున్నాడు.”

 

“సహజైకభక్తినిష్ఠాపరతంత్రుఁడగు భక్తునకు బాహిరములగు కేవల ప్రకృతివిషయములను గూర్చి గాని, అన్యదేవతావిషయము గాని యవసరమే యుండదు. సహజైకలింగనిష్ఠాపరతంత్రుడగు శైవుని భక్తికంతకు నిదియే మూలకందము. కాబట్టియే యీ కృతియం దెచ్చటను నితరమతఖండన, దేవతాప్రసక్తి లేక ఎచ్చట చూచినను శివమహత్త్వము, భక్తినిశ్చలత, శాంత, సాత్త్విక వైరాగ్య ప్రవృత్తి యుద్దీపించుచున్నవి.“

              శతక సంపుటము ప్రథమ భాగము - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, 1966

-  నిడదవోలు వెంకట రావు గారి పీఠిక.

 

 యధావాక్కుల అన్నమయ్య శతకంలో శివ మహత్యము, నిశ్చల భక్తి భావము, శాంత స్వరూపము మరియు సాత్విక  ప్రవుత్తి  ప్రస్ఫుటంగా గోచరిస్తాయి.  శివుడు భక్త సులభుడు.  భక్తి తో ఒక పుష్పాన్ని సమర్పిస్తే, పునర్జన్మ ఉండబోదని స్పష్టంగా వివరించాడు అన్నమయ్య.

 

ఒకపుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం-

జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ బునర్జన్మంబు లేదన్నఁ బా-

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచో బెద్దనై-

ష్ఠికుఁడై యుండెడువాఁడు నీవగుట దాఁ జిత్రంబె సర్వేశ్వరా!

 

సర్వేశ్వర శతకం వీర శైవ సంప్రదాయం ప్రకారం విలసిల్లిన భక్తి రస ప్రధానమైన శతకం.

 

మహాకవి ధూర్జటి విరచిత శ్రీ కాళహస్తీశ్వర శతకం –

 

భక్తి శతకాలలో మకుటమానమైనది మహాకవి ధూర్జటి విరచిత శ్రీ కాళహస్తీశ్వర శతకం. ధూర్జటి స్వీయానుభూతి ఈ శతక రచనలో ఎక్కువగా కనబడుతుంది. భక్తి, మాధుర్య భావాలతో ఈ శతక రచన సాగింది. ధూర్జటి తన జీవిత చరమాంకములో లోకము నందలి గుణదోషములను మరియు  తన జీవితానుభవసారాన్ని  “శ్రీ కాళహస్తీశ్వర” అన్న సప్తాక్షరీ మహా మంత్ర మకుటం ద్వారా మనకు పద్యకుసుమాలను అందించాడు. ఈ శతకంలోని ప్రతి పద్యము ఒక పూజ కుసుమమే.

 

శరీరంలో సత్తువ తగ్గక మునుపే శివ నామ స్మరణ చేయవలనని ఆ శ్రీకాళహస్తీశ్వరుని వేడుకున్నాడు  ధూర్జటి.

 

దంతంబుల్పడనప్పుడే తనువునన్‌ దార్ఢ్యంబు నున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే

వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే

చింతింపన్‌వలె నీ పదాంబుజములన్‌ శ్రీకాళహస్తీశ్వరా!

 

పరమేశ్వరుని దయ వుంటే చాలునన ఈ విధంగా వేడుకుంటూ తన శతక రచనారంభం చేశాడు –

 

శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా

రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్‌

దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా

సేవం దామరతంపరై మనియెదన్‌ శ్రీకాళహస్తీశ్వరా

 

నా మనస్సుపై అరిషడ్వర్గములు దాడి చేయగా, చెదిరి చెడుచున్నది, కావున ఇట్టి నా మనస్సును నీవు స్వీకరించి, నన్ను స్థిమిత పరచుము. పరమశివుని యందే  మనస్సు నిలకడగా ఉండునట్లు చేయమని ఈ విధంగా వేడుకుంటున్నాడు –

 

అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్‌ సదా

కాంతల్పుత్రులు నర్థమున్‌ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ

జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా

 

రాజులు గర్వం కలవారు. వారిని సేవించుట నరకముతో సమానము. వారిచ్చు  సకలోపభోగములు మనసుకు బాధ కలిగించునవే !! కనుక ఆ భోగముల కంటే అధికమైన జ్ఞానలక్ష్మి ని ప్రసాదించి, మోక్షలక్ష్మిని అనుగ్రహించవలిసినది అని ప్రార్థిస్తున్నాడు.

 

రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం

భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా

బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితి\న్‌ జ్ఞానల

క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!

 

శివ మానస పూజ స్తోత్రములోనున్న భావాన్ని ఈ పద్యంలో వివరిస్తున్నాడు. నా కావ్యమందలి నవరసములను అభిషేక ద్రవ్యాలుగా, నేర్పుతో కూర్చిన పదముల యొక్క కూర్పే పుష్పములుగా, కావ్యమునందలి ధ్వని, శబ్దాలంకారములనే వాయిద్యములుగా, అర్ధాలంకారములనే తగిన వస్త్రముగా, గుణములను దీపములుగా, నీ మహత్యము వర్ణించు వర్ణనయె నివేదనగా చేసి, నా మనసునందలి భక్తి భావము ప్రకటితమగునట్లుగా రచించిన కావ్యనిర్మాణమునే గొప్ప పూజగా చేసి నిన్ను సేవించుచున్నాను శ్రీ కాళహస్తీశ్వరా ! 

 

జలకంబుల్‌, రసముల్‌, ప్రసూనములు, వాచాబంధముల్‌, వాద్యము

ల్కలశబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తుల్మెఱుం

గులు నైవేద్యము మాధురీమహిమగాఁ గొల్తున్నినున్‌ భక్తిరం

జిల దివ్యార్చన గూర్చినేర్చిన క్రియన్‌ శ్రీకాళహస్తీశ్వరా!

 

ఈ విధముగా ప్రతి పద్యము ఒక పూజ కుసుమము. మధుర భక్తి ప్రపూరితము. తనను రక్షింపమని వివధ శివాలయాలలో విలసిల్లిన ఆ పరమశివుని వేడుకుంటున్నాడు ధూర్జటి. అణుమాత్రమైన తన భక్తిని మహామేరువుగా భావించి రక్షింపవా అంటూ తన మనో నేత్రం తో జ్యోతిర్లింగ మూర్తులను దర్శించాడు ధూర్జటి.

 

శ్రీశైలేశు భజింతునో యభవుఁ గాంచీనాథు సేవింతునో

కాశీవల్లభుఁ గొల్వఁబోదునొ మహాకాళేశుఁ బూజింతునో

నా శీలంబణువైన మేరువనుచున్‌ రక్షింపవే నీ కృపా

శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వరా!

 

శ్రీ కాళహస్తీశ్వర శతకం భక్తి,, జ్ఞాన సమ్మిళితం. ఈ రెండు మార్గాల మోక్షప్రాప్తి తథ్యం. అందుకే శ్రీ కాళహస్తీశ్వర శతకం భక్తి శతకాలలో మకుటాయమానం.

 

ఇక ఇటీవలి కాలంలో వచ్చిన శైవ భక్తి ప్రపూరిత శతకము ఒకటి  ఉదహరిస్తాను -

 

పొత్తూరు వెంకట సుబ్బారావు గారు రచించిన ఇష్ట కామేశ్వర శతకం (2009) -

 

ఖమ్మం లో ఆంగ్లభాషోపన్యాసకులుగా పని చేసిన డా. సుబ్బారావు గారు నాకు ఆంగ్ల భాషను బోధించిన గురువు గారు. వీరు తన స్వగ్రామము కామేపల్లి  లోని తన ఆరాధ్య దైవమైన ఇష్ట కామేశ్వరుని పై ఒక శతకరాజాన్ని రచించారు. శతక సాహిత్యాన్ని సంప్రదాయ సిద్ధంగా నవ నవోన్మేషణం చేయడం వీరి ప్రత్యేకత. వీరి శతకం లోని ప్రతి పద్యంలోనూ ఆ పరమశివుని ఎలా స్మరించాలి ? చింతన చేయాలి మరియు మననం చేయాలి అన్న ఆర్తి కనిపిస్తుంది. ఆది శంకరుల వారి “ యద్యతకర్మకరోమి తత్తదఖిలం, శంభో శివారాధానం “ అన్నట్లు వీరి శతక పద్యాలన్నీ పరమేశ్వర అర్పితములే.

 

 పా  పధ్వంత విధూత సూర్య నిభమై, ప్రావిద్యంబునై

రూపాలంకృత సర్వలోక గమనారుఢమ్మునై, భావనా

దీపారోపిత జాజ్వల త్రతిభకాదిత్యాంశు ధామమ్ము నై

ప్రాపున్ మాకాగుశంభు నామమోకటప్పా ఇష్ట కామేశ్వర

 

శ్రీ గౌరి స్మిత చంద్రికాతుషిత హృతసీమావృతానంద స

ద్రానిగానీత కపోలరంజిత ముఖా ! రమ్యేందురేఖాధరా !

రాగద్వేషములన్న జీకటుల బారాన్ ద్రోలి సదభక్తిన్

మాగాణమ్ముగ జేయ నా హృదిని రమ్మా  ఇష్ట కామేశ్వర 

 

ఇక తెలుగులో ఎన్నో శైవ భక్తి ప్రధానమైన శతకాలు ఉద్భవించాయి. తదుపరి సంచికలో విష్ణు భక్తి ప్రాతిపదికన రచింపబడిన శతకాల గురించి వివరిస్తాను.

bottom of page